రేకు: 0353-06 సం: 04-314
పల్లవి:
ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నునినామమే వేదంబాయ
చ.1:
నలినదళాక్షునినామకీర్తనము
కలిగి లోకమునగలదొకటే
యిల నిదియే భజియింపగ బుణ్యులు
చెలగి తలప సంజీవని యాయ
చ.2:
కోరిక నచ్యుత గోవిందాయని
ధీరులు దలపగ దెరువొకటే
ఘోరదురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మగగలిగె
చ.3:
తిరువేంకటగిరి దేవుని నామము
ధరదలపగ నాధారమిదే
గరుడధ్వజుని సుఖప్రదనామము
నరులకెల్ల బ్రాణము దానాయ
భావం
పల్లవి:
అన్నిచోట్లా స్థానమయినది ఒక్కటే. అదే విష్ణుదేవుని నామము. అది వేదమయినది.
చ.1:
తామరరేకుల వంటి కన్నులు కలిగిన స్వామి వారి నామకీర్తనము ఈ లోకములో అన్ని కలిగినది.( అన్ని ప్రసాదిస్తుందని భావం) లోకమున పుణ్యాలు కలిగించేది స్వామి నామకీర్తనము ఒకటే.
ఈలోకంలో నామకీర్తనము చేయుచున్న పుణ్యాత్ములకు ఈ గోవిందుని నామమే సంజీవనిలా బాధల గాయాలను చెరిపి స్వస్థతను ఇస్తుంది.
చ.2:
కోరికతో అచ్యుత గోవిందా అని ధైర్యవంతులైన భక్తులు తలచగా లభించే మార్గము ఒకటే ! ( మోక్షమని తాత్పర్యం)
ఘోరమయిన పాపములను హరించువాడా ! గోవర్ధన పర్వతమును ధరించినవాడా ! నారాయణ అని పిలుస్తూ స్వామిని నమ్ముకొంటే - నాకు ఈ నామకీర్తనము చేసే అదృష్టం కలిగింది.
చ.3:
శ్రీ ప్రదమైన వేంకటగిరి దేవుని(వేంకటేశ్వరుని) నామము -ఈ భూమిలో ఆధారము.
గరుత్మంతుడు ధ్వజముగా కలిగిన సుఖప్రదమైన గోవిందుని నామము మానవులందరికి ప్రాణము .
***
No comments:
Post a Comment