కరువులో అధిక మాసం - అచ్చంగా తెలుగు
కరువులో అధిక మాసం
కాశీ విశ్వనాథం పట్రాయుడు
9494524445
 

చామలాపల్లి అగ్రహారంలో సీతాపతి, లక్ష్మి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి  నిఖిత, లిఖిత, కవిత అనే ముగ్గురు కుమార్తెలు. సీతాపతి చిరుద్యోగి. చాలీచాలని జీతం. భర్త సంపాదించే కొద్దిపాటి డబ్బుతోనే గుట్టుగా కుటుంబాన్ని నడిపించేది లక్ష్మి. పెద్దకూతురు నిఖితకి రెండేళ్ళ క్రితం పెళ్లి చేసారు. కూతురు నెల తప్పడం తో ఇంటికి తీసుకువచ్చి సీమంతం చేసారు. ఆ సీమంతానికి వచ్చిన బంధువుల్లో దగ్గరి బంధువులు  రెండో కూతురు లిఖితని  కోడలుగా చేసుకోవాలనుకున్నారు. కుటుంబం మంచిది, పెళ్ళికొడుకు బుద్ధిమంతుడు కావడంతో  సీతాపతి దంపతులు లిఖిత  పెళ్లికి అంగీకరించారు.  సీమంతం ఖర్చు, ఆ తర్వాత కానుపు ఖర్చు, ఇప్పుడు పెళ్లి సంబంధం కుదరడంతో పెళ్ళి ఖర్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి  వచ్చిపడ్డాయి. దాచుకున్న డబ్బులన్నీ  అయిపోయాయి. ఏమి చేయాలో తోచలేదు ఆ దంపతులకు. 

అదే సమయంలో సీతాపతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇటు సంపాదన లేక  అటు ఖర్చులు  పెరిగిపోవడం తో “కరువులో అధిక మాసం” అయ్యింది అతడి పరిస్థితి. 

అయితే ఈ జాతీయం వెనుక ఒక కథ కూడా ఉంది. బ్రాహ్మణుల వృత్తి పౌరోహిత్యం.  వైదిక కార్యాలు, యజ్ఞ యాగాదులు, వివాహాది శుభకార్యాలు  జరిపించి వారు ఇచ్చిన దక్షిణతో జీవనం సాగిస్తూ ఉండేవారు. అంతేకాకుండా పల్లె ప్రజలు పంట దినుసులన్నీ ఇచ్చి  బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

అయితే ఓ ఏడాది ఆ ప్రాంతానికి కరువు సంభవించింది. వర్షాలు పడలేదు. పంటలు పండలేదు.  ప్రజల చేతుల్లో డబ్బులేదు. బ్రాహ్మణునికి ఏమీ ఇవ్వలేకపోయారు ఆ గ్రామస్తులు.

సరిగ్గా అదే సమయంలో అధిక మాసం కూడా వచ్చింది. తెలుగు నెలల్లో మూడేళ్లకు ఒక నెల అధికంగా వస్తుంది. అదే అధిక మాసం. ఈ అధిక మాసంలోను, మూఢం లోనూ, శూన్య మాసం లోనూ ప్రజలు ఎటువంటి శుభకార్యాలు చేయరు. అందువల్ల  పై నెలల్లో పురోహితులకు ఎటువంటి ఆదాయం ఉండదు. అటు పంట గింజలు లేక పైసా రాబడి లేక వారి జీవితం అగమ్యగోచరం అయ్యింది. అప్పటి నుంచి కష్టాలు వరుసగా వచ్చినపుడు, తగిన ఆదాయం లేనప్పుడు వరుసగా అనేక ఖర్చులు వచ్చి పడినపుడు, ‘కరువులో అధిక మాసం’ అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. ఇదే అర్థంలో ‘మూలిగే నక్క మీద తాటిపండు పడటం,’ ‘గోరుచుట్టు మీద రోకలి పోటు’ ‘ఊగే పంటి కింద రాయి పడటం’ అనే జాతీయాలు కూడా ఉపయోగిస్తున్నారు.

***

No comments:

Post a Comment

Pages