మానస వీణ - 56 - అచ్చంగా తెలుగు

మానస వీణ - 56

Share This

                                                                       మానస వీణ - 56

శుభశ్రీ అశ్విన్

 



"అమ్మా... అమ్మా... అమ్మా…!"

"అబ్బా!!! ఏమైందే సరిత?? ఎందుకంత హడావిడి చేస్తున్నావు?" అంటూ బయటకు వచ్చింది శ్రావణి.

"అమ్మా!! మరీ మానసమ్మని…" రొప్పుతోంది సరిత.

"ఆ మానసనీ? మానసకేమయింది??" పట్టరాని భయంతో, ఒళ్ళంతా కంపించిపోతుంటే అడిగింది శ్రావణి.

"అమ్మా మానసమ్మను ఎవరో దౌర్జన్యంగా కారులోకి లాగి తీసుకుని వెళ్ళిపోయారు." పక్కనే ఉన్న రాజా అందుకుని చెప్పాడు.

"ఆఆఆఆఆ!!??"

ఒక్క క్షణంపాటు నిర్ఘాంతపోయింది శ్రావణి. 

"అవునమ్మా. ఆపటానికి ప్రయత్నించిన నన్ను వెనుకకు తోసేసి మానసను లాక్కుని వెళ్ళిపోయారు. మేమిద్దరం కారు వెంట ఎంత పరిగెట్టినా లాభం లేకపోయింది. మానసమ్మ ఫోన్ ను కూడా బయటకు విసిరికొట్టారు." తలనుంచీ రక్తం కారుతూ ఉండగా దానికి పసరు తెమ్మని సరితకు చెప్పి అలా కూర్చుండిపోయాడు రాజా.

శ్రావణికి జరిగిందేమీ అర్ధం కాలేదు. పొంగుకొస్తున్న దుఃఖంతో, 'సమయానికి ఆయన కూడా ఊరిలో లేరు. అసలీ పని చేయాల్సిన అవసరం ఎవరికుంది? వెంటనే అనిరుధ్ కి ఫోన్ చేసి చెప్పాలి. ఈ పరిస్థితుల్లో నా బంగారుతల్లిని కాపాడగలిగేది అతనే: అనుకుని వెంటనే అనిరుధ్ నెంబరుకి పోను చేసింది. కానీ ఎంతసేపు ప్రయత్నించినా, అవతలివైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు, ఒక్క స్విచ్ఛాఫ్ అని తప్ప...

ఏమీ తోచని అయోమయస్థితిలో, 'భగవంతుడా!! నా బంగారుతల్లికి ఏమీ కాకుండా కాపాడు.' అని ఉన్నచోటే కూలబడింది శ్రావణి.

వెంటనే రాజా లేచి "అమ్మా, మరేం పర్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి అనిరుధ్, దినేష్ గార్లకు ఈ విషయం చెప్పి మానసమ్మ ఆచూకీ తెలుసుకుంటాను" అని చెప్పి, సరితతో "నువ్వు అమ్మగారికి తోడుగా ఇక్కడనే ఉండు" అని బయలుదేరాడు.

గూడెంలో ఉన్నవారందరికీ విషయం చెప్పి, "మన బిడ్డల బతుకులు బాగుచేయడానికొచ్చిన ఆయమ్మని, ఆ అప్పలనాయుడి దౌర్జన్యాల నుంచీ మనలను కాపాడనికొచ్చిన ఆ తల్లిని మనం ఎట్టాగైనా రక్షించుకోవాల!!

అడవి మొత్తం జల్లెడ పట్టి యెతకండి. ముఖ్యంగా ఆ అప్పలనాయుడి స్థావరాలన్నీ...

ఈ దినం వరకు మన పిరికితనం మాత్రమే‌ చూసారు ఆ గూండానాయాళ్ళు. కానీ ఇయ్యాల మనందరం ఏకమైతే ఎట్టుంటాదో ఆ అప్పలనాయుడి రౌడీ యెధవలకి చూపెట్టాల. ఏ ఒక్కడు కనపడినా ఎవ్వరినీ వదలొద్దు. ఆ అడవితల్లి ఋణం తీర్చుకునే సమయం వచ్చినాది. వేగిరం రండిరా!! అందరూ తలో దిక్కు చుట్టేయండి." అని అందరినీ ప్రేరేపించి తాను ఇన్స్పెక్టర్ దినేష్ దగ్గరకు పరుగు పరుగున బయలుదేరాడు.

***

అక్కడ శ్రావణి తన భర్తకు ఫోను చేసి, సమాచారాన్ని అందించింది. ఆపకుండా అనిరుధ్ ఫోనుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆ తల్లి తన బిడ్డ కోసం ప్రార్ధించని దేవుడు లేడు. 

అసలు అనిరుధ్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? తన తండ్రి మీద పడింది కేవలం నింద మాత్రమే. ఇది అనిరుధ్ ప్రగాఢ నమ్మకం. రెండు రోజులుగా తన తండ్రి జిటిఆర్ కు తెలియకుండా మొత్తం అతని కాంటాక్ట్స్ అన్నీ, అన్ని బిజినెస్ లకు సంబంధించిన ఫైల్స్ అన్నీ వెతుకుతున్నాడు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఒకసారి ఈ విషయమై దినేష్ ను కలిసి మాట్లాడాలి.

మానస గుర్తొస్తుంది. 'ఒకసారి మానసను కలిసి దినేష్ దగ్గరకు వెళదామా? లేదు..లేదు. అతన్ని కలిసి నాన్న గురించి మాట్లాడి అప్పుడు మానసను కలుస్తాను.' అనుకుని దినేష్ దగ్గరకు బయలుదేరాడు.

***

ఇన్స్పెక్టర్ దినేష్ ఇల్లు...

"చెప్పండి డిటెక్టివ్ రామజోగయ్య గారు (ఫెర్నాండెజ్) ఎక్కడి వరకు వచ్చింది మన కేసు? జిటిఆర్ గురించిన వివరాలేమైనా తెలిసాయా?" దినేష్ డిటెక్టివ్ రామజోగయ్య గారిని అడిగాడు.

"సార్... మీరు ఫోన్ చేసిన వెంటనే నేను ఇండియాకు వచ్చి జిటిఆర్ ను గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. సరిగ్గా కొన్ని రోజుల క్రితం అతని కొడుకు అనిరుధ్ నాకు ఫోన్ చేసి తన తండ్రిని గురించి వివరాలు సేకరించడంలో తనకు నా సహాయం కావాలని అడిగాడు.

అనిరుధ్ నిజాయితీ పరుడు. అతనికి తన తండ్రిన గురించిన చీకటి కోణం అసలు ఏ మాత్రం తెలియదు."

ఈలోగా బయట నుంచి తలుపు కొడుతున్న శబ్ధం వినబడింది. ఇద్దరూ అప్రమత్తమై తలుపు తెరిచారు. ఇంతలో బయట నుంచీ రాజా...

"సారూ! మానసమ్మని ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయినారు."

"వాట్!!!????"

అటు అప్పుడే బండి పార్క్ చేసి లోపలకు వస్తున్న అనిరుధ్, ఇటు దినేష్, ఇద్దరూ ఖంగు తిన్నారు. "ఏంటి నువ్వు చెప్పేది రాజా?" అనిరుధ్ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చి రాజాను పట్టుకుని అడుగుతున్నాడు. దినేష్ కూడా ఏమీ మాట్లాడకుండా చూస్తుండిపోయాడు. 

"అవును సారు..." అని అక్కడ జరిగిందంతా ఆ ముగ్గురికీ పూస గుచ్చినట్లు చెప్పి కారు నెంబరు కూడా చూసానని చెప్పాడు రాజా.

"ఇది ఖచ్చితంగా అప్పలనాయుడి మనుషుల పనే అయ్యుంటుంది. అసలు వాళ్ళనీ… పదండి దినేష్ వెంటనే అడవిలోకి వెళ్దాం" అంటున్న అనిరుధ్ ని, "ఆగండి అనిరుధ్." అని ఆపాడు రామజోగయ్య.

"వెళ్ళాల్సింది అడవికి కాదు, సిటీకి. మీ ఆశ్రమం‌, ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో మీ గోడౌన్స్ కానీ, గెస్ట్ హౌస్ లు, ఇప్పటి వరకూ మీరు చూడనివీ, మీకు తెలియనివీ, ఏవైతే ఉన్నాయో, అవన్నీ వెతకండి. ఖచ్చితంగా మానసను అక్కడే ఉంచుంటారు." అన్నాడు.

"వాట్!? ఏంటండీ మీరు మాట్లాడేది? మానసను మా గోడౌన్స్ లో ఎందుకూ దాస్తారు?" 

"ఎందుకంటే మానసను కిడ్నాప్ చేసింది మీ తండ్రి  జిటిఆర్ ఏ కాబట్టి..."

"కానీ మానసను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆయనకేముంది?" బేలపోయిన ముఖంతో ప్రశ్నించాడు అనిరుధ్.

"ఆయనకే ఉంది" అన్నాడు దినేష్.

ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు అనిరుధ్...

"సరైన ప్రశ్న వేశారు అనిరుధ్. సరే, ముందు నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి." అన్నాడు రామజోగయ్య.

"అసలు మీ నాన్నగారు ఎన్నో ఆశ్రమాలు ఉండగా కేవలం అనాధాశ్రమమే ఎందుకు పెట్టారు? అది కూడా కేవలం ఆడపిల్లల కోసం??!! సరే వదిలేయండి. మానస కూడా అందరిలా ఆ ఆశ్రమంలో కేవలం ఒక అనాధ. అలాంటి ఆమెకు చిన్నతనం నుండి అంత ఇంపార్టెన్స్ ఎందుకిచ్చారు? మీతో సమానంగా మానసను ఎందుకు పెంచారు? ఆశ్రమంలో వేరెవ్వరికీ లేని విధంగా మానసను అనుక్షణం గమనించడానికి మనుషులనెందుకు పురమాయించారు? ఎందుకు ఆమె చేసే ప్రతి పనిలో తనకు వెన్నంటి నీడగా ఉంటూ వచ్చారు? అసలు అంత కోటీశ్వరులు కానీ కట్నం ఆశించకుండా మీ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు??? మానస కు తోడుగా ఉండాలనా? ఆమె ఆయన దారికి అడ్డం కాకుండా ఉండాలనా?? అసలు మానస భూషణం మనమరాలని జిటిఆర్ కు ముందే తెలుసాఅసలు ఓబులేసుకి ఆ పసికందును ఆశ్రమం గేటు దగ్గర వదిలి పెట్టమని చెప్పింది ఎవరు? అసలు అప్పలనాయుడికీ, జిటిఆర్  కీ, భూషణానికీ ఉన్న సంబంధం ఏంటి? మానసను ఆయన ఎందుకు చేరదీసారు?? ఒకసారి రెండోవైపు నుంచి కూడా ఆలోచించండి అనిరుధ్..." అంటున్న రామజోగయ్య మాటలు వింటూ‌ ఆలోచనలో పడ్డాడు అనిరుధ్

***

"ఏదైనా నా వరకూ రానంతవరకే… అది సోదరుడైనా! స్నేహితుడైనా! కట్టుకున్న భార్య అయినా! కాబోయే కోడలైనా!!! చివరికి కన్న కొడుకైనా!!!! రేయ్!! ఆ మానసని గోడౌన్ లో కట్టేయండి."

"అట్టాగేనయ్యా..."

"రేయ్!! నువ్వెళ్ళి ఆ అప్పలనాయుడి సంగతి చూడు. నా పేరు బయటికొచ్చేముందే పని జరిగిపోవాల!!!"

"సరేనయ్యా…."

తన చేతికున్న ఉంగరాన్ని తిప్పుతూ ఆ పెద్దమనిషి దీర్ఘాలోచనలో పడ్డాడు. ఆ ఉంగరంపై 'జిటిఆర్' అని ఉంది.


No comments:

Post a Comment

Pages