ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -13 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -13

Share This

                                              ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -13

కొత్తపల్లి ఉదయబాబు


మెట్లు ఎక్కి  కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్న మూడో ప్రదక్షిణంలో ''తల్లిగాడు ...అటు చూడు.''అని తల్లి చెప్పిన మాట విని అటు చూసింది హరిత. అక్కడ గోశాల దగ్గర చేతిలో తోటకూర, పాల కూర కట్టలు పట్టుకుని సిద్ధంగా నిలబడి తనకేసి ఆరాధనగా చూస్తూ నిలబడ్డాడు విరాజ్.

''నమస్తే ...ఆంటీ... హాయ్ హరితగారు...శుభోదయం. ఇవిగో ..మీరు తలో రెండు కట్టలు తీసుకుని ఆవులకి తినిపించండి. మీరు రావడం చూసాను. ఇవి కొనడానికి వెళ్లి వచ్చేసరికి మీరు పైకి వచ్చేసారు.'' అంటూ పిలిచాడు. తల్లి కనుసైగతో అటు  నడిచింది హరిత. ఇద్దరూ అతను అందించిన ఆ కట్టలను తీసుకుని గోవులకు తినిపించారు.

అనంతరం ముగ్గురూ దర్శనం చేసుకున్నారు.

టికెట్ తీసుకుని తనతో పాటు అతని గోత్ర నామాలను అడిగి పూజ చేయించింది శకుంతల.

తర్వాత ముగ్గురూ ఆ ప్రాంగణంలోని మిగతా కోవెలలను దర్శించుకుని  శివుని ప్రాంగణంలో మండపంలో కూర్చున్నారు.

'మీరు నా ప్రొపోజల్ కి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హరితగారు.'' అన్నాడు విరాజ్. ఎంతో ఎక్సయిట్మెంట్ కు గురి అవుతున్నట్టు అతని మాటలే చెబుతున్నాయి.

''ముందుగా మీకు కృతజ్ఞతలు.'' అంది హరిత.

''బాబు...మీరు మాట్లాడుకుంటూ ఉండండి ..నేను ప్రసాదం కొనుక్కుని వస్తాను'' అని అతని సమాధానం కోసం చూడకుండా మల్లె మెట్లు ఎక్కి పైకివెళ్ళింది శకుంతల.

''మీకు నేనే ఎందుకు నచ్చానో చెప్పగలరా?'' సూటిగా అడిగింది హరిత.

''మీరు నాకన్న నిజంగా అందగత్తె. అయితే మీలో అందం కన్నా 'లక్ష్మీదేవి 'కళలాంటారే..అది నాకు నచ్చింది. మీరు బహుమతి తీసుకోవడానికి నా దగ్గరగా వస్తున్నా కొద్దీ నాగుండె స్పందన పెరిగిపోయింది. నా లక్కీ డైమండ్ నాకు దొరికిందని నాకు అర్ధమైపోయింది.ఇపుడు తెలిసిందా?'' అన్నాడు అతను మెరుస్తున్న కళ్ళతో.

చిరుమందహాసం చేసి తలవంచుకుంది హరిత. గాలికి ఎగురుతున్న ఆమె ముగురుల అల్లరిని చూస్తున్న అతను హరిత మాటలతో ఈలోకంలోకి వచ్చాడు.

''అయితే నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ''

''చెప్పండి.''

''మీకు ఇవి నియమాలు అనే చెప్పవచ్చు. కానీ గాలిలో ఉన్న ఆడపిల్లగా నాకు అత్యంత ముఖ్యమైన విషయాలు.''

''నేను ఈ పని చెయ్యాలి అనుకున్న తరువాత ఇక వెనుకడుగు వెయ్యను. అడుగు వేయబోయేముందే  ఇది నేను చేయగలనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. చేయగలను అనుకున్న తర్వాత ఎటువంటి   కష్టం  ఎదుర్కోవడానికైనా సిద్దపడిపోతాను. నాకెంత నష్టం కలిగినా బాధపడను. బుద్ధి తెచ్చుకుని మళ్ళీ అటువంటి పనిమాత్రం చేయను.'' అన్నాడు లెంపలేసుకుని నవ్వుతూ.

''ఇపుడు నేను చెప్పే విషయాలు వింటే మళ్ళీ ఇంకోసారి వేసుకుంటారేమో?'' హరితకూడా నవ్వుతూ అంది.

''మీ అభిప్రాయాలు ఏవైనా నిర్మొహమాటంగా చెప్పవచ్చు. మనకి ఇంకా ఇంకా రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై రోజుల సమయం ఉంది.''

''అదేం లెఖ్ఖ?'' వింతగా అతన్ని చూస్తూ అడిగింది.

''మనం మూడేళ్లు స్నేహితులుగా ఉంటూ ప్రేమించుకోవాలి కదా...ఇప్పటికి పదిరోజులు గడిచిపోయాయి. నాకు తీసివేతలు వచ్చంటారా?''

''అవి తెలియకుండానే మీ నాన్నగారికి వ్యాపారంలో సహకరిస్తున్నారా?'' అంది తన  చేతిలోని పుస్తకంలో కరపత్రం తీసి అతనికి ఇస్తూ.

''ఓ ...ఇదా...ఇది మీ చేతికి ఎలా వచ్చింది?'' అడిగాడతను.

 ''మా అమ్మగారికి ఎవరో ఇచ్చారట. సరే.అసలు విషయానికి వస్తాను.''

 ''రండి''

 ''మీకు అన్నీ పాయింట్-వైజ్ చెబుతాను.

మొదటిది...నన్ను హరిత.. అని పిలిస్తే చాలు.'గారూ' అవసరం లేదు.నేను మిమ్మల్ని విరాజ్ అని పిలుస్తూనే  గౌరవించుకుంటాను. నాకు మగవాళ్ళని ఏకవచన సంబోధన ఇష్టం ఉండదు.

రెండు... నాకు ఇరవై రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆఖరి పరీక్ష పూర్తి అయిన మరునాటి ఉదయం మళ్ళీ మనం  ఈ గుడిలో ఇక్కడే కలుద్దాం. అంతవరకూ పొరపాటున కూడా మీరు ఒకసారి కలుసుకుందాం అని అడగకూడదు.

మూడు...నాకు సెల్ ఫోన్ లేదు . స్మార్ట్ ఫోన్   కొనుక్కనే  స్థోమత మాకు లేదు. మా అమ్మగారిది కూడా కేవలం కమ్యూనికేషన్  ఫోన్ మాత్రమే . మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే అమ్మతో మాట్లాడటమే.

నాలుగు ...నాకు సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆఖరి పరీక్ష అయినా మరునాడే పగటిపూట ఎనిమిది గంటలు మాత్రమే ఖచ్చితంగా పనిచేసే ఉద్యోగం చూసిపెట్టండి. అది బయట బైక్ మీద తిరిగే ఉద్యోగమైనా...లేదా ఒక ఆఫీసులో అటెండర్ గా ఫైల్స్ అందించే ఉద్యోగమైనా... 

అయిదు...అలాగే ఒక కరాటే శిక్షణా కేంద్రం ...కూడా..''

''అన్నీ బాగానే ఉన్నాయి... ఈ చివరిది ఎందుకు?''ఆశ్చర్యపోతూ అడిగాడు విరాజ్.

 (ఇంకా ఉంది)

 

No comments:

Post a Comment

Pages