"బంగారు" ద్వీపం (అనువాద నవల) -21
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original: Five on a treasure Island (1942)
Writer : Enid Blyton
(వార్తాపత్రికల్లో వచ్చిన వార్తను చూసి కిర్రిన్ ద్వీపానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఆ ఓడలో దొరికిన తగరపు గీత పెట్టె గురించి క్వెంటిన్ బయటపెట్టడమే కాక దాన్ని ఒక వ్యక్తికి అమ్మేస్తాడు. పిల్లలు కోటలో బంగారం గురించి బయటవాళ్ళకు తెలియక ముందే, తాము వారాంతంలో ఆ కోటని శోధించాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో జార్జి తండ్రి కిర్రిన్ ద్వీపాన్ని అమ్మేస్తున్నట్లు చెప్పడంతో తన ద్వీపాన్ని అమ్మటానికి వీల్లేదని ఆమె తల్లిదండ్రులతో గొడవపడుతుంది. తరువాత. . . .)
@@@@@@@@@@@@@@@@@@@
ఆమె వెనుదిరిగి తడబడుతూ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. మిగిలిన పిల్లలు ఆమె కోసం బాధపడ్డారు. ఆమె భావాలేమిటో వారికి తెలుసు. ఆమె విషయాలను చాలా తీవ్రంగా తీసుకుంది. ఆమెకు పెద్ద వాళ్ళను అర్థం చేసుకోవడం తెలియదని జూలియన్ భావించాడు. పెద్దవాళ్ళతో తగవు పడటం మంచిది కాదు. వాళ్ళకేది యిష్టం అయితే సరిగా అదే చేయగలరు. జార్జి యొక్క కోటను, ద్వీపాన్ని తీసేసుకోవాలనుకుంటే, వాళ్ళు చేయగలరు. దానిని అమ్మేయాలనుకొంటే అమ్మేయగలరు. కానీ క్వెంటిన్ బాబయ్యకు అక్కడ బంగారు కడ్డీల ఖజానా ఉండొచ్చన్నట్లు తెలియదు. ఈ విషయంలో అతన్ని హెచ్చరించాలని జూలియన్ తన బాబయ్య వైపు కన్నార్పకుండా చూసాడు. అంతలోనే చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. నలుగురు పిల్లలు ఆ బంగారాన్ని కనుగొనే చిన్న అవకాశం ఉంది.
"ద్వీపాన్ని ఎప్పుడు అమ్ముతున్నావు బాబయ్యా?" అతను మెల్లిగా అడిగాడు.
"రాతకోతలు వారం రోజుల్లో ముగుస్తాయి" అన్నది వచ్చిన జవాబు. "అందుచేత మీరు అక్కడ ఒకటి, రెండు రోజులు గడపాలని అనుకుంటే, త్వరగా వెళ్ళటం మంచిది. తరువాత కొత్త యజమానుల నుంచి అనుమతి దొరక్కపోవచ్చు."
"ఈ దీవిని కొనాలనుకున్న వ్యక్తి ఆ పాత పెట్టెను కొన్న అతనేనా?" జూలియన్ అడిగాడు.
"అవును" చెప్పాడతని మామయ్య. "అతను కేవలం పాత వస్తువులను కొనే వాడనే అనుకొన్నాను. దీవిని కూడా కొంటాననగానే ఆశ్చర్యపోయాను. దీవిని కొని, కోటను హోటలుగా మార్చి కట్టాలన్న ఆలోచన అతనికి వచ్చినందుకు, నాకు విస్మయం కలిగించింది. అలాంటి ప్రాంతంలో హోటల్ నడపటమంటే బాగా డబ్బులొస్తాయి, అలాంటి చిన్న దీవిలో గడపటం మనోహరంగా ఉంటుంది, ప్రజలు దానినే యిష్టపడతారని ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్పగలను. నేను వ్యాపారస్తుణ్ణి కాదు. అంతేకాక కిర్రిన్ ద్వీపం లాంటి చోట పెట్టుబడి పెట్టటానికి నేను యిష్డపడను. కానీ తను చేస్తున్నదేమిటో అతనికి బాగా తెలుసునని నేను భావిస్తున్నాను."
"అవును. తప్పకుండా అదే చేస్తాడు" డిక్, అన్నెలతో ఆ గదిలోనుంచి బయటకు నడుస్తూ, జూలియన్ తనలో అనుకున్నాడు. "అతను ఆ పటాన్ని అధ్యయనం చేసాడు. మాలాగే అతను అదే ఆలోచన చేసాడు. దాచిపెట్టిన లోహపు కడ్డీల స్టోరు ఆ దీవిలోనే ఎక్కడో ఉంది. దాన్ని అతను వశపరచుకోవాలని అనుకొన్నాడు! అతను కూడా నిధి వెనుక పడ్డాడు! క్వెంటిన్ బాబయ్యకు మరీ తక్కువ ధరను ప్రతిపాదిస్తే, అమాయకుడైన ముసలి బాబయ్య అదే అద్బుతమైన మొత్తం అనుకొంటున్నాడు! అయ్యో! ఘోరం జరగబోతోంది."
అతను జార్జి కోసం వెతికాడు. ఆమె టూల్ షెడ్డులో విచారగ్రస్తయై కనిపించింది. తనకు ఒంట్లో బాగులేదని చెప్పింది.
"నువ్వు బాగా నిరాశ పడటం వల్లనే అలా ఉంది" అన్నాడు జూలియన్. అతను ఆమె భుజం చుట్టూ చేయి వేసాడు. తరచుగా చేసినట్లు ఆమె ఆ చేతిని తోసెయ్యలేదు. దాన్ని ఆమె ఓదార్పుగా భావించింది. నీటితో నిండిన కళ్ళను కోపంగా మిటకరించింది.
"విను జార్జి! మనం ఆశను వదిలిపెట్టొద్దు" చెప్పాడు జూలియన్. "రేపే మనం కిర్రిన్ ద్వీపానికి వెళ్దాం. లోహపు కడ్డీలను కనిపెట్టడానికి ఎలాగోలా ఆ నేలమాళిగల్లోకి దిగుదాం. మన పని పూర్తయ్యేవరకు అక్కడే సరదాగా ఉండిపోదాం. గమనించావా? అక్కడ ప్రణాళిక వేయటంలో నీ సహాయం మనందరికీ ఎంతో అవసరం. అందుకే హుషారుగా ఉండు. ఆ పటం కాపీ చేయటం వల్ల మనకి మంచే జరిగింది."
జార్జి చిన్నగా నవ్వింది. తన తల్లిదండ్రులపై ఆమె యింకా కోపంగానే ఉంది. కానీ ఒకటి, రెండు రోజులు కిర్రిన్ ద్వీపానికి వెళ్ళాలన్న ఆలోచన, అదీ తిమోతీని తీసుకుని, ఆమెకు ఫరవాలేదు అనిపించింది.
"మా అమ్మా నాన్న లకు అసలు దయ లేదు అనుకొంటాను" అందామె.
"అంత కాదు" తెలివిగా అన్నాడు జూలియన్. "అంతగా వాళ్ళకు డబ్బులు అవసరమైతే, తమకు పనికిరాదని భావించే ఏదో వస్తువుని వదులుకొనే వెర్రివాళ్ళు. నీకు అర్థమైందా? మీ నాన్న నువ్వు కోరుకునే దేనినైనా పొందవచ్చు అన్నాడు. నేనే నువ్వయితే, ఏమి అడిగే వాడినో తెలుసా?"
"ఏమిటి?" జార్జి అడిగింది.
"తప్పకుండా తిమోతిని!" జూలియన్ చెప్పాడు. ఆ మాటలు జార్జిని హుషారుగా నవ్వించాయి.
@@@@@@@@
జూలియన్, జార్జి యిద్దరూ డిక్, అన్నెలను వెతుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళు వీళ్ళ కోసం తోటలో నిరాశగా ఎదురు చూస్తున్నారు. జూలియన్, జార్జి లను చూడగానే ఆనందంతో పరుగున వచ్చారు.
జార్జి చేతులను పట్టుకొని, "నీ ద్వీపం గురించి నేను చాలా బాధపడుతున్నాను" అంది అన్నె.
"నేనూ అంతే" అన్నాడు డిక్. "దురదృష్టం అమ్మాయీ.... అదే....అబ్బాయీ!"
జార్జి అతి కష్టంగా నవ్వింది. "నేను అమ్మాయిలా ప్రవర్తించాను" సిగ్గు పడుతూ చెప్పింది. "కానీ భరించలేని దిగ్భ్రమ చెందాను."
జూలియన్ తమ ప్రణాళిక ఏమిటో వారికి చెప్పాడు. "మనం రేపు ఉదయం వెళ్తున్నాం. మనకు అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేద్దాం. ఇప్పుడే మొదలెడదాం."
అతనొక పెన్సిలు, నోటు పుస్తకాన్ని బయటకు తీసాడు. మిగిలిన వారు అతన్ని చూస్తున్నారు.
"తినుబండారాలు" డిక్ వెంటనే అందుకొన్నాడు. "సరిపడా ఉండాలి ఎందుకంటే ఆకలి వేస్తుంది గనుక."
"తాగడానికేదో ఉండాలి" చెప్పింది జార్జి. "ఆ దీవిలో నీరు లేదు. నాకు తెలిసి, చాలా ఏళ్ళ క్రితం అక్కడ నుయ్యిలాంటిది ఏదో ఉండేది అనుకుంటాను. మంచి నీరే గానీ, సముద్ర మట్టం కన్నా బాగా లోతుకి ఉండేది. ఏమైనప్పటికీ, నేను దానిని చూడలేదు."
"తిండి" జూలియన్ వ్రాసాడు, "నీరు.". తలెత్తి మిగిలిన వాళ్ళను చూసాడు.
" పారలు" గంభీరంగా చెబుతూ కాగితంపై గిలికాడు.
అన్నె ఆశ్చర్యంగా చూసింది.
"దేనికవి?" అడిగిందామె.
"నేలమాళిగల్లోకి దిగి వెతకాలంటే తవ్వాల్సి ఉంటుంది కద!" చెప్పాడు జూలియన్.
"తాళ్ళు" అన్నాడు డిక్. "అవి కూడా మనకు కావాల్సి ఉంటాయి."
"టార్చ్ లు"జార్జి చెప్పింది. " నేలమాళిగల్లో చీకటి ఉంటుంది."
"ఔ!" ఆ చీకటిని తలచుకుంటూ చిన్నగా వణికింది అన్నె. నేలమాళిగలు ఎలా ఉంటాయో ఆమెకు తెలియదు, కానీ భయపెట్టేలా ఉంటాయని మాత్రం వింది.
"రగ్గులు" చెప్పాడు డిక్. "మనం ఆ చిన్న గదిలో పడుకోవాలంటే రాత్రి చలిగా ఉంటుందిగా!"
జూలియన్ వాటిని కాగితంపై వ్రాసాడు. "తాగడానికి మగ్గులు" అన్నాడతను. "ఇవే గాక కొన్ని పనిముట్లు కూడా తీసుకెళ్ళాలి. వాటి అవసరం కూడా రావచ్చు. మనం చెప్పలేము."
అరగంట తరువాత వాళ్ళ చేతిలో పెద్ద జాబితా ఉంది. దానిని చూసి అంతా తృప్తిగా సంతోషించారు. నిరాశ, కోపం నుంచి జార్జి తేరుకోసాగింది. ఆమె ఒంటరిగా ఉండి ఉంటే, ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచించి, మరింత చిరాకు, దురుసుతనంతో రగిలిపోయేది. కానీ మిగిలినవారు ప్రశాంతంగా, నిగ్రహంతో ఆనందంగా ఉన్నారు. ఆమె వాళ్ళతో ఎక్కువసేపు కలిసి ఉంటే చిరాకుగా ఉండటం అసాధ్యం.
"ఒంటరిగా ఉండకపోతే నేను కూడా మంచిగానే ఉంటాను" తల వంచి ఆలోచిస్తున్న జూలియన్ వైపు చూస్తూ, తనలో అనుకొంది జార్జి. "ఇతరులతో విషయాలను మాట్లాడుతుంటే, చాలా మంచి జరుగుతుంది. అప్పుడు వారంతా దుర్మార్గంగా కనిపించరు. వాళ్ళు మంచివాళ్ళుగా, సహనశీలురిలా కనిపిస్తారు. ఈ ముగ్గురు కజిన్లు నాకు బాగా నచ్చారు. వాళ్ళెప్పుడూ హుషారుగా, దయతో నవ్వుతూ మాట్లాడటం తనకు నచ్చింది. నేను కూడా అలాగే ఉండాలనుకుంటాను. నేను నిత్యం చిరాకుగా, జగడాలమారిలా తగవు పడతాను. అందుకే నాన్న నన్ను యిష్టపడక తరచుగా తిట్టిపోయటంలో ఆశ్చర్యమేమీ లేదు. అమ్మ చాలా మంచిది. కానీ నన్ను చెడ్డదానినని ఎందుకు చెబుతుందో యిప్పుడు అర్థమైంది. నా కజిన్లకు భిన్నంగా నేను ఉంటాను. వాళ్ళను సులువుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అందరికీ నచ్చుతారు. వాళ్ళు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎలా ఉండాలో అలా వాళ్ళు నన్ను మారుస్తున్నారు."
ఆమె ఆలోచనలు చాలా సేపు సాగాయి. వాటిలో ములిగిపోయిన ఆమె చాలా గంభీరంగా ఉంది. జూలియన్ తలెత్తి ఆమె నీలి కళ్ళు తనపై లగ్నమయ్యాయని గమనించాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?" చిరునవ్వుతో అడిగాడు.
"అంత విలువైన వేమీ కాదు" అంటున్న జార్జి ముఖం ఎర్రబడింది. "మీరంతా ఎంత మంచివారో అని ఆలోచిస్తున్నాను. నేను కూడా అలా ఎందుకు ఉండకూడదని అనుకొంటున్నాను."
"నువ్వు చాలా మంచిదానివి" మెచ్చుకుంటూ అన్నాడు జూలియన్. "ఇంటిలో ఒక్క పిల్లవే అయిపోవటం వల్ల నువ్వేమీ చేయలేవు. అలాంటి పిల్లలు జాగ్రత్తగా లేకపోతే, ఎప్పుడూ కొంచెం చిత్రంగా ప్రవర్తిస్తారు. నువ్వు చాలా ఆసక్తి కలిగించే పిల్లవని నా అభిప్రాయం."
అతని పొగడ్తకు జార్జి మురిసిపోయింది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment