ఎందరు సతులో యెందరు సుతులో
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0354-01 సం: 04-315
పల్లవి:
ఎందరు సతులో యెందరు సుతులో
యిందునందు నెట్లెరిగే నేను
చ.1:
మలయుచు నాయభిమానములని నే
కెలననిపుడు వెదకేనంటే
పలుయోనులలో పలమారుబొడమిన
చలమరి నాతొలుజన్మంబులను
చ.2:
గరిమెలబాణిగ్రహణము నేసిన
సిరులచెలుల గలసేనంటే
తరుణుల గురుతులు తలపున మరచితి
పరగిన బహుకల్పంబులయందు
చ.3:
శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల
భావించి యేకరి బైకొంటి
తావులజూడగ తగిలికోర్కుల
భావరతుల బెంబడి మనసందు
భావం
పల్లవి:
ఇక్కడా అక్కడా(ఎన్నోజన్మలలో) నాకు ఎందరు భార్యలో! ఎందరు బిడ్డలో!
నాకు ఎలా తెలుస్తుంది? ( తెలియుట కష్టమని భావం)
చ.1:
అనేక యోనులలో(జన్మస్థానములలో) అనేక సార్లు పుట్టిన మాత్సర్యశీల భరితమైన నా మొదటి జన్మలలో తిరుగుచూ ఆనాటి నా అభిమానములను, బంధుత్వాలను ఇప్పుడు నేను వెతుక్కోగలనా? (సాధ్యం కాదని భావం)
చ.2:
అనేక కల్పములలో (1000 మహాయుగాలు అనగా 432, 000, 000 సంవత్సరాలు)గొప్పతనములతో నేను పెండ్లి చేసుకొన్న శోభలు వెదజల్లు నా భార్యలను కలుసుకోగలనా? వారిగుర్తులు మరిచిపోయాను.
చ.3:
శ్రీ వేంకటగిరిదేవుడైన వేంకటేశుని ఆజ్ఞలతో ఆయనను భావించి, మన్మథాసక్తితో కోర్కెల జంతువులందు మనస్సును లగ్నం చేసి , కిరాత భావాన్ని తలదాల్చాను.(ఇప్పటికయినా స్వామి ఆ కిరాత భావాన్ని పోగొట్టి మోక్షాన్ని అనుగ్రహించాలని భావం)
No comments:
Post a Comment