'కదలిరా..దుర్గవై..!'
-సుజాత.పి.వి.ఎల్.
అయ్యలనుగన్న అమ్మవూ నీవే కదమ్మా!..
మరి, ఆ (మగ) మనసుల్లో
విష బీజాలెలానాటుకుంటున్నాయి తల్లీ?!..
సృష్టి సమస్తానికి జన్మనిచ్చే మాతృమూర్తి అన్న
ఆరాధనా భావాన్ని అడుగంటిస్తూ..
యత్ర నార్యస్తు పూజ్యంతే అన్న
సంస్కృతి నానుడిని భ్రష్టు పట్టిస్తూ..
పసిపిల్ల నుంచి పండు ముదుసలి దాకా
ఎవరు కనిపించినా రిమ్మతెగలు పుట్టే
మ(మృ)గాడి జాతికి
జన్మనెలా నిచ్చావమ్మా!?..
అవునులే పిల్లలను కంటావుగాని..
వాళ్ళు మదోన్మత్తులు, రాక్షస మనస్కులు అవుతారని,
ఎలా అనుకుంటావు..!?
అయినా...
అబలల రక్షణకు హామీ ఇచ్చే అపర చంఢికవూ నువ్వే కదా!..
చట్టాలు..న్యాయాలు కంచె కట్టలేకపోతున్నాయి..
జనారణ్యంలో మృగాళ్ళు ఒళ్ళు విరుచుకుంటున్నారు
అధాటున ఎత్తి, గోళ్ళతో చీల్చి,
శూలంతో తూట్లు పొడవాల్సిన సమయం ఆసన్నమయింది..
కదలిరా..దుర్గవై..
ఆడపిల్లలు నీ దుర్గంలో ఉన్నంతవరకు
రక్షణ ఇవ్వడానికి కదలిరా..!
***
No comments:
Post a Comment