మానస వీణ - 57 - అచ్చంగా తెలుగు

మానస వీణ - 57

Share This

                                                                    మానస వీణ - 57

స్వాతి శ్రీపాద

 



మరోసారి ఉంగరాన్ని తిప్పి తిప్పి చూసుకున్నాక తలపైకెత్తాడు. 

"నువ్వు నా కల్పవృక్షం, నా కామధేనువు. నా స్వర్ణ స్వప్నం". అవును నిజంగా తాడూ బొంగరం లేని క్షణాల్లో దేవుడిచ్చిన వరం ఆ ఉంగరం. 

మొహానికి ఉన్న మాస్క్ సవరించుకున్నాడు. 

కళ్ళు విప్పిన మానసకు ఒక్క క్షణం ఎక్కడ ఉందో అర్ధం కాలేదు. చక్కని ఏసీ గది అని మాత్రం తెలుస్తోంది. ఏదైనా హోటలా? కాదూ ఎక్కడైనా సుదూరంగా ఉన్న ఫామ్ హవుసా

కారులోకి తోసేసాక తేరుకునే లోగానే ఎవరో మత్తు మందులో ముంచిన కర్చీఫ్ మొహానికి అద్దినట్టున్నారు. ఎవరో గమనించే లోగానే మత్తులోకి జారిపోయింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడే కళ్ళు తెరవడం తెరవడం. 

రాత్రా పగలా? ఎక్కడ చూసినా వెలుగు కనిపిస్తున్నా అది కన్సీల్డ్ లైటింగ్ అని గమనించడానికి ఎంతో సమయం పట్టలేదు. 

బయటి శబ్దం ఏ మాత్రం లేదు. కనీసం గాలి వీచే ధ్వని కుడా. లేచి కూచుందామని చూసింది. 

ఉహు. చేతులు వెనక్కు విరిచి కట్టేసినట్టున్నారు. కాళ్ళు కదపడానికి లేకుండా రెండు కాళ్ళూ కలిపి కట్టారు. 

దాహంగా ఉంది. 

"నీళ్ళు కావాలి … ఎవరైనా ఉన్నారా?" అమె స్వరం అమెకే పీలగా వినిపించింది. 

ఎవరో నడిచిన శబ్దం మనిషి కనబడకుండా బాటిల్ పట్టుకుని మంచినీళ్ళు తాగించడం తెలుస్తోంది. 

"ఎవరు నువ్వు? ఎందుకు నన్నిక్కడికి తెచ్చావు?" ప్రశ్నల పరంపర కురిపించింది. కాని ఆ మనిషి పెదవి కదపకుండా జారుకున్నాడు. 

లైట్ల వెలుగు తగ్గి మసక వెలుతురు పరచుకుంది. 

'అనిరుధ్... ఎక్కడ ఉన్నావు అనిరుధ్' అమె మనసు బాధగా అతన్ని తలచుకుంది. 

సరిగ్గా అప్పుడే అనిరుధ్ కి పొలమారింది. ఉట్టుట్టిగానే. ఒక అరనిమిషం దగ్గి ఊపిరి గాఢంగా పీల్చుకుని సర్దుకున్నాడు. మానసే తలుచుకుని ఉంటుంది అనుకున్నాడు. 

రామజోగయ్య పక్కగదిలో పక్కాగా ప్లాన్ కోసం కావలసిన సమాచారం వెదుకుతున్నాడు.  ఎవరికీ తిండి మీద ధ్యాసే పోలేదు. అదేమిటో ఎవరెన్ని విధాల అనుమానించినా అనిరుధ్ కి తండ్రి మీద అపనమ్మకం కలగడం లేదు. 

'నాన్నలా చెయ్యడు. ఆయన అలాంటి మనిషి కాడు. నూటొకటో సారి అనుకున్నాడు. అవును, చిన్నప్పటి నుండి చూస్తున్నాడు సేవే పరమార్ధంగా బ్రతికే మనిషి… అలాంటిది… ఎలా నమ్మాలి? అసలీ   అప్పల్నాయుడి వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు?'

ఇంకా... 'అసలు దినేష్ ని రామజోగయ్యను నమ్మ వచ్చా? వాళ్ళకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? ఎలా ఎలా ఈ సమస్యని  ఛేదించాలి?' చేత్తో అసంకల్పితంగా నుదుటి మీద తట్టుకున్నాడు.

ఠక్కున గుర్తుకు వచ్చింది. ఈ అలవాటు చాలా చిన్నప్పుడే వచ్చిందట అదీ నెలల పిల్లడిగా ఉన్నప్పుడే. అమ్మ చెప్పేది. 

నాన్నకి, వాళ్ళ నాన్నకి కూడా అదే అలవాటు అంటూ - వారసత్వంగా ఇలాటివి వద్దన్నా వస్తాయి అనేది. 

కాని ఈ మధ్యన నాన్న ఎన్ని సమస్యలు వచ్చినా తలకొట్టుకోడం చూడనే లేదు.   

అంటే అప్పుడు తన వయసు పదిహేనో పదహారో… నాన్న ఒకసారి డబుల్ రోల్ సినిమా చూస్తూ "నన్నెవరైనా కిడ్నాప్ చేసి నా డబుల్ రోల్ గా వచ్చినా, ఈ అలవాటు తెలిగ్గా పట్టిచ్చేస్తుంది" అన్నాడు. అని ఒక నిమిషం ఆగి "చూడు అనీ, ఈ లోకంలో ఏదైనా సంభవమే… అందుకే మన కీలక రహస్యాలు డాక్యుమెంట్ చేసి సీక్రెట్ లాకర్ లో ఉంచాను. ఆ వివరాలు నీ పేరిట ఈ మెయిల్ క్రియేట్ చేసి అందులో పెట్టా. ఇది మనిద్దరికే తెలుసు ఏదైనా సమస్య వస్తే అవి చూడు. ఈ మెయిల్ ఐడి నా పేరూ నీపేరూ ఇనిషియల్స్.  పాస్ వర్డ్ అమ్మ పుట్టిన రోజు కి అటు ఇటూ మూడు సున్నాలు"

ఇన్నేళ్ళు ఒక్కసారిగా కూడా ఆ మాటలు తలపుకి రాలేదు. ఇప్పుడూ ఇలా… 

ఒక్కసారి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు.  ఇప్పుడూ ఈ రామ జోగయ్య, దినేష్ నన్ను వంటరిగా వదుల్తారా మరెలా… ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళగలగాలి… ఆలోచనలో పడ్డాడు. 

                                               ***

మానసకు నిద్రపట్టేసినట్టుంది. మళ్ళీ మెళుకువ వచ్చి కళ్ళు తెరిస్తే, ఉండీ లేనట్టున్న వెలుగు. 

ఎక్కడి నుంచో సన్నని మూలుగు. కాస్సేపు గుండె గుబగుబలాడింది. చూసిన దయ్యం సినిమాలన్నీ  గుర్తుకు వచ్చాయి. ఇది పాడుబడిన ఫామ్ హవుసా? దయ్యాలు ఉన్నాయా ? ఛ.. చిన్నప్పటినుండీ లేవని వాదించి ఇప్పుడెలా వస్తాయి. మరో సారి చెవులు రిక్కించి వింది. ఖచ్చితంగా మనిషి స్వరమే. 

ఎక్కడ పక్కగదిలోలా లేదు. లేచే ప్రయత్నం లో మంచం చివరకు ఉందేమో దొర్లి కిందపడింది. 

దబ్బున శబ్దం… చెక్క ఫ్లోరింగ్ లా ఉంది.  తేరుకున్నాక శబ్దం మరింత స్పష్టంగా… 

అవునుఫ్లోర్ కింద నుండే… అంటే నేనున్నది ఎన్నో ఫ్లోర్ లో… కొంచం ధైర్యం కూడ గట్టుకుంది.  

"ఎవరు?" బోర్లా దొర్లి నోరు నేలకు ఆనించి అడిగింది. 

"నేను... నేను… " 

సరిగ్గా వినబడలేదు. 

అప్పుడే చటుక్కున ఎవరో గదిలోకి వచ్చారు. 

No comments:

Post a Comment

Pages