నీకు నాకు మధ్య... - అచ్చంగా తెలుగు
నీకు నాకు మధ్య...

నాగమంజరి గుమ్మా



"శ్రీకాంత్ ని చూడవే. నాలుగేళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్నాడు. నువ్వు ఔనని చెప్పవు, కాదని చెప్పవు. ఆ అబ్బాయి అంతే. నిన్ను వదలడు. అదే నేనైతే ఎప్పుడో ఒప్పేసుకునేదాన్ని. ఇంకా ఏమిటే నీ సంశయం? " ప్రశ్నించింది పల్లవి.

మౌనమే సమాధానంగా చిరునవ్వు నవ్వింది రవళి.
"నిన్ను అడిగాను చూడు... నాది బుద్ధి తక్కువ." అంటూ దూరంగా కనిపిస్తున్న శ్రీకాంత్ కేసి చేయి ఊపింది పల్లవి.

బదులుగా శ్రీకాంత్ కూడా చేయి ఊపాడు. 
అంతే... సమావేశం పూర్తి అయినట్లు రవళి, పల్లవి కళాశాల లోకి వెళ్లిపోయారు. శ్రీకాంత్ తన బండి మీద ముందుకి వెళ్ళిపోయాడు.

శ్రీకాంత్ ఇంజనీరింగ్ చదువు మూడో ఏడులో ఉండగా ఆ కాలేజీలో మొదటి సంవత్సరం లో చేరింది రవళి. రెండో సంవత్సరం విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులను ఆట పట్టించబోగా, అటుగా వస్తున్న శ్రీకాంత్ వారిని వారించాడు. అప్పుడు చూసాడు రవళిని. నల్లగా ఉన్నా కళ అయిన ముఖం.  చెంపకు చారెడు కళ్ళు, పొడుగాటి జడ. ఎందుకో చూడగానే ఆకర్షితమయ్యాడు శ్రీకాంత్. థాంక్స్ చెప్పి రవళి అక్కడ నుంచి వెళ్ళిపోయింది కానీ శ్రీకాంత్ మనసులో గుడి కట్టేసింది. స్వతహాగా బిడియస్తురాలైన రవళికి పల్లవి ఒక్కతే స్నేహితురాలు. ఇద్దరూ ఒకే బస్ లో కాలేజీకి వస్తారు. రెండు నెలలుగా శ్రీకాంత్ తమ వెంట రావడంతో పల్లవి మొదట శ్రీకాంత్ తన కోసమే వస్తున్నాడనుకొంది. దొంగచాటుగా చూస్తూ, చిరునవ్వులు విసిరేసరికి శ్రీకాంత్ కంగారుపడి, తాను ఇష్టపడుతున్నది రవళినని చెప్పేసాడు.

అదిగో అప్పుడు మొదలైంది. రవళి ఒప్పుకోదు, పల్లవికి ఆశ చావదు. తన చదువు పూర్తి అయిపోయినా, రోజు వీళ్ళ కాలేజి బస్సు వచ్చే సమయానికి కాలేజి దగ్గర నిరీక్షించడం, వీళ్ళు కాలేజి లోపలికి వెళ్లిపోగానే శ్రీకాంత్ బయలుదేరడం... ఇలాగే రవళి చదువు నాలుగేళ్లు పూర్తికావచ్చేయి.

ఆఖరి సెమిస్టర్ పరీక్షల ముందు, సెలవులు రేపటి నుండి అని ప్రకటించారు. మరొక పదిహేను రోజుల్లో పరీక్షలు. అయిపోతే ఎవరికెవరో... సెలవులు అని తెలిసినా ఎందుకో శ్రీకాంత్ కాలేజి గేటు దగ్గర వేచి ఉన్నాడు. ఒక ఆటో వచ్చి గేట్ దగ్గర ఆగింది. రవళి, పల్లవి ఆటో దిగారు. శ్రీకాంత్ కళ్ళు మెరిసాయి. రవళి కూడా చూపు కలిపింది. 

"ఓయ్! మనం వస్తామని నువ్వు శ్రీకాంత్ కి చెప్పేవా?" గొణిగింది పల్లవి.

మళ్ళీ చిరునవ్వే సమాధానం రవళి నుంచి.

ఇద్దరూ కాలేజి వైపు అడుగులు వేస్తుండగా, శ్రీకాంత్ పిలిచాడు... "మాట..."

రవళి వెనక్కు తిరిగి చూసింది. 

"నేను మీ నాన్నగారితో మాట్లాడవచ్చా?" అన్నాడు శ్రీకాంత్.

చేతిలో ఉన్న నోట్ బుక్ నుంచి పేజీ చించి తండ్రి పేరు, ఫోన్ నెంబర్, ఎడ్రసు రాసి శ్రీకాంత్ చేతికి ఇచ్చింది రవళి. నవ్వుతూ అందుకుని "థాంక్స్" అన్నాడు శ్రీకాంత్. రవళి, పల్లవి ముందుకు నడిచారు. రవళి తండ్రి ఫోన్ నెంబర్ వెంటనే ఇచ్చినందుకు ఆశ్చర్యపడుతూనే, రవళి ఒప్పుకోకపోతే శ్రీకాంత్ ను అడగాలనుకున్న ఆశ ఆవిరయినందుకు ఒకింత బాధపడింది పల్లవి.

కాలేజి దగ్గర నుండి బయలుదేరిన శ్రీకాంత్ మనసు ఏవేవో లోకాల్లో విహరిస్తోంది. ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ తనని చూసి ఒక్క మాట కూడా మాట్లాడని రవళి ఈరోజు అడగ్గానే తన తండ్రి ఫోన్ నెంబర్, చిరునామా ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆలోచనలు కట్టిపెట్టి గమ్యం వైపు సాగిపోయాడు.
***
పుస్తకం ముందేసుకుని కూర్చున్న రవళిని ఆలోచనలు చుట్టుముట్టాయి. తను నల్లగా ఉంటుందని తెలుసు. వారసత్వం గా వచ్చిన లక్షణం. దైవదత్తం.  నలుపు లోపం కాకపోయినా,  చిన్నతనం నుంచి ఏదో బెరుకు. ఇంట్లో మామూలుగానే ఉన్నా, నలుగురిలోకి వెళ్ళేటప్పుడు, ఏ పనికైనా ముందుండటానికి కాస్త బిడియపడేది రవళి. వయసు వచ్చే కొద్దీ ఆ బిడియం ఎక్కువయ్యింది. ఇంటర్ లో చేరాక తన తోటి విద్యార్థినులంతా సీతాకోకచిలకల్లా రంగురంగుల ఫాషన్ దుస్తుల్లో మెరిసిపోతూ ఉంటే, తను మాత్రం సంప్రదాయకమైన దుస్తులనే ధరించేది, ఆ అలవాట్లనే పాటించేది. 

ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రోజు... గేటు దాటి లోపలికి వస్తూ ఉంటే "ఏయ్ ఎల్లో" పిలిచారెవరో... తనని కాదనుకుని ముందుకు వెళ్ళిపోబోయింది రవళి.

 "ఏయ్ బ్లాక్ బ్యూటీ... పిలిస్తే ఆగాలని తెలీదా?" మళ్ళీ పిలిచారు. 

తప్పనిసరై ఆగి, చుట్టూ చూసింది. నలుగురు అమ్మాయిలు మైదానంలో ఉన్న సిమెంటు బెంచి దగ్గర నుంచి రవళినే చూస్తూ, పిలుస్తున్నారు. సీనియర్స్ కాబోలు అనుకుంది. రవళి అటు తిరిగి అడుగులు వేయగానే మరో నలుగురు వచ్చి చేరారు. దగ్గరగా వచ్చి "గుడ్ మార్నింగ్ సీనియర్స్" అని చెప్పింది. 

"అబ్బో మర్యాదలు పాటిస్తున్నావే..." 
"మొదటిసారి పిలిస్తే ఎందుకు రాలేదు?"
"నిన్ను బ్లాక్ బ్యూటీ అని పిలిస్తే కానీ పలకవా?"
ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. 
"నీపేరు?"
"రవళి"
"ఏ ఊరు?"
"..." చెప్పింది.
"కాలేజీకి చుడిదార్ లో వస్తారా? జీన్స్ వేసుకురావాలని తెలీదా?" 
మౌనంగా ఊరుకుంది రవళి.
"ఇంత పొడుగు జడ, జడలో గులాబీ... అబ్బే మాకు నచ్చలేదు. రేపు పార్లర్ కు వెళ్లి భుజాల వరకు కత్తిరించుకో... లేదంటే మేమే కత్తిరిస్తాం..." ఆజ్ఞో, బెదిరింపో అర్ధం కాలేదు రవళికి.
తన జడ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది.  కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రవళికి.

"ఏయ్, శ్రీకాంత్ సర్ వస్తున్నారు, వదిలేయ్" అంది ఓ అమ్మాయి. 
చటుక్కున జడ వదిలేసి నిలుచున్నారు నలుగురు అమ్మాయిలూ... 

"ఏంటి ర్యాగింగా? ఈ కాలేజీలో అలాంటివి లేవని తెలీదా?" గద్దించాడు అతను.

"సారి సర్, జస్ట్ ఇంటరాక్షన్" నసిగింది ఒక అమ్మాయి.
"జడ కత్తిరిస్తానని చెప్పడం ఇంటరాక్షనా? మరోసారి ఇలా చూస్తే రిపోర్ట్ ఇస్తా... " అని వాళ్ళని హెచ్చరించి, "మీరు వెళ్ళండి" అన్నాడు. "థాంక్స్" చెప్పి కదిలింది రవళి.

"నా పేరు శ్రీకాంత్. మీ పేరు? ఏ బ్రాంచ్?" వెనుకే వస్తూ అడిగాడు.

చెప్పింది రవళి. "మీకు సూపర్ సీనియర్ ని అయితే. ఆల్ ద బెస్ట్" చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. 

అప్పటి వరకు శ్రీకాంత్ ఒక లెక్చరర్ అనుకుంది రవళి. అంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి, రవళి భుజం మీద చేయి వేసింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది రవళి. 
"నేను కూడా మీ బస్ లోనే దిగాను. మీరు ఇటు బేచ్ కి దొరికారు, నేను అటు బేచ్ కి దొరికాను. నా పేరు పల్లవి. శ్రీకాంత్ సర్ వచ్చేసరికి నన్ను కూడా వదిలేశారు వాళ్ళు. మీ పేరు? ఏ బ్రాంచ్?" గలగలా అడిగేసింది పల్లవి. చెప్పింది రవళి. 

"అయితే ఒకటే క్లాస్. హమ్మయ్య. నాకో ఫ్రెండ్ దొరికింది." అంది పల్లవి.  నవ్వి ఊరుకుంది రవళి.
అదిగో అలా ఒకే రోజు పరిచయమయ్యారు శ్రీకాంత్, పల్లవి. 

ఒక వారం గడిచాక  నడుస్తున్న పల్లవి రవళి చేయి పట్టుకుని హఠాత్తుగా ఆపింది. "ఏమైందన్నట్లు" కళ్ళతోనే అడిగింది రవళి. 

"శ్రీకాంత్ మనల్ని ఫాలో అవుతున్నాడు." అంది గుసగుసగా.

"నీ భ్రమ. నోరు మూసుకుని పద." కసిరింది రవళి. రవళి లా తలొంచుకు పోయే రకం కాదు పల్లవి. ఈనాటి ఆధునిక అమ్మాయి. తన తోటి అమ్మాయిల వస్త్రధారణ గమనించడం, బావున్న ఫాషన్లను అనుసరించడం, అబ్బాయిలు అమ్మాయిలను గూర్చి చేసే కామెంట్లు, కాంప్లిమెంట్లు పరిశీలించడం.. ఇలా కాస్త తన పరిసరాలని గమనిస్తూ, మనుషుల్ని చదివేస్తూ... గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. విని, నవ్వి ఊరుకుంటుంది రవళి.

రెండు నెలలు గడిచాక ఓరోజు "నువ్వు నడుస్తూ ఉండు, నే వచ్చి కలుస్తానని" గేటు దగ్గరే ఆగిపోయింది పల్లవి. రవళి "ఎందుకని" అడక్కుండా ముందుకు నడిచిపోయింది. పది నిమిషాల లోనే గబగబా వచ్చింది పల్లవి.

"ఓయ్ నల్లపిల్లా!" 

పల్లవి వైపు ప్రశ్నార్థకంగా చూసింది రవళి. 

"అదిగో! ఆ కళ్ళతోనే కట్టేసావా తల్లీ?"

"ఎవరిని?"

"అబ్బ! ఏం తెలియదండి... శ్రీకాంత్ మన వెనకే తిరుగుతున్నాడని తెలుసు కదా... నన్నేమో అనుకుని, ఆగి, వెళ్లి అడిగాను. కంగారు పడిపోయాడు గురుడు. తనకి నువ్వే నచ్చావట... నువ్వు కరుణించే వరకు నిరీక్షిస్తాడట..." నిట్టూరుస్తూ చెప్పింది పల్లవి.

కాస్త కంగారు పడింది రవళి. "నాకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెప్పెయ్" అంది.

"అయితే నేను ప్రయత్నించుకోనా?" ఆశగా అడిగింది పల్లవి.

"కడతానంటే తాళి కూడా కట్టించుకో. నాకేం అభ్యంతరం లేదు. నేను ముందు ఈ చదువు పూర్తి చేయాలి. తర్వాత మా నాన్న ఇష్టపడిన కుర్రాడితో నా పెళ్లి. ఈ ప్రేమలు నాకు సరిపడవు" తేల్చి చెప్పేసింది రవళి.

వెనుదిరిగి చూసింది పల్లవి. శ్రీకాంత్ కనబడలేదు. తర్వాతి రోజు శ్రీకాంత్ కనబడితే రవళి ఉద్దేశ్యాన్ని, తన మనసులో మాటను బయటపెట్టింది పల్లవి. శ్రీకాంత్ సున్నితంగా తిరస్కరించాడు. ఒప్పుకునే వరకు రవళి నే ఆరాధిస్తానని చెప్పేడు. పల్లవికి ఇష్టమైతే స్నేహితులుగా ఉందామని చెప్పేడు.

రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి. శ్రీకాంత్ చదువు పూర్తయిపోయింది. "ఇంక ప్రతిరోజు వెంటపడడు" అని రవళి సంతోషించింది. "అయ్యో కనబడడే" అని పల్లవి నిట్టూర్చింది. కానీ కాలేజీలు తెరిచిన క్షణం నుంచి, బస్ దిగేసరికి ఎదురై, కళ్ళతోనే పలకరించి, వీళ్ళు గేటు దాటి పోగానే వెనుదిరిగి పోతున్నాడు శ్రీకాంత్. 
క్యాంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగం వచ్చినా వదులుకుని, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా చేరాడట. పల్లవి కనుక్కుని చెప్పింది. ఇప్పుడు మరో రెండేళ్లు కూడా గడిచిపోయాయి. 
ధైర్యం చేయకపోతే ప్రేమ దక్కదని శ్రీకాంత్ అడగడం, నాలుగేళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్న వ్యక్తిని వదులుకోవడం ఇష్టం లేక రవళి ఒప్పుకోవడం జరిగిపోయాయి. 
***
రవళి తండ్రి వెంకటరావు గారికి ఫోన్ చేసి తనను పరిచయం చేసుకున్నాడు శ్రీకాంత్. తన కాలేజి లేదా ఇల్లు లేదా వేరే ఎక్కడైనా కలిసి మాట్లాడుకోవడానికి అనుమతి అడిగాడు.

శ్రీకాంత్ మాటతీరు, రవళిపై అతను చూపిస్తున్న ప్రేమ రవళి తండ్రిని ఆకట్టుకున్నాయి. "ఇంటికే రమ్మని" ఆహ్వానించారు. 

ఆ సాయంత్రం శ్రీకాంత్ పూలు, పళ్ళు తీసుకుని రవళి ఇంటికి వచ్చాడు. పళ్ళు వెంకటరావు గారి  చేతిలో పెట్టి నమస్కరించాడు. పూలు టీపాయ్ మీద పెట్టాడు. వెంకటరావు గారు రవళిని పిలిచారు.  రవళి తల్లి సత్యవతి రవళిని తీసుకు వచ్చింది. రవళి లేత ఆకుపచ్చ చీర లో వచ్చి నిలుచుంది. ఎప్పుడూ చుడిదార్ లో కనిపించే రవళి చీరలో కొత్తగా కనబడింది శ్రీకాంత్ కి. మెడలో ఎప్పుడూ ఉండే ఒంటిపేట ముత్యాల దండ. చెవులకు టాప్స్ కాకుండా ముత్యాల హేంగింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన అలంకారాలు చేసుకోలేదు రవళి. 

"పెద్దల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉత్తచేతులతో వెళ్లకూడదు అని అమ్మ చెప్తుంది. పూలు పళ్ళు తీసుకు వచ్చాను. ఇష్టమైతే రవళికి ఇవ్వండి" అన్నాడు శ్రీకాంత్. టీపాయ్ మీద ఉన్న పూలు రవళికి ఇచ్చింది సత్యవతి. మాల నుంచి కాస్త దండ తుంపి, దేముడికి పెట్టి, మరికొంత తల్లి జడలో పెట్టి, మిగిలినవి తన జడ లో తురుముకుంది రవళి. కాఫీ ఫలహారాలు తెస్తానని చెప్పి, రవళి, సత్యవతి వంటింట్లోకి వెళ్లారు.

 శ్రీకాంత్ కుటుంబ వివరాలు, చదువు వగైరా వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంకటరావు గారు. వంటింట్లో ఉన్న వారికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కాఫీ తీసుకువచ్చింది రవళి. ట్రే లో ఫలహారాలు తీసుకువచ్చారు సత్యవతి గారు. రవళి ఇష్టం కూడా కనుక్కున్నాక, మంచి రోజు చూసుకుని శ్రీకాంత్ వాళ్ళింటికి మాట్లాడటానికి వస్తామని చెప్పేరు వెంకటరావు దంపతులు. శ్రీకాంత్ ని రాత్రి భోజనం చేసి వెళ్ళమన్నారు. శ్రీకాంత్ సంబంధం కుదిరిన తర్వాత తప్పక చేస్తానన్నాడు. సెలవు తీసుకుని, రవళికి చెప్పి, బయలుదేరాడు శ్రీకాంత్. వెళ్లేముందు, శ్రీకాంత్ తండ్రి వివరాలు, ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు వెంకటరావు గారు.

శ్రీకాంత్ తండ్రి రాజారావు తో ఫోన్ లో ఒకసారి మాట్లాడి, వారి ఇంటికి వెంకటరావు దంపతులు వెళ్లారు. రాజారావు దంపతుల సౌమనస్యం, ఆదరణ బాగా నచ్చేయి. ఇరు కుటుంబాలకు అంగీకారం కుదరగానే త్వరలోనే నిశ్చితార్థానికి, మూడు నెలలు తిరగకుండా పెళ్లి కి ముహుర్తాలు పెట్టుకున్నారు. 

నిశ్చితార్థానికి, పెళ్లికి పల్లవి రాలేదు. ఎంత సరదాగా అనుకున్నా శ్రీకాంత్ ని మనసారా ఇష్టపడింది పల్లవి. శాశ్వతంగా తనకు దక్కడు అని తెలిసాక, పై చదువులకోసం దూరంగా వెళ్ళిపోయింది. శ్రీకాంత్ రవళిల వివాహం చక్కగా జరిగింది. పిల్ల కాస్త రంగు తక్కువ, అయినా ప్రేమ పెళ్లి కాబట్టి ఒప్పుకున్నారు అని కొందరు చెవులు కోరుక్కోవడం అక్కడక్కడ రవళి చెవిన పడింది. శ్రీకాంత్ రవళి చేయి తట్టి, "నేనున్నాను" అని కళ్ళతోనే భరోసా కల్పించాడు. కొందరైతే రవళికి ఆస్తి ఎక్కువగా ఉందేమో, అందుకే శ్రీకాంత్ రవళిని చేసుకుంటున్నాడేమో అని కూడా అనేశారు. నిజానికి రాజారావు కుటుంబం కంటే వెంకటరావు కుటుంబం ఆర్ధికంగా కాస్త ఎక్కువే. అయినా ఆ భేషజం ఎక్కడా లేదు. రవళి నెమ్మదితనం, అణకువ, అతిథులను ఆహ్వానించే తీరు, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా అందరి మనసులో స్థానం సంపాదించింది రవళి.
***
నాలుగేళ్లు ఇట్టే తిరిగిపోయాయి. రవళి శ్రీకాంత్ లకు ఒక కూతురు, కొడుకు. కాలేజి తరపున కేరళ యూత్ ప్రోగ్రాంకు కుటుంబ సమేతంగా బయలుదేరాడు శ్రీకాంత్. కాలేజి పిల్లలందరూ ట్రైన్ లో బయలుదేరారు. వారితో ఇద్దరు లెక్చరర్లని పంపించి, తన భార్యా పిల్లలతో అంత దూరం ట్రైన్ లో వెళ్లలేక విమానంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకాంత్. విమానాశ్రయంలో భుజాన చంటి పిల్లాడితో, చేతిలో ట్రాలీతో అనుకోకుండా ఎదురైంది పల్లవి. 

"పల్లవీ" ముందుగా చూసిన రవళి పలకరించింది. చాలా కాలానికి కలిసిన స్నేహితుల ఆనందానికి మితి లేకపోయింది. పక్కనే ఉన్న కుర్చీలలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. పల్లవి కాస్త ఒళ్ళు చేసింది. రవళి కూడా ఇద్దరు పిల్లల తల్లి కావడంతో మరీ కాలేజి పిల్లలా కాకున్నా నాజూగ్గానే ఉంది. పల్లవి చేతిలో ఉన్న పిల్లాడు కాస్త పల్లవి పోలికలతోనే ఉన్నాడు.

"ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? మా పెళ్లికి రాలేదు సరే... నీ వివరాలు కూడా ఏమి చెప్పేవు కాదు" అంది రవళి.

ఎం.టెక్ చేస్తుండగా విదేశీ స్టూడెంట్ తో పరిచయం అయ్యిందని, ఈ అబ్బాయి తన కొడుకు విహాస్ అని చెప్పింది పల్లవి. ఏడాది వయసున్న రవళి కొడుకు, దాదాపు అంతే వయసున్న పల్లవి కొడుకు భలే ఆటల్లో పడ్డారు. ఈలోగా టైం అవడంతో ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని శ్రీకాంత్, రవళి పల్లవి దగ్గర సెలవు పుచ్చుకున్నారు. 

బయలుదేరబోతూ పల్లవి వైపు చూసిన శ్రీకాంత్ కి పల్లవి కళ్లలో నీలి నీడలు, కన్నీటి జాడలు కనిపించాయి. చాలాకాలం తర్వాత కలిసిన ఆనందోద్వేగాలు అనుకున్నాడు. 

పల్లవి నెమ్మదిగా ముందుకు సాగిపోయింది. 
"రవళి, పల్లవిని చూసావా? తనతో తీరిగ్గా ఓసారి మాట్లాడాలి" అన్నాడు శ్రీకాంత్.
అవునన్నట్లుగా చూసింది రవళి.
***
ఓ రోజు సాయంత్రం శ్రీకాంత్ రవళికి ఫోన్ చేసాడు. 
"బయటకి వెళదాం తయారుగా ఉండమని."
శ్రీకాంత్ రాగానే ఇద్దరూ బయటకు వెళ్లారు. కార్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగడంతో రవళి ఆశ్చర్య పోయింది. శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రమ్మన్నట్లు చూసి, ముందుకు నడిచాడు. 
ఒక వార్డ్ లో నోటిలో, ముక్కులో గొట్టాలతో, చేతికి సెలైన్ తో పల్లవి కనిపించింది. పక్కనే ఒక లేడీ కానిస్టేబుల్ చేతిలో పల్లవి కొడుకు ఏడుస్తున్నాడు. గబగబా విహాస్ ని అందుకుంది. 

"పల్లవీ" అంది గాభరాగా…

"బాబుని గట్టున కూర్చోపెట్టి, నీటిలోకి దూకింది. వెంటనే పక్కనున్న వారు చూసి, దూకి, ఒడ్డుకు తీసుకువచ్చేలోగా నీళ్లు తాగేసి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒడ్డున ఉన్న హేండ్ బేగ్ లో నా విజిటింగ్ కార్డు చూసి నాకు ఫోన్ చేశారు పోలీసులు. హాస్పిటల్ లో చేర్చి, నాకు ఎడ్రసు చెప్పేరు." అన్నాడు శ్రీకాంత్.

మరో గంటకు పల్లవికి మెలకువ వచ్చింది. రవళిని, శ్రీకాంత్ ని చూసి, సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకుంది. పోలీసుల దగ్గర రాతకోతలు పూర్తిచేసి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి, పల్లవిని, విహాస్ ను తమ ఇంటికి తీసుకువచ్చారు శ్రీకాంత్, రవళి.

జరిగినదేమిటో ఎవరికి తెలియదు. పల్లవికి స్వస్థత చిక్కాక తానే చెప్తుందని ఊరుకున్నారు. ఇంట్లో మాత్రం, పల్లవి తమ ఇద్దరికి స్నేహితురాలని, హఠాత్తుగా ప్రయాణంలో ఉండగా అనారోగ్యం చేసిందని, హాస్పిటల్ లో చూపించి తీసుకువచ్చామని చెప్పేరు.

రాజరావుగారు, అతని భార్య, రవళి, పిల్లలు అందరి సమక్షంలో తన అనారోగ్యాన్ని, కష్టాన్ని మర్చిపోయి, నాలుగు రోజుల్లోనే కోలుకుంది పల్లవి. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు, తిరిగి వచ్చాక శ్రీకాంత్ వచ్చి పల్లవిని పలకరించి వెళ్ళేవాడు. 

పల్లవికి ప్రశాంతత చిక్కింది అనిపించిన తర్వాత, ఓ రోజు సాయంత్రం పిల్లలు ముగ్గుర్ని పెద్దవాళ్ళ దగ్గర వదిలి, శ్రీకాంత్, రవళి, పల్లవితో కలిసి షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్లారు. 

విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తోంది రవళి. ఇంతలో పల్లవి "కాసేపు ఆ పార్క్ లో కారు ఆపండి శ్రీకాంత్" అంది.

"నేను సెకండ్ ఇయర్ లో ఉండగా విన్నీ తో పరిచయమయ్యింది. తను చాలా ఆక్టివ్. ఒకసారి ప్రేమలో పడిన వారు రెండోసారి తేలిగ్గా పడతారుట... సారీ రవళి... శ్రీకాంత్... నిన్ను ప్రేమించి, పొందలేక పోయిన నన్ను విన్నీ చాలా త్వరగా అర్ధం చేసుకున్నాడు. తమ వైపు ఇవన్నీ సాధారణం అని, బ్రేక్ అప్ కు ఇంత కుమిలిపోకూడదని ఓదార్చాడు. నాది బ్రేక్ అప్ కాదు, వన్ సైడ్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నన్ను వీలయినంత వరకు ప్రతిక్షణం ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. సినిమాలకు తీసుకువెళ్ళేవాడు. రాత్రి పగలు నాతో ఛాటింగ్ లో టచ్ లో ఉండేవాడు. మొదట స్నేహంగా ఉన్న మేము క్రమేపీ ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని పరిస్థితి కి వచ్చాము. ఇద్దరం ఒకే రూమ్ తీసుకుని సహజీవనం మొదలు పెట్టాము. ఒక ఏడాది బాగానే గడిచింది. చదువులు అయ్యాక ఇద్దరం ఉద్యోగాలలో చేరాము. విహాస్ కడుపున పడ్డాడు. అప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా ఎలా జరిగిందో తెలీదు. సరే ఇద్దరం ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకున్నాం.  పెళ్లి అయిన ఆరు నెలలకు విహాస్ పుట్టాడు. విహాస్ పుట్టినా విన్నీ కి నా మీద ప్రేమ ఇంత పిసరు కూడా తగ్గలేదు. తన వీసా పొడిగించుకున్నాడు. అక్కడ ఉన్న తన తల్లిదండ్రులకు వీడియో కాల్ లో నన్ను, విహాస్ ను చూపించాడు. 

మా ముగ్గురికి వాళ్ళ దేశం వెళ్ళడానికి వీసా పనుల మీద ఇక్కడికి వచ్చాడు. ఈలోగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోత కారణంగా మా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుని, వీసా కు ప్రయత్నిస్తానని విన్నీ చెప్పాడు. నన్ను, విహాస్ ను వీసా కోసం ఇక్కడికి రమ్మన్నాడు. నేను ఆరోజు మీకు విమానాశ్రయం లో కనిపించింది అప్పుడే... 

కానీ నేను వచ్చేసరికి విన్నీ అక్కడ లేడు. తను పనిచేసే చోటికి వెళ్లి అడిగాను. ఆరోజు సాయంత్రం వీసా పనిమీద వెళ్తున్నానని చెప్పేడన్నారు... మరి ఆ రోజు నుంచి కనిపించలేదు. హాస్టల్ లో చేరాను. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. కొత్తగా ఉద్యోగం దొరకలేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను. ఈ ఆరు నెలలుగా విన్నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. మీ ఎదురు పడాలనిపించలేదు. మీరు ఫోన్ చేసినప్పుడల్లా మాములుగా మాట్లాడి పెట్టేసేదాన్ని. ఇంక భరించలేక, విహాస్ ని నాతో తీసుకెళ్లలేక, ఒడ్డునే కూర్చోపెట్టి, నేను మాత్రమే నీటిలోకి దూకేసాను" చెప్పి మౌనం వహించింది పల్లవి. ఓదార్పుగా పల్లవి భుజం మీద చేయి వేసింది రవళి. 

తను చెప్పేది పూర్తి కావచ్చే వరకు ఏమి మాట్లాడలేదు శ్రీకాంత్, రవళి. "పదమని" చెప్పి, ఒక హోటల్ కి తీసుకువెళ్లాడు శ్రీకాంత్.  తేలిగ్గా ఫలహారం తీసుకుని, కూల్ డ్రింక్ తాగి స్థిమిత పడ్డాక, 

"ఒక్కసారైనా అసలు విషయం చెప్పాల్సింది పల్లవీ" అన్నాడు శ్రీకాంత్. "సరే, ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకు. నేను కూడా ఎంక్వయిరీ మొదలుపెడతాను. ఈ లోగా నీకేదైనా పని చూడాలి. పదండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది" అని చెప్పి, గబగబా షాపింగ్ కి తీసుకువెళ్లి, పల్లవికి, విహాస్ కు కావలసిన వస్తువులు కొని ఇంటికి చేరుకున్నారు. 

ఔట్ హౌస్ లోకి పల్లవి మకాం మారింది. పగలంతా రవళి వాళ్ళింట్లోనే ఉండేది. పల్లవికి కాలక్షేపానికి, ఆసరాగా ఉండటానికి ఏదైనా ఉద్యోగం చూడమని శ్రీకాంత్ కు చెప్పింది రవళి. 

"సాఫ్ట్వేర్ అంటే ప్రస్తుతం ఖాళీ లేవని, కావాలంటే తమ కాలేజీలో లెక్చరర్ గా ప్రయత్నిస్తానని" శ్రీకాంత్ చెప్పాడు. పల్లవి "సరే"నంది. 

పల్లవి వేరేగా బస్ లో వెళ్తానన్నా, వద్దని, ఇద్దరం వెళ్ళేది ఒకే కాలేజీకి కాబట్టి తన కార్ లో వెళదామని చెప్పేడు శ్రీకాంత్. 

ఆరు నెలలుగా సరైన తిండి తిప్పలు లేక పాలిపోయి, సన్నబడిపోయింది పల్లవి. దానికి తోడు భర్త కనిపించని ఆవేదన, ఒంటరితనం. ఇప్పుడు తనకు ఒక భరోసా దొరికింది. 

సన్నగా, తెల్లగా, నాజూగ్గా ఉన్న పల్లవి శ్రీకాంత్ తో పాటు కాలేజీకి వెళ్తూ ఉంటే విహాస్, తన కొడుకులతో పాటు గేటు వరకు వచ్చి సాగనంపేది రవళి. శ్రీకాంత్ డిపార్ట్మెంట్ హెడ్ అయితే పల్లవి చదువు ఎక్కువైనా, కొత్త కాబట్టి జూనియర్ లెక్చరర్ అయ్యింది. తన బాధలు మరచిపోడానికి పనిలో మరింత లీనమయ్యేది పల్లవి. తెలియని విషయాలను, సబ్జెక్టు లో డౌట్ లను శ్రీకాంత్ ను అడిగి తెలుసుకునేది. సాయంత్రం కాలేజి నుంచి వచ్చాక, కాసేపు పిల్లలతో గడిపి, తర్వాత విన్నీని వెతకడానికి వెళ్ళేవాడు శ్రీకాంత్. పోలీసు స్టేషన్ కు వెళ్లడం, తనకు పరిచయం ఉన్న అధికారులతో కేసు కాస్త ముందుకు వెళ్లేలా చూడటం, తాను కూడా స్వయంగా ప్రతి చోటా విచారించడం చేసేవాడు.

ఈలోగా ఒకరోజు పల్లవిని తీసుకుని, వారి ఊరికి వెళ్లి, అక్కడ ఇంటి అద్దె తదితర బకాయిలు కట్టి, అక్కడి సామాన్లు అన్ని ఇక్కడికి తెప్పించాడు శ్రీకాంత్. పల్లవి కాస్త కుదుట పడ్డట్టు అయ్యింది. 

శ్రీకాంత్ కి ఇప్పుడు రవళితో గడిపే సమయం కంటే పల్లవితో గడిపే సమయం ఎక్కువైంది. ఎక్కడెక్కడో విన్నీ గురించి వెదికి, రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరడం, స్నానం, భోజనం చేసి, మర్నాటి ప్రోగ్రాం లను కాసేపు చూసుకుని, రవళితో కాసేపు మాట్లాడి, నిద్రపోయేవాడు. ఇదివరకులా ఇద్దరూ ఏకాంతంగా ఎక్కువసేపు గడపడానికి వీలు లేకపోతోంది. పగలంతా విహాస్ రవళితో ఉండటంతో, రాత్రిళ్ళు కూడా రవళి పిల్లలతో కలిసి నిద్రపోతున్నాడు. 

ఒకరోజు పల్లవికి నిద్ర పట్టకపోతే బయటకు వచ్చి, కాసేపు లాన్ లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంది. రాస్తున్న నోట్స్ పూర్తి కావడంతో శ్రీకాంత్ గదిలో లైట్ ఆఫ్ చేసేసరికి, బయట లాన్ లో లైట్ వెలుతురు లో పల్లవి కనిపించింది. చేతిలో విన్నీ ఫోటో పట్టుకుని ఏడుస్తూంది. శ్రీకాంత్ బయటకు వెళ్లి, పల్లవిని మందలించి, ఇంట్లోకి పంపి వచ్చాడు. ఎందుకో మెలుకువ వచ్చి, కిటికీ  లో నుంచి చూసిన రవళికి ఇంట్లోకి వెళ్తున్న పల్లవి, వెనుదిరిగి వస్తున్న శ్రీకాంత్ కనిపించారు. మనసుని సమాధాన పరచుకోలేకపోయింది రవళి. 

మరునాడు కాలేజీకి బయలుదేరిన  శ్రీకాంత్ పల్లవి లను జాగ్రత్తగా గమనించింది. పల్లవి రోజూ లానే, శ్రీకాంత్ పక్కన ముందు సీట్లో కూర్చుంది. ఇంట్లోకి వెళ్ళి, అద్దంలో చూసుకుంది. పల్లవి పక్కన తాను ఇంకా నల్లగా ఉన్నట్లు అనిపించింది. పైగా పల్లవి నాజూగ్గా ఉంది. ఉద్యోగం వలన వచ్చిన హుందాతనం. తాను... గృహిణిగా, ముగ్గురు పిల్లలను చూసుకునే ఆయాగా ఉంది. ఒంటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఏదో అనుమానం మనసులో తొలిచివేయసాగింది. 

ఒకప్పుడు శ్రీకాంత్ ను పల్లవి ప్రేమించింది. తాను అంగీకరించక పోతే శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు వారిద్దరికీ ఏకాంతంగా గడిపే అవకాశం తానే ఇచ్చినట్లుగా అయ్యింది. తన ఇంట్లో స్థానం కల్పించడం, భర్త పనిచేసే కాలేజీలో ఉద్యోగం ఇప్పించడం, ఆమె భర్తని వెతకడానికి వెళ్లడం... అర్ధరాత్రి ఓదార్పులు... ఛ.. ఛ.. తానేమిటి ఇలా ఆలోచిస్తోంది? అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పల్లవి అలాగే ఉంది, తాను ఇలాగే ఉంది. ఆనాడు పల్లవి శ్రీకాంత్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పినా, శ్రీకాంత్ ఒప్పుకోలేదు. నాలుగేళ్లు ఓపిక పడి, పెద్దలను ఒప్పించి మరీ తనను పెళ్లిచేసుకున్నాడు. తన స్నేహితురాలు కూడా, భర్త కనబడకపోతే మరణించడానికైనా సిద్ధ పడింది కానీ, తమకు ఈ విషయం చెప్పుకోలేదు...

ఇలా అటు ఇటు ఎడతెగని ఆలోచనలతో మానసిక సంఘర్షణ కు గురైంది రవళి.

ముప్పిరిగొన్న ఆలోచనలు మనసుని మెలి పెడుతూ ఉంటే తల విదిలించి లేచింది రవళి. కాస్త శ్రీకాంత్ తో ఏకాంతంగా గడిపే సమయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది. 

ఆరోజు సాయంత్రం శ్రీకాంత్, పల్లవి కాలేజి నుంచి ఆలస్యంగా వచ్చారు. వస్తూనే చెరో సోఫాలో వాలిపోయి, "రవళీ... కాఫీ" అన్నారు ఒక్కసారే... 

అడగగానే అందించడానికి నేనేమైనా పనిమనిషినా అనుకుని, విసుక్కుంటూనే ఇద్దరికి కాఫీ అందించింది. 

"ఇవాళ కాస్త ఆలస్యమైనట్లుంది" అంది రవళి.

"ఊఁ కాస్త పని ఎక్కువయ్యింది" అన్నాడు శ్రీకాంత్.

"రవళీ, ఈరోజు బాబుని నీ దగ్గరే ఉంచవా ప్లీజ్" అడిగింది పల్లవి.

అరికాలి మంట నెత్తికెక్కినట్లు అయ్యింది.
భోజనాలు అయ్యాక పల్లవి వెనకే శ్రీకాంత్ కూడా బయలుదేరాడు. ఇద్దరూ కాసేపు లాన్ లో నడుస్తూ మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో కళ్ళు ఒత్తుకుంటోంది పల్లవి. చూడకూడదు అనుకుంటూనే అటు చూస్తోంది రవళి. శ్రీకాంత్ తన జేబులో నుండి రుమాలు తీసి ఇచ్చాడు. రవళికి మనసు భగ్గున మండింది. మరి కాసేపు మాట్లాడాకా, వెనుదిరిగి వస్తూ, చేయి జాపింది పల్లవి. చేతిలో చేయి వేసి, పట్టుకుని నాలుగు అడుగులు నడిచాడు శ్రీకాంత్. ముఖద్వారం దగ్గర రవళిని చూసి, అప్రయత్నంగా చేతిని వెనక్కు తీసుకున్నాడు. పల్లవి తలవంచుకుని, గుడ్నైట్ చెప్పి గబగబా ఔట్ హౌస్ లోకి వెళ్ళిపోయింది.
శ్రీకాంత్ ఇంట్లోకి వచ్చాడు. రవళి మౌనంగా అనుసరించింది. రవళి ఏమి ప్రశ్నించలేదు, శ్రీకాంత్ ఏమి చెప్పలేదు.

మరో రెండు రోజుల పాటు శ్రీకాంత్, పల్లవి ఆలస్యంగానే ఇంటికి వచ్చారు. అడిగితే పని వత్తిడి అన్నారు. 

ఓరోజు మధ్యాహ్నం పల్లవి ఇంటికి వచ్చింది. "రవళీ! బాబుని సిద్ధం చెయ్యవా? ఊరికి వెళ్ళాలి" అని చెప్పి, తనవి, విహాస్ వి బట్టలు సర్దుకుని, బయలుదేరింది. బయలుదేరేముందు ఎక్కడికి అని అడగకూడదు కాబట్టి, పల్లవే చెప్తుందేమో అని చూసింది. పల్లవి  నిశ్శబ్దంగా విహాస్ ను ఎత్తుకుని, వెళ్ళొస్తానని చెప్పి, వచ్చిన ఆటో లోనే బయలుదేరింది.

సాయంత్రం యధావిధిగా ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్ ని పల్లవి ఊరికి వెళ్లిన విషయం అడిగింది రవళి. "రేపు వచ్చేస్తుందిలే..." అన్నాడు శ్రీకాంత్.

"మళ్ళీ యూత్ ఫెస్టివల్స్ అవుతున్నాయా?" అడిగింది రవళి.

"లేద"న్నాడు శ్రీకాంత్.
"మరి?"

"ప్రశ్నలు వేయకు రవళీ. కాస్త కాఫీ తీసుకురా" చిరాకు పడ్డాడు శ్రీకాంత్.

మౌనంగా కాఫీ తెచ్చి అందించింది.  కాఫీ తాగి, "మళ్ళీ వస్తాన"ని చెప్పి, బయటకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్. 

నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోయింది రవళి.
రాత్రి పది గంటలప్పుడు వచ్చాడు శ్రీకాంత్. మౌనంగా వడ్డించింది రవళి. భోజనం చేసి, మంచంపై నడుం వాల్చాడు శ్రీకాంత్. 

"నువ్వు తిన్నావా? తింటావా?" అని అడగలేదు. "పిల్లలు ఏరి? ఎలా ఉన్నారు?" పలకరించలేదు. భర్తలో వచ్చిన ఈ మార్పు తట్టుకోలేకపోతోంది రవళి.
ఇక్కడ ఉంటే భాగోతం నడవడం లేదని పల్లవిని బయట ఎక్కడైనా ఉంచాడేమో అని సందేహం కూడా వచ్చింది. 
****
ఎందుకో మనసంతా అలజడి గా ఉంది రవళికి. మధ్యాహ్నం పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్ళకి పాలు కలిపి ప్లాస్క్ లో పోసి, చిరుతిళ్ళు, టేబిల్ మీద అమర్చి, ఇంట్లో అత్తగారి చెప్పి, బయలుదేరింది రవళీ. ఫోన్ చేయకుండా సరాసరి భర్త పనిచేసే కాలేజీకి బయలుదేరింది. రిసెప్షన్ లో కూర్చుని, శ్రీకాంత్ కి ఫోన్ చేసి కాలేజీకి వచ్చినట్లు చెప్పింది. " ఆ సమయంలో క్లాస్ లో ఉన్నానని, ఒక్క అరగంటలో వస్తానని' చెప్పేడు శ్రీకాంత్. అటుగా వెళ్తూ, తొంగి చూసిన లేడీ స్టాఫ్ ఒకరు, పక్కన ఉన్న వారితో "అదిగో ఆమే శ్రీకాంత్ సర్ భార్య రవళి." అని చెప్పడం వినిపించింది రవళికి. చూపులు రిక్కించింది. 

"వారిది ప్రేమ వివాహం అనుకుంటా" రెండో గొంతు.
"ఇప్పుడు కొత్తగా చేరిన పల్లవి కూడా అప్పటి స్నేహితురాలేనట"
"అవునా అందుకేనా అనుక్షణం అంటిపెట్టుకునే ఉంటుంది..."
"ఈ మధ్య రెండు రోజులుగా రావడం లేదు ఎందుకో.."
అడుగుల చప్పుడు వినబడింది. మాటలు ఆగిపోయాయి. తల ఎత్తింది రవళి.  శ్రీకాంత్ వచ్చాడు. 
"ఎప్పుడూ ఇటు రాలేదు... " అడిగాడు శ్రీకాంత్.
"మనసేం బాగోలేదు శ్రీ... పిల్లలు నిద్రపోతున్నారు. ఏం తోచక, ఎటు వెళ్లాలో తెలీక ఇలా వచ్చాను." అంది రవళి. 
"సరే. మరొక్క క్లాస్ తీసుకుని, పర్మిషన్ పెట్టి వచ్చేస్తాను. ఈలోగా ఈ రెండు మేగజైన్లు చూస్తూ ఉండు." అని కాలేజి మేగజైన్లు రవళీ ముందు పెట్టాడు. అటెండర్ ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించాడు.

శ్రీకాంత్ వెళ్ళేక మళ్ళీ మాటలు వినిపిస్తాయేమో అని చూసింది రవళి. బహుశా క్లాస్ లకు వెళ్లిపోయారేమో, నిశ్శబ్దమే మిగిలింది.

కాసేపు మేగజైన్ తిరగేసింది. "నమస్తే మిసెస్ శ్రీకాంత్!" వినిపించి తలెత్తి చూసింది రవళీ. 

ఎదురుగా ఒక వ్యక్తి నమస్కరిస్తూ కనిపించాడు. 
"నమస్తే. మీరూ..." ఆగిపోయింది రవళి.

"నా పేరు మూర్తి. నేను వేరే బ్రాంచ్ లెండి. శ్రీకాంత్ గారి కొలీగ్ ని. మీరు కేరళ యూత్ ఫెస్టివల్ కు వచ్చారు కదా, అప్పుడు చూసాను మిమ్మల్ని. అందుకే గుర్తు పట్టాను" అన్నాడు మూర్తి.

"అలాగా" అన్నట్లు చూసి, నేను మిమ్మల్ని పోల్చలేకపోయాను. సారీ" అంది రవళి.

"మీరు శ్రీకాంత్ కోసం వచ్చారా? పల్లవి గారి కోసం వచ్చారా? పల్లవి గారు మీ స్నేహితురాలంట కదా... నాకెలా తెలుసు అనుకుంటున్నారా... శ్రీకాంత్ చెప్పేరు లెండి. భలే కలుపుగోలు మనిషి పల్లవి గారు" గలగలా మాట్లాడేస్తున్నాడు మూర్తి.

కాసేపు ఏవో కబుర్లు చెప్పేడు మూర్తి. అంతలో సడన్ గా గుర్తు వచ్చినట్లు, "ఎంతసేపూ నేనే మాట్లాడుతున్నాను, మీరేమి మాట్లాడటం లేదు" అన్నాడు. నవ్వేసి ఊరుకుంది రవళీ. 

"సరే, నేను వస్తానండి, క్లాస్ కి టైం అయ్యింది. మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియడం లేదు. మళ్ళీ కలుస్తా" చెప్పేసి వెళ్ళిపోయాడు మూర్తి.

మరి కాసేపటిలో శ్రీకాంత్ వచ్చాడు. ఇద్దరూ బయలుదేరి బయటకు వెళ్లారు. సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతం గా అనిపించింది రవళికి.
***
రెండు రోజుల తర్వాత వచ్చింది పల్లవి. మనిషి కాస్త వడలినట్లు అనిపించినా, మొహం లో వింత కాంతి కనిపిస్తోంది. ఆటో దిగుతూనే వచ్చి రవళి ని కౌగిలించుకుంది. బుగ్గన ముద్దు పెట్టి, హుషారుగా పిల్లలను పలకరించి, విహాస్ ను తీసుకుని ఔట్ హౌస్ వైపు వెళ్ళిపోయింది. 

పల్లవి ప్రవర్తన అర్ధం కాలేదు రవళికి. టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా పల్లవి, శ్రీకాంత్ ఏమి చెప్పలేదు. ఇద్దరూ మామూలుగానే కాలేజీకి వెళ్లిపోయారు. 

ఇంతలో రవళి ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్. "మేడమ్ నమస్తే. నేను మూర్తిని." కాసేపు ఆలోచించాక గుర్తుపట్టింది.
 
"నమస్తే అండీ."

"పల్లవి ఊరెళ్లి తిరిగి వచ్చేసినట్లుంది?"

"ఈయన కెందుకో అంత క్యూరియాసిటీ" మనసులో అనుకుంటూ, "అవును" అంది పొడిపొడిగా.

"కాలేజీకి వెళ్ళారా?"

"వెళ్లారు"

"మీరు చాలా అమాయకులండీ. తెల్లని వన్నీ పాలు, నల్లని వన్నీ నీళ్లు అనుకుంటున్నారు" అన్నాడు మూర్తి.

"ఏమైంది?"

"ఏమి లేదు లెండి...  మీరేమి అనుకోనంటే ఒక చిన్న విన్నపం. నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. మీరు కాస్త సహకరిస్తే, మీ మనసులో బాధ కూడా తీరుతుంది. కొంచెం ఆలోచించండి." అన్నాడు మూర్తి.

నిశ్చేష్టితురాలయ్యింది రవళి. పల్లవికి ఇంతకు ముందే పెళ్లి అయిన విషయం చెప్పాలనుకుంది. అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు మూర్తి.

శ్రీకాంత్ కి ఫోన్ చేసింది. శ్రీకాంత్ ఫోన్ కాలేజీలో వదిలి పెట్టాడని, పల్లవితో కలిసి బయటకు వెళ్లాడని, అటెండర్ చెప్పాడు. రవళికి మనసు రగిలిపోయింది. శ్రీకాంత్ వస్తే తనకు ఫోన్ చేయమని చెప్పి, పెట్టేసింది.
బాగా ఆలోచించింది రవళి. శ్రీకాంత్  ఫోన్ చేస్తే, పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పింది. "ఇప్పుడా?" అన్నాడు ఆశ్చర్యంగా శ్రీకాంత్.

"అవును శ్రీకాంత్. నాలుగు రోజులుండి వస్తాను. నీకు ఇక్కడ ఏమి ఇబ్బంది రాదులే. పల్లవి ఉందిగా." అని చెప్పేసి, ఫోన్ పెట్టేసింది. 

తల్లిదండ్రులకు ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పింది. అత్తమామలకు చెప్పి, పిల్లల్ని తీసుకుని బయలుదేరింది రవళి.

ఏమి మాట్లాడకుండా కూర్చున్న కూతుర్ని చూసేసరికి వెంకటరావు,  సత్యవతి దంపతులు ఏదో జరిగిందని గ్రహించారు. 

తరచి తరచి ప్రశ్నిస్తే కానీ రవళి నోరు విప్పలేదు. గడచిన నాలుగు నెలలుగా జరిగిన విషయాలు, ఇప్పుడు రెండు నెలలుగా జరుగుతున్న విషయాలు చెప్పి, వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకాంత్ స్వభావం తెలిసిన వెంకటరావు గారు శ్రీకాంత్ ని తప్పు పట్టలేక, కూతురి బాధను చూడలేక, వెళ్లి శ్రీకాంత్ తో మాట్లాడి వస్తానన్నారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ఏ విషయం చెప్పనందుకు సత్యవతి బాధపడింది. కూతుర్ని ముఖం కడుక్కుని రమ్మని పంపి, పిల్లలకు ఆటవస్తువులు ఇచ్చి కూర్చోపెట్టింది.

"ఏమిటండి ఇది... ఇలా జరుగుతోంది. అసలు ఆ పల్లవిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి? దీని కాపురం ఇలా అవడమేమిటి? నాకేం అర్ధం కావడం లేదు" అంది సత్యవతి ఆందోళనగా... 

"నువ్వు గాభరా పడకు, నేను వెళ్లి కనుక్కుంటాను. నువ్వు అమ్మాయిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో" అన్నాడు.

మొదట ఏమి చెయ్యాలో కాసేపు ఆలోచించుకున్నాడు. ఊరికే కాలేజీకి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం మంచిది కాదు. అల్లుడి పరువు పోతుంది. అలాగని కూతురు మాటల్ని కొట్టి పారేయలేడు. డ్రైవర్ ని విచారిద్దామంటే, శ్రీకాంత్ డ్రైవర్ ని పెట్టుకోలేదు. సరే ఏదో ఒక పక్క నుంచి నరుక్కుని రావాలి కాబట్టి, ఇంటి నుంచి బయలుదేరాడు వెంకటరావు.  ఇంటి నుండి బయలుదేరే ముందే రవళిని అడిగి మూర్తి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మొదటగా మూర్తికి ఫోన్ చేసాడు. రవళి తండ్రిని అని చెప్పగానే శ్రీకాంత్ పల్లవిల గురించి కాసేపు చెప్పేడు. కాలేజి వదిలిన తర్వాత ఇద్దరూ ఎక్కడికో వెళతారని చెప్పేడు. మూర్తి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు వెంకటరావు.

శ్రీకాంత్ కి ఫోన్ చేసాడు. శ్రీకాంత్ వెంటనే తాను, పల్లవి కలిసి వస్తామని, బయట  లంచ్ చేస్తూ మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడు కూడా పల్లవితో కలిసి వస్తాననేసరికి రవళి, మూర్తి చెప్పినవి నిజమేమో అనిపించింది వెంకటరావు తండ్రి మనసుకి.
చెప్పిన టైం కి, చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ శ్రీకాంత్, పల్లవి వచ్చి ఉన్నారు. అప్పటివరకు పల్లవిని చూడలేదు వెంకటరావు గారు. కాలేజి రోజుల్లో కూడా ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు రవళి. పల్లవి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేసి, శ్రీకాంత్ వైపు ప్రశ్నర్థకంగా చూసారు వెంకటరావు గారు.

"కూర్చోండి మామయ్యా. రవళి పుట్టింటికి వెళతాను అనగానే మీరు ఫోన్ చేస్తారని ఊహించాను" అని మొదలుపెట్టాడు. ఈలోగా భోజనాలకు ఆర్డర్ ఇచ్చి, తింటూ ఉండగా జరిగినదంతా చెప్పాడు. 
"అదీ మామయ్యా జరిగిన సంగతి. రవళి అపార్ధం చేసుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. తనలో తాను ఇంతగా కుమిలిపోతుందని కూడా తెలియదు. ఈ కష్ట కాలంలో పల్లవికి తోడు నిలవమని రవళియే చెప్పింది. తనకి ఓ దారి చూపించే ప్రయత్నమే ఇదంతా." అన్నాడు శ్రీకాంత్.

"నీ విషయం నాకు తెలుసయ్యా... కానీ తండ్రిగా కూతురి ఆవేదన చూడలేకపోయాను. నీతో ఒకమాట చెప్పి పోదామని వచ్చాను. కానీ ఇప్పుడు నా కూతురికే నచ్చ చెప్పుకుంటాను." అని, పల్లవి వైపు చూసి, "మా శ్రీకాంత్ తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదమ్మాయ్. నీ కష్టాలు తీరిపోయినట్లే." అన్నాడు.

"అవును బాబాయ్ గారు, తెగిన గాలిపటంలా ఉన్న నా జీవితాన్ని ఓ దరికి చేర్చారు. రవళికి ఏం ఇచ్చినా ఋణం తీరదు. ఇంకొద్ది రోజుల్లో అన్ని చక్కబడతాయి. ఆ ధైర్యం నాకుంది." అని చెప్పింది పల్లవి. 

ఇద్దరికి చెప్పి, తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు వెంకటరావు. రవళి, శ్రీకాంత్, పల్లవి జీవితాలలో విధి చేసిన ఛాలెంజ్ లో అందరూ నెగ్గాలని కోరుకుంటూ, ఇల్లు చేరుకున్నాడు.
***
"ఏం జరిగిందండీ?" ఆత్రం గా గుమ్మంలోనే ఎదురై అడిగింది సత్యవతి.

లోపలకు వచ్చి కూర్చున్నాడు వెంకటరావు. మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది రవళి. పక్కనే కూర్చున్నారు సత్యవతి, రవళి. 

"అమ్మాయి రవళీ, నువ్వు శ్రీకాంత్ ని, పల్లవి ని అనుమానించడంలో తప్పులేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నీ అనుమానానికి ఆ మూర్తి చెప్పిన మాటలు కూడా బలం చేకూర్చాయి. ఇప్పుడు నీకు ఏం చెప్పినా నువ్వు సమాధానపడలేవు. రెండు రోజులు ఓపిక పట్టు. అన్ని విషయాలు తేల్చేస్తాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. ఒకసారి ఆనందాలు, ఒకసారి ఆందోళనలు తప్పవు. విధి చేసే ఈ ఛాలెంజ్ లను ఎదుర్కోవడమే మనిషి విధి." అని చెప్పి, లోపలికి వెళ్ళిపోయాడు.
***
"సత్యవతీ, రవళీ రేపు మనం ప్రశాంతత చేకూర్చే ఓ ప్రదేశానికి వెళ్తున్నాము. అమ్మాయ్ నీకు అక్కడ నిజంగా ప్రశాంతత దొరికింది అనుకుంటే అక్కడ నుంచి మీ ఇంటికి వెళ్లిపోవచ్చు." అన్నాడు వెంకటరావు.

"నా జీవితానికి ప్రశాంతత?" మనసులో అనుకుంది రవళి. "సరే నాన్నగారు" అంది.

పిల్లలను ఇంట్లో వారికి అప్పగించి, రవళి తో సహా బయలుదేరారు వెంకటరావు దంపతులు. దారిలో పూలు, పళ్ళు తీసుకున్నారు. ఏదైనా ఆశ్రమానికి వెళ్తున్నాము అనుకుంది రవళి. 

బంతిపూల తోరణాలు కట్టి, ముగ్గులు వేసి అలంకరించబడిన ఒక ఇంటి దగ్గర  కారు ఆపాడు వెంకటరావు. కారు దిగి చుట్టూ చూసింది రవళి. ప్రశాంతమైన వాతావరణం. పూల మొక్కల మధ్య చిన్న ఇల్లు. ప్రహారీ లేదు కానీ చుట్టూ వెదురు తడకల ఫెన్సింగ్ ఉంది. చిన్న గేటు. 

"ఇది ఎవరి ఇల్లండీ? ఏదైనా స్వామీజీ ఆశ్రమమా?" కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించింది సత్యవతి. 

వాచీ చూసుకుంటూ, "ఐదు నిమిషాలు ఓపిక పట్టు" అంటూ ఉండగానే మరో కారు వచ్చి ఆగింది. శ్రీకాంత్ కారుగా గుర్తించారు. కారు లో నుంచి శ్రీకాంత్ దిగి, వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. ఎర్రగా ఉన్న ఒక విదేశీయుడు కారులో నుంచి దిగాడు. అటువైపు నుంచి విహాస్ ను ఎత్తుకుని పల్లవి దిగింది. ఇంతలో ఇంకో కారులో రాజారావు దంపతులు వచ్చారు. రవళి అంతా ఆశ్చర్యంగా చూస్తోంది.

అందరూ లోపలికి నడిచారు. పల్లవి, ఆ విదేశీయుడు మొదటగా గుమ్మానికి నమస్కరించి, లోపలికి అడుగుపెట్టారు. ఒకరొకరుగా మిగతా అందరూ లోపలికి వచ్చారు. అందరికి కుర్చీలు వేయబడి ఉన్నాయి. అందరూ కూర్చోగానే పల్లవి లేచి నిలబడింది. 

"అందరికి నమస్కారం. ఈయన మావారు విన్నీ" అని పరిచయం చేసింది. విన్నీ లేచి అందరికి నమస్కారం చేసాడు. రవళి విస్తుపోయి చూస్తోంది.

"నేను రవళి, శ్రీకాంత్ ల ఇంటికి చేరుకున్నంత వరకు జరిగిన సంగతులు అందరికి తెలుసనుకుంటాను. శ్రీకాంత్ చలువ, రవళి ఆదరణ వలన నేను ఈరోజు విన్నీ ని చేరుకోగలిగాను" అంది పల్లవి.

"నేను చెప్తాను" అని లేచాడు శ్రీకాంత్.
"నన్ను మన్నించు రవళి. నీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచాను. ఎందుకో చివరిలో నీకు తెలుస్తుంది.విన్నీ ని వెతికే క్రమంలో, నేను పోలీసుల మీద ఆధారపడకుండా, నా విచారణ మొదలుపెట్టాను. పల్లవి ఇంటి నుంచి తెచ్చిన విన్నీ ఫోటోలు కాపీలు తీయించి, విన్నీ పనిచేసిన ప్రదేశం నుంచి, వీసా ఆఫీస్ వరకు అక్కడక్కడ అంటించాను. మరికొన్ని ప్రదేశాలలో కూడా అతికించాను. కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చి, విన్నీ ని ఎవరైనా, ఎప్పుడైనా చూసి ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయమని రాసాను. 

నిజానికి ఆరోజు విన్నీ బయలుదేరి వీసా ఆఫీస్ కు వస్తుండగా ఆక్సిడెంట్ జరిగింది. విన్నీ అచేతనంగా పడిపోయాడు. కానీ ఎక్కడా గాయాలు తగలలేదు. రక్తం రాలేదు. చుట్టుపక్కల వారు వచ్చి, నీళ్లు జల్లి ఉపచారాలు చేసేసరికి మెలకువ వచ్చింది. వీసా వీసా అంటూ లేచి,  పక్కనే పడి ఉన్న బేగ్ ఎవరో అందిస్తే తీసుకుని మెల్లగా నడిచి వెళ్ళిపోయాడు. అంతే... ఆ తర్వాత విన్నీ వీసా ఆఫీస్ కి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 

ప్రతి చోట ఎంక్వయిరీ చేసాను. చివరకు "సబ్ వే దగ్గర ఎవరో పిచ్చాడు వీసా వీసా అంటూ ఉంటాడని, తరచు తన బేగ్ లో కాగితాలు చూసుకుంటాడని, మీరు అతికించిన ఫొటోలో వ్యక్తి పోలికలున్నాయని" ఎవరో ఫోన్ చేశారు. నేను, పల్లవి వెళ్లి చూసాం. అతను విన్నీ యే. ఎవరిని గుర్తు పట్టలేదు. ఇంటికి తీసుకు వెళదాం అన్నాను. ఇప్పటికే నీకు శ్రమ ఇచ్చినందున, మళ్ళీ విన్నీ విషయంలో కూడా రవళిని ఇబ్బంది పెట్టవద్దంది పల్లవి. 

విన్నీని మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చాము. ఆక్సిడెంట్ లో తలకి తగిలిన గాయం వలన తాత్కాలిక మరుపు వచ్చిందని, జ్ఞాపకం చేసే అంశాలు ఎదురైతే త్వరగానే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పేరు. అక్కడ మంచి మందులు, ఆహారం ఇచ్చారు. రోజూ సాయంత్రం విన్నీ దగ్గర కూర్చొని, మాటలాడి వచ్చేవాళ్ళం. ఒకేసారి నిన్ను ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాం. పల్లవి విహాస్ ని చూపిస్తే, తనతో రెండు రోజులుంటే విన్నీ ఇంకా త్వరగా కోలుకుంటాడేమో అంది. అందుకే రెండు రోజులు విహాస్ తో కలిసి బయట ఉన్నది. ఆ రెండు రోజుల్లో విహాస్ మాటలకు విన్నీ చాలా త్వరగా రికవరీ అయ్యాడు. మరొక్క మూడు రోజుల్లో కోర్సు పూర్తి అయిపోతుంది, ఇంటికి వెళ్లిపోవచ్చు అన్నారు డాక్టర్లు. ఈలోగానే నువ్వు పుట్టింటికి వెళ్లావు. మీ నాన్నగారికి విషయమంతా చెప్పి, విన్నీని చూపించాను. అదీ జరిగింది." అని ఆపాడు శ్రీకాంత్.

"నిన్ను శారీరకంగా కష్టపెట్టడం ఇష్టం లేక మేము విన్ని విషయం చెప్పలేదు. నువ్వు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తానంటావు. అందరి మధ్య ఉంటే త్వరగా కోలుకుంటారంటావు. నీకు అదనపు శ్రమ అని నేను వద్దన్నాను. కానీ నీకు మానసిక శ్రమ కలిగించామని అర్ధమయ్యింది. మన్నించు రవళి. మీ దంపతుల కారణంగా నాకు చక్కని బహమానం లభించింది" అని చెప్పి, రవళీ, శ్రీకాంత్ లకు నమస్కరించింది పల్లవి. 

అందరూ ఆనందించారు. ఇంటికి ఫోన్ చేసి, రవళి పిల్లల్ని కూడా తీసుకురమ్మన్నారు వెంకటరావు గారు. అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. భోజనాలు చేశారు. 

ఈ ఇంట్లో పల్లవి, విన్నీలు విహాస్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. విహాస్ కు కూడా తమ కాలేజీలోనే ఉద్యోగం చూస్తానన్నాడు శ్రీకాంత్. 

విన్నీ ఒక్కసారిగా "వీసా" అన్నాడు.. అందరూ తుళ్ళిపడ్డారు. విన్నీ సర్దుకుని, "ఐ మీన్, వీసా వస్తే, నేను పల్లవితో కలిసి మా దేశం వెళ్తాను. ఈలోగా నేను వీసా పర్మిట్ ముగిసినా ఇక్కడే ఉన్నందుకు గల పరిస్థితులు వివరిస్తూ, మీ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఆ సమస్యలన్నీ సర్దుబాటు అయ్యాక మేము వెళ్లిపోతాం" అన్నాడు. 

విన్నీ మాటలకు అందరూ ఆనందించారు. "నీకు నీ బహుమతి దక్కింది, నాకు నా బహుమతి దక్కింది" అంటూ శ్రీకాంత్ చేయి పట్టుకుంది రవళి. "కాదు నీవే నాకు బహుమతి" అన్నాడు శ్రీకాంత్. నవ్వులు విరిసాయి.

సర్వే జనా సుఖినో భవంతు

***
 

No comments:

Post a Comment

Pages