"బంగారు" ద్వీపం (అనువాద నవల) -22 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -22

Share This

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -22

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton


@@@@@@@@
(కిర్రిన్ ద్వీపాన్ని అమ్ముతున్నందుకు జార్జి తల్లితో దెబ్బలాడుతుంది. జూలియన్ బాబయ్య పక్కన చేరి వారం రోజుల్లో ద్వీపాన్ని అమ్మబోతున్నట్లు, వారి దగ్గర పెట్టె కొన్న వ్యక్తే ఆ ద్వీపాన్ని కొనబోతున్నట్లు తెలుసుకుంటాడు. అతను జార్జిని ఓదారుస్తూ, తాము రెండు రోజులు ద్వీపంలో గడుపుతామని యింట్లో చెప్పి, దాన్ని అమ్మేలోపుగా తమ దగ్గర ఉన్న పటం సాయంతో ద్వీపాన్ని గాలించి బంగారు కడ్డీలను తెచ్చుకుందామని సలహా యిస్తాడు. అనుకున్నట్లుగానే వారు ద్వీపానికి వెళ్ళటానికి ఏర్పాటులు చేసుకుంటారు. తరువాత. . .)
@@@@@@@@@@@

అతని పొగడ్తకు జార్జి మురిసిపోయింది. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. "తిమోతి ని అలా తిప్పడానికి వెడదాం" అందామె. "ఈరోజు మనకి ఏమైందో నని ఆలోచిస్తూ ఉంటాడు."

వాళ్ళంతా కలిసి బయటకు వెళ్ళారు. వాళ్ళను చూసి కుక్క ఆనందంతో మోరసాచి అరిచింది. మరునాడు తాము చేయబోయే దేమిటో మొత్తం అతనికి చెప్పగానే, తన సున్నితమైన బూడిద రంగు కళ్ళతో వాళ్ళను చూస్తూ,‌ వాళ్ళు చెప్పే ప్రతి అంశం అర్థమైనట్లు కుక్క హుషారుగా తోక ఊపింది.

"రెండు, మూడు రోజులు మనతో గడపబోతున్న ఆలోచనతో అది ఆనందిస్తోంది" అంది అన్నె.

మరునాటి ఉదయం ఆహ్లాదకరంగా ఉంది. తమ సామానంతా మోసుకెళ్ళి పడవలో ఒక మూల సర్దారు. జూలియన్ జాబితాలో వివరాలను గట్టిగా చదువుతూ వస్తువులను సరిపోల్చాడు. తామేమీ మరచిపోయినట్లుగా వారికి అనిపించలేదు.‌‌

"పటాన్ని పట్టుకొన్నావా?" అకస్మాత్తుగా డిక్ అడిగాడు. ‌

జూలియన్ తలూపాడు.

"ఈ ఉదయం నేను కొత్త జీన్సే‌ వేసుకొన్నాను" చెప్పాడతను. ‌"కానీ పటాన్ని నా జేబులో పెట్టుకోవటం గుర్తుంచుకొన్నానని నువ్వు భావించాలి. ‌ఇదిగో అది!"

అతను దానిని జేబులో నుంచి తీసి చూపించాడు. ‌ అదే ‌సమయంలో విసురుగా వీచిన గాలి దాన్ని అతని చేతి నుంచి ఎగరగొట్టేసింది. అది సముద్రంలో పడి ‌గాలికి నీటిలో ఊగసాగింది. నలుగురు పిల్లలు నిరాశతో అరిచారు. వారి విలువైన పటం!

"త్వరగా! పడవని అటు పోనియ్యాలి" జార్జి అరుస్తూ పడవను అటు తిప్పింది. కానీ తిమొతి ఆమె కన్నా వేగంగా ఉంది. జూలియన్ చేతిలోని కాగితం ఎగిరిపోవటం, పిల్లలు నిరాశతో అరవడం విని అర్థం చేసుకుని, నీరు బ్రహ్మాండంగా చిందేలా సముద్రంలోకి‌ దూకి ధైర్యంగా పటం వైపు ఈదింది.

బలంగా,‌ శక్తివంతంగా ఉన్న కుక్క కనుక బాగా ఈదగలదు. త్వరగానే పటాన్ని ‌నోటితో పట్టుకొని వెనక్కి పడవ దగ్గరకు ‌‌ఈదుకొచ్చింది. దాని పని అద్భుతంగా ఉందని పిల్లలు భావించారు!

జార్జి కుక్కని పడవలోకి గుంజి, తన నోటిలోని పటాన్ని తీసుకుంది. దాని మీద ఒక్క పంటి గాటు కూడా పడలేదు. దానిని తిమొతి చాలా జాగ్రత్తగా మోసుకొచ్చింది. నీటిలో తడవటం వల్ల పటం నకలు పాడైందేమోన‌ని పిల్లలు ఆత్రంగా చూసారు. కానీ జూలియన్ దానిని బాగా నొక్కి పెట్టి గీయడం వల్ల ఏమాత్రం పాడవలేదు. అతను దానిని ఒక సీటు మీద ఉంచి, అది ఎండటానికి సూర్యకాంతి ఉన్న చోట దానిని పట్టుకోమని డిక్ తో చెప్పాడు.

"అదొక‌ చిన్న గండం!" అతని మాటలను మిగిలిన వారు సమ్మతించారు.

జార్జి తెడ్డుల‌ను చేతిలోకి తీసుకోవడంతో దీవికి మరొకసారి వారి ప్రయాణం మొదలైంది. తిమోతి తడిసిన తన ఒంటిని విదిలించటంతో అందరూ షవర్‌బాత్‌ చేసిన అనుభూతిని పొందారు. దానికి బహుమతిగా పెద్ద బిస్కట్ యివ్వడంతో, దానిని అది సంతోషంగా కరకరమని నమలసాగింది .

జార్జి రాతి బండల మధ్య నుంచి భద్రంగా సాగిపోతోంది. ప్రమాదకరమైన బండరాళ్ళ మధ్య నుంచి చిన్న గీత అయినా పడకుండా ఆమె పడవను ఎలా నడపగలుగుతోందోనని మిగిలిన వారు ఆశ్చర్య పోతున్నారు. ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి అని వాళ్ళు భావించారు. ఆమె సురక్షితంగా సన్నని సముద్ర మార్గంలోకి పడవను చేర్చింది. వాళ్ళంతా గట్టుకి దూకారు. ఆ సన్నటి గొందిలోకి సముద్రపు నీరు వస్తే కొట్టుకుపోకుండా,‌ పడవను గట్టుపై చాలా దూరం లాగారు. తరువాత పడవలో వస్తువులను ఖాళీ చేసారు.

"ఈ వస్తువులన్నీ మనం ఆ రాతి గదిలోకి మోసుకుపోదాం" చెప్పాడు జూలియన్. "అవి అక్కడే భద్రంగా ఉంటాయి. వాన పడినా తడిసిపోవు. మనం ఇక్కడ ఉండగా ఎవరూ ఈ ద్వీపానికి రారనే అనుకొంటున్నా జార్జి!"

"వస్తారని నేనూ అనుకోవటం లేదు" అంది జార్జి. "పత్రాలపై సంతకాలు పూర్తవడానికి, దీవిని అతనికి అప్పచెప్పటానికి సుమారుగా వారం పడుతుందని నాన్న అన్నాడు. అప్పటి వరకు ఇది అతనిది కాదు. ఏమైనప్పటికీ మనకు వారం సమయం ఉంది."

"సరె! ఎవరైనా అప్పుడు వచ్చినట్లు అయితే, మనం ఇక్కడ కాపలా ఉండనవసరం లేదు" చెప్పాడు జూలియన్. కానీ ఎవరో ఒకరిని ఈ గొంది దగ్గర కాపలా ఉంచడం మంచిదని,‌ ఎవరైనా వస్తే ఆ‌ వ్యక్తి తమను హెచ్చరిస్తాడని అతనికి అనిపించింది. "పదండి! డిక్! నువ్వు పారలు తీసుకో. నేను, జార్జి ఆహారం, నీరు పట్టుకొస్తాం. చిన్న వస్తువులను అన్నె తెస్తుంది."

తాము దీవిలో ఉండగా ఆకలితో మాడకూడదని పిల్లలు ఆహారం, ద్రవ పదార్థాలను ఒక పెద్ద‌ పెట్టెలో నింపుకొచ్చారు. వారు రొట్టె ముక్కలు, వెన్న, బిస్కట్లు, జామ్, పళ్ళ డబ్బాలు, రేగు పండ్లు, జింజిర్ బీరు సీసాలు, టీ తయారు చేసే గిన్నె, ఇంకా వాళ్ళకు అవసరం అనుకొన్నవి పట్టుకొచ్చారు. జార్జి, జూలియన్ ఆ‌ బరువైన పెట్టెను అతి కష్టంపై కొండ శిఖరానికి చేర్చారు. దారిలో విశ్రాంతి కోసం ఆ పెట్టెను ఒకటి, రెండు చోట్ల నేలపై దించాల్సి వచ్చింది.

అన్ని వస్తువులను వారు ఆ చిన్న గదిలో ఉంచారు. తరువాత వాళ్ళు రగ్గులు, దుప్పట్లను తీసుకెళ్ళటానికి పడవ దగ్గరకు తిరిగి వచ్చారు. వారు వాటిని చిన్న గది మూలల్లో సర్దారు. అక్కడ రాత్రి గడపటం అద్భుతమైన అనుభూతిగా వారు భావించారు.

"మీ యిద్దరు అమ్మాయిలు కలిసి ఆ రగ్గుల దొంతరపై పడుకోండి" చెప్పాడు జూలియన్, "మేమిద్దరు అబ్బాయిలం ఈ దొంతుపై పడుకొంటాం."

అన్నెతో జత చేసి తనను అమ్మాయిగా లెక్కించడం జార్జికి యిష్టం లేనట్లు చూసింది. కానీ అన్నె ఆ మూల ఒంటరిగా పడుకోవటానికి యిష్టపడటం లేదు. ఆమె వేడుకొంటున్నట్లు తన వైపు చూడటంతో, వయసులో పెద్దదైన జార్జి చిరునవ్వు నవ్వి, అభ్యంతరం చెప్పలేదు. జార్జి మంచిదానిగా మారుతున్నట్లు అన్నె భావించింది.

"సరె! మనమిప్పుడు పని గురించి చూద్దాం" అంటూ జూలియన్ పటాన్ని బయటకు లాగాడు. "మనం దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి, నేలమాళిగల్లోకి సరిగా ఎక్కడనుంచి ప్రవేశించగలమో చూద్దాం. ఇప్పుడు - అందరూ వచ్చి చూడండి. మంచి మార్గమేదో కనుగొందాం. శాయశక్తులా మన మేధస్సును ఉపయోగించి, ఈ దీవిని కొన్న వాణ్ణి దెబ్బ కొట్టటం అంతా మనలోనే ఉంది."

అందరూ పటం చుట్టూ చేరి వంగి చూస్తున్నారు. అది బాగా ఎండిపోవడం వల్ల స్పష్టంగా కనిపించే పటాన్ని, శ్రద్ధగా చూస్తున్నారు. గతంలో ఈ కోట ఒక చక్కని ప్రదేశమని స్పష్టంగా కనిపిస్తోంది.

"చూడండి" జూలియన్ పటంలో నేలమాళిగల ప్రాంతంపై వేలిని ఉంచి చెప్పాడు. "ఇవి కోట అడుగున చుట్టూ విస్తరించినట్లు అనిపిస్తోంది.....ఇక్కడ.... ఇక్కడ.... ఈ గుర్తులు మెట్లను గాని, మెట్ల మార్గాన్ని గాని సూచిస్తున్నాయి."

"అవును" అంది జార్జి. "నేనూ అదే అనుకొంటున్నాను. అయితే, నేల మాళిగల్లోకి దిగటానికి రెండు మార్గాలు ఉన్నట్లు అనిపిస్తోంది. చాలా మెట్లు ఉన్న మార్గమొకటి ఎక్కడో ఈ చిన్న గదినుంచే ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. మరొకటి కోట బురుజు క్రింద ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుర్తుని ఏమనుకొంటున్నావు జూలియన్?" ఆమె పటంలో గుండ్రని రంధ్రంలా కనిపించిన చోట వేలుని ఉంచి అడిగింది. ఆ గుర్తు నేలమాళిగలు ఉన్నచోటే కాకుండా, కోట యొక్క భూతలం పైన కూడా కనిపించింది.

"అదేమిటో నేను ఊహించగలను" అంటూ ఆలోచించాడు జూలియన్. "ఓ! అదేమిటో నాకు అర్ధమైంది. ఎక్కడో పాత బావి ఉందని నువ్వు చెప్పావు, గుర్తుందా? అదే కావచ్చు. మంచి నీళ్ళు పొందటానికి ఈ బావిని సముద్రం అడుగున బాగా లోతుకి తవ్వి ఉండాలి. అందువల్ల బహుశా యిది నేలమాళిగల గుండా పోయి ఉండొచ్చు. రోమాంచకంగా లేదూ?"

అందరూ అదే అనుకొన్నారు. వారందరికీ సంతోషంగానూ, ఉత్సాహంగాను అనిపించింది. వాళ్ళు కనిపెట్టవలసినది ఏదో ఉంది. ఆ కనిపెట్టేది, చేసేది రాబోయే రెండు రోజుల్లోనే పూర్తిచేయాలి.

వారు ఒకరినొకరు చూసుకున్నారు. "సరె!" అన్నాడు డిక్. "మనం యిప్పుడూ ఏమి ప్రారంభించబోతున్నాం? ఈ చిన్నగది చుట్టూ నేలమాళిగల్లోకి ఉన్న ప్రవేశద్వారాన్ని కనుగొనటానికి ప్రయత్నిద్దామా? మనకు తెలిసిందల్లా నేలమాళిగల్లోకి దిగే మెట్ల పైన పెద్ద బండరాయి కప్పి ఉండవచ్చునని; దాన్ని మనం పైకెత్తవలసి రావచ్చు."

ఇది ఉత్కంఠభరితమైన ఆలోచన. తక్షణమే పిల్లలు కార్యరంగంలోకి దిగారు. జూలియన్ విలువైన ఆ పటాన్ని మడతపెట్టి తన జేబులో పెట్టుకొన్నాడు. తరువాత అతను చుట్టూ చూసాడు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages