కార్తవీర్యార్జునుడు - అచ్చంగా తెలుగు

కార్తవీర్యార్జునుడు

Share This

కార్తవీర్యార్జునుడు

(పురాణగాథ )

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.



పూర్వం హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతనికి  విష్ణుమూర్తి చేతిలోని సుదర్శనచక్రం యొక్క తేజస్సుతో అర్జునుడు 'అనే మహాబలవంతుడైన కుమారుడు పుట్టాడు . కృతవీర్యుని కుమారుడు కాబట్టి అతను 'కార్తవీర్యార్జునుడు 'అని ప్రసిద్ధి చెందాడు. కార్తవీర్యుడు అత్రి మహాముని కుమారుడగు దత్తాత్రేయుడిని ఆరాధించి పదివేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశాడు. దత్తాత్రేయుడు సంతోషించి అతడిని వరాలు కోరుకొమ్మన్నాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు నాలుగు వరాలు కోరుకొన్నాడు. అవి తనకు సహస్ర బాహువులను, తాను అధర్మము ఆచరిస్తుంటే సత్పురుషులు దానినుండి నివారించటం, యుద్ధములో భూమిని జయించి ధర్మబద్ధంగా దానిని పరిపాలించటం, సంగ్రామంలో తనకంటే అధికుని చేతిలో మరణము అనేవి. దత్తాత్రేయుడు అతడు కోరుకొన్న వరాలు ఇచ్చి బ్రాహ్మణుల విషయంలో ఎటువంటి పొరబాట్లు చెయ్యరాదని, జాగురూకతతో వ్యవహరించమని హెచ్చరిస్తాడు.

ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు తన బాహుబలంతో మొత్తం భూమండలాన్ని జయించాడు. అతని రాజధాని మాహిష్మతీ నగరం. అతడు తన నోటితోనే సముద్రపు పోటులను వెనక్కు నెట్టి వర్షాకాలంలో సముద్రపు వేగం తగ్గించేవాడు. అతడు తన బాహువులతో నర్మదానదికి అడ్డుకట్ట కట్టి తన భార్యలతో ఆ నదిలో క్రీడించేవాడు.బలశాలి యగు అతడు ఒకసారి లంకకు పోయి కేవలం  ఐదు బాణాలతో రావణాసురుడిని గెల్చి  తీసికొచ్చి మాహిష్మతీ నగరంలో బందీగా పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రావణుడి తండ్రి పులస్త్యుడు వచ్చి కొడుకును వదిలిపెట్టమని బ్రతిమిలాడి చెరనుండి విడిపించుకొని లంకకు తీసికొని పోయాడు.అంత బలశాలి కార్తవీర్యార్జునుడు.

ఒకసారి సూర్యుడు బ్రాహ్మణరూపంతో కార్తవీర్యార్జుని దగ్గరికి వచ్చి"ఓ రాజా!నాకు చాలా ఆకలిగా ఉంది.  నేను నీరసంతో ఉన్నాను.నా ఆకలి తీర్చగలవా? "అని అడిగాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు "మహానుభావా!మీకు ఎటువంటి ఆహారం కావాలో తెలియచేయండి!నేను తెప్పించి, మీ ఆకలి తీరుస్తాను."అని వినయంగా అడిగాడు."నా ఆకలికి ఓషధులతో కూడిన వనములను ఆహారం ఇస్తే సరిపోతుంది."అని బదులిచ్చాడు. వచ్చిన వాడు సామాన్యుడు కాడని రాజుకు అర్థం అయ్యింది. వెంటనే అయన పాదాలకు నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి "నాయనా!నేను ఆదిత్యుడను.నా కిరణాలలో ఉండే వేడితో నేను వృక్షాలను కాల్చలేను. నాకు వృక్షాలతో, ఓషధులతో నిండిన ఆహారం కావాలి.అప్పుడు మాత్రమే నాకు వచ్చిన నీరసం తగ్గి, బలంతో నా పూర్వ తేజస్సుతో సంచరిస్తాను. నీకు నేను అక్షయమైన,సర్వతోముఖమైన దివ్య బాణాలను ఇస్తాను. వాటి ములుకుల్లో నా తేజస్సును నింపి పెడతాను. నీవు కొన్ని వనములను తగలబెట్టి, వాటి స్థానంలో క్రొత్త నగరాలు నిర్మించు!"అని రాజుకు దివ్వ్యాస్త్రాలను ఇచ్చాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ దివ్వ్యాస్త్రాలతో కొన్ని పెద్ద పెద్ద వనాలను కాల్చివేశాడు.
ఆ సమయంలో భృగువంశానికి చెందిన భార్గవుడను మహాముని తన ఆశ్రమప్రాంతంలో ఉండే సరస్సులో మునిగి తపస్సుచేస్తూ ఉన్నాడు.అతడు తపస్సు ముగించుకుని నీటినుండి బయటికి వచ్చి చూస్తే అతని ఆశ్రమం దగ్ధమై ఉంది. భార్గవుడు దివ్యదృష్టితో ఆ పని చేసింది రాజు అని తెలిసికొని కోపంతో అర్జునుని ఇలా శపించాడు."ఓ హైహయా!నా అనుమతి లేకుండా ఆశ్రమాన్ని, నా వనాన్ని నువ్వు తగలబెట్టావు కాబట్టి నా వంశమందు పుట్టిన తాపసి నీ బాహువులను ఖండించి, నిన్ను వధిస్తాడు. భవిష్యత్తులో కౌరవవంశంలో నీ పేరు కలవాడొకాడు పుట్టి నీ కీర్తిని హరిస్తాడు.  నీ కీర్తి యొక్క ఫలం అంతా మాయమవుతుంది. 'అర్జునుడు 'అంటే ప్రజలు అతడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. "
పై ఋషి శాపం తర్వాతి కాలంలో కార్తవీర్యార్జునుడు అనుభవించాల్సి వచ్చింది.

ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు సైన్యంతో కలిసి వేటకు వెళ్ళాడు. అక్కడ జంతువులను వేటాడి, వేటాడి రాజు సైన్యం అలిసిపోయింది. వాళ్ళు రాత్రికి ఒక చోట విడిది చేశారు. అక్కడికి దగ్గర్లో జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉంది. తెల్లవారి రాజు లేచి నదిలో స్నానం చేసి దత్తాత్రేయమంత్రం జపిస్తూ ఉన్నాడు. అక్కడికి బ్రహ్మతేజస్సుతో ఉన్న జమదగ్ని మహర్షి వచ్చి రాజును ఆదరంగా కుశలప్రశ్నలు వేశాడు. రాజు కూడా జమదగ్ని మహర్షికి దండప్రణామములాచరించి, తాను, తన పరివారం వేటకోసం వచ్చామని, ఇంక రాజ్యానికి బయలు దేరతామని తెలిపాడు. జమదగ్ని మహర్షి రాజుకు, అతని పరివారానికి తాను ఆతిధ్యం ఇస్తానని, స్వీకరించివెళ్లమని కోరాడు. దానికి రాజు సున్నితంగా తిరస్కరించినా కూడా మహర్షి ఒప్పుకోలేదు. చివరకు రాజు "మహర్షి పెట్టిందేదో కాస్త తిని వెళదాం!దుంపలో, ఫలాలో పెట్టింది తిని అతని ఆశీస్సులు తీసుకుంటే సరిపోతుంది "అని తన పరివారంతో అలాగే కూర్చున్నాడు.
జమదగ్ని మహర్షికి ఐదుగురు కుమారులు. ఆయన భార్య పేరు రేణుక. ఆమె మహాపతివ్రత. మహర్షి ఆఖరి కుమారుడు రాముడు. విష్ణుమూర్తి అంశతో జన్మించిన వాడు. మహాతేజోసంపన్నుడు.తన అన్నలతో కలిసి తపస్సు నిమిత్తం దూరప్రాంతానికి వెళ్లాడు.ఆశ్రమంలో ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు. మహర్షి ఆశ్రమంలో కామధేనువు ఉంది. ఆ కపిల గోవు ఏది అడిగినా క్షణంలో సమకూరుస్తుంది. జమదగ్ని మహర్షి కామధేనువును పూజించి రాజుకు, రాజ పరివారానికి భోజనం అడిగిన వెంటనే కామధేనువు అతి మధురమైన పదార్థాలనెన్నింటినో సృష్టించి ఇచ్చింది.
మహర్షి రాజుకు, రాజపరివారానికి అద్భుతమైన విందుభోజనం పెట్టాడు.
అది భుజించిన కార్తవీర్యార్జునకు ఆశ్చర్యం వేసింది. ఒక మంత్రిని పిలిచి 'ఈ మహర్షి ఐశ్వర్యానికి కారణమేమిటో తెలిసికొని రమ్మని 'పంపించాడు.
ఆ మంత్రి  మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి చూచి మహారాజు దగ్గరికి వచ్చి "మహారాజా!అక్కడ జింక చర్మాలు, యజ్ఞసామగ్రి తప్ప ఏమీ చెప్పుకోదగ్గ సంపద ఏమీ లేదు. ఆశ్రమంలో దివ్యతేజస్సుతో వెలిగిపోతూ ఒక కపిల గోవు మాత్రం ఉంది."అని తెలిపాడు.

మంత్రి చెప్పింది విన్న తర్వాత కార్తవీర్యార్జునుడి మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. 'అంత మహిమ కల ఆ కపిల గోవు తనవంటి మహారాజు దగ్గర ఉండాలి కానీ తాపసుల దగ్గర ఎందుకు? భూమి రాజుది. భూమిలో ఉన్న వస్తుసామగ్రి ఏదైనా రాజు స్వంతం. రాజుకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఒక గోవు ఏమిటి? సర్వాన్ని రక్షించే రాజు అన్నిటికీ హక్కుదారు.'అని ఇలా తలపోసి అంతటి తపోసంపన్నుడు, దత్తాత్రేయుడి భక్తుడు, ధర్మాచరణ తెలిసినవాడు అయిన కార్తవీర్యార్జునుడు కాలవశమున, పోగాలము దాపురించి, మహర్షిని అడిగి కామధేనువును తీసికొని రమ్మని మంత్రులను, సేనాధిపతిని పంపించాడు.
జమదగ్ని మహర్షి రాజు యొక్క అహంకారానికి చింతించి "నాయనలారా!ఈ గోవు సామాన్యమైనది కాదు. ఈ కామధేనువు క్షీరసాగరమథనంలో లక్ష్మీదేవితో పాటు ప్రభవించింది. దీనిని సురాసురులు హోమద్రవ్యముల కొఱకు సప్తఋషులకు ఇచ్చారు. ఈ గోవు ఋషుల సొత్తు. దీనిని భోగలాలసతో సామాన్యులు ఆశించటం మహాపాపం.ఋషులు దేవపూజ్యులు. ఋషుల ముందు రాజు అల్పుడు. కామధేనువును మీ రాజుకు ఇవ్వటం కుదరదు."అని అనునయంగా చెప్పాడు.
రాజు  మంత్రులు, సేనాధిపతి వెళ్లి  రాజుకు విషయం చెప్పారు.
కార్తవీర్యార్జునుడికి కోపం వచ్చింది. దత్తాత్రేయవరప్రసాది అయిన తనను ఆ ముని అల్పునివలె జమకడుతున్నందుకు అవమానంగా అనిపించింది. ఇక యుద్ధం చేసైనా గోవును తెచ్చుకుందామని జమదగ్ని మహర్షి ఆశ్రమం మీదికి  పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చాడు.

 జమదగ్ని కూడా అస్త్రశస్త్రాలతో రాజుతో యుద్ధం చేయసాగాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం రోజుల తరబడి జరిగింది.రాజు ఎన్ని
శస్త్రాస్త్రాలు ప్రయోగించినా అవి జమదగ్నిని ఏమీ చేయలేకపోయాయి. మహర్షి ముందు బ్రహ్మాస్త్రం కూడా నిష్ప్రయోజనం అయింది. చివరకు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయమహర్షి తనకు ఇచ్చిన 'ఏక పురుషఘాతి 'అను శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తి నూరుగురు సూర్యుల తేజస్సు కలది. కార్తవీర్యుడు సమస్త దేవతల తేజస్సును, బ్రహ్మ, విష్ణు, శంకరుడు, మాయాదేవి యొక్క శక్తులను ఆవాహనచేసి మహర్షి మీద ప్రయోగించాడు. ఆ శక్తి జ్వలించుచు వచ్చి జమదగ్నిమహర్షి రొమ్ముకు తగిలింది. మహర్షి వెంటనే మరణించాడు. ఆ శక్తి శ్రీహరి సన్నిధికి తిరిగి వెళ్ళింది. ఒకప్పుడు శ్రీమహావిష్ణువు ఆ శక్తిని దత్తాత్రేయునికి ఇచ్చాడు. దానినే దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఇచ్చాడు.
కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి వెళ్లి గోవు కోసం చూడగా గోవు కనిపించలేదు. కామధేనువు జమదగ్ని మహర్షి మరణించటంతో స్వర్గానికి వెళ్లిపోయింది.'ఇంత యుద్ధం చేసినా గోవు దక్కలేదని 'బాధపడుతూ రాజు నిరాశతో రాజ్యానికి తిరిగి వచ్చాడు.


భర్త మరణించటంతో రేణుకాదేవి గగ్గోలు పెడుతూ" భార్గవరామా!రామా!"అంటూ ఇరవైయొక్కమార్లు తన కుమారుడిని పిలుస్తూ గుండెలు బాదుకొంటూ రోదించసాగింది. అప్పటికే మహర్షి శిస్యులు ఆకాశమార్గంలో యోగశక్తి ద్వారా ప్రయాణంచి భార్గవ రాముడికి, అతని అన్నలకు విషయం చెప్పారు. హుటాహుటిన సోదరులందరూ ఆశ్రమానికి వచ్చారు. తండ్రిని అన్యాయంగా కార్తవీర్యార్జునుడు సంహరించాడని తెలుసుకొన్న భార్గవరాముడు "నేను ఆ దుర్మార్గుడైన రాజుని వధిస్తాను. నా తల్లి ఇరవైయొక్కమార్లు నన్ను పిలిచి రోదించింది కాబట్టి ఇరవైయొక్క మార్లు ఈ క్షత్రియులపై దండెత్తి భూమిపై క్షత్రియులు లేకుండా చేస్తాను "అని ప్రతిజ్ఞచేశాడు.
తదనంతరం  కుమారులు తండ్రికి ఉత్తరక్రియలు జరిపారు. రేణుకాదేవి భర్తతో పాటు సహగమనం చేసింది.


భార్గవరాముడు పరమశివుని గురించి తపస్సు చేసి' పరశువును 'పొంది, దానితో కార్తవీర్యార్జునిపై యుద్దానికి వచ్చాడు.అతడిని అందరూ అప్పటి నుండి 'పరశురాముడు 'అని పిలవసాగారు.
పరశురాముడిని చూచి ఏనుగుపై ఎక్కి ఉన్న  రాజు హేళనగా నవ్వి "చిన్న బాలుడివి. ఒంటరివి. నన్ను నా సైన్యాన్ని ఎదుర్కొంటావా? నేను మీ నాన్నను సంహరించాను. నువ్వు చిన్నవాడివి. వెళ్ళు!వెళ్లి ధర్భలు ఏరుకుంటూ జీవితాన్ని గడుపుకో!పెద్దవాళ్ళతో యుద్ధం చెయ్యటానికి ఇది పిల్లలాటకాదు.అయినా నీవంటి చిన్నపిల్లలతో యుద్ధం నేను చెయ్యను ". అన్నాడు.
దానికి పరశురాముడు "సరే!నేను ఆటలాగానే యుద్ధం చేస్తాను!చూస్తూ ఉండు!"అంటూ తన పరశువుతో రాజు సైన్యాన్ని ఊచకోత కోయటం మొదలు పెట్టాడు.
సైన్యం తరిగిపోతూఉంటే రాజు తన శక్తియుక్తులతో యుద్ధం చేశాడు. తుదకు రాముడు ఎగిరి ఏనుగుపై నున్న రాజు వెయ్యి బాహువులను నరికి  వేశాడు. ఉన్న  రెండు చేతులతో కార్తవీర్యార్జునుడు వీరోచితంగా పోరాడాడు. కానీ పరశురాముడు పరశువుతో రాజు తల ఖండించాడు. అలా కార్తవీర్యార్జునుడు మరణించాడు. అతని శరీరం నుండి ఒక దివ్యతేజస్సు వచ్చి వైకుంఠంలో ఉండే సుదర్శనచక్రంలో కలిసిపోయింది.
కార్తవీర్యార్జునిడికి నూరుగురు కుమారులు. వాళ్ళు చాలా బలవంతులు.  ఐదుగురు మాత్రం  హిమాలయాలకు పారిపోయారు. వారు శూరసేనుడు, శూరుడు, వృష్టి, కృష్ణుడు, జయధ్వజుడు.
 మిగిలిన కుమారులు మొత్తం పరశురాముని గొడ్డలికి బలి అయ్యారు.అలా కార్తవీర్యార్జునుడనే  సుదర్శన తేజం చివరకు వైష్ణవ తేజుడైన పరశురాముని చేతిలో ముక్తిని పొంది విష్ణువును చేరుకొంది. 

//ఈ కథను విన్నా, చదివినా ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తులు ఇహలోకంలో సర్వసౌఖ్యాలుపొంది అంత్యంలో మోక్షం పొందుతారు.//

No comments:

Post a Comment

Pages