కటకట హరిమాయాకల్పనెట్టిదో - అచ్చంగా తెలుగు

కటకట హరిమాయాకల్పనెట్టిదో

Share This

కటకట హరిమాయాకల్పనెట్టిదో 

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

ఆచార్య  తాడేపల్లి పతంజలి

 



పల్లవి:

కటకట హరిమాయాకల్పనెట్టిదో

తటుకునబారవేసేతలపెందు లేదు


చ.1: 

అనంతకోటియుగాదులనుండియు

తనివోక విషయాల దగిలుండినా

దినమొక్కొక్కరుచి తీపులై పండీగాని

వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు


చ.2:

కడలేక నాలుకకు గన్నయాహారములెల్ల

వోడలిలో బూటవూట వొట్టుకొనినా

సడిబైపై వింతవింతచవులే వెదకుగాని

విడువని యాత్మకు వెగ టెందు లేదు


చ.3:

కలకాలముననుండి కాపురపు లంపటాలె

కలిమితో మెడగుచ్చి కట్టుకొనినా

యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల -

నలవాటైన యాత్మకలపే లేదు

(రేకు: 0354-02 సం: 04-316)


భావం

పల్లవి:

కటకట! హరియొక్క మాయాకల్పన ఎటువంటిదో !

తటాలున ఆశను పారవేసే ఆలోచన ఎక్కడ కూడా  లేదు.(ఆశా   వ్యామోహము వదులుకోలేకపోతున్నామని భావం)

చ.1:

ప్రతిరోజు ఒక్కొక్క రుచి అనుభవిస్తూ  తియ్యదనాలలో పండిపోయినా జీవునికి  కోర్కెలపై ఆసక్తి పోలేదు.

అంతములేని కోట్లాది యుగముల నుండి  జీవునికి విషయాలపై ఆసక్తి ఉంటున్నది. ప్రతి జన్మలో వెంబడిరచు  ఆత్మకు వెగటు ఎందులో లేదు.

చ.2:

శరీరములో ప్రతిరోజు ఒట్టు పెట్టుకొన్నట్లుగా వ్యామోహానికి అంతులేక ఈ  నాలుక చూసిన ఆహారములన్నీ కావాలనుకొంటుంది.లొట్టల చప్పుళ్ళు చేస్తూ వింతవింత రుచులే  వెదకుతుంది .మోహము విడువని ఆత్మకు వెగటు ఎప్పుడు  లేదు.

చ.3:

కలకాలమునుండి కాపురపు బంధాలను  మెడలోగుచ్చి కట్టుకొన్నప్పటికి- సంతోషంతో  శ్రీవేంకటేశ్వరుని ఆజ్ఞలు అలవాటైన ఆత్మకు అలుపు అనునది  లేదు. ( సంసారాలలో ఉన్నప్పటికి స్వామిని తలిస్తే ఆత్మ సంతోషిస్తుందని భావం)


విశేషాలు

యుగాలు

కృతయుగమునకు 1728000 సంవత్సరములు. త్రేతాయుగమునకు 1296000 సంవత్సరములు. ద్వాపర యుగమునకు 864000 సంవత్సరములు. కలియుగమునకు 430000 సంవత్సరములు.

 
 ***

No comments:

Post a Comment

Pages