మానసవీణ - 58 - అచ్చంగా తెలుగు

మానసవీణ - 58

Share This

                                                                 మానసవీణ - 58

శ్రీమతి బేబీ సరోజ



గదిలోకి ఎవరో వచ్చారని తెలుస్తూ ఉండగానే కళ్ళు గట్టిగా మూసుకుని ఊపిరి బిగబట్టి మనసులోనే ఇష్టదైవాన్ని స్మరించుకుంటుంది మానస –‘దేవుడా దేవుడా దేవుడా ’ అంటూ. 

గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి కింద పడి ఉన్న మానసను అమాంతంగా ఎత్తి మంచం మీద పడేశాడు. వెంటనే బయటకు వెళ్ళి తలుపు బయట గడియ పెట్టిన శబ్దం వినపడింది. ఆ వెంటనే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్లు గమనించింది కానీ సౌండ్ ప్రూఫ్ రూమ్ లా ఉండడం వలన అతను ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా వినలేకపోయింది. 

అసలు నేనేనా ఈ పరిస్థితిలో ఉన్నది, కలలో కూడా నేనెప్పుడూ ఊహించనయినా లేదుఇటువంటి  ఆపదలో చిక్కుకుంటానని. అసలెవరీ వ్యక్తులు, నన్నిలా బంధించవలసిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి. అసలీ సాలె గూటి నుంచీ తప్పించుకునే మార్గం” అంటూ ఆలోచనలో పడింది మానస. 

తనేమై పోయిందో అర్థం కాక ఆశ్రమంలో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, అనిరుధ్ సంగతి సరే సరి అసలు అనిరుధ్ కి  తెలుసా, ఈ విషయం? అమ్మ... అమ్మ... అమ్మకసలు తెలుసా తను వేటగాడి వలలో చిక్కిన జింక పిల్లలా విల విల్లాడుతున్నానని,   అమ్మో అమ్మకి తనిక్కడ ఈ విధంగా బంధింపబడిందని తెలిస్తే తట్టుకోగలదా, బ్రతకగలదా, అమ్మకి అమ్మకేమయినా అయితే తను తట్టుకోగలదా.  ఏమిటీ మనసు పరి పరి విధాల కీడును శంకిస్తోంది?

ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనయినా ‘ధైర్యం’ అనే ఆయుధాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, అప్పుడే విజయలక్ష్మి మనల్ని తప్పక వరిస్తుంది, అనే విషయం చిన్నప్పట్నుంచీ వింటున్నదేగా.  అష్టలక్ష్ములలో  ఆదిలక్ష్మి, వరలక్ష్మి, ధాన్యలక్ష్మీ మొదలైన దేవతలందరూ వెళతానన్నా సరేనంటుంది ఆ భక్తురాలు చివరిగా వెళ్ళడానికి సిద్ధపడిన ధైర్యలక్ష్మి ని మాత్రం నిలువరిస్తుంది  అదేమని అడిగిన ధైర్యలక్ష్మి తో “నువ్వున్నావనే  ధైర్యం తోనే కదమ్మా అందరినీ వెళ్ళనిచ్చాను, నువ్వంటూ నాతో ఉంటే వెళ్ళిన లక్ష్ములందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి స్థానాలనలంకరిస్తారు కదమ్మా” అంటూ పాదాలపై వాలిపోతుంది. 

ఈ కథ స్ఫురణకు వచ్చినంతనే ‘మానస’ లో ఒక నూతనోత్తేజం వచ్చినట్లయింది అంతే “ఏ విధంగా నయినా సరే ఈ పరిస్థితి నుంచి బయట పడాలి, తను బయట పడడమే కాదు, తనతో పాటు బాధతో మూలుగుతున్న ఆ అపరిచిత వ్యక్తిని కూడా కాపాడాలి.” అని తీర్మానించుకుంది. 

ఈ సమయంలో మానసని చూస్తే సన్నగా, నాజూగ్గా సన్నజాజి తీగలా ఉండే ‘మానస’ స్థానంలో శత్రువును వేటాడేటప్పుడు చిరుత కళ్ళల్లో ఉండే తీక్షణత, కాళ్ళల్లో ఉండే వేగమే గుర్తొస్తుంది. 

ఒకానొక సమయంలో శరవేగంతో ప్రవహించే సాగరంలో గడ్డి పోచ కూడా ఏనుగును బంధించే మోకు లాగానే తోస్తుంది, ఆవలి ఒడ్డుకు చేర్చే ఆపద్బాంధవి లానే గోచరిస్తుంది.    

నిద్రలో నుంచి పొరపాటున కింద పడిపోయిందేమోనని మానసని యథాప్రకారం మంచం మీద పడేసి బయటికి వెళ్ళిన వ్యక్తి అలికిడి లేదని నిర్థారించుకన్న మానస మెల్లిగా మంచం మీద కూర్చుని తాడు కట్టి ఉన్న రెండు కాళ్ళను నేల మీద ఆనించి లేచి గెంతుతూ  గెంతుతూ గది మధ్య వరకు వచ్చింది. 

 నేల మీద పడుకుని కట్టి ఉన్న చేతులతో వుడెన్ ఫ్లోరింగ్ మీద శబ్దం చేస్తూ... "హలో! ఎవరైనా ఉన్నారా?” అని అడిగింది. సమాధానంగా ఇంతకు ముందు విన్న మూలుగు మళ్ళీ వినపడింది.

          ఏమండీ, ఎవరండీ మీరు? మీరెవరైనా సరే, మీకొచ్చిన భయమేం లేదు, ధైర్యంగా ఉండండి. మీరు, నేను కూడా క్షేమంగా బయట పడబోతున్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.”  ఇంతలో రైలు వెళుతున్నట్లు పెద్ద శబ్దం, ఆ శబ్దంతో పాటు వారున్న ప్రదేశం కూడా స్వల్పంగా కంపించింది. అంటే తామున్న చోటుకి చాలా దగ్గర్లోనే రైల్వే ట్రాక్ ఉన్నట్లు గ్రహించింది మానస. 

మానసని ఎవరో కారులో ఎత్తుకుపొయ్యారనే విషయం రాజు, సరితల ద్వారా విన్న శ్రావణి ఒక్కసారిగా కుప్ప కూలిపోయ్యింది. కంటికీ మింటికీ ఏకధారగా విలపిస్తోంది. 

రాజు, సరిత ఇన్స్పెక్టర్ దినేష్ దగ్గరికి  వెళ్ళారు కదా, మానసని ఎవరో ఎత్తుకుపోయిన విషయం చెప్పే ఉంటారు. దినేష్ తన అధికారాన్ని తక్షణమే ఉపయోగించి నా చిట్టి తల్లి మానస ఆచూకీ తెలుసుకుంటారు. 

నా బంగారు తల్లి వాళ్ళ చేతిలో ఏం కష్టాలు పడుతుందో, ఏమో, అసలు వాళ్ళెవరు, మానస ని తీసుకెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి. సమయానికి ఈయన కూడా ఊళ్ళో లేరు, ఎలా ఎలా?” అంటూ ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతోంది. వెంటనే దేవుని గదిలోకి వెళ్ళి పసుపు గుడ్డలో వెయ్యి నూట పదహార్లు ముడుపు కట్టి కొండలరాయుని విగ్రహం ముందున్న హుండీలో వేసిముకుళిత హస్తాలతో  “నాయనా ఏడుకొండల వాడా! నా బంగారు తల్లిని క్షేమంగా ఇంటికి చేర్చు, కాలినడకన నీ కొండకొస్తాను, అంగ ప్రదక్షిణ చేస్తాను. ఈ ఆపద నుంచి నా మానస ని కాపాడి ఆపద మొక్కులవాడవని మరొక్కసారి నిరూపించుకోవయ్యా, నీకు నిలువు  దోపిడి ఇచ్చుకుంటాను తండ్రీ!” అంటూ  ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అలాగే నిద్రలోకి జారుకుంది శ్రావణి.      

రాజు, సరితలు చెప్పిన ఆధారాలను బట్టి కారు నంబరును ట్రేస్ చేయగలిగితే సగం చిక్కు ముడి వీడినట్లేనని భావించిన సిఎ దినేష్ వెంటనే ఆర్టీఓ ఆఫీసు కి ఫోన్ చేసి “ఫలానా నంబరు కల కారు యజమాని పేరు, ఊరు, అడ్రస్ అరగంటలో నాకు తెలియాలి, వెరీ వెరీ అర్జంట్” అని చెప్పాడు. 

పక్కనే ఉన్న రామజోగయ్య, అనిరుధ్ ల వైపు తిరిగి “కారు వివరాలు తెలిస్తే కాస్త క్లూ అయినా దొరుకుతుంది, లేదంటే కేసును ఛేదించడం కష్టమవుతుంది. ఒకవేళ ఏదో ఒకటి ఊహించి మన ప్రయత్నాలు మనం మొదలు పెడితే మానసని కాపాడడంలో జాప్యం జరగవచ్చు. ఆ కారుకి సంబంధించిన వివరాలు మనకి అందే లోపు మీకేమయినా ఉపాయం తడితే నిరభ్యంతరంగా చెప్పండి" అంటూ వాళ్ళిద్దరి అభిప్రాయాలు కూడా సేకరించే విషయంలో నిమగ్నమయ్యాడు ఇన్స్పెక్టర్ దినేష్. 

అసలెవరో తెలియని వ్యక్తి తనలాగే ఆపదలో ఉన్నారని మాత్రం గ్రహించిన మానస ఎలా అయినా సరే  కట్లు విప్పుకుని ఈ గది నుండి బయట పడాలి, బయటపడి వుడెన్ ఫ్లోర్ కింద అంటే కింది గదిలో ఉన్న వ్యక్తిని కూడా రక్షించాలి” అని దృఢసంకల్పానికి వచ్చింది. 

అంతే వెంటనే ఆమె మెదడు పాదారసంలా పని చేయనారంభించింది. మంచం మీద కూర్చుని కట్టేసిన రెండు కాళ్ళను కిందికి పైకి కదిలించ సాగింది, గట్టిగా కట్టిన కట్లు రాపిడికి కాస్త కాస్త వదులవుతున్నయ్, చేతికి కట్టిన కట్లు మాత్రం చాలా చాలా నొప్పెడుతున్నయ్. 

ఇంతలో తలుపు బయట గడియ తీస్తున్న శబ్దం రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.  ఒక వ్యక్తి అన్నం పళ్ళెంతో లోనికి ప్రవేశించాడు. పళ్ళెం పక్కన పెట్టి మానస కట్లు ఊడదీశాడు, కాలికి కట్టిన కట్లు కూడా ఊడదీసి బాత్రూమ్ వైపు చూపించాడు. “అసలు మీరెవరు, నేను మీకేం ద్రోహం చేశాను, నన్నీ విధంగా బంధించడం భావ్యమేనా” అని మానస ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆ వ్యక్తి నుంచి మౌనమే సమాధానమయ్యింది. 

ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచీ  కాసిన్ని మంచి నీళ్ళు తప్ప వేరే ఆహారమేమి లేక కళ్ళు తిరుగుతున్నట్లయ్యింది మానసకి. ఆ అపరిచిత వ్యక్తి తెచ్చిన అన్నం తిని, మంచి నీళ్ళు తాగింది. 

తనేం చేస్తున్నా ఆలోచనలు మాత్రం శరవేగంతో పథక రచన చేస్తూనే ఉన్నయ్.  అన్నం తినడం పూర్తయ్యిందని గ్రహించిన వ్యక్తి తాళ్ళు తీసుకుని తనవైపే రావడం గమనించిన  మానస ఒక్క ఉదుటున మంచం మీదినుంచీ లేవటం, చేతిలో ఉన్న స్టీలు పళ్ళెం వాడి ముఖాన్ని పచ్చడి చేయడం కనురెప్ప పాటులో జరిగిపోయాయి.   

ఆ దెబ్బకి వాడి కళ్ళు బైర్లు కమ్మినయ్, అంతే ఆ సమయం చాలు మానసకి అక్కడి నుంచి తప్పించుకోవటానికి. ఆ దెబ్బ నుంచి వాడు తేరుకునే లోపు తనని కట్టడానికి తెచ్చిన ఆ తాళ్ళతోనే వాడి కాళ్ళూ చేతులూ కట్టేసి, వాడి జేబులోని సెల్ ఫోన్ తీసుకోవడం, లేడి పిల్లలా చెంగున ఒక్క గెంతులో బయటకు దూకటం, బయట గడియ పెట్టటం జరిగిపోయినయ్. 

అదృష్టవశాత్తు బయట ఎవరూ లేరు. సెల్ ఫోన్ తో సహా మెట్లు దిగి బయటకు పారిపోయేంతలో మెట్ల పక్కగది నుంచి బలహీనమైన  మూలుగు, అంతకు ముందు తను విన్న మూలుగు అదే, అంతే తను అంతకు ముందు ఆ వ్యక్తికిచ్చిన  మాట గుర్తొచ్చింది.  

గది బయట గడియ మాత్రమే పెట్టి ఉండడంతో  గడియ తీసి లోనికి ప్రవేశించింది, లోపలంతా చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమి కనపడడం లేదు. తెరచిన తలుపుల గుండా ప్రసరించిన వెలుతురులో, చింపిరి జుట్టుతో, మాసిన గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి మూలగా ఉన్న మంచంమీద కాళ్ళూ చేతులూ కట్టేసిన స్థితిలో ఉన్నాడు. గబగబా కట్లు విప్పుతూనే “మనం సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచీ పారిపోవాలి, మళ్ళీ ఆ నరరూప రాక్షసులు వచ్చారంటే ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు” అంటూ ఆ వ్యక్తి ముఖంలోకి మెల్లిగా చూడసాగింది. 

కట్లు విప్పగానే ఆ వ్యక్తి చేతితో తలను కొట్టుకోవడం గమనించిన మానస “ఈ వ్యక్తిని ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఇలా తలపై కొట్టుకోవడం కూడా సుపరిచితమే, అవును అనిరుధ్ కి కూడా ఈ అలవాటుంది” అని మనసులో అనుకుంటూ...  తేరిపార అతని ముఖంలోకి చూసి, షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. 

వెంటనే తెప్పరిల్లిన మానస “జ్ఞాపకం కాదు వాస్తవం, ఇది ముమ్మాటికి వాస్తవమే ఆ వ్యక్తి మరెవరో కాదు, తన పాలిటి దైవం, దయార్ద్రత, మంచితనం  మూర్తీభవించిన మహామనిషి, తనని ప్రాణానికి ప్రాణంగా అభిమానించే మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన జిటిఆర్ అంకుల్. ఒక్కసారిగా తన కళ్ళని తనే నమ్మలేకపోయింది మానస. 

అంకుల్! మీరు...? ఇక్కడ?” మానసకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బలహీన స్వరంతో “ఆశ్చర్యంతో ఆలస్యం చేసే సమయం కాదమ్మా, ముందు మనం ఇక్కడ్నుంచి బయట పడే మార్గం ఆలోచించమ్మా, ఆ గూండాలు వచ్చారంటే  ఇంక మనం బయటకు వెళ్ళడం అసాధ్యం.” అన్నారు. 

వెంటనే మానస “ఒక్క నిమిషం అంకుల్! అనిరుధ్ కి ఫోన్ చేసి, విషయం చెప్పి లొకేషన్ షేర్ చేస్తాను” అన్నది. అనిరుధ్ కి ఫోన్ చేసిన మానస “అనిరుధ్! నేను మానసని, జిటిఆర్ అంకుల్ నాతోనే ఉన్నారు, మేము చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాము, అసలు మేమెక్కడున్నామో కూడా తెలియడం లేదు, లొకేషన్ షేర్ చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా వచ్చి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బంధించిన వారు ఏ క్షణంలో నయినా రావచ్చు” అంటూ గడ గడా అప్పచెప్పేసింది. 

వెంటనే అనిరుధ్ మానసతో "మీరేమి భయపడకండి, నేను మన సిఐ దినేష్ గారు కలిసి నువ్వు షేర్ చేసే లొకేషన్ కి వచ్చేస్తాం, ఈ లోపు మీరేదయినా సురక్షిత ప్రాంతంలో దాక్కోండి”. అని చెప్పాడు. 

దాదాపు గంట, గంటన్నర తరువాత ఆర్టీఓ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది దినేష్ కి, ఒకే నంబరు తో రెండు కార్లు కనిపిస్తున్నాయని, ఏది అసలో, ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందని, పై ఆఫీసరు సెలవులో ఉన్నాడని చావు కబురు చల్లగా చెప్పారు. 

ఇంతలో మానస ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసిన విషయం దినేష్ కి చెప్పాడు అనిరుధ్. అంతే కాదు తన తండ్రి అయిన జిటిఆర్ కూడా అక్కడే ఉన్నారని మానస చెప్పిన విషయం కూడా వివరించాడు. ఆశ్చర్యపోవడం దినేష్ వంతయ్యింది. 

అనిరుధ్ ఆలోచనలో పడి చేతితో చిన్నగా తలమీద కొట్టుకుంటూ “నాన్నగారు అక్కడుంటే, మరి ఇంట్లో ఉన్నదెవరు? సాంకేతికపరంగా అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిన, సాధిస్తున్న ఈ రోజులలో కూడా ఇటువంటి నేరాలు-ఘోరాలా” అనుకుంటూ భూమి ఒక్కసారిగా చీలిపోయి తానందులో కూరుకుపోతున్న భావన, తనను తాను నిలదొక్కుకోలేక తూలిపడబోయిన అనిరుధ్ ని పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ దినేష్ గట్టిగా పట్టుకుని, కుర్చీలో కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి, ఎసి ఆన్ చేశారు. 

సిఐ దినేష్ వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అందరినీ ఎలర్ట్ చేసి లొకేషన్ కి వచ్చేయమని, తను డైరెక్ట్ గా అక్కడికే వచ్చేస్తానని చెప్పారు.   

No comments:

Post a Comment

Pages