'నిశ్శబ్ధాన్ని నిరసించే నినాదం!'
-సుజాత.పి.వి.ఎల్.
ఊహించని నిశి ఏదో ఆ రాత్రి ఆవహించినట్టు
నువ్వా మృగాళ్ల చేతుల్లో చిక్కి బలైపోయావా?!
తలచుకొంటేనే రక్తం సలసల మరిగిపోతోంది..
కారుణ్యమంటే తెలియని కసాయిల ముందు
రెండు చేతులను జోడించి వేడుకున్నావని తలచుకొంటేనే..
ఆ కర్కశుల కరాలు తెగనరికినా తప్పులేదనిపిస్తోంది.
చికిత్సతో రోగుల మోముపై
నవ్వుల పువ్వులు పూయించాలనుకొన్న
ఆ కలల సౌధాన్ని కాలరాసిన కసాయిలను కఠినంగా శిక్షించకపోతే ఆవిరైపోయిన
నీ ఆశల ఆఖరి చూపుకు అర్థముంటుందా?
నిన్న నిర్భయ
మొన్న అభయ
నేడు ఎందరో..ఆడబిడ్డల ఆర్తనాదాలేవీ
వినబడనంత మొద్దునిద్దురలో ఉందీ నిస్సిగ్గు సమాజం..
కరుడుకట్టిన కామాంధులను కంచెకట్టి కాపాడుతున్నంత కాలం
చట్టం కూడా వ్యర్థంలో భాగమే!
మసకబారిన నీ కన్నీటి రుధిర బిందువులు
'నాకెందుకీ శాపమ'ని ప్రశ్నిస్తే..
ఏ ఒక్కరి దగ్గరైనా ఉందా సరైన సమాధానం?
మౌనంగా ఉన్న నిశ్శబ్ధాన్ని నిరసించే
నినాద తూటాల శబ్ధం సంధించేంత మార్పు మనలో రానంత వరకు
మరో ఊహించని రాత్రిని తలచుకొంటూ భయం గోడల మధ్య బతికేద్దాం!
***
No comments:
Post a Comment