ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -15 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -15

Share This

ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -15 

                                                                                                            కొత్తపల్లి ఉదయబాబు


అనుకున్న ప్రకారం విరాజ్ హరితకు ప్రతిపరీక్షకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

అయితే హరిత అన్ని పరీక్షలు చాలా అద్భుతంగా రాసింది. తనకు రావలసిన సరాసరి శాతం కన్నా ఎక్కువ శాతం మార్కులు వస్తాయని తల్లికి చెప్పింది.

పరీక్షలు పూర్తయ్యాక విరాజ్ కి మాటిచ్చిన ప్రకారం తల్లితో కలిసి అదే కోవెలల్లో స్వామి దర్శనం చేసుకున్న అనంతరం  అదే శివాలయ ప్రాంగణంలో కూర్చున్నారు వారు ముగ్గురూ.

''అమ్మయ్య.నీ పరీక్షలు పూర్తి అయిపోయాయి. మరి రేపటినుంచి ఏం చేద్దామనుకుంటున్నావ్?'' అడిగాడు విరాజ్.

''ఇంతకాలం  పరీక్షలు బాగా రాయడంకోసం కష్టపడ్డావ్ కదా. కొద్దిరోజులు విశ్రాన్తి తీసుకోమని చెబుతున్నాను బాబు. హరిత వినడం లేదు . ''అంది శకుంతల. 

'' ఈ వయసులో  ఖాళీగా ఉంటే  రెండు నష్టాలు విరాజ్. ఒకటి సమయం వృధా...వృధాగా గడచిన కాలం తిరిగి రాదు. రెండోది... ఏ పనిలేకుండా ఖాళీగా కూర్చుంటే  పిచ్చి ఆలోచనలు వస్తాయి. నేను మీముందు పెట్టిన ప్రొపోజల్స్ ఏంచేశారు?'' అడిగింది హరిత.

''ఆ విషయానికే వస్తున్నా.. హరితా.. ఆంటీ.. మీరిద్దరూ ఏమీ అనుకోనంటే హరితకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అది కాదంటే మాత్రం నేను చాలా చాలా బాధపడతాను. ఇదేదో ముందరికాళ్లకు బంధం వేస్తున్నాను అనుకోవద్దు. ఈ ఒక్కటి తీసుకోవాలని నేను ఆ దేవుని ప్రాంగణంలో అడుగుతున్నాను. ''అడిగాడు విరాజ్.

తల్లీకూతుళ్లు ఇద్దరూ మోహ మొహాలు చూసుకున్నారు.

''నువ్వు ఏమైనా అడిగావా అతన్ని?'' అడిగింది శకుంతల కూతుర్ని.

''నేనా? ఏమీ అడగలేదు మమ్మీ. నేను ఆరోజు ఎం మాట్లాడానో నీతో చెప్పానుగా.''అని హరిత గుర్తుచేశాకా సమాధానపడిన శకుంతల -

''సరే బాబు...ఏమిటో ఇవ్వండి.'' అంది.

''థాంక్స్ ఆంటీ.. రెండు నిముషాల్లో వస్తాను.'' అనేసి బైక్ దగ్గరకు వెళ్లి చేతిలో గిఫ్ట్ బాగ్ తో వచ్చాడు విరాజ్. వస్తూనే దానిని హరిత చేతిలో పెడుతూ అన్నాడు. ' తీసి చూడు.''

గిఫ్ట్ బాగులోంచి ఒక పాకెట్ తీసింది హరిత. అది స్మార్ట్ ఫోన్.

''ఇంత ఖరీదైన ఫోనా...''అంది హరిత దానిని ఓపెన్ చేసి.

''మా స్థాయికి ఇంత గొప్ప ఫోన్ అవసరమా బాబు?''నొచ్చుకుంటున్నట్టుగా అంది శకుంతల.

''లేదు ఆంటీ. ఫోన్ అనేది స్థాయి కాదు...నిత్యజీవన అవసరం. ఇంతకాలం తాను కాలేజీకి వెళ్లింది కాబట్టి  మీరు తన రాకకోసం ఈనాడు ఇబ్బంది పడలేదు. ఇకమీదట ఏదైనా ఉద్యోగంలో చేరితే మీ ఇద్దరిమధ్య వారధిలా పనిచెయ్యడంకోసమే ఈ సారధి.'' అన్నాడు విరాజ్.

''అవుననుకో బాబు... కానీ మేము నీకు రుణపడేలా చేస్తున్నావనిపిస్తోంది.'' 

''అలా భావించవద్దు ఆంటీ. స్నేహితులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోరా? ఏదో గోడకి తగిలించే బొమ్మలకన్నా  మీరు అనునిత్యం వాడుకునేది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది కదా..ఇందులో నా స్వార్ధం కూడా కొంత ఉంది ఆంటీ. ప్రతీసారి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇకనుంచి నేను డైరెక్టుగా హరితనే ఇబ్బంది పెట్టవచ్చు కదా..'' అన్నాడు .

అతని మాటలకు తల్లీ కూతుళ్లు ఇద్దరూ నవ్వారు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages