తల్లిమనసు - అచ్చంగా తెలుగు
తల్లిమనసు.
(చిన్న కథ )

టి. వి. యెల్. గాయత్రి 
పూణే. మహారాష్ట్ర.



కొడుకు అభిలాష్, కోడలు తన్మయి రెండేళ్ల తర్వాత ఇండియాకి వస్తున్నారు. ఇల్లంతా సర్దింది మాధవి. పిల్లలున్నన్ని రోజులూ మానకుండా రమ్మని పనిమనిషికి చెప్పింది. వారం నుండి సర్దిందే సర్దుతూ, పిల్లలకు చిరుతిండి చేసిపెట్టింది. ఏమిటో పొద్దుటి నుండి కొంచెం నీరసంగా అనిపించింది మాధవికి.

"ఊరికే హైరానా పడకు!అసలే నీకు మోకాళ్ళ నొప్పులు.. కరోనా తర్వాత ఆరోగ్యం సున్నితం అయింది.. కాస్త రెస్టు తీసికో!అన్నాడు రాఘవ భార్యను మందలిస్తూ.

"మీరు మహా బలశాలులైనట్లు..డాక్టర్ దగ్గరికెళ్ళి కళ్ళజోడు మార్పించుకు రావద్దూ!.."

"ఇప్పుడే వద్దులే!పిల్లలు వెళ్ళాక చూద్దాం! ఇప్పుడు జోడు మార్చాలంటే కనీసం నాలుగు వేలవుతుంది... ముందు కోడలికి పట్టుచీర కొన్నావా?..."

"రేపు వెళ్ళి కొంటాను. అటునుంచటే బంగారం షాపుకు వెళ్ళి కోడలికి చిన్న నెక్లెస్ కొంటాను..."

"ఇప్పుడెందుకు?  పిల్లో, పిల్లవాడో పుడితే ఇద్దువుగాని!...మళ్ళీ నీకు హెర్నియా ఆపరేషన్ కూడా ఉంది కదా!.. మనకు డబ్బులు అవసరం వస్తాయి!పిల్లలను అడిగితే బాగుండదు!.."

"ఆపరేషన్ ఒక రెండు నెలలు వాయిదా వేసుకుందాము!అయినా మన పిల్లలకు మనం పెట్టుకోకపోతే ఇంకెవరు పెడతారు? ఊళ్ళో వాళ్ళు ముచ్చటగా చేయిస్తారా ఏమిటి?"

"నువ్వొక పిచ్చిదానివి!" అంటూ నవ్వాడు రాఘవ.

పిల్లలు వచ్చారు.  మూడు వారాలే సెలవలు. ఒక వారం తన్మయి  పుట్టింట్లో గడిపారు. మరో వారం తమ తల్లి తండ్రి, చెల్లెలితో తిరపతి, కంచి ట్రిప్ పెట్టింది తన్మయి. ఆఖరు వారం మూడు రోజులు అమెరికాకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవటంతో సరిపోయింది. సరిగ్గా రేపు అమెరికా వెళ్తారనంగా ఇంటికి వచ్చారు అభిలాష్, తన్మయిలు.

సంబరంగా అన్ని రకాలు వండిపెట్టింది మాధవి.డైటింగ్ అంటూ కొద్దికొద్దిగా తినింది తన్మయి. అభిలాష్ కాస్త పలకరించాడు.. పట్టుచీర, నెక్లెస్ చూచి అప్రసన్నంగా మోహం పెట్టింది తన్మయి. కోడలి మోహం చూసి నిరాశ పడింది మాధవి.ఉదయం పదింటికి వచ్చి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక "ఇంకా సామాన్లు కొనుక్కోవాలి "అంటూ భర్తను లేవదీసింది తన్మయి.

"వచ్చినంత సేపులేరు" అనుకుంటూ నిల్చున్న భార్య భుజం మీద అనునయంగా చేయి వేశాడు రాఘవ.

"నేను చెప్పలేదా!నువ్వే అనవసరంగా హైరనా పడ్డావు!...  అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా!.. మనం తెలుసుకోవాలి!... అంటూ ఇంకా ఏదో అనబోతుంటే 

"మీరు కాసేపు వాడిని ఏదో ఒకటి అనటం మానుకొంటారా ! మన కోసం అంత దూరం నుంచి వచ్చారు బిడ్డలు..వాళ్ళ కోసం చేసిన కజ్జికాయలు, సున్నుండల డబ్బా మర్చిపోయారు. మీ స్కూటర్ తీయండి! గబుక్కున వెళ్లి ఇచ్చి వద్దాము!ఎంతో దూరం వెళ్ళరు.....పిచ్చి వెధవకి ఎంతిష్టమో!"అంటూ స్వీట్ల డబ్బాను సంచిలో పెట్టుకుని తయారవుతున్న భార్యను చూసి 

"ఏమిటో!దీని పిచ్చి మమకారం!... ఒట్టి వెఱ్ఱిబాగుల్ది!...."  అనుకున్నాడు  మనసులో లోకం పోకడ తెలిసిన రాఘవ.

 ***

No comments:

Post a Comment

Pages