ఉన్నఊరు - కన్నతల్లి - అచ్చంగా తెలుగు

ఉన్నఊరు - కన్నతల్లి

Share This

ఉన్నఊరు - కన్నతల్లి 

రచన :టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
 




మూడు రోజులుగా మద్రాసులో ఒకటే వాన. రోడ్లన్నీ జలమయం.వరద నీటిలో వీధులు వీధులు  మునిగిపోయాయి.ఆందోళన పడుతూ ఉంది హారతి.చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్న రేవంత్ కు దిక్కు తోచడం లేదు.ఇంటి లోపలికి వరద నీరు వచ్చేసింది.  చంటి పిల్లాడిని పెట్టుకుని మంచం మీద కూర్చుంది హారతి.సామాన్లు నీటిలో తెలుతున్నాయి.ఆమె గుండె భయంతో దడదడ లాడుతోంది.
 రేవంత్ ది నెల్లూరు దగ్గర దుగ్గవోలు గ్రామం.తండ్రి శ్రీరాములు,తల్లి అనంతమ్మ. మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పొదుపుగా గడుపుకుంటారు శ్రీరాములు దంపతులు. రెండు బర్రె గొడ్లు ఉన్నాయి. వాళ్లకు ఇద్దరు పిల్లలు.కొడుకు రేవంత్,కూతురు భువన.
భువన బి. ఎ. బి. ఇ. డి. పాస్ అయ్యింది.నెల్లూరులో టీచర్ ఉద్యోగం చేస్తున్న విజయ్ కిచ్చి భువన పెళ్లి చేశాడు శ్రీరాములు.
రేవంత్ అగ్రికల్చర్ బి.ఎ.స్సీ. చదివి తండ్రితో పాటే వ్యవసాయం.
రేవంత్ కు సూళ్లూరుపేటలో ఉండే హారతి సంబంధం వచ్చింది.

"పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేవాడిని నేను చేసుకోను నాన్నా!"
అంది హారతి తండ్రి వెంకటరావుతో చికాగ్గా.

వెంకటరావు సూళ్లూరుపేటలో ఉన్న ఒక బట్టలషాపులో గుమస్తా. హారతి కంటే పెద్దది శోభ. శోభ కాలేజీలో బి. ఎ. చదివింది. శోభ పెళ్లి మద్రాసులో టైలర్ మోహన్ తో జరిగింది. వాళ్ళకొక మూడేళ్ల పాప. మోహన్ టైలర్ గా పనిచేస్తున్నా సొంత షాపు, ఇల్లు ఉంది. అతనికింద నలుగురు పనివాళ్ళు పని చేస్తారు. పెళ్లయ్యాక శోభ భర్త దగ్గర టైలరింగ్ నేర్చుకొని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది.

హారతి ఇంటర్లో ఫెయిల్ అయింది. చదువు మీద శ్రద్ధ లేదు.

"పోనీ!హిందీ పరీక్షలకు కట్టు!హిందీ టీచర్ గా ఉద్యోగం వస్తుందేమో!"అన్నాడు వెంకటరావు.

ఇంట్లో కూర్చుని బద్ధకంగా టీ. వీ. చూసే హారతికి చిర్రెత్తు కొచ్చింది.
"వెధవ చదువు!ఎంత చదివినా బుర్ర కెక్కదు... నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్నా!..."తెగేసి చెప్పింది హారతి.
కూతురికి సంబంధాలు చూస్తున్నాడు వెంకటరావు.
రెండేళ్ళు తిరిగితే ఈ సంబంధం వచ్చింది. బాగుందనిపించింది వెంకటరావుకు.

"పల్లెటూరి సంబంధాన్ని ఎవరు చేసుకుంటారు నాన్నా!పేడ పిసుక్కుంటూ, పిడకలు చేసుకుంటూ బర్రెగొడ్లను చూసుకోవటమేనా నా బతుకు?..."
ఈసడించుకొంది హారతి.


"వాళ్లు కట్నమడగలేదు.సొంత ఇల్లు ఉంది.అబ్బాయి అగ్రికల్చరల్ బి.ఎస్సీ.చదివాడు. వ్యవసాయం బాగుంటే ఇంకో ఎకరా కొంటారేమో! నాకు బాగుందనిపించింది.ఆడబడుచు వాళ్ళు నెల్లూరులో ఉంటారు. ఆ అమ్మాయి టీచరు. పోరుపొచ్చెం లేని సంబంధం.నెమ్మదైన వాళ్ళలాగా కనిపించారు..... అయినా గొప్ప గొప్ప సంబంధాలు తేవటానికి నేనేమన్నా షావుకారునా?... గుమాస్తాని.... నువ్వు కూడా ఆ టి. వి సీరియల్స్ చూడటం మానేసి కాస్త ఈ ప్రపంచంలోకి రా!.. పరిస్థితి అర్థం చేసుకో!... "

గట్టిగానే చెప్పాడు వెంకటరావు.

తండ్రికి ఏమీ చెప్పలేక అసంతృప్తిగా పెళ్లికి ఒప్పుకుంది హారతి.

పెళ్లయ్యాక రేవంత్ ఇంటికి వచ్చింది హారతి. అత్త అనంతమ్మ కాయబారు మనిషి. తెల్లవారిలేచి బర్రెగొడ్లను చూసుకోవటం, పాలు తీసి పాలవ్యాను వస్తే పొయ్యటం.... ఇంటిపని.. సరిపోతుంది.
తండ్రీ కొడుకులు పొలానికి పోతే సాయంత్రానికి వస్తారు. రాత్రిపూట కరెంట్ ఉంటుంది. పొలానికి వెళ్లి నీళ్లు పెట్టివస్తాడు శ్రీరాములు.
హారతికి అసలా పల్లెటూరు నచ్చలేదు. విసుక్కుంటూ, నసుక్కుంటూ ఇంట్లో పనులు చేసేది. ఇంతకు ముందులా పొద్దస్తమానం టి.వి చూడటానికి లేదు. రాను రాను కోడలి ప్రవర్తన శ్రీరాములుకు అర్థం అయ్యింది. పట్నం పోకడలున్న పిల్ల. పోనీ కొడుకుని, కోడలిని నెల్లూరులో పెడితేనో!... ఏదైనా వ్యాపారం పెట్టిస్తేనో!.... వ్యవసాయంలోనే పుట్టి పెరిగిన రేవంత్ కి వ్యాపారం చేయటం ఎలా వస్తుంది?.... ఏం చెయ్యాలో తోచటం లేదు శ్రీరాములుకు. ఆలోచిస్తున్నారు తండ్రీ కొడుకులు.

ఈ లోపల పండుగొచ్చింది. రేవంత్, హారతిలు సూళ్లూరుపేటకు వచ్చారు. అక్కడికి పిల్లలతో శోభ కూడా వచ్చింది.

"నువ్వేం సిటీలో ఉంటావు!నీ పిల్లలకు మంచి కాన్వెంట్ చదువు చెప్పిస్తావు!నాకేముంది?బురదలో పొర్లుతూ బతకటం....." కళ్ళనీళ్లు పెట్టుకుంది హారతి.

శోభకు చెల్లెలి బాధ అర్థం అయ్యింది.

"పోనీ మీ ఆయనను ఒప్పించి మీరు కూడా మద్రాసు వచ్చెయ్యండి!.. ఏదో ఒక పని చేసుకోవచ్చు!.. కానీ నువ్వు అనుకున్నట్లు సిటీలో అంత హాయిగా ఉండదు.. అక్కడ ఉండే ప్రాబ్లెమ్స్ అక్కడ ఉన్నాయి..మాకు కూడా కష్టాలు ఉంటాయి. అన్నిటికీ సర్దుకుపోతూ ఉండాలి. పలకరించే దిక్కు ఉండదు. ఉరుకుల పరుగుల బతుకులు...  హాయిగా మాత్రం ఉండదు... సంపాదించింది అంతా ఆవిరి అయిపోతుంది.. ఖర్చులెక్కువ..."

"నేను నీ కంటే స్థితిమంతురాలినైపోతానని నీకు ఏడుపు!.. మా ఆయనేం బావలాగా సంపాదించడులే అక్కా!!.."
అంది హారతి విసురుగా.

శోభ ఠక్కున నోరు మూసుకొంది.

మొత్తానికి తన మాట చెల్లించుకొని భర్తతో పాటు మద్రాసు చేరింది హారతి. అనంతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే 
"చూడు!వాళ్ళుచిన్న పిల్లలు!.కాస్త సరదాగా బ్రతకొద్దటే!మనలాగా మట్టిలో బతకమంటే ఎలాగా?.."

అంటూ ఓదార్చాడు శ్రీరాములు.

తండ్రి దగ్గర కొంత డబ్బు తీసికొని మద్రాసులో ఉండే చిన్న గల్లీలో కిరాణా షాపు పెట్టుకున్నాడు రేవంత్. మోహన్ కూడా రేవంత్ కు కొంత డబ్బు సర్దాడు. అయితే మోహన్ వాళ్లకు దగ్గరలో ఇల్లు దొరకలేదు రేవంత్ కు. కొంచెం దూరంలో ఐదారు వీధుల అవతల తక్కువ బాడుగతో చిన్న ఇల్లు దొరికింది. సరిగ్గా రెండు గదులు. అందులోనే చిన్న వంటగది. అక్కడే బాత్ రూం. తలుపు తెరిస్తే కామన్ వరండా. మొత్తం పది పోర్షన్లు. రోజూ పొద్దున ఆరింటికి ఒక గంట మాత్రమే నీళ్లు వస్తాయి. నీళ్లు అన్ని పోర్షన్ల వాళ్ళు పట్టి పెట్టుకోవాలి. ఒక్కోసారి అవికూడా రావు. ఎండాకాలం మూడు రోజుల కొకమారు నీళ్లు. ప్రతి దానికి డబ్బు పెట్టాలి. కిరాణా కొట్టు నడపటం రేవంత్ కు కష్టంగా ఉంటోంది. తెలియని వ్యాపారం.. షాపు అద్దె, టాక్స్లు, ఇంటి ఖర్చు పోను చేతిలో డబ్బులు మిగలటం కష్టమవుతోంది. మద్రాసులో ఎండలు విపరీతం. చెమట కారుతూ..... నీళ్ల కోసం కష్టం.. అలాగే రేవంత్, హారతి ఒక సంవత్సరం నెట్టుకొచ్చారు. పిల్లవాడు పుట్టాడు. సూళ్లూరుపేట నుండి ఐదో నెల బాబుతో వచ్చింది హారతి.

వచ్చిన నాలుగు రోజుల్లో వాన పట్టుకుంది. ఒక పూటలో భీకరంగా జడివానగా మారింది... బయటికి కదలటానికి లేదు. వరద నీళ్లు వరండా దాటి వచ్చేశాయి. అన్ని సామాన్లు నీళ్లల్లో తేలుతున్నాయి.పిల్లవాడిని పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది హారతి.

ఎప్పుడూ సూళ్లూరుపేటలో కానీ, దుగ్గవోలులో కానీ ఇలా వరద చూడలేదు.ఎంత పెద్ద వాన వచ్చినా ఒక గంటలో నేల పొడారిపోయేది. పిల్లవాడంటే తన దగ్గర పాలు తాగుతున్నాడు. ఇంకోరోజు వానపడితే తమ గతేమి కాను?... కరెంట్ లేదు. ఫోన్ చార్జిలేదు. చీకటి.. దోమలు.. కాలు క్రింద పెడదామంటే బురద. నీళ్లు ఇంకా లోపలికి వస్తున్నాయి. ఆ రాత్రి కాళరాత్రిలా గడిచింది.
రెండోరోజు వీధిలోకి చూసి భయపడింది హారతి. పడవల్లో తిరుగుతున్నారు అధికారులు...ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పంచుతుంటే రేవంత్ ఆ నీళ్లల్లోనే వెళ్లి రెండు వాటర్ బాటిళ్ళు తెచ్చాడు.. ఇంకా నీళ్లు వస్తుంటే అందరూ మేడమీదకెక్కి కూర్చున్నారు..
కడుపులో ఆకలి.... నీరసం.. పిల్లవాడికి కొంగు కప్పి కూర్చుంది హారతి.
వాన పడుతూనే ఉంది.. పిల్ల వాడి తల తడిసిపోతూ ఉంటే దుఃఖం పొంగుకొస్తోంది హారతికి. చంటిబిడ్డకు ఏమన్నా అయితే?... ఊహ భయంకరంగా ఉంది.
ఆమె మనసు దుగ్గవోలులో ఉంది.
"ఖర్మ ముసించి ఇక్కడికి వచ్చింది.. ఇక్కడ ఇంత నరకం ఉంటుందని తెలీదు. మంచిగా ఉన్న ఇల్లు వదిలేసి ఏదో బావుకుందామని వచ్చింది. ఇప్పుడు అనుకొని ఏం లాభం?.."
ప్రక్కనే ఉన్న రేవంత్ పిల్లవాడిని పొట్టలో దాచుకున్నట్లు పొదువుకుని కూర్చున్నాడు. సాయంత్రానికి వరద తీసింది..
ఇంటిలోకి వచ్చారు రేవంత్, హారతిలు.

మామూలు పరిస్థితులు రావటానికి వారం పట్టింది. ఆ వారం రోజులూ చంటిబిడ్డతో ఎలాగో బ్రతికారు భార్యాభర్తలిద్దరూ.

షాపు దగ్గరికి వెళ్ళాడు రేవంత్. షాపు మునిగిపోయింది. దాదాపు రెండులక్షల సరుకు నీటిపాలు.. ముఖం వెళ్ళాడేసుకొని ఇంటికి వచ్చాడు.ఇంటిలో తండ్రి కనిపించాడు.
"ఇప్పుడే వచ్చానురా!టి. వి. లో వరద పరిస్థితి చూస్తే మీ గురించి భయం వేసింది.... ఎలా ఉన్నారోనని...."శ్రీరాములు మాట ఇంకా పూర్తి కాలేదు.. తండ్రిని చుట్టుకొని భోరుమన్నాడు రేవంత్.
"అక్క ఇల్లు కాస్త మెరకలో ఉండబట్టి మునిగిపోలేదు. పైగా డాబాఇల్లు. అంత నష్టం లేదు. మా వీధే పూర్తిగా మునిగిపోయింది. పిల్లవాడితో ఇక్కడ ఉండటానికి భయం వేస్తోంది మామయ్యా!.."అంది హారతి. దుఃఖంతో ఆమె కంఠం వణుకుతోంది.

"పదమ్మా!ఊరికి పోదాము!అన్ని పరిస్థితులు చక్కబడితే మళ్ళీ రావచ్చు!"అన్నాడు శ్రీరాములు అనునయంగా.

"ఇక్కడికి ఇంకెప్పుడూ రాము మామయ్యా!.. ఇంత భయంకరంగా ఉంటుందని తెలీదు..."

"మీరు ఊరికి వెళ్ళండి!ఇక్కడ అన్నీ చక్కబెట్టుకొని సామాను తీసికొని ఒక వారంలో నేను వస్తాను."అన్నాడు రేవంత్.

ఆరోజు ఎలాగోలా రైల్వేస్టేషన్ కు చేరుకొన్నారు  మామా కోడళ్ళు.బిడ్డని ఎత్తుకొని  సీటులో జారగిలపడి కూర్చుంది హారతి. ఆమె మనసుకిప్పుడు నిశ్చింతగా ఉంది.రైలు నెల్లూరుకు బయలుదేరింది.

***

No comments:

Post a Comment

Pages