ఉత్సవ విగ్రహం - అచ్చంగా తెలుగు
ఉత్సవ విగ్రహం

కాశీ విశ్వనాథం పట్రాయుడు(బాల మిత్ర)
9494524445
 

ప్రతీ గ్రామంలో దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయం లో యంత్రం మీద ప్రతిష్టించబడిన విగ్రహం ఉంటుంది. అది మూల విరాట్. ఆ దేవుని విగ్రహం నిత్యం పూజలందుకుంటుంది. నమ్మిన వారి కోర్కెలు తీరుస్తుంది. ముఖ్యమైన పండుగలు, బ్రహ్మోత్సవాలు సమయం లో ఊరేగించడం కోసం పంచలోహ విగ్రహాలను తయారు చేయించి ఉంచుతారు వాటినే ఉత్సవ విగ్రహాలు అంటారు. ఉత్సవ విగ్రహమనే మాటకు ఉత్స విగ్రహం అనేది వాడుకలో నిలిచిన రూపాంతరం.  పండగలూ పబ్బాలూ వచ్చినప్పుడు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలు జరిపేటప్పుడు మూల విరాట్ ను కదిలించగూడదు కాబట్టి దానికి బదులుగా చిన్న విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ సమయంలో ఊరేగే విగ్రహం కాబట్టి ఉత్సవ విగ్రహం అంటారు.  పూజలూ మహిమలూ సమస్తం మూలదైవానికే గాబట్టి ఉత్సవవిగ్రహాలు ఊరేగటానికి మాత్రమే పనికి వస్తాయన్న భావంతో  ఏ శక్తి లేనివారిని, స్వతంత్రంగా వ్యవహరించ లేనివారిని వగైరా అర్థాల్లో ఉత్సవిగ్రహమనే మాట వాడుకలోకి వచ్చింది. దాని వెనుక ఒక కథ కూడా ఉంది. 

చంద్ర గిరి రాజ్యాన్ని  కీర్తి వర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడు భోగలాలసుడు.
నిరంతరం విలాసాల్లో మునిగి తెలేవాడు.  ప్రజల సమస్యలను పట్టించుకునే వాడు కాదు. కేవలం రాజసభలో ఒక గంట పాటు కనిపించి రాజమందిరానికి వెళ్ళిపోయేవాడు. పరిపాలనా సౌలభ్యం కోసం ఎక్కువమంది సలహాదారులను, మంత్రులను నియమించుకున్నాడు. పరిపాలనా వ్యవహారాలన్నీ వారే చూసుకునేవారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం,  ప్రజల సమస్యలను పరిష్కరించడం కాకుండా వారి వ్యక్తిగత ప్రయోజనాలే చూసుకునేవారు. ప్రజలు రాజుతో చెప్పుకుందామంటే రాజు అందుబాటులో ఉండేవాడు కాదు. మంత్రులు, సలహాదారులు వారికి నచ్చినవారి సమస్యలు మాత్రమే పరిష్కరించేవారు.

రాజు ఏ విషయాన్ని పట్టించుకునే వాడు కాదు. పేరుకు మాత్రమే రాజు. ఒక రకంగా చెప్పాలంటే సలహాదారులు మకుటం లేని మహారాజులయ్యారు.. ఏ విషయంలో నైనా రాజు కలగజేసుకోబోతే మంత్రులు రాజుగారికి  మరిన్ని విలాసాలు సమకూర్చి, “ఆ సమస్య మేం చూసుకుంటాం మహారాజా… తమరు విశ్రమించండి.” అనేవారు. అలా “మంత్రుల చేతిలో రాజు కీలుబొమ్మ అయ్యాడు”. రాజు మూల విరాట్టు అయినప్పటికీ ఉత్సవిగ్రహంలా మిగిలి పోయాడు. నాటి నుంచి ఉత్సవ విగ్రహం అనే జాతీయం వాడుకలోకి వచ్చింది.

***

No comments:

Post a Comment

Pages