యయాతి - అచ్చంగా తెలుగు

 యయాతి

అంబడిపూడి శ్యామసుందర రావు 



యయాతి చరిత్ర భాగవత పురాణం లోని   18 వ, 19 వ 
అధ్యాయముల లోని  9 వ కాండములో వస్తుంది. యయాతి చంద్రవంశానికి చెందిన  రాజు.  యాదవ ,పాండవ వంశాలకు మూలపురుషుడు కొన్ని కథనాల ప్రకారము ఆయన నహుషుడు, శివపార్వతుల కుమార్తె అయిన  అశోక సుందరుల కుమారుడు ఇంకొక కథనం  ప్రకారం యయాతి  విరజ  కుమారుడు . యయాతికి యతి, సంయతి, ఆయతి ,వియతి మరియు కృతి అనే ఐదుగురు సోదరులు ఉన్నారు యయాతి తండ్రి మునుల శాపం వల్ల కొండచిలువ గా మారినప్పుడు యయాతి అన్న యతికి రాజ్యభారము అప్పజెప్పినప్పినప్పుడు యతి తిరస్కరించి సన్యాసి అవుతాడు అప్పుడు యయాతి రాజై తన నలుగురు సోదరులను నాలుగు దిక్కులా తన  ప్రతినిధులుగా నియమించి రాజ్య పాలన చేస్తుంటాడు వృషపర్వుడనే వాడు దానవులకు రాజు. ఆయన కుమార్తె శర్మిష్ఠశుక్రాచార్యుని  కూతురు దేవయాని శుక్రాచార్యుడు రాక్షసులల  గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్లగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్తులను మార్చి వేస్తాడు. ముందుగా స్నానం ముగించుకుని వచ్చిన శర్మిష్ట జరిగిన సంగతి తెలియక దేవయాని దుస్తులను ధరిస్తుంది. దాన్ని చూసిన దేవయాని కోపోద్రిక్తురాలవుతుంది. మా తండ్రి మీ తండ్రికి గురువు కనుక, నీవు నాకంటే తక్కువ స్థాయి గల దానివి. నా బట్టలు ఎలా ధరిస్తావు? అని ప్రశ్నించింది. అది విన్న శర్మిష్ట కూడా అంతే కోపంతో నా తండ్రి ఈ రాజ్యానికి ప్రభువు. నీ తండ్రే నా తండ్రి కింద పని చేస్తున్నాడు కాబట్టి నువ్వే నా కన్నా తక్కువ స్థాయిలో ఉన్నావంటుంది. అలా జరిగిన జగడం లో శర్మిష్ట దేవయానిని ఒక బావిలో పడదోసి వెళ్ళి పోతుంది.

వేట ముగించుకుని వస్తున్న యయాతి బావిలో పడిన దేవయానిని రక్షిస్తాడు కానీ దేవయాని నగరానికి వెళ్లకుండా  తన సేవకురాలు ద్వారా తండ్రికి తనకు జరిగిన పరాభవాన్ని తెలియజేస్తుంది  ఆగ్రహించిన శుక్రాచార్యుని శాంతింపజేయటానికి తన కూతురు శర్మిష్ఠ తో పాటు దేవయానికి పరిచర్యలు చేయడానికి వేయిమంది దాసీలను పంపిస్తాడు ఆ తర్వాత దేవయాని యయాతి ప్రేమలో పడి  యయాతిని  వివాహమాడతానని తండ్రితో చెప్పి ఒప్పించి వివాహమాడింది. దేవయానితో పాటు  దాసిగా శర్మిష్ఠ కూడా యయాతి రాజ్యానికి వెళుతుంది శుక్రాచార్యుడు ఎటువంటి పరిస్థితుల్లో శర్మిష్ఠ తో ఏ రకమైన సంబంధం పెట్టుకోకూడదు అని  హెచ్చరిస్తాడు. కానీ యయాతి శర్మిష్ఠ బలవంతం మీద ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు రాజుగా అది తప్పు కాదని శర్మిష్ట యయాతిని  ఒప్పిస్తుంది. దేవయాని  యయాతి వలన యదు మరియు తుర్వసు అనే ఇద్దరు  కుమారులను కంటుంది యదు యాదవ వంశానికి మూల పురుషుడవుతాడు  అలాగే తుర్వసు వారసులు యవన రాజ్యాన్ని స్థాపిస్తారు. అలాగే శర్మిష్ట యయాతి వలన ద్రుహ్యు ,అనుద్రుహ్యు ,పురు అనే ముగ్గురు కుమారులను కంటుంది.వీరిలో పురు కురు వంశానికి మూల పురుషుడవుతాడు.   

కాలక్రమములో దేవయానికి తన భర్త యయాతికి శర్మిష్ఠ ఉన్న సంబంధం తెలిసి తన తండ్రికి తెలియజేస్తుంది  ఉగ్రుడైన శుక్రాచార్యుడు తన కూతురును మోసం చేసినందుకు వృద్దుడివి కమ్మని శపిస్తాడు శాంతించిన శుక్రాచార్యుడు యయాతి కుమారులలో ఎవరైనా వృద్ధాప్యాన్ని తీసుకుంటే యయాతి కి తిరిగి యవ్వనం వస్తుంది అని శాప విమోచనం చెపుతాడు. యయాతి  కుమారులకు ఈ విషయం చెబితే ఎవరు వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు కానీ శర్మిష్ట చిన్న కొడుకు పురు తన తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకొని తన యవ్వనాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. యయాతి తన చిన్న కుమారుని త్యాగానికి సంతోషపడి పురు ను తన వారసునిగా ప్రకటిస్తాడు.యవ్వనాన్ని తిరిగి పొందిన యయాతి ప్రాపంచిక సుఖాలను వెయ్యేళ్ళు అనుభవిస్తాడు. పుత్రుడి యౌవనం కొంత కాలం గ్రహించి ,తానుగా చేయవలసిన పుణ్య క్రతువులు పూర్తి చేసి , తిరిగి పుత్రుడికి యౌవనం ఇచ్చి వేస్తాడు.పురువు కు తన మాట విని , ధర్మమార్గాన నడిచిన వాడికి తన చిన్న కొడుకుకు పరంపరాగతంగా నాగరిక రాజ్యాలపై అధికారమూ, చక్రవర్తిత్వము ఇస్తాడు ; తక్కిన కొడుకులకు సమీప రాజ్యాలు వారి యోగ్యతను బట్టి ఇచ్చి, తపస్సుకు వెళ్లిపోతాడు యయాతి  భరత చక్రవర్తికి పూర్వీకుడు వంశకర్త అయినవాడు యయాతి. అనితర సాధ్యమైన ఘోరతపస్సు చేసి బ్రహ్మలోక నివాసం చేసిన ఘనుడీయన. దౌహితృడు పుణ్య విశేషం చేత నష్టమైన పుణ్య లోకాలు తిరిగి పొందిన చరిత్ర ఈయనది.  ఆది పర్వం తృతీయాశ్వాసం చివర ఈ యయాతి ఉపాఖ్యానం ఉంది 

యయాతి తపస్సుకు వెళ్లబోయే ముందు కొడుకు పురువుకు చేసిన హితబోధ అమోఘమైనది ఆదర్శప్రాయమైనది. అవి  నీతులలో గొప్పవిగా సర్వ జనులకు అనుసరణీయంగా నిల్చిపోయినవి అవి : పాత్రత ఎరిగి దానం చేయాలి. ఒకరిని వేడుకోగూడదు .అది రాజధర్మ విరుద్ధం. [రాజు ఇచ్చేవాడే. ఊరక తీసుకునే వాడు కాదు] ఎదురుగా వచ్చి 'దేహి ' అని ఆశ్రయించిన సర్వ జీవుల ఆశలు రాజులు నెరవేర్చాలి. ఎపుడూ సజ్జనులతో గోష్ఠి చేస్తూ, ఆదర్శప్రాయమైన జీవితాలు గడపిన పుణ్యాత్ముల జీవితం ఎట్లా గడిచిందో గోష్ఠి ద్వారా ధర్మం ఏది? అని కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ధర్మం విషయంలో ఏమరక ఉండి , సమయోచితంగా నిత్య వ్యవహారంలో అనువర్తించు కోవాలి. రాజు సభలో ఎలా ఉండాలో చెప్తుతాడు. మితంగా, ప్రియంగా, ధర్మ విరుద్ధం కాకుండా , వ్యర్థ వాక్యాలు లేకుండా సభ రంజకంగా మాట్లాడాలి. మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు.. మర్మభేదకమైన మాటలతో ఎదుటివాళ్ళను నొప్పించే వాళ్లను వాళ్లు మహావీరులైనా సరే.. దరిచేరనీయవద్దు. దయ, ఆర్జవము( సూటిగా మాట్లాడటం ) , సత్యం, శమము,. శౌచము ఎపుడూ మనసును వీడగూడనివి. అరిషడ్వర్గ జయం సాధించిన వాణ్ణి బాహ్య శత్రువులేమీ చేయలేరు.ఈ సాధు మార్గం కొడుకుకు ఉపదేశించాడు. కొడుకు  సజ్జనుడు..తప్పక అనుసరిస్తాడు అని నమ్మిక కలిగింది.

తపోవనాలలో వానప్రస్థ విధి చక్కగా పాటించాడు. దేవతలను, పితృ దేవతలను హవ్య కవ్యములతో సంతృప్తులను చేశాడు. శిలోంఛవృత్తి అనుసరించి కందమూలాలతో జీవిస్తూ ఒక 1000 సంవత్సరాలు గడిపాడు. సర్వసంగాలూ విడిచి 30 సంవత్సరాలు నిరాహారిగా తపస్సు చేశాడు . కేవలం వాయు భక్షణతో  ఒక సంవత్సరం గడిపాడు .ఒక ఏడు పంచాగ్ని మధ్య లో , ఒక ఏడు ఒంటి కాలి మీద నిలిచి జల మధ్యంలో తపస్సు చేశాడు. దివ్య విమానంలో దేవలోకం చేరాడు. దేవర్షుల పూజలందుకున్నాడు. బ్రహ్మలోకం చేరి బ్రహ్మర్షుల పూజలందుకున్నాడు.

అనేక కల్పాలు గడిచాక దేవేంద్రుడు పరీక్ష పెట్టే సమయం వచ్చింది. "ఇంత కాలం అన్ని భోగాలు అనుభవించావు 'నీ తపస్సు చాలా గొప్పది కదా? "అని దేవేంద్రుడు అంటే "ఔను దేవేంద్ర దేవ దానవ యక్ష సిద్ధ గంధర్వ మునివర్యుల  తపస్సులు  నా తపస్సుకు సాటి రావు "అని యయాతి సమాధానం ఇచ్చాడు. నీవు తపోభిమానముతో మహర్షులనే అవమానించావు కాబట్టి నీవు మనుష్య లోకం చేరవలసి ఉంది" అని దేవేంద్రుడు అంటే "నేను భూలోకంలో ఉండలేను నన్ను అంతరిక్షంలోనే సద్భువన లోకములోని నిలుపు గర్వం ఎంతటివారికైనా పతన హేతువు అవుతుంది "అని యయాతి దేవేంద్రుని ఎదుట తన తప్పును ఒప్పుకుంటాడు యయాతి దౌహితృలైన అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, శిబి  లను  సద్భువన లోకంలో కలిసి వారి పూజలందుకొని వారి  అనేక ధర్మ సందేహాలను  , శాస్త్ర రహస్యాలను యయాతి ఆ సందేహాలన్నీ తీర్చాడు. వేదోక్త ధర్మ మార్గంలో నడవడం పుణ్య లోక ప్రాప్తి కారణం. లోక గర్హిత కార్యాలు చేయడం పతన హేతువు. అనేక శాస్త్రవిషయాలు సృష్టి లక్షణం, ఊర్ధ్వ లోకాలు, ఆ ప్రాప్తి ఎవరెవరికి ? మొదలైన అనేక విషయాలు వారికి చెప్పాడు యయాతి మాకు పుణ్య లోకములున్నవా? అని అడిగారు ఆ మనవళ్ళు. ఇప్పటి వరకు తామెవరో చెప్పలేదు. చివరకు మేము మీ మనవళ్లం అని చెప్పారు వారు . వాళ్లు యయాతికి పుణ్య లోకాలిచ్చారు. అందరూ ఊర్ధ్వ లోకాలు చేరారు. మనిషి ఇష్టభోగాలు ధర్మ బద్ధంగా అనుభవించి తపస్సుతో కల్మషాలను ప్రక్షాళన చేసుకొని, అత్యుత్తమమైన బ్రహ్మలోకం లోని, స్వర్గాది లోకాలలోనూ చేసిన పుణ్యాల ఫలితం అనుభవించి,, భూలోకానికి  యయాతి తిరుగు ప్రయాణం చేస్తాడు. ఇదండీ యయాతి చరిత్ర.

***  


No comments:

Post a Comment

Pages