అరిటాకుకు శిక్ష - అచ్చంగా తెలుగు

అరిటాకుకు శిక్ష

Share This
అరిటాకుకు శిక్ష

ఎం బిందుమాధవి 




వేసవి సెలవలకి పిల్లలొస్తారంటే .. పార్వతికి ఎక్కడ లేని హడావుడి. పని ఒత్తిడి. అదివరకల్లా ఒంటి చేత్తో అన్నీ చేసిన మనిషే! 


సాధారణంగా ఎవరింట్లోనైనా..నాలుగైదేళ్ళకి ఒక సారి కానీ రాని అమెరికా పిల్లలు..పార్వతి అదృష్టం..ప్రతి సంవత్సరం తమతో పాటు, సందడిని, ఆనందాన్ని మోసుకొచ్చి... నెల రోజులుండి పగలు, రాత్రి వెన్నెలలు పూయించేస్తారు. 

 

రాను రాను ఓపిక తగ్గుతున్నది. ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులొకటి ఇబ్బంది పెడుతున్నాయి. 


ఇంతకు ముందు..చాలా కాలంగా ఇంట్లో అన్ని పనులు ఒంటి చేత్తో చక్కబెట్టే రాములమ్మ..వృద్ధాప్యం వల్ల ఇటీవలే రావటం మానేసింది. 


పార్వతికి చెయ్యి విరిగినట్టుంది. 


అందుకే ఉదయం నించి సాయంత్రం వరకు, సాయం కోసం ఒక మనిషిని పెట్టుకోవాలనుకుంటున్నది పార్వతి.


పిల్లలు రావటానికి నెల రోజుల ముందు నించీ.. అలాంటి మనిషి కోసం పార్వతి అన్వేషణ మొదలు పెట్టింది. ఎట్టకేలకు ఈ మధ్యనే నీలమ్మ పరిచయమయింది. 


చాలా కాలం నమ్మిన బంటు లాంటి పనమ్మాయి ఉన్న పార్వతికి... పనమ్మాయి వెనకాలే ఇల్లంతా తిరుగుతూ పహరా కాసే అలవాటు లేదు. 


కొత్త వారిని ఇంట్లోకి రానివ్వాలంటే భయం. . ఈ నేపధ్యంలో వచ్చిన నీలమ్మని నమ్మి పనిలో పెట్టుకోవచ్చా..అని సందేహపడుతున్న పార్వతికి నీలమ్మ మాట, నవ్వు ముఖం ఆ సందేహం కొంత తీర్చాయి. 


నీలమ్మది... రంగు నలుపే కానీ కళ గల ముఖం. చక్కని మాట తీరు..వస్త్ర ధారణ.. పార్వతికి ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి. 


ఇంక ఎక్కువ ఆలోచించకుండా మరునాటి నించి పనిలోకి రమ్మంది. "ఉదయం ఎనిమిదింటికల్లా వచ్చేసెయ్యి. ఫలానా పని అని నేను చెప్పను. అన్ని పనులు చెయ్యాలి. బరువు పనులు చెయ్యటానికి వేరే మనిషి ఉన్నది. వంతులేసుకుని మీరిద్దరూ తగువు పడకుండా సర్దుకుపొండి" అన్నది. 


***


"అమ్మమ్మా నాకు పూరీ-కూర" బంటి ఫర్మాయిషీ!


"మరి నీకేం కావాలి" అని అమ్ముమ్మ  అడగటం ఆలస్యం.."నాకు వైట్ ఉప్మా..కారం లేకుండా" కార్టూన్ చూసే శశి నించి జవాబు...టీవీ నించి తల తిప్పకుండానే! 


"మరి నీకేం కావాలి శ్రీకర్" అన్న నానమ్మ ప్రశ్నకి "ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎలా చేస్తావ్ నానమ్మా..వాళ్ళిదరితో పాటు ఏది అయినా ఫరవాలేదు" అని శ్రీకర్ సమాధానం.. పెద్దమనిషి తరహాగా. 


"అమ్మా నువ్వు అడుగుతున్న కొద్దీ వాళ్ళు ఇలాగే చెబుతారు. మనిషికొకటి ఎలా చేస్తావ్? ఇవ్వాళ్ళ అందరూ పూరీ కూర తినండి. రేపు ఉప్మా-పెసరట్టు" అని నిర్ణయించేసింది..కూతురు శిరీష. 


పిల్లలు నలుగురూ వస్తే..నాలుగు రకాలూ చేస్తూ..వాళ్ళతో ఆడుకోవటం..అరవై దాటాక..కొంచెం కష్టమే అయినా పార్వతి వాళ్ళతో కబుర్లు చెబుతూ..వారిని నవ్విస్తూ రోజువారీ పని లాగించేస్తుంటుంది.

పార్వతమ్మ మనవలతో బ్రేక్ ఫాస్ట్ అనబడే 'అష్టావధానం' చేస్తూ ఉండగా రోజూ లాగానే నీలమ్మ వచ్చింది. 


స్టవ్ దగ్గర బిజీగా ఉన్న పార్వతమ్మ అది గమనించ లేదు. 


"నీలమ్మా ఇలా వచ్చి పూరీలు వత్తి ఇవ్వు. పిల్లలకి ఆకళ్ళేస్తున్నాయి. ఒక్క దానికి పని తెమలదు" అని ఓ కేక వేసి..ఆలూ కూర చేసే పనిలో పడింది. 


రెండు-మూడు సార్లు పిలిచినా నీలమ్మ ఉలుకూ-పలుకూ లేదు. 

ఎందుకో కానీ నీలమ్మ ముఖం వాడిపోయి దిగులుగా ఉన్నది. 


"పిల్లలూ....నీలమ్మ వచ్చినట్టు లేదు. మీలో నాకు సహాయం ఎవరు చేస్తారో వాళ్ళతో రాత్రి 'అష్ట చెమ్మా' ఆడతాను..  రాత్రి పడుకున్నప్పుడు ఒక కథ  ఎక్కువ చెబుతాను" అన్నది. 


"నీలమ్మ వచ్చింది నానమ్మా..బాల్కనీలో ఉంది" అన్నాడు శ్రీకర్. 

"ఏం నీలీ.. ఆకలేస్తోందా? ఉదయం ఏమైనా తిన్నావా? పిల్లలు తిన్నాక నీకు పెడతాను" ముద్దొచ్చినప్పుడు, జాలేసినప్పుడు పూర్తి పేరుతో కాకుండా... అలా పిలుస్తుంది పార్వతమ్మ! 


"లేక మీ ఇంట్లో గొడవయిందా? నువ్వూ మీ ఆయనా పోట్లాడుకున్నారా?"


"ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉండేవే? ఎప్పుడూ నవ్వుతూ..తుళ్ళుతూ..చనువుగా జోకులేస్తూ ఉండే నువ్వు ఇలా దిగులుగా ఉండటం ఈ నెల రోజుల్లో  ఎప్పుడూ చూడలేదు. ఏమయింది?

ముందు ఈ టీ తాగు." అన్నది. 


పార్వతి మాటలతో గాలి తగిలిన మేఘం లాగా వర్షించటం మొదలుపెట్టింది..నీలమ్మ. 


"మా ఆయన లేడమ్మ. ఇంట్లో నేనూ..పిల్లలే ఉంటాం" అన్నది కళ్ళు తుడుచుకుంటూ. 


"లేడంటే....? చక్కగా ముత్తైదువు లాగా రెండు చేతుల నిండా గాజులు, పాపిటలో సిందూరం పెట్టుకుని నిండుగా తయారవుతావు కదా....!" అన్నది సందేహంతో! 


"లేడంటే..నాతో లేడు" అన్నది. 


"అదంతా ఒక పెద్ద కథ. తరువాత చెబుతాలే అమ్మా. నా గొడవ ఎప్పుడూ ఉండేదే! అన్నది టీ తాగుతూ..తన సహజ ధోరణిలో నవ్వి! 


పార్వతమ్మ కూడా.."ఆ మాట నిజమేలే.. మనకి మాట్లాడుకునే తీరుబాటు ఇప్పుడు లేదు. డబ్బేమైనా కావాలంటే మొహమాట పడకుండా పట్టుకెళ్ళు" అని పనిలో పడింది. 


@@@@


నెల రోజుల తరువాత పిల్లలు వెళ్ళగానే.. తుఫాను వెలిసి.. ఇల్లు స్తబ్ధంగా తయారయింది. 


పార్వతమ్మకి ఊపిరి తీసుకునే సమయం దొరికింది. 


"ఆ:( ఇప్పుడు చెప్పు..ఏంటి నీ సంసారం గొడవ" అని అడిగింది. 


"ఏముంటదమ్మా...అందరి ఇళ్ళల్లో లాగానే! మనిషి చూట్టానికి బానే ఉంటాడు. పనికి పోతాడు. ఈడు జోడు సరిపోతుందని మా అమ్మ అయ్య వానితోని పెళ్ళి జేశారు. రెండు సంవత్సరాలు మంచిగనె ఉన్నాడు. అప్పట్లో  నేను పనికి పోయే దాన్ని కాదు. ఆయన దోస్తులతో తిరుగుతూ ఒక రోజు తాగి వచ్చాడు. నా పెద్ద కూతురు ఏడాది పిల్ల. నేను వండింది బాగాలేదని..కంచం విసిరేసి వెళ్ళిపోయాడు."


"నాకు బయమేసి మా అమ్మ తానికి బోయి అమ్మకి, అయ్యకి జెప్పిన. ఈ రోజుల్లో తాగనోడు ఎవడు? ఊకె బయపడద్దు" అని నన్ను మా ఇంటికి పంపేసిన్రు. 


"నెల రోజులు మంచిగనె ఉన్నడు. రెండో బిడ్డ కడుపున పడింది. ఒక రోజు ఎవతెనో ఎంటబెట్టుకొచ్చిండు." 'ఇదేందయ్యా అన్న.'


"ఎప్పుడు జూడు...వాంతులంటవ్, నీరసం అంటవ్. ఒక రోజు కూర వండితే ఒక రోజు కారమేసి పెడతవ్. నీతోని తిండి సుకం లేదు... పక్క సుకం లేదు. అందుకే ఈమెని తెచ్చుకున్న" అన్నడు. 


"మా అత్తమ్మతోని జెప్పిన. 'మగాడు పది మందితో తిరుగుతడు. ఆడది గమ్మున ఇంట్ల కూసోవాలె. సతాయించినవంటే నిన్ను, నీ పిల్లల్ని వదిలేసి పోతడు. ఆనికేం మగ మహారాజు' అని భర్త లేని ఆమె..తీర్పు చెప్పబట్టింది"


"ఆడదానికి ఆడదె శత్రువు అని ఎందుకంటరొ తెలిసింది" అన్నది నీలమ్మ మొహమంతా చిన్నబుచ్చుకుని. 


"ఆ:( ..తర్వాత ఏమయింది" అన్నది పార్వతమ్మ. 


"ఏముందమ్మా..ఇట్లె పది రోజులు మంచిగుంటడు. ప్రేమగ మాట్లాడతడు. బతిమాలుతడు. మళ్ళీ షురు..తాగుడు..నన్ను కొట్టుడు..ఒక్కోసారి పిల్లల మీద కూడా సెయ్యి లేపుతడు. ఒక్క పైస తెచ్చి ఇంట్ల ఇయ్యడు. ఇంగ పిల్లలని, అత్తమ్మని పోసించె బాధ్యత నేనే జూసుకుంటున్న."


"ఒక రోజు మస్తుగ తాగొచ్చి..రాత్రి పూట సిగ్గు లేకుండ.. నా పిల్ల మీద..అదే...అదే.. "అని నసగటం మొదలు పెట్టింది. 


"ఓరిని..అంత పని చేశాడా" అన్నది పార్వతి ముక్కు మీద వేలేసుకుని.


"అంతె.. నాకు కోపం, ఆవేసం వచ్చి కట్టె తీస్కొని నెత్తి మీద ఒక్కటేసిన. నెత్తి పగిలి నెత్తురొచ్చింది. మా అత్త అదే కట్టె తీస్కొని నన్ను కొట్టింది. అప్పుడు నా మూడో కూతురికి ఏడాది వయసు. ఆ రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని మా అమ్మ తానికి పోయిన. నాదె తప్పు అన్నట్టు మా అమ్మ..నాన్న నన్ను లోనికి రానియ్యలె" 


"ఇంక నీకు పెళ్ళి గాని చెల్లెళ్ళు ఉన్నరు.నిన్ను లోనికి రానిస్తె వాల్ల బతుకులు ఆగమయితయ్. ఇంతమందిని మేం పోసించలెం" అని తలుపులు ఏసేసిన్రు. 


"ఇంగ పిల్లలతో సహా...తెల్లందాక ఏడుస్తు అక్కడ్నే బయట కూసున్న. నేను పని జేసే తాన.. అమ్మ, అయ్య చాలా మంచోల్లు. తెల్లారి అక్కడికి బోయి మొత్తం జెప్పిన. ఆల్లు వాల్ల తెలిసినోల్ల ఇంట్ల ఔట్ హౌస్ లో ఉండుమని దారి చూపించారు." అన్నది నీలమ్మ ఊపిరి తీసుకుంటూ. 


"సరే ఇవన్నీ జరిగి ఎన్నాళ్ళయింది? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? నీ పిల్లలకి ఇప్పుడు ఎంత వయసు?" అన్నది పార్వతమ్మ తినటానికి దోశ పెడుతూ. 


"ఇది జరిగి ఐదేళ్ళవుతున్నది. ఇప్పుడు నాకు ముగ్గురు ఆడ పిల్లలు. చివరామెకు ఆరేళ్ళు. నేన్ పని జేసే ఇంట్ల అయ్య...నా మీద జాలితోని.. దిక్కులేని ఆడవాళ్ళు ఏమైతరు. ఎక్కడ బోతరు అని డబ్బు అప్పిచ్చి నా చేత ఇల్లు గొనిపించిన్రు. వాల్లింట్ల పని జేస్తూ కొంచెం కొంచెం అప్పు దీరుస్తున్న. ఇంతలో అంతకు ముందు నేను ఉన్న ఔట్ హౌస్ అమ్మ కి అల్జీమర్స్ రోగమొచ్చి అన్ని మంచంలనె జేస్తుంటే..నన్ను ఆమెకి సేవ జెయ్యమన్నరు. అట్ల జేసినందుకు ఎక్కువ జీతమిచ్చిరి. అట్ల ఇంక ఎక్కువ అప్పు దీరుస్తూ పిల్లలని పెంచుకుంటున్న అమ్మా" అన్నది. 


"మరి ఇప్పుడేమయింది? ఎందుకు ఏడ్చావు?" అన్నది పార్వతమ్మ. 


"ఇస్కూల్ల పిల్లలందరు ఒక చోట జేరి..'శ్రావనికి నాన్న లేడు. శ్రావని అంటె నా రెండో బిడ్డ. ఆల్లమ్మ ఎవరినో ఉంచుకుందంట. అందుకె ఆల్ల అయ్య ఈమెని వదిలేసిండంట' అన్నరంట. అందుకే అది నేను స్కూల్ కి బోను అని ఒకటే లొల్లి జెయ్యబట్టింది."


"మొన్న ...పిల్లలని స్కూల్ కి పంపి నేను పనికి వచ్చిన. తోటి పోరగాల్ల మాటలతో అది ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. మా బతుకంత తెలిసిన పక్కింటామె..పిల్లకి నాలుగు మంచి మాటలు జెప్పే బదులు.. 'అవ్వే...మీ అమ్మ మంచిది కాదు. ఎవరితోనో తిరగ బట్టింది. ఒకాయనతొ పోగ నేన్ గుడ జూసిన. లేకుంటే ముగ్గురు ఆడవిల్లలున్న ఆమెకి భర్తని వదిలెయ్యనీకి ఎంత ధైర్యం. ఒంటరిగ పిల్లల్ని పెంచుడంటే మాటల? ఎవ్వరు పైసలు ఇయ్యకుంటె.. ఆల్లని పోసించనీకి డబ్బెక్కడి నించి వస్తున్నది? ఈ రోజులల్ల..ఆమె ఒక్కదాని సంపాదనే సరిపోతుందా 'నిప్పు లేందే పొగ రాదు' " అన్నదంట. 


"'అమ్మా మా నాయనెక్కడ? అందరూ నీ గురించి..నువ్వు ఏడేడనొ తిరుగుతవ్.. ఎవరితోనో ఆటోల కనిపిస్తవ్' అని, 'అట్ల తిరగద్దన్నడని మా నాయన మీద కేసు పెట్టినవని చెబుతున్నరు' అని అడగబట్టింది."


"గంత చిన్న పిల్లకి చెబితె మాత్రం అర్ధమయితదా? సొంత తండ్రి..తన అక్కతోని తప్పుగా జేస్తున్నాడు అంటే ఏం తెలుస్తది? ఎట్ల జెప్పాలె అర్ధమయితలేదు" అన్నది నీలమ్మ కళ్ళు తుడుచుకుంటూ. 


"అతని మీద పోలీసు కేసు కూడా పెట్టావా. పోలీసులు నీలాంటి వాళ్ళ జీవితాలతో ఇంకొకరకంగా ఆడుకుంటారు" అన్నది పార్వతమ్మ. 


"నేను పనికి బోయినప్పుడు మా ఆయన ఇంట్లకొచ్చి..మా ఇంటి కాయితాలు..అదే ఆ అయ్య అప్పిచ్చి కొనిపిచ్చిన ఇల్లు... తీస్కబోయి అప్పు దెచ్చి గా ముండలకి పెట్టిండు. తాగి తందనాలాడిండు. ఒక తెలిసిన పోలీసాయన ఉంటే ఆయన్ని తీస్కపోయి కల్లు పాకలోను, గా ఉంచుకున్నామె ఇంట్లను చూపించి కేసు పెట్టిన. ఆ కేసు ఇంకా నడుస్తున్నది. పెద్ద పిల్లలకి ఆల్ల నాయన గురించి కొంత తెలుసు. గీ చిన్నామెకి ఇంక తెలిసె వయసు రాలేదు. స్కూల్లో ఎవరైనా ఏమన్న అంటే రోజూ ఇంటికొచ్చి..'అందరు నన్ను జూసి నవ్వుతున్నరు. అందరి నాయనలు స్కూల్ కి వస్తరు. మా నాయన రాడు. అందుకే నేను స్కూల్ కి బోను' అని ఏడ్పు" అని దీర్ఘంగా నిట్టుర్చింది. 


"నే పనికొచ్చినప్పుడు బస్తిల వాళ్ళంతా పిల్లల మనసు పాడు జేస్తున్నరు అని నే కొట్లాడితే..అందరు కలిసి నా మీద కి ఉరికొస్తున్నరు. అందులో కొందరు మగాళ్ళైతే..వాల్ల ఆడవాల్లకి నా గురించి అవి ఇవి జెప్పి నాతొ మాట్లాడకుండ జేస్తున్రు. ఆల్లు గుడ నాతో జేరి చెడిపోతరంట. నేను ఒంటరిగ వస్తుంటే ఎక్కువ తక్కువ మాట్లాడుడు..ఒక్క రాత్రికి నాతానకొస్తె నీ పిల్లల బాధ్యత అంత నేనె జూస్తా అంటూ వెకిలి నవ్వులు, వెకిలి మాటలు మాట్లాడతరు. ఇప్పుడు చెడింది..చెడుపుతున్నది ఎవరమ్మా?" 


"ఇవన్ని పిల్లలకి ఏమని జెప్పాలె. చెబితే అర్ధమయితదా? ఒంటరిగున్న ఆడవాల్లని ఈ లోకం మర్యాదగ బతకనియ్యదమ్మా" అన్నది నీలమ్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ. 


"ఆడ వాళ్ళ బతుకులింతే! 'ముందు నుయ్యి..వెనక గొయ్యి'..పెళ్ళిళ్ళు చేసుకోక తప్పదు."


"ఆడ పిల్లకి పెళ్ళి వయసు వచ్చిందంటే నలుగురి కళ్ళు వాళ్ళమీదే ఉంటాయి. ఎవడో ఒకడి చేత మూడు ముళ్ళు వేయించేస్తే తమ బాధ్యత తీరిందనుకుంటారు తల్లిదండ్రులు! చేసుకున్నవాడు సరైన వాడు కాకపోతే ఇక దాని తిప్పలు భగవంతుడు తీర్చాల్సిందే" అని పార్వతమ్మ అంటూండగా.. 


వీళ్ళ మాటలు నిజమే అన్నట్టు త్రిశూలం సినిమాలోని ..'నేనేంటి..నాకింతటి విలువేంటి.. నీ అంతటి మనిషితో పెళ్ళేంటి? నీకేంటి..నువ్వు చేసిన తప్పేంటి.. ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి" అనే పాట ఎఫ్ ఎం రేడియోలో వినిపిస్తోంది. 


"ఇప్పుడు ఇంకా నయం నీలీ! ఆడవారికి సహాయం చెయ్యటానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి. పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ సంస్థలు నిలదీసి అడుగుతున్నాయి. అయినా కష్టపడుతున్న ఆడవాళ్ళు తక్కువేం లేరు. అందరి జీవితాలు ఈ తాగుడుతో అతలా కుతలం అవుతున్నాయి."


"అన్నీ తెలిసిన తల్లిదండ్రులు కూడా..సమస్యలో ఉన్న తమ కూతురికి సహాయం చెయ్యటానికి ముందుకు రాలేకపోతున్నారు. పేదరికం, చదువుకోక పోవటం వారిని సరైన దిక్కు నడిపించలేకపోతున్నాయి". 


"నీ సమస్య పూర్తిగా నేనే తీరుస్తానని చెప్పలేను కానీ..నా ఫ్రెండ్ ఒక ఆడ ఇన్స్పెక్టర్ ఉన్నది. ఆమెకి నీ గురించి చెప్పి..సహాయం చెయ్యమంటాను. ప్రస్తుతం నీ బస్తిలోనే ఉండు. నీ పిల్లల్ని అప్పుడప్పుడు మనింటికి తీసుకొస్తూ ఉండు..నేను కూడా వాళ్ళకి అర్ధమయ్యేట్టు చెబుతూ ఉంటాను."


"రేపు వాళ్ళు కూడా ఎదిగి ఈ సమాజంలోనే బతకాలి కదా. వాళ్ళకి నెమ్మదిగా ఆత్మ రక్షణ విద్యలు నేర్పిస్తాను. సరేనా..దిగులు పడకు. నువ్వు ధైర్యంగా ఉండి..పారిపోకుండా పరిస్థితికి ఎదురు నిలబడినప్పుడు అవతలి వారు కొంచెం జంకుతారు."


"ఈ మధ్య అలా నిలబడలేక కొందరు పిల్లలతో సహా ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. నువ్వు బతికి నలుగురిని బతికించాలే కానీ పారిపోకూడదు" అని పార్వతమ్మ నీలమ్మకి ధైర్యం నూరిపోసింది. 


@@@@


"అమ్మా నీ కోసం ఎవరో వచ్చారు" అన్న  శిరీష పిలుపుతో..పూజ గదిలో నించి నెమ్మదిగా కుంటుతూ వచ్చింది పార్వతమ్మ. 


"అయ్యో అమ్మగారు..పూజ గదిలో నించి వచ్చారా? నేను కూర్చునే దాన్ని కదమ్మా అన్నది శిల్ప. 


"శిల్పా..ఎంతా పెద్ద దానివయ్యావు? నేను గుర్తుపట్టలేదమ్మా. బాగున్నావా? ఏం చేస్తున్నావు. నిన్ను చూసి 7-8 సం లు అవుతున్నది" అన్నది అక్కడే సోఫాలో కూర్చుంటూ! 


"బికాం పాస్ అయి ICFAI లో ఎంబియే చదివి..క్యాంపస్ సెలెక్షన్ లో ఒక ఎం ఎన్ సి లో ఫైనాన్స్ మేనేజర్ గా చేరి అక్కడ పని చేస్తున్నానమ్మా. మా చిన్నప్పుడు మీరు చెప్పిన మాటలు, చేసిన సహాయం వృధా పోలేదమ్మా. నేను ఇప్పుడు మా చెల్లెళ్ళని మంచి కాలేజిలో చేర్చి చదివిస్తున్నానమ్మా" అంది నీలమ్మ పెద్ద కూతురు శిల్ప. 


"చాలా సంతోషంగా ఉన్నదే నిన్ను చూస్తుంటే! ఎంత పెద్ద దానివయ్యావు? నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నేను చెప్పినంత మాత్రాన నువ్వు, మీ అమ్మ దాన్ని పాటించి మీ జీవితాలు బాగు చేసుకుంటారని నమ్మకం ఏముంది. ఏదో ఉండబట్టలేక..నాకు తోచిందేదో చెబుతూ ఉండేదాన్ని."


"చేసిన ఉపకారాన్ని అప్పుడే మర్చిపోయే ఈ రోజుల్లో.. ఇన్నేళ్ళ తరువాత గుర్తు పెట్టుకుని.. నన్ను చూడటానికి వచ్చావు. చాలా సంతోషం. అలా కూర్చో" అని శిల్పకి చెబుతూ... 


"శిరీషా...నీకు గుర్తుందా..కొన్నేళ్ళ క్రితం మనింట్లో పని చేసిన నీలమ్మ పెద్ద కూతురు ఈ అమ్మాయి. ఎంత వృద్ధిలోకొచ్చిందో చూశావా? కొంచెం మంచి నీళ్ళు..టీ తెచ్చివ్వు" అన్నది. 


"అయ్యో అక్క కి ఎందుకమ్మా శ్రమ? నేనే టీ పెట్టి..మీకు, అక్కకి ఇస్తాను. ఆ మాత్రమైనా చెయ్యనివ్వండమ్మా" అని లేచి వంట గదిలోకి వెళ్ళింది. 


"చూశావా శిరీషా.. ఆడవారికి సమాజం నించి సమస్యలు వచ్చినప్పుడు..నలుగురు నాలుగు రకాలుగా కుళ్ళబొడవకుండా..  ఎవరో ఒకరు సహృదయంతో చెయ్యడ్డుపెట్టి సహాయం చేస్తే వాళ్ళ బతుకులు గాలికి చిరిగే అరిటాకుల్లాగా కాకుండా నిలబడి..పూజకో..భోజనానికో..అలంకారానికో ఉపయోగపడతాయి" అన్నది పార్వతమ్మ. 


"అవునమ్మా..మీరన్నది నిజం. చిన్నతనం వల్ల అప్పుడు నాకు అందులో గొప్పతనం అంత తెలియలేదు. మీ లాంటి వారి వ్యక్తిత్వం చూసి మేమందరం కొంచెమైనా అలవాటు చేసుకోగలిగితే ఇంకో పదిమందికి ఉపకారం చేసినవారం అవుతాము" అన్నది పార్వతమ్మ కాళ్ళకి నమస్కరిస్తూ! 


***

No comments:

Post a Comment

Pages