"బంగారు" ద్వీపం (అనువాద నవల) -23 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -23

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -23

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton
 



(అనుకున్నట్లుగానే పిల్లలు మరునాడు ఉదయం కిర్రిన్ ద్వీపానికి బయల్దేరారు. ఈదురుగాలికి పటం సముద్రంలో పడిపోతే, కుక్క నీటిలోకి దూకి దాన్ని తెస్తుంది. పిల్లలు తాము తెచ్చుకొన్న వస్తువులను దీవిలోని చిన్న గదిలోకి చేరుస్తారు. అక్కడ కోట యొక్క పటాన్ని పిల్లలు అధ్యయనం చేసి, నేలమాళిగకు పోయే మార్గాన్ని అన్వేషించాలని నిశ్చయించుకుంటారు. తరువాత)
 

జూలియన్ విలువైన ఆ పటాన్ని మడతపెట్టి తన జేబులో పెట్టుకొన్నాడు. తరువాత అతను చుట్టూ చూసాడు. ఆ చిన్నగదిలోని రాతి నేల లోంచి నేలబారున పాకే కలుపుముక్కలు పైకి పొడుచుకు వచ్చాయి. అక్కడ ఏవైనా కదలించవలసిన రాళ్ళు ఉన్నాయా అన్నది చూడాలంటే ముందు ఆ ప్రాంతాన్నంతా ఖచ్చితంగా శుభ్రం చేయాలి.

"మనం పని చేయటానికి సిద్ధం కావాలి" పారను చేతిలోకి అందుకొంటూ అన్నాడు జూలియన్. "మనం పారలతో ఈ కలుపు మొక్కల్ని తొలగిద్దాం. చూడండి. వాటిని యిలా పీకి పారెయ్యండి. తరువాత ప్రతి రాతిపలకను పరిశీలించండి!"

వారంతా పారలను అందుకొన్నారు. తరువాత దట్టంగా పెరిగిన కలుపు మొక్కలను, పారలతో ఆ నలుగురూ తవ్వేస్తున్న శబ్దాలతో ఆ చిన్న గది నిండిపోయింది. కలుపుమొక్కలనుంచి రాతి పలకలను వేరు చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అందులోనూ పిల్లలు పట్టుదలతో పని చేస్తున్నారు.

టిం ప్రతీదీ ఉత్సాహంగా గమనిస్తున్నాడు. వాళ్ళేమి చేస్తున్నారో అతనికి అర్ధం కావటం లేదు. కానీ తను కూడా ధైర్యంగా వాళ్ళతో చేరాడు. తన నాలుగు పాదాల గోళ్ళతో అతను నేలను గీకసాగాడు. అతనలా గీకుతుంటే మొక్కలు, మట్టి గాలిలోకి ఎగురుతున్నాయి.

"హాయి టిం!" అంటూ జూలియన్ కుక్క బొచ్చు మీద పేరుకొంటున్న దుమ్మును తన చేతితో దులిపాడు. "నీలో కొద్దిగా చురుకుదనం ఉంది. నేను చెప్పేదేమిటంటే, నువ్వు ఒక్క నిమిషంలో రాళ్ళను కూడా పైకి ఎగరేసేస్తున్నావు. జార్జి! ప్రతిదానిలో టిం మనతో కలుస్తున్న తీరు అద్భుతంగా లేదూ?"

వాళ్ళంతా ఎలా పని చేస్తున్నారు? భూగర్భ నేలమాళిగల్లోకి ప్రవేశద్వారాన్ని కనుక్కోవటానికి వాళ్ళెంత ఆకాంక్షతో ఉన్నారో! అదెంత గగుర్పాటుని కలిగిస్తుందో?

@@@@@@@@@

త్వరలోనే చిన్న గదిలోని రాతి పలకలు, మట్టి, యిసుక, కలుపు మొక్కల నుంచి బయటపడి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఆ రాతి పలకలన్నీ ఒకే పరిమాణంలో ఉండటాన్ని గమనించారు. అవి అన్నీ పెద్దవిగా, ఒకే పరిమాణపు చదరంలో ఉండి, ఆ గదిలో బాగా అమర్చబడ్డాయి. చేతిలో టార్చీలతో జాగ్రత్తగా వాటిని దాటి వెళ్ళి, కదపటానికి లేదా ఎత్తటానికి వీలుగా ఉండే రాతి పలక కోసం అన్వెషించారు.

"ఇనుప రింగు హాండిల్ ఉన్న రాతిపలకను మనం కనుక్కోవాలి" అన్నాడు జూలియన్. కానీ వాళ్ళకది సాధ్యం కాలేదు. ఆ గదిలోని రాతి పలకలన్నీ సరిగ్గా ఒకేలా కనిపించాయి. అది వారిని మరింత నిరాశపరచింది.

వివిధ రకాల రాళ్ళ మధ్య పగుళ్ళలో తన చేతిలోని పారను దూర్చి, ఒక్క రాతి పలకనైనా కదపటానికి అవకాశం దొరుకుతుందేమోనని జూలియన్ ప్రయత్నించాడు. కానీ వాటిని కదపలేమని వాళ్ళకు అర్ధమైంది. అవన్నీ దృడంగా ఉన్న నేల మీద అమర్చినట్లు అనిపించింది. మూడు గంటలు బాగా కష్టపడ్డాక, పిల్లలంతా భోజనం తినటానికి కూర్చున్నారు.

వాళ్ళకు నిజంగా చాలా ఆకలిగా ఉంది. తాము తినటానికి చాలా పదార్ధాలు తెచ్చుకోవటం వల్ల వారికి ఆనందంగా ఉంది. వారు తింటూ తాము పరిష్కరించుకోవలసిన విషయాల గురించి చర్చిస్తున్నారు.

‘నేలమాళిగల్లోకి ప్రవేశ ద్వారం ఈ చిన్న గది కింద ఏమాత్రం లేనట్లు కనిపిస్తోంది’ జూలియన్ అన్నాడు. ‘ఇది చాలా నిరాశపరిచింది. కాని ఇప్పుడు నేలమాళిగలోకి మెట్లు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతున్నాయని ఎందుకో నాకు అనిపించటం లేదు. సరిగ్గా ఎక్కడనుంచి మెట్లు మొదలవుతాయో మనం కొలవటానికి పటాన్ని మరొకసారి చూడాలి. బహుశా ఆ కొలతలు సరైనవి కాకపోవచ్చు, మనకెలాంటి సాయాన్ని చేయకపోవచ్చు. అయినా ప్రయత్నిద్దాం."

కాబట్టి దిగువకు వెళ్ళటానికి మెట్లు ఏ ప్రాంతం నుంచి ప్రారంభమౌతాయో కనుక్కోవటానికి సాధ్యమైనంత మేరా కొలిచారు. వేర్వేరు కొలతలతో ఉన్న మూడు అంతస్తుల నమూనాలను అధ్యయనం చేయటం అసాధ్యం అనిపించింది. పటాన్ని తదేకంగా చూస్తున్న జూలియన్ తెల్లబోయాడు. అది అతనికి నిరాశాజనకం అనిపించింది. వాళ్ళు కోటలోని భూతలమంతా గాలించాల్సిన అవసరం లేదు. అలా చేయటానికి కొన్ని యుగాలు పడుతుంది.

"చూడు" పటంలో కన్నంలా మార్కు ఉన్న చోట జార్జి హటాత్తుగా వేలు పెట్టి చూపించింది. గతంలో వాళ్ళంతా అక్కడ బావి ఉంటుందని భావించారు. "నేలమాళిగల్లోకి ప్రవేశ ద్వారం బావికి ఎక్కువ దూరంలో లేదు. మనం బావిని కనుక్కోగలిగితే, దానికి చుట్టుపక్కల నేలమాళిగలోకి వెళ్ళే మెట్లమార్గాన్ని వెతకవచ్చు. రెండు పటాల్లోను బావి ఉంది. బహుశా అది కోట మధ్యలో ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తోంది. "

"నీది మంచి ఆలోచన" జూలియన్ సంతోషంగా చెప్పాడు. "మనం బయటకు వెళ్ళి కోట మధ్య ప్రాంతానికి వద్దాం. పాత బావి ఎక్కడ ఉందో మనం యిటూ అటూగా అంచనా వేయొచ్చు. ఎందుకంటే అది పాత ప్రాంగణం మధ్యలో ఉన్నట్లు ఖచ్చితంగా అనిపిస్తోంది."

అందరూ సూర్యకాంతి పడే బయట ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు తమ అన్వేషణని చాలా ముఖ్యమైన, తీవ్రమైన అంశంగా భావించారు. అదృశ్యమైన బంగారపు కడ్డీలను వెతకటం అద్భుతమైన అంశమే! అవి ఎక్కడో భూగర్భంలో తమ పాదాల కిందనే ఉన్నాయని వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. అక్కడ నిధి ఉండకపోవచ్చుననే భావనే ఆ పిల్లల్లో ఏ ఒక్కరికి కలగటం లేదు.

వారు ఒకప్పుడు కేంద్రంగా ఉన్న శిధిలమైన కోట ప్రాంగణంలో నిలబడ్డారు. వాళ్ళు వేగంగా ఆ ప్రాంగణాన్ని చేరుకొని మధ్యలో నిలబడి చుట్టూ గమనించారు. నిష్ఫలంగా కనిపిస్తున్న ఆ ప్రాంతం బహుశా నూతి యొక్క పైభాగం కావచ్చు. సముద్రతీరాన్నుంచి ఎగిరి వచ్చిన మట్టితో అది పూర్తిగా నిండిపోయింది. కలుపుమొక్కలు, అన్ని రకాల పొదలు అక్కడ దట్టంగా పెరిగాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద నున్నటి రాతిపలకలతో కప్పబడిన ఆ ప్రాంగణం గచ్చు బీటలువారటంతో చదునుగా లేదు. ఆ పగుళ్ళలో యిసుక, కలుపు మొక్కలు నిండిపోయాయి.

"అటు చూడు! అక్కడ ఒక కుందేలు ఉంది" డిక్ అరుస్తూ చూపించాడు. ఒళ్ళంతా యిసుక పేరుకొన్న పెద్ద కుందేలొకటి మెల్లిగా గెంతుతూ ఆ ప్రాంగణానికి అడ్డం పడి పోతోంది. అది మరో చివరికి చేరగానే అక్కడ ఉన్న కన్నంలో దూరింది. తరువాత మరొక కుందేలు కనిపించింది. అది కూర్చుని కొద్దిసేపు పిల్లలవైపు చూసి తరువాత మాయమైంది. అది చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. మచ్చికైనట్లు ప్రవర్తించే అలాంటి కుందేళ్ళను వాళ్ళు యింతకు ముందెప్పుడూ చూడలేదు.

మూడవ కుందేలు ప్రత్యక్షమైంది. అది ఆకారంలో చిన్నదైనా, మరీ పెద్దగా ఉన్న చెవులు, కురచైన తెల్లని వెంట్రుకలతో చిన్న తోకను కలిగి ఉంది. అది కనీసం పిల్లల్ని గమనించనైనా లేదు. అది పిల్లలకు ఆనందం కలిగేలా ఉల్లాసభరితంగా కాసేపు గెంతి, తరువాత తన వెనుక కాళ్ళపై కూర్చుంది. తరువాత తన రెండు పెద్ద చెవులను, ఒక దాని తరువాత మరొక దాన్ని కిందకు లాగి, నాలుకతో శుభ్రం చేసుకుంటోంది.

కానీ తిమోతికి యిది ఎక్కువ అనిపించింది. ఆ ప్రాంతానికి అడ్డం పడి వెళ్ళిన మిగతా రెండు కుందేళ్ళు, తను పెద్దగా అరవకుండానే అదృశ్యమయ్యాయి. కానీ ఈ చిన్న కుందేలు తన ముందరే కూర్చుని చెవులను శుభ్రం చేసుకోవటం, ఏ కుక్కకైనా అసహనాన్ని కలిగిస్తుంది. వెంటనే కుక్క ఉద్రేకంతో మొరుగుతూ తెల్లబోయి చూసిన కుందేలు వైపు వేగంగా ఉరికింది.

ఒక క్షణం ఆ చిన్న జంతువు కదలకుండా కూర్చుంది. ఇంతకు ముందెప్పుడూ అది భయపడటం గానీ, తననెవరూ వెంబడించటం గానీ జరుగలేదు. అందుకే తన వైపుకు దూసుకొస్తున్న కుక్కను కళ్ళు బాగా విప్పార్చి చూసింది. తరువాత వెనక్కి తిరిగి అమిత వేగంతో పరుగెత్తింది. ఆ వేగానికి దాని చిన్న కుచ్చు లాంటి తోక కిందకు పైకి ఊగసాగింది. అది పిల్లలకు దగ్గరగా ఉన్న ముళ్ళపొదలోకి దూరి మాయమైంది. దాన్ని వెంబడించిన తిమోతి కూడా ఆ పెద్ద పొదలోకి దూరింది.

కుందేలు భూమిలో ఉన్న కన్నంలోకి దూరగానే, దాని వెంట పడ్డ టిం క్రిందకు వెళ్ళటానికి తన ముందు కాలి గోళ్ళతో వీలైనంత వేగంగా యిసుక, మట్టిపెళ్లలు గాలిలోకి ఎగిరేలా తవ్వసాగింది. అదే సమయంలో ఉద్రేకంతో గట్టిగా అరుస్తూ, మోరసాచి కుయ్యోమని రాగాలు తీస్తూ, తనను పిలిచే జార్జి మాటను కూడా ఖాతరు చేయట్లేదు. ఎలాగైనా ఆ కుందేలుని పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. దాదాపుగా పిచ్చెక్కినట్లు ఆ కన్నాన్ని కాలి గోళ్ళతో గీకుతూ, దాన్ని మరింత పెద్దది చేయసాగాడు.

"టిం! నేను చెప్పింది వింటున్నావా? అక్కడ నుంచి బయటకు రా!" జార్జి అరిచింది. "నువ్వు యిక్కడికి కుందేళ్ళని వేటాడటానికి రాలేదు. అది నువ్వు చేయకూడదని నీకు తెలుసు. నువ్వు మొండివాడివి. బయటకు రా!"

కానీ టిం బయటకు రాలేదు. పిచ్చి పట్టినట్లు అదే పనిగా గోళ్ళతో గీకసాగాడు. జార్జి అతన్ని తీసుకు రావటానికి వెళ్ళింది. ఆమె ముళ్ళ పొదను పైకి లేపగానే, అకస్మాత్తుగా గోళ్ళతో గీకుతున్న శబ్దం ఆగిపోయింది. భయంతో పెట్టిన అరుపే తప్ప మరే శబ్దం వినపడలేదు. జార్జి ఆశ్చర్యపోతూ ముళ్ళపొద కిందకు తొంగి చూసింది.

టిం అదృశ్యమయ్యాడు! అతను అక్కడ లేడు. ఉన్నది టిం తవ్విన పెద్ద కుందేలు రంధ్రం మాత్రమే! కానీ అక్కడ టిం లేడు.

"నేను చెబుతున్నాను జూలియన్! టిం పోయింది" జార్జి స్వరం భయంతో వణికింది. "అతను ఖచ్చితంగా కుందేలు కన్నంలోకి దూరగలడా? నువ్వే చెప్పు. అతను ఎంత పెద్ద కుక్క!"

పిల్లలంతా ఆ ముళ్ళపొద చుట్టూ మూగారు. దాని కింద ఎక్కడి నుంచో నీరసంగా మూలుగుతున్న శబ్దం వినిపించింది. జూలియన్ ఆశ్చర్యపోయాడు.

(ఇంకా ఉంది)




No comments:

Post a Comment

Pages