గురుదక్షిణ - అచ్చంగా తెలుగు
గురుదక్షిణ.
(చిన్న కథ )
రచన : టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
 



రాఘవయ్య మాస్టారుకు ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది.ఊరి వాళ్ళందరూ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు.
 
పూర్వ విద్యార్థులు చాలామంది ఆ రోజు జరిగే సభకు వస్తామన్నారు.ఈ రోజు మాస్టారి శిష్యులు చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అందరూ మాస్టారుకు   సన్మానం ఎలా చేయాలో చర్చించుకుంటున్నారు.

 'మాస్టారుకు బహుమానంగా ఏమివ్వాలి?'

'ఒక బంగారు గండపెండేరము అయితే బాగుంటుంది!'అనుకున్నారు కొంతమంది శిష్యులు.

'భేష్! మంచి గురుదక్షిణ! చాలా బాగుంది!' అని మెచ్చుకున్నారందరూ.సన్మానం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఆరోజు రానే వచ్చింది. రాఘవయ్య మాస్టారును , ఆయన భార్య శ్రీదేవమ్మను సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టారు.

చాలామంది పట్టుబట్టలు పెట్టారు. ఇంకొందరు శాలువాలు కప్పారు. పెద్ద గజపూలమాలను తెచ్చి ఇద్దరికీ కలిపి వేశారు. పూలు చల్లారు. మాస్టారు తడిసి ముద్దయ్యేవరకు పన్నీరు చల్లుతూ పరవశించి తమ భక్తిని చాటుకొన్నారు. ఆర్భాటంగా మేళతాళాలు వాయించారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బంగారు గండపెండేరాన్ని తెచ్చి ఆయన పాదానికి తొడిగారు.

ఇంకా కొంతమంది మంచి వక్తలు మాస్టారి యొక్క గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేసి బ్రహ్మాండంగా పద్య రత్నాలను చదివి పొగిడేశారు.ఇంత చేస్తుంటే....అదేమిటో కానీ మాస్టారు మొహం అంత ప్రసన్నంగా లేదు..

చివరగా  రాఘవయ్య మాస్టారు  లేచారు. మైకు తీసుకున్నారు. అందరినీ పరికించి  "అందర్నీ చూసి చాలా సంతోషంగా ఉంది! నా శిష్యులు ఇచ్చిన గురుదక్షిణ ఎంత గొప్పగా ఉందో!.. ఈ పట్టుబట్టలు, ఈ శాలువాలు, ఈ బంగారు గండపెండేరం అన్నీ నా బీరువాలో చేరుతాయి... మీరంతా ఊర్లో నా దగ్గర చదివి గొప్ప గొప్ప పదవుల్లో ఉండి దేశాన్ని నడిపిస్తున్నారు!.. నాకు ఇంత గొప్పగా సన్మానం చేయగలిగే స్థితికి వచ్చారు!మీ చిన్నప్పుడు  నేను చెప్పే కష్టమైన లెక్కలకు మీలో చాలామంది సరైన సమాధానాన్ని చెప్పేవారు.ఇప్పుడు నేను ఒక సమస్య చెప్తాను! దానికి పరిష్కారం చూపగలరా?...."ఒక్క నిమిషం ఆగారు మాస్టారు.

 శిష్యులు "చెప్పండి మాస్టారూ!"అంటూ ఉత్సాహంగా అడిగారు.

"వినండి!నా బావిలో నీళ్లు రావడం లేదు!నా బావిలోనే కాదు... మన ఊర్లో చాలా వరకు బావులు ఎండిపోతున్నాయి.. బావుల్లో నీళ్లు ఎందుకు ఎండిపోతున్నాయి ? మన చెఱువును కబ్జా చేశారు.తోటలుగా మార్చేశారు.. క్రమక్రమంగా చెఱువు ఎండిపోతోంది? కబ్జా చేసిన వాళ్ళు మనలోనే ఉన్నారు.

మన జీవితాలు ఎలా ఉంటాయి? మన ఊరి వాళ్ళందరమూ ఈ రోజు నీళ్లట్యాంకు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉన్నాము....మీ చిన్నప్పుడు మనకు నీటి సమస్య లేదు.ఈ చెఱువులోనే మీరంతా ఈతలు కొట్టిన వాళ్లే కదా!ఈరోజు స్కూలు పిల్లలకు ఆ సరదా లేదు!..ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి.మీరు గొప్పవారయ్యారు!... పెద్దవారయ్యారు..గురుదక్షిణ నాకు అవసరం లేదు! ఈరోజు ఈ లెక్కను పరిష్కరిస్తారా?..నేను మిమ్మల్ని చెయ్యి చాచి అడుగుతున్నాను! జలదానం చేయగలరా?..."
 ]రాఘవయ్య మాస్టారి గొంతు గద్గదికమైంది. కండువాతో కళ్ళు తుడుచుకుంటున్నారు.

శిష్యులు కదలిపోయారు. అందరూ మౌనంగా ఉన్నారు. కాలం మూగబోయింది.

శిష్యులు లేచారు.మాస్టారి పాదాలముందు మోకరిల్లారు.
  
అందరూ కదిలారు. చెఱువును కబ్జా చెరనుండి విడిపించే ప్రయత్నాలు చేశారు.
చెఱువును బాగు చేసుకున్నారు.జల సంరక్షణ పనులు చేపట్టారు.వాననీటిని ఒడిసిపట్టారు. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు త్రవ్వారు.ఎక్కడ చోటుంటే అక్కడ చెట్లు పెంచారు.చాలా ఇళ్లల్లో వాననీటిని తిరిగి బావిలోకి పడేట్లుగా ఏర్పాటు చేశారు. చుక్కనీటిని కూడా వృధాపోనీయకుండా కట్టడి చేశారు.

రెండుసంవత్సరాలు గడిచాయి.
 
వానాకాలం వచ్చింది.చెఱువులోకి నీళ్లు వచ్చాయి.

రాఘవయ్య మాస్టారి శిష్యులు మాస్టారుకు ఇచ్చిన గురుదక్షిణకు సాక్ష్యంగా ఆయన  బావిలో నీళ్లు నిండుగా ఉన్నాయి.ఆ తర్వాత ఆ ఊరికి ఎప్పుడూ నీళ్లట్యాంకు రాలేదు.
ఆ ఊరి బడిపిల్లలు ఇప్పుడు చెఱువులో ఈతలు కొడుతున్నారు.

పల్లె పచ్చపచ్చగా ఉంది.

***

No comments:

Post a Comment

Pages