కచ్ఛపి నాదం - 3
మంథా భానుమతి
వంటింట్లో అప్పటికే సందడి మొదలయింది. వసారాలో పాలదాలి మీద డేగిసాలో పాలు మరుగుతున్నాయి. పాలు కాగుతున్న వాసన ఇల్లంతా ఆక్రమించింది.
సావిత్రి గిన్నెలోకి పాలు తీసుకుంటూ పిలిచింది.
“దా! సోంబాబూ పాలు తాగి, తాతగారి రాగాలాపన విను. విని మనసుకి పట్టించుకోవాలి. వీలైతే ఒకటో రెండో సంగతులు గ్రహించాలి. కాసేపయ్యాక వారు బైటికి వెళ్తారు. చద్దన్నం తిని అప్పుడు సాధన చేసుకోవచ్చు.”
సోంబాబు సంతోషంగా తలూపాడు. తాతగారితో పాటు పైకి వినిపించకుండా లోపల్లోపల పాడుకున్నాడు.
కరణంగారి అబ్బాయి వాసు కూడా వాళ్లతో కలిసే వచ్చాడు. వాసు మేనమామ ఇల్లు దాసుగారి ఇంటికి దగ్గరే.
సోంబాబు కూడా తమతో వస్తున్నాడని వాసు చెప్పగానే కరణంగారు చాలా సంతోషించారు… ఒకరికొకరు తోడుగా ఉంటారని.
అంతే కాదు… వాసు మేనమామ శేషగిరి, వీధరుగుమీద బడి నడుపుతాడు. ఐదో క్లాసు వరకూ చెప్పి, పిల్లలని ఫస్టు ఫారంలో హైస్కూలుకి వెళ్లే లాగా తయారు చేస్తాడు.
హైస్కూల్లో చేరని వాళ్లకి, ఆసక్తి ఉన్న పిల్లలకి ఆ తరువాత కూడా ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ కట్టిస్తాడు. ఆ సదుపాయం కూడా ఉండటం అవధానిగారికి ఊరట కలిగించింది.
ఏదో చిన్నతనం కొద్దీ… అక్కడా అక్కడా విని పాటలు పాడుకుంటుంటే, విద్వాంసుడౌతాడని సంగీతం మీదే ఆధార పడటం, అదీ తమ వంశంలో ప్రథమంగా… కొంత కలతగానే ఉంది అవధానిగారికి. అంతగా నచ్చలేదు. ‘ఎలాగో అలా మెట్రిక్ పాసయితే ఏదన్నా ఉద్యోగం అయినా చూసుకోవచ్చు’ అనుకున్నారు.
సోంబాబు భవిష్యత్తు ఎలా ఉందో మరి… వేచి చూడవలసిందే.
సోంబాబు, వాసు దగ్గరకి వెళ్లి వస్తానని సావిత్రి అత్తయ్యకి చెప్పాడు. ఆవిడ వివరాలు కనుక్కుంది.
“వీధిబడి శేషగిరి మాష్టారా? అలాగే వెళ్లు. బాగా చెప్తారు పాఠాలు. పన్నెండు గంటలకి వచ్చెయ్యి. తాతగారితో కలిసి భోజనం చెయ్యచ్చు.” అత్తయ్య అనుమతి ఇచ్చింది. వరుసకి మామ్మ అయినా అలా పిలవాలని అనిపించలేదు సోంబాబుకి. చూడగానే ఆవిడ నచ్చేసింది.
“నీ ఇష్టం వచ్చినట్లు పిలవరా!” అనేసిందావిడ.
“అలాగేను అత్తయ్యా. జాగ్రత్తగా వెళ్తా… పన్నెండింటికి వచ్చేస్తా.” అని మలహరి రాగంలో శ్రీ గణనాథ వరుసలో అంటూ పరుగెత్తాడు సోంబాబు. సావిత్రి ఆశ్చర్యంగా వాడి కేసి చూస్తూ ఉండిపోయింది. ఏమిటీ పిల్లవాడు… ఈ వయసులో ఇంత చురుకుతనం, తన ధ్యేయం మీద చెదరని దృష్టి! ఇటువంటి పిల్లలు అరుదుగా ఉంటారు.
తప్పకుండా అనుకున్నది సాధిస్తాడనుకుంది.
అంతా చూసుకుంటూ, పక్క వీధిలో ఉన్న వాసు వాళ్ల మామయ్య ఇంటికి వెళ్లే సరికి అక్కడ తెగ హడావుడిగా ఉంది. ఎక్కడ చూసినా పిల్లలు…
అయినా అంత గొడవగా లేదు.
పెద్ద పెద్ద వీధరుగులు ఐదు భాగాలుగా విభజించ బడ్డాయి. ఒక అరుగు మీద చిన్న పిల్లలు, పలకల మీద కణికి పుల్లలతో రాసేస్తున్నారు.
ఇంకొక అరుగు మీద, అటూ ఇటూగా సోంబాబు వయసు వాళ్లు తెల్ల కాగితాలతో కుట్టిన పుస్తకాల మీద పెన్సిళ్లతో దీక్షగా చూస్తూ రాస్తున్నారు.
మధ్య మధ్యలో సైగలూ, సన్న సన్నగా మాటలూ, కిసుక్కుమంటూ నవ్వులూ… పిల్లల సహజమైన చేష్టలతో సందడిగా ఉంది.
“ఏంటోరా! ఇవేళ బళ్లో నాకు సహాయంగా పనిచేసే మాష్టారు రాలేదు. ఇందర్ని చూసేప్పటికి నా పనైపోతోంది.” కండువా దులుపుకుంటూ లోపల్నుంచి వచ్చాడు శేషు మామయ్య, వెనుకే వాసుగాడు.
అతని గురించి వాసు చెప్పిన మాటలు వినీ వినీ, సోంబాబు క్కూడా శేషు మామయ్యే!
“నేను మూడో క్లాసు వాళ్లకి లెక్కలు పాఠం చెప్పి చేయిస్తాను మామయ్యా! రెండో క్లాసు వాళ్ల చేత పద్యాలు బట్టీ పట్టిస్తా. డిక్టేషన్ కూడా చెప్పి రాయిస్తాను.” సోంబాబు తడుముకోకుండా ముందుకొచ్చాడు.
“నేను ఒకటో తరగతి పిల్లల చేత ఎక్కాలు చెప్పించి, చిన్న చిన్న మాటలు రాయిస్తా మామయ్యా!” వాసు కూడా ముందుకొచ్చాడు.
ఇద్దరూ అరుగు మీదికి ఎక్కారు.
శేషగిరి ముందు ఆశ్చర్యపోయినా, ఆనందంగా ఒప్పుకున్నాడు. వయసు కంటే చిన్నగా అనిపిస్తాడు సోంబాబు. వాసు బాగా పొడగరి. వాడి భుజాల దగ్గరికి వచ్చాడు. ‘ఈ కుర్రాడేం చెప్తాడబ్బా’ అనిపించింది చూడగానే.
శేషగిరి నాలుగైదు క్లాసుల వాళ్లని చూసుకుంటూ సోంబాబుని, వాసునీ గమనించ సాగాడు. చిన్న గ్రామమైనా లోగిసలో బాగానే చదువులు చెప్పినట్లున్నారు... పిల్లలిద్దరూ చాలా పద్ధతిగా చెప్తున్నారు.
దీక్షగా ప్రతీ పిల్లవాడినీ గమనిస్తూ చెప్తున్నారు. చెప్పద్దూ, శేషగిరికి ముచ్చట వేసింది చూస్తుంటే.
వీళ్లిద్దరి చేతా మెట్రిక్ కట్టించాలని అప్పుడే నిర్ణయానికి వచ్చేశాడు శేషగిరి. కానీ… అనుకున్నవన్నీ అనుకున్నట్లు అయితే కావలసింది ఏముంటుందీ!
ఎలా గుర్తున్నాయో… సోంబాబు మూడో క్లాసు లెక్కలు, పుస్తకం చూడకుండా మొదట్నుంచీ చేయించేస్తున్నాడు.
రెండో క్లాసు వాళ్ల చేత వేమన శతకంలో పద్యాలు చెప్పి బట్టీ పట్టిస్తున్నాడు.
మొత్తం యాభై మంది పిల్లలు. చిన్న క్లాసుల్లో పన్నెండేసి మంది. చిన్న క్లాసుల వాళ్లకి పాఠాలు చెప్పటానికే అసిస్టెంటు మాష్టర్ని కుదుర్చుకున్నాడు శేషగిరి.
నాలుగైదు క్లాసుల వాళ్లకి తనే పాఠాలు చెప్తాడు.
అతను ప్రైవేట్ గా పంపించిన పిల్లలు హైస్కూల్లో చేరకపోవటమనేది ఉండదు. చుట్టు పక్కల వీధుల్లో శేషగిరి బడికి మంచి పేరు ఉంది.
పోను పోనూ బాగా ఎండెక్కి పోతోంది. వీధరుగు మీది నుండే సూర్యుని గమనాన్ని పరికిస్తున్నాడు సోంబాబు.
వీధిలో ఎండలో నడుస్తున్న వాళ్ల నీడ, నిటారుగా పడుతుంటే, మధ్యాన్నం పన్నెండు అవుతోందని గ్రహించి, లేచి శేషగిరి దగ్గరగా వెళ్లాడు.
“మామయ్యా! ఇంటికెళ్లి అన్నం తినేసి వస్తా…”
“అలాగే వెళ్లి రా. దగ్గరేనా?”
“పక్క వీధిలోనే మామయ్యా! మా చిన్న తాతగారి ఇంటి దగ్గర ఉంటున్నా. తినగానే వచ్చేస్తాను.”
పిల్లలందరినీ కూడా ఇళ్లకు వెళ్లి అన్నాలు తిని రమ్మని తను లేచాడు శేషగిరి. పల్లెటూర్లలో పొద్దుట ఫలహారాలేమీ ఉండవు. స్నానం, పూజ అయ్యాక, పెద్ద గ్లాసుడు కాఫీ తాగి పన్నెండింటికి భోజనం చెయ్యటమే.
అప్పుడప్పుడే అందరికీ కాఫీ అలవాటవుతోంది. అంతకు ముందయితే అదీ లేదు. పాడి ఉంటే పాలు త్రాగేవారు.
నారాయణదాసు గారు కళాశాల నుంచి వచ్చి, కాళ్లు చేతులు కడుగుకొని, జరీ అంచు పట్టు పంచ కట్టుకుని వచ్చారు.
నుదుట విభూతి పట్టీలు, మధ్యలో కుంకుమ బొట్టు. మెడలో ఉత్తరీయం. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తుంటే ఒక రకమైన వెలుగు నిండింది ఇల్లంతా. ఆజానుబాహువు, చేతులు మోకాళ్లకి తగులుతున్నాయి.
సోంబాబు తల బాగా పైకెత్తి చూడాల్సి వచ్చింది తాతగారిని.
తను కూడా కాళ్లు చేతులు కడుక్కుని, పట్టు లాగు కట్టుకుని వచ్చాడు.
ఎవరూ చెప్పకుండానే తాతగారిని చూడగానే పవిత్ర భావం కలిగి, అమ్మమ్మ చెప్పినట్లుగానే సాష్టాంగ నమస్కారం చేశాడు సోంబాబు.
ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి చూపించి పీట మీద కూర్చున్నారు దాసుగారు. వెండి పువ్వులున్న పెద్ద పీట. విశాలంగా ఉంది. హాయిగా కూర్చోగలిగారు. వారి ముందు పెద్ద వెండి కంచం, పక్కనే చిన్న వెండి పళ్లెం. ఎడం పక్కనే పెద్ద వెండి గ్లాసులో మంచి నీళ్లు పెట్టారు.
ఎవరో ముగ్గురు అతిథులు కూడా పట్టు పంచలు కట్టుకుని వరుసగా దాసుగారి పక్కన పీటల మీద కూర్చున్నారు.
వారికి అరిటాకుల్లో వడ్డించారు. ఆ రోజుల్లో ప్రతీ ఇంట్లో ఇంచుమించుగా రోజూ అతిథులుండేవారు. కొందరైతే అతిథులు వస్తారేమోనని కాసేపు ఎదురు చూసే వారు కూడా. అందులో విజయనగరం… చుట్టు పక్కల ఉన్న ఊళ్లు అన్నింటికీ అదే పెద్ద పట్టణం.
వైద్యానికీ, చదువులకీ, పెళ్లిళ్లు పేరంటాలకి సంభారాలు కొనుక్కోడానికీ అక్కడికే రావలసి వచ్చేది. అప్పట్లో హోటళ్లలో తినడాలు ఉండేవి కాదు. ఎవరూ బంధువులు లేకపోతే, సత్రం లో భోంచేసేవారు.
సోంబాబు పక్కన ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. వాళ్లకి అరటి ఆకు పాయలు వేశారు. అవీ పెద్దవి గానే ఉన్నాయి. పిల్లలిద్దరిని సావిత్రి పరిచయం చేసింది.
ఒకబ్బాయి సోంబాబు కంటే చిన్నగా ఉన్నాడు. అతని పేరు వాసా కృష్ణమూర్తి, ఇంకొక అబ్బాయి ఒకట్రెండేళ్లు పెద్ద వాడై ఉంటాడు. అతను సావిత్రి కొడుకు, ఉపాధ్యాయుల సూర్యనారాయణ రావు.
“నా పేరు అయ్యగారి సోమేశ్వర్రావు, మా నాన్నగారు వేద పండితులు. మాది లోగిస గ్రామం…” అని తనెవరో కూడా చెప్పాడు సోంబాబు.
పప్పు, కూర, పచ్చడి, అన్నం వడ్డించి నేతి గిన్నె పట్టుకొచ్చి అభికరించింది సావిత్రి.
వంట చేయడానికి దూరపు బంధువు ఒకావిడ ఉన్నారు, కానీ వడ్డన సావిత్రే చేస్తుంది.
అప్పట్లో అది మర్యాద.
ఇంటి ఆడవారే కావలసినవి మరీ మరీ కనుక్కుని వడ్డించాలి.
ఔపోసన పట్టి తినడం మొదలు పెట్టారు అందరూ! తాతగారు అందరినీ పలుకరించి, మౌనంగా భోజనం చెయ్యడం గమనించాడు సోంబాబు. ఎవరూ మాట్లాడడం లేదు. భోజనం మీదనే దృష్టి అంతా.
సోంబాబు అంతా చూస్తూ మనసుకి పట్టించుకుంటున్నాడు.
***
ఆరోజు సాయంత్రమే దాసుగారి హరికథా విశ్వరూపం చూసే అదృష్టం కలిగింది సోంబాబుకి.
మధ్యాన్నం భోజనానికి వచ్చిన బంధువులు తాతగారి హరికథ చూడటానికే వచ్చారుట, ఆనక అత్తయ్య చెప్పింది.
ఐదుగంటల నుంచీ సావిత్రి అత్తయ్య వంట చేయించేసి, ఇల్లంతా సర్ది ఆరు గంటలకల్లా తయారయింది.
తాతగారు ఎర్రని పట్టుపంచ, కండువా, మెడలో పెద్ద గొలుసు వేసుకుని తయారైపోయారు. కాళ్లకి గజ్జెలు మాత్రం తరువాత కట్టుకుంటారుట.
అందరూ కలిసి హరికథా కాలక్షేపం జరిగే చోటుకి వెళ్లారు. సోంబాబు, సూర్యనారాయణ, సావిత్రి జట్కాలో వెళ్లారు. జట్కా ఎక్కటం చాలా ఇష్టం సోంబాబుకి. హై… హై అంటూ జట్కా అబ్బాయి గుర్రాన్ని తోలుతుంటే ముందుకి వంగుని మరీ చూస్తాడు. అందులో చక్రంలో కర్ర పెట్టి నప్పుడు అది చేసే శబ్దం కూడా బలే ఉంటుంది, టకటక అంటూ. అది సాధారణంగా ఏక తాళంలోనే ఉంటుందని కనిపెట్టాడు.
అంత పెద్ద ఆవరణ సోంబాబు ఎప్పుడూ చూడలేదు. దానికి తగ్గట్లే ఉంది వేదిక. ఒక పక్కగా వయోలీన్, మృదంగం వాయించే వాళ్లు కూర్చున్నారు.
వయోలీన్ వాయించే ఆయన్ని చూసి సోంబాబు ఆశ్చర్య పోయాడు.
వాళ్ల నాన్నగారిలాగే ఆయన క్కూడా కళ్లు కనిపించవని తెలుస్తోంది.
“అత్తయ్యా ఆయన…” ఎవరన్నట్లుగా చెయ్యి చూపించి అడిగాడు.
“ద్వారం వేంకటస్వామి నాయుడుగారు. ప్రముఖ వయోలీన్ విద్వాంసుడు. నువ్వు చేరబోయే విజయరామగాన కళాశాలలో అధ్యాపకులు. తాతగారు రిటైర్ అయ్యాక ఆయనే ప్రిన్సిపాల్ అని అంటున్నారు. అప్పుడప్పుడు తాతగారికి వాయిద్య సహకారం ఇస్తూ ఉంటారు.”
“ఇంకా మొదలవలేదుగా నేను తీసుకెళ్లి దగ్గరగా చూపిస్తాను పద…” సూర్యనారాయణ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు.
“నమస్కారమండీ గురువుగారూ!” నాయుడు గారి దగ్గరగా వెళ్లి పలుకరించాడు.
“ఆ… సూర్యనారాయణా! బాగా చదువుతున్నావా?” శృతి సరి చేసుకుంటున్న నాయుడుగారు తల పైకి ఎత్తి పక్కకి తిరిగి అడిగారు.
“చదువుతున్నానండీ. మా చుట్టాలబ్బాయిని తీసుకుని వచ్చా. మన మ్యూజిక్ కాలేజ్ లో చేరబోతున్నాడు. ఇప్పుడు సెలవులు కదా! కాలేజీ తెరిచే వరకూ మా ఇంట్లోనే ఉంటాడు.”
“అలాగా! దాసుగారి అండ దొరికిందంటే ఇంకేం… తప్పకుండా పైకి వస్తాడు.” సోంబాబు వారి కాళ్లకి ముట్టుకుని నమస్కారం చేశాడు. ఇద్దరూ, వేదిక దిగి తాము కూర్చున్న చోటికి వచ్చారు.
సోంబాబు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకా నమ్మలేక పోతున్నాడు. ద్వారం వారి కచేరీకి గజపతినగరంలో అమ్మమ్మ తో కలిసి ఒకసారి వెళ్లాడు. నిజంగా ఆయనేనా… తన చేతుల్ని చూసుకున్నాడు.
“ఇంక రోజూ నాయుడు గారిని చూస్తావు. అసలు వెంకటస్వామి నాయుడుగారు గానకళాశాల సంగతి విని విద్యార్థిగా చేరటానికి వచ్చారుట. తాతగారు ఆయన ప్రతిభ చూసి అధ్యాపకునిగా చేర్చుకున్నారుట.” సూర్యనారాయణ చెప్పాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.
సోంబాబు నెమ్మదిగా లేచి చుట్టూ చూశాడు. ఆవరణ అంతా నిండిపోయింది. అక్కడక్కడ వినిపించే గుసగుసలు తప్ప పెద్దగా ఏమీ శబ్దాలు రావట్లేదు.
వయోలీన్, మృదంగం శృతి చేసుకుని తయారుగా ఉన్నారు సహకార విద్వాంసులు. సన్నగా వాయులీనం వినిపిస్తోంది.
ఆవరణ అంతా ఒక రకమైన పవిత్రత ఆవరించు కుంది. గాలి కూడా రామా, కృష్ణా అంటున్నట్లు ఉంది.
దాసుగారు వేదిక మీదికి వచ్చి, కంఠం సవరించుకుని సన్నగా శృతి చూసుకున్నారు. ప్రేక్షకుల దగ్గర సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఎవరూ కదలటం లేదు.
సోంబాబు నిటారుగా అయి చూస్తున్నాడు.
“శ్రీమద్రమారమణ గోవిందో హరి…” అంటూ దాసుగారు మొదలుపెట్టగానే విజయనగరంలో సగం పైగా వీధుల్లోకి వినిపించేట్లు ధ్వని వచ్చింది. వినాయక స్తుతి, ఇష్టదేవతా ప్రార్ధన అవగానే కథ ప్రారంభించారు.
సోంబాబుకి చాలా ఇష్టమైన రుక్మిణీ కళ్యాణం… చాలా వరకూ అందులోవి, భాగవతంలో పద్యాలు కంఠస్తమే.
ఆశువుగా కీర్తనలు అల్లుతూ, చిన్న చిన్న కథలు చెప్తూ ప్రేక్షకులను కథాకాలం నాటికి తీసుకుని వెళ్లిపోయారు దాసుగారు... మధ్య మధ్యలో చిడతలు వాయిస్తూ నాట్యం చేస్తుంటే చూసే వారికి హుషారు వచ్చింది. చేతుల్తో తాళం వేసే వారు, అనుగుణంగా తలలూపే వారు… ప్రపంచంలోని చైతన్యమంతా అక్కడే ఉంది.
ఎప్పుడైనా ప్రేక్షకులకి ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తే “జై శ్రీమద్రమా రమణ గోవిందో హరి”, అని అంటూ అందరిచేతా అనిపించేశారు. రాబోయే నిద్ర ఝామ్మని పారిపోవలసిందే.
అంత గంభీరమైన కంఠం సోంబాబు ఎప్పుడూ వినలేదు. తల తిప్పుతే ఎక్కడ ఏది తప్పిపోతుందో అన్నట్లు కూర్చున్నారు అందరూ.
నవ యవ్వనవతి రుక్మిణీదేవి అందం వర్ణించేటప్పుడు, ఆవిడ నడక చూపిస్తూ వివిధ విధాలుగా నడుస్తూ, ప్రతీ భంగిమ లోని ప్రాధాన్యత… రుక్మిణీదేవి మనస్సులోని భావాన్ని ఎంతో అందంగా చెప్పారు దాసుగారు.
ప్రేక్షకులకి, విశాలమైన వక్షస్థలం కలిగిన ఆరడుగుల ఆజానుబాహుడు కనిపించలేదు. సన్నగా నాజూకుగా నడుస్తున్న సౌందర్యవతి రుక్మిణి, తన సహజ లావణ్యంతో కళ్లు మిరిమిట్లు కొలిపేటట్లు కనిపించింది.
హరికథ అయిపోయినట్లు కూడా ఎవరికీ స్పృహ లేదు. మంగళం పాడుతుంటే తెలిసింది.
ప్రేక్షకులు ఆపకుండా కరతాళధ్వనులు… వాయిస్తూనే ఉన్నారు.
చివరికి దాసుగారే ఆ చప్పట్ల చప్పుడుకి మించిన కంఠస్వరంతో ఆపమని అడగవలసి వచ్చింది.
మంగళం పాడుతుంటే, తప్పని సరిగా లేచారు అందరూ.
ఇంటికి వచ్చి పడుక్కున్నాక కూడా తెరలు తెరలుగా ఆ హరికథ వినిపిస్తూనే ఉంది సోంబాబుకి.
***
“ఏమిటీ? నారాయణదాసు గారింట్లో ఉంటున్నావా? వారికి బంధువులా మీరు?” శేషగిరి ఆశ్చర్యంగా అడిగాడు.
నమ్మలేనట్లు సోంబాబుని చూస్తూ…
“అవునండీ!. మా తాతగారికి వరుసకి తమ్ముడు. నాకు చిన్నతాతగారు.” సోంబాబు అతని కేసి వింతగా చూశాడు. ‘దాసుగారికి బంధువు లుండరా’ అనుకుంటూ.
“మరి వారి ఇంట్లోనే ఉంటావా?” ఇంకా ఆశ్చర్యమే శేషగిరి కంఠంలో.
“గాన కళాశాల తెరిచాక హస్తబల్ లో ఉంటాను. అప్పటి వరకూ వారి దగ్గర ఉండమన్నారు.”
“మరేం లేదు బాబూ! మాకు ఎవరికీ వారిని తలెత్తి చూసే ధైర్యమే లేదు. నువ్వు వాళ్లింట్లో ఉంటున్నావంటే కొద్దిగా…అబ్బురంగా అనిపించింది.” సోంబాబుని ఒక విధమైన ఆత్మీయతతో కొత్తగా చూస్తూ అన్నాడు.
సోంబాబు విజయనగరం వచ్చి ఐదు రోజులయింది. ఆరోజు ఆదివారం. బడికి సెలవు. శేషగిరికి కాస్త తీరిక చిక్కి సోంబాబు వివరాలు అడగటం మొదలు పెట్టాడు. అదిగో… అప్పుడే తెలిసింది కుర్రాడి సంగతి.
రామ్మూర్తి అవధానిగారి గురించి కూడా శేషగిరికి తెలుసు. లోగిస కరణంగారి బావమరిదే కద మరి! అందుకే కుర్రవాడు అంత తెలివిగా ఉన్నాడని అనుకున్నాడు.
“మీ ఇంట్లో అంతా వేద పండితులు కదా? నీకు సంగీతం మీద ఇంత ఆసక్తి ఎలా కలిగింది “ ఇంకా శేషగిరి ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.
“మా అమ్మమ్మగారు వాళ్లు ఆజ్జాడ వారే కదండీ. వాళ్ల దగ్గర్నుంచి వచ్చిందని అమ్మమ్మ అంటుంది. పైగా సామవేదం నుంచే సంగీతం పుట్టిందని అంటారు కదా!” సోంబాబు నెమ్మదిగా అన్నాడు.
“నువ్వు పాడి వినిపించావా? నీ ఆసక్తి చూసే అంత సులభంగా సరే అనేశారా?”
“పాడ లేదండీ. నన్ను చూపించి, సంగీతం అంటే నాకిష్టమని అమ్మమ్మ చెప్తే సరే అనేశారు.”
“ఇదివరకు నేర్చుకున్నావా?”
శేషగిరినీ, సోంబాబునీ మార్చి మార్చి చూస్తున్నాడు వాసు. తనకి దాసుగారి సంగతి అంతగా తెలియదు.
“వర్ణాల వరకూ వచ్చానండీ. పది వర్ణాలు వరకూ అమ్మమ్మే నేర్పించింది. అక్కడక్కడా విని నేర్చుకున్న కీర్తనలు ఉన్నాయి కానీ, పెద్ద వాళ్ల ముందు పాడటానికి కాస్త ఇబ్బంది గా ఉంటుంది మామయ్యా! అంటే… వినికిడి పాటలే కదా!”
మొహమాటంగా చూస్తూ అన్నాడు సోంబాబు.
“ఏదీ ఒక వర్ణం పాడు.” మామయ్య ఇంతలా అడుగుతుంటే వాసుకి కూడా అయోమయంగానే ఉంది.
వేదపాఠశాలలో చేరుతానంటే రాని సందేహాలు సంగీతం నేర్చుకుంటానంటే ఎందుకు వచ్చాయో అర్ధం కాలేదు అతనికి. సంగీతం కొందరికే వస్తుందా?
సావిట్లో ఒక పక్కగా ఉన్న ‘హార్మోనియం పెట్టి’ చూశాడు సోంబాబు. శేషగిరి కూతురు నేర్చుకుంటోంది.
విజయనగరంలో ప్రతీ ఇంట్లోనూ హార్మోనీ పెట్టి ఉంటుంది. అరవ దేశంలో లాగా ఇంచుమించుగా అందరికీ సంగీత జ్ఞానం ఉంటుంది. పాడటం రాకపోయినా నిశితంగా పరిశీలిస్తూ ఆనందించడం వస్తుంది. కొన్ని కొన్ని రాగాలు, తాళాలు కూడా తెలిసి ఉంటాయి.
“హార్మోనీ తీసుకోవచ్చాండీ?” తీసుకో అన్నట్లుగా తల ఊపాడు శేషగిరి.
పెట్టి నుంచి బైటికి తీసి, అందులోనే ఉన్న మెత్తటి బట్టతో హార్మోనియం తుడిచాడు సోంబాబు. ఎడంచేత్తో బెల్లోస్ లాగుతూ, కుడిచేతి వేళ్లు మెట్ల మీద కదిపాడు.
చక్కని నాదం వచ్చింది.
మంచి స్వరజ్ఞానం ఉందనుకున్నాడు శేషగిరి.
శృతి మాత్రం పెట్టుకుని మొదలుపెట్టాడు… కేదారగౌళ వర్ణం. పాడటం మొదలు పెట్టగానే సోంబాబు తీరు మారి పోయింది. పూర్తి ధ్యాస తన పాటమీద, హార్మోనియం మీదనే.
ముందుగా స్వరం, తరువాత సాహిత్యం. రెండు, మూడు కాలాల్లో. శృతి, లయ ఏ మాత్రం తప్పకుండా… రాగం లోని గమకాలు చక్కగా పలికిస్తూ పాడాడు.
“సనిదప నిదపద పామగ రీపమ పా,ని దప…” చిట్టస్వరం పాడుతున్నప్పుడు హార్మోనియం కూడా వాయించాడు.
శేషగిరి భార్య, కూతురు కూడా వచ్చి వింటున్నారు.
“హార్మోనియం ఎవరి దగ్గర నేర్చుకున్నావు?”
“అమ్మమ్మ గీతాల వరకూ నేర్పించింది మామయ్యా! తరువాత నేనే సాధన చేశాను. కొద్దిగా వీణ కూడా వాయించగలను… వాసు వాళ్ల ఇంట్లో ఉంది కదా. మెట్లు అవీ తెలుసు.”
సోంబాబు వేళ్ల కదలికలను బట్టి, వేగాన్ని… ఏకాగ్రతను బట్టి శేషగిరి గ్రహించాడు, ఒక గొప్ప వాయిద్యకారుడు, సంగీత విద్వాంసుడు ఆవిర్భవించబోతున్నాడని.
తనకైతే స్వయంగా చూస్తే కానీ, వింటే కానీ సోంబాబు ప్రతిభ తెలియలేదు.
దాసుగారు సర్వజ్ఞులు కదా పిల్లవాడిని, అతడి మోములో వెలిగే కళని, చేతి వేళ్లని, కళ్ళు తిప్పటంలో చురుకుదనాన్ని చూడగానే గ్రహించేసి ఉంటారు.
“వచ్చేనెల పదిహేనో తారీఖున గాన కళాశాల తెరుస్తారు. అప్పటివరకూ పగలు ఇక్కడికి వచ్చి సంగీతం సాధన చేసుకుంటూ ఉండు. నీతో పాటుగా వాసు, మా అమ్మాయి కూడా సాధన చేసుకునేటట్లు చూడు. మీ తాతగారిని అడిగి అనుమతి తీసుకునే రా.”
“అలాగే వస్తాను మామయ్యా! తాతగారివరకూ వెళ్లనక్కర్లేదు, సావిత్రి అత్తయ్యకి చెప్తే చాలు. ఇల్లంతా ఆవిడే చూసుకుంటుంది.” సోంబాబు ధృఢంగా అన్నాడు. అతనికి చాలా సంతోషంగా ఉంది, వాయించుకోవడానికి హార్మోనియమ్ దొరికింది కదా!
“రేపట్నించీ చిన్న మాష్టారు వస్తారు. మీరిద్దరూ ఆరో క్లాసు పుస్తకాలు చదవటం మొదలుపెట్టండి. కావలసిన పుస్తకాలు మనింట్లో ఉన్నాయి. నేను పాఠాలు చెప్తాను.”
“అలాగే మామయ్యా! అన్నం తినేసి వస్తాను.” సోంబాబు బయల్దేరాడు.
వాసు ఇంట్లో కెళ్లిపోయాడు.
శేషగిరికి ఇంకా నమ్మశక్యంగాలేదు, సోంబాబు దాసుగారి మనుమడంటే! ప్రతీ రోజూ ఆయనని చూడగలగడం… ఎంత అదృష్టం!
(తరువాయి భాగం వచ్చే గురువారం)
ముందు రెండు భాగాలనూ దిగువ లంకె లో చదవగలరు.
https://www.acchamgatelugu.com/2024/09/kacchapi-nadam.html
No comments:
Post a Comment