కచ్ఛపి నాదం - 4 - అచ్చంగా తెలుగు

 కచ్ఛపి నాదం - 4

మంథా భానుమతి 




శ్రీ విజయరామ గాన కళాశాల… గేటు ముందు, ఎదురుగా నిలబడి, కళ్లు పెద్దవి చేసుకుని, రెండు కాళ్లు ఎత్తి మరీ చూస్తున్నారు సోంబాబు, వాసు.

          అంత పెద్ద ఆవరణని, భవనాన్ని చూస్తుంటే ఇద్దరిలోనూ ఆశ్చర్యం… అనిర్వచనీయమైన భావన కలిగింది. కాళ్లు నొప్పి పుట్టాక మామూలుగా నిలుచున్నారు.

          “ఇక్కడే కదా నువ్వు వచ్చే పదేళ్లు గడపబోతున్నావు.” వాసు అబ్బురంగా చూస్తూ అడిగాడు.

          “అవునవును… ఊపిరి పీలుస్తున్నప్పుడు, వదులుతున్నప్పుడు సప్తస్వరాలూ పలకాలి. అవి మన మనసుకు వినిపించాలి. ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా ఎప్పుడూ సంగీత ధ్యానమే ఉండాలి మెదడులో, మనసులో. మిగిలినది ఏదైనా రెండో స్థానమే.” సోంబాబు ఉద్వేగం కళ్లలో, మొహంలో, చేతులు తిప్పటంలో కనిపిస్తోంది. శరీరం చిన్నగా కంపిస్తున్నట్లు తెలుస్తోంది.

          తాను అనుకున్నది సాధించిన తృప్తి అణువణువునా తెలుస్తోంది.

          నిజంగా తను విజయనగరం వచ్చాడా… నమ్మ బుద్ధి కావడం లేదు. ఒక సారి కళ్లు గట్టిగా మూసుకుని తెరిచాడు.

          పది సంవత్సరముల పిల్లవాడు మాట్లాడుతున్నట్లు లేదు… ఎవరో ఆవహించినట్లుంది.

           వాసు ఆశ్చర్యంగా చూశాడు సోంబాబు ఆవేశాన్ని.

          “మొన్ననే శేషు మామయ్య మనం అనుకున్నది సాధించాలంటే ఏం చెయ్యాలో చెప్పారు కదా, అందుకే అలా అలా రెచ్చి పోయాను… ఏమనుకోకేం!” కాస్త బిడియ పడుతూ అన్నాడు సోంబాబు.

          “అవునవును… మెలకువలో నిద్రలో కూడా అదే ధ్యాస ఉండాలన్నారు కదా.” వాసు గుర్తుకు తెచ్చుకున్నాడు.

           ఆ రోజే కళాశాలలో తరగతులు మొదలవబోతున్నాయి. ముందురోజే శేషగిరి మామయ్య ఇద్దరినీ తీసుకుని వచ్చి, సోంబాబుని చేర్పించాడు.

          వాసు, మహారాజా ఉన్నత పాఠశాలలో చేరి యస్సెసెల్సీ చదుతానన్నాడు.

          “అప్పుడప్పుడు పాడు కోవటానికి మాత్రమే నాకు సంగీతం” తడుము కోకుండా అనేశాడు.

          దాదాపు ఒక నెల పైగా సోంబాబుతో కలిసి సాధన చేసే సరికి, తనకి కావలసింది తెలిసింది. వాడికి ఉన్న తపన తనకి లేదని గ్రహించాడు.

          “సోమేశ్వర్రావ్! నువ్వు ఇక్కడ…” ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకి వచ్చాడు దాసుగారి ఇంట్లో కలిసిన అబ్బాయి, కృష్ణమూర్తి.

          “నేను ఈ కళాశాలలో చేరాలని ఈ ఊరు వచ్చాను. నిన్ననే చేరాను. తాతగారు వస్తారేమో అని చూస్తున్నాం. వచ్చాక లోపలికి వెళ్దామనేసి…”

          ‘ఎవరూ’ అన్నట్లు వాసు కేసి చూశాడు కృష్ణమూర్తి.

          “ఇతను శ్రీనివాస్, మా ఊరి వాడే. ఇద్దరం కలిసే వచ్చాము. ఇక్కడే వాళ్ల మామయ్య దగ్గర ఉండి చదువుకుంటాడు. ఈ ఊరంతా బాగా తెలుసు… అందుకని తోడుగా వచ్చాడు.” సోంబాబు వాసుని పరిచయం చేశాడు.

          “నా పేరు కృష్ణమూర్తి. వాసా వెంకట్రావుగారి అబ్బాయిని. మా నాన్నగారు ఈ కళాశాలలో అధ్యాపకులు. వీణ నేర్పిస్తారు. నేను నాన్నగారితో వచ్చాను. వారు ఇప్పుడే లోపలికి వెళ్లారు. నిన్ను ఇక్కడ చూసి ఆగాను. మనం ఆ రోజు దాసుగారి ఇంట్లో కలిశాం గుర్తుంది కదా… మా అమ్మగారు ఊరు వెళ్తే సావిత్రి అత్తయ్యగారు వాళ్లింట్లో అన్నం తిందువుగాని రమ్మని పిలిచారు. అన్నం తినగానే వెంటనే ఇంటికి వెళ్లిపోయాను నాన్నగారు వచ్చెయ్యమంటే.”

          “మీ నాన్నగారు ఇక్కడ మాస్టరుగారు కదా… అయితే మనం రోజూ కలుసుకుంటూ ఉంటాము. మా తాతగారు మీ నాన్నగారి దగ్గరే వీణ నేర్చుకోమన్నారు? మీ ఇంట్లో వీణలు ఉన్నాయా?” సోంబాబు కళ్లు పెద్దవి చేసి అడిగాడు.

          తను చేరబోయే సంగీత కళాశాల మాస్టరుగారి అబ్బాయి… అందరు పిల్లల లాగే తనతో మాట్లాడుతున్నాడు. కొంచెం కూడా గొప్ప చూపించటం లేదు. సోంబాబుకి నమ్మబుద్ధి కావట్లేదు.

          “చాలా ఉన్నాయి. కానీ నేను ఇక్కడ ఇంకా చేరలేదు. పదిసంవత్సరాలు నిండాలి చేరాలంటే. ఇంకా రెండేళ్లు ఆగాలి. నాకిప్పుడు ఎనిమిదేళ్లే. తప్పకుండా మనిద్దరం ఇక నుంచీ మంచి స్నేహితులం. కలిసి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుందాము.” కృష్ణమూర్తి మాట ఇచ్చేశాడు.

          అతను ఏ శుభ ఘడియలో అన్నాడో కానీ ఇద్దరి మధ్యా గాఢ స్నేహం కలిసి చివరి వరకూ నిలిచింది.

          “మీ ఇంటికి తీసుకుని వెళ్తావా నన్ను?” కళ్లు పెద్దవి చేసి అడిగాడు సోంబాబు.

          “తప్పకుండా తీసుకెళ్తా. నాన్నగారికి చెప్పి వెళ్దాము.” స్నేహంగా చూశాడు కృష్ణమూర్తి. సోంబాబు బాగా నచ్చేశాడు. సంగీతం మీద అతనికి ఉన్న ఆసక్తి కూడా నచ్చింది.

          నెమ్మదిగా కళాశాల ప్రాంగణంలోనికి ఒక్కొక్కరే వస్తున్నారు. కలకలం మొదలయింది.

          ఎంత పెద్ద గేటో… సోంబాబు తమ ఊర్లో అలాంటిది చూడలేదు.

          ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, పేరి బాబుగారు, వస్తూ ఉండగా, కళాశాల అధ్యక్షుడు నారాయణ దాసుగారు వచ్చారు. అందరూ కలిసి లోపలికి ప్రవేశించి మాట్లాడుకుంటూ వారి వారి స్థానాల లోనికి వెళ్లారు.

          అంతలో ఒక సహాయకుని చేయి పట్టుకుని ఒక అంధ బాలుడు కళాశాల లోపలికి వెళ్లాడు. కళ్లు కనిపించకపోయినా ఆ పరిసరాలన్నీ తెలిసినట్లుగా ఉన్నాయి అతనికి.

          “అతను?” ఎవరన్నట్లు కృష్ణమూర్తి కేసి చూసి సైగతో అడిగాడు సోంబాబు.

          చిన్నప్పటి నుంచీ వాళ్ల నాన్నగారిని చూస్తూ ఉండటం చేత సోంబాబుకి అంధులని చూస్తే ఆత్మీయులుగా అనిపిస్తారు.

          “ముందు మనం లోపలికి వెళ్లి నీ క్లాసుల సంగతి చూద్దాం.” వాసు తొందరపెట్టాడు.

          ముగ్గురూ కళాశాల లోపలికి వెళ్లారు. లోపల ఇంకా బాగా నచ్చింది సోంబాబుకి. విశాలమైన వరండాలు, పెద్ద పెద్ద క్లాసు గదులు… వాటిలో రకరకాల వాయిద్యాలు.

          ఆ రోజు క్లాసులేం జరగలేదు. పరిచయాలు అయాక, మర్నాటి నుంచీ మొదలవుతాయన్నారు.

          ఒక వ్రాత పుస్తకం తెచ్చుకోమన్నారు పేరి బాబుగారు. దాసుగారు తన బంధువుల అబ్బాయని చెప్పారేమో, అధ్యాపకులందరూ ఆప్యాయంగా మాట్లాడారు.

          “తాతగారి ఇంటికి వెళ్లి సామాన్లు తెచ్చుకుని, హస్తబల్ కి వెళ్లాలి. ఇంక ఇవేళ్టి నుంచీ అక్కడే ఉండాలి” సోంబాబు అంటుంటే తను కూడా వస్తానన్నాడు కృష్ణ మూర్తి.

          వాసు అట్నించి అటే, మధ్య దారిలోనే వాళ్ల మామయ్యగారి ఇంటికి వెళ్లి పోయాడు.

          ‘అంతే… ఈ వేళ్టి నుంచీ వాసు ఎప్పుడో సెలవు రోజుల్లో తప్ప కనిపించడన్నమాట. అలాగే కృష్ణమూర్తిని తోడుగా పంపించాడు దేముడు’ అని కూడా అనుకున్నాడు సోంబాబు. అంత చిన్న వయసు నుంచే ఏది జరిగినా భగవంతుని సంకల్పమే అనే అవగాహన వచ్చింది.

***

  “అత్తయ్యా!” చెప్పులు వీధి గుమ్మం దగ్గర వదిలి, ఇంట్లోకి వెళ్లి పిలిచాడు సోంబాబు.

  “వచ్చావా సోంబాబూ? ఎలా ఉంది మొదటి రోజు అనుభవం? కళాశాల నచ్చిందా? కృష్ణమూర్తి కూడా వచ్చాడే… ఇద్దరికీ అన్నం పెట్టనా? కూర అయిపోయింది కానీ పప్పు, పులుసు ఉన్నాయి” సావిత్రి అడిగింది.

   “మ్యూజిక్ కాలేజ్ ఎంత బాగుందో అత్తయ్యా! చాలా పెద్దది. అందరూ చాలా బాగా మాట్లాడారు. కృష్ణమూర్తి, నేను స్నేహితులం అయిపోయాము. నాకు అన్నీ పరిచయం చేస్తూ ఊర్లో ఎక్కడెక్కడ ఏముంటాయో వరుసగా చూపిస్తున్నాడు. మహారాజా వారి సత్రంలో అన్నం తినేసి వచ్చాము. హస్తబల్ లో ఉండే వాళ్లు రోజూ అక్కడే తిని రావాలి.”

  సోంబాబు రెండు గ్లాసుల్లో మంచినీళ్లు తెచ్చి ఒకటి కృష్ణమూర్తికి ఇచ్చాడు.

  పిల్లల అమాయకత్వానికి ముచ్చటవేసింది సావిత్రికి.

  “సత్రంలో వంట బాగుంది అత్తయ్యా… అస్సలు కారంగా లేదు.”

  “భలే వాడివే… మీ తాతగారి ఇంట్లో తింటానంటే వాళ్లేం వద్దనరు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అన్నం ఇక్కడే తినాలి తెలిసిందా… అమ్మమ్మ వంటలాగ ఉంటుంది కదా?” సావిత్రి నవ్వుతూ అంది.

  “నిజమే. అలాగే అత్తయ్యా!” బుద్ధి మంతుడిలా తల గుండ్రంగా తిప్పాడు సోంబాబు.

  “రాజావారి కోట దగ్గర టౌన్ హాల్లో పెట్టారు కాలేజి. పెద్దగా ఉండదా మరి… ముందు ముందు ఎందరో విద్వాంసులు బయటికి రావాలి అక్కడి నుంచి. ప్రస్తుతానికి గాత్రం, వీణ, వయోలీన్, మృదంగం, డోలు నేర్పిస్తున్నారు. తరువాత నాట్యం, సితార్, గిటార్ వంటివి కూడా పెడతారు. క్లాసులు మొదలయ్యాయా? ఏమేం నేర్చుకోమన్నారు?” సావిత్రి సోంబాబుని, కృష్ణమూర్తిని చాప మీద కూర్చోమని, చెరొక జంతిక తెచ్చి ఇచ్చింది.

   “రేపట్నుంచి క్లాసులు మొదలవుతాయట. పేరి బాబుగారి దగ్గర గాత్రం, వాసా వెంకట్రావుగారి దగ్గర వీణ నేర్చుకోమని చెప్పారు. ఇంతకు ముందు నేర్చుకున్నా సరే… సరళీస్వరాల దగ్గర్నుంచీ మొదలు పెట్టాలిట. పదేళ్ల కోర్సు. అప్పుడు డిప్లొమా పరీక్షకి కట్టిస్తారు. నేను, గంగబాబు అనే అబ్బాయి ఒకే క్లాసు. అతనికి నాన్నగారికి లాగే కనిపించదు. మీకు తెలుసా అత్తయ్యా?”

   తెలుసన్నట్లు తలూపింది సావిత్రి.

   కృష్ణమూర్తి మంచినీళ్లు తాగి కుతూహలంగా చూశాడు.

   “అతని పేరు చాగంటి గంగబాబు. చాగంటి జోగారావు పంతులుగారి కొడుకు. పంతులుగారు విజయనగరం మహారాజా పూసపాటి విజయరామరాజ గజపతిగారి ఆస్థానంలో దివాను గా పనిచేస్తారు. గంగబాబు పుట్టుకతో అంధుడని తెలుసుకుని అతని భవిష్యత్తు కోసమే ఈ కళాశాల స్థాపించారు రాజావారు.”

  “అవునా… రాజా వారు ఎంత మంచి వారో కదా? ఆ అబ్బాయి కోసం ఏకంగా కాలేజీ పెట్టించారంటే…” సోంబాబుకి అక్కడ జరిగేవి అన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి.

   “వారికీ, పంతులుగారికీ ఉన్న స్నేహం అటువంటిది. ఇప్పటికే దేశంలో అందరికీ కళాశాల గురించి తెలిసి ఉత్తర హిందూస్తానీ సంగీతం నేర్పించే వారు కూడా వచ్చారు.

   కలకత్తా నించీ రామేశ్వరం వరకూ ఇదొక్కటే సంగీత కళాశాల. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలు కలిపి కొత్త బాణీ తయారు చేశారు గురువుగారు... అంటే మీ తాతగారు. దానిని విజయనగరం బాణీ అని పిలుస్తున్నారు...” సావిత్రి సంగీత కళాశాల గురించి వివరించింది.

  సోంబాబుకి ఆ మాటలు వింటుంటే… అక్కడే తను కూడా సంగీతం నేర్చుకో బోతున్నానని చాలా సంతోషం కలిగింది. ఒకసారి అమ్మమ్మని తలుచుకున్నాడు. ఎంత మంచి అమ్మమ్మో… రాజా వారంత మంచిది.

  అమ్మమ్మ కల్పించుకోవడం వల్లనే, నాన్నగారికి నచ్చ చెప్పటం వల్లనే తను ఇక్కడికి రాగలిగాడు కదా! ఎలా ఉందో… అమ్మమ్మ లేకుండా ఉండగలడా? ఉండాలి. ధైర్యం తెచ్చుకోవాలి. ఆవిడ మాట నిలబెట్టాలి.

  “అత్తయ్యా! నా సామాన్లు తీసుకుని వెళ్తాను హస్తబల్ కి. సామాన్లంటే పెద్దగా ఏం లేవు… నాలుగు జతల బట్టలు, దుప్పటి ఉన్న ట్రంకు పెట్టె. దానికి గొళ్లెం వేయించి తాళం వేయించింది అమ్మమ్మ. అవి కాక ఒక చాప… అంతే.”

  “ఎలా తీసుకెళ్తావు? మూల మీద ఉండే చాకలతన్ని పిల్చుకురా. సాయం చేస్తాడు. నేను చెప్తాను.” సావిత్రికి సోంబాబు ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేసింది.

   అప్పటికి దాసుగారింట్లో పనిచేసే వాళ్లంతా అలవాటయ్యారు సోంబాబుకి. తుర్రుమని పరుగెత్తాడు.

***

   ‘హస్తబల్’… అంటే విజయనగరం మహారాజావారి ఏనుగుల శాల. ఆ సమయంలో రాజావారికి ఏనుగులు లేకపోయినప్పటికీ, కొన్ని తరాల వెనుక ఉండి ఉండవచ్చు.

   వారి వద్ద ఏనుగులు చాలా ఉండేవి కనుకనే వారికి గజపతులు అని పేరు వచ్చి ఉంటుందని జన వాక్యం…

   ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఏనుగులు చాలా ఎక్కువగా ఉండటం వలన కూడా అక్కడి రాజులని గజపతులు అని వ్యవహరించేవారని అంటుంటారు. ఓఢ్ర దేశ రాజులు గజపతులకి వీరికీ బంధుత్వం ఉందని కూడా కొందరంటారు.

  ఏ కారణమైనా కానీ ఆ స్థలం, అక్కడి హాలు హస్తబల్… ఏనుగుల శాల అయింది.

  కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ గుర్రాలని కట్టేసేవారని అంటారు. అయితే పేరు అశ్వబల్ అని ఎందుకు మార్చలేదో అని నవ్వుకుంటూ ఉంటారు ప్రజలు.

  తరువాత ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి అశ్వబలం సేకరణ మీద కూడా ఆసక్తి పోయింది రాజులకి. ఫిరంగులు, తుపాకీలు వచ్చేశాయి.

  అందుకే విశాలమైన హస్తబల్ శాల ఖాళీగా ఉండిపోయింది. విజయరామరాజు గారి కాలంలో పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చేస్తూ హస్తబల్ ని సద్వినియోగం చెయ్యాలని నిర్ణయించారు.

  ఆ సమయం లోనే… ఆ హస్తబల్ ని మహారాజా వారి పాఠశాలలో, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకి వసతి గృహంగా ఏర్పాటు చేశారు.

  అక్కడ నివాసం ఉంటూ, విద్యార్థులు సింహాచలం వరాహ నరసింహస్వామి పేరున ఉన్న మహారాజా వారి సత్రంలో భోజనం చేస్తూ విద్యలు అభ్యసిస్తారు.

  విజయనగరం మహారాజులు ప్రజల అభివృద్ధి, యోగక్షేమాల గురించి పట్టించుకుంటూ సంపద కంటే వారి అభిమానాన్ని అధికంగా సంపాదించుకున్నారని ప్రతీతి.

  సోంబాబు తన ట్రంకు పెట్టె, చాప ఒక వారగా, కిటికీ పక్కన పెట్టుకున్నాడు. దాదాపు పదిహేను మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

  కృష్ణమూర్తి హాలు చుట్టుపక్కల అంతా చూపించి వెళ్లిపోయాడు.

  సోంబాబుది సహజంగా కలివిడిగా ఉండే తత్వం కనుక అక్కడ ఉండే కొందరు విద్యార్థులతో పరిచయం చేసుకుని, వారి వివరాలు కనుక్కున్నాడు. సంగీత కళాశాల నుంచి అక్కడ ఉన్నది తానొక్కడే అని తెలిసింది.

  రాత్రికి అన్నం తిని వచ్చి పక్క వేసుకుని పడుక్కోగానే ఒక్క సారిగా వంటరితనంతో నిస్సత్తువ ఆవహించింది. ‘లోగిస’లో అయితే, ఇల్లంతా తమ్ముళ్ల అల్లరితో, అమ్మ తెలిసీ తెలియక చేసే పనులతో, అమ్మమ్మ సర్ది చెప్తుండడాలతో… నాన్నగారి కోసం వచ్చే బంధు మిత్రులతో హడావుడిగా ఉండేది.

  నిత్యం వేద పఠనంతో, అమ్మమ్మ పాటలతో, పద్యాలతో ఇంట్లో హడావుడి… తను కూడా ఏదో ఒకటి పాడుతూనో తాళం వేస్తూనో… అలా గడచి పోయేది. ప్రతి వీధిలో బంధువులు… రోజూ ఏవో పూజలూ, పండుగలూ! ఇన్నాళ్లకి ఇప్పుడు లోగిస, అమ్మ, అమ్మమ్మ గుర్తుకు వచ్చారు.

  విజయనగరం వచ్చాక కూడా, తాతగారి ఇంట్లో తమ ఇంట్లో లాగానే సందడిగా ఉంది.

  పగలంతా పక్కన వాసు, కృష్ణమూర్తి తోడు ఉండటం, పనులతో తిరగటం తో తెలియలేదు.

  చుట్టూ చూశాడు. అందరూ తన కంటే పెద్దవాళ్లే. మొన్న మొన్నటి వరకూ అమ్మమ్మ చేతి ముద్దలు తిన్నవాడు… పొద్దున్నే ఎవరూ లేపే వాళ్లు లేరు. “స్నానం చెయ్యి, అన్నానికి రా” అని పిలిచే వాళ్లు లేరు.

  తన వాళ్లు అందరూ ఏరి? ఇంక ఎవరూ కనిపించరా? సోంబాబు ఉన్నట్లుండి తొమ్మిది సంవత్సరాల పసివాడై పోయాడు. ఎంత పెద్దరికం తెచ్చుకున్నా అసలు వయసు అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంటుంది.

  ఎందుకో ఒక్క సారిగా భయం వేసింది. విజయనగరం వచ్చాక కూడా, హస్తబల్ కి రాక ముందయితే తన వాళ్లనే వాళ్లున్నారని… పిలిస్తే పలికే అత్తయ్య, మాట్లాడక పోయినా కొండంత తాతగారు ఇంట్లో ఉన్నారన్న ధైర్యం, పగలు శేషు మామయ్య… వాసు తోడుగా ఉండటంతో తెలియలేదు. ఇప్పుడు ఎవరూ లేరనే నిజం గ్రహించేసరికి దుఃఖం వచ్చేసింది.

  ఆపుకోలేక పోయాడు. పక్క మీద బోర్లా పడుకుని గట్టిగా ఏడుస్తూ వెక్కిళ్లు పెట్టసాగాడు. ఏడుస్తుంటే దుఃఖం ఇంకా ఎక్కువవుతోంది. దుప్పటి అంచుతో తుడుచుకోవడం, ఏడవడం… కడుపులోనుంచి తెరలు తెరలుగా వచ్చేస్తోంది.

  “అయ్యయ్యో! ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమయింది? ఊరుకో… ఊరుకో. అందరూ వచ్చారంటే వేళాకోళం చేస్తారు.” పదిహేనేళ్ల అబ్బాయి ఒకతను దగ్గరగా వచ్చాడు.

  సోంబాబు వెల్లకిలా తిరిగి లేచి కూర్చున్నాడు. ముక్కు మొహం ఎర్రగా అయిపోయాయి. బుగ్గల నిండా నీళ్ల చారికలు. ఎగ పీలుస్తూ వెక్కుతూ చూశాడు.

  మొహం లేతగా ఉంది. సన్నగా, చిన్నగా ఉన్నాడు. ‘అప్పుడే పంపించేశారే…’ అనుకున్నాడు.

  “ఇవేళే వచ్చావా? అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? మొదట్లో అలాగే ఉంటుంది. నెమ్మదిగా అలవాటయిపోతుంది. అందరం అలా ఏడ్చినవాళ్లమే. ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఇంత చిన్నప్పుడే పంపేశారా? ఏ విద్య అయినా పదేళ్లు దాటుతే కానీ చేర్చుకోరు కదా!” సోంబాబు తన వయసుకంటే చిన్నగా కనిపిస్తాడు.

  సోంబాబు తన గురించి అంతా చెప్పాడు.

  “నాకు పదేళ్లు. చిన్న పిల్లాడిని కాదు.” రోషంగా అన్నాడు.

  “సంగీతమా? ఇప్పటి వరకూ ఎవరూ లేరు ఇక్కడ. నువ్వే మొదటి వాడివి. నేను హైస్కూలులో ఫిఫ్తు ఫారం చదువుతున్నాను. ఏం భయంలేదు. ఏమి అవసరం వచ్చినా నన్ను అడుగు. నా పేరు రామశాస్త్రి. ఆ వరాహ నరసింహ స్వామిని తలుచుకుంటూ పడుక్కో. భయం పోతుంది. మాది సింహాచలం. మేము ఎప్పుడూ స్వామి నామం అనుకుంటూ ఉంటాము.”

  పక్కకు తిరిగి ముడుచుకుని పడుక్కున్నాడు సోంబాబు. కదులుతూ కొద్దిగా వణికాడు.

  “రాత్రికి బాగా చలేస్తుంది. ఇంకో దుప్పటి లేదా? నేనిస్తానుండు.” తన పెట్టెలో నుంచి దుప్పటీ తీసి కప్పాడు శాస్త్రి.

  అమ్మా నాన్నలకి దూరంగా వచ్చేస్తే ఎవరో ఒకరు ఆదుకునే వాళ్లు దొరుకుతారు. సృష్టి రహస్యం అదే నేమో! మళ్లీ దేముడు గుర్తుకు వచ్చాడు.

 

  అలవాటు చొప్పున ఐదున్నరకి లేచేశాడు సోంబాబు. తన పనులన్నీ చేసుకుని, స్నానం కూడా చేసి, ఆవరణ అంతా ఒక సారి తిరిగి వచ్చాడు.

  ఇంకా చీకటి చీకటిగానే ఉంది. ఎవరూ లేవలేదు. అయినా భయం వేయలేదు. తరువాత ఏం చెయ్యాలి?

  ఆకాశంలో ఎఱ్ఱ బడుతున్న వైపుకి తిరిగి ఆదిత్య హృదయం మొదలు పెట్టాడు.

  “తతో యుద్ధ పరిశ్రాంతమ్ సమరే చింతయాస్థితమ్

  రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపాగతమ్

  ………….. రశ్మి మంతం సముద్యంతం దేవాసుర

   నమస్కృతమ్…..

ఇతి ఆదిత్య హృదయమ్.”

  మొత్తం స్తోత్రం అంతా కంఠతా వచ్చు సోంబాబుకి.

  అమ్మమ్మ రోజూ స్నానం చెయ్యగానే, సూర్యుడికి ఎదురుగా నిల్చుని, రెండు చేతులూ ఎత్తి దణ్ణాలు పెడుతూ స్తుతిస్తుంది.

  వినీ వినీ సోంబాబుకి కంఠతా వచ్చేసింది.

  “రామ రావణ యుద్ధం జరగడానికి ముందు, రాముడికి, సప్తర్షులలో ఒకరైన అగస్త్యుడు ఉపదేశించాడు. రోజూ చదువుకుంటే ఆ రోజు పనులకి అడ్డం ఉండదు. ఏదైనా కొత్త పని ఆరంభంచేటప్పుడు తప్పకుండా చదువుకోవాలి.”

  అమ్మమ్మ చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోడు సోంబాబు. ఆదిత్య హృదయం అయే సరికి సూర్యుడు కొద్దిగా వచ్చి, ఆకాశం అంతా ఎర్రగా అయింది.

  ఇవేళ సంగీత కళాశాలలో క్లాసుకి మొదటి సారిగా వెళ్తున్నాడు కదా! ఏ అడ్డంకి లేకుండా కోర్సు పూరయేటట్లు చూడమని సూర్యదేవుడిని అడిగేశాడు.

***

  తరువాత…

  కొంచెం దూరంగా ఉన్న చెట్టు కిందికి వెళ్లి కూర్చున్నాడు. పక్షులు రెక్కలు విదిలించు కుంటూ, పైకీ కిందికీ ఎగురుతూ రకరకాలుగా కూస్తున్నాయి.

  అంతటా కదలిక వచ్చేసింది.

  కొద్దిగా చలిగానే ఉంది. చేతులు కాళ్లు ముడుచుకున్నాడు. తాతగారి దగ్గర బోలెడు శాలువాలు ఉన్నాయి, పాతది ఒకటి ఇస్తుందేమో అత్తయ్యని అడగాలనుకున్నాడు.

  ఈ లోగా ఒక కోయిల మొదలు పెట్టింది పంచమంలో సంభాషణ. ఇంకొక కోయిల సమాధానం ఇచ్చింది.

  మిగిలిన పక్షుల రెక్కల చప్పుళ్లు తాళం వేస్తున్నట్లు ఉంది. అలా కాసేపు వాటి గానం విన్నాక సోంబాబుకి ఒక ఆలోచన వచ్చింది.

  అంతే అమలు చేసేశాడు.

  సా… పా…సా పట్టాడు రెండేసి నిముషాలు.

  సరళీ స్వరాలు, జంట స్వరాలూ నాలుగు కాలాల్లోనూ సాధన చేశాడు. తరువాత త్రి స్థాయిల్లో అకార సాధన… మూడు స్థాయిల్లోనూ బాగా అందుతున్నాయి స్వరాలు.

  చలి ఎప్పుడో పారి పోయింది. మనసంతా హాయిగా, తేలిగ్గా ఉంది. లేచి నిలబడి కాళ్లు చేతులూ సాగ దీసుకున్నాడు. రోజూ ఇంకొంచెం ముందు లేచి సాధన చేయాలని, రెండు రౌండ్లు పరుగు కూడా పెట్టాలని అనుకున్నాడు.

  తనకి వచ్చినవన్నీ పాడుకుంటూ… సాధన పూర్తయ్యే సరికి తెల్లగా తెల్లారింది.

  శాస్త్రి ఇంకో ఇద్దరు కుర్రాళ్లతో వచ్చాడు.

  “అప్పన్న, నరసింహం… మా క్లాసే.” పరిచయం చేశాడు.

  సోంబాబు తల పైకెత్తి నవ్వాడు.

  “ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? నీ కోసం వెదుకుతున్నాను. దా… సత్రంకి వెళ్లి అన్నం తిని బడికి వెళ్లాలి. స్నానం చేశావా?”

  “ఆ… లేవగానే చేసేశా అన్నయ్యా! బట్టలు ఉతికి ఆరేసుకున్నా కూడా. నా పెట్టె పైనున్న కిటికీకి, పక్క కిటికీకి కలిపి తాళ్లు కట్టాను… బైట గోడవతల. అత్తయ్య ప్రతీ రోజూ ఏం చెయ్యాలో చెప్పింది. దండానికి తాళ్లు కూడా తనే ఇచ్చింది. ఎంత బెంగ వచ్చినా కడుపు నిండా అన్నం తినాలని కూడా చెప్పింది. నాకు తెల్లారకట్ల లేవటం అలవాటు. సంగీత సాధన చేస్తున్నా.” సోంబాబు సమాధానం ఇచ్చాడు.

  శాస్త్రి మెచ్చుకుంటున్నట్లు చూశాడు. ఈ అబ్బాయి, ‘నిన్న రాత్రి కొంచెం బాధ పడ్డాడు కానీ, పూర్తిగా తయారయే వచ్చాడు. ఇంక ఏ సమస్యా లేదు’ అనుకున్నాడు.

  “పొద్దున్న చద్దన్నం పెడతారు. ఆవకాయో మజ్జిగో వేసుకుని తినెయ్యటమే. మధ్యాన్నం, రాత్రి వేడన్నం, పప్పు, కూర చారు పచ్చడితో పెడతారు. మేము లేకపోయినా నువ్వు వెళ్లి తినెయ్యవచ్చు. పిల్లలు వెళ్తే… అందులో ఇక్కడ చదువు కునే పిల్లలు, లేదనకుండా, కావలసినంత వడ్డిస్తారు.”

  “అలాగే… తెల్ల కాయితాలతో పుస్తకం కుట్టి తెచ్చుకోమన్నారు. నా దగ్గర రెండు రూపాయలున్నాయి. కొంచెం సాయం చేస్తావా అన్నయ్యా?” సోంబాబు నెమ్మదిగా అడిగిన తీరు శాస్త్రికి, అతని స్నేహితులకి బాగా నచ్చింది.

  “పుస్తకం నా దగ్గరుందిలే, ఇస్తాను. సాయంత్రం వెళ్లి కాగితాలు తెచ్చుకుందాం. కంఠాణీ, దారం కూడా ఉన్నాయి. అట్టలు కూడా వేసి కుట్టుకోవచ్చు. పద… వెళ్దాము.”

***

  సోంబాబు గదికి వెళ్లి తన సంచీ తెచ్చుకుని, రెండు కాళ్లతో గెంతుతూ వచ్చాడు.

  ఆ వేళే సంగీతం క్లాసు మొదలు… అదీ రాజా వారి పెద్ద కాలేజీలో. ఎంతగా ఎదురు చూశాడో! తన కల నెరవేరబోతోంది.

  శేషు మామయ్య ఎంత గొప్పగా చెప్పాడో కాలేజీ, అందులో సంగీతం నేర్పే గురువుల గురించి… సావిత్రి అత్తయ్య కూడా!

  ఎలాగైనా బాగా నేర్చేసుకోవాలి. మళ్లీ… అమ్మమ్మ జ్ఞాపకం వచ్చింది. ఒక సారి తల విదిల్చాడు. అమ్మమ్మని సంతోషపెట్టాలి. అదే తన ఆశ, ఆశయం.

  “అబ్బో… చాలా సంతోషంగా ఉన్నావే! అదంతా కాలేజీలో చేరుతున్నందుకే” శాస్త్రి నడుస్తూ అన్నాడు.

  “అవునన్నయ్యా… అందుకే గదా ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకూ అరుగు మీద బడి తప్ప స్కూల్ కే వెళ్లలేదు. మా కాలేజ్ ఎంత బాగుందో తెలుసా? చాలా పెద్దది.” రెండు చేతులూ బార్లా జాపి అన్నాడు.

  “ఇక్కడ మహారాజా వారి ఏ సంస్థ అయినా అలాగే ఉంటుంది. మా స్కూల్ కూడా చాలా బాగుంటుంది.” శాస్త్రి, సోంబాబు ఉత్సాహానికి ముచ్చట పడుతూ అన్నాడు.

  “వీడిని మన ఫుట్బాల్ జట్టులో చేర్చుకోవచ్చేమో, చాలా తేలిగ్గా ఎగురుతున్నాడు.” శాస్త్రి తో వచ్చిన అప్పన్న సలహా ఇచ్చాడు.

  “నిజమే. అడుగుదాం తనకి ఆసక్తి ఉందో లేదో? పైగా కాస్త ఒడ్డూ పొడుగూ పెరగాలి. ఎగుర్తే సరిపోదు.” శాస్త్రి సోంబాబుని చూస్తూ అన్నాడు.

  సోంబాబు వెంటనే మామూలుగా నడవసాగాడు. తనకి ఆటల మీద అంత ఇష్టం లేదు. ఏదో అప్పడప్పుడు ఫరవాలేదు కానీ జట్టు లో చేరడం అదీ… అంటే రోజూ వెళ్లాలి. తన సంగీతానికి ఆటంకం కలిగించే ఏ పనైనా పక్కకి తోసెయ్యాలిసిందే!

  “ముందరా అబ్బాయిని ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి సర్దు కోనియ్యండి.” నరసింహం మాటలకి ‘అమ్మయ్య’ అనుకుంటూ కుదుట పడ్డాడు సోంబాబు.

  రాత్రి సరిగ్గా తినలేకపోయాడేమో అన్నం చూడగానే ఆకలేసింది సోంబాబుకి. పక్కన శాస్త్రి వాళ్లు ఉన్నారు కూడా… ఇంకా చిన్న పిల్లాడి వేషాలు అనుకోరూ? అమ్మమ్మ దగ్గర లేదని ఆలోచించ కుండా, ఆవకాయ, నీళ్ల మజ్జిగ అన్నం కడుపు నిండా తినేశాడు.

  “నువ్వు ఒక్కడివీ వెళ్లగలవా మేము వచ్చి చూపించాలా?” శాస్త్రి అడిగాడు.

  అంతలో కృష్ణమూర్తి రానే వచ్చాడు. శాస్త్రికి పరిచయం చేసి సంగీత కళాశాలకి వెళ్లిపోయాడు సోంబాబు తన స్నేహితుడితో.

  “చీమ్మిరపకాయలా ఉన్నాడు. ఎవరబ్బాయో కానీ… ఏం ఎనర్జీ!” నరసింహం మాటలకి అవునన్నట్లు తలలూపారు మిగిలిన ఇద్దరూ.

  నరసింహం మాట్లాడేటప్పుడు వీలైనంత వరకూ ఇంగ్లీషు పదాలు వాడుతుంటాడు. ఎలాగైనా లండన్ వెళ్లి ‘ బార్ ఎట్ లా’ చదవాలని అతని కోరిక, ఆశయం.

  “వేదపండితుల కుటుంబంట. వాళ్ల నాన్నగారు చాలా పెద్ద పేరున్న ఘనాపాటీ... మైసూరు, విజయనగరం, కళింగ వంటి రాష్ట్రాల మహారాజుల సన్మానాలు అందుకుంటున్న వారుట. శ్రీమదజ్జాడ నారాయణదాసు గారి బంధువులట కూడానూ.” ముందు రోజు రాత్రి సోంబాబు చెప్పిన విశేషాలన్నీ మిత్రులకు వివరించాడు శాస్త్రి.

  “ఆ కుర్రాడిని చూస్తే అలాగే అనిపించాడు. తను చేయదలచుకున్న పని మీద శ్రద్ధ బాగా ఉన్నట్లు కనిపిస్తోంది.” అప్పన్నకి, నరసింహానికి కూడా సోంబాబు మీద మంచి అభిప్రాయం కలిగింది.

  “నిజమే… ఈ వయసులోనే ఎవరూ చెప్పకుండానే తెల్లారకట్లే లేచి సాధన చేస్తున్నాడు. అదీ, ఇంకా కళాశాలలో చేరక ముందే! తప్పకుండా అనుకున్నది సాధిస్తాడు.” శాస్త్రీ, అతని స్నేహితులూ సోంబాబుకి హస్తబల్ లో సన్నిహితులయ్యారు. తనకి ఏ అవసరం వచ్చినా సంకోచించకుండా అడుగుతున్నాడు.

                  

   కళాశాల ఆవరణలోకి అడుగు పెడుతూ వినాయకుడిని తలుచుకుని మనసులో దణ్ణం పెట్టుకున్నాడు సోమేశం. అది కూడా, అమ్మమ్మ చెప్పినట్లు ‘శుక్లాంబరధరం విష్ణుం…’ చదువుకున్నాకనే.

  కళాశాలలో చేరాక సోంబాబు, సోమేశంగా అందరికీ పరిచయం అయ్యాడు.

  సోమేశం, సరస్వతీ స్తుతి చేసుకుంటూ క్లాసులో అడుగు పెట్టాడు… భవిష్యత్తులో వైణికునిగా అనేక పురస్కారాలు, బిరుదులూ, ప్రశంసలూ అందుకోవటానికి అదే నాంది అయింది.

  అప్పటికే గంగబాబు వచ్చేశాడు. వయోలీన్ అభ్యాసం చేస్తున్నాడు.

  పేరి బాబుగారు అన్నట్లుగానే సరళీ స్వరాల తోనే మొదలు పెట్టారు… కానీ అతి త్వరలో వర్ణాల స్థాయికి వచ్చేశారు ఇద్దరూ.

  ఇద్దరికీ కూడా ఇంక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. మంచి స్నేహితులైపోయారు.

  క్రమం తప్పకుండా సాధన… మిత్రుడు వాసుతో తొమ్మిదేళ్ల సోంబాబు అన్న మాటలు నిజం చేస్తున్నాడు సోమేశం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడూ కూడా సంగీతం…

  సంభాషణలన్నీ సంగీతం సంబంధితాలే!

  పేరి బాబు గారి దగ్గర గాత్రం సాధన చేస్తూ ఉండగానే, వాసా వెంకట్రావు గారి వద్ద వీణ పాఠాలు ప్రారంభించిన సోమేశం తన భవిష్యత్తు, తన ధ్యేయం ఏమిటో తెలుసుకున్నాడు.

  కృష్ణమూర్తి వీణ సాధనలో సహాధ్యాయి అయి, తమ ఇంటికి తీసుకుని వెళ్ల సాగాడు. సోమేశం హస్తబల్ లో కంటే కళాశాలలో, వాసా వారి ఇంట్లో ఎక్కువగా గడపసాగాడు.

  సోమేశం అభిరుచి, ఆసక్తి గమనించిన వెంకట్రావుగారు తన శిష్యునికి తగిన ప్రోత్సాహం ఇవ్వసాగారు.

  సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, గురువులకి ప్రియ శిష్యులై పోయారు సోంబాబు, కృష్ణ మూర్తి కూడా.

  వీణ నిలబెట్టి వాయించటంలో ప్రావీణ్యత సంపాదించారు స్నేహితులిద్దరూ. ఎంతో పట్టు ఉంటే కానీ ఆ విధంగా వాయించలేరు.

  ఎక్కడ కచేరీ అయినా కృష్ణమూర్తితో సోమేశంని కూడా తీసుకుని వెళ్తున్నారు వెంకట్రావుగారు.

  వీలు కుదిరినప్పుడు స్నేహితులు కలిసి, విడివిడిగా వేదికల మీద వాయిస్తున్నారు.

  విజయనగరం రాగలగటం సోమేశం వంటి అనేకమంది కళాకారులకి పునర్జన్మ లభించినట్లే.

  నిరంతరం నారాయణదాసుగారి వంటి మహానుభావుని ఛూడటం, అవకాశం ఉన్నప్పుడు అజ్జాడవారి అవధానాలు, హరి కథలూ వినగలగటం ఒక వరం.

   వాసా వారి వంటి వైణికుడు, ద్వారం వారి వంటి వాయులీన విద్వాంసుల సమక్షంలో గడపగలగడం ఎంతో అదృష్టం… అనుక్షణం సంగీత కారుల సూచనలు ఎందరికో స్ఫూర్తి నిచ్చి దిశా నిర్దేశం చేశాయి.

  అమ్మమ్మని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు సోమేశం. ఆవిడ చొరవ వలననే కదా ఇదంతా!

  ఒకేసారి నాలుగు గతులలో వీణ వాయించగల శ్రీమదజ్జాడ నారాయణదాసుగారి ప్రతిభ సోమేశం ని ముగ్ధుడిని చేసి మరింత శ్రద్ధగా తన ధ్యేయం వైపుకి నడిపించింది.

   నారాయణ దాసుగారికి సంగీతానికి సంబంధించి రాని వాయిద్యం లేదు. బహు భాషా కోవిదుడు. ఎన్నో భాషలలోని సంగీత సాహిత్యాలని మధించారు.

***

  ఆ రోజు సాయంకాలం సోమేశం కలలోనైనా ఊహించని సంఘటన జరిగింది.

  తాతగారు పదవీ విరమణ చేసి, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ గా పదవీ స్వీకరణ చేసిన తరువాత, తొలిసారి వారి వద్ద నుంచి పిలుపు వచ్చింది.

  పది సంవత్సరముల డిప్లొమా కోర్సులో ఏడవ సంవత్సరంలో ఉన్నాడు. అప్పటికే రాగం, తానం పల్లవుల శిక్షణ, సాధన మొదలయింది.

  ఎందుకు పిలిచారో అని ఆలోచిస్తూ వెళ్లాడు… కింది తరగతుల వారి చేత సాధన చేయిస్తూనే ఉన్నాడే... తాను కూడా గురువుల సూచనలు పాటిస్తూ బాగా నేర్చుకుంటున్నాడు.

  భయమైతే వెయ్యలేదు కానీ కుతూహలం కలిగింది. ఏమిటయి ఉంటుంది?

  తన వాయిద్యాన్ని ద్వారం వారు అప్పుడప్పుడు గమనించటం చూస్తున్నాడు. వీణ వాయిస్తుండే గది ముందు నుంచి వెళ్తూ కాసేపు ఆగి వింటున్నారు.

   “దా! సోమేశం. ఇక్కడ బాగా అలవాటయింది కదా? రేపు రాజా వారి వద్ద నా కచేరీ ఉంది. నీవు సహకారం అందించాలి.” నాయుడు గారి ఆదేశం విని ఆశ్చర్యపోయాడు. కొంచెం భయం కూడా వేసింది.

  ద్వారంవారికి సహకారమా? అదీ రాజావారి సమక్షంలో… తను ఆశిస్తున్నదే అయినా తొలిసారి కదా!

  తన గురువులు పేరి బాబుగారు, వాసా వెంకట్రావుగారు మంచి అభిప్రాయం కలిగించారన్నమాట. ఇంతటి అవకాశం ఇంత త్వరగా లభించింది… ఎలాగైనా సద్వినియోగ పరచుకోవాలి.

  అరచేతుల్లో కొంచెం చెమట మొదలయింది. చేతి వేళ్లు ముడుస్తూ విప్పుతూ ఒత్తిడి తగ్గించు కుంటున్నాడు.

  వెంటనే గురువుగారు వెంకట్రావుగారి ఇంటికి వెళ్లాడు. వారు లేరు కానీ, కృష్ణమూర్తి అక్కడే ఉన్నాడు.

  అప్పటి వరకూ ఇద్దరూ చాలా సార్లు ద్వారం వారి కచేరీ, వెంకట్రావుగారి సహకార వాయిద్యం చూసి… విని ఉన్నారు.

  గురువుగారు ఇంకా రాలేదు. వీణ శృతి చేసుకుని వాయించటం మొదలు పెట్టాడు.

  కృష్ణమూర్తి… తను తరువాత కలుస్తానని చెప్పి, సోమేశం వీణా వాదనని గమనించ సాగాడు.

  సాధారణంగా అందరూ కచేరీ హంసధ్వని రాగంతో మొదలు పెడతారని, ఆ రాగం వాయించసాగాడు. ఏ కచేరీకి వెళ్ళినా, ప్రతీ కచేరీలోను కొత్త సంగతులుంటే వ్రాసుకుని, తాను ఇంకొంచెం పెంచి వాయించు కోవటం అలవాటు.

  అలాగే విస్తారంగా రాగాలాపన వాయించ సాగాడు.

  తరువాత తానం మొదలు పెట్టాడు. గురువుగారు ఎప్పుడు వచ్చారో కూడా చూడలేదు. వెంకట్రావుగారు, రాగం వాయించడం మొదలు పెట్టగానే వచ్చారు.

  అక్కడే కూర్చుని శిష్యుని వ్రేళ్ల కదలికలను వేగాన్ని గమనించ సాగారు. ఏమైనా మార్పులు చెప్పాలా అని చూస్తున్నారు. ఏమీ కనిపించడం లేదు.

  పల్లవి ప్రారంభించబోతుండగా కృష్ణమూర్తి కూడా చేరాడు. ఒకరిని మించి ఒకరు అంది పుచ్చుకుని వాయిస్తుంటే, ఇంట్లో వాళ్లు, పక్కింటి వాళ్లు, వీధిలో వెళ్తున్నవాళ్లు కూడా వచ్చి వింటున్నారు. విజయనగరం మంచి శ్రోతలకు ప్రతీతి.

  అలా ఒక గంట సేపు పైగా ఏకాగ్రతతో సాగింది ఇరువురి వీణా వాదన. ఇంక ఏదీ కనిపించలేదు, వినిపించలేదు.

  పూర్తి అయాక అందరూ చప్పట్లు కొడుతుంటే చూశాడు, నిండా పదిహేడేళ్లు లేని సోమేశం. కృష్ణమూర్తి అయితే సోమేశం కంటే చిన్నవాడు. పది మంది పైగా ఉన్నారు.

  గురువుగారి కళ్లలో మెప్పుని చూసి మనసులో ఆనందించి, లేచి పాదాభివందనం చేశారు ఇద్దరూ.

  తన జేబులో నుంచి ఒక కాగితం తీసి సోమేశం చేతిలో పెట్టారు వెంకట్రావుగారు.

  ఆదుర్దాగా అదేమిటా అని చూశారు శిష్యులిద్దరూ.

  ద్వారం వారు రాజా వారి వద్ద జరుపబోయే కచేరీ లోని అంశాలు, వర్ణం నుంచీ మంగళం వరకూ రాసి ఉన్నాయి.

  ప్రతీ కీర్తనకీ వివరంగా రాగం, తాళం… రాగాలాపన చేయబోయే కీర్తనలు, ప్రతీ ఒక్కటీ స్పష్టంగా ఉంది.

  వరుస క్రమం కూడా ఉంది.

  సోమేశం కి ఆ లిస్ట్ ని చూడగానే చాలా సంతోషం కలిగింది. అందులో రాసి ఉన్న రాగాలు, పాటలూ… అన్నీ తనకి వచ్చినవే. స్వర కల్పనలు కూడా సులభంగా చేసెయ్యగలడు.

  అప్పటికే జనరంజకమైన ప్రముఖ వాగ్గేయకారుల కీర్తనలు చాలా వరకు నేర్చుకున్నాడు. దాదాపు యాభై వరకూ రాగాలు వాయించ గలడు.

  అతనికి తెలియని విషయమేమిటంటే, వెంకట్రావుగారు, నాయుడు గారు కలిసి ఆ పట్టిక తయారు చేశారని… తనకి బాగా వచ్చినవే అందులో చేర్చారని.

  తప్పనిసరిగా నిలదొక్కుకుంటాడనే నమ్మకమున్న శిష్యునికి గురువుల ప్రోత్సాహం ఆ విధంగానే ఉంటుంది. ఎప్పటికీ ఉండాలి కూడాను.

No comments:

Post a Comment

Pages