కచ్ఛపి నాదం - అచ్చంగా తెలుగు

కచ్ఛపి నాదం

(1,2 భాగాలు)

మంథా భానుమతి



కచ్ఛపి నాదం  

నుర్మాసం… సంక్రాంతి పండుగ రోజులు దగ్గరపడుతున్నాయి. సంవత్సరమంతా కష్టపడి పండించిన పంటలు దరి చేరబోతున్నాయని ఆ ఊరిలోని వీధులన్నీ కళకళలాడుతున్నాయి.

          ప్రతీ ఇంటి ముందూ తీర్చిదిద్దిన ముగ్గులు, ఎంతో అందంగా పోటీలుపడి వేసినట్లున్నాయి.

సూర్యోదయం అయి రెండు ఘడియలయి ఉంటుంది. జోడు సన్నాయిల వాయిద్యం వినిపిస్తోంది శ్రావ్యంగా.

          అది ఒక పెంకుటిల్లు. వాకిలి అలికి ముగ్గు వేసి ఉంది. లోపలికి వెళ్లే మెట్లమీద కూడా ముగ్గులు అందంగా స్వాగతం పలుకుతున్నాయి.

           వీధి గుమ్మం దగ్గర గంగిరెద్దులు ఆడించేవాళ్లు వచ్చి, తమ ప్రతిభ చూపిస్తున్నారు. ఎద్దు మెడ అటూఇటూ తిప్పుతూ తాళం వేస్తోంది. వీపుమీద రకరకాల దుప్పట్లు, చీరలు, పంచెలు వేలాడుతున్నాయి.

          మెట్లకి ఇటూ అటూ అరుగులు. అరుగుల మీద కూడా అంచుల్లాగ ముగ్గులు మెరుస్తున్నాయి. అక్కడే చెరో గోడకీ రెండేసి బెంచీలు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్తే వరుసగా సావిడి, నట్టిల్లు, వంటిల్లు, వెనుక వరండా, పెరడు ఉన్నాయి.

          గోడలన్నీ మాసిపోయి, వెంటనే వెల్లలు వేయండి అంటున్నాయి. సావిడికి ఒక పక్కన చిన్న పడక గది. ఇంకొక పక్కన కటకటాల వరండా ఉన్నాయి.   

          వరండాకి ఆనుకుని చిన్న సందు... వీధిలోనుంచి ఆ సందు ద్వారా పెరట్లోకి త్రోవ ఉంది. సందులో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మందార మొక్క, దేవ గన్నేరు, కనకాంబరం మొక్కలు వేశారు. పూజకి సరిపోయినన్ని పూలు పూస్తాయి రోజూ.

          ఇల్లంతా పాతదై పోయినా, నేల మాత్రం శుభ్రంగా తళతళా మెరుస్తోంది.

           “అమ్మమ్మా! ఆకలి వేళల అలపైన వేళలను…” ముద్దుముద్దుగా పలుకుతూ పాటలా రాగయుక్తంగా పాడుతూ పిలిచాడు సోంబాబు.

          సన్నాయి వాళ్లు, ఇంటి ముందర ఆగి, ఆ కీర్తనే వాయిస్తున్నారు. ఎక్కడ ఏ పాట విన్నా ఆ రాగం, పల్లవి, సాహిత్యం ఇట్టే పట్టేస్తాడు సోంబాబు. రాగాలు తెలియవు కానీ అదే రాగంలో ఉన్న ఇంకొక పాటను వెంటనే చెప్పేయగలడు.

  “ఆగరా కన్నయ్యా! వస్తున్నా అక్కడ ఉన్న గిన్నెలన్నీ ముట్టుకోకు…” కంగారుగా అంది లక్ష్మమ్మ.

          పట్టు లాగూ తొడుక్కుని నట్టింట్లో పీట మీద కూర్చుని, బుల్లి వెండి కంచం ముందు పెట్టుకుని… దాని మీద తాళం తప్పకుండా చేత్తో దరువేస్తున్న నాలుగేళ్ల మనవడి కేసి మురిపెంగా చూస్తూ, సోలగ్లాసుతో డబ్బాలో బియ్యం తీసుకుని వాకిట్లోకి వెళ్లి, గంగిరెద్దుకి కట్టి ఉన్న సంచీలో పోసి వచ్చింది లక్ష్మమ్మ… సోమేశం అమ్మమ్మ.

          కంచంలో వేడి వేడి అన్నం, పప్పు, పేరిన్నెయ్యి వేసి కలిపి, ఒక చివరగా వంకాయ ముద్దకూర వేసి, పక్కనే కూర్చుని మనవడికి ముద్దలు చేసి నోట్లో పెట్టసాగింది.

“ఈ పాట ఎక్కడ విన్నావురా కన్నా? బాగా పాడుతున్నావే…” వాత్సల్యంగా చూస్తూ అడిగింది.

          “మొన్న కచేరీలో పాడారు కదా… పట్టేశా అంతే! ఇప్పుడు సన్నాయి వాళ్లు ఈ పాటే వాయిస్తున్నారు కదా?” బుగ్గ నిండా పప్పూ అన్నం నింపి బుంగమూతితో అంటున్న సోంబాబు ముద్దొచ్చేశాడు.

          అమాంతం ఒళ్లోకి లాక్కుని, నుదుటి మీద ముద్దులు కురిపించేసింది.

          “బంగారు కన్నయ్యవిరా నా బుజ్జి తండ్రీ! అదంతా జ్ఞాపకం పెట్టుకున్నావా?”

          “అమ్మమ్మా! ఆగు, అంటు… ఎంగిలి.” అంటూ చిట్టి చేతులతో అమ్మమ్మ మూతి తుడిచాడు.

          “ఇంకా వచ్చు అమ్మమ్మా… తేకువ నా.. నామమే, దిక్కు మరి లేదు…” పాడుతూనే ముద్దలు తినేసి, గ్లాసులో నీళ్లు తీసుకెళ్లి వరండాలో మూతి కడుక్కుని వచ్చాడు.

          “నా నామము కాదురా కన్నా… ‘హరి నామమే దిక్కు మరి లేదు’. అంటే ఆ వెంకన్నబాబు పేరు. నువ్వే దిక్కు నాకు ఆకలేస్తే, అంటున్నారు అన్నమయ్య.”

          “హరి.. నా…..మ మే…….” చక్కగా దీర్ఘం తీస్తూ పాడాడు సోంబాబు.

          అప్పుడే లక్ష్మమ్మ మనసులో, ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఎంతవరకూ అనుకున్నది సాధించగలుగుతుందో వేచి చూడాల్సిందే.

          నాలుగు వీధులైనా లేని ఆ పల్లెటూర్లో అయితే ఆవిడ అనుకున్నది జరిగే అవకాశం లేనే లేదు.

           అది 1924 వ సంవత్సరం.

***

ఐదు సంవత్సరములు గడిచాయి, అమ్మమ్మ, మనవల ఆటపాటలతో!

          “అమ్మ కూరలు తరుగుతుందట అమ్మమ్మా! త్వరగా రా!” సోంబాబు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వారం రోజుల క్రితమే తొమ్మిదో ఏడు వచ్చింది.

          అయితేనేం… పన్నెండేళ్లు దాటిన పిల్లలకు ఉండే తెలివి, గ్రహింపు శక్తి, జ్ఞానం ఉంది.

          వెనుక వరండాలో, లక్ష్మమ్మ విసురుతున్న తిరగలి ఆపేసి, చటుక్కున లేచి నట్టింట్లోకి వెళ్లింది...

 “పిట్టలు రాకుండా చూస్తుండు సోంబాబూ!” అంటూ.

          సోంబాబు తల్లి, సూరమ్మ అప్పటికే కత్తిపీట కింద పరిచింది. వెడల్పుగా ఉన్న వెనుక భాగం పీట మీద కూర్చోబోతోంది.

          పక్కనే గిన్నెలో నీళ్లలో వంకాయలు ఉన్నాయి… ఇంకొక చిన్న గిన్నెలో పచ్చిమిరపకాయలు.

          కొంచెం దూరంలో గుమ్మం అవతల తులసి కోట దగ్గర పీట మీద కూర్చుని, సోంబాబు తండ్రి రామ్మూర్తి అవధాని సంధ్యావందనం చేసుకుంటున్నారు.

          అవధానిగారు పుట్టుకతోనే అంధుడు. అయితేనేం, అపారమైన తెలివి తేటలు. శబ్దాన్ని విని ఏం జరుగుతోందో గ్రహించగలరు.

          సంస్కృతాంధ్రాలలో ఆరితేరిన వారు. వేదపండితుడు... ఘనాపాటీ.

           “అయ్యో సూరీడూ! అదేం పనే… బియ్యంలో రాళ్లు మాత్రమే ఏరమని అన్నా కదా?”

  సూరమ్మ తలెత్తి చూసింది.

          “ఏరేశానుగా చూడమ్మా…” అమాయకంగా నవ్వుతూ సూరమ్మ బియ్యం చేట చూపించింది. కొద్దిగా బియ్యం అటూ ఇటూ పోసినా బాగానే ఏరింది.

          “అయినా సరే… కూరలు తరగద్దు. కత్తిపీట పదునుగా ఉంది. అక్కడ గోంగూర పెట్టాను. బాగుచెయ్యి.”

          కత్తిపీట తీసి మూలగా పెట్టి వెనక్కి తిరిగింది లక్ష్మమ్మ.

          సోంబాబు తల్లి సూరమ్మ అమాయకురాలు. ఏదో పని చెయ్యాలన్న తాపత్రయం తప్ప ఏదీ సరిగ్గా చెయ్యలేదు. ఒక సుగుణం ఏమిటంటే, ఎదురు సమాధానాలు చెప్పదు. చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంది.

          “మీకు చాలా శ్రమ అయిపోతోంది అత్తయ్యగారూ!” అవధాని సంధ్యావందనం ముగించి, తులసి కోట దగ్గర నుంచి లేస్తూ కించిత్ బాధగా అన్నాడు.

          అంతలో సన్నగా ‘కృష్ణం కలయ సఖీ సుందరం…’ అంటూ లయ బద్ధంగా పాట, ఏదో వింత శబ్దం తాళం వేస్తున్నట్లుగా, శ్రావ్యంగా, శృతి తప్పకుండా… వెనుక వరండా నుంచి వినిపించింది.

          సోంబాబు పాడుతున్నట్లు తెలుస్తోంది.

          కానీ ఆ తాళం తాలూకు శబ్దం ఎలా వస్తోంది? ఎక్కడి నుంచి? లక్ష్మమ్మకి బోధపడలేదు.

          లక్ష్మమ్మ చిన్నప్పుడు పుట్టింట్లో కీర్తనల వరకూ సంగీతం నేర్చుకుంది.

          అత్తవారింట్లో పని పాటలు చేసుకుంటూ పాడుకుంటూ ఉంటుంది. నేర్చుకోవడానికి కుదరక పోయినా, నేర్చుకున్న వన్నీ గుర్తున్నాయి.

          పుట్టింటి వారిది, అత్తింటి వారిదీ కూడా సంగీతం మీద పట్టుగల కుటుంబాలు. అత్తవారి బంధువులలో చాలా మంది విద్వాంసులు ఉన్నారు… ఆడవాళ్లు భోగి పాటలు, మంగళహారతులు, జోల పాటలు వంటివి పేరంటంలో పాడుతుంటారు.

          వినికిడితో చాలా కీర్తనలు అభ్యాసం చేసుకుంటూ ఉంటుంది. భాగవతంలో పద్యాలు కూడా రాగయుక్తంగా పాడగలదు. అలాగే సోంబాబుకి చాలా పద్యాలు నేర్పింది.

          అందుకే సోంబాబు ఆసక్తిని కనిపెట్ట గలిగింది లక్ష్మమ్మ.

          సోంబాబు ఇంకో నాలుగు రెట్లు ఎక్కువ చేసి మాటలు, సంభాషణలు కూడా పాటల్లా పలుకుతుంటాడు.

          ఆలోచిస్తూ నెమ్మదిగా వరండా లోకి నడిచింది. ఇదే ఆర్ధిక స్తోమతు ఉంటే, ఈ పాటికి ఎలా ఉండేవాడో!

          అక్కడి దృశ్యం చూసి కాసేపు నోట్లోంచి మాటరాక అలా నిలబడి చూస్తూ ఉండి పోయింది.

          సోంబాబు తిరగలి తిప్పుతూ పాడుతున్నాడు… అది కూడా నారాయణ తీర్థులవారి తరంగం. గమకాలు కూడా బాగా పలుకుతున్నాడు.

          మామూలుగా తిప్పటం కాదు. తిరగలి రాయిని లయబద్ధంగా తిప్పుతున్నాడు. విసురుతున్న బియ్యం నలుగుతోంది.

          తిరగలి రాయి తాళం తప్పకుండా వింత శబ్దం చేస్తోంది.

          తాళం… కాలితో లయ చూసుకుంటున్నాడు. దెబ్బకి ఒక లాగ, ఉసికి ఒకలాగ ధ్వని వస్తోంది, తిప్పుతున్న చెయ్యి వత్తిడిని అనుసరించి.

          “ఇదేంటి సోంబాబూ! తిరగలి ఇలా తిప్పుతున్నావు? కానీ ఇదొక రకంగా బాగా తాళం పడుతోంది.” ఆశ్చర్యంగా చూస్తూ అంటున్న అమ్మమ్మ కేసి నవ్వుతూ చూశాడు.

          లక్ష్మమ్మ తనకి వచ్చిన సంగీతం నేర్పుతోంది మనవడికి. వర్ణాల వరకూ వచ్చాడు సోంబాబు. తాళాలలో రకాలు చాలా వరకూ బాగా తెలిశాయి. అమ్మమ్మ పాడుతుంటే చాలా కీర్తనలు తను కూడా పాడేస్తుంటాడు.

          “కరణంగారి అబ్బాయి శ్రీనివాసు ఉన్నాడు కదా… వాడు నా స్నేహితుడు అమ్మమ్మా! మొన్న బడి నుంచి వస్తూ వాళ్లింటికి తీసుకెళ్లాడు. మద్రాసు నించి వాళ్లన్నయ్య తెచ్చిన గ్రామఫోను చూపించాడు. అందులో ముల్లు ఇలాగే చక్రం మీద తిరుగుతుంటే పాట వస్తోంది. బలే ఉందిలే. మనిషి కనిపించకుండా కచేరీ వినిపిస్తోంది.”

          “రేపు నేను కూడా వెళ్లి చూస్తాను. ఇంకలే… బియ్యప్పిండి జల్లించుకుని డబ్బాలో పోసుకోవాలి.”

          ఇంట్లోకి వెళ్తున్న సోంబాబుని చూస్తూ మళ్లీ ఆలోచనలో పడింది లక్ష్మమ్మ. ఈ మాణిక్యం మరుగున ఉండిపోకూడదు.

          ఏది చూసినా, విన్నా ఆకళించు కోవడమే కాదు… కొత్త కొత్త విషయాలు గ్రహించడం, కనిపెట్టి చూడటం, కొత్త పరికరాలు… అవీ సంగీతానికి సంబంధించినవి తయారు చెయ్యటం… కొంచెం కూడా సమయం వృధా చెయ్యడు సోంబాబు.

          మనవడి తెలివితేటలు, ఆసక్తి చూసి అతని భవిష్యత్తుకి తనే బాట వెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది.

          సోంబాబు తప్పకుండా ప్రత్యేకతని సంతరించుకుంటాడు. ఆ నమ్మకం కలిగింది లక్ష్మమ్మకి.

          కానీ ఈ పల్లెటూరు లో ఏం చెయ్యగలుగుతుంది?

          గట్టిగా నాలుగు వీధులు లేవు. హైస్కూలుకే దగ్గర్లో ఉన్న పట్టణం పంపాలి. తమకి నాలుగు గింజలు వచ్చే పొలం ఉందని కానీ, ఏ సదుపాయం లేదు.

          ఆ పొలం కూడా సగమే వ్యవసాయానికి అనుకూలం. మిగిలిన సగం తుప్పలూ, రాళ్లు… గడ్డి కూడా మొలవదు.

***

అది విశాఖపట్టణంకి తూర్పుగా ఉన్న గజపతినగరం దగ్గర ఉన్న ‘లోగిస’ గ్రామం… లక్ష్మమ్మ కుటుంబం తరతరాలుగా అక్కడ స్థిరపడ్డారు. కొద్దిగా భూములున్నాయి.

          ఆదాయం బొటాబొటిగా సరిపోతుంది. అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. లక్ష్మమ్మకి ఐదేళ్లకి పెళ్లయింది. పన్నెండేళ్లకి అత్తగారింటికి కాపురానికి వచ్చింది.

          పధ్నాలుగేళ్లకి అమ్మాయి పుట్టింది.

          ఇంట్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు చెవిలో పడుతున్న విషయం అర్ధం కావటానికే సమయం పట్టింది.

          “ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేయాలి నిజమే, కానీ ఉయ్యాల్లో పిల్లకి చేస్తారా ఎవరేనా?” లక్ష్మమ్మ కూతురు సూరమ్మకి పది నెలలునిండాయి.

          తను విన్న వార్తని నమ్మలేకపోయింది.

          ఇంకా అన్నప్రాసనేనా అవని కూతురుకి పెళ్లని చెప్తే, ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ఇంట్లో పెద్దలని నిలదీసింది లక్ష్మమ్మ.

          పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇద్దరన్నదమ్ములు… వారి కొడుకులు, కోడళ్లు, మనవలు పదిహేను మంది వరకూ ఉంటారు.

          విశ్రాంతి కావాలంటే ఆడవాళ్లు గడపల మీద తల పెట్టుకుని పడుక్కోవడమే. చిరుగులు కుట్టుకున్న చీరలతో కాలక్షేపం చెయ్యడమే!

          ఒక్కరికీ పూర్తిగా కడుపు నిండని ఆదాయం. పెరట్లో పండిన ఆకు కూరలు, కూరగాయలతోనే భోజనాలు. ఏడాదికి సరిపడా ధాన్యం గింజలు వస్తున్నాయి కనుక సరిపోతోంది.

          ఇంట్లో మామగారిదే పెత్తనం.

          ఏడాది నిండని సూరమ్మకి పదిహేడో ఏడు నడుస్తున్న అయ్యగారి రామ్మూర్తి అవధానితో పెళ్లి నిశ్చయించారు మామగారు.

          భర్తకి అడిగే స్వతంత్రం లేదు.

          ఇరవై ఏళ్లు వయోభేదం ఉన్న పెళ్లిళ్లు, తమ ఊర్లలో పిల్లలు దొరకక పోతే, అరవ దేశంలో ఉన్న పాల్ఘాట్ వెళ్లి పిల్లని తెచ్చుకుని చేసుకోవడాలు సర్వ సాధారణం ఆ రోజుల్లో. అక్కడ, పాల్ఘాట్లో మరీ ఘోరం… పిల్లని వదిలించుకోవడమే ప్రధానం. ఆ పిల్లలు పుట్టింటిని మరచిపోవలసిందే!

          మగవారికి… అందులో సంస్కృతం చదువుకున్న వారికి ఆదాయం అంతగా ఉండేది కాదు. ఇళ్లలో కూర్చుని వేదాలు వల్లె వేసుకోవడమే! ఎప్పుడైనా ఏ సమావేశానికో పిలుపు వస్తే పండగే.

          పైన చెప్పుకున్నట్లు పెళ్లికి ఆడపిల్లలు దొరకడం చాలా కష్టం. అందులో రామ్మూర్తి అవధాని అంధుడు. కొద్దిగా భూమి, ఇల్లు ఉన్నాయి, భుక్తికి లోటు లేదు.

           మరి అతనైనా ఎలా ఒప్పుకున్నాడో లక్ష్మమ్మకి అర్ధంకాలేదు. పైగా సంస్కృతం చదువుకున్నాడు, వేద పండితుడు.

          లక్ష్మమ్మ సందేహం సహేతుకమే!

అవధానికి కనిపించదు కదా… ఆమ్మాయి వయసు ఎంతో ఇరు ప్రక్కల వాళ్లూ చెప్పలేదు.

          ఎవరో వ్యవహారకర్త ఇరువైపులా కబుర్లు చెప్తూ సంధానం చేస్తాడు, అందరూ ఒప్పేసుకుంటారు.

          ఈ వ్యవహారంలో ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం అంధుడికి పెళ్లి జరిపించటం, ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఆడపిల్లకి కన్నెచెర వదిలించటం. వయసుదేముంది… పదేళ్లు ఎంతలో గడచిపోతాయి?

          పెళ్లికొడుకు కుటుంబంలో అందరూ తెలుగు, సంస్కృతం బాగా చదువు కున్నవారే. దూరపు బంధుత్వం కూడా ఉంది.

          జాతకాలు చూసి పెళ్లి కుదిర్చేశారు లక్ష్మమ్మ మామగారు.

          లక్ష్మమ్మ, కూతురుకి అప్పుడే పెళ్లి వద్దంటున్నా, తన నిరసనల మధ్య ఉయ్యాల్లో పాపాయికి పెళ్లై పోయింది. మామగారి ఎదురుగా నిలబడలేని సాంప్రదాయాలు… పెళ్లి జరిపించేశాయి.

          పెళ్లికూతురు తల్లి ఒళ్లో కూర్చుంటే మంగళ సూత్రం కట్టాడు పెళ్లి కొడుకు. ఆ తల్లి కళ్లలో నీళ్లు తుడుచుకుంటూనే ఉంది, మామగారి చూపులు తప్పించుకుంటూ! పెళ్లికొడుకుకి ఎలాగా చూపులేదు.

          సూరమ్మకి వయసు పెరుగుతోంది కానీ ఆ వయసు పిల్లలకి ఉండాల్సిన చురుకుతనం లేదు. స్వంతంగా ఏ పనీ చెయ్యలేదు. కనీసం ఆలోచన కూడా చెయ్యలేదు. అమాయకంగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది.

          సూరమ్మ ఈడేరగానే అత్తగారింటికి పంపేశారు. కాలక్రమేణా అన్నదమ్ములు విడిపోయి ఉన్న కొద్దిపాటి చెక్కనీ, చెరి కాస్త పంచేసుకున్నారు.

          మొదటి నుంచీ సంసారం మీద ఆసక్తి లేని లక్ష్మమ్మ భర్త కాశీ వెళ్లి పోతున్నానని వెళ్లిపోయాడు. లక్ష్మమ్మ ఒంటరిదై పోయింది.

          తన వాటా పొలం మీద కొద్దిగా ఆదాయం వస్తుంది.

          అమాయకురాలైన సూరమ్మ పిల్లల్ని పెంచుతూ అవధాని గారింట్లోనే ఉండిపోయింది, వారి కోరికపై.                                       

***

సోంబాబుకి తొమ్మిదేళ్లు నిండాయి… రామ్మూర్తి అవధానిగారి మూడవ సంతానం.

          అన్నలిద్దరినీ వేద పాఠశాలలో చదువుల కోసం విజయనగరం పంపించారు. అక్కడ రాజుగారి ధర్మమా అని విద్యకి, వసతికీ రొక్కం ఏమీ ఇవ్వనక్కర్లేదు.

          సూరమ్మకి సోంబాబు తరువాత ముగ్గురు మగ పిల్లలు కలిగారు.

          సంతానం దేముడి వరం అనుకునే రోజులు అవి.

          సోంబాబును కూడా అన్నల లాగే సంస్కృతాంధ్రాలు చదివిస్తూ తనంతటి వేద పండితుడిని చెయ్యాలని అవధాని గారి సంకల్పం. తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటాడని గ్రహించారు. అతని గ్రహణ, ధారణ శక్తుల మీద అత్యంత నమ్మకం వారికి.

          సోంబాబు, ఆ ఊరిలోని వీధి బడిలో ఉన్న తరగతులన్నీ చదివేశాడు. ఐదవ తరగతి పుస్తకం మొత్తం చూడకుండా అప్పజెప్ప గలడు. లెక్కల్లో ఎప్పుడూ నూటికి నూరే… ఏకసంథగ్రాహి.

          ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ఏదో పని చేస్తూనే ఉంటాడు.

          తన క్రింది తరగతి పిల్లలకి తెలియని పాఠాలు చెప్తుంటాడు. బాగా చెప్తాడని పేరు తెచ్చుకున్నాడు.

          ఆ రోజు… సోంబాబు భవిష్యత్తుకి పునాది పడిన రోజు. కటకంలో జరిగిన జాతీయ వేదసభకి వెళ్లి వచ్చారు అవధాని గారు.

          అతను అంధుడు కనుక ఎవరైనా తీసుకుని వెళ్లాలి. వేదం చదువుతున్న పెద్దకొడుకు విజయనగరం నుంచి సాయం వస్తూ ఉంటాడు, ముఖ్యమైన సభలకి.

          అటువంటి సభలకి వెళ్లినప్పుడు అక్కడి జమీందారులు, సభకు వచ్చిన ధనవంతులు చేసిన పురస్కారాలతో, అందించిన రొక్కంతో ఆరు నెలల వరకూ ఇల్లు నడిచి పోతుంది. వారికి పంచల చాపు ఇస్తూ, కొందరు అమ్మగారికి చీర కూడా ఇస్తారు.

          అందులో రామ్మూర్తి అవధానిగారు పనస వల్లించారంటే సంస్కృతం తెలియని వారు కూడా అలా చెవులప్పగించి ఉండిపోతారు.

          అవధానిగారు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రత్యేకించి విజయనగరం మహారాజా వారు తన దగ్గరకి పిలిపించి మరీ ఘనంగా సత్కరించారు.

          విజయనగరం ఎప్పుడు వచ్చినా తమ ఆస్థానానికి వచ్చి, వేద పఠనం చెయ్యాలని ఆహ్వానించారు.

          “అల్లుడు గారూ!” వారి పూజ అయిన వెంటనే సమయం చూసుకుని లక్ష్మమ్మ కొంచెం దూరంలో నిలబడి పిలిచింది.

          అవధాని గారి మీద సూర్యకాంతి పడి, సాక్షాత్తూ పురాణాలలో వర్ణించిన బృహస్పతుల వారిలా ఉన్నారు. అసంకల్పితంగా చేతులు జోడించింది లక్ష్మమ్మ.

          “చెప్పండి అత్తగారూ! వచ్చిన రొక్కం అంతా మీకు అప్పజెప్పాను కదా. ఇంటికి కావలసిన సరుకులూ, అందరికీ వస్త్రాలూ తెప్పించండి. ఇంటికి కూడా చిన్న చిన్న మరమ్మతులుంటే చేయిద్దాము”

          “అది కాదు బాబూ! సోంబాబు భవిష్యత్తు గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఇక్కడి వీధిబడి చదువు అయిపోయింది కదా! ఈ సంవత్సరం…”

          అప్పుడే సోంబాబు వచ్చాడు అక్కడికి. అమ్మమ్మని ఆనుకుని నిల్చుని చూస్తున్నాడు.

          నాన్నగారు ఏం చెప్తారో అని ఆతృతగా ఉంది. అమ్మమ్మ ఎప్పుడో చెప్పేసింది, తనేమి అడగబోతోందో!

          “అవును. ఈ సంవత్సరం విజయనగరం పంపించి వేద పాఠశాలలో చేర్పిద్దాము. ఎన్నదగ్గ వేద పండితుడౌతాడు. పదుగురి మెప్పూ పొందుతాడు”

          “నిజమే అనుకోండి. అయితే మన సోంబాబుకి సంగీతం అంటే ఎంతో ఆసక్తి, అభిమానం. వాడికి సహజంగా వచ్చిన అభిరుచి అది. విజయనగరంలో కొత్త కళాశాల పెట్టారట. అందులో చేర్పించి సంగీతం నేర్పిద్దామని నా అభిలాష. మీరు కాదనరనే అనుకుంటున్నాను…” లక్ష్మమ్మ సందేహిస్తూనే అడిగింది.

          అమ్మమ్మ దగ్గర నిలబడి అంతా వింటున్న సోంబాబు మొహంలో ఆనందం, హుషారు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

          ఆ వయసులో అడగటం తెలియడం లేదు కానీ, కరణంగారి అబ్బాయిని పంపించబోతున్నారనీ, విజయనగరంలో సంగీతం నేర్చుకుంటాడనీ తెలిసినప్పట్నుంచీ ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నాడు.

          తండ్రిని ఎలా అడగాలా అనుకుని మధన పడుతున్నాడు.. ఆయన దగ్గర అంత చనువు లేదు. అమ్మమ్మ చీర కొంగు గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ, భయం లేదు అన్నట్లు దగ్గరగా లాక్కుంది.

          “ఇంట్లో అంతా వేద పండితులు, సంస్కృతంలో ఆరి తేరిన వారు. అదంతా వదిలేసి, ఇప్పుడు కొత్తగా సంగీతం నేర్పించడం ఏమిటండీ?”

          “అందుకే అల్లుడు గారూ! మిమ్మల్ని ఒప్పిద్దామని వచ్చాను. వీడికి సంగీతం అంటే ఎంతో అభిమానం. మా అత్తవారి వంక నించి వచ్చిందేమో! అజ్జాడ నారాయణ దాసుగారి దగ్గరకి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. వారు మా మామగారికి దగ్గర బంధువులు కూడా. నాకు చిన మామగారు అవుతారు. మమ్మల్ని కూడా అజ్జాడ వారనే అంటారు కదా. వీణ్ణొక్కడినీ నాకు వదిలేయండి. ఎవరి భవిష్యత్తు ఎందులో ఉందో ఏం చెప్పగలం…” లక్ష్మమ్మ తను చెప్పిన మాట వినక తప్పదన్నట్లు సంకేతమిచ్చింది.

          అత్తగారి కోరికకి అడ్డు చెప్పలేక పోయారు అవధానిగారు. సంసారానికి ఆవిడ చేస్తున్న సేవ తక్కువేం కాదు. ఇంకా ముగ్గురు చిన్న పిల్లలున్నారు.

          అయిష్టంగానే అయినా సరే అనక తప్పలేదు.

          “మరి ఖర్చులకి రొక్కం? వేద పాఠశాలలాగ కాదు కదా?” వేద పాఠశాలలో ఖర్చేమీ ఉండదు..

          “అదంతా నేను చూసుకుంటాను.”

          ఇంటి ఖర్చులకి పొదుపు గా వాడుతుంది లక్ష్మమ్మ. అవధానిగారు కటకం నుంచి తెచ్చిన డబ్బు బాగానే ఉంది.  

***

ఉపోద్ఘాతం అవసరం లేని వ్యక్తి వారు.

          విజయనగరం అంటే వారే గుర్తుకు రావాలి.

          దేశవ్యాప్తంగా, విశ్వ వ్యాప్తంగా వారి పేరు తెలియని వారు లేరు. నవ భాషా పండితుడు. సంగీత సాహిత్యాలను ఔపోసన పట్టిన వారు… ఒకే మారు ఐదు తాళాలతో పాడగల లయబ్రహ్మ. కర్ణాటక, హిందూస్తానీ రాగాలని మేళవించి కొత్త బాణీ సృష్టించిన స్వరబ్రహ్మ.

          అదే విజయనగరం బాణీగా ప్రసిద్ధి చెందింది. కాకపోతే వారి పేరు ఆ బాణీ చెప్పేటప్పుడు ఎక్కడా వినిపించదు. కొందరి కృషి గుప్తంగా ఉండిపోతుంది.

          ఇతర రాష్ట్రాలలో విజయభేరి మ్రోగించాక, తన స్వస్థలమైన విజయనగరంలో సన్మానం అందుకున్నారు.

          వారి మాటల లోనే, ‘రచ్చగెలిచి ఇంట గెలిచారు’.

          వారే… హరికథా పితామహుడు “శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.”

          తెలుగువారు ఏనాడో చేసుకున్న పుణ్యం, వారు ఆంధ్రదేశంలో జన్మించడం.

          లక్ష్మమ్మ, సోంబాబును తీసుకుని విజయనగరంలో, తిన్నగా దాసుగారి ఇంటికే వెళ్లి పోయింది.

          విజయనగరం వచ్చినప్పుడల్లా వారింటికి తరచుగా వెళ్తుండటం అలవాటే. పైగా మామగారికి వరుసకి తమ్ముడు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు రాకపోకలు బాగానే ఉండేవి.

          ఆ సమయంలో దాసుగారు శ్రీ విజయరామ గాన కళాశాలకి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.

          ఆ కళాశాల స్థాపించడంలో ముఖ్య పాత్ర వారిదే. దాసుగారిని ప్రథమ అధ్యక్షులుగా రాజావారు, విజయరామరాజు గారు నియమించారు.

          ఉద్యోగ విరమణ చేయవలసిన వయసులో తనకీ బాధ్యత వద్దని మొదట్లో దాసుగారు నిరాకరించారు.

          పైగా తనకి చాలా చోట్ల ప్రదర్శనలు ఉంటాయనీ, తన హరికథా కాలక్షేపం వినాలని వచ్చే ప్రేక్షకులను నిరాశపరచలేననీ చెప్పారు.

          అయితే… విజయరామరాజు గారు వారిని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు.

          స్వయంగా రాజుగారే అడుగుతే కాదనలేక పోయారు దాసుగారు.

          విజయనగర ఆస్థానం వారికి తన ప్రతిభ తెలుసు కోవడానికి అంత కాలం పట్టిందని, దాసుగారు తన సాహితీ మిత్రుడు పద్మనాభస్వామి గారితో నవ్వుతూ అనేవారు.

          దాదాపు ఇరవై సంవత్సరాలు నిరాటంకంగా పాఠశాలని నిర్వహించారు.

          సోంబాబుని తీసుకుని లక్ష్మమ్మ వెళ్లే నాటికి దాసుగారు అధ్యక్ష పదవిలో పది సంవత్సరాల నుంచీ పని చేస్తున్నారు. కళాశాలని మంచి స్థాయికి తీసుకుని వెళ్లటానికి ఎంతో కృషి చేస్తున్నారు. సహ అధ్యాపకుల చేత చేయిస్తున్నారు.

          దక్షిణ భారత దేశంలో విజయనగరంలోని విజయరామ గాన కళాశాల చాలా ప్రసిద్ధి చెందింది.

          అక్కడికి సుదూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి సంగీతం అభ్యసించేవారు ఉన్నారు. దక్షిణ దేశం నుంచి కలకత్తా వరకూ అదొక్కటే సంగీత కళాశాల.

          అందులో ముఖ్యంగా గాత్రం, వీణ, వాయులీనం, మృదంగం కోర్సులు ప్రఖ్యాతి చెందాయి. కర్ణాటక సంగీతమే కాకుండా హిందూస్థానీ కూడా నేర్పించే గురువులని నియమించారు.

          దాసుగారి ఇంటికి వెళ్లిందే కానీ, ఆ రోజంతా లక్ష్మమ్మ వారిని కలవలేక పోయింది. బంధువుల్లో వారంటే అందరికీ అపరిమితమైన గౌరవం. సాదా సీదాగా ఎదురు వెళ్లి మాట్లాడడానికి ధైర్యం ఉండదు.

          లక్ష్మమ్మ వచ్చినట్లు తెలుసుకుని, వారే రాత్రి భోజనం అయ్యాక పిలవనంపారు. అప్పటికి కానీ తీరిక దొరకలేదు వారికి.

          సోంబాబుని తీసుకుని వెళ్లి, ఒద్దికగా హాలులో స్తంభం ప్రక్కన నిలబడింది. సోంబాబు అమ్మమ్మ చాటు నుంచి వంగి వంగి చూడసాగాడు.

          దాసుగారి ఠీవి చూడటానికి రెండు కళ్లూ చాలవు అనుకుంది.

          సోంబాబుని పక్కకు జరిపి చూపించింది. తన మనసులో మాట మొహమాట పడుతూ చెప్పింది.

          “మా మనవడు బాబుగారూ! సంగీతం అంటే చిన్నతనం నుంచీ చాలా ఆసక్తి ఉంది కుర్రవాడికి. నేర్పిద్దామని ఉంది నాకు. ఒకసారి పాడి వినిపించమంటారా మామయ్యగారూ!”

          సోంబాబుని దగ్గరగా పిలిచి, మొహంలోకి చూసి, పక్కన కూర్చో పెట్టుకున్నారు.

          “అవసరం లేదమ్మా. అలాగే నేర్పిద్దాము. నువ్వు చెప్పావంటే పిల్లవాడు పైకి వస్తాడనే అర్థం. చిన్నతనం నుంచీ గమనించే ఉంటావు కదా! ప్రస్తుతం మనింటి దగ్గర ఉంటాడు. గాత్రం సాధన చేస్తూ ఉండమందాము... కళాశాలలో కొత్త క్లాసులు మొదలయ్యాక అందులో చేర్పిద్దాము.”

          “మరి ఉండటానికి వసతీ, భోజనం అదీ… సదుపాయం ఉందా బాబుగారూ?” లక్ష్మమ్మ బెదురు బెదురుగా అడిగింది.

          “చక్కని సదుపాయం… ఇటువంటి ఆసక్తి గల పిల్లల కోసమే ఈ కళాశాల ప్రారంభించారు. మహారాజా వారి సత్రం ఉంది. అందులో పిల్లలందరికీ ఉచితంగా భోజనం పెడతారు. ‘హస్తబల్’ లో వసతి… అంటే ఉండటానికన్నమాట. అక్కడ ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఒకప్పటి గజశాలనే వసతిగృహంగా మార్చారు. అందులో ఉంటాడు. మరి మిమ్మల్ని వదిలి ఉండగలడా?”

          “ఉంటాను గురువుగారూ!” సోంబాబే సమాధానం ఇచ్చాడు. కుర్రవాడికి చాలా హుషారు వచ్చింది, దాసుగారు ఇస్తున్న ప్రోత్సాహం చూసి.

          దాసుగారు నవ్వుతూ చూశారు. కళ్లలో తెలివీ, అమాయకత్వం సమానంగా కనిపిస్తున్న సోంబాబుని. అతను నిలబడిన విధానం, స్పందించిన తీరు చూసి పిల్లవాడి చురుకు తనాన్ని, ఆసక్తిని కనిపెట్టేశారు.

          కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని, గంభీరమైన కఠస్వరంతో దాసుగారు మాట్లాడుతుంటే, తల తిప్పకుండా కళ్లప్పగించి అలా చూసూ ఉండిపోయాడు సోంబాబు.

          విశాలమైన నుదురు, నుదుటి మీద బొట్టు, ముఖ్యంగా ఆ మీసకట్టు… గిరజాల జుట్టు, పెద్ద పెద్ద కళ్లు, చేతులకున్న కంకణాలు, వ్రేళ్లకున్న ఉంగరాలు, మెడలోని గొలుసులు…

          చూస్తుంటే అమ్మమ్మ చెప్పే కథల్లోని మహారాజులు గుర్తుకు వచ్చారు.

          ఆ ఠీవీ, దర్పం ఎక్కడా చూడలేదు సోంబాబు, వాళ్ల అమ్మమ్మా! వారిని చూస్తుంటే, భయమే కాకుండా ఒక రకమైన ఆత్మీయత కూడా కలుగుతోంది.

          దాసుగారి పాదాలకు నమస్కరించి, లక్ష్మమ్మ, సోంబాబు లోపలికి వెళ్లి పోయారు.

          మనవడిని విజయనగరం తీసుకు వచ్చి మంచి పనే చేశాను… అనుకుంది లక్ష్మమ్మ.

          దాసుగారు పుస్తకం తీసుకుని రాసుకుంటూ ఉండి పోయారు. వారు క్షణం కూడా తీరికగా ఉండరు.

***

“నాన్నగారిని కలిసిన పనయిందా?” నారాయణదాసు గారి అమ్మాయి సావిత్రి, నవ్వుతూ అడిగింది.

          “మహానుభావులు తలచుకుంటే ఎంత సేపు… సోంబాబుని చూడగానే సరే అనేశారు.” దాసుగారు ఉన్న వైపుకి చూస్తూ రెండు చేతులూ జోడించి అంది లక్ష్మమ్మ.

          “అబ్బాయిని చూడగానే గ్రహించి ఉంటారు వదినా! ఈ పిల్లవాడు తప్పకుండా సాటిలేని సంగీత విద్వాంసుడవుతాడు. ముందు ముందు ఎంతో పేరు తెచ్చుకుంటాడు. నాన్నగారు ఇంతటి అవకాశం ఇచ్చారంటే తిరుగు లేదు. వారికి భవిష్య దృష్టి కూడా ఉంది. రండి ఫలహారం చేద్దాం. రొట్టె ముక్క వేశాను, అనుపానం కొబ్బరికాయ పచ్చడి! సోంబాబుకి కావాలంటే అన్నం కూడా ఉంది. మజ్జిగ వేసుకుని తినవచ్చు.”

          సోంబాబుకి అప్పటికే సంతోషంతో కడుపు నిండిపోయింది. కరణంగారి అబ్బాయి వాసు, సంగీత కళాశాల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.

          అది విన్నప్పటి నుంచీ ఎలాగైనా అందులో చేరాలని గట్టిగా అనుకున్నాడు…

          వాసు కి విజయనగరంలో ఉన్న తన మేనమామ ప్రోత్సాహం బాగా ఉంది.

          కొత్త ఇల్లు, కొత్త చోటు కానీ… ‘ఇంతకన్నానందమేమీ…’ అని పాడాలని ఉంది.

          సోంబాబు పెరట్లో నూతి దగ్గరకు వెళ్లి కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. లక్ష్మమ్మ కంచాలు పెట్టడం వంటి పనుల్లో సాయం చేసింది.

          దాసుగారి అమ్మాయి సావిత్రి, లక్ష్మమ్మ సంగతులన్నీ తెలుసుకుంది.

          “అవును… రామ్మూర్తి అవధాని గారి గురించి విన్నాను. నాన్నగారు, ‘రాజుగారికి చెప్పి వారితో విజయనగరంలో వేద సభ పెట్టించాలి’ అని కూడా ఒకసారి అన్నారు.”

          నాలుగు రోజులుండి, సోంబాబుకి కావలసినవి అన్నీ సమకూర్చి, చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి, కొద్ది రొక్కాన్ని చేతిలో పెట్టి లోగిస వెళ్లి పోయింది లక్ష్మమ్మ.

          అందరు మనవల్లోకీ సోంబాబుకి అమ్మమ్మ దగ్గర ఎక్కువ చేరిక. వదల్లేక వదల్లేక వెళ్లింది. “తెలివైనవాడే… నెట్టుకొస్తాడు” అనుకుంటూ.

***

“అమ్మమ్మా!” నెమ్మదిగా పిలుస్తూ లేచాడు సోంబాబు, పక్కన తడుము కుంటూ. ఇంకా చీకటి చీకటిగానే ఉంది. తెల్లవారు ఝామునే లేవటం అలవాటు అవధానిగారింట్లో.

          తమ ఇంట్లో లాగా వేద పఠనం వినిపించడం లేదు.

          గంభీరమైన కంఠస్వరంతో భూపాల రాగాలాపన వినిపిస్తోంది. తను ఎక్కడ ఉన్నాడో ఒక్క సారిగా గుర్తుకు వచ్చింది. అమ్మమ్మ వెళ్లిపోయింది కదా… కొత్త చోటు. తను లేకుండా ఎలా ఉండాలి? ఒక్క క్షణం భయం వేసింది.

          “నీకు సంగీతం మీద ఉన్న ఆసక్తి చూచి, మీ నాన్నగారిని ఒప్పించి ఇక్కడికి తీసుకు వచ్చాను… ఒక్కడినీ వదిలి వెళ్తున్నాను. జాగ్రత్తగా గురువులు చెప్పినది విని నేర్చుకో! బాగా సాధన చేసి నీ గమ్యాన్ని చేరుకోవాలి. నా కోసం బెంగ పడ కూడదు సుమా! పెద్దలని ఎప్పుడూ ఎదిరించ వద్దు. సహాధ్యాయులతో స్నేహంగా ఉండు.” అమ్మమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. తల విదిలించి స్థిర నిశ్చయంతో లేచాడు సోంబాబు.

          కళ్లు నులుము కుని అరచేతులు దగ్గరగా పక్కపక్కనే పెట్టుకుని చూసుకున్నాడు.

“కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ

కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనం”

లోపలే చదువుకుని, రెండు చేతులనీ కళ్లకద్దుకుని దణ్ణం పెట్టుకున్నాడు. అమ్మమ్మ నేర్పించిన అలవాటు.

          గబగబా పెరట్లోకి వెళ్లి వసారాలో ఉన్న దండెం మీద నుండి తన తువ్వాలు, ఉతికిన బట్టలు తీసుకున్నాడు.

          జల్లించిన కచిక పొడి తో (నీళ్ల పొయ్యి దగ్గరో, పాలదాలి దగ్గరో మండిన పిడకల పొడి నుసి) దంతధావన కార్యక్రమం ముగించుకుని, తాటాకు నాలికపాయతో నాలుక శుభ్ర పరచుకుని అలాగే నూతి దగ్గర నీళ్లు తోడుకుంటూ స్నానం కూడా చేసేశాడు సోంబాబు. విప్పిన బట్టలు ఉతికి ఆరేసుకున్నాడు, ‘బట్టల సబ్బు కొని తెచ్చుకోవాలి’ అనుకుంటూ.

          పన్లోపని… పెరట్లో పడి ఉన్న తాటాకు ఆకులు విప్పదీసి, వాటి మీద నీళ్లు చల్లి, ఈనెలు తీసి పాయలు విడదీసి, అర స్కేలు బద్దంత ముక్కలు చేసి అక్కడున్న బుట్టలో వేశాడు.

          ఈ పనంతా గమనించిన సావిత్రి మెచ్చుకోలుగా చూసింది.

          ‘తన పనులు తాను చేసుకుంటూ, చెప్పకుండానే గ్రహించి ఇంటి పనులు అందుకుంటున్నాడు, అందరికీ ప్రీతి పాత్రుడు అవుతాడు’ అనుకుంది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages