మానసవీణ - 59 - అచ్చంగా తెలుగు

మానసవీణ - 59

Share This

                                                                           మానసవీణ - 59

కాంతి కలిగొట్ల కేరీ, నార్త్ కెరోలినా, అమెరికా


 

           దినేష్ ఫోన్ లో మాట్లాడడం పూర్తవగానే అనిరుధ్ దగ్గరకు వచ్చి “ఇప్పటిదాకా జరిగిన సంఘటనలలో జిటీఆర్ ప్రమేయం ఉందని అనుమానించాము, కానీ చిత్రంగా మానస తనతో పాటు జీటీఆర్ గారు కూడా ప్రమాదంలో ఉన్నారని ఫోన్ లో చెప్పింది, మా దర్యాప్తులో తేలినదానికంటే లోతట్టు విషయాలు చాలా ఉన్నాయనిపిస్తోంది.” అన్నాడు.

          అనిరుధ్ “దినేష్! మీరన్నది నిజమే! మీతో నా తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాలి. గత కొన్ని నెలలుగా నా తండ్రి ప్రవర్తనలో కొంచెం అసహజత్వం నేను గమనించాను. అయితే పని వత్తిడి వల్లనేమో అని అనుకునేవాడిని కానీ అది కాదని ఇప్పుడే కొంచెంగా అర్ధం అవుతోంది. ఎప్పుడూ ప్రతిరోజూ సాయంత్రం సమయం, రాత్రి సమయం కుటుంబంతో గడిపే నా తండ్రి ఈ మధ్యకాలంలో అసలు సాయంత్రం, రాత్రి ఇంట్లో ఉండకుండా బిజీ అంటూ బయటికి వెళ్ళిపోతున్నారు. అమ్మమీద, నామీద చాలా చిరాకు చూపిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళలో ఉండే కంగారు… ఆలోచిస్తుంటే నా తండ్రి స్థానంలో నా తండ్రిలాగా మరెవరో వచ్చారనిపిస్తోంది.  మా తాతగారినుంచి సంక్రమించిన ఆస్తిని నిజాయితీతో అంచెలంచెలుగా కష్టపడి పెంచి పెద్దచేసిన ఆయన ఏదో ఒక రోజు తనకు, తన ఆస్తికి ముప్పు ఉందని గ్రహించి ఒక సీక్రెట్ డిజిటల్ లాకర్ ని మా ఇద్దరి పేర్ల ఇనీషియల్స్ తో క్రియేట్ చేసి అందులో చాలా కీలక రహస్యాలను సాఫ్ట్ కాపీల్లో పొందుపరిచారు” అన్నాడు. 

          అనిరుధ్ కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసిన తరువాత మానస ఇంక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా తక్షణమే అక్కడనుంచి జిటిఆర్ గారితో కలిసి బయటపడాలనుకుంది. తన అనాధ జీవితంలో చాలా సవాళ్ళు, సమస్యలు ఎన్నో ఎదుర్కొంది కానీ ఈ రకమైన ప్రాణహాని పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ‘ప్రాణహాని’ అని అనుకోగానే గుండె ఝల్లుమంది మానసకి. తనది గట్టి ప్రాణం కాబట్టే భూషణం గారు పురిట్లోనే చంపెయ్యమని పురమాయించి పంపినా బతికి బట్టకట్టింది, అన్యాయాలు ఎదిరించింది, అభాగ్యులకు చేయూతనిచ్చింది. ఈ దుర్మార్గుల చేతిలో చావడానికి కాదు తాను ఇంతకాలం బతికిందీ కష్టపడిందీ... ఆశయాలు, ఆ ఆశయాల సాధన కోసం ఆశలు తనలో నవనవలాడుతున్నాయి. ఆ ఆశలే తనకు కొండంత బలం, ధైర్యం. చిన్నతనం నుండీ తను ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతున్న లలితా సహస్రనామాలు మానస మనసులో మెదిలాయి. లలితా పరా భట్టారిక తనలో అణువణువునా ఆవరించిన భావం కలిగింది మానసకి.  జిటిఆర్ ని తీసుకుని గది తలుపు బయటకు తొంగి చూసింది. అంతా చిమ్మ చీకటి. కొంచెం దూరంలో బయటకి వెళ్ళే దారిలాగా అతి సన్నగా వెలుతురు కనిపించింది. 'చుట్టూ ఎవరూ లేరులాగా ఉంది. పైన తనను బంధించిన వాడో లేక వాడి తాలూకు మనుషులో తాము తప్పించుకోవడం పసికట్టేలోగానే ఇక్కడ నుండి బయట పడాలి.’  

          గబగబా ఇద్దరూ వడివడిగా చప్పుడు చెయ్యకుండా సన్నటి వెలుతురు వైపు వెళ్ళారు. మానస బయట ఒకసారి చుట్టూ చూసింది. అంతా చీకటిగా నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. తొందరగా అక్కడ నుంచి అడుగులు వేసి వెడుతుంటే ఎక్కడ ఉన్నాడో ఎక్కడ నుండి చూసాడో ఒక దుండగుడు.

            ‘ఏయ్ ఎక్కడికే తప్పించుకు పోతున్నారు?’ అంటూ వెనక నుంచి వచ్చి ఒడుపుగా పట్టుకున్నాడు. 

          అనాథ శరణాలయంలో ప్రవీణ్ నుండి తను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ గుర్తుకొచ్చాయి.  వెంటనే మానస ముందుకి వంగి వాడి పట్టు నుంచి తనచేతులు తప్పించుకుని ఒడుపుగా వాడి కాళ్ళని లాగి కింద పడేసి కాళిక లాగ వాడు కదలకుండా తొక్కి పట్టింది. ఈ లోగా జిటీఆర్ పక్కనే ఉన్న కర్రతో వాడి నెత్తిన గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. 

          ఇంక అక్కడి నుండి ఇద్దరు పరుగెత్తి పారిపోబోతుంటే సరిగ్గా అప్పుడే ఒక తెల్ల వ్యాన్ అక్కడికి వచ్చి ఆగింది. అందులోనుంచి సాయుధ దుండగులు మరియు వారి నాయకుడు దిగారు. వారి నాయకుడిని చూసి మానస నిర్ఘాంతపోయి పక్కనే మాసిన గడ్డంతో ఉన్న జీటీఆర్ ని చూసింది. అచ్చుగుద్దినట్లు ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు. 

          “ఎవరు నువ్వు” గద్దించింది మానస దుండగుల నాయకుడిని. 

          “హహ్హహ్హా .... నేనెవరా?? జీటీఆర్!! అవును. నాపేరు గుమ్మనేని త్రికాలేశ్వరరావు ఉరఫ్ జీటీఆర్!”

          ఒక్కక్షణం నిశ్శబ్దం... మానస నిర్ఘాంతపోయి చూస్తోంది. 

          ఆమె తేరుకునేలోగా త్రికాలేశ్వరరావు తన మనుషులను మానసను పట్టుకుని బంధించమని ఆజ్ఞాపించాడు. అయితే వారు పట్టుకునేలోగానే సాయుధ పోలీసు బలగాలు, దినేష్, అనిరుధ్, శ్రావణి, రఘురాం కూడా అక్కడకు చేరుకున్నారు. వెంటనే త్రికాలేశ్వరరావు, అతని మనుషులందరినీ బంధించి పోలీసువాహనాలలో ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు. 

          శ్రావణి పరిగెత్తుకుంటూ వచ్చి మానసను దగ్గరికి తీసుకుని కన్నీరు కారుస్తూ అడిగింది “నా బంగారు తల్లీ నీకేమీ కాలేదు కదా? మళ్ళీ నువ్వు నాకు దూరమైతే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా... లేదు.”

          “నాకేం కాలేదమ్మా! నీ ప్రేమా, దీవెనలే నన్ను కాపాడుతున్న కంటికి కనిపించని రక్షణవలయం. బాధ పడకమ్మా! నేనెప్పుడూ నీ దగ్గరే ఉంటాగా!” అనునయంగా అంది మానస.

          మానస తాను ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా తన తండ్రిని కూడా దుర్మార్గుల చెరనుండి బయట పడేసినందుకు అభినందనగా మానస వంక చూసి తన తండ్రివైపు తిరిగి సంశయంగా “నాన్నా..?!” అని పిలిచాడు అనిరుధ్. 

          “అవును అనిరుధ్!  నాన్ననే! ఆ దుర్మార్గుడు నా రూపంలో వచ్చి అందరినీ మోసగించి నేనే నీ నాన్నని అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితిని కల్పించాడు. నేనే త్రివిక్రమరావుని.” అన్నారు జీ.టీ.ఆర్. 

          “అచ్చు మీ రూపు రేఖలతోనే ఉండి మిమ్మల్ని బంధించిన ఆ దుర్మార్గుడు ఎవరంకుల్?” అడిగింది మానస.

          “వాడు నా తోడబుట్టినవాడు, నా కవల సోదరుడు త్రికాలేశ్వరరావు. చిన్నప్పటి నుంచే చెడు సావాసాలు మరిగి చెడు మార్గంలో వెళ్ళాడు. వాడి ఆగడాలతో నా తల్లితండ్రులకు మనశ్శాంతి లేకుండా చేసాడు. వాళ్ళు మందలించినప్పుడల్లా వాడికి ఉక్రోషం, నామీద అసూయా వచ్చేవి. డబ్బు సంపాదన లేదు సరికదా ఇతరుల కష్టాన్ని కొల్లగొట్టి తాను అనుభవించాలనుకుంటాడు. నా తండ్రి తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో సగభాగం, తన స్వార్జితంలో కొంతభాగం వాడికి ఇచ్చారు. నేను డబ్బు విలువ తెలిసి కష్టపడి నాకు దక్కిన ఆస్తిని పదిరెట్లు చేసి అందులో కొంత అనాథ శరణాలయం కోసం కేటాయించి తగిన విధంగా సమాజ సేవ కూడా చేస్తున్నాను. కానీ త్రికాలేశ్వరరావు డబ్బంతా తాగుళ్ళు, జల్సాలకు ఖర్చు చేసి హారతి కర్పూరం చేసేసాడు. ఎప్పుడయితే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలలేదో అప్పటినుండీ వాడి క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు. చిన్నప్పుడు చాలా సార్లు నాలాగే నటించి నా తల్లితండ్రులని నమ్మించి డబ్బు దొంగతనాలు చేసేవాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా నా స్థానంలో వచ్చి నా ఆస్తి అంతా కాజేయాలని పన్నాగం పన్నాడు. దానికోసం అప్పలనాయుడుతో చేతులు కలిపాడు. ముక్కుకు సూటిగా వెళ్ళే మానస మీద నిఘా పెట్టాడు. అప్పలనాయుడుని అరెస్ట్ చేయించడం, కబ్జా చేసిన భూములు, నగలు తిరిగి పేదవారికి ఇచ్చేయడం తో పాటు, మొత్తం వ్యవహారంలో పోలీసుల జోక్యం ఎక్కువవుతూండడం, మానస స్వభావం తన దుర్మార్గాలకు అడ్డుగా భావించి మానసని కూడా కిడ్నాప్ చేసాడు. నా తమ్ముడు త్రికాలేశ్వరరావు నుండి ఏదో ఒకరోజు ఈ ప్రమాదం పొంచి ఉందని గ్రహించే నాకు సంబంధించిన నా కీలక రహస్యాలు అన్నీ కూడా డాక్యుమెంటు చేసి సీక్రెట్ లాకర్లో పొందుపరిచాను. నన్ను కిడ్నాప్ చేసి ఇదుగో ఇక్కడ పడేస్తే మానసే గదిలోనుంచి నా మూలుగులు విని వాళ్ళ చెర నుంచి తను తప్పించుకుంటూ నన్ను కూడా కాపాడింది.” చెప్పుకొచ్చాడు జిటిఆర్ - గుమ్మనేని త్రివిక్రమరావు.

దినేష్ మానసవైపు తిరిగి అన్నాడు “కంగ్రాట్యులేషన్స్ మానసా! చాకచక్యంగా మీరు తప్పించుకుని, త్రివిక్రమరావు గారిని కాపాడడమే కాకుండా ఆ దుర్మార్గులని కూడా చట్టానికి పట్టిచ్చారు. ఇక ఆ దుర్మార్గుల పని చట్టం చూసుకుంటుంది.” 

అందరూ మానస వంక అభినందనగా చూసారు. శ్రావణి ఉప్పొంగిపోతూ తన బిడ్డ మానస భుజంపై ప్రేమగా చెయ్యివేసి మనసులో అనుకుంది ‘ఇంటికి వెళ్ళాక మానసకి దిష్టి తియ్యాలి’.

***

          మానస కమ్ముకొచ్చిన అలసటతో ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు. నిద్ర లేచి కళ్ళు తెరిచేసరికి పక్కనే కూర్చుని తల్లి తననే కన్నార్పకుండా చూస్తోంది. ఆమె వెనకే తండ్రి రఘురాం ఉన్నాడు. తను నిద్రలేవగానే దిగ్గున లేచి వంటగదిలోకి వెళ్ళింది దిష్టి తీస్తానంటూ. 

          రఘురాం మానస దగ్గరకి వచ్చి అన్నాడు, ‘కన్నబిడ్డ నెలల వయసులోనే దూరమవడం, సంవత్సరాల తరబడి అనుభవించిన తీవ్రమైన బాధ, మీ అమ్మని నిలవనివ్వడం లేదు. ఎదిగొచ్చిన కూతురైనా కూడా ఎక్కడ ఎవరు నిన్ను తననుండి మళ్ళీ దూరం చేస్తారో అన్న ఆందోళన ఆమె అంతరాంతరాలలో గూడు కట్టుకుని పోయింది. కానీ నువ్వు తనకి దూరమవక ముందు వరకూ మీ అమ్మ చాలా ధైర్యవంతురాలు.  చుట్టూ ఉన్నవారికి చేతనైనంతలో సహాయం చేస్తూ ఉండేదమ్మా! పనివాళ్ళ పిల్లలకి అర్ధం కాకపోతే పాఠాలు నేర్పిస్తూ ఉండేది.’ 

రఘురాం చెబుతున్నది వింటుంటే మానసకి మనసంతా గర్వంగా, తల్లిపట్ల కృతజ్ఞతగా అనిపించింది. ‘తనలో ప్రవహిస్తున్న సుగుణాలు ఆమెవే, తనకు అబ్బిన పరోపకార భావనలు, సంస్కారం తల్లినుండి సంక్రమించినవే కదా!’ 

రఘురాం ఇంకా చెబుతున్నాడు “కానీ ఏదో ఒకరోజు నీకూ పెళ్ళి అవుతుంది లేదా ఉద్యోగం కావచ్చు లేదా ఇంకేదైనా కారణంతో ఎప్పుడైనా నువ్వు మీ అమ్మకి దూరంగా ఉండవలసి రావచ్చు. ఆ దూరం ఆమె భరించలేకపోవచ్చు. కాబట్టి నువ్వే మీ అమ్మలో తిరిగి ధైర్యం నింపాలి” అని రఘురాం నెమ్మదిగా గది బయటకు వెళ్ళాడు. 

          మానస తండ్రి వైపే చూస్తూ ఆయన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తోంది. ‘నిజమే! మళ్ళీ తనెక్కడ దూరమౌతానో అనే ఆందోళనలో తన తల్లి ఉంది. తనిప్పుడు చిన్నపిల్ల కాదు, పెళ్ళీడుకొచ్చింది. పెళ్ళైతే తనకు అత్తారిల్లు కూడా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ బాధ్యతలు పెరుగుతాయే కానీ తగ్గవు. పెరుగుతున్న బాధ్యతలతో ఇంట్లో, తల్లితో గడిపే సమయం కూడా తగ్గవచ్చు. ఏది ఏమైనా తల్లిలో ధైర్యాన్ని నింపితే ఆ ధైర్యమే తనకూ కొండంత బలంగా ఉంటుంది.' అనుకుంది మానస.

          మానస ఆలోచిస్తుండగానే శ్రావణి గుప్పిట నిండుగా ఎర్ర మిరపకాయలు పట్టుకొనొచ్చి మానసకి దిష్టి తీసి వెళ్ళి ఆ మిరపకాయలు చెత్తలో పడేసి చేతులు, కాళ్ళు కడుక్కుని వచ్చి కూతురు దగ్గర కూర్చుంది.

          మానస తల్లి చెయ్యి తన చేతిలోకి తీసుకుని అంది “ అమ్మా! జీవితం చాలా చిత్రమైనది. ఏ చోటా ఆగకుండా పారే సెలయేరులాంటిది. మనతోపాటు ఎవరు ఉన్నా లేకున్నా జీవితం మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు నేను అనాథని, నాకెవరూ లేరనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఒక కుటుంబం, తల్లి, తండ్రీ ఉన్నారు. అప్పుడూ ఇప్పుడూ నా చుట్టూ ఏదీ మారలేదు. అదే మనుషులు ఉన్నారు, నా జీవిత పథం కూడా ఒకేలా ఉంది, ఏమీ మారలేదు. మారిందల్లా నేను జీవితాన్ని చూసే దృక్కోణం. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు. నిన్నటి వరకూ మనిద్దరం ఒకరికొకరం ఎవరో తెలియదు. ఈ రోజు మనం అపురూపమైన తల్లీ కూతుళ్ళం. తరువాత ఏదో ఒకరోజు పెళ్ళి ద్వారా అంతవరకూ ఏ బంధమూ లేని కుటుంబం నాదవుతుంది. అలాగే తోడ బుట్టిన వాళ్ళూ, పిల్లలూ… ఎవరి కుటుంబాలు వాళ్ళకి ఏర్పడుతూ ముందుకు సాగుతుంది జీవితం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఏదీ శాశ్వతం కాదు! ఎప్పుడూ అందరూ మనతోనే ఉండిపోలేరు. కానీ మన ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు చిరకాలం నిలిచి ఉంటాయి, శాశ్వతంగా. ఇది అర్ధం చేసుకున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమభావంతో చూడగలుగుతాము. అమ్మా! ఒకప్పుడు నువ్వు ఏ విధంగా పేద పిల్లలకు ఉచితంగా విద్య నేర్పించావో, అదే విధంగా ఇప్పుడు అనాథ శరణాలయంలో పిల్లలకు అప్పుడప్పుడూ వచ్చి చదువు చెప్పాలి. ఈ ప్రపంచంలో నీ వెలుగులు ప్రసరింపచెయ్యాలి. చేస్తావు కదూ…?” ఆర్ద్రంగా అడిగింది మానస.

          శ్రావణి కళ్ళలో కన్నీళ్ళు జలజలా రాలాయి. “నా బంగారు తల్లీ! ఇప్పుడే దగ్గరయిన నా బిడ్డ మళ్ళీ ఎక్కడ దూరమవుతుందోనని ఇన్నాళ్ళూ నాలో గూడు కట్టుకున్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి. ఎంత బాగా చెప్పావు!  నిజమే. ఈరోజు నాది అనుకున్నది రేపు నాది కాదు. కానీ సేవలోనే సాంత్వన  దొరుకుతుంది. మంచి ఆలోచన! తప్పకుండా అప్పుడప్పుడూ అనాథ శరణాలయానికి వచ్చి పిల్లలకు పాఠాలు చెబుతాను.” 

          మానస కంట్లో ఆనందభాష్పాలు కారుస్తూ తల్లిని కౌగలించుకుంది. 

***

          మానస సెల్ ఫోన్ రింగవుతోంది. ఎవరా? అని చూస్తే అటువైపు అనిరుధ్! చాలా సంతోషంగా ఉంది అనిరుధ్ గొంతు. 

          “ఏమిటి విశేషం? చాలా ఆనందంగా ఉన్నావు?” అడిగింది మానస.

        “అవును మానసా! చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఫోన్ లో చెప్పే విషయంకాదు. మనం ఎప్పుడూ మీట్ అయ్యే చోటుకి రా! అంతా చెప్తాను.” 

***

          అనిరుధ్ మానస చేతిలో ఒక కవర్ పెట్టాడు ‘తీసి చదువు’ అంటూ.

          ‘ఏమై ఉంటుందబ్బా?’ అనుకుంటూ ఆ కవర్ తెరిచి చూసింది. మానస కళ్ళు సంతోషంతో మెరిసాయి. 

          ఆ ఉత్తరం - ‘ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో’ నుండి. అనిరుధ్ కి జాబ్ అఫర్ లెటర్.

          ‘గ్రేట్ న్యూస్ అనిరుధ్! నాకు చాలా గర్వంగా ఉంది. కలలు అందరూ కంటారు. కానీ కొందరే ఆ కలలను నిజం చేసుకోవడానికి పాటుపడతారు. కొందరే నిజం చేసుకుంటారు. ఈ జాబ్ అఫర్ లెటర్ నీ సంవత్సరాల కృషి, నిబద్ధతకు లభించిన అందమైన ప్రతిఫలం. నీకు నా అభినందనలు!’

          అనిరుధ్ వెలిగిపోతున్న మొహంతో అన్నాడు “థాంక్యూ! ఎప్పుడూ బెరుకుగా ఉండే నాలో ధైర్యాన్ని నింపి, కలను సాధించగలననే  ఆత్మవిశ్వాసాన్ని నింపింది నీ స్నేహం. నా కృషి, నిబధ్ధతలకు స్ఫూర్తి నీ సేవాగుణం.”

No comments:

Post a Comment

Pages