పల్లవి:
నటనల భ్రమయకు నామనసా
ఘటియించుహరియే కలవాడు
చ.1:
ముంచిన జగమిది మోహినీగజము
పొంచినయాస పుట్టించే దిది
వంచనల నిజమువలెనే వుండును
మంచులు మాయలే మారునాడు
చ.2:
సరిసంసారము సంతలకూటమి
సొరిది బచారము చూపేదిది
గరిమ నెప్పుడు గలకలమనుచుండును
మరులగువిధమే మాపటికి
చ.3:
కందువదేహము గాని ముదియదిది
అందినబహురూప మాడేదిది
యెందును శ్రీవేంకటేశ్వరుడుండును
డిరదుపడగనిదె తెరమరగు
భావం
పల్లవి:
ఓ మనసా!లోకంలో తమ అవసరాలు గడుపుకోవటానికి జనులు ప్రవర్తించే కపటప్రవర్తనములలో భ్రమించకు. వాటిని నమ్మకు. సృష్టిని కలిగించు వేంకటేశ్వరుడే మనందరికి ఆప్తుడు.అతనినే నమ్ము.
చ.1:
నశింపచేయు ప్రపంచమిది. ఈ ప్రపంచము అందరిని మోహింపచేయు ఏనుగు. హఠాత్తుగా దాడి చేసేందుకు చాటున దాగి ఉండు స్వభావము కలిగిన ఆశలను ఈ ప్రపంచము పుట్టిస్తుంది.మోసముతో ( మాయతో) ఈ ప్రపంచము నిజములా ఉంటుంది.వేరొకరోజు( స్వామి దయతో జ్ఞానం కలిగినరోజు) ఈ మాయలన్నీ మంచులా కరిగిపోతాయి.
చ.2:
ఎదుట ఉన్న ఈ సంసారము తాత్కాలికం. ( సంతలో కలయిక తాత్కాలికము. అలాగే ఈ ప్రపంచములో బంధుత్వాలు తాత్కాలికమని భావం)క్రమంగా అంగడిని ( వివాహాలు , బంధుత్వాలు మొదలైన బేరసారాలు చేసే అంగడి) చూపిస్తుంది.గొప్పతనము, గౌరవము మొదలైన వాటి కోసం తాపత్రయ పడుతూ కలకలమని ఉంటుంది.
మాపటికి (రాత్రికి) మోహాన్ని పెంచే విధానమే ఈ సంసారం చేస్తుంది.
చ.3:
ఇది అసత్యమైనశరీరము, కపట శరీరము.ఇది ఎప్పటికి ముసలితనము పొందదు. ఎప్పుడూ బహురూపాలలో ఆడుతుంటుంది.( అవిద్యా కామకర్మలు).ఎక్కడయినా శ్రీవేంకటేశ్వరుడున్నాడు.ఆయనను ఆశ్రయించితే అన్నీ శమించి ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి.(అనగా మాయాప్రభావము తొలగుతుందని, మోక్షం లభిస్తుందని భావం)
విశేషాలు
1. పచారము
పచారము అను మాటకు నటన, అంగడి, మాట అను అర్థాలున్నాయి. వీటిలో అంగడి అను అర్థం సందర్భానుసారంగా స్వీకరించటమయినది.
2. షడూర్ములు :
ఊర్మి అనగా తరంగం. షడూర్ములని వేదాంతుల పరిభాష ఒకటి ఉంది. తరంగాలలాగా వస్తూ పోతూ ఉండేవి అని అర్థం. అవి ఆరు. అందులో జరామరణాలు రెండు స్థూలదేహానికి చెందినవి. క్షుత్పిపాసలు రెండూ సూక్ష్మదేహానికి పోతే మోహశోకాలు రెండూ కారణ దేహానికి సంబంధించిన దోషాలు. ఇవే షడూర్ములు. వీటిని నిశ్చలమైన సాగరంలాంటి మన చైతన్య సాగరంలో(వేంకటేశ్వరునిలో) అదిమి వేయగలిగితే అంతా ఆత్మాకారంగా అనుభవానికి రాగలదు.అన్నమయ్య ‘‘ఎందును శ్రీవేంకటేశ్వరుడుండును/డిరదు
కందువ దేహం
‘దేగ్ధి లింపతి.’ ఏదయితే పూసినట్టు కప్పినట్టు కనిపిస్తుందో అది దేహం. మన ఆత్మచైతన్యాన్ని చుట్టూ కప్పివేసి దాన్ని తన భౌతిక గుణాలతో పులిమి పుచ్చుతున్నది. కనుక దేహమనే పేరు దీనికి సార్థకంగా పెట్టారు. ఇదే మన చైతన్యానికి ఉపాధి .చైతన్యాన్ని కప్పే ఉపాధులన్నీ శరీరాలే. అవిద్యా కామకర్మలు మూడూ మూడు శరీరాల కిందికే వస్తాయి.అవిద్య కామం నిరాకారమైనా అవి మన ఆత్మను కప్పివేస్తున్నాయి కనుక ఒకటి కారణ శరీరం, మరొకటి సూక్ష్మశరీరం అని పిలవబడుతున్నాయి. కర్మ స్థూలమైన శరీరంగా, సాకారంగా కనిపిస్తూ ఉన్నది. అన్నీ చేస్తూ ఉన్న పని ఒక్కటే. అది మన స్వరూపాన్ని సంపూర్ణంగా మనకు చూపక మరుగుపుచ్చుతాయి.( బ్రహ్మశ్రీ యల్లంరాజు)అన్నమయ్య ఈ కీర్తన అంతా పై భావాల సమ్మిశ్రితం.
ముంచిన జగమిది మోహినీగజము
No comments:
Post a Comment