ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -16 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -16

Share This

                                         ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -16

                                                                                                            కొత్తపల్లి ఉదయబాబు


'సరే విరాజ్. నువ్వు ఇది అని కాదు గాని ఇలాంటి పని ఒకటి చేస్తావని అనుకున్నాను. ఇదే కోవెలలో మీ స్నేహానికి గుర్తుగా హరిత కూడా నీకు ఒక బహుమతి ఇస్తుంది. దానిని నువ్వు కాదనకూడదు.'' శకుంతల మాటలకు ఆశ్చర్యపోవడం విరాజ్, హరితల వంతైంది. 

''ఏమిటమ్మా అది? నాతో చెప్పనేలేదు?'' ఉత్సాహంగా అడిగింది హరిత. 

''ఆ తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని నువ్వే అతనికి ఇవ్వు.'' అంటూ తన చేతిలోని పర్సులోంచి ఒక చిన్న పాకెట్ తీసి హరితకు ఇచ్చింది శకుంతల.

దానిని తెరుస్తూనే విరాజ్, హరితలా కళ్ళు మెరిసాయి. అది శకుంతల చేయించిన ''H-V" పెండెంట్.ఆ రెండు అక్షరాలను కలుపుతూ బంగారంలో నీలంరాయి ధగధగా మెరుస్తోంది దీపాల కాంతిలో .

''ఇదెక్కడ చేయించారేమిటి ఆంటీ? అరే .ఇది మా షాపులోనే చేయించారు ...అంటే మీరు మా షాప్ కి వచ్చారా?మా నాన్నగారిని కలిసారా? నేను లేనప్పుడు వచ్చారా?''ఆశ్చర్యపోతూ అడిగాడు విరాజ్.

''వచ్చాను బాబు. ఆడపిల్లకు పెళ్ళిచేసేటప్పుడు ఎంత లేనివాళ్ళైనా చేయువులకు రింగులు, మేడలో ఒక బంగారపు గొలుసుతో కన్యాధార పోయాలని మా అమ్మ చెబుతుండేది. అసలు బంగారం రేటు ఎలా ఉందో   తెలుసుకోవడానికి మీ షాపుకు వచ్చాను.మీ నాన్నగారు  కౌంటర్లోనే ఉన్నారు. కానీ నేను ఫలానా అని, మీరు మా ఇంటికి వచ్చారని చెప్పలేదు.  మీరెప్పుడు హాపీ విరాజ్ లా ఉండాలని కోరుకుంటూ ఆ అక్షరాలా కాంబినేషన్ తో చేయించాను. ''అంది శకుంతల.

''ఎంత మంచి పనిచేశారు ఆంటీ..మీ దూరదృష్టికి నా ప్రణామాలు. హెచ్.వి. అంటే నేను ఇంకా హరిత-విరాజ్ అనుకున్నాను.''

''మా హరితతో మీ స్నేహం పెళ్లిగా  మారిన నాడు అలా అనుకోండి. అంతవరకూ హ్యాపీ విరాజ్ అనే అనుకోండి.''అంది.

 ''దీన్ని నా బ్రాస్-లెట్ లో వేసుకుంటాను ఆంటీ. ధన్యవాదాలు మీకు. ''

''మేమే మీకు ఫోన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి.''

''అన్నట్టు ఆంటీ తీహారిత కరాటే నేర్చుకుంటాను అంది. నా స్నేహితుడు ఒకతను జిమ్ పెట్టుకున్నాడు, ఆటను ఆడపిల్లలకు కరాటే తరగతులు కూడా నిర్వహిస్తాడు. ఇది అతని విజిటింగ్ కార్డు. మీరు వెళ్లి హరితను జాయిన్ చేయండి. నేను చెప్పానని చెప్పండి.'' 

అది అందుకుని చదివిన హరిత తల్లికి ఇచ్చింది. హరిత దానిని పర్సులో పెట్టుకుంది.

''ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కి అడిగాను. ఆటను రెండు రోజుల్లో చెబుతాను అన్నాడు. ఈలోగా హరిత చేత ఫోన్ లో రకరకాల వంటకాలు చేయడం నేర్పించండి. ''

''నా ప్రయత్నం నేను చేస్తాను బాబు.. నా ఆఫీసులో కొల్లీగ్స్ కి ఇప్పటికే చెప్పాను.ఏది దొరికినా అందులో చేరిపోవచ్చు...యే ఉద్యోగంలో అయినా మూడురోజులు పని నేర్చుకుంటే నాలుగోరోజు అలవాటైపోతుంది.సరే నేను మరొక్కసారి స్వామీ దర్శనం చేసుకుని వస్తాను. ''అని చెప్పేసి మెట్లవైపు వెళ్ళిపోయింది శకుంతల.

అది తమ ప్రయివసీకోసం అని అర్ధం చేసుకున్న విరాజ్ కొంచంగా హరిత పక్కకు చేరాడు.

''విరాజ్...మీకు ఈవేళ ఆరో పాయింట్ చెబుతాను అన్నాను..గుర్తుందా...''అంది హరిత.

''చెప్పు హరితా..నువ్వు ఏంచెప్పినా మనస్ఫూర్తిగా వింటాను.''

''ఈవిషయం మిమ్మల్ని తప్పక బాధపెడుతుంది విరాజ్.అందుకే ఆలోచిస్తున్నాను.''అంది హరిత.

"ఈసారి నువు ఏదో నియమాన్ని గట్టిగా చెప్తావని అనుకుంటున్నాను.నియమాలు గట్టిగా ఉంటే ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం మరింత గట్టి పడుతుందని నా నమ్మకం.

నేను నీతో నా స్నేహాన్ని ఏదో ఆషామాషీగా తీసుకోవడం లేదు. నా జీవితానికి ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే మీ నాన్నగారు లేకపోయినా మీ అమ్మగారు నడిపిస్తున్న క్రమబద్ధమైన జీవితంలో నువ్వు ఎంత క్రమశిక్షణగా, నిబద్ధతతో  నడుస్తున్నావో నాకు అర్థం అయింది.

నేను చాలామంది ఫ్రెండ్స్ ని అని చూశాను.

కాలానికి తగ్గట్టుగా బతికేయడం ఈరోజు మనకి డబ్బు ఖర్చు లేకుండా ఎలా గడిచి పోతుందా అనే ఫ్రెండ్స్ నాకు ఎక్కువ. 

నిజం చెప్పాలంటే ఈ నెళ్ళాళ్లలో నీ పరిచయం అయ్యాక ఫ్రెండ్స్ రమ్మన్నా బయటికి ఎక్కువగా వెళ్లడం లేదు. ఇదివరకు పొద్దున పోతే రాత్రి వచ్చేవాడిని.

 (ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages