'ప్రశాంత నిశ్శబ్దం!'
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
ఎన్నో దశలు దాటి వచ్చానని గొప్పగా చెప్పుకొని
గాంభీర్యాన్ని కాస్త గట్టిగానే ప్రదర్శించవచ్చేమోగానీ..
మునగదీసుకొని మూలకూర్చొని వున్న మృత్యువు ముఖాన్ని
చూస్తూ అబద్ధం చెప్పటం సాధ్యమా?!
కాలాలు ఎవరి ప్రమేయం లేకుండా మారొచ్చు
ఋతువులు వాటంతటవే వచ్చి వెళ్లిపోతూ ఉండొచ్చు..
మరి,
జీవితాన్ని నిర్దేశించే గమ్యం
కడదేర్చే ఘడియను తెలుసుకోలేకపోవటం
ఆశ్చర్యమే కదా!
వేల మాటలు చెప్పొచ్చు,
స్వప్నాల బాటలు చూపించవచ్చు కానీ,
గెలిచినప్పుడే గొప్పనిపించే
శాశ్వత భావన ముందు
అన్నీ శూన్యమనిపించవచ్చు
అయితే చివరికి గెలుపే పయనమనే దిశగా
పరుగులు ఎప్పటిదాకా? ఎందాక?
మారే క్షణాల్లో నిలిచిపోయే శ్వాసే నిజమైన సత్యం?
మరో క్షణం ఆశించి
మన ఆలోచనలను
ఎన్ని గగనాలకు ఎగరేసినప్పటికీ,
అక్కడే నిలిచిపోయిన
భావనల ఆగమనం,
మరణం ఎదుట ఏ నిజమో చెబుతుందా మన మనసుకు?
ఎన్నో దారులు, ఎన్నో కలలు, సాహస పయనాలు,
అవి అన్నీ గమ్యం లేకుండానే ముగిసిపోతాయి,
వెలుగులు, కరిగిపోయిన అస్తమయాల వంటివి!
సత్యం చివరికి కేవలం ప్రశాంతమైన నిశ్శబ్దం.!!
***
No comments:
Post a Comment