ప్రేమ తత్త్వమే భగవత్ తత్వం - అచ్చంగా తెలుగు

ప్రేమ తత్త్వమే భగవత్ తత్వం

Share This
                                        ప్రేమతత్వమే భగవత్ తత్వం

సి.హెచ్.ప్రతాప్




జీవి పుట్టిన క్షణం నుండి తన తల్లిని ప్రేమిస్తూ వుంటుంది. ఇదే సూత్రం ఈ సృష్టిలోని ప్రతీ జీవికి వర్తిస్తుంది.దీనిని బట్టి మానవుల హృదయాలలో మొట్టమొదట ఈ ప్రేమ భావనే జనిస్తుంది అని అర్ధమౌతోంది. ప్రేమ భావన తర్వాతే మిగితా భావనలు ఉత్పన్నమవుతుంటాతి. అసలు ఈ సృష్టిని నడిపించేది ప్రేమ భావనే అని భాగవతంలో చెప్పబడింది. ఓ మానవుడా నీకు ప్రేమ లేకపోవడం చేతనే, నీకు స్వార్థం కలుగడం చేతనే ఇన్ని విధాల బంధాలతో జగత్తులొ చిక్కుపడి ఉన్నావు. త్యాగము, ప్రేమ, ధర్మము నీలో కలిగినపుడు దివ్యమైన మానవునిగా రూపొందుతావు” అంటూ శ్రీ సత్యసాయిబాబా ఏ రూపమైనా, ఏ నామమైనా అనేకత్వం లోని ఏకత్వాన్ని ప్రబోధించేవారు. మానవ జీవితమనే వృక్షానికి ప్రేమ వేరు మరియు జ్ఞానం ఫలమని ఉపనిషత్తులు కూడా చాటుతున్నాయి.  కాబట్టి మానవ జీవితానికి ఆధారం ప్రేమ, జీవితమే ప్రేమ మరియు ప్రేమే జీవితం.తాను సృష్టించిన జీవులందరినీ రక్షించేవాడు భగవంతుడు. భగవంతుని తత్వం ప్రేమ , కరుణ, దయ లు . కాబట్టి ప్రేమ స్వరూపుడైన భగవంతుడిని స్వార్ధరహితంగా ప్రేమించి, ఆరాధిస్తే, ఆ స్వార్ధరహితమైన నిశ్చలమైన ప్రేమే సర్వులను రక్షిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా ఒక సందర్భంలో అర్జునుడితో ఎవరైతే నన్ను నిశ్చలంగా, నిస్వార్ధరహితంగా, ధృఢమైన విశ్వాసంతో ప్రేమిస్తారో, నా నామాన్నే నిరంతరం జపిస్తారో, ణా రూపాన్ని తమ గుండెల నిండా నింపుకొని అనుక్షణం నన్ను ఆరాధిస్తారో అట్టివేరే నాక్కు అత్యంత ఇష్టులు. ఈ సృష్టికీ ఆధారభూతమైన ప్రేమతత్వాన్ని గుర్తించి సర్వులను నిస్వార్ధంగా ప్రేమిస్తారో వారే నా ప్రైయ భక్తులు అని ప్రేమ తత్వం గురించి అద్భుతంగా తెలియజేసారు.  ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని, ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే.. ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమ తత్వం బోధిస్తుంది.కృష్ణుడు ఎప్పుడు స్త్రీల కోసం పాకులాడలేదు. అసలైన ప్రేమను అర్థం చేసుకునేవారికే కృష్ణుడి ఆరాధన కూడా అర్థమవుతుంది. ప్రేమతో ఈ సృష్టిలో సాధించలేనిది అంటూ ఏమీ లేదు. కరుడు కట్టిన శిలల వంటి హృదయాలను సైతం నిస్వార్ధ నిశ్చల , అనిర్వచనీయమైన ప్రేమ తత్వం కరిగిస్తుంది. కోపం, అసూయ, స్వార్ధం,అహంకారం , దర్పం వంటి అసురీ భావాలను సైతం చల్లార్చగలిగేది ప్రేమ తత్వం మాత్రమే ఎందుకంటే అదే భగవత్ తత్వం. తోటి మనిషిని ప్రేమించండి.. ఇంతకు మించిన దేవుడి సేవ లేదు’ అంటూ ప్రజల్లో ప్రేమతత్వాన్ని నింపుతూ గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని అవతార్ మెహర్ బాబా తీసుకువచ్చారు. దైవాన్ని చేరాలంటే.. పూజలు, ధూప, దీప, నైవేద్యాలు, మడి, ఆచారం, తిథి, సంప్రదాయాలు వద్దనీ, మనిషి ప్రేమ తత్వాన్ని అలవరచుకుంటే.. భగవంతుడే స్వయంగా వచ్చి సాక్షాత్కరిస్తాడని బాబా అనేవారు.  ఈ కలియుగంలో అశేష భక్తజనావళిచే ఆరాధించబడుతున్న శ్రీ శిరిడీ సాయిబాబా వారు కూడా ప్రేమతత్వాన్నే ఎక్కువగా కనబరిచారు. శ్రద్ధ, సాబురి- ఓర్పు, సహనంతో జీవితాన్ని సాగించారు. సాటివారి పట్ల విసుగు, చిరాకు, కోపం, ద్వేషం వంటివి ప్రదర్శించకుండా, సహాయ సహకారాలు అందించడమే పరమావధిగా ఆయన అనుసరించి, మనకి ఆదర్శంగా నిలిచారు. కేవలం మానవులనే కాకుండా కుక్కలు, గుర్రాలు వంటి జంతుజాలాల్లో కూడా భగవంతుని వీక్షించి, వాటిని కూడా ప్రేమగా చేరదీస్తూ ఆహారం అందించేవారు. ఆయన జీవితమంతా కూడా ప్రేమ తత్వానికి ఒక ఉదాహరణగా, ప్రతిరూపంగా నిలిచింది.

మనిషి పక్షిలా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు. చేపలా నీటిలో ఈదటం నేర్చుకున్నాడు. కానీ ఈ భూమిమీద మనిషిలా బతకడం మనిషికి చేతకావటంలేదు. నాగరికత పెరిగింది. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది. కాని ప్రేమతత్వం అంతగా పెంపొందడం లేదు.    మనుషుల్లో దైవభక్తి మరీ సన్నగిల్లిపోతుంది. దైవభక్తి ఉన్నప్పుడు ప్రేమతత్వం వర్థిల్లుతుంది. అప్పుడు ఎటువంటి అనర్థాలు జరగటానికి అవకాశం ఉండదు. మనిషి భూమిమీద ఆనందం అనుభవించాలంటే అందుకు కావలసినవి ప్రేమ, విజ్ఞానం.


కాబట్టి ప్రతి ఒక్కరూ స్వార్ధాన్ని,  క్రూరత్వాతన్ని విడానాడి వాటి  స్థానంలో ప్రేమని,  విజ్ఞానాన్ని,  వృద్ధిచేసుకుంటే జీవితాంతం ఆనందాన్ని అనుభవించగలగుతారు. వీటిని ప్రతీ మనిషి తప్పక పెంపొందించుకోవాలి. అలాంటి ప్రేమ నేడు ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా యుక్తవయస్సులో కలిగేది ఆకర్షణా? లేదా నిజమైన ప్రేమనా అనే క్లారిటీ లేక యువత తికమక పడుతుంది. ఒకవేళ అది ఆకర్షణ అయితే ఆ బంధం విడిపోవడానికి కొద్దిరోజుల సమయమే పడుతుంది.యుక్త వయస్సుకు వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారు చెడుదారిలోకి వెళ్లకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలతో చనువుగా ఉంటూ ప్రేమ, ఆకర్షణకు తేడా అర్థమయ్యేలా వివరించాలి.


***

No comments:

Post a Comment

Pages