రకరకాల రాముడి కథలు - అచ్చంగా తెలుగు
 రకరకాల రాముడి కథలు
 - కర్లపాలెం హనుమంతరావు 




జానపదులకు తెలిసినంత శ్రీరామ చరిత్ర పండితులకు తెలియదేమో! క్రీస్తుకు పూర్వము మూడొందల శతాబ్దాల నుంచి జైనులు వచ్చినప్పటి నుంచి మన జానపదులు రామాయణం కథలు కథలుగా వింటూనే వున్నారు. వాటినే గేయాలుగా పాడుకొంటున్నారు. వాల్మీకి రామాయణ ఆంధ్రీకరణల్లో వీటికి కొంత చోటు దక్కింది కూడా! జానపదుల స్త్రీల పాటల్లో సీతారాములు పదహారణాల తెలుగువాళ్లు . మన కష్ట సుఖాలన్నీ సీతారాములకూ అంటగట్టారు . స్త్రీల రామాయణపు పాటలలో కుశలవ కుచ్చలకథ పెద్దది,ప్రధానమైనది. తల్లి పేరేంటో తెలీని ఆడపడుచు ఎవరో వాల్మీకంలో లేనివి జైన రామాయణాల నుంచి విన్న రామకథలను పాటలుగా మలచి భద్రపరిచింది. పట్టాభిషేకం తరువాత రాముడు వేటకని వెళ్లే ముందు సీత సెలవు కోసం అంత: పురానికి వెళ్ళాడు. సీత 'మిమ్ము నెడబాసి నిముష మోర్వను .. మీతో కూడా వస్తాననెను. 'ఎడబాయక మన శాంతవుండగా ఏమి కొదవ గావచ్చునె నీకు?' అని ధైర్యంచెప్పి వెళ్ళిపోతాడు రాముడు . గతంలో జరిగిన అవమానానికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశమొచ్చింది శూర్పణఖకు. అప్పట్లో రామలక్ష్మణుల ముందు కోసిన 'వొడిగట్టిచుక్కల నేరగ నేర్తు , ఏరిన చుక్కలు విడువగ నేర్తు.. పారెడు పిడుగుల పట్టగ నేర్తు , పట్టిన పిడుగుల విడువగ నేర్తు ' వంటి రకరకాల విద్యలు పునశ్చరణ చేసి అంగదుడితో కలసి అంత:పురానికి వెళ్లగలిగింది . సీత ఆడపడుచు శాంత గారడీదని శూర్పణఖను తరిమిగొట్టపోతే 'కూటిక చేరిన బాపన పడుచువు! కూతలేటికే శాంతరొ నీకు' అని ఎదురు పెట్టేసరికి యతికి ఏదైనా ఇచ్చి సాగనంపే పని సీతకు అప్పగించి తాను తప్పుకుంటుంది శాంత. రావణుని పటం రాసివ్వమని అడిగిన శూర్పణఖతో 'పది నెలలు చెరనుంటిని కాని పాపకర్ముని కన్నులచూడ, జనకునిగా భావిస్తిని. నేను అంగుష్ట మొక్కటి ఎరుగుదును' అని చెప్పి ఆ వేలు బొమ్మే రాసిచ్చింది సీత. ఆ పటానికి బ్రహ్మ తో ప్రాణం పోయించుకొని వచ్చి సిత దగ్గర పడేసి చక్కాపోయింది శూర్పణఖ. ' రావే పోదము లంకకు ననుచు' రచ్చ రచ్చ చేసే ఆ పటాన్ని అంతఃపుర స్త్రీలు నిప్పుల్లో పడేసినా కాలింది కాదు. నూతిలోకి విసిరి పాషాణాలు తోసినా పగలకొట్టుకొని మరీ పైకొచ్చి సీతను పీడించడం మానలేదు . రాముడి మీద ప్రమాణం చేసి ఆ పీడను మంచం కింద దాచేసింది సీతమ్మ చేసేదేం లేక . ఆ రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు రాముణ్ణి ఆ పటం కిందకు పడతోసింది. 'ఆడుదురు పాడుదురు కవ్వింతురుగాని.. పడతోసుట లివి సరసములటనే' అంటూ ఒంటి మన్ను దులుపుకొని సీతను మందలించి మళ్లీ పట్టె మంచం పైన కూర్చున్నాడు రాముడు . పటం అతగాడి ఎదురుగా నిలబడింది. దాన్ని చూసి రాముడు సీతను అనుమానించాడు. 'నాకని ఇచ్చెను జనకుడు నిన్ను మోహము రావణుపై కద్దనెను. ఎంత మోహము రావణు మీదా? ' అంటూ అనరాని మాటలన్నాడు. సీతను అడవులకు పంపించేశాడు . ఈ కథ వాల్మీ కంలో కనిపించదు కాని, శ్వేతాంబర జైన రామాయణంలో కొద్ది తేడాతో ఉంది. ఈ తెలుగు సీతారాముల కథ ఖండాంతరాలకు వెళ్లే క్రమంలో శూర్పణఖ చోటులో ఆమె కూతురు థాయ్ లండ్ రాక్షస కన్య 'అద్దుల్' వచ్చి చేరింది. లంకలో ఉమ అయింది. . కంబోడియాలో ఓ యక్షిణి అయింది. మలేషియా రామాయణంలో అయితే కైకేయి కూతురు కుకువా ఈ దుష్కార్యానికి వడిగడుతుంది . బెంగాలీ చంద్రావతి రామాయణంలోనూ ఈ దుష్ట చేష్ట కుకువాదే కాని .. చేసేది మంధర దుర్బోధ వల్ల! ఇన్ని దేశాల రామాయణాలలో ఈ సన్నివేశంలో ఇన్నేసి మార్పులు జరగటానికి కారణం జైనుల రాముడికి సీత సౌశీల్యం మీద అప్పట్లో ఆట్టే నమ్మకం లేకపోవడం! 

 ( ఆరుద్ర రచన రాముడికి సీత ఏమవుతుంది ? .. ఆధారంగా 

No comments:

Post a Comment

Pages