ఉమారామేశ్వర శతకము - అచ్చంగా తెలుగు
ఉమారామేశ్వర శతకము - విద్వాన్ కల్లూరి వెంకటసుబ్రహ్మణ్యదీక్షితులు

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
 


కవి పరిచయం:
ఉమారామేశ్వర శతక రచయిత విద్వాన్ కల్లూరి వెంకటసుబ్రమణ్య దీక్షితులు క్రీ.శ. 1908 సంవత్సరం దత్తాత్రేయ జయంతి నాడు శ్రీ భోగీశ్వరసోమయాజులు, శ్రీమతి రామలక్షమ్మ దంపతులకు పశ్చిమగోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా పట్టిసము వద్ద తాళ్ళపూడి గ్రామంలో జన్మించారు. వీరు కౌండిన్యస గోత్రులు. శాండిల్యస గోత్రులైన కంభంపాటివారికి వీరు దౌహిత్రులు, గౌతమస గోత్రులైన ఈమనివారి కుమార్తెను వివాహము చేసికొనినారు. వీరు తమ 18వ ఏటనుండి మూడు సంవత్సరములు కరణీకము చేసి ఆతరువాత విజయవాడలో, కొత్తగూడెములో భీమవరములో ఆపైన కొవ్వూరులో ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ సంస్కృతకళాశాలలో ఆచార్యపదవి నిర్వహించారు.

వీరు బహుగ్రంధకర్త. కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఆశిస్సులందుకొని ఆస్ఫూర్తితో అనేక గ్రంధములను రచించారు. వానిలో 1. కవి కల్పలత (దేవేశ్వర మహాకవి కృతికి ఆంధ్రీకరణ) 2. భాగవత మాహాత్మ్యము 9పద్యకావ్యం, 1936) 3. ఆస్తాదశపురాణములలో పదకొండు మహాపురాణాలకు ఆంధిరీకరణ (గద్య పరబంధములు, 1936-1941), 4. మంజీరము (ఖండకావ్యము), 5. శ్రీమదాంధ్ర మహాభాగవతము (పరిష్కర్త), 6. స్కందపురాణము (ఆంధ్రికరణ వచనము, 1968), 7. నవనీతము (శ్రీకంచి కామకోటి జగద్గురువుల బోధనలు, తేటతెలుగున తేటగీతి పద్యములు, 1968), 8. ఆర్యాద్విశతి (దూర్వాసముని కృతికి ఆంధ్రీకరణ), 9. "భద్రాద్రి రామప్రభు" శతకము, 9. నారాయణీయము (ఆంధిరీకరణము,తాత్పర్య సహితము) 10 మూకపంచశతి (ఆంధిరీకరణము తాత్పర్య సహితము), 11. గురుకృపాలహరి (306 స్లోకముల సంస్కృత స్వతంత్ర కావ్యము), 12. ఉమారామేశ్వర శతకము. ఇవియేకాక వీరు ప్రజ్ఞానిధులు, కళానిధులు వంటి అనెక గద్య గ్రంథములను రచించారు. వీరు రచించిన శ్రీకామకోటి జగత్గురు దివ్య చరిత్రము 'ఆంధ్రప్రభా లో ప్రతి ఆదివారము ధారావాహికముగా ప్రచురించబడినది. విరు ఆంధ్రప్రభలో గ్రంధసమీక్షకులుగా అనేక ఉత్తమ గ్రంధములపై వ్రాసిన వ్యాసములు అత్యంత ప్రసిద్ధి పొందినవి.
వీరి అముద్రిత రచనలలో 'పాండురంగ మాహాత్మ్య వ్యాఖ్యా 'ప్రభోదసుధాకరము  , 'శ్రీనాథీయము  , 'జగద్గురు చంద్రదర్శన సాహస్రీ (సంస్కృత పద్యకావ్యము) మొదలైన అనేక రచనలు కలవు.

శతక పరిచయం

'ఉమారామేశ్వరా! శంకరా!' అనే మకుటంతో ఆచంటయందు వెలసిన శ్రీ ఉమారామేశ్వరుని కంకితంగా రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. కవి ఈశతకాన్ని కేవలం మూడు రోజులలో పూర్తి చేసినట్లు చెప్పుకొనినాడు. కవి ప్రతి పది పద్యముల తరువాత ఈశ్వరునిపై తమ భక్తిని చాటుతూ చెప్పిన పద్య గుళికలు అమృతప్రాయముగా ఉన్నాయి.

శ్రీవాణుల్ నిజవామదక్షిణముగాఁ జెల్వొంది వింజామరల్
వీవన్ షణ్ముఖునిన్ గజాస్యు నొడిలోఁ బ్రేమోక్తి లాలించుచున్
నీవామార్ధము భద్రపీఠి గొలువై నిన్ బూర్ణశృంగార ధా
రావీక్షం దనియించు టెంచెద నుమారామేశ్వరా! శంకరా!

నీకంటెన్ మఱియొండు దైవమెఱుఁగన్ నీయాలయ ప్రాంగణ
మ్మేకాకన్యంబును ద్రొక్కిచూడనుజుమీయేరూపములేని లిం
గాకారంబిది నీదికాక మఱియేయాకారముంజూడ శ్
ర్వా! కారుణ్యము మూర్తి వీవని ఉమారామేశ్వరా! శంకరా!

ప్రాలేయాచల కన్యకాదృఢ పరిష్వంగప్రియా! విస్ఫుర
త్కైలాసాచల రత్నమందిరగుహాంతఃస్థాయి పంచాననా!
వేలాతీత నిరాకులాద్భుత కృపాబ్ధీ! భక్తహృత్పద్మ ధా
ఠాళ శ్రీ మధుధోరణీప్లుత! ఉమారామేశ్వరా! శంకరా!

నరులకు గురుభక్తి ఎంత ముఖ్యమో ఈ కవి సూటిగా చెప్పాడు.

కాశింబట్టిన గంగలోనదిగెన కైలాసమే మెట్టెనా
ఆశితాచల సేతుమధ్యగత దివ్యక్షేత్రముల్ సుట్టెనా
శ్రీశైలాగ్రముసూచినా వృధాగదా చిత్తంబు ప్రోద్యద్దయా
రాశి న్ని న్గురుమూర్తిలోఁగన కుమారామేశ్వరా! శంకరా!

గురు రూపమ్మున నంబ నీవొకటియై గొంతెండినన్నీరు, మే
నొరుగన్ గూ, డెదయుంబడల్వడఁగవిత్వోన్మేషమున్ రాజవి
డ్వరమందు దగునంగరక్ష, యిడిరీపై గాలదండోగ్రదు
ర్భర గండం బేడలింపలేరటె ఉమారామేశ్వరా! శంకరా!

శైవ వైష్ణవ భక్తుల ఆగడాలు ఆరోజులలో అధికంగా ఉండి ఉండవచ్చుని అందుకే కవి ఈద్దరి పోలికలు ఎంతో హాస్యపూర్వకంగా తెలియచేసారు.

దేవానీకము స్వార్థలుబ్థము ప్రభూ! దేవాదిదేవుండ వం
చేవోమేల్ బిరుదు దగిల్చి స్వసుఖాపేక్షన్ విసమ్మిచ్చి నీ
కావెంటన్ హరికిచ్చి లచ్చిని మహాత్మా! నిన్ బిచ్చానకున్
రావయ్య! యని రట్లవచ్చెద వుమారామేశ్వరా! శంకరా!

ప్రభువా! పెద్దసమస్య నేడు పులిహోరల్ పొంగలుల్ వైష్ణవ
ప్రభువుల్ విష్ణుని కారగింపులిడ నబ్బా! వద్దు వద్దేను మీ
ప్రభువుంగ్నని తా గుడిన్ వదలి పారెన్ గొంపగూలెన్ భలే
రభసల్ పో యిటఁ గేశవార్చన లుమారామేశ్వరా! శంకరా!

హరియే దైవము, గాఁడుపో హరుఁడటం చవ్వైష్ణవస్వాము ల
ల్లరివెట్టన్ బిడియాన స్థాణువయి మూలన్నక్క నీకేమి మున్
గరళమ్ముందినినట్టి ప్రోడకు విషాన్నమ్మంత పట్టింపె; నే
రరు తక్కుంగల్ వేల్పులిందిల కుమారామేశ్వరా  ! శంకరా!

 ఆకాలమునాటి రాజకీయ, సాంఘీక పరిస్థితులపై కవి చాల ఘాటుగా స్పందించాడు.

పురుషార్ధంబుల నర్ధకామములదేపో రాజ్య మీనాట, న
య్యిరు పక్షాలగు ధర్మమోక్షములతో నేపొందుయున్ లేదు, ము
ష్కర మీరక్కసిజాతి యేలుబడీ మోక్షమ్మేది! యాభౌతికా
స్త్రరణద్ఘోరగుణధ్వనుల్ విడి యుమారామేశ్వరా!శంకరా!

నిలువున్నీడకు నిల్లు వస్త్రములవేనిన్ మానరక్షార్థ మ
కలి కన్నం బనుకొన్న జీవులకు దుఃఖంబేది లోటేది? దు
ర్బలిలంగొట్టి బలుల్ హరించు బలిభుక్ప్రాయుల్ బలుల్ రేగినా
రలు తండ్రీ! ఉదరంభరుల్ దొర లుమారామేశ్వరా! శంకరా!

ముండాప్రాభవమేమొ తెచ్చికొని నామున్నాస్తికత్వంబు నా
బండారమ్మిది పాడు నాగరికభావాల్ వెండిబంగారపుం
భాండారాల్ దొరలించి పాడుశనిబీర్వాల్నించి యీయుక్కు రా
రండా కొల్తమటండ్రు పెద్దలు నుమారామేశ్వరా! శంకరా!

చెడెనాహారము శుద్ధిదానఁజెడియెన్ జిత్తంబు లద్దాననే
చెడె విద్యావినయమ్ము లాపయిజెడెన్ శీలమ్ము నారోగ్యముల్
చెడెనయ్యో చెడే రక్త మోపికలు నిస్సీ! యిందు సద్భావమే
ర్పడుటెట్లీచెడులోన మంచిగ నుమారామేశ్వరా!శంకరా!

భాషామూల విభాగరాష్ట్ర పరిధుల్ పాడైన వర్ణాశ్రమ
ద్వేషమ్మౌర! నదీజలార్థ కలహోద్రేకమ్ము లప్రాచ్యముల్
వేషమ్ముల్ పలుమూకయేల్బడులు దుస్స్వేచ్ఛావిహారమ్ము దు
ర్భాషాఘోష లగుప్తమంత్రము లుమారామేశ్వరా!శంకరా!

ఈవ్ధంగా సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక నీతి సంబంధిత విష్యాలనెన్నో కవి ఈ శతకంలో పొందుపరిచారు. అందరు చదవలసిన ఒక అద్భుతమైన శతకం మీరుకూడా చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

***

No comments:

Post a Comment

Pages