ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -17 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -17

Share This

 ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -17

                                                                                                            కొత్తపల్లి ఉదయబాబు

మా నాన్నగారు కూడా నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు కావాల్సిన అంత డబ్బు ఇచ్చేవారు. చేతిలో పుష్కలంగా డబ్బు, నా చుట్టూ ఫ్రెండ్స్... వీళ్ళ అందరితో జీవితం హ్యాపీగానే ఎంజాయ్ చేశాను. కానీ దాంట్లో ఆనందం తామరాకు మీద   నీటి బొట్టులా మెరిపించి మురిపిస్తుంది తప్ప మానసికమైన ఆనందం లభించదని అర్థమైంది.

అందుకే జిమ్ లో చేరాను... ఏదో సిక్స్ ప్యాక్ లు మెయింటైన్ చేసేద్దామని కాదు.

ఒక క్రమశిక్షణగల జీవితం గడపాలని. నాకంటూ నేను ఒక కాల నిర్ణయ పట్టిక తయారు చేసుకున్నాను. "

 "కాల నిర్ణయ పట్టికా?అదేంటి? ఓహ్... టైం టేబులా?" పకపకా నవ్వేసింది హరిత.

 "చూసావా ఒక్క ఇంగ్లీషు వాడు కేవలం 200 సంవత్సరాలు  మన దేశాన్ని పాలించిన దౌర్భాగ్యస్థితి... ఇన్ని తరాలు కాలగతిలో గడిచిపోతున్నా, పరభాషా వ్యామోహం  మనలని బానిసలుగా చేసి ఎంతగా పట్టిపీడిస్తుందో..."

 " ఇంతకీ ఏం టైం టేబుల్ తయారు చేసుకున్నారు ఏమిటి? "

 " ఏముంది? పొద్దున్నే సరిగ్గా అయిదింటికి ధ్యానం, యోగ చేయడం, సరిగ్గా ఆరింటికి జిమ్ కి వెళ్లడం... ఏడున్నరకి ఇంటికి వచ్చిన తర్వాత  స్నానం చేసి భగవంతుడు దగ్గర హనుమాన్ చాలీసా చదువుకొని, టిఫిన్ చేయడం, 9:00కల్లా షాప్ కెళ్ళి షాప్ తెరవడం , నాన్న వచ్చాక కౌంటర్ అప్పగించి, ఆయనకి బయటిపనులు అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే చూసి పెట్టడం... ఇంటికి వెళ్లి 12 గంటలకు భోజనం చేసి  నేను షాప్ కి వచ్చి కూర్చోవడం, నాన్నగార్ని భోజనానికి పంపించడం. ఆయన  రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాక నేను కౌంటర్ ఆయనకు అప్పగించేసి ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళిపోవడం, వీకెండ్స్ లో పబ్ కి వెళ్లడం.."

" చాలా బాగుంది మిమ్మల్ని మీరే కాలంలో బంధించుకున్నారన్నమాట. సరే.. పబ్ అంటే ఏముంటుంది అక్కడ?అసలు ఏం చేస్తారు?"

" నిజానికి ఈ పబ్ కల్చర్ కూడా మనం ఇంగ్లీష్ వాళ్ల  నుంచి దిగుమతి చేసుకున్నదే.

 జనరల్ గా 21 ఏళ్ల వాళ్లను ఇక్కడ అనుమతిస్తారు. పెద్దవాళ్ళు ఎవరైనా తోడుగా ఉంటే టీనేజ్ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు అనుమతిస్తూ ఉంటారు.

 తాగుడు అలవాటు ఉన్నటువంటి వాళ్లకి సలాడ్స్ సూప్స్ ఆకలి పుట్టించే పదార్థాలు, ఖరీదైన మద్యాలు దొరికే స్థలం అది. మస్తుగా తాగి, ఇష్టమైన వాళ్ళతో  ఆడా మగా ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేస్తారు.    నేనైతే  ఫ్రెండ్స్ కోరిక మీద జస్ట్ ఖరీదైన బీరు తీసుకుంటాను. నా పుట్టినరోజు నాడు  పార్టీ అడిగితే వాళ్ళకి ఇస్తుంటాను."

" మరి మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పారు కదా. వారితో చాలా సోషల్ గా కూడా మూవ్ అవుతానని చెప్పారు. సోషల్ గా మూవ్ అవడం అంటే ఏమిటి? ఏమీ అనుకోకండి. నాకు తెలియక అడుగుతున్నాను"

" జస్ట్ కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ఒకరి నడుం మీద మరొకరు చేయి వేసి, రెండో చేయి పట్టుకుని  డాన్స్ చేయడం...అలాంటివి చేశాను.. డబ్బున్న కుర్రవాళ్ళు మగాడిలా కనిపిస్తే చాలు,  ఆడపిల్లలు రెచ్చగొట్టి ట్రాప్ చేస్తారు. లేదా ఎంజాయ్ చేసి డబ్బు అడుగుతారు.

 నువ్వు నమ్మిన నాకు నమ్మకపోయినా, అటువంటి పనులు మాత్రం చేయలేదు.

 ఇంతకీ నువ్వు చెప్పదలచుకున్న విషయం ఏమిటో చెప్పనేలేదు."


(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages