"బంగారు" ద్వీపం (అనువాద నవల) -24 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -24

Share This
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -24
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton




@@@@@@@@
(నేల మాళిగకు పోయే మార్గాన్ని కనుక్కోవటానికి ముందు అక్కడ పెరిగిన కలుపు మొక్కలను తవ్వుతారు. చిన్న గదిలో వారికి రాతిపలకలు కనిపిస్తాయి. వాటిని కదపటం చాలా కష్టమవటంతో అక్కడ మార్గం లేదని నిర్ధారించుకుంటారు. పటాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకు బావి దగ్గరలో మార్గం ఉండవచ్చునని భావిస్తారు. ఈలోపున అక్కడ కవ్విస్తూ తిరిగే కుందేళ్ళ వెంట పడ్డ కుక్క ఒక ముళ్ళ పొదలో దూరుతుంది. తరువాత. . .. )
@@@@@@@@@@@@@@@

కింద ఎక్కడి నుంచో నీరసంగా మూలుగుతున్న శబ్దం వినిపించింది. జూలియన్ ఆశ్చర్యపోయాడు.

"అతను ఆ కన్నం కిందే ఉన్నాడు!" అన్నాడు. "ఎంత విడ్డూరం! నేను యింతవరకు కుందేలు కన్నంలో దూరిన కుక్క గురించి నిజంగా వినలేదు. అతన్ని మనం ఎలా బయటకు తీయబోతున్నాం?"

"మనం ముందుగా ఆ ముళ్ళ పొదను తవ్వాలి" దృఢస్వరంతో చెప్పింది జార్జి. టింని బయటకు తేవటానికి ఆమె మొత్తం కిర్రిన్ కోటనే తవ్వేసేలా ఉంది. అది మాత్రం ఖచ్చితం! "పాపం టిం సాయం కోసం అలా ఏడుస్తూంటే నేనిలా ఉండకూడదు. అతనికి చేతనైన సాయాన్ని చేయాలి."

ఆ పొద బాగా పెద్దదే కాకుండా దాని కింద దూరితే ముళ్ళు గీరుకొనేలా ఉంది. అన్ని రకాల ఉపకరణాలను తెచ్చినందుకు జూలియన్ సంతోషించాడు. గొడ్డలి తీసుకురావడానికి వెళ్ళాడతను. వాళ్ళు తమతో చిన్న గొడ్డలి తెచ్చారు. అది ముళ్ళ కొమ్మలను, ఆ చెట్టు కాండాన్ని నరకటానికి ఉపయోగిస్తుంది. పిల్లలు దాన్ని నరికేయటంతో, ముళ్ళ పొద విషాద రూపంలో కనిపించింది.

దాన్ని నాశనం చేయటానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే అది ముళ్ళను కలిగి ఉండి, దృఢంగా, లావుగా ఉంది. మొత్తం పొదను పూర్తిగా మోడు చేసే సమయానికి పిల్లలందరి చేతులు చీరుకొన్నాయి. అప్పుడు వారు కన్నాన్ని స్పష్టంగా చూడగలిగారు. జూలియన్ తన చేతిలోని టార్చిని వెలిగించి కిందకు దించాడు.

అతను ఆశ్చర్యంతో కేకపెట్టాడు. "ఏమి జరిగిందో నాకు అర్ధమైంది! ఇక్కడ పాత బావి ఉంది! దాని పక్కనే కుందేళ్ళ రంధ్రం ఉంది. దానిని పెద్దది చేయటానికి కాలిగోళ్ళతో టిం ప్రయత్నిస్తున్నప్పుడు, నూతిలో కొంత భాగం తెరుచుకొంది. దానితో టిం బావిలో పడిపోయాడు!"

"అయ్యో! అయ్యో!" జార్జి భయంతో అరిచింది. "అయ్యో టిం! టిం! నువ్వు క్షేమంగా ఉన్నావా?"

దూరం నుంచి కుయ్యోమన్న ఏడుపు వారి చెవులకు వినిపించింది. స్పష్టంగా టిమ్ అక్కడే ఎక్కడో ఉన్నాడు. పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు.

"‘సరే, చేయాల్సిన పని ఒక్కటే ఉంది’ జూలియన్ అన్నాడు. "మనం పారలను బయటకు తీసి మూసుకుపోయిన బావిని తవ్వుదాం. అప్పుడు మనం ఒక తాడును గాని, మరేదైనా గాని క్రిందికి వదిలి టింని పైకి చేర్చుదాం."

వాళ్ళంతా పారలతో పనికి సిద్ధమయ్యారు. మూసుకుపోయిన బావిని తిరిగి తెరవటం పెద్ద కష్టం కాదు. పరుచుకొన్న ముళ్ళ పొద యొక్క వేళ్ళు, కొద్దిగా కూలిపోయిన ఇటుకరాళ్ళు, సిమెంటు మొదలైనవి, మట్టి, యిసుక, చిన్న చిన్న రాళ్ళతో అది మూసుకుపోయింది. కోట బురుజు యొక్క కొంత భాగం, బావిలో కూలిపోవటంతో, అది పాక్షికంగా మూసుకుపోయింది. వాతావరణం, పెరిగిన ముళ్ళ పొద మిగిలిన భాగాన్ని మూసేసినాయి.

కూలిపోయిన స్లాబ్ ను కదపటానికి పిల్లలంతా ఏకమయ్యారు. దాని కింద కుళ్ళిపోయిన చెక్క పలక ఉంది. పాత రోజుల్లో అది నూతి మీద రక్షణగా ఉండేది. అది ఎంతగా కుళ్ళిపోయిందంటే, టిం దాన్ని బలంగా నొక్కగానే, అది కన్నం పడి టిం లోనికి జారిపోయేలా చేసింది.

జూలియన్ ఆ పాత చెక్కను తొలగించగానే, వాళ్ళకు నూతి రంధ్రం కనిపించింది. నుయ్యి చాలా లోతుగాను, బాగా చీకటిగాను ఉంది. వారికి నూతి దిగువ భాగం కనిపించటం లేదు. జూలియన్ ఒక రాయిని తీసుకొని లోనికి పడేశాడు. వాళ్ళు నీరు తుళ్ళిన చప్పుడు అవుతుందేమోనని ఆలకించారు. కానీ అలాంటి శబ్దం వినపడలేదు. ఆ నూతిలో నీరు ఉండకపోవచ్చు, లేదా నీరు తుళ్ళిన శబ్దం వినిపించనంత లోతుగా ఉండొచ్చు.

"లోనుంచి శబ్దమేమి వినిపించనంత లోతు ఉందేమోనని అనుకొంటున్నాను" అన్నాడు జూలియన్. "ఇప్పుడు టిం ఎక్కడ ఉన్నాడు?"

అతను టార్చిని వెలిగించి కిందకు చూడగా, టిం కనిపించాడు. చాలా ఏళ్ళ క్రితం పెద్ద స్లాబ్ ఆ నూతిలో పడి, దానిలో అడ్డంగా యిరుక్కుపోయింది. టిం ఆ పాత స్లాబ్ పై కూర్చున్నాడు. అతను తన కళ్ళను పెద్దవి చేసి భయంతో పైకి చూస్తున్నాడు. తనకు ఏమి జరిగిందో ఊహించలేకపోయాడు.

బావిలో ఒక ప్రక్కకు పాత ఇనుప నిచ్చెన బిగించబడింది. ఎవరూ అక్కడకు చేరుకోక ముందే జార్జి దాని మీద ఉంది! ఆ నిచ్చెన నిలబడేలా ఉందా లేదా ఆలోచించకుండా, కిందకు దిగి టిం దగ్గరకు చేరుకొంది. ఆమె ఎలాగోలా అతడ్ని తన భుజంపైకి ఎక్కించి, ఒక చేత్తో పట్టుకొని, మెల్లిగా నిచ్చెన పైకి ఎక్కసాగింది. మిగిలిన ముగ్గురూ ఆమెను బయటకు లాగారు. టిం ఆమె చుట్టూ మొరుగుతూ గెంతుతూ, అందరినీ నాకసాగింది.

"మంచిది టిం" అన్నాడు డిక్. "నువ్వు కుందేళ్ళను వెంబడించకూడదు. కానీ నువ్వు మాకు చాలా ఉపకారం చేసావు. ఎందుకంటే నువ్వు మా కోసం నూతిని కనిపెట్టావు. ప్రస్తుతం మేము చెరసాల తలుపు కొరకు ఈ చుట్టుపక్కల కొద్దిగా వెతకాల్సి ఉంది."

వారు నేలమాళిగ ద్వారాన్ని వెతకటానికి సిద్ధమయ్యారు. తమ దగ్గర ఉన్న పారలతో పొదలు అన్నింటి కింద తవ్వటం మొదలెట్టారు. తమ పారలను భూమిలో బలంగా దిగేసి తవ్వుతుంటే, భూమిలో పాతుకుపోయిన కంకర రాళ్ళు పైకి లేచి, ఆకసంలోకి ఎగిరి పడుతున్నాయి. అది చూస్తుంటే గగుర్పాటు కలుగుతోంది.

అన్నె నేలమాళిగ ద్వారాన్ని చూసింది. ఇది ‌అనుకోకుండా జరిగింది. ఆమె అలసిపోయి ‌విశ్రాంతి కోసం కూర్చుంది.. ఆ అమ్మాయి నేలపై ముందుకు వాలి వేళ్ళతో ఇసుకలో గీరుతోంది. అప్పుడు ఆమె వేళ్ళకు ఇసుకలో గట్టిగా, చల్లగా ఉన్న వస్తువేదో తగిలింది. వెంటనే దానిపై ఉన్న ఇసుకను తొలగించి "ఇదిగో చూడండి. ఇక్కడేదో ఇనుప‌ రింగు ఉంది'" అంటూ మిగిలిన వాళ్లను పిలిచింది. వాళ్ళంతా వచ్చి చూసారు.

"ఇక్కడ రాతికి బిగించిన ఇనుప కొక్కెం ఉంది!' అన్నె ఉత్సాహంతో అరిచింది. అందరూ ఆమె వద్దకు పరుగెత్తారు. జూలియన్ తన పారతో తవ్వి, ఒక పెద్ద రాతిని బయటపెట్టాడు. కచ్చితంగా ఆ రాతిపలకకు ఒక పెద్ద కొక్కెం ‌బిగించి ఉంది. ‌రాళ్ళను కదపడానికి ఇలాంటి కొక్కాలనే వాటికి బిగిస్తారు. కచ్చితంగా ఈ రాతి పలక ఒక నేలమాళిగ ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచటానికి ‌ఉపయోగించబడినది.

పిల్లలంతా వంతుల వారీ దానిని లాగడానికి ప్రయత్నించారు ‌కానీ ఆ రాయి కదల లేదు. జూలియన్ ‌ఒక తాడును ఆ కొక్కెం లోకి దూర్చి గట్టిగా రెండు, మూడు ముడులు వేసాడు. నలుగురు పిల్లలు తమ పూర్తి ‌బలాన్ని‌ ఉపయోగించి, బలంగా లాగారు.

వాళ్ళ ప్రయత్నం ఫలించి ఆ రాయి కదిలింది. పిల్లలకు అది కదిలినట్లు స్పష్టంగా ‌అనిపించింది. "అందరూ కలిసి ‌మళ్ళీ.." జూలియన్ అరిచాడు. అందరూ కలసి లాగారు.‌ దానిని మళ్ళీ మళ్ళీ లాగగా, అది అకస్మాత్తుగా ‌కదిలి దారి ఇచ్చింది. ఒక్కసారిగా వారు ఒకరిపై ఒకరు పేకముక్కల్లా తూలిపడ్డారు. టిం ఆ గోతి‌ వద్దకు పరుగున వెళ్ళి కుందేళ్ళ ప్రపంచం అంతా అక్కడే నివసిస్తున్నట్లు పిచ్చిగా మొరగసాగింది.

జూలియన్, జార్జి తమ పాదాలకు పని చెప్పి, ‌కదలిన రాయి బయట పెట్టిన గోతి దగ్గరకు పరుగెత్తారు. అక్కడ నిలబడి కిందకు చూసిన వారి ముఖాలు ఆనందంతో మెరిసాయి. నేలమాళిగ ముఖద్వారాన్ని వారు కనుగొన్నారు!

ఆ రాతితోనే ఏర్పడిన నిటారుగా ఉన్న మెట్ల వరుస, కింద ఉన్న దట్టమైన చీకటిలోకి దారి తీసింది.

"రండి" జూలియన్ అరుస్తూ తన చేతిలోని టార్చిని‌ వేసాడు. "మనం కోరుకొన్నదే మనం కనుగొన్నాం. ఇప్పుడు ‌నేలమాళిగ చూడాలి."

కిందకు పోతున్న మెట్లు జారుతున్నాయి. ముందుగా టిం పరుగెత్తి, కాళ్ళు జారి అయిదారు మెట్లు దొర్లి‌ భయంతో కుయ్యోమన్నది. కుక్క వెనుక జూలియన్, అతని వెనుక జార్జి, ఆపై డిక్, చివరగా అన్నె లోనికి దిగారు. వారంతా చెప్పలేనంతగా పులకించారు. నిజానికి, వారంతా తమ చుట్టూ బంగారం మరియు అనేక రకాల ‌నిధుల రాసులు కుప్పలు పోసి ఉంటాయని ఆశించారు.

నిటారుగా ఉన్న మెట్ల కింద చిమ్మ చీకటి ఉంది. మురికి వాసన వస్తోంది. అన్నె కొద్దిగా ఉక్కిరిబిక్కిరి అయింది.

"ఈ కింద ఉన్న గాలి ఫరవాలేదనుకొంటాను" అన్నాడు జూలియన్. "కొన్ని సమయాల్లో ఈ భూగర్భ ప్రాంతాలు అంత మంచివి కావు. ఎవరికైనా కొంచెం యిబ్బంది అనిపిస్తే ఆ విషయం చెప్పండి. అప్పుడు బహిరంగ ప్రాంతంలో గాలి కోసం మరల పైకి వెళ్దాం."

కానీ తమకు యిబ్బందిగా ఉన్నా, ఆ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పలేదు. ఉత్తేజకరంగా ఉన్న ఆ సమయంలో ఆందోళన అన్న విషయానికి వాళ్ళు దూరమయ్యారు

మెట్లు కిందకు చాలా దూరం పోయాయి. ఎట్టకేలకు వాటి చివరకు చేరుకొన్నారు. జూలియన్ ఆఖరి రాతి మెట్టు మీద నుంచి పాదం కింద మోపి తన టార్చి వెలుతురులో చుట్టూ గమనించాడు. అతని కళ్ళకు ఒక విచిత్ర దృశ్యం కనిపించింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages