పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5

Share This

                                    పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -5

బాలకాండ

దినవహి సత్యవతి




2 వ సర్గ 

      రామచరిత వ్రాయుమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట...

1.      

మహాముని వాల్మీకి ధర్మబుద్ధి కలవాడు,

పద వాక్య విశేషములు తెలిసినవాడు,

శిష్యులకూడి సంక్షిప్త రామాయణం విన్నాడు,

నారద మహర్షిని శ్లాఘించి పూజించినాడు,

వాల్మీకినుంచి సెలవు కోరి వెడలె నారదుడు, సత్య!  

2.      

నారదుడు ఆకాశమార్గాన దేవలోకం చేరెను,

వాల్మీకి కూడా జాహ్నవీ నది విడచి వెళ్ళెను,  

చేరువునే ఉన్న తమసా నదీ తీరము చేరెను,

బురద లేని రేవుని చూచి  శిష్యుని పిలిచెను,    

శిష్య భరధ్వాజునికి రేవు గూర్చి తెలిపెను, సత్య!

3.      

రేవు, సత్పురుషుని హృదివలె యున్నదనెను,  

సుందర నిర్మల మనోహరంగా యున్నదనెను,

శిష్యుడితో, చేతి జలపాత్ర,  క్రిందయుంచమనెను,

తదుపరి తనకు నార చీర తెచ్చి యిమ్మనెను,

వాల్మీకి తమసా తీర్థంలో స్నానమాడ వెడలెను, సత్య!

4.      

శిష్యుడు వాల్మీకికి  నార చీర తెచ్చి యిచ్చెను,

ఇంద్రియ నిగ్రహుడైన వాల్మీకి చీర చేకొనెను,

అది చేత బట్టి  విశాల వనాన సంచరించెను,

తమసా తీర్థం వద్ద క్రౌంచ పక్షి జంటను కాంచెను,

అవి ఎడబాటు లేక మనోహరంగా కూయుచుండెను, సత్య!

5.      

ఇంతలో వచ్చె క్రూర నిర్ణయము కల బోయవాడు,

పశు పక్ష్యాదులను నిష్కారణంగా ద్వేషించువాడు,

వాల్మీకి ముని చూచుచున్నాడని యెరిగిన వాడు,

అయిననూ భయ సంకోచములు లేకుండిన వాడు,

రతి క్రీడలోనున్న పక్షులలో మగ పక్షిపై బాణం వేసె, సత్య!

6.      

బాణం తగిలి రక్తసిక్తమై క్రౌంచ  నేల కూలెను,

బాధలో పొరలుచున్న క్రౌంచను క్రౌంచి చూచెను,

పెనిమిటి వియోగంతో క్రౌంచి దీనముగా ఏడ్చెను,

బోయచే నేల కూలిన క్రౌంచను వాల్మీకి చూచెను,

ధర్మాత్ముడైన మహర్షికి క్రౌంచ పై జాలి కలిగె, సత్య!

7.      

విలపించే క్రౌంచి పై వాల్మీకికి  దయ కలిగెను,

క్రౌంచ మరణము వాల్మీకి మునిని బాధించెను,

బోయవాని చర్య ధర్మము కాదని తలంచెను,

నిర్భాగ్యుడని బోయపై  వాల్మీకి కోపగించెను,

తత్ క్షణాన ముని నోటినుండొక వాక్యం వెలువడె, సత్య !

8.      

క్రౌంచ జంటలో మగ పక్షిని బోయ చంపెననెను,

మన్మథ పరవశులౌ  జంటను విడదీసెననెను,

అందుచే బోయ కలకాలం జీవించబోడనెను,

తాను పలికిన వాక్యం మరల పరిశీలించెను,

శోకించు పక్షిగని దుఃఖంతో పలికితిననుకొనె, సత్య!

9.      

వాల్మీకి మహాపండితుడు, బుద్ధిమంతుడు,  

శోకార్తుడై ఆ వాక్యం పలికితినని గ్రహించినాడు,    

వాక్యంలో నాల్గు పాదాలున్నవని యెరిగినాడు,

ప్రతి పాదాన సమానాక్షరాలున్నవని గ్రహించినాడు,  

అది గీతా వాద్యాలతో పాడదగినదనుకొనె, సత్య!

10.  

    తాను ఆ వాక్యాన్ని శ్లోకమని పిలిచెదననెను,

    అది  శ్లోకమను పేరిటే ప్రసిద్ధి కావలెననెను,

    అత్యుత్తమమౌ ఆ వాక్యాన్ని శిష్యుడు స్వీకరించెను,

   ‘మా నిషాద... ఇత్యాది వాక్యాలను కంఠస్థం చేసెను,

   శిష్యుడి చర్యకు వాల్మీకి మహర్షి సంతసించెను, సత్య!  

11.  

పిదప వాల్మీకి తీర్థమందు స్నానము చేసెను,

జరిగిన సంఘటన గూర్చే ఆలోచించసాగెను,

శిష్యుడు జలంతో నిండిన కలశం తీసుకొనెను,

మునిని అనుసరించి ఆశ్రమానికి మరలెను,

శిష్యులు పక్షి వృత్తాంతమే ముచ్చటించుకొనిరి, సత్య!

12.  

లోకములు సృజించినవాడు, చతుర్ముఖుడు,

 లోకాధిపతి, గొప్ప తేజస్వి బ్రహ్మదేవుడు,

వాల్మీకిని చూచుటకై స్వయముగ వచ్చినాడు,

బ్రహ్మను చూసి ముని ఆశ్చర్యచకితుడైనాడు,

అంజలి ఘటించి, యథాశాస్త్రంగా ప్రణమిల్లినాడు, సత్య!

13.  

  అవిచ్ఛిన్నమగు కుశలమడిగి పాద్యం ఇచ్చెను

 అర్ఘ్యము, ఆసనము, వందనము సమర్పించెను,

 బ్రహ్మను ఉత్తమాసనముపై కూర్చుండ జేసెను,

 బ్రహ్మ అనుజ్ఞతో  ఆయన ఎదురుగా కూర్చుండెను

 కానీ వాల్మీకి అపుడు అన్యమనస్కుడై యుండెను, సత్య!

14.  

వాల్మీకి క్రౌంచ పక్షి గూర్చియే ఆలోచించుచుండెను,

దుఃఖ నిమగ్నుడై  బాహ్య విషయాలు మరచెను,

మా నిషాద శ్లోకము మననం చేసుకొనుచుండెను,

వాల్మీకి మనః స్థితిని బ్రహ్మ అర్థం చేసుకొనెను,  

వాల్మీకి  కూర్చినది నిస్సందేహంగా శ్లోకమేయనెను, సత్య!

15.  

 వాల్మీకి ఋషి శ్రేష్ఠుడని, బ్రహ్మ కొనియాడెను,

తన సంకల్పం చేతే ఆ వాక్కు ఆవిర్భవించెననెను,

 రాముడు ధర్మ స్వభావుడు, పండితుడని యనెను,

 లోకములో ప్రశస్తమైన గుణాలు కలవాడనెను,

 రామ చరిత  కావ్య రూపంగా రచింపుమనె బ్రహ్మ, సత్య! 

16.  

నారదుడినోట విన్నది విన్నట్లుగా వ్రాయుమనెను,

సీతారామ లక్ష్మణాదుల చరిత్ర వ్రాయుమనెను,   

రహస్యమౌ రాక్షసుల చరిత్ర  వ్రాయుమనెను,  

మున్నెవ్వరెరుగని విషయాలూ వ్రాయుమనెను,  

వాల్మీకికవన్నీ స్పష్టంగా తెలియగలవనె  బ్రహ్మ, సత్య!  

17.  

రామాయణ కావ్యం పుణ్యమూ మనోహరమూయనె,

వాల్మీకిని, రామ కథ  శ్లోకబద్ధము చేయుమనె,  

అందులో  తెలిపినదేదీ అసత్యం కానేరదనె,  

రామాయణ కావ్యం భూతలాన నిలిచియుండనె,

గిరులు, నదులున్నంతవరకూ వ్యాప్తిలో యుండుననె, సత్య!

18.  

 ఊర్థ్వ, అధోలోకములు తన సృజనయేయనెను,

 అందు రామాయణ కథ ప్రచారంలోయుండుననెను,

 కావున వాల్మీకి ఆ లోకాల సంచరించవచ్చనెను,

 వాల్మీకితోనట్లు పలికి బ్రహ్మ అంతర్థానమయ్యెను,

 అది చూచి  వాల్మీకి శిష్యులూ ఆశ్చర్యపడిరి, సత్య!

19.  

వాల్మీకి శిష్యులు అమితముగా  సంతోషించిరి

 సమ అక్షరముల శ్లోకము మరలా పఠించిరి,

నాల్గు పాదములూ  ఒకరికొకరు చెప్పుకొనిరి

అట్లా శ్లోకానికి ఇంకనూ శ్లోకత్వం  కలిగించిరి,  

అదిజూచి వాల్మీకి ఒక నిశ్చయమునకు వచ్చె,  సత్య!

20.  

 కావ్యమంతా అదే శ్లోక వృత్తంలో  వ్రాయదలచెను,

 యశస్వి రాముని మహాత్మ్యము తెలుప దలిచెను,

మనోహర, ఉత్తమ వృత్తాలతో కావ్యం రచించెను,   

 శబ్దార్థాలు, సమాక్షరాలతో శోభించునట్లు వ్రాసెను,   

 వందలాది శ్లోకాలతో వాల్మీకి రామకథ రచించెను, సత్య!

21.  

రామ కథలో, సంధులు శ్రావ్యములై యుండెను,

సమాసములు నాతి దీర్ఘములుగ యుండెను,

శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర సమ్మతముగ యుండెను,

వాక్యాలు సమ, మధుర, అర్థవంతంగ యుండెను,

వాల్మీకి రచించిన కావ్యం వినదగినదై యుండెను, సత్య!                        

No comments:

Post a Comment

Pages