దైవానుగ్రహం - అచ్చంగా తెలుగు

దైవానుగ్రహం

-సుజాత.పి.వి.ఎల్.




వివేక పురాన్ని ఆదిత్యుడు అనే రాజు పాలిస్తుండేవాడు. తనని రోజూ పొగిడిన వాళ్లని, తన గురించి గొప్పలు గొప్పగా చెప్పే వాళ్ళని పిలిచి కానుకలు ఇస్తుంటాడు.
ఆ ఊరికి పని నిమిత్తం పొరుగూరు నుండి రాజయ్య, దేవయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

రాజయ్య నాస్తికుడు. ఏ ఎండకా గొడుగుపట్టే రకం. దేవయ్య ఆస్తికుడు. ముఖస్తుతి మాటల్ని అసలు నచ్చకోడు. ముక్కుసూటి మనిషి.

రాజుగారి విషయాన్ని ఆ ఊరి ప్రజల ద్వారా తెలుసుకున్న రాజయ్య రాజు ముందు నిలబడి అంతా రాజాజ్ఞ. రాజు అనుగ్రహిస్తే కొదవేముంది' అంటూ.. పొగడనారంభించాడు. దేవయ్య మాత్రం మిన్నకున్నాడు. 

"ఏం దేవయ్యా! ఏం మాట్లాడవేంటి" అన్నాడు రాజు. "అయ్యా! మీరు మాకు ప్రభువులు.. కానీ మన అందరికీ ప్రభువు మాత్రం ఆ భగవంతుడే. భగవదనుగ్రహం లేకపోతే మీరు రాజుగా ఆ సింహాసనంలో కూర్చునే వారు కాదు. మనల్ని సృష్టించిన ఆ భగవంతుడికి అన్నీ తెలుసు ఏ జీవికి ఏది అవసరమో, ఏది అనవసరమో. అందుకే నేను దైవానుగ్రహాన్ని నమ్ముతాను అన్నాడు. దేవయ్య మాటలు రాజుగారికి కోపాన్ని కలిగించాయి. ''నా ముందు నిల్చుని కనబడే నన్ను పొగడక కనబడని ఆ దేవుని నమ్ముతున్నావంటే..నీవు లౌక్యహీనుడవు. తక్షణమే నా ముందు నుండి వెళ్ళిపో" అన్నాడు రాజు. "చిత్తం ప్రభూ! అంటూ వెళ్లిపోయాడు దేవయ్య.

మరుసటి రోజు ఉదయం. తనని పొగిడిన రాజయ్యకి ఏదో ఒక బహుమానం ఇవ్వాలనిపించింది రాజుగారికి. తన అనుచరులను పిలిచి ఒక పుచ్చకాయను తెప్పించాడు ఒకపక్క చిన్నగా కోసి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి అందులో వజ్రాలు వైడూర్యాలు బంగారు నాణేలు నిండా పెట్టించి మరల ఆ కత్తిరించిన భాగాన్ని అంటించి చూడటానికి అది కత్తిరించి మరల అంటించి నట్టు కూడా ఎవరు గమనించలేని విధంగా చేసి రాజు అనుగ్రహిస్తే ఎలా ఉంటుందో దేవయ్యకు తెలియని చెప్పాలనే ఉద్దేశంతో రాజయ్యనొక్కడ్నే రాజమందిరానికి పిలిచి ఆ పుచ్చకాయను బహుమానంగా ఇచ్చాడు.

అందులో ఏముందో తెలియని రాజయ్య రాజు ఇచ్చిన పుచ్చకాయని 'ఏదో గొప్ప బహుమతి ఇస్తాడు అనుకుంటే ఈ పుచ్చకాయ ఇచ్చాడేంటీ? ఇంతోటి పుచ్చకాయ మా పెరట్లో

కాయదా ఏంటీ?' అనుకుని అది ఇంటికి తీసుకెళ్లకుండా దారిలో ఉన్న ఒక దుకాణదారుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు.

అంతలో దేవయ్య ఇంటికి దూరపు బంధువులు ఎవరో వచ్చారు. "ఇంట్లో అన్ని సరుకులు నిండుకున్నాయి ఎర్రటి ఎండలో వచ్చిన అతిథులకు మనం ఏం పెట్టాలి? ''అంది భార్య సుశీల. "నువ్వు వాళ్లతో మాట్లాడుతూ ఉండు నేను అలా బయటికి వెళ్లి ఏదో ఒకటి తీసుకొస్తాను" అని బయలుదేరాడు దేవయ్య. అలా ఎండనపడి దారినపోతున్న దేవయ్యకు దుకాణదారుడు పిలిచి "ఇందా! దేవయ్యా! ఈ పుచ్చకాయ తీసుకొని ఇంటికి వెళ్ళు. కోసుకొని చక్కగా తినండి నేను సరుకుల నిమిత్తం సంతకి వెళ్లాల్సిన పని ఉంది రెండురోజులు పడుతుంది. వచ్చేటప్పటికి పాడైపోతుంది అందుకే ఇచ్చేస్తున్నాను తీసుకో " అంటూ చేతిలో పెట్టాడు. ఇంటికి వచ్చి ఆ పుచ్చకాయను భార్య చేతిలో పెట్టాడు దేవయ్య. తను కోసి చూద్దును కదా! ఆశ్చర్యం! అందులో వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణేలు, దైవానుగ్రహం అంటే ఇదేకదా! అనుకుని మనసారా భగవంతుడికి రెండు చేతులెత్తి మొక్కాడు దేవయ్య. మరుసటిదినం రాజుగారు రాజయ్యని రమ్మని కబురు పెట్టాడు వజ్రవైడూర్యాలు ఇచ్చినందుకు ఎంతో పొంగిపోయి నన్ను పొగడ్తాతలతో ముంచెత్అతతాడని ఎదురు చూసిన రాజుగారి ముందు ఏమీ ఎరగనట్టు నిలబడిన రాజయ్యను చూసి "రాజయ్యా! ఆ పుచ్చకాయను కోసి తిన్నావా?'' అని అడిగాడు. తినలేదు అని చెబితే రాజుగారికి కోపం వస్తుందని, తిన్నాం అని అబద్దం చెప్పాడు. నిజంగా తిన్నావా సందేహాన్ని వెలిబుచ్చాడు రాజు. "అ..దీ.." అంటూ సాగదీస్తున్న రాజయ్యను నిలదీశాడు.అప్పుడు నిజం చెప్పక తప్పలేదు రాజయ్యకి."అయ్యా! అది నేను ఇంటికి తీసుకెళ్లలేదు దారిలో ఉన్న దుకాణదారుడికి ఇచ్చి వెళ్ళిపోయాను" అన్నాడు. అతనిని ప్రవేశపెట్టండి అన్నాడు రాజు. దుకాణదారుడు "అయ్యా! అది నేను కూడా కోసుకుని తినలేదు. అటుగా వస్తున్న దేవయ్య కి ఇచ్చాను" అని చెప్పాడు. దేవయ్యని పిలిపించారు. "అవును ప్రభూ! అది నాకే చేరింది. ఇప్పటికైనా తెలిసిందా ప్రభూ! దైవానుగ్రహం అంటే ఏమిటో" అన్నాడు దేవయ్య. రాజు నివ్వెరపోయి తలూపక తప్పలేదు.

***

No comments:

Post a Comment

Pages