కచ్ఛపి నాదం - 5 - అచ్చంగా తెలుగు

  కచ్ఛపి నాదం - 5

మంథా భానుమతి


“నీది వాయిద్య సహకారం మాత్రమే… ఆ విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. ప్రధాన కళాకారునిదే ముఖ్య పాత్ర. తెలుసు కదా! అనుసరణే కానీ అధిగమించకూడదు. ప్రతీ స్వరాన్నీ… తాళం కూడా, గమనిస్తూ ఉండాలి. ఒకో సారి స్వర కల్పనలు చేసేటప్పుడు తాళాలు కూడా మారుస్తుంటారు, గమనిస్తూ ఉండాలి” గురువుగారి మాటలకి తల ఊపాడు సోమేశం.

   “అవును గురువుగారూ! ఆవర్తం చివర్లో స్వరాలు అనుకూలంగా పలికిస్తూ సహకారం అందించాలి.”

   “అంతే కాదు, నీ వంతు వచ్చినప్పుడు రాగం, తానం వాయిస్తున్నప్పుడు, స్వరకల్పన చేసేటప్పుడు… గుర్తు పెట్టుకుని సాధ్యమైనంత వరకూ ప్రధాన వాయిద్య కారులు వేసిన సంగతులు వేయగలగాలి. జల క్షీరముల వలే కలిసి పోయి వాయించాలి.”

  మరునాడు పొద్దున్నే ఐదుగంటలకి లేపి, కూర్చో పెట్టి కచేరీకి సాధన చేయిస్తూ, వేదిక మీద సహకారం ఇచ్చేటప్పుడు పాటించవలసిన పద్ధతులు వివరిస్తున్నారు గురువుగారు. ముందు రోజే, రాత్రికి వాళ్లింట్లోనే ఉండి పోమన్నారు.

  ఎక్కడ ఉన్నా కూడా ఆ ఇంటి వాళ్ల తో కలిసి పోయి, చేదోడుగా ఉంటాడు సోమేశం.

  గురువుగారు వెంకట్రావుగారింట్లో కూడా అంతే… చేతిలో పనులు అందుకుంటూ సహాయం చేస్తూ ఉంటాడు. ఎక్కడి వస్తువులు అక్కడ సర్దటం, భోజనాలకి ముందు, పట్టు పంచ కట్టుకుని అమ్మగారికి వంటింట్లో, నట్టింట్లో అందిస్తూ, మంచి నీళ్లు నింపుతూ పిలిస్తే పలికేటట్లు ఉంటాడు.

  కృష్ణమూర్తి కూడా వెనుక వెనుకే తిరుగుతూ అన్నీ సోమేశాన్ని చూసి నేర్చుకున్నాడు.

  “ఇంత తీరు ఎలా వచ్చిందిరా?” అమ్మగారు ఎప్పడైనా మెచ్చుకోలుగా అంటారు.

  “అంతా మా అమ్మమ్మ ట్రైనింగండీ…” సోమేశం ఎప్పుడూ అమ్మమ్మని తలుచుకుంటూ ఉంటాడు.

  సోమేశం రాత్రికి రావడం లేదని హస్తబల్ నిర్వాహకులకి గురువు గారే కబురు చేశారు. గురువు గారి ఇంట్లో ఒక జత బట్టలు ఎప్పుడూ ఉంటాయి.

  వేదిక మీద వాయించటం, పాడటం మొదలు పెట్టించినప్పుడే రెండు జతలు సిల్కు లాల్చీ, పైజామాలు కుట్టించింది లక్ష్మమ్మ. ఏడాదికి రెండు సార్లు వచ్చి కావలసినవి తమ పరిధిలో అమరుస్తుంది మనవడికి.

  ప్రతీ సంక్రాంతికీ సోమేశంని లోగిస రమ్మంటుంది. చెప్పక పోయినా సూరమ్మకి కూడా చూడాలని ఉంటుంది కదా! తల్లి మనసు తల్లికే తెలుస్తుంది.

  ఆ ఎనిమిది సంవత్సరాలలో నాలుగు సార్లు అవధానిగారు తన శిష్య బృందంతో విజయనగరం వచ్చారు, వేద సభలకి… రాజా వారి ఆహ్వానం మీద. అది దాసుగారే ఏర్పాటు చేశారు. వారి దృష్టిలో పడాలి కానీ మరచిపోరు.

  కుమారుని ప్రతిభ అతని గురువుల ద్వారానే విని ఎంతో ఆనందించారు అవధానిగారు. పిల్లల ఆసక్తి గమనించి ప్రోత్సహిస్తే వచ్చే ఫలితం తెలుసుకున్నానని అత్తగారికి ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతుంటారు.

  ఈ కచేరీ సోంబాబుకి ఎంతోో ముఖ్యమైనది, అపురూపమైనది.

  సమయం లేదు కానీ అమ్మమ్మ, తండ్రిగారు, అమ్మ వస్తే బాగుండునని అనిపించింది సోమేశానికి.

   అన్నలిద్దరి విద్య పూర్తి అయింది. విజయనగరం నుంచి వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నారు. వాళ్లిద్దరూ ఎలాగా వస్తారు. ప్చ్… అమ్మమ్మే అస్సలు కదల్లేక పోతోంది. తమ్ముళ్లు విజయనగరం లోనే వేద పాఠశాలలో చేరిపోయారు. ఊర్లోనే కనుక వాళ్ళు ముగ్గురూ రాగలుగుతారు.

  ద్వారం వారితో కలిసి వాయించటమంటే… ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒకసారి మళ్లీ తనకి ఇచ్చిన పట్టిక చూసుకున్నాడు. సాయంత్రం లోపుగా వీలయినన్ని సార్లు… సాధన చేశాడు.

  వేదిక మీద వాయించడం కొత్త కాదు… కళాశాలలో చేరిన మరుసటి సంవత్సరం నుంచే త్యాగరాజ ఉత్సవాలు, గణపతి నవరాత్రుళ్లు, శ్రీరామనవమి పందిళ్లలోనూ వాయిస్తూనే ఉన్నాడు. చాలా సార్లు సోలో కచేరీలు కూడా… కానీ ఎప్పుడూ ఇంత ఒత్తిడికి గురవలేదు.

  “మరేమీ ఫరవాలేదు సోమేశం! చక్కగా వాయిస్తావు. బెంగ పడ వద్దు.” గురువుగారి ధైర్య వచనాలు వింటున్నప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. కాసేపయాక మళ్లీ మామూలే. తలంతా భారంగా ఉంది.

  కచేరీ సమయం దగ్గర పడుతోంది. సోమేశం చక్కగా తయారయి, నుదుటి మీద బొట్టు పెట్టుకున్నాడు.

  అప్పుడప్పుడే యవ్వనం లోకి ప్రవేశిస్తున్నాడేమో, కొత్త తేజస్సుతో వెలిగి పోతున్నాడు. అంత పొడుగూ పొట్టీ కాని విగ్రహం, దీక్షగా చూస్తున్న నేత్ర ద్వయం… తెలివిని చూపించే ముఖ కవళికలు, చూసే వారికి అతని లోని ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది.

  వేదిక మీదికి ఎక్కి వీణ పట్టుకోగానే సోమేశం మనసు లోని సంఘర్షణ అంతా మాయమైపోయింది.

  మనసంతా తేలికయింది. వీణ శృతి చేస్తుండగానే వీణ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ద్వారం వారు వేదిక మీదికి వచ్చారు. అప్పుడే రాజావారు కూడా వచ్చి, అందరి నమస్కారాలు అందుకుంటూ తన ఆసనం మీద కూర్చున్నారు.

  సోమేశం ఇద్దరికీ నమస్కారం చేసి, ఆశీర్వచనం కోసమన్నట్లు తల వంచాడు. రాజావారు నవ్వుతూ తల పంకించారు.

  మృదంగం, వీణ, వయోలీన్ మూడు వాయిద్యాల శృతులు కలువగానే కచేరీ ప్రారంభమయింది.

  అదొక మధుర సంగీత ఝరి. అలా సాగిపోతూనే ఉంది. సోమేశం గురువుగారి సూచనలన్నీ పాటించి, అద్భుతమైన సహకారం అందించాడు.

  అసలే ఏకసంథగ్రాహి యేమో, ప్రధాన వాయిద్యం వాదనని అనుసరిస్తూ అందరూ మెచ్చుకునేలాగ వాయించాడు.

  ముందు చూడగానే, ఈ కుర్రవాడి సహకారమా అనుకున్న రాజావారు ఆశ్చర్యపోయేట్లు వాయించాడు.

  తను సంగీత కళాశాల స్థాపించి మంచి పని చేశానని, అప్పుడు రాజా వారికి తప్పకుండా అనిపించి ఉంటుంది.

  నాయుడుగారు మాత్రం తను ఊహించినట్లే జరిగిందని సంతోషించారు. ఎంత నమ్మకం లేకపోతే, రాజా వారి దగ్గర వాయించేటప్పుడు పిలుస్తారు?

  ఆ తరువాత చాలా సార్లు తన తో వాయించే అవకాశం ఇచ్చారు ద్వారం వారు. ప్రదర్శన ప్రదర్శనకీ తన ప్రతిభని పెంచుకుంటూ వచ్చాడు సోమేశం.

 

  ఇంకా రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం ఉండగానే అమ్మమ్మ ఒక ప్రతిపాదన తీసుకు వచ్చింది.

  వారం రోజులు గురువుగారి అనుమతి తీసుకుని లోగిస వెళ్లాడు సోమేశం. అమ్మమ్మ పెద్దదయి పోయింది… చూడాలని గొడవ పెడుతోందంటే వెళ్లాడు. అమ్మమ్మే స్వయంగా వణుకుతున్న చేతులతో కార్డు రాసింది.

  అమ్మమ్మకి తన వీణా నాదన వినిపిద్దామని కరణంగారి ఇంటి నుంచి వీణ తెచ్చుకుని వచ్చాడు. ఎవరూ వాడటం లేదేమో వీణ వాయించడానికి పనికి వచ్చేటట్లు లేదు. తను చిన్నప్పుడు సరిగమలు నేర్చుకున్న వీణ…

  వీణ బుర్ర చేతిలోకి వచ్చేట్లు ఉంది. మెట్లు కదిలి పోయాయి. తీగలు కొన్ని తెగి పోయాయి, కొన్ని తుప్పు పట్టి పోయాయి. మేళం కూడా కొత్తగా వేయాలి.

  ‘సున్నితమైన సంగీత పరికరం… నిత్యం చూసుకుంటూ వాడుతూ ఉండాలి. ఒక మూల పడేస్తే ఇలాగే అవుతుంది. ఈ వీణని బాగుచేయించే కంటే కొత్తది కొనుక్కోవడం నయం’ అనుకున్నాడు.

  కానీ… అలా చేస్తే తన ప్రతిభ ఏముంటుంది… ఈ వీణనే కొత్తగా చెయ్యాలి. ఎందుకైనా మంచిదని తను వచ్చేటప్పుడు, వీణ తీగలు రెండు సెట్ లు తెచ్చాడు.

  వీణ పేరు చెప్తేనే ఊహ తెలిసి నప్పటి నుంచీ సోమేశానికి ఒక రకమైన ఆరాధనా భావం, ఉద్వేగం కలుగుతుంది... తన జీవితంలో, జీవనంలో వీణ కిచ్చినంత ప్రాముఖ్యత దేనికీ ఇవ్వలేడు. అది పూర్వ జన్మ సుకృతం అని చెప్ప వచ్చు.

 

  “వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః

  తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గంస గచ్చతి”

 

  అని యాజ్ఞ్య వల్క్య స్మృతిలో ఉంది. ‘వీణా వాదన తెలిసి శ్రుతి జాతులలో విశారదుడై తాళం తెలిసిన వారు మోక్షానికి తేలికగా వెడతారు’ అని భావం.

  వీణ, వేద కాలం నాటిదని రుక్కుల వలన తెలుస్తోంది. ఆ నాడు తంత్రులున్న ఏ వాయిద్యాన్నయినా వీణ అని ఉంటారు.

  వీణని పెద్దలు మానవ శరీరంతో ఏ విధంగా పోల్చారో చెప్పిన సిద్ధాంతాన్ని సోమేశం ఎప్పటికీ మర్చి పోలేడు. ఒక సారి గురువుగారు తన వీణకి మేళం సరి చేస్తూ అందులోని భాగాలు చూపించి తనకీ, కృష్ణమూర్తికీ వివరించారు. ఆ వివరణ వింటుంటే ఒడలు పులకరించింది సోమేశానికి.

  పైగా వీణ వాయించడమే కాదు, ఎలా తయారు చేస్తారో తెలుసు కోవాలనీ… తీగలు మార్చటం, చిన్న చిన్న మరమ్మతులు చెయ్యటం నేర్చుకోవాలనీ చెప్పారు.

 

  * మూలాధారం నుండి శిరస్సు ఊర్ధ్వ భాగం వరకూ మానవ శరీరంలోని వెన్నుపూస దీర్ఘంగా నిలిచి ఉంది. శిరస్సు పై భాగమే బ్రహ్మరంధ్రం. వీణకు 24 మెట్లు ఉన్నట్లే వెన్ను పూసకూ 24 పూసలున్నాయి. వెన్నెముకలో పైనించి కింది వరకూ 7 సెర్వికల్, 12 థోరాసిక్, 5 లంబార్ వెర్టిబ్రేలు ఉన్నాయి. వీణలో పై మెట్లకు వెళ్తుంటే మెట్టుకు మెట్టుకు దూరం తక్కువ అవుతూ ఉంటుంది. అలాగే మూలాధారం దగ్గర వెన్ను పూసలు దట్టంగా ఉంటాయి. బ్రహ్మ రంధ్రం వైపుకి వెళ్లే కొద్దీ సన్నబడతాయి.

  మంద్ర స్థాయి స్వరం శరీరం అడుగు భాగాన చివర్లో జనిస్తుంది. బ్రహ్మ రంధ్రం వేపుకి వెళ్లే కొద్దీ శ్రుతి పెరుగుతుంది. బ్రహ్మ రంధ్రం సహస్రారంలో ఉంటుంది. అక్కడే సంగీతం యొక్క జీవం ఉంటుంది.

  ప్రాణాగ్ని సంయోగం చేత నాదోత్పత్తి జరుగుతుంది. తక్కువ శ్రుతిలో మూలాధారంలో అది మొదలై పైకి పోయే కొద్దీ స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా అనే ఆరు చక్రాలను దాటి సహస్రారం చేరే సరికి శ్రుతి పెరుగుతుంది.

  వీణలో కూడా అంతే. పైకి వెళ్తున్న కొద్దీ సన్నబడుతున్న మెట్ల మీద శ్రుతి పెరుగుతూ ఉంటుంది.

  *(ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి “వీణపై విశేషాలు” నుండి)

 

  తను వాయించిన తొలి వీణ చూస్తుంటే సోమేశంకి ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. తన శరీరానికే దెబ్బలు తగిలినట్లు బాధ పడ్డాడు.

  వీణని మెత్తని పల్చని బట్ట తీసుకుని వచ్చి సున్నితంగా తుడిచి, సన్నని దుప్పటితో కప్పి చేతులతో పట్టుకుని లేచాడు.

  ద్వారంవారు తన సహకార వాయిద్యానికి ఇచ్చిన డబ్బు బాగానే కూడింది. అదంతా పట్టుకుని బయల్దేరాడు.

  బయల్దేరే ముందు అమ్మమ్మకి, నాన్నగారికి చెప్పాడు. అవసరమవుతుందేమో ఉంచమని అమ్మమ్మ కూడా కొంత రొక్కం ఇచ్చింది.

 

  గజపతి నగరంలో, బొబ్బిలి వీణల వ్యాపారస్తులలో ఒకాయన సంగీత పరికరాలు అమ్ముతున్నాడని, మరమ్మతులు చేస్తున్నాడనీ… వీణ తీసుకుని వచ్చేటప్పుడు కరణంగారు చెప్పారు. ఆయనకి సోమేశం సంగతి తెలుసు కదా, మరమ్మతుకి తీసుకుని వెళ్తాడని ఊహించారు.

  జట్కా అయినా, ఎడ్ల బండి అయినా కుదుపులు ఉంటాయని, పల్లకీ మాట్లాడు కున్నాడు. అవసరమైతే గజపతి నగరంలో రెండు రోజులు ఉండాలని చెప్పాడు బోయీలకి.

  “ఇది తంజావూరు వీణ బాబూ!” చూడగానే వ్యాపారస్తుడు చెప్పాడు.

  “మరి… మీరు రిపేర్ చెయ్యగలరా?” సోంబాబుకి బెంగ వచ్చింది. చెయ్యలేనంటాడేమో ఏం చెయ్యాలి? తంజావూరు అయితే తీసుకు వెళ్లలేడు.

  “చేసేస్తామండి. మా దగ్గర అన్ని రకాలూ ఉంటాయి. వీణ మరీ అంత పోలేదండి. దండి (మెడ), యాళి (పురాణ జంతువు మెడ ఆకారం), కుండ బానే ఉన్నాయి. సొరకాయ బుర్ర ఒకటీ మార్చాలి. చేసేద్దామండి. తంత్రులు చూస్తారాండీ?”

  “తంత్రులు తెచ్చాను. చేసెయ్యండి. మేము సత్రంలో ఉంటాము. ఎంత అవుతుంది?”

  “చేశాక కానీ చెప్పలేమండి.”

  అనుకున్నట్లే రెండు రోజులు పట్టింది. కొత్త వీణలా తయారయింది. సోంబాబుకి చాలా సంతోషం కలిగింది. వీణకి కవరు కూడా కొన్నాడు ఆ కొట్లోనే. అనుకున్న దాని కంటే తక్కువే అయింది డబ్బు.

  పదిలంగా, ఆనందంగా సరి కొత్త వీణని ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడి నుంచి విజయనగరం తీసుకు వెళ్దామని అనుకున్నా.డు. తన దగ్గరే హస్తబల్ లో ఉంచుకోవచ్చు.

 

  “ఇప్పుడు నాకు పెళ్లా? ఇంకా నా కోర్సు అవలేదు.” అమ్మమ్మ దగ్గర పేచీ పెట్టాడు సోమేశం.

  అప్పటి రోజుల్లో చదువు కుంటున్న మగపిల్లలకీ, పెద్దమనిషి అవని ఆడపిల్లలకీ పెళ్లిళ్లు చెయ్యడం సాధారణమే.

  “పెళ్లికీ నీ సంగీతానికీ ముడి పెట్టనక్కర్లేదు. మీ అన్నయ్య లిద్దరికీ ఈ వయసుకే పెళ్లిళ్లు అయాయి. నాకు తొందరలోనే పిలుపు వస్తుంది. మనిద్దరికీ ఉన్న అనుబంధం నీకు తెలుసు కదా! నీ వివాహం కళ్లారా చూశాక వెళ్లి పోదామని నా ఆశ.”

  “నేను వారం రోజులే అనుమతి తీసుకుని వచ్చాను. వెళ్లకపోతే మా గురువుగారు ఊరుకోరు.” చివరి అస్త్రం ప్రయోగించాడు.

  “కార్డు ముక్క రాయిస్తాలే. వీణ బాగుచేయించుకుని వచ్చావుగా ఇక్కడ సాధన చేసుకోవచ్చు. కరణం మామయ్యగారిని అడిగిరా… మరమ్మతు కయిన ఖర్చు ఇస్తారా, వీణ తీసేసుకోమంటారా అని.” లక్ష్మమ్మ వదల్లేదు. ఆవిడ అనుకున్న పని సాధిస్తుందని సోమేశం స్వానుభవమే కద.

  కరణంగారు వీణ ఇచ్చేటప్పుడే చెప్పారు, “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో” అని. వాళ్లింట్లో వాయించే వాళ్లు, సంగీతాభిరుచి ఉన్నవాళ్లు ఎవరూ లేరు.

 

  “ఇంతకీ అమ్మాయి ఎవరు? నీకు తెలిన వారేనా? ఈ ఊరేనా?” సోమేశం నెమ్మదిగా అడిగాడు.

  అవధానిగారు, సూరమ్మ అక్కడే ఉన్నారు. సూరమ్మ నవ్వుతూ చూస్తోంది. కొడుకు పెళ్లంటే ఆనందం మరి.

  “అలారా దారికి. మన వాళ్లే. దూరపు బంధుత్వం ఉంది. అమ్మాయి చక్కగా చురుగ్గా ఉంటుంది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల. మనింట్లో ఇట్టే కలిసి పోతుంది. కష్టానికి సుఖానికీ ఆదుకోవడానికి తనకి తమ్ముడు కూడా ఉన్నాడు.” లక్ష్మమ్మ మొత్తానికి మనవడిని ఒప్పించ గలిగింది.

  ఎంత సామర్ధ్యం లేకపోతే అమాయకురాలైన కూతురు, అంధుడైన అల్లుడు… వాళ్ల ఇంట్లో ఉండి ఆరుగురు పిల్లలని పెంచి పెద్ద చేయగలుగుతుంది!

  వారం రోజుల్లో పెళ్లి జరిగి పోయింది. ఆ రోజుల్లో అమ్మాయిని అబ్బాయి కానీ, అబ్బాయిని అమ్మాయి కానీ పెళ్లికి ముందు చూసే సాంప్రదాయం లేదు.

  జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు చూసుకున్నారు.

  ‘అమ్మాయి వేళ్లు బాగున్నాయి. వీణ నేర్పిస్తే మంచి వైణికురాలు అవుతుంది’ అనుకున్నాడు సోమేశం.

  అబ్బాయి గురించి ఏమన్నా అనుకునేటంత వయసు లేదు పెళ్లి కూతురు జయకుమారికి. ఏడు సంవత్సరాలు ఇంకా నిండలేదు. తల పైకెత్తి చిన్నగా నవ్వింది.

  సోమేశం వివాహం అయాక మామగారు పప్పు చంద్ర శేఖర శాస్త్రిగారి కుటుంబం, లోగిస నుంచి విజయనగరం వచ్చేసి అక్కడ స్థిర పడ్డారు.

                 …………………

                       3

 

  వివాహం అయి విజయనగరం వెళ్లిన వెంటనే గురువు గారు, వాసా వెంకట్రావుగారు శుభవార్త చెప్పారు.

  పైగా వివాహం జరిగిన వెంటనే అటువంటి శుభవార్త మంచి భవిష్యత్తుకి సూచన అన్నారు.

  “బొబ్బిలి మహారాజా వారి దగ్గర నుంచి మీ గురువుగారికి, వారి సంస్థానంలో వీణ ప్రోగ్రామ్ ఇవ్వాలని ఆహ్వానం వచ్చింది. దానికి సహకారం అయ్యగారి సోమేశ్వరరావు ఇవ్వాలని అనుకుంటున్నాను. వీలైతే ఆ సమయంలో నీ సోలో కి కూడా ప్రయత్నం చేస్తాను.”

  “గురువుగారూ! ధన్యవాదాలండీ.”

  సోమేశం ఆనందానికి అవధులు లేవు.

 

  “మన రాష్ట్రంలో బొబ్బిలి వీణ బాగా ప్రసిద్ధి చెందింది. నీకు తెలుసు కదా?” గురువుగారు సోమేశానికి చెప్తున్నారు.

  తెలుసునన్నట్లు తల ఊపాడు సోమేశం.

  “ఎందుకో తెలుసా?”

  “తెలియదండి గురువుగారూ!”

  “బొబ్బిలి సంస్థానాన్ని పెదరాయుడు 17వ శతాబ్దంలో స్థాపించాడు. అందరి ప్రభువుల్లాగే ఆయనికి కూడా కళలంటే ఆసక్తి. మొదట్లో ఖాళీ సమయాల్లో వీణ వాయించే వారు. తరువాత, రాచకార్యాల్లో వీణ వాయించడం బొబ్బిలి సంస్థానంలో విడదీయరాని భాగమయిపోయింది.

  వీణను గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వర్గ కళాకారులు తయారు చేసే వారు. సంస్థానంలోని మహిళలు వీటిని వాయించే వారు. రాజులు వీటిని ఆంగ్లేయ సందర్శకులకు బహుమానంగా ఇచ్చేవారు. కళాకారులను ఘనంగా సత్కరించే వారు. అప్పటి నుంచే వీణ ప్రాముఖ్యత పెరిగింది.”

  “ఆంగ్లేయులు వీణని ఏం చేసుకుంటారండీ?” సోమేశం సందేహం సరైనదే… వాళ్లేం చేసుకుంటారూ? పాశ్చాత్య సంగీతంలో వీణని ఉపయోగించడం ఎప్పుడూ విన లేదు సోంబాబు.

  గురువుగారు ఆలోచించారు.

  “కొంతమంది విదేశీయులు కూడా మన సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వారేమో! అయినా ఏ వాయిద్యమైనా ఏ దేశ సంగీతానికైనా అనువుగా మలచుకోవచ్చు. వయోలిన్ చూడు… ఐరోపా దేశానికి చెందినది. మొదటి వయోలిన్ ఇటలీలో తయారు చేశారు. ఇప్పుడు కర్ణాటక సంగీతంలో దాని ప్రాముఖ్యత తెలుసు కదా?”

  “నిజమే నండీ. సంగీతానికి, వాయిద్యాలకి ఎల్లలు లేవు.” సోమేశం సందేహం తీరిపోయింది. ఆ విషయం అతను ఎప్పుడూ మరచి పోలేదు. అన్ని రకాల వాయిద్యాలనూ, సంగీతాలనూ సమానంగా అభిమానించాడు.

 

  గురువుగారు వాగ్దానం చేసినట్లుగానే జరిగింది. 

  బొబ్బిలిలో తన సోలో ప్రోగ్రామ్ కి కూడా అవకాశం వచ్చింది. గురువు గారికి సహకారం అందించి అందరి మెప్పూ పొందిన వెంటనే, మర్నాడే సోమేశం వీణా వాదన… తన ప్రతిభని శక్తి వంచన లేకుండా ప్రదర్శించాడు.

  వేదిక ఎక్కి వీణ పట్టుకోగానే ఇంకేదీ గుర్తుకు రాదు సోమేశానికి. తను… తన వీణ… అంతే.

  సంగీత కళాకారులందరూ స్వయంగా కలిసి అభినందించి, మంచి భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు. 

  విజయనగరంలో తన సంగీత విద్యాభ్యాసాన్ని పలువురి ప్రశంసలు అందుకుంటూ పూర్తి చేసుకున్నాడు సోమేశం. అనేక చోట్ల సోలో గానూ, కృష్ణమూర్తితో కలిసీ… చుట్టు ప్రక్కల ఊళ్లలో కచేరీలు చేశాడు.

 

  సోమేశ్వర్రావు, భార్య జయకుమారికి పది సంవత్సరములు వచ్చినప్పటి నుంచీ రోజూ వాళ్ల ఇంటికి వెళ్లి నేర్ప సాగాడు.

  గురువుగారు చెప్పినవి ఎప్పటి కప్పుడు సాధన చేసి అప్పజెప్పి, వాయించి చూపించ వలసిందే. గురువుగారు గురువుగారే, ఇంటిమనిషి ఇంటి మనిషే. క్రమంగా తనకి కూడా ఆసక్తి కలిగి శ్రద్ధగా నేర్చుకో సాగింది.

  ఒక రోజు సోమేశం, మిత్రుడు వాసా కృష్ణమూర్తితో కలిసి మామగారింటికి వెళ్లే సరికి, మంచం కింద నుంచి వీణ మీద బిలహరి స్వర పల్లవి వినిపిస్తోంది. అంతకు ముందే భార్యకి నేర్పించాడు తను.

  జయకుమారి మంచం కింద కూర్చుని వాయిస్తోందేమిటా అని మిత్రులిద్దరూ వంగుని చూశారు.

  ఏడు సంవత్సరాల బావమరిది పప్పు సోమేశ్వరరావు, బిడియంగా నవ్వుతూ, దొరికిపోయి చూస్తున్నాడు… అక్క వీణ ఒళ్లో పెట్టుకుని.

  “మీరు నేర్పించి వెళ్లాక అక్క నాకు నేర్పిస్తూ సాధన చేస్తోంది బావా… నాకు కూడా నేర్పించరా?” మంచం కింది నుంచి వచ్చి అడిగాడు చిన్న సోమేశం.

  అంతకంటే కావలసినదేముంది… సోమేశ్వర్రావు, అక్కా తమ్ముళ్లిద్దరికీ మరింత శ్రద్ధగా వీణ నేర్ప సాగాడు .

  పరీక్షా ఫలితాలు తెలిశాయి. అందరూ అనుకున్నట్లుగానే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయాడు. తన గురువుల దగ్గరకు వెళ్లి నమస్కరించాడు.

  తాతగారు అజ్జాడ నారాయణదాసు గారి ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాడు.

  హస్తబల్ లో అందరినీ పలుకరించి, వీడ్కోలు చెప్పి… అక్కడ తన కున్న కొద్దిపాటి సామాను సర్ది పెట్టుకున్నాడు.

  ఇంక భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న ఉదయించింది. సంగీత రసజ్ఞులు ఉన్న చోట స్థిర పడి తన విద్య సద్వినియోగం అయేలాగ శిష్యులకి నేర్పుతూ, కచేరీలు చేస్తూ తీర్చి దిద్దుకోవాలి. అలాగే తనతో సమానమైన వారసులని తయారు చేయాలి.

  ఏం చెయ్యాలి? ఎక్కడకు వెళ్లాలి? అలా ఆలోచిస్తూ పడుకుంటే ఎప్పటికో నిద్ర పట్టేసింది.

                …………………

 

   ఇప్పుడు అయ్యగారి సోమేశ్వరరావు అంటే విజయనగరంలో, చుట్టు ప్రక్కల తెలియని వారు లేరు. ఎవరూ తెలియని కొత్త ప్రదేశం వెళ్లి, తన జీవన ప్రస్థానం మొదలు పెట్టే ధైర్యం చేయలేక పోయాడు.

  సోమేశ్వర్రావు, హస్తబల్ నుంచి సామాన్లు తీసుకుని మహారాజా సత్రంకి మారిపోయాడు. మామగారు చంద్ర శేఖరంగారు ఆ సంగతి తెలుసుకుని, కోప్పడి తమ ఇంటికి తీసుకు వెళ్లారు.

  మామగారి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు సోమేశ్వరరావుకి. వెంటనే ఇల్లుదొరకటం అంత సులభం కాదు. విజయనగరంలో దాదాపు పది సంవత్సరాలనుంచి ఉన్నా, తను, తన వీణ… కళాశాల, గురువులూ తప్ప బైటి వారెవరూ తెలియదు.

  కృష్ణమూర్తి కూడా చిన్నవాడే... విద్యార్ధి దశలోనే ఉన్నాడు. గంగ బాబుది ఆ ఊరే అయినా అంధుడు.

   సోమేశం హస్తబల్ లోనూ, కళాశాలలోనూ అందరితో బాగా మాట్లాడుతూ తలలో నాలుకలా ఉంటాడు కానీ, తన హద్దుల్లో తను ఉండేవాడు. వీణ సాధనే ధ్యేయం… పరిచయాలేం లేవు.

 

  తదుపరి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు వాసు అతని వద్దకు వచ్చాడు.

  వాసు విజయనగరం మహారాజా కాలేజ్ లోనే డిగ్రీ పూర్తి చేసి రైల్వేలో ఉద్యోగం సంపాదించు కున్నాడు.

  “శేషు మామయ్య ఇంటి పక్కనే ఒక వాటా ఖాళీ ఉందిట సోంబాబూ! ముందు అందులో చేరు. వాళ్ల పిల్లలిద్దరికీ ఇంటికి వచ్చి సంగీతం నేర్పే వాళ్ల కోసం చూస్తున్నారు. ఇంటి అద్దెకి బదులుగా సంగీతం నేర్పుతావని చెప్దాము.”

  నమ్మలేనట్లు చూశాడు సోంబాబు. నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరించకపోయినా, సంగీతం నేర్చుకోవటానికి విజయనగరం వచ్చినప్పుడు కూడా వాసు వెన్ను దన్నుగా నిలిచాడు. ఇప్పుడు కూడా, నాలుగు బాటల కూడలిలో నిల్చుని ఎటుపోవాలో తెలియని సందిగ్ధంలో ఉంటే, త్రోవ చూపిస్తున్నాడు.

  ఎప్పుడూ… పిలిచినట్లుగా సరైన సమయానికి వచ్చి సహాయం చేయడానికి తమిద్దరి మధ్యా ఏ రుణానుబంధం ఉందో!

  ఎవరి కైనా జీవితం సాఫీగా గడవటానికి, అవసరం పడినప్పుడు ఇటువంటి అండని చూపిస్తాడేమో భగవంతుడు.

   ఆరోజే వాసు చూపించిన వాటాలో చేరిపోయాడు. ఇంటి వాళ్లకి సోమేశ్వర్రావు ప్రతిభ బాగా తెలుసు. వాళ్లు ఎక్కడ ఎవరి కచేరీ అయినా తప్పని సరిగా వెళ్తారు.

   అప్పట్లో విజయనగరంలో ప్రతి ఇంటి లో వారికీ సంగీతం అంటే అభిమానం, పరిచయం ఉండేది. తన శిష్యులు రాము, కృష్ణలని ఆప్యాయంగా పలుకరించాడు. వాళ్ల అమ్మ దగ్గరే నేర్చుకుంటున్నారుట. గీతాల వరకూ వచ్చారు.

  “మీరు పరీక్షించండి పిల్లలని గురువుగారూ! వాళ్లకి విద్య అలవడుతుందంటే, వీణలు కూడా సమకూరుద్దాము.” ఇంటి యజమాని ప్రసన్నంగా చూస్తూ అన్నాడు.

   ఆ తర్వాత వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు సోమేశ్వర్రావుకి. రోజూ ఎక్కడో అక్కడ కచేరీ… అందులో విన్న వాళ్లు వాళ్ల ఊరికి రమ్మని ఆహ్వానించి, వారి తాహతు తగ్గట్లుగా సత్కరించడం చేస్తున్నారు.

  తగు మాత్రంగా ఆదాయం కూడా సమకూరుతోంది.

 

  ఆహ్వానం వచ్చిన కచేరీలు లేని నాడు, చుట్టు ప్రక్కల పల్లెలలో ఒక ఊరు ఎన్నుకుని, అక్కడకు వెళ్లి వాయించేవాడు. మొదట్లో అక్కడి రైతులకు, పెద్దలకు ఆసక్తి లేకపోయినా కుర్రవాడు ఉత్సాహంగా వచ్చి వాయిస్తున్నాడని వచ్చే వారు. వారి పిల్లలని కూడా తీసుకుని రమ్మని చెప్పేవాడు సోమేశం. క్రమంగా శ్రోతల సంఖ్య పెరగ సాగింది.

  శ్రోతలని బట్టి తన పాటలని ఎన్నుకునే నేర్పు సహజంగానే అబ్బింది సోమేశానికి.

  పల్లెలలో పల్లె పాటలు, జానపద గేయాలు ఎక్కువగా వాయిస్తూ, మధ్య మధ్య రామదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులు పండిత పామర జనరంజకంగా వాయించే వాడు.

  కొంత కాలం తరువాత శ్రీరామ నవమి, వినాయక చవితి, దేవీ నవరాత్రుల వంటి పండుగలకి వారే పిలవడం మొదలు పెట్టారు.

  రాజావారి ఆస్థానంలో, పండితుల సభలో వాయించినప్పుడు తన ప్రతిభ పూర్తిగా చూపించే వాడు.

  బొబ్బిలి, కటకం, విశాఖపట్టణం, విజయవాడ వంటి ఊర్ల నుండి సంగీత సభలకు ఆహ్వానాలు వస్తూనే ఉండేవి.

  సంగీత ప్రస్థానం సాగుతూ ఉండగానే, సంసారం ఏర్పాటు జరిగింది. జయకుమారికి తగిన వయసు రాగానే కాపురానికి పంపించారు.

  అన్ని వ్యవహారాలలోనూ చురుకుగా ఉండే జయకుమారి, ఇంటి పనులు చేసుకుంటూనే వీణ సాధన పట్టుదలగా చేసేది... అనతి కాలంలోనే తాను నేర్పగల స్థాయికి చేరుకుంది. తాను కూడా శిష్యులను సమ కూర్చుకుంది.

  అందులో ఇంటిలోనే గురువుగారు అనుక్షణం సరదిద్దుతూ ఉంటే అడ్డు ఏముంటుంది?

  జయకుమారి వీణ సాధన చేస్తూ అంతా సమర్ధించుకుంటూనే గర్భవతి అయింది. ఇంట్లోకి మహలక్ష్మి వచ్చింది. సరస్వతీ నిలయం కదా… శారద అని పేరు పెట్టారు.

  సోమేశం ‘అమ్మలూ’ అంటూ తీరిక దొరికినప్పుడల్లా కూతురితో గడప సాగాడు.

   రెండు సంవత్సరముల తరువాత పుంభావ సరస్వతి ఆవిర్భవించాడు. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి మరి…

  అతనికి శ్యామసుందరం అని నామకరణం చేశారు. శ్యామసుందరం పుట్టాక, అదృష్టం కలసి వచ్చింది.

  అప్పుడే అయ్యగారి సోమేశ్రరావుగారి విద్య, ప్రతిభ అందరికీ తెలిసే సంఘటన జరిగింది.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages