కచ్ఛపి నాదం - 6 - అచ్చంగా తెలుగు

  కచ్ఛపి నాదం - 6

మంథా భానుమతి



   1948వ సంవత్సరం…

  మద్రాసులో శ్రీ కృష్ణ గానసభలో కచేరీకి వెళ్లినప్పుడు ఒక విశిష్ట వ్యక్తి సోమేశ్వరరావుని కలిశారు. కచేరీ అయాక తను ఉన్న వసతి గృహానికి తీసుకుని వెళ్లారు.

  చాలా మందిశ్రోతలు ఆ విధంగా తీసుకుని వెళ్లి సత్కరించి, వారి ఊరికి రమ్మని ఆహ్వానించడం అలవాటయి పోయింది. అటువంటి పిలుపే అనుకుని వెళ్లిన సోమేశ్వర్రావుకి ఊహించని ప్రతిపాదన వచ్చింది.

  “నా పేరు వల్లూరి వెంకటేశ్వర్లు. సుప్రీం కోర్టు లాయర్ని. మాది బాపట్ల. మీరు కుటుంబంతో బాపట్ల వచ్చి అక్కడే నివాసం ఏర్పరచు కోవాలని ఆహ్వానిస్తున్నాను. మా వూరిలో సంగీతం నేర్పే వారు ఎవరూ లేరు. నాకు సంగీతం అన్నా, వీణా వాయిద్యం అన్నా అభిమానం ఎక్కువ. మా ఇంట్లోనే ఒక వాటా ఏర్పరచి, మీకు ఏ లోటూ రాకుండా చూస్తాను.”

   వెంకటేశ్వర్లు గారి ఆహ్వానం విని ఏం చెప్పాలో తెలియక కొద్ది సేపు మౌనంగా ఉండిపోయారు సోమేశ్వరరావు గారు.

  అంత పెద్దాయన పిల్చి నప్పుడు కాదన లేరు. పైగా వారు, మంత్రి వల్లూరి బసవరాజు గారి సోదరుడు.

  జయ ఏమంటుందో… కొత్త ప్రదేశం. తన వారందరినీ వదిలి వెళ్లాల్సి వస్తుంది.

  చూడటానికి మంచి అవకాశం లాగే ఉంది. జయకు నచ్చచెప్పవచ్చులే అనుకున్నారు.

  “అలాగేనండీ. ఇంటికి వెళ్లి మా వాళ్లతో మాట్లాడాక మంచిరోజు చూసుకుని వస్తాము.”

 

  “కొత్త ఊరు, పూర్తిగా మనకు తెలియని పరిసరాలు… ఎలా ఉంటామో? చటుక్కున మన వాళ్లని చూడాలనిపిస్తే రోజు పడుతుంది ప్రయాణం.” అంటూ… ముందు సందేహించినా స్వతహాగా ధైర్యం కల అమ్మాయి కనుక సోమేశ్వరరావు ప్రతిపాదనకి పెద్ద అభ్యంతరాలు చెప్పకుండా సరే అనేసింది జయకుమారి.

  ఉన్నచోటే ఉంటే అవకాశాలు రావు. జీవితంలో పైకి రాలేరని తనకి తెలుసు. సంస్కృత పండితుల పుత్రిక మరి.

  అనేక ప్రదేశాలు కచేరీలకోసం తిరిగే సోమేశ్వరరావుకి, వల్లూరి వారి ఆహ్వానం వినగానే మంచి మార్పే అనిపించింది.

  బాపట్ల అన్ని రాష్ట్రాలకీ మధ్యలో ఉండటం కూడా సదుపాయంగా ఉంది. తెనాలి వచ్చి మద్రాసు-హౌరా మైల్ ఎక్కుతే తను తరచుగా వెళ్లే ప్రాంతాలన్నీ అందుబాటులో ఉంటాయి.

  బాపట్ల చేరగానే వల్లూరి వెంకటేశ్వర్లు గారి ఇంట్లో తమ కోసం తయారు చేసిన వాటాలోకి వెళ్లిపోయారు.

  వారు వాగ్దానం చేసినట్లు గానే ఇల్లు చాలా సదుపాయంగా ఉంది. చిన్న పెరడు, ఇంటికి దగ్గరలోనే నుయ్యి. పైగా మంచినీళ్లట. కాకపోతే విజయనగరం నుయ్యి కంటే రెండు మూడు బారలు లోతు ఎక్కువ. చేతులకి మంచి వ్యాయామం.

  ‘సరే… ఏం చేస్తాం. తోడుకున్న నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? జీవితంలో అభివృద్ధి కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి ’ అనుకుంది జయకుమారి. తను ఏ పరిస్థితినైనా అనుకూలంగా మలచుకుంటుంది.

 

  విజయనగరం శిష్యులు మాత్రం చాలా బెంగ పడ్డారు. ఇంటి వాళ్ల పిల్లలతో కలిపి పది మంది వరకూ ఉంటారు.

  “గురువుగారూ! మేము కూడా మీతో వచ్చేస్తాం” కళ్ల నిండా నీళ్లతో అడిగారు. వాళ్లందరినీ కృష్ణమూర్తికి అప్పచెప్పారు. అతనికి ఇంకా రెండేళ్లు పడుతుంది డిప్లొమా అవటానికి.

  బాపట్లలో ప్రధమ శిష్యుడు వల్లూరి వెంకటేశ్వర్లు గారు, సుప్రీం కోర్టు లాయర్. (వీరే తరువాత కుర్తాళం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించారు).

  వారు ఎంతగానో మొహమాట పడుతూ అడిగారు, “నాకూ నేర్పిస్తారా” అని… అంటే… పెద్దవాడిని కదా అని సంశయించారు.

  “తప్పకుండానండీ. విద్య నేర్చుకోవటానికి వయసుతో పనిలేదు. ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు. అవి మీకు ఉన్నాయని మమ్మల్ని రప్పించినప్పడే తెలిసింది. రేపే మొదలు పెట్టేద్దాం.”

  ఏదో శిఖరం ఎక్కినట్లు ఆనంద పడుతూ తన ఇంట్లోకి వెళ్లిపోయారు వెంకటేశ్వర్లు గారు.

  అనుకోని కొత్త సదుపాయాలు కూడా అమిరాయి జయకుమారికి.

   ఒక పాలేరు వచ్చి నూతి దగ్గరున్న నాలుగు గోళాల్లోనూ నీళ్లు నింపి వెళ్తాడు... మంచినీళ్లు, మడి నీళ్ళు మాత్రం వీళ్లే తోడుకోవాలి.

   అంటగిన్నెలకి పనిమనిషి కుదిరింది. బట్టలు ఉతకటానికి చాకలి అమ్మాయి రోజూ వస్తుంది… సాయంత్రం వచ్చి మడతలు కూడా పెడుతుంది. పిల్లల పనుల్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది. అలవాటైతే ఇక్కడి జీవితం బాగానే ఉంటుందనిపించింది.

                     ……..

 

  బాపట్ల వచ్చి రెండేళ్లవుతోంది.

  కర్ణాటక సంగీతం, వీణా నేర్పే విద్వాంసుడు ఊరిలో ఉండి పోవడానికి వచ్చారనగానే మధ్యతరగతి వారందరూ వారి పిల్లలకు సంగీతం నేర్పించటానికి ఉత్సాహం చూపించారు.

  అంతకు ముందే, విజయనగరంలో ఉన్నప్పటి నుంచే మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి కర్ణాటక సంగీత కచేరీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా సోమేశ్వరరావుకు వచ్చేవి.

  వాగ్గేయ కారక రత్న, హరి నాగభూషణంగారు ఈయన ప్రతిభకు చకితులై ‘వైణిక బాల భాస్కర’ బిరుదము నిచ్చి, ప్రఖ్యాత విద్వాంసులు వెంకట రమణదాసుగారి వలే, సంగమేశ్వర శాస్త్రిగారి వలే శాశ్వత కీర్తి పొందమని ఆశీర్వదించారు.

  1948 లో విజయవాడలో ఆకాశవాణి కేంద్రం తెరిచారు. సోమేశంకి వెంటనే ఉత్తమ శ్రేణి కళాకారుడిగా అవకాశాలు రావటం మొదలయ్యాయి.

  భారతీ తీర్థా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి ‘వీణా కోవిద’ బిరుదు పొందారు.

  ఆంధ్ర సారస్వత పరిషత్ కార్య సభ వారి దగ్గర నుంచి ‘వైణికరత్న’ బిరుదు లభించింది. ఈ సంస్థ దిగ్గజాల వంటి పెద్దలతో స్థాపించబడి అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులకు బిరుదులు అంద జేస్తుంది. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు రాజా వేంకటాద్రి అప్పారావు, శ్రీ నాగపూడి చంద్రశేఖరయ్య వంటి వారు ఇందులో అధ్యక్ష పదవులు అలంకరించారు.

  వీణ వెంకటరమణ దాసు గారు “ఇతడు నా వద్ద రెండు మూడు పర్యాయములు వీణా గానము సల్పి నాడు. అద్భుతముగా వాయించుచున్నాడు. పరిణతికి రాగలడు.ఎట్టి ప్రోత్సాహమునకైనా అర్హుడు” అని చెప్పారుట.

  విజయనగరం పౌరులు వారికి ‘వీణా గాన సుదానిధి’ బిరుదము నిచ్చారు.

  దక్షిణాది దేశంలో అనేక కచేరీలు చేసేరు. ముఖ్యంగా వేణుగాన ధురీణులు పల్లడం సంజీవ రావు గారు, బెంగుళూరు నాగరత్నమ్మగారు వంటి మేటి కళాకారుల సమక్షంలో తిరువాయూరు నందు వాయించి శహభాష్ అనిపించుకున్నారు.

  దేవులపల్లి వారూ, ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారు మొదలగు వారు పరవశించి వారిపై గీతాలు రచించారు.

  1955 లో బాపట్ల పురజనులు, సోమేశం గారికి కాశీ కృష్ణమాచార్యుల వారి సువర్ణ ఘంటా కంకణమును బహుకరించారు.

  అప్పటి నుంచీ ఎన్నో ప్రశంసలు, అంతకు మించిన బిరుదులు… సత్కారాలు, సన్మానాలు. ఆ వెల్లువ ఆగకుడా ప్రవహిస్తూనే ఉంది.

  “మనసును మరపించేదే గానం. ఇది శాస్త్రీయమా కాదా అనే సంశయం లేకుండా ఏ నాదామృతంలో మునిగి తేలుతామో అదే నిజమైన గానం” అంటారు అయ్యగారి వారు.

   ఇంతటి విశాల దృక్పథం ఉన్నవారు కనుకనే జనంలోకి చొచ్చుకొని పోయే అయ్యగారి వారి బాణీ ప్రపంచమంతా ప్రాముఖ్యత సంతరించుకుంది.

                   ………………

 

  “అమ్మా! నాన్నగారు వచ్చారు. మంచినీళ్లు ఇచ్చి వస్తా. బిందె అందటం లేదు. గ్లాసులో పోసి ఇవ్వవా?” నాలుగేళ్ల శారద పరుగు పరుగున వచ్చింది.

   అప్పటికి నాలుగు రోజులయింది. రెండ్రోజుల్లో వస్తానని చెప్పి మద్రాసులో కచేరీకి వెళ్లారు సోమేశ్వరరావు. అప్పట్లో పోస్ట్ కార్డు తప్ప ఏ సౌకర్యాలూ లేవు. అత్యవసరం అయితే టెలిగ్రామ్. ఫలానా అప్పుడు వస్తామంటే ఎదురు చూడటమే.

  “ఇంకో రెండు రోజులు ఉండవలసి వచ్చింది. రెండు కచేరీలు… చెట్టినాడుల ఇళ్లలో ఆహ్వానించారు. పెద్ద వ్యాపారస్థులు. రొక్కం దండిగా ఇచ్చారు. పైగా… ఇది ప్రారంభమే అన్నారు.” సోమేశం తన రాక రెండ్రోజులు ఆలిశ్యం అవటానికి వివరణ ఇచ్చారు.

  జయకుమారి వీణ అందుకుని, లోపల పెట్టి వచ్చింది.

  “చిట్టితల్లి నీళ్లు తెచ్చిందే…” అంటూ గ్లాసు ఎత్తి పట్టుకుని గటగటా తాగేసి, పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కుని, వెనకాలే వచ్చిన కూతుర్ని ఎత్తుకున్నారు.

  ఒక్క సారిగా ఉన్న అలసటంతా మాయం… పాపాయి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసే సరికి.

  “రైలు చాలా లేటుగా బయల్దేరింది. మధ్య మధ్య ఆగుతూ, ఇప్పటికి వచ్చింది. ఏదో ఇంజను సమస్యట. అందుకే ఆలిశ్యమయింది. నానిబాబు ఏడీ”

  “బజ్జున్నాడు. తీసుకొస్తా” శారద తండ్రి మెడ వదిలి, చటుక్కున దిగి పక్క గదిలోకి వెళ్ల బోయింది.

  “ఆగు… లేపకమ్మా. కాళ్లకీ చేతులకీ అడ్డం పడుతూ అల్లరి చేసి ఇప్పుడే పడుక్కున్నాడు.” జయకుమారి సోమేశం పెట్టె తీసి బట్టలు అన్నీ విడదీసింది.

  “అలాగే.” అంటూ శారద అమ్మకి సాయం చెయ్యటానికి తయారయింది.

  “కూతురుంటే కుంచం అంత సాయం అని ఊరికే అన్నారా? మన బంగారం చూడు… అన్నం వడ్డించేయి. ఐదు నిముషాల్లో వస్తా.” సోమేశం మురిసి పోతూ తువ్వాలు తీసుకుని స్నానాల గదికి వెళ్లాడు.

  చిన్నారి శారద మొయ్యలేక మొయ్యలేక మోస్తూ పీట తీసుకు వచ్చి వేసి కంచం పెట్టింది.

  “నీళ్ల గ్లాసు అప్పుడే పెట్టకు. తమ్ముడు లేచే వేళయింది. తప్పటడుగులు వేస్తూ అంతా తన్నేస్తాడు.” జయమ్మ మాట పూర్తవకుండానే వచ్చేశాడు శ్యాంసుందర్.

   సరిగ్గా అప్పుడే పట్టుపంచె కట్టుకుని వచ్చిన సోమేశం, చేతులందించిన కొడుకుని ఎత్తుకుని, వళ్లో కూర్చో పెట్టుకుని పీట మీద కూర్చున్నాడు.

  “నాన్నా నాకు సరళీ స్వరాలు కంఠతా వచ్చేశాయి, తాళంతో సహా. శ్రుతి కూడా తప్పలేదంది అమ్మ” శారద మాటలకి నవ్వుతూ చూసాడు.

  “నాకూ కూదా…” అంటూ చేత్తో తాళం వేసి మరీ చూపించాడు శ్యాంసుందర్.

  అలా పిల్లలిద్దరితో ఆనందిస్తూ భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నారు సోమేశం, భార్య.

 

  “మనం ఇక్కడ స్థిర పడ్డట్లే. నాకు శిష్యులు కూడా బాగానే దొరికారు. నీ సంగతి కూడా అందరికీ చెప్దాము. నువ్వు కూడా పాఠాలు మొదలు పెట్టవచ్చు.”

  జయకుమారి ఈనెలు తీసి, సున్నం రాసిన తమలపాకుల మీద వక్కపొడి వేసి ఇస్తే నోట్లో పెట్టుకుంటూ అన్నాడు సోమేశం.

  “నేను కూడా నీ దగ్గర నేర్చుకుంటానమ్మా.” శారద అమ్మ కుచ్చిళ్లలో మొహం దాచుకుంది. శ్యాంసుందర్ అక్క ఏంచేస్తే అదే తనూ…

  “ముందు కనీసం మూడు వీణలు తీసుకోవాలి. అప్పుడు ఒకే సారి ముగ్గురికి నేర్పించవచ్చు. ఒకర్నిచూసి ఒకరు వస్తారు శిష్యులు.” జయకుమారి సలహా…

  “నిజమే! ఆ ప్రయత్నం మీద ఉంటాను. హాల్లో కింద మంచి చాపలు వేసి పెట్టాలి. పైన దండెం లాగ గట్టి కర్ర కడ్తే వీణలు వేళాడదీయచ్చు. వచ్చిన వారికి ఆకర్షణీయంగా చూడటానికి కూడా బాగుంటుంది. అంతే కాదు మన చిన్ని కృష్ణుడు వాటి జోలికి వెళ్లకుండా ఉంటాడు.”

  నాన్న మాటలు విని ఒళ్లో వచ్చి కూర్చుని ఏదో చెప్పబోయాడు శ్యాంసుందర్.

  “చూడు తన గురించే మాట్లాడు కుంటున్నామని తెలుసు… వచ్చేశాడు.”

  “వేలెడు లేడు. బారెడు గ్రహణశక్తి.”

   బుర్ర పక్కకి వంచి చిరునవ్వులు చిందించాడు శ్యామసుందరుడు అమ్మ పలుకులకి.

  “మనం ఏమేం కొనాలో ఒక పట్టిక రాసుకుందాము. నెమ్మదిగా సమకూర్చుకోవచ్చు. మద్రాసులో కచేరీలకి బాగానే డబ్బు వచ్చింది. వెంకటేశ్వర్లు గారు కూడా కొంత ఇచ్చారు, దారి ఖర్చులకని. అందులో కొంత మిగిలింది. రేపే వెళ్లి బాంక్ అకౌంటు తెరుస్తాను. నెల నెలా కొంత మిగిల్చి దాచు కోవాలి, అవసరానికి ఆదుకోవటానికి…” తల్లి, తండ్రీ మాట్లాడుకుంటుంటే చప్పుడు చేయకుండా నాన్న ఒళ్లో నుంచి జారి, వంటింట్లోకి వెళ్లాడు శ్యామసుందరం.

  శారద తన బొమ్మల పెట్టి పట్టుకొచ్చి పక్కన కూర్చుని నెమ్మదిగా పేరుస్తోంది.

  “పిల్లలకి బళ్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి ఇంక. ఇంట్లోకి ఇంకొక పాపాయి రాబోతుందని అనుమానంగా ఉంది.”

  భార్య మాటలు వింటూ నవ్వుతూ చూశాడు సోమేశం అభినందిస్తున్నట్లు.

  “బాగానే ఉంది కానీ, పిల్లలు ఎక్కువైతే అన్నీ అమర్చటం కష్టం కదా. ఎన్నో అవసరాలుంటాయి. పనులు ఎక్కువవుతాయి. ఖర్చులు పెరుగుతాయి.”

  “ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వైణికులు తయారవుతారు.” సోమేశం ధీమాగా అన్నాడు.

  “అమ్మా ఆశ. మనం అనుకోగానే అయిపోతారా ఏమిటి?”

  “చూస్తూ ఉండు నా మాట నిజమవుతుందో లేదో…” సోమేశం మాట పూర్తవకుండానే, వంటింట్లో నుంచి గిన్నె దొర్లుతున్నట్లు చప్పుడూ, పెద్దగా ఏడుపూ వినిపించాయి.

  తండ్రీ కూతురూ పరుగెత్తారు.

  జయకుమారి ఆయాసపడుతూ వంటింట్లోకి వెళ్లింది.

 

  “పాలగిన్నె దొర్లించేశాడు కాబోయే వైణికుడు. ఇప్పుడిదంతా సర్దుకునే సరికి నా పని అవుతుంది.” ఒక్క సారిగా ఆపుకోలేని నీరసం వచ్చింది జయకుమారికి.

  అసలే వేవిళ్లు ఏది తిందామన్నా సయించటం లేదు.

  “నేను సహాయం చేస్తాను. ఇద్దరం కలిసి సర్దేద్దాము.” సోమేశ్వరరావు గిన్నె తీసే లోపుగా స్వరం పెంచాడు చిన్నారి గాయకుడు.

  “ముందు వాడిని తీసుకెళ్లండి. కాస్త బుర్ర పనిచేస్తుంది నాకు, ప్రశాంతంగా ఉంటే.”

  శారద బొమ్మలు చూపిస్తూ శ్యామసుందరంని వరండాలోకి తీసుకెళ్లింది. ఎప్పుడూ బొమ్మలు ముట్టుకోనివ్వని అక్క బొమ్మ ఇస్తానంటే వదుల్తాడా…

  అక్క వెనుకే పరుగెత్తాడు, బుడిబుడి అడుగులు టపటపా వేస్తూ. జయమ్మ, సోమేశం కలిసి అంతా సర్దేశారు.

  వంటిల్లంతా ఒకసారి పరికించాడు సోమేశం. మరీ చిన్నది కాదు కానీ, ఎక్కడా గిన్నెలు పెట్టుకోవడానికి సదుపాయం లేదు.

  ఉన్న ఒక అలమారులో డబ్బాల్లో, సీసాల్లో సరుకులు. ఒక మూల నీళ్లు పోవడానికి తూము.

  తూముకి దగ్గర్లోనే రెండు కుంపట్లు, ఒక కిరసనాయిలు స్టౌ. గిన్నెలు, పళ్లాలు నేల మీదే ఒక పక్కగా బోర్లించి ఉన్నాయి.

   అన్నీ కింద పరుచుకుని ఉన్నాయి. ఇంకొక మూల బియ్యం డ్రమ్ము. నేల కడిగాక పొడి బట్ట పెట్టి ఎంత తుడిచినా సరిగ్గా ఆరదు… కాళ్లకి తడి అంటుతూ ఉంది.

  గాలి సరిగ్గా వచ్చే కిటికీ లేదు. అప్పట్లో గాలికి పొయ్యి సరిగ్గా మండదని కిటికీ పెట్టే వారు కాదు వంటింట్లో!

  సోమేశం ఆలోచనలో పడ్డాడు. ఏదో చెయ్యాలి… లాభం లేదు.   మద్రాసులో తను చూసిన ఒకరి ఇల్లు గుర్తుకు వచ్చింది. ఇల్లంతా తిప్పి చూపించారు అతిథులకి వాళ్లు. వంటింట్లో ఎక్కడా కింద ఏమీ కనిపించ కుండా అమర్చారు..

  మరునాడే వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి వంటిల్లు మార్పించాలని నిశ్చయించు కున్నాడు సోమేశం.

 ***

 

  గత రెండు సంవత్సరాలలో వెంకటేశ్వర్లు గారికి బాగా అలవాటయ్యారు సోమేశ్వరరావు కుటుంబం.

  ముఖ్యంగా జయకుమారి కలుపుగోలుతనం, చురుకుగా ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం, వీణ సాధన… వచ్చే పోయే శిష్యులు… ఇల్లంతా సందడిగా ఉంది.

  వెంకటేశ్వర్లు గారి భార్యకు కూడా వీణ నేర్చుకుందామని అభిలాష కలిగింది. కానీ అంత పెద్ద ఇల్లు, సంసారం నిభాయించుకునే సరికి అలసట వచ్చేస్తోంది. తమ బంధువులందరికీ, మిత్రులకీ అయ్యగారి దంపతుల గురించి చెప్పారు. నలుగురు పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటున్నారు.

  సోమేశం చెప్పిందంతా విని, వంటింట్లోకి వచ్చి చూశారు వెంకటేశ్వర్లుగారు.

  “పదిహేను, ఇరవై రోజులు మీరు ఎక్కడైనా కాలక్షేపం చెయ్యగలరా?”

  “మా ఊరు వెళ్లి, అందరినీ చూడాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా మా తల్లిదండ్రులని చూసినట్లు ఉంటుంది. లోగిస, విజయనగరం వెళ్లి వస్తామండీ. ఇటూ, అటూ కన్నవారు సంతోషిస్తారు.” సోమేశం మొహమాట పడుతూనే అన్నాడు.

  వల్లూరి వారికి అనుకోని ఖర్చు…

  “మంచి ఆలోచన. రెండు రోజుల్లో బయలు దేరండి. టికెట్లు తెప్పిస్తాను మీ ఇద్దరికీ.” సోమేశంకి చెప్తూనే, మిగిలిన రెండు గదులూ పరికిస్తూ మేస్త్రీకి కబురు పంపారు.

  వల్లూరి వెంకటేశ్వర్లుగారికి ఉన్న వ్యాపారాలలో భూములు అమ్మటం, కొనటం కూడా ముఖ్యమైనవి. అలాగే అనేక భవనాలు కూడా కట్టించారు.

  వారు మద్రాసులో, హైద్రాబాదులో… ఇంకా అనేక ఊర్లలో వ్యాపారాలు చేస్తారు.

  సోమేశం వంటింటి పని వారికి ఆవగింజంత.

  “నిశ్చింతగా వెళ్లి రండి. తిరిగి వచ్చేసరికి మీకోసం మరింత సదుపాయమైన ఇంటి వాటా స్వాగతం చెప్తుంది.” సోమేశం వెళ్లొస్తామని చెప్పటానికి వెళ్తే నవ్వుతూ అన్నారు.

 

  గజపతి నగరంలో బస్సు దిగి, జట్కా ఎక్కగానే ఒక్క సారి గట్టిగా, కడుపు నిండా గాలి పీల్చుకున్నారు సోమేశం దంపతులు.

  “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి…” అన్నాడు సోమేశం.

  “అర్ధం అయీ అవనట్లు ఉంది. కొంచెం వివరిస్తారా?” జయమ్మ అడిగింది.

  బళ్లో మూడో క్లాసు తరువాత చదువుకోలేదు జయకుమారి. తెలుగు బాగానే చదువుతుంది కానీ అంతకు మించి సాహిత్యంతో పరిచయం లేదు.

  కీర్తనలు చెప్పేటప్పుడు అర్థం, భావం వివరించి నేర్పిస్తాడు సోమేశం. అందుకే ప్రతీదీ తెలుసు కోవాలనే కుతూహలం మెండుగా ఉంది జయకుమారికి.

  సోమేశం చెప్పటం మొదలు పెట్టాడు. “ఇది రామాయణంలోని శ్లోకంలో భాగం.

 

 మూల శ్లోకం: అపి స్వర్ణమయీ లంకా- న మే లక్ష్మణ రోచతే

            జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.

 

   రామ రావణ యుద్ధం అయి, విభీషణునికి పట్టాభి షేకం జరిగాక, అతను లంక వైభవం అంతా చూపిస్తాడు రాముడికి. కళ్లు మిరిమిట్లు కొలిపే ఆ సంపద చూసి లక్ష్మణునితో అంటాడు రాముడు… “లక్ష్మణా! లంకా నగరం స్వర్ణమయమై శోభించినా, నన్ను ఆకర్షించుట లేదు. అది మన మాతృభూమి కాదు. జనని, జన్మభూమి స్వర్గము కంటే ప్రియమైనవి కదా!”

  సోమేశం కూడా ఐదో క్లాసు వరకే చదివినా, విజయనగరంలో తెలుగు, సంస్కృతం నేర్చుకున్నాడు. కళాశాలలో క్లాసులయి పోయాక దాసుగారి సన్నిహితులొకరు నేర్పించారు. పరీక్షలకి ఏవీ కట్టలేదు కానీ బాగా చదవడం, అర్ధం చేసుకోవడం వచ్చింది.

  సంగీతం తరువాత సాహిత్యం అంటే చాలా ఆసక్తి సోమేశానికి. అది కూడా అమ్మమ్మ ధర్మమే.

  సంగీతం నేర్చుకునేటప్పడు, పాటలలో ఉన్న సాహిత్యం బాగా తెలియాల్సి ఉంటుంది. అప్పుడే భావం బాగా పలికించ గలుగుతారు. పైగా తను సంస్కృత, వేద పండితుల కుటుంబంలో జన్మించాడు.

  “నిజమే. ఇక్కడ నేను ఉన్నది నాకు ఎనిమిదేళ్లు వచ్చే వరకూ మాత్రమే. అయినా… అడుగు పెడుతుండగానే ఏదో హాయి అయిన భావం కలిగింది. ఈ గాలి, ఈ నేల ప్రత్యేకమైనవిగా అనిపిస్తోంది.” గట్టిగా గాలి పీల్చి అంది జయకుమారి.

  శారద తల తిప్పి అమ్మకేసి తిరిగి వింటోంది. నాన్నగారు చెప్పింది అర్ధమవక పోయినా అమ్మ ఏమంటోందో తెలుస్తోంది.

  జట్కా ఎగరేసి తీసుకు పోతున్నా, శ్యామసుందరం వెచ్చగా అమ్మ ఒళో నిద్ర పోతున్నాడు.

 

  లోగిసలో ఇంటి తలుపు కొట్టగానే తలుపు తీసిన సూరమ్మ మొహం, ఆనందంతో విప్పారింది.

  మూడేళ్ల క్రితం లక్ష్మమ్మ పోయాక… అంత పనీ తనే చేసుకోవలసి రావటంతో, కాస్త స్తబ్దత వదిలింది ఆవిడకి. కొద్దిగా తనంత తను ఆలోచించి పనులు చేసుకోగలుగు తోోంది.

  పెద్ద కొడుకు, కోడలు… ఇద్దరు మనవలతో వాళ్ల దగ్గరే ఉండటంతో కొంత బాధ్యత తెలిసి వచ్చింది.

  అవధాని గారు వేద సభలకి వెళ్లడం తగ్గింది. తీరిక దొరికి, భార్యకి భారత భాగవతాది పురాణాలను, చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్ప సాగారు. మనవలు కూడా వింటుంటారు.

  మిగిలిన పిల్లలందరూ తలొకచోట స్థిర పడ్డారు. ప్రతీ సంవత్సరం కలవటానికి ఆర్ధిక నవరులు అంత గొప్పగా లేవు. ఒకో సంవత్సరం ఒక్కొక్కళ్లు వంతు ప్రకారం వస్తుంటారు. ఎవరెవరో బాగానే గుర్తు పడుతుంది సూరమ్మ.

  “ఎవరదీ?” శబ్దం విని రామ్మూర్తి అవధాని లోపల్నుంచి గట్టిగా పిలిచాడు.

  “సోంబాబు వచ్చాడు…” సూరమ్మ దగ్గరగా వెళ్లి చెప్పింది.

  “మేమే నాన్నగారూ! మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చాము.” వీధి వాకిలి వద్దే కాళ్లు చేతులు కడుక్కుని, తండ్రికి పాదాలంటి నమస్కరించాడు సోమేశం.

  “నువ్వా సోంబాబూ? అమ్మాయి, పిల్లలూ వచ్చారా?”

  “వచ్చాం మామయ్యగారూ!” జయకుమారి మామగారికి నమస్కరించి, పిల్లలిద్దరినీ ఆయన చేతులకి అందించింది.

  ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని, తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినట్లు తడిమారు అవధానిగారు.

  “చాలా సంతోషం తల్లీ. స్నానాలు చేసి రండి. ఎప్పుడనగా తిన్నారో ఏమో… భోజనం చేద్దురు గాని.”

  తల మీద, కళ్లల్లోను రైల్లోంచి పడిన బొగ్గు నుసి చికాకు పెడుతుంటే నూతి దగ్గరకు తీసుకు వెళ్లి స్నానాలు చేయించింది జయమ్మ.

  కాసేపు పిల్లలిద్దరూ నీళ్లతో ఆడుకున్నాక, తుడిచి వేరే బట్టలు మార్చి, సోమేశాన్ని చూస్తూ ఉండమని, తను వాడిన బట్టలు ఉతికి, ఆరేసి స్నానానికి వెళ్లింది.

  “కొంచెం కనిపెట్టి చూడండి. ఎలాగో ఏమార్చి ఏదో కొంటె పని చేస్తాడు శ్యామసుందరుడు.”

  “నేను చూస్తుంటా లేమ్మా, నాన్నగారికి తోడుగా.” శారద వాగ్దానం చేసేసింది.

  సోమేశం ఇద్దరినీ చెరో పక్కనా నడిపించుకుంటూ లోపలికి వెళ్లి పెద్దన్నగారి దగ్గర కూర్చుని క్షేమసమాచారాలు కనుక్కో సాగాడు.

  “మామూలుగా నడిచి పోతోంది రా సోంబాబూ! అలవాటైన చోటు కదా, అమ్మా నాన్నలకి ఏ ఇబ్బందీ లేదు.”

 

  పది రోజులు తండ్రి గారికి తోడుగా ఉండి, అవసరానికి ఉంటుందని అన్నగారికి కాస్త డబ్బు ఇచ్చి విజయనగరం మామగారి ఇంటికి వచ్చారు సోమేశం కుటుంబం.

  జయకుమారి తండ్రి గారు, పప్పు చంద్రశేఖర శాస్త్రిగారు సంస్కృత పండితులు. ఇంట్లోనే, ప్రైవేటుగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు నేర్పిస్తారు.

  సోమేశం కళాశాలకు వెళ్లి, గురువులనీ, స్నేహితులనీ పలుకరించి తన కళాశాలలో విద్యార్థుల, గురువుల ఎదురుగా హాల్లో కచేరీ చేశాడు.

  శేషగిరి మామని కూడా పలకరించి వచ్చాడు. దాసుగారి ఇంట్లో ఎవరూ లేరు. ఒకసారి ఆ వీధి అంతా తిరిగి వచ్చాడు.

  తను ఎప్పుడూ వెళ్లే గ్రామాల వాళ్లని పలుకరించి రెండు గ్రామాల్లో వాయించాడు.

  మిత్రుడు వాసా కృష్ణమూర్తితో కలిసి వెళ్లి, రెండు పెద్దవీ, రెండు చిన్నవీ వీణలు పురమాయించి బాపట్ల ప్రయాణమయ్యారు సోమేశం దంపతులు.

  అక్కడ ఉన్న నాలుగు రోజులు మిత్రులిద్దరూ వీణ సాధన చేసుకున్నారు.

  స్కూలు ఫైనలు చదువుతున్న జయకుమారి తమ్ముడిని కూడా తమతో తీసుకు వచ్చారు, సెలవులే కదా అని.

  అతనే… బావగారి వద్ద వీణాభ్యాసం చేస్తూ గురువుగారితో సరి సమానంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించు కొన బోతున్న పప్పు సోమేశ్వరరావు.

 

  ఇంటికి వచ్చి తలుపు తీయగానే, ఇది తమ ఇల్లేనా అని సందేహం వచ్చింది అందరికీ. చిన్న చిన్న మరమ్మతులు చేసి, వెల్లలు వేయించి తీర్చి దిద్దారు.

  గుమ్మాలకి, తలుపులకీ రంగులు వేశారు. గడపలకి కూడా పచ్చరంగు వేసి, ఎరుపు, తెలుపు చుక్కలు పెట్టారు. ఎంతో అందమొచ్చింది.

  ఇంక వంటిల్లయితే చెప్పక్కర్లేదు. ఎర్ర రంగు వేసిన సిమెంటు నేల మెరిసి పోతోంది. పెద్ద కిటికీ లోనుంచి వెలుతురు అంతటా పరచుకుంది.

  నేల మీద ఏ వస్తువు పెట్టనక్కర లేకుండా గోడలకి అరలు. రెండు ప్రక్కలనుంచి నీళ్లు పోయేటట్టు తూములు… వాటికి పైన తోమిన గిన్నెలు బోర్లించు కునేటట్లు చిల్లులు ఉన్న, సిమెంటు తో కట్టిన అరలు.

  వంటిల్లు చూడగానే అలా నిలబడి పోయింది జయకుమారి. వంట చేసుకోవడానికి కూడా, కుంపట్లు పెట్టుకునేలాగ పెద్ద అరుగు. తూముకి దగ్గరగా పాలదాలి కట్టారు. పక్కనే పొయ్యి… పెడ పొయ్యి కూడా ఉంది.

  “ఇది వంటిల్లా? ఎక్కడా ఇలా చూడలేదు. నిలబడి చెయ్యాలా వంట… కాళ్లు నొప్పి పుట్టవూ?” ఆశ్చర్యంగా అడిగింది.

  “కావాలంటే స్టూలు వేసుకుని కూర్చో వచ్చు. అయినా అలవాటై పోతుంది. నొప్పి ఉండదు. వంట త్వరగా అయి పోతుంది. పాలదాలికి, కట్టెల పొయ్యికి ఆ పక్కన సదుపాయం ఉంది, చూశావు కదా. విశాలంగా మన బుల్లి కళాకారులకి నాట్యం చెయ్యటానికి అనువుగా ఉంటుంది. కాకపోతే దరువులు వెయ్యటానికి పళ్లాలు, గిన్నెలు అందుబాటులో ఉండవు.” నవ్వుతూ ఆన్నాడు సోమేశం.

  అంతలో చప్పట్లు కొడుతూ ప్రవేశించారు శారద, శ్యామసుందరుని ఎత్తుకుని మామయ్య పప్పు సోమేశ్వర్రావు.

  “చాలా బాగుందక్కా! కొన్ని ప్రకటనల్లో చూస్తుంటాను, ఇటువంటి వంటిల్లు. సర్దు కోవడం చాలా సులువు.”

  “సరే సరే… ముందు మధ్య గదిలో పేర్చిన సామాన్లు సర్దుదాం. ఆ మీద సరుకులు తెచ్చుకుని వంట మొదలెట్టాలి.” కొత్త వంటింట్లో ఎలా చేసుకోవాలో అని బెదురుతూనే జయమ్మ నడుం బిగించింది.

  “ఈ పూటకి ఇంటి వారు పంపుతానన్నారు. మనం స్నానాలవీ చేసి, లిస్టు తయారు చేసుకుంటే బజారు పని చూసుకుందాం.” సోమేశం వీణ తీసి తుడవ సాగాడు.

 

  అనుకున్నదాని కంటే త్వరగానే కొత్త పద్ధతిలో వంట చేయటం అలవాటై పోయింది జయకుమారికి.

  ప్రతీ దానికీ కూర్చుని లేవ వలసిన పని తప్పింది. కత్తిపీట ముందు వేసుకుని కూరలు తరగడానికి మాత్రం కూర్చోవాలి.

  మొదట్లో కొంచెం కాళ్లు నొప్పి పుట్టినా… నెమ్మదిగా అలవాటయి సర్దుకుంది.

  కొత్త వంటింట్లో పని మొదలుపెట్టి నెల రోజులయింది. చకచకా తిరుగుతూ చేసేసుకుంటోంది.

  ఆ రోజు పొద్దున్నే మరింత హడావుడిగా తిరుగుతూ పని చేసుకుంటోంది జయమ్మ. మరునాడు తమ్ముడు విజయనగరం వెళ్తున్నాడు. కాస్త దిబ్బరొట్టె కట్టి ఇద్దామని పప్పు నానబోసింది… అదొకటి రుబ్బాలి.

  అయ్యగారి సోమేశం కూడా విజయనగరం చుట్టుప్రక్కల నాలుగు ఊర్లలో కచేరీలకి రమ్మంటే బయల్దేరుతున్నాడు.

  రెండు కుంపట్లమీదా అన్నం, పప్పు పడేసింది. వెతుకుతే కూరలేం కనిపించలేదు. దొడ్లో ఏమన్నా ఉన్నాయేమో చూడాలి అనుకుంటూ…

  స్టౌ వెలిగించబోతే కిరొసిన్ అయిపోయినట్లుంది, ఎర్రగా వస్తోంది మంట.

  హాల్లోంచి వీణా నాదం… ఆ ఇంట్లో ఎప్పుడూ వీణ నేపథ్య సంగీతం ఉంటుంది, సోమేశం ఇంట్లో ఉంటే. ఇప్పడు అతను బైటికెళ్లాడు కానీ పప్పు సోమేశం ఉన్నాడు కదా!

  తనకు కూడా వీణ వాయించుకోవాలనిపిస్తోంది. పిల్లలతో… సవా లక్ష ఇంటి పనులతో ఎలా కుదురుతుంది? మధ్యాన్నం ఐదు నిముషాలు నడుం వాలుద్దామంటే కుదరట్లేదు.

  ఒక్క క్షణం ఆడ వాళ్ల పని అంతే కదా అనిపించింది. ఏ పని చెయ్యాలన్నా బోలెడన్ని అడ్డంకులు.

  పొరపాటున సమయం చిక్కి వీణ ముందుకు పెట్టుకోగానే శ్యాంబాబు వచ్చేస్తాడు… “నేను కూదా వాయిత్తా… నీ… పా” అని గట్టిగా పాడుతూ.

  ఎందుకో… ఒక్కొక్క సారి మహా నిర్వేదం వచ్చేస్తుంది జయకుమారికి… తన కనే కాదు, ప్రతిభ ఉన్న ఎవరికైనా, తమకి ఇష్టమైన పని చెయ్యడానికి వీలు కాకపోతే అంతే… విరక్తి వచ్చేస్తుంది.

  కాసేపు ఎక్కడన్నా కూర్చుంటే బాగుండును…

  పూజ గదిలో కూర్చుంటే? వెంకటేశ్వర్లుగారు వంటిల్లు బాగు చేసేటప్పుడు, వంటింటికి వెళ్లే తోవలో ఒక మూల చిన్న పూజ గది ఏర్పాటు చేశారు.

  కుంపట్లలో అన్నం, పప్పు ఇప్పుడే ఉడుకు పట్టాయి.

  దేవుడి దీపం పొద్దున్నేనే పెట్టేసింది. చీర సర్దుకుని వెళ్లి, దేముడి ముందు కూర్చుంది.

  కళ్లు మూసుకుని దృష్టి అంతా ఆజ్ఞా చక్రం మీద నిలిపి, ధ్యానంలోకి వెళ్లడానికి ప్రయత్నించ సాగింది.

  ముందరే చెప్పుకుంది… సరిగ్గా పది నిముషాలు. అంతే.

  వెంటనే ధ్యానం లోకి వెళ్లిపోయింది. మధ్యలో శారద వచ్చి చూసింది. మామయ్య దగ్గరకి వెళ్లి, చూపుడు వేలు మూతి మీద పెట్టి ‘హుష్’ అంది.

  వీణ కింద పెట్టి, చిన్న సోమేశం లేచి వెళ్లాడు. అక్కని చూసి, ఏం ఫరవాలేదన్నట్లు తలూపి, మళ్లీ వీణ తీశాడు. సన్నగా ఆనందభైరవి రాగం వాయించటం మొదలు పెట్టాడు.

  ఆనంద భైరవి, రీతిగౌళ మనసుని సాంత్వన పరుస్తాయని అంటారు. అందులో నెమ్మదిగా, సున్నితంగా వాయిస్తే నిద్ర కూడా వచ్చేస్తుంది.

  జయకుమారి సరిగ్గా పది నిముషాలకి కళ్లు తెరిచింది.

  నిజమే… ఎవరికి నిర్దేశించ బడిన పనిని వాళ్లు చెయ్యాలి.

  ఇంటి ఇల్లాలికి ఉన్న బాధ్యత ప్రపంచంలో ఎవరికీ ఉండదు. శరీరం, మనసూ ఎప్పుడూ చురుకుగా ఉంచుకోవలసిందే.

  తను నిర్వేదంలోకి వెళ్తే కాబోయే, సంగీత కళాకారుల్ని, వైణికుల్ని ఎవరు తయారు చేస్తారు? నవ్వుకుంటూ లేచి, కుంపట్లలో బొగ్గులు తీసేసి, వట్టి కుంపట్ల మీద గిన్నెలు పెట్టి సిబ్బెల మీద రెండేసి నిప్పు కణికలు పెట్టింది.

  కూర స్టౌ మీద చేయచ్చులే అనుకుంటూ, వీణా నాదం వింటూ, కూరల బుట్ట తీసింది.

 

  చిన్న సోమేశం బావగారిలాగే ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోనీయడు. గత నెల రోజులుగా, నాలుగు పెద్ద వర్ణాలు, ఎనిమిది కృతులు నేర్చుకుని, ఆ కృతుల రాగాలు, స్వరకల్పనలు కూడా సాధన చేశాడు.

  చిన్న సోమేశానికి మనోధర్మం మీద చాలా అభిరుచి. ఎప్పటికైనా రాగం, తానం, పల్లవి, స్వరకల్పనల లో మేటి అనిపించు కోవాలనేదే తన ఆశయం.

  ఉన్నట్లుండి నాదం ఆగింది. సన్నగా సరిగమలు వినిపిస్తున్నాయి. పక్కనే వచ్చీరాని మాటలతో తోడు స్వరం. ఆ స్వరాలకి సరిపోయేట్లు వీణ మీద కూడా స్వరాలు…

  జయకుమారి మందహాసంతో పెరట్లోకి వెళ్లింది. వారసులు అందుకుంటున్నారు అనుకుంటూ.

  ముద్దు ముద్దుగా శారద తాళం వేస్తూ పూర్తిగా సరళీ స్వరాలు పాడుతుంటే మామయ్య వీణ మీద సహకారం… చిన్ని విద్వాంసుడు నీ… పా అంటూ తోడు. ఆ రెండు అక్షరాలే పలకటం వచ్చు మరి. కానీ తాళం మాత్రం తప్పకుండా వేసేస్తాడు.

  జయకుమారి, దొండతీగకి ఉన్న లేత దొండకాయలు వెతుకుతూ తెంపుతోంది. ఒక్కో కాయ ఒక్కొక్క ఆకుని కవచంలా కప్పుకుని దాక్కుంటున్నాయి.

  చెట్లు కానీ, పశు పక్ష్యాదులు కానీ… ఎవరి రక్షణ వారిది అనుకుంటూ సున్నితంగా విడదీసి, తెంపుతుంటే కొట్టింది… గుప్పు మని కిరసనాయిలు వాసన.

  ఎక్కడి నుంచబ్బా? అటూ ఇటూ చూసింది. వంటింట్లో తూములో నుంచి ప్రవాహం… రెండంగల్లో వంటింట్లోకి వెళ్లింది.

  అంతకు ముందే స్టౌలో కిరసనాయిలు పోసి, స్టౌ గట్టు పైన పెట్టింది. కానీ, డబ్బా కిందే ఉండిపోయింది. మూత కూడా తిన్నగా పట్టినట్లు లేదు… ఎప్పుడు వచ్చాడో చిన్ని శ్యామసుందరుడు, మామయ్య కళ్లు కప్పేసి… వంటింట్లో ప్రవేశించాడు.

  కిరసనాయిలు డబ్బా అడ్డంగా పడేసి, దాని మీద చిన్న కర్ర పుల్లతో ఆది తాళం వాయించేస్తున్నాడు… నీ, పా అంటూ. అమ్మని చూసి చిరునవ్వులు చిందిస్తున్నాడు. బట్టల మీద, కాళ్ల మీద కిరసనాయిలు…

  రెండు మూడు నెలలు రావలసిన కిరసనాయిలు నేలపాలు. నీరసం, కోపం, ఆవేశం చుట్టు ముట్టాయి జయకుమారిని. గోడకానుకుని నిలుచుండి పోయింది.

  అప్పుడప్పుడే కుదుటపడుతున్న గుండె మళ్లీ వేగంగా కొట్టుకోడం మొదలెట్టింది. నుదురంతా చెమట. అక్కడే… గోడ నుంచి కిందికి జారి కూలబడింది.

  ఎవరిని ఏమని అనగలదు? జాగ్రత్తగా చూసుకోరా అంటే వదిలేసిన తమ్ముడినా? మేనల్లుడి తెలివి తేటల గురించి సరిగ్గా హెచ్చరించక పోవటం తన తప్పే…

  శారదకి తెలుసు కదా తమ్ముడేం చేస్తున్నాడో తను మాత్రం చూసుకోవద్దూ?

  కానీ… పాపం అది కూడా చిన్న పిల్లే. అక్కడికీ అమ్మ వెనకే తిరుగుతూ సహాయం చేస్తూనే ఉంటుంది.

  కిరసనాయిలు వాసనకి చిన్న సోమేశం, శారద రానే వచ్చారు.

  పరిస్థితి చూశాడు చిన్న సోమేశం. అక్కని పట్టుకుని లేపి హాల్లో మంచం మీద కూర్చో పెట్టాడు. మంచి నీళ్లు తాగించి లోపలికి వచ్చి వంట సంగతి చూశాడు.

  రెండూ ఉడికినట్లే ఉన్నాయి. తీసి కింద పెట్టి, కుంపట్ల మీద నీళ్లు చల్లి పక్కకి జరిపేశాడు. అమ్మయ్య…ఆవకాయన్నా వేసుకుని తినచ్చు.

  శారద, తమ్ముడిని పెరట్లోకి తీసుకెళ్లి పోయింది. మామయ్య వాళ్ల వెనకాలే వెళ్లి, కిరసనాయిలు వాసన పోయేలాగ సబ్బుతో పిల్లవాడి ఒళ్లు కడిగి, తుడిచి పొడి లాగూ చొక్కా వేశాడు..

  ఆ తరువాత ఏం చెయ్యాలో ఇద్దరికీ తెలియలేదు. జయకుమారి నెమ్మదిగా లేచి పరిస్థితి తన అదుపులోకి తీసుకుంది. పిల్లలిద్దరినీ చూస్తే జాలి వేసింది మళ్లీ. బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు శ్యామసుందరం.

  అమ్మకి కోపం తెప్పించానని తెలుసు చిన్ని బుర్రకి. అక్క గౌను పట్టుకుని దీక్షగా చూస్తున్నాడు.

(ఇంకా ఉంది)



No comments:

Post a Comment

Pages