కచ్ఛపి నాదం - 7
మంథా భానుమతి
“అక్కా పోనీ నాతో వస్తావా? ఇద్దరు పిల్లలతో చేసుకోవటం
కష్టంగా ఉంది కదా!”
“లేదురా! మళ్లీ మీ బావగారికి ఇబ్బంది. ఇంట్లో ఉన్నప్పుడైనా
వేళకి తినగలుగుతారు. యెవరైనా పనిచేసే పిల్ల దొరుకుతుందేమో పిన్నిగారిని అడగమంటాను.”
నెమ్మదిగా లేచి, స్టౌ వెలిగించి చారు పెట్టింది.
“సరే, నీ ఇష్టం. పరీక్షలైపోయాక మళ్లీ వస్తాను. ఇద్దరం
కలిసి సాధన కూడా చేసుకుందాం.” అక్కగారి పరిస్థితి గ్రహించాడు.
కంచాలు, గ్లాసులు పెట్టింది శారద.
సోమేశం మేనల్లుడిని పక్కన కూర్చో పెట్టుకుని ఖాళీ
గ్లాసు చెంచా ఇచ్చాడు, వాయించుకోమని
“పప్పు వేసి, చారు కలిపి పిల్లలకి అన్నాలు పెట్టి,
కాసేపు అలా గుడికి వెళ్లొద్దాం. ఈ లోపు బావ వస్తే భోజనం చేసి, కొత్తరాగం ఏదైనా నేర్చుకుందాం.”
నవ్వుతూ అంటున్న అక్క మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు
చిన్న సోమేశం.
“ఏం ఎనర్జీ అక్కా… ఇంత పని చేస్తూ ఎంత హుషారుగా
ఉంటావో?”
“ఆ శక్తి ఆడవాళ్లకి ఆ భగవంతుడు ఇస్తాడురా!”
నిజమే… ఆరాధనగా చూస్తూ, ఉండిపోయాడు అక్కని.
సాయంకాలం తన సామాన్లన్నీ పెట్టెలో సర్దుకుంటున్నాడు
చిన్న సోమేశం.
“రెండు మూడు రోజులు ఇక్కడ ఉండ గలుగుతావా? క్లాసులు
పోయినా చదువుకోగలుగుతావా?” సోమేశం దగ్గరగా వచ్చి అడిగాడు బావమరిదిని.
ఏమేం క్లాసులున్నాయో కాసేపు మనసులోనే లెక్కలు వేసుకున్నాడు…
“చదువుకో గలుగుతాను బావా ఇబ్బందేం లేదు. అటెండెన్సు
బాగానే ఉంది. ఏం పని?”
“బెజవాడ ఆలిండియా రేడియోలో నా ప్రోగ్రాం ఉంది. నువ్వు
కూడా వస్తే అక్కడ అందరికీ పరిచయం చేస్తాను. తరువాత నీకు అందులో సెలెక్షన్ సులభం అవుతుంది.”
అంత కంటే కావసినది ఏముంది… తన మొదటి ఆశయం అదే కదా
! ఆనందంగా ఒప్పుకున్నాడు చిన్న సోమేశం.
అప్పట్లో కళాకారులకి రేడియోలో సెలెక్ట్ అవడం, కార్యక్రమం
దొరకడం ఒక గీటురాయి. సెలెక్ట్ అయితే ప్రతీ మూడు నెలలకి ఒక సారి ప్రోగ్రామ్ ఇస్తారు.
ఎక్కడెక్కడి వారూ తమ పాటని, వాయిద్యాన్ని వింటారు కదా.
రేడియో స్టేషన్ లో సంధ్యావందనం శ్రీనివాసరావుగారికి
బావమరిదిని చూపించి పరిచయం చేశాడు.
“వాయించి వినిపిస్తావా?” సంధ్యావందనం అడిగారు, ఆడిషన్
రూమ్ లోకి తీసుకెళ్లి.
అంతకంటేనా…
వెంటనే సంకోచం లేకుండా, వీణ శృతి చేసుకుని మొదలు
పెట్టాడు చిన్న సోమేశం.
శ్రోత లిద్దరూ అలా కూర్చుండి పోయారు. పప్పు సోమేశ్వరరావు
వీణావాదన విన్నాక, అఫీషియల్ ఆడిషన్ లేకుండానే రేడియోకి సెలెక్ట్ చేసుకున్నారు సంధ్యావందనం
వారు.
అప్పుడు చిన్న సోమేశానికి పధ్నాలుగేళ్లు. ఇంకా మైనారిటీ
తీరలేదు.
21 ఏళ్లు నిండి మేజర్ అయే వరకూ… విజయనగరం, వాళ్ల
నాన్నగారికి, చెక్ వెళ్లిపోయేది.
ప్రతీ మూడు నెలలకీ విజయవాడ అక్క దగ్గరకి వచ్చే అవకాశం
కూడా వచ్చింది.
చిన్నతనం… ఏం చెయ్యాలో తెలియక, చాలా సంవత్సరాలు
బి గ్రేడ్ కళాకారుడి గానే ఉండి పోయాడు. ఎప్పటికో… ఎవరో చెప్తే పై గ్రేడ్ సెలెక్షన్
కి వెళ్లాడు పప్పు సోమేశ్వర్రావు.
ఆ రోజుల్లోనే కాదు… ఎప్పుడూ ఆ విధమైన సెలెక్షన్
అరుదుగానే జరుగుతుంది.
ఇంటికి వెళ్లగానే జయకుమారి తమ్ముడికి దిష్టి తీసింది.
…………
4
బాపట్ల వచ్చాక ఆదాయం బాగానే పెరిగిందని చెప్పవచ్చు
అయ్యగారి వారి కుటుంబానికి.
వ్యవసాయ ఆధారిత కుటుంబాలైనా, గుంటూరు, కృష్ణా జిల్లాలలో
చదువులకి, కళలకి బాగా ప్రాధాన్యత నిస్తారు.
కాస్త ఆర్ధిక స్థితి బాగున్న వాళ్లు ఆడపిల్లలని
కూడా హాస్టళ్లలో ఉంచి చదివిస్తారు. బళ్లలో చేరినప్పుడే సంగీతం క్లాసుల్లో కూడా సహజంగా
జేర్పించేస్తారు.
ముఖ్యంగా బాపట్లలో ఎక్కువ మధ్య తరగతి వారు ఉన్నారు.
కొందరు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు.
అందుకే శిష్యులు చాలా మందే చేరారు అయ్యగారి వారింట.
మూడు నెలలకొక సారి వచ్చే చిన్న సోమేశం కూడా పాఠాలు చెప్తుంటాడు, తను ఉన్న మూడు నాలుగు
రోజులూ!
కాక పోతే వీణ కంటే గాత్రం ఎక్కువ మంది నేర్చుకుంటారు.
అదేమీ పెద్ద సమస్య కాదు… అయ్యగారి వారికి.
జయకుమారి గాత్రం కూడా వాయిద్యంతో సమానంగా నేర్పించగలదు.
కానీ పూర్తిగా నేర్చుకుని, ప్రదర్శనివ్వగల స్థాయికి ఎవరూ రాలేరు.
ఆడపిల్లలు కృతుల దగ్గరకి వచ్చే సరికి పెళ్లిళ్లు
అయి వెళ్లిపోతుంటారు. మగపిల్లలు చదులై పోయాక ఉద్యోగాలకి వెళ్లిపోతారు.
అయ్యగారి కుటుంబం వల్లూరి వెంకటేశ్వర్లుగారి ఇంట్లోనే
ఉంటున్నారు. స్వంత ఇల్లు కట్టుకున్నాకే వెళ్లమని పంతులుగారు ముందే చెప్పేశారు.
ఇంకొక పాపాయి వచ్చింది ఇంట్లోకి. అన్న, అక్కల కంటే
చురుకుగా ఉందనుకుంది జయకుమారి.
రాజేశ్వరి అని పేరు పెట్టారు సోమేశ్వరరావు గారు.
పార్వతీ దేవి ప్రతి రూపం అంటూ!
అప్పుడప్పుడే, చిన్న చిన్న పట్టణాలలో కూడా మార్కెట్
లోకి రేడియో వచ్చింది. కొంతమంది ధనవంతులు కొని తమ ఇళ్లలో జాగ్రత్తగా పెట్టుకుని అపురూపంగా
వాడుకుంటున్నారు.
మంచి కార్యక్రమాలు ఉంటే చుట్టు ప్రక్కల వాళ్లు కూడా
వచ్చి వింటూ ఉంటారు. ఆదివారం పిల్లల ప్రోగ్రాం కైతే, హాలు నిండి పోయేది, ఎవరింట్లో
నైనా సరే.
పొద్దున్నే వార్తలు, అయ్యాక కర్నాటక సంగీతం, లలిత
గీతాలు… సినిమా గీతాలు. అందరికీ భలే కాలక్షేపం. వార్తలు వచ్చే సమయం వస్తే, ఇళ్లలో మగవాళ్లందరూ
రేడియో చుట్టూ చేరిపోతారు.
మధ్యలో రేడియో నాటకాలు, పద్యాలు… పిల్లల కార్యక్రమాలు.
ఇంట్లో రేడియో ఉంటే అదొక అబ్బురం. సందడే సందడి.
చుట్టు ప్రక్కల అందరిలోనూ ఒక విధమైన గౌరవం, ప్రత్యేకత
ఉండేవి.
వల్లూరి వెంకటేశ్వర్లు గారు రేడియో వచ్చిన కొత్తల్లోనే
మద్రాసు నుంచి కొనుక్కొచ్చారు. జయకుమారీ వాళ్లు, సోమేశం ప్రోగ్రాం వస్తే అక్కడికే వెళ్లి
వింటారు.
బుల్లి ట్రంకు పెట్టెంత ఉండేది రేడియో సైజు. బల్ల
మీద ఎత్తుగా పెట్టి కనిపించేలాగ, కుర్చీల్లోనో, చాపల మీదో కూర్చుని వింటారు… అది కూడా
బైటి శబ్దాలు ఏవీ ఇంట్లోకి రాకుండా చూసుకుంటూ.
శ్యామసుందర్ కి ఇంకా మాటలు పూర్తిగా రాలేదు. పొద్దుట్నుంచీ
కాళ్లలో చేతుల్లో పడుతుంటే పంతులు గారింటికి వెళ్లి రమ్మని, శారదని తోడిచ్చి పంపింది
జయమ్మ. అలా వాళ్లింటికి వెళ్లి కాసేపు అక్కడ బొమ్మలతో ఆడుకుని రావటం ఆలవాటే.
అత్తయ్యగారిని అడిగి రేడియో కూడా విన వచ్చని చెప్పింది.
వెంకటేశ్వర్లు గారిని పంతులు గారని అంటారు.
హాల్లో బల్ల మీద రేడియో మోగుతోంది. ఎవరిదో వీణ కచేరీ
వస్తోంది. చాప వేసి ఇద్దరినీ కూర్చోమని ఇంటావిడ లోపలికి వెళ్లారు.
అటూ ఇటూ తిరుగుతూ, అక్కడున్న వన్నీ పరిశీలిస్తున్నాడు
శ్యామసుందరుడు. శారద చూస్తూనే ఉంది.
రేడియోలో వస్తున్నది వీణ కదా… అందుకని ఆసక్తిగా
వింటోంది. నెమ్మదిగా అక్కని ఏమార్చి, కుర్చీ ఎక్కి రేడియో నాబ్స్ పట్టుకో బోయాడు.
అంతే… రేడియో కదిలి, కిందపడింది ఢాం… అంటూ. బిక్క
మొహం వేసి కిందికి దిగాడు. అక్కని గట్టిగా పట్టుకుని ఆపకుండా ఒకటే ఏడుపు.
అపురూపమైన వస్తువు… బోల్డు ఖరీదు. శారద ఏం చెయ్యాలో
తోచక అలా నిలుచుండి పోయింది.
అప్పుడే బైటినించి వచ్చిన పంతులు గారికి విపరీతమైన
కోపం వచ్చింది. చిన్న పిల్లాడు, పైగా గురువుగారి కొడుకు… ఏమీ అనలేక ఆవేశం దిగమింగి
వెళ్లిపోయారు.
రేడియో ముక్కలైతే అవలేదు. శారద దానిని జరిపి పక్కన
పెట్టి, అత్తయ్యగారిని పిలిచి చూపించింది.
ఆవిడ మాత్రం ఏమనగలదు?
కిక్కురు మనకుండా బిక్క మొహం వేసుకుని తమ్ముడిని
తీసుకుని ఇంటికి వచ్చేసింది.
అప్పటి నుంచీ, “నీపా పెట్టి పల్ల కొత్తే పంతు కొత్తాత్త”
అంటూ దాని జోలికి పోలేదు శ్యామసుందరం. దూరం నుంచే వినటం. సమయానుకూలంగా ప్రవర్తించడం
సహజంగా అబ్బింది అబ్బాయికి.
‘నీపా పెట్టి’ అంటే ‘సనిదప’ వచ్చే పెట్టి. రేడియోకి
ఆ పేరు పెట్టుకున్నాడు మన బుల్లి నాయకుడు. తెలివి తేటలకి ఏమీ తక్కువ లేదు.
అప్పుడప్పుడు, రాత్రి పూట లేచి, నిద్ర కళ్లతోనే
అమ్మని లేపి… “మాజానకీ పాడు…” అని అడుగుతాడు. సన్నగా పాడుతుంటే పడుకుంటాడు. అలాగే రోజుకో
పాట పాడాలిసిందే.
పసితనం నుంచే భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుందని అందుకే
అంటారేమో!
మన పురాణాల్లో కూడా అలాగే చెప్పారు కదా…
శ్రీరాముడు బాల్యం నుంచీ పెద్దమనిషిలా వ్యవహరించే
వాడనీ, తమ్ముళ్లని జాగ్రత్తగా చూసుకునే వాడనీ, తల్లిదండ్రులని గౌరవించే వాడనీ… ఎదురు
పడిన అందరినీ ప్రేమగా పలకరించే వాడనీ చెప్తూ… పెద్ద అయాక అతని స్వభావం ఎలా ఉంటుందో
చెప్పక చెప్పేవారు.
ఇంక చిన్ని కృష్ణయ్య అల్లరి పనులు ఒకటా రెండా? అదే
చిలిపి తనం ఎంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా. భయంకరమైన యుద్ధం వస్తుందని తెలిసి బావలిద్దరూ
సహాయం అడగటానికి వస్తే తనకు కావలసినదే వాళ్లు అడిగేటట్లు ఎంత చాకచక్యంగా ఆ సందర్భాన్ని
ఎదుర్కున్నాడో ఎవరైనా మర్చిపోగలరా!
అలాగే మన బుల్లి శ్యామసుందరుడు పెద్ద సంగీత కళాకారుడు
అవుతాడని చిన్నతనం నుంచే సంకేతాలు వచ్చాయి.
“శారదా! తమ్ముడు ఏడీ?”
సాయంకాలం ఇంటికి రాగానే రోజూ అయ్యగారి సోమేశ్వర్రావుగారు
పిలిచే పిలుపు, కనుక్కునే విశేషం అదే... ఆ విషయంలో మార్పు ఉండదు.
పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కుని వచ్చేటప్పటికి
ఒళ్లోకొచ్చేయాలి.
“బైటి ఊర్లకి వెళ్లినప్పుడు ఏం చేస్తారూ?” జయమ్మ,
భర్తని ఆట పట్టిస్తూ అంది.
“ఏం చేస్తానూ… ఇంటికి వచ్చే వరకూ తలుచుకుంటూ ఉంటాను.
అయినా, ఆడవాళ్లు అదృష్టవంతులు. పిల్లలు ఎప్పుడూ కళ్ల ముందే ఉంటారు.” సోమేశం కించిత్
అసూయ చూపిస్తూ అన్నాడు.
నిజమే కదా… ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు తను. జయమ్మకి
కనువిప్పు అయినట్లు అయింది.
ఎంత సేపూ తనేదో తనకి కావలసింది, ఇష్టమయింది చెయ్యలేకపోతోంది
అనుకుందే కానీ పిల్లలతో సమయం అంతా గడప గలుగుతోందని చూడలేక పోయింది. తన విచక్షణా రాహిత్య
చింతనకి తనకే సిగ్గు కలిగింది.
‘ఆ విధాతకి ఎంత ఆలోచన ఎవరి విధులు వాళ్లకి ఎంత చక్కగా
విభజించాడు?’ అనుకుంది. గబగబా లోపలికి వెళ్లింది, ఇద్దరికీ ‘టీ’ కలిపి తేవడానికి. పొద్దున్న
కాఫీ, సాయంకాలం టీ కలిసి తాగటం అలవాటు సోమేశం దంపతులకి.
“ఇక్కడే ఉన్నాం నాన్నగారూ!” ఇద్దరూ ఏక కంఠంతో పలికారు.
ఎక్కడెక్కడికి వెళ్లినా, నాన్నగారు వచ్చే సమయానికి బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడు హీరో.
శ్యామ సుందర్ కి పదేళ్లు వచ్చాయి. రాజేశ్వరి తరువాత
ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు.
మూడవ అమ్మాయికి శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు.
అంతే కదా మరి… ముగ్గురు అమ్మలు ఉండాలి ఇంట్లో.
రాజేశ్వరి తరువాతి అబ్బాయి సత్యప్రసాద్. ఆఖరివాడు
ఉమా చంద్రశేఖర్… జయకుమారి తండ్రి గారి పేరు.
ముగ్గురు ఆడపిల్లలూ, ముగ్గురు మగపిల్లలూ కళకళలాడుతూ
అయ్యగారి వారి ఇంట్లో తిరుగుతున్నారు. పలకటం వస్తే చాలు, సరిగమలు పాడ వలసిందే.
అల్లరి, అలకలు… ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు… అవన్నీ
మామూలే. పిల్లలున్న ఇంట్లో ఉండకుండా ఎలా ఉంటాయి?
అయినా… చాలా మంది పిల్లల కంటే నయమే. అందరికీ ఒకే
ధ్యేయం… ఒకే ధ్యాస. అదే వీణా నాదం. సంగీత సాధన.
నలువ రాణి తన కచ్ఛపితో కొలువు తీరిందా అనిపించక
మానదు చూసే వారికి.
“ఇవేళ ఏం సాధన చేశారు?” అందరినీ ఎదురుగా కూర్చో
పెట్టుకుని అడుగుతారు నాన్నగారు…
చిన్నపిల్లలు అల్లరి చెయ్యకుండా, సాధకుల దృష్టి
మళ్లించకుండా జయమ్మ పెరట్లోకి తీసుకెళ్లి ఆడిస్తుంది.
“సరళీ స్వరాలు మొదలుకొని, అలంకారాల వరకూ, మూడు కాలాలూ…
త్రి స్థాయిల్లోనూ పాడుకున్నామండీ.” శారద బుద్ధిగా చెప్పింది.
“గీతాలు కూడా…” సన్నగా అంది రాజేశ్వరి. తను అక్క
వెనుకే ఉంటుంది. అక్కని ఏదడిగినా తను కూడా సమాధానం చెప్తుంటుంది.
“మరి వర్ణం?”
“అభోగి వర్ణం. మూడు కాలాలూ, రెండు గతుల్లో పాడుకున్నాం.
అకార సాధన కూడా చేశాము.” శారద సమాధానం.
“ఎవ్వారీ… బో…ధ…” రాజేశ్వరి పాడుతూ అందుకుంది… కొంచెం
కూడా శ్రుతి తప్ప లేదు. నవ్వుతూ చిన్న కూతుర్ని దగ్గరగా తీసుకున్నారు సోమేశ్వరరావు.
రాజేశ్వరి సమయానికి తగు మాటలు, పాటలు పలుకుతుంటుంది.
“ఏవిటా రెండు గతులూ?”
“చతురశ్ర గతి… అంటే దెబ్బకి నాలుగు అక్షరాలు. త్రిశ్ర
గతి అంటే దెబ్బకి మూడు అక్షరాలు.” తడుము కోకుండా చెప్పాడు శ్యామసుందర్.
“వెరీ గుడ్. ఏదీ నానిబాబూ! అభోగి రాగంలో గజేంద్ర
మోక్షంలోని పద్యం పాడు.”
శ్యామసుందర్ వెంటనే అందుకున్నాడు.
“లావొక్కింతయులేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్…
నీవే
తప్ప నితఃపరం బెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే
ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా.”
“బాగుంది. రెండో పాదంలో కొంచెం దీర్ఘం తీసి, కాస్త
కరుణ పలికించాలి పద్య మంతా.”
“అయితే, మళ్లీ పాడుతా…” కంఠం పెంచి గట్టిగా పాడాడు
శ్యామసుందరం.
“బాగుంది నాని బాబూ! మీలో ఎవరైనా ఈ రాగాలేంటో చెప్పగలరా?”
కొన్ని రాగాలు తాను పాడుతూ చెప్పించారు. మధ్య మధ్య
శ్యామసుందరంని చెప్ప వద్దని, మిగిలిన ఇద్దరికీ అవకాశం ఇమ్మనీ సైగ చేస్తూ!
క్లాసులో కూడా అందరి కంటే ముందే రాగాలు కనుక్కోవటంలో
దిట్ట శ్యామసుందరుడు. సరదాగా ‘రాగాల పులి’ అని అంటుంటారు సహాధ్యాయులు.
సరైన సమయానికి ఆటలు కట్టిపెట్టించి… సంగీత శిక్షణ,
సాధన, చదువుల భారంతో పెట్టే తిక్కలు సముదాయించి, మంచి మాటలతో పిల్లలందరినీ గురువుగారి
మెప్పు పొందేలా చేసేది జయకుమారి.
తను కూడా రోజూ వీణ క్లాసులు తీసుకోవటం మొదలు పెట్టింది.
ఇంటికి పిల్లలు వస్తున్నారు. ఆదాయం కూడా బాగానే ఉంది.
ఆరుగురు పిల్లలున్న సంసారం మరి… ఎన్నెన్ని అవసరాలుంటాయి?
ఆఖరివాడు ‘ఉమా’ కి కూడా ఏ టైముకి ఏం చెయ్యాలో తెలిసి
పోయింది. నాన్నగారు ఇంట్లో ఉన్నంత సేపూ అందరూ బుద్ధిగా ఉంటారు.
బాపట్లలో స్వంత ఇల్లు కట్టుకున్నారు అయ్యగారి వారు.
ఇంటికి వారి పెద్ద అమ్మాయి పేరు, శారదా నిలయం అని పెట్టుకున్నారు.
జయకుమారి తన విద్యార్థులలోనే తమ్ముడికి సంబంధం చూసింది.
‘పేరి’ వారమ్మాయి భానుమతిని తమ్ముడికి చూపించి,
ఇరు ప్రక్కలా పెద్దవాళ్లతో మాట్లాడింది... చిన్న సోమేశానికి పంథొమ్మిదేళ్లు వచ్చాయి.
బి.ఏ అయిపోతుంది. ఆ రోజుల్లో వారి ఇళ్లల్లో ఇరవై దాటకుండా పెళ్లి చేసెయ్యాలి.
ఆ వయసు దాటితే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి
దొరకటం కష్టం. అందుకే తొందర పడుతూ ఉంటారు పెద్ద వాళ్లు.
భానుమతి వాళ్లింట్లో కూడా తనకి పెళ్లి చేద్దామని
చూస్తున్నారు.
భానుమతి పెద్దక్క, సర్వలక్ష్మి సంసార భారం తీసుకుంది.
ఆవిడ తల్లిదండ్రులు, చెల్లెళ్లు అందరూ అక్కడే, ఆవిడ దగ్గరే బాపట్లలో ఉంటారు.
సర్వలక్ష్మి వితంతువు. బాపట్ల ఎగ్రికల్చర్ యూనివర్సిటీలో
పనిచేస్తుంది.
పేరి వారు కూడా అయ్యగారి వారి లాగే ద్రావిడులు.
పెద్ద సంసారం. అమ్మాయి అణకువగా ఉంటుందని అందరికీ నచ్చి పెళ్లి చేశారు.
ఆ వివాహం మరొక వీణ కళాకారుల కుటుంబ ఆవిర్భావానికి,
అభివృద్ధికి నాంది పలికింది.
……….
1960 వ సంవత్సరం…
తెలుగువారికి… సాహిత్య సంగీత, నాట్య ప్రియులకు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద వరం ప్రసాదించిన సంవత్సరం.
కళాకారులు ప్రతీ కళకీ, కళా ప్రదర్శన కీ మద్రాసు
మీద ఆధార పడనక్కర్లేదనీ, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించుకున్న సంవత్సరం.
విజయవాడలో సంగీత కళాశాల ప్రారంభించారు. ఆకాశవాణి
కేంద్రం ఆరంభించినప్పుడే ఆంధ్రుల పరువు కాస్త పెరిగినట్లు తెలిసింది దేశంలో అందరికీ.
విజయవాడ, గుంటూరు, తెనాలి… చుట్టుపక్కల అన్ని ఊళ్లలో
కాగితాలు పంచిపెట్టారు.
అయ్యగారి సోమేశ్వరరావుగారు, మహదేవు రాధాకృష్ణ రాజు
గారు, కోటిపల్లి ప్రకాశరావుగారు మొదటి అధ్యాపకులుగా నియమితులయ్యారు.
సంవత్సరన్నర పాటు, మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు
వచ్చేవరకూ, అయ్యగారి సోమేశ్వరరావుగారు ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
అయ్యగారి వారు బాపట్ల నుంచి విజయవాడకు సంసారం మార్చేశారు.
ఆ మార్పు కూడా కుటుంబంలోని కళాకారులకి ప్రోత్సాహం
వచ్చినట్లు అయింది.
సోమేశ్వరరావుగారు హైస్కూలు చదువులు చదవకపోయినా,
వారి వీణా వాదన ప్రతిభ ముందు అదేమీ పెద్ద అడ్డంకి అవలేదు. పైగా సంస్కృతాంధ్ర భాషలలో
దిట్ట వారు. వేద పండితుల కుటుంబం నుంచి వచ్చిన వారు కదా!
బెజవాడ, బాపట్లతో పోలుస్తే పట్నం కింద లెక్క. చాలా
పెద్ద ఊరు. పెద్ద రైల్వే స్టేషన్… జంక్షన్. చాలా పట్టణాలకి కనెక్షన్ ఉంది. ఏ ఊరు వెళ్లాలన్నా
ప్రయాణం సులువయింది.
కొత్త ఊరు, కొత్త స్కూలు… శ్యామసుందర్ ఆనందానికి
అవధుల్లేవు. అల్లరి కూడా పెరిగింది. రోజూ ఏదో ఒక పేచీ ఇంటి మీదికి…
“అత్తయ్యగారూ! మా దొడ్లో మొక్కలు పీకేశాడండీ…”
“శ్యాంబాబూ…”
“అంటే… మన పెరట్లో పాతాలని తీసుకొచ్చానమ్మా!”
“మా తడిక అంటుకునేట్లు నిప్పు విసిరాడు అత్తయ్యగారండీ!”
“శ్యాంబాబూ!”
“అంటే… భోగి పండుగ కదాని మంటకి…”
“మా ఇంట్లోకి రాళ్లు విసిరాడండి పిన్నిగారూ!”
“శ్యాంబాబూ!”
“కుక్క జొరబడిందమ్మా… వాళ్ల మొక్కలు పాడి చేస్తుందనీ…”
ఎప్పటికప్పుడు చుట్టు ప్రక్కల వాళ్లని సముదాయించి
పంపటం అమ్మ వంతు.
ఎంత అల్లరి చేసినా, సంగీత సాధన దగ్గరికి వచ్చేసరికి
పూర్తిగా మారిపోతుంది వ్యవహారం.
అక్కతో పోటీపడి తన కంటే బాగా వాయించాలనే ధ్యేయం
ముందుకి నడిపిస్తోంది శ్యామసుందర్ ని. అంతే కాదు… తండ్రిగారి వారసత్వం అలా వచ్చేసింది.
వీణ అంటే ప్రాణం. వీణా వాదన అంటే ఎంతటి అల్లరీ మాయం అయి పోతుంది.
మరి సినిమాలో…
సినిమా జన జీవన స్రవంతిలో ముఖ్య మయిన అంశం అయిపోయింది.
అమ్మో! సినిమాలు లేకపోతే ఎలాగ? అమ్మని కాకా పట్టి
ఎలాగైనా వీలైనన్ని సినిమాలు చూడాలిసిందే. అక్క కూడా తనకి సాయం చేస్తుంది కదా.
‘మహాకవి కాళిదాసు’ వచ్చిందిట… చాలా బాగుందని అందరూ
అంటున్నారు. ఒక్కొక్కళ్లు నాలుగైదు సార్లు చూస్తున్నారు.
ఆవేళ ఆదివారం… నాన్నగారు కచేరీ కోసమని మద్రాసు వెళ్లారు.
ఇదే మంచి సమయం.
వంటగదిలో అష్టావధానం చేస్తోంది అమ్మ. దగ్గరగా వెళ్లి
నిలబడ్డారు అక్కా, తమ్ముడూ.
“ఏమిటి విశేషం? ఇవేళ్టి సాధన అయిందా?”
“అయిందమ్మా.”
“మరి ఒంటిగంటకి రేడియో స్టేషన్ కి వెళ్లాలి కదా?”
“వెళ్లాలి… అట్నించటే…” శారద గొణిగింది.
“మహాకవి కాళిదాసుకా?”
అమ్మో అమ్మని ఏమార్చలేము. ఆవలించకుండానే పేగులు
లెక్కపెట్టేస్తుంది… అవునన్నట్లు చలాకీగా, నిలువుగా తలలు ఊపారు ఇద్దరూ.
చెప్పద్దూ… అమ్మకి ముద్దొచ్చేశారు. నవ్వుకుంటూ మూడు
రూపాయలు ఇచ్చింది. ముప్పావలా టికెట్టు. పావలా వేరుశెనక్కాయలకి.
“చెల్లిని కూడా తీసుకెళ్లండి. అందులో మంచి మంచి
పాటలు, పద్యాలూ ఉన్నాయిట. చూసొచ్చి చెప్పండి.”
“నాలుగింటికి స్పెషల్ షో ఉంది. దానికెళ్లొస్తాం.”
తుర్రుమన్నారు ముగ్గురూ.
రాజేశ్వరి అక్క వెనుకే అమ్మకి కనపడకుండా దాక్కుంది.
ఒక్క గెంతులో ముందుకొచ్చింది.
చిన్న వాళ్లకున్న సౌకర్యం అదే. ఎక్కువగా ఏమీ అడగక్కర్లేదు.
పెద్ద వాళ్లకి వస్తే వాళ్లకి వచ్చేస్తుంది.
“అమ్మా! చాలా బాగుంది సినిమా. అక్క వేరుశెనక్కాయలు
కొనుక్కోలేదు. మేమిద్దరం మా వాటిల్లో కొన్ని ఇచ్చాం.” ఇంటికి రాగానే రాజేశ్వరి చేరేసింది.
ముగ్గురూ ఎగురుకుంటూ వచ్చారు, సినిమా నుండి.
“మరి పావలా ఏం చేశావు శారదా?”
“సినిమా పాటల పుస్తకం కొందమ్మా అక్క. మేం కూడా పాటలు
నేర్చుకుంటాం. అందుకే మా వేరుసెనక్కాయలు కొన్ని ఇచ్చాం.” శ్యాంసుందర్ చెప్పాడు.
“మంచి క్లాసికల్ సంగీతంతో పాటలూ, శ్లోకాలూ ఉన్నాయి.
చాలా చాలా బాగున్నాయి. ఇంకొకసారి చూస్తాం అమ్మా… ప్లీజ్ ఏంటో చూసినట్లే లేదు!” శారద
బ్రతిమలాడింది.
“అవును. అన్నం తిన్నాక కూడా ఆకలేసినట్లుంది.” శ్యామసుందర్
కి మంచి ఉపమానాలు దొరుకుతాయి. సమయస్ఫూర్తి బాగా ఉంది.
సాధారణంగా శారద చాలా పెద్దరికంగా ఉంటుంది. అందుకే
జయకుమారి ఊగిసలాడింది.
“నాగేశ్వర్రావు ఎంత బాగున్నాడో అమ్మా. కాళిదాసు
అంటే ఇలాగే ఉండేవాడేమో అనిపించింది. చదువులేని అబ్బాయిలా కూడా ఎంతో బాగున్నాడు. అసలు
అలాగెలా చేస్తారో కదా! ముందరి కాళిదాసుకీ, తరువాతి అతనికీ ఎంత తేడానో!” శ్యామసుందర్
ఆరాధనగా చూస్తూ అన్నాడు.
“అవునవును… శ్రీరంజని కూడా చక్కగా సరిపోయింది. అచ్చు
రాజకుమారి లాగానే ఉంది.” రాజేశ్వరి అందుకుంది.
పిల్లలు ముగ్గురినీ చూస్తూ ఆలోచనలో పడింది జయకుమారి.
ఈ సినిమాల పిచ్చిలో పడిపోతారా పిల్లలు… తమ ధ్యేయం నెరవేరాలంటే ధ్యాస మార కూడదు.
మళ్లీ సర్దుకుంది… పిల్లలకి ఆ మాత్రం ఆటవిడుపులు
ఉండాలి, భౌతికంగా మానసికంగా కూడా. చదువులో, సంగీతంలో కూడా ముందరే ఉంటున్నారు కదా! వాళ్లు
అడుగుతున్నవి కాదనుకుండానే, పక్కతోవలు పట్టకుండా చూసుకోవాలి.
శారద ఫరవాలేదు కానీ, శ్యాంబాబే… అందరి సంగతులూ వాడికే
కావాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఏదో అల్లరి పని చేస్తాడు. జాగ్రత్తగా చూసుకుంటుండాలి.
“సరే రేపు మేం కూడా వస్తాం. అందరం కలిసి వెళ్దాము.
మరి చిన్న తమ్ముడిని చూసుకుంటారా? నాన్నగారు రావటానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుందిట.”
ముగ్గురి ఆనందానికీ అవధుల్లేవు.
అస్సలు పేచీలు లేకుండా తమ్ముళ్లనీ చెల్లెల్నీ తయారు
చేసేశారు. ఏమర్ధమయిందో ఏమో చిన్నవాళ్లు ఉమా చంద్రశేఖర్, సత్యప్రసాద్ తిక్కలు పెట్టకుండా
బుద్ధిగా రిక్షా ఎక్కేశారు.
అలాగే సినిమాలో కూడా తల తిప్పకుండా చూశారు. అందులో
కిరీటాలూ, చెమ్కీ దుస్తులూ కూడానూ!
అయ్యగారి వారి పిల్లలు అందరూ పాటలూ, పద్యాలు వింటుంటే
చాలు. చెవులప్పగించేస్తారు. ఇంక వీణ అయితే చెప్పక్కర్లేదు.
సినిమా నిజంగానే చాలా బాగుంది. జయకుమారికి కూడా
బాగా నచ్చింది.
“నాన్నగారు వచ్చేలోపుగా మేమిద్దరం…” శారద మాట పూర్తి
చెయ్యలేదు.
“కాదు ముగ్గురం…” రాజేశ్వరి అందుకుంది. జయమ్మ నవ్వుతూ
చూసింది రాజేశ్వరిని. చాలా చురుకుగా ఇట్టే పట్టేస్తుంది.
అందులో సంగీతం దగ్గరకి వచ్చే సరికి మరీ… అయితే
పైకి తేలదు. ఏమీ తెలియనట్లే ఉంటుంది.
“వీణ మీద మాణిక్యవీణాం నేర్చుకుంటాం. ఘంటసాల ఎంత
బాగా పాడారో కదమ్మా!”
“అవును. రేపు పొద్దున్న వంట అయాక కూర్చుందాం.”
“మొదటి శ్లోకం మాణిక్యవీణా ముపలాలయంతీం … మోహన రాగం.
ఆరోహణ అవరోహణ ఏంటీ?” జయకుమారి అడిగింది.
“సరిగపదస. సదపగరిస” ముగ్గురూ కోరస్ లా చెప్పారు.
“మరీ ‘అ,ఆ’ లు రాయమన్నట్లుందమ్మా నీ ప్రశ్న.” నవ్వుతూ
అన్నాడు శ్యాంసుందర్. నిజమే కదా అనుకుంది జయకుమారి. అయ్యగారి సోమేశ్వరరావుగారి పిల్లలు
మరి. ఆ సంగతి మర్చిపోకూడదు.
“తరువాత కేదారగౌళ, కళ్యాణి, శంకరాభరణం. మళ్లీ కళ్యాణి,
కానడ, పంతువరాళి… బాగా వాడుకలో ఉన్నరాగాలు. అందరినీ ఆకర్షిస్తాయి. అన్నింటి కంటే కళ్యాణి
రాగం రారాణిలా ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో ‘కుర్యాత్కటాక్షాం కళ్యాణీం…’ అన్నప్పుడు
చక్కని సంగతి వేశారు. చివర్లో మధ్యమావతి మంగళప్రదంగా ముగిస్తుంది. స్వరాలు రాసుకుని
చక్కగా సాధన చేయండి. సరిగ్గా ఉన్నదీ లేనిదీ నాన్నగారు విన్నాక చెప్తారు.”
సరిగ్గా అప్పుడే రేడియోలో వచ్చింది… కాళిదాసులోని
శ్యామలా దండకం. జయకుమారి గమనిస్తూ స్వరాలు అనుకుంది. వీలయినన్ని రాసుకుంది.
విజయవాడ వెళ్తూనే సోమేశ్వర్రావు రేడియో కొన్నారు.
కానీ, అస్తమానం అదే వినడానికి వీల్లేదు.
అమ్మ చెప్తుంటే స్వరాలు రాసుకుని శారద, శ్యామసుందర్
ప్రాక్టీస్ చేశారు. రాజేశ్వరి, తన చిన్న వీణ పట్టుకుని వాళ్ల వెనుకే ఉంటుంది. ముగ్గురికీ
ఆ విషయంలో నాన్నగారి పోలికలు వచ్చాయి. ఏ కొత్త కీర్తనయినా వచ్చే వరకూ వదలరు.
ఉమాచంద్రశేఖర్, సత్య, శ్రీలక్ష్మి కూడా అక్క, అన్నల
వెంటే. శృతి కానీ, తాళం కానీ అటూ ఇటూ అయితే వెంటనే సరి చేస్తారు. సాధారణంగా అటువంటివి
జరగవు.
సోమేశం చిన్నతనంలో హరికథలూ, పురాణాలూ, నాటకాలూ తప్ప
సినిమాలు లేవు.
అందులో… లోగిసలో అసలు ఎక్కువ ఉండేవి కావు.
మంచి కార్యక్రమం కావాలంటే గజపతి నగరం వెళ్లాలిసిందే.
ఎప్పుడైనా అమ్మమ్మతో పురాణానికి వెళ్తుండేవాడు.
విజయనగరంలో ఉన్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు సంగీత
కార్యక్రమాలకు వెళ్లేవారు.… అజ్జాడ తాతగారి హరికథ అంటే హస్తబల్ మొత్తం హాజరవాలిసిందే.
అన్నలతో వేదసభలకి వెళ్లేవాడు సోమేశం… తీరిక దొరుకుతే.
కానీ, అతని పిల్లలు పెరిగేటప్పుడు ఇతర ఆకర్షణలు
ఎక్కువ గానే ఉంటున్నాయి. కొంచెం కఠినంగా ఉంటూ క్రమశిక్షణ తో పెంచుకోవాల్సి వచ్చింది.
(తరువాయి భాగం వచ్చే గురువారం)
No comments:
Post a Comment