కచ్ఛపి నాదం - 8 - అచ్చంగా తెలుగు

                                                                  కచ్ఛపి నాదం - 8

మంథా భానుమతి



పిల్లల మీద చూపించే కఠినత్వం ఒకోసారి కొంచెం మితిమీరి ఎక్కువవుతుంటుంది.

  కానీ అది కూడా శ్యామసుందర్ కి, మిగిలిన పిల్లలకి వరమే అయింది. ఒకసారి ఇంట్లో జరిగిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేరు కుటుంబ సభ్యులు ఎవరూ!

  చాలా కష్టమైన స్వరజితి… భైరవి రాగంలోని ‘కామాక్షి…’ నేర్పించటం మొదలుపెట్టింది జయమ్మ. అయితే… శ్యామసుందరం రెండు రోజుల్లో నేర్చేసుకుని అద్భుతంగా వాయించాడు, నాన్నగారి ఎదురుగా...

  ఎప్పుడూ స్పందించని సోమేశ్వరరావు, బైటికి చెప్పకపోయినా చాలా ఆనందించాడు. అదంతా అతని ముఖకవళికల్లో తెలిసి పోతూనే ఉంది. గర్వంతో వెలిగి పోయింది మొహం. అది కూడా అనుకూలమైన, ఆహ్లాద కరమైన గర్వమే.

 

  వెంటనే ఇంకా కష్టమైన కానడ అఠతాళ వర్ణం నేర్పించటం మొదలు పెట్టాడు. శారద, రాజేశ్వరి పేరంటానికి వెళ్లారు. వాళ్లు వచ్చే వరకూ ఆగుతారు మామూలుగా… కానీ సోమేశంకి ఆవేశం వచ్చేసింది, శ్యాంబాబు స్వరజితి వినగానే.

  “కానడ రాగం ఖరహరప్రియ జన్యం” సోమేశం మొదలు పెట్టాడు. గురు శిష్యులిద్దరూ వీణ పట్టుకుని కూర్చున్నారు.

  వెంటనే శ్యామసుందరం ఖరహర ప్రియ ఆరోహణ, అవరోహణ వాయించాడు.

  “అంతే అంతే. స్వరస్థానాలు అవే. అయితే ఇది షాడవ- వక్ర సంపూర్ణ రాగం. అవరోహణ లోనే వక్రం.

 

  ‘స రి గ మ దా ని స

  స ని స దా ప మ ప గా మ రి స…’

 

  సోమేశం వాయించి చూపిస్తూ చెప్తున్నాడు.

 

  “ఆరోహణలో ‘ద’, అవరోహణలో ‘గ’ దీర్ఘంగా పలకడంలో ఈ రాగం మాధుర్యం కనిపిస్తుంది.

  ఇది గమక వరీక రాగం- ‘సరిప గా’ అనే ప్రయోగంలో ‘ప’ తన స్వస్థానం లో ఉండదు. ఆ గమకాలు వేయటం లోనే రాగ స్వరూపం తెలుస్తుంది.”

  శ్యామసుందరం వింటూ అనుకరిస్తున్నాడు కానీ… ఎందుకో ఆ వేళ దృష్టి పెట్టలేక పోతున్నాడు సరిగ్గా.

  వీణ శ్రుతి సరి చేసుకుని మొదలు పెట్టారు గురువు గారు.

  “ఇక్కడ చూడు… ‘మ ప గా’ అనే ప్రయోగంలో తీగెని కంపింప చేస్తూ ఒక ప్రత్యేక పద్ధతిలో గాంధారం దగ్గర లాగాలి.

  అలాగే ‘ని స దా ద ని పా’ అనే ప్రయోగంలో దైవతం దగ్గర తీగెని ఊపే పద్ధతి ఈ రాగం ప్రత్యేక లక్షణం…”

  అలా చెప్తూ తను ఆ మెట్ల దగ్గర ఏ విధంగా వేళ్లని కదపాలో చూపిస్తున్నాడు సోమేశం.

  అన్యమనస్కంగానే గురువు గారి పాఠాన్ని వింటున్నాడు శ్యామసుందరం.

  ఆ సాయంత్రం స్నేహితులందరూ కలిసి కృష్ణా బ్యారేజ్ దగ్గరకి వెళ్దామనుకున్నారు. అది తెరిచాక చాలా మంది చూడలేదు. చాలా బాగుందిట. మనసంతా స్నేహితుల మీద, కృష్ణా బ్యారేజి మీద ఉంది.

  నాన్నగారేమో ఇవేళే కొత్త పాఠం మొదలు పెట్టారు.

  “నాని బాబూ! చూస్తున్నావా, వింటున్నావా?” అంటూ పల్లవి ఆరంభించారు.

  వర్ణం రాసిన పుస్తకం శ్యామసుందరం ముందుకు జరిపి మరీ మొదలు పెట్టారు

  “పల్లవి రిషభంతో మొదలవుతుంది. ‘రీరిప గాగా గమరిస నిసరిస రీరీ’… ఏదీ! వాయించు…”

  శ్యామసుందరం వాయిస్తున్నాడు కానీ… సరైన మధుర ధ్వని రప్పించడం చేత కావటం లేదు.

  సోమేశ్వరరావుకు కోపం వచ్చేసింది. చాలా సేపట్నుంచీ గమనిస్తున్నాడు కుర్రాడి వరస.

  “అలా కాదు… ఎన్ని సార్లు చెప్పాలీ? గాంధారం దగ్గర ఇలా వణికించాలీ అని…”

  గట్టిగా అంటూ తను ‘గా’ పలికిస్తూ… ఆవేశంతో, ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్లి రాగం వాయించడం ఆరంభించాడు.

  అంతే… పరిసరాలు మర్చిపోయి అలా వాయిస్తూనే ఉన్నాడు.

  శ్యామసుందర్ మనసు లోకి కానడ రాగం చొచ్చుకుని పోయింది. కృష్ణా బారేజీ… స్నేహితులూ… అన్నీ పారిపోయాయి.

  అద్భుతమైన తండ్రిగారి ప్రతిభను… వేళ్ల కదలికల్లోని వేగాన్ని, రాగంలోని ప్రయోగాలని, గమకాలనీ పూర్తి ధ్యాస పెట్టి గమనించ సాగాడు. కానడ రాగంతో ఎక్కువగా రాగ ప్రస్తారం చేయలేరని అంటారు. కానీ సోమేశ్వర్రావుగారు గంట పైగా తన వాయిద్యంలో లీనమైపోయి తనకోసం… పూర్తిగా తన ఆత్మ తృప్తి కోసం వాయించారు.

  జయకుమారీ, పిల్లలూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి వచ్చేశారు. శారద, రాజేశ్వరీ తండ్రిగారి ఆవేశం ఆరంభమైనప్పుడే వచ్చారు.

  గురువుగారు వాయిద్యాన్ని ఎప్పుడు ఆపేశారో కూడా స్పృహ లేదు ఎవరికీ.

  ఇంక అప్పటి నుంచీ వీణని మించి తనకు కావలసినది ఏదీ లేదని గ్రహించాడు శ్యామసుందరం.

  అల్లరి పూర్తిగా మానక పోయినా… ఏదయినా వీణ తర్వాతే! సహజంగా అందరినీ అలరించే మనస్తత్వం ఎక్కడికి పోతుంది?

  సమయానుకూలంగా ఆహ్లాదకరమైన సంభాషణలు… చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడాలు అవన్నీ సాగుతున్నాయి.

  ఆ తరువాత ఎప్పుడూ నాన్నగారికి కోపం తెప్పించలేదు. పాఠం నేర్చుకునేటప్పుడు శ్రద్ధ తగ్గించలేదు.

  మిగిలిన పిల్లలు కూడా అన్నగారిని అన్ని విషయాల్లోనూ అనుకరిస్తుంటారు కనుక… ఆ గృహం సంగీత మయమయింది. సరస్వతీ నిలయమయింది.

 

  అలాగే… జయకుమారి సమయస్ఫూర్తితో కూడిన పెంపకం పిల్లల భవిష్యత్తుని తీరుగా తీర్చి దిద్దింది. సోమేశ్వర్రావు తరచుగా కచేరీలకి ఇల్లు వదిలి వెళ్తున్నా… ఆ ప్రభావం పిల్లల మీద పడలేదు. తండ్రిమీద గౌరవం, ఆరాధన కలిగేట్లు, నిరంతరం ఉండేటట్లు చూసుకుంది జయకుమారి.

  అందుకే చాలా చిన్న వయసులోనే అయ్యగారి వారి పిల్లలు వైణికులుగా శిఖరాగ్రాలు అందుకున్నారు.

  ముఖ్యగా పెద్ద అబ్బాయి శ్యామసుందర్…

  సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా మొట్ట మొదటి పుత్ర సంతానం మీద చాలా ఆశలుంటాయి. తమ ఆశయాలు నెరవేర్చు కోవడానికి వారి మీద చాలా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి.

  అయితే ఆ పిల్లలకి ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యం సహజంగానే వచ్చేస్తుంది.

  శ్యామసుందర్ కూడా తల్లిదండ్రులని ఎప్పుడూ నిరాశ పర్చలేదు. ఎక్కడ పోటీలకు వెళ్లినా బహుమతి రావలసిందే.

  అప్పట్లో చాలా సినిమాల్లో కర్ణాటక సంగీత ఛాయలున్న పాటలు చాలా ఉండేవి. మధ్యలో వీణ కూడా వినిపించేవారు. అటువంటి పాటలన్నీ అలవోకగా వాయిస్తూ అందరి మన్ననలూ పొంద సాగాడు శ్యామసుందర్.

  నిత్య జీవితంలో ఏది ఎదురైనా అందులో సంగీతమే కనిపిస్తుంది అతనికి.

  ఆఖరుకి, సైకిలుకి గాస్ సిలిండర్ కట్టుకుని గాస్ అబ్బాయి వస్తుంటే… ఆ సిలిండర్ మృదంగం లాగ కనిపిస్తుంది.

  నీళ్లు నింపుతున్న బిందెలో గరిటతో దరువు వేస్తూ… అందులో నిండిన నీళ్ల లెవెల్ని బట్టి వచ్చే శబ్దాలతో వింత వాయిద్యం కనిపెడతాడు.

 

  ఎందరో స్నేహితులూ, అభిమానులు… స్కూల్లో, కాలేజీలో, సంగీత అధ్యయనంలో... ఎక్కడ ఏ కొత్త విశేషం కనిపించినా మధించాలిసిందే. 

  తన చుట్టూ నలుగురైదుగురు స్నేహితులు ఎప్పుడూ ఉంటారు. అందరికీ శ్యామసుందరం లీడర్. ఏదో ఒకటి గమనిస్తూ, విశ్లేషిస్తూ, వివరిస్తూ, చర్చిస్తూ ఉంటాడు.

  చిన్న చిన్న క్విజ్ లు నిర్వహిస్తూ ఉంటాడు.

  యస్సారార్ కాలేజీలో పియుసి, తరువాత బికామ్ చదువుతూ… చదువు లో అందరి కంటే ముందే ఉన్నాడు.

  సంగీత కళాశాలలో గాత్రం, ముసునూరి వెంకట రమణ గారి వద్ద, నేదునూరి కృష్ణమూర్తిగారి వద్ద నేర్చుకుంటున్నాడు.

  వీణ సరే సరి… ఉగ్గు పాలతోనే వింటూ… వీణ పట్టుకోవడం వచ్చినప్పటి నుంచీ నాన్నగారి వద్ద అక్కతో పాటుగా శిక్షణ పొందుతూ… రోజు రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ, అదే ఆలోచన… అదే ప్రపంచం.

  నాన్నగారు నిద్రపోతున్నారు కదా అని కాస్తంత వేరే విషయానికి దృష్టి మళ్లిస్తే పిల్లల వీపు మీద మృదంగ వాయిద్యమే.

  కాలేజీ నుంచి గాత్రం, ప్రైవేట్ గా వీణ డిప్లొమా కట్టి రెండింటిలో డిస్టింక్షన్ తెచ్చుకున్నాడు.

  ఇప్పుడు అసలైన సమస్య ఎదురయింది.

 

  గాత్రమా, వీణా? దేనికి ప్రాధాన్యమివ్వాలి? గాత్రంలో కూడా సమాన ప్రతిభ చూపిస్తున్నాడు.

  చిన్నతనం నుంచీ వీణా ప్రపంచంలోనే పెరిగాడు. నాన్నగారి తో కలిసి వీణ కచేరీలు…

  గాత్రం… నేదునూరి గారికి సహకార గాత్రం అందించటం, బి.కామ్ చదివేటప్పుడు కాలేజ్ లో గ్రూప్ సింగింగ్, కంపోజింగ్… పాడడం, పాడించడం… సర్వం నాదమయం. సమస్తం సంగీత మయమే.

  చివరికి వీణకే ప్రాధాన్యమిచ్చి వైణికునిగానే స్థిరపడటానికి మొగ్గు చూపాడు శ్యామసుందర్.

  అయితే గాత్రంలో కూడా సమాన పాండిత్యం ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా శ్రోతలను అలరించే నేర్పు ఉంది.

 

  కానీ ఆ వయసులో కొన్ని చిలిపి ఆలోచనలు తల ఎత్తటం సహజమే కదా… అందులో అప్పట్లో (ఇప్పట్లో కూడా… అంతే కాదు ఎప్పటికీ) యువతకి సినిమా ప్రపంచం పెద్ద ఆకర్షణ.

  పల్లెలు, పట్టణాలు… వీధి వీధిలో సినిమాల గురించి మాట్లాడని వారు లేరు. ప్రతీ ఒక్కరినీ ఆకర్షించగలిగే శక్తి, వినోద ప్రపంచంలో సినిమాకే ఉంది.

  సినిమాల్లో ఏవిధంగా అయినా పాలు పంచుకోవాలి… పది మందికీ తమ పేరు తెలియాలి. పైకి వచ్చే ప్రతీ కళాకారునిలో అంతర్లీనంగా ఆ కోరిక ఉంటుంది. శ్యామసుందరం కూడా అతీతుడు కాదు.

  బి.కామ్ అవగానే సినిమా ఆర్కెస్ట్రాల్లో అవకాశం కోసం ప్రయత్నిద్దామని పించింది. నేపథ్య సంగీతంలో, పాటలకి వాయించే వాయిద్యాలలో వాడే సంగీతాన్ని, స్వరాలనీ తరచుగా గమనిస్తూ ఉన్నాడు.

  అదేమీ పెద్ద ఘనమైన పనేం కాదు. తను చాలా సులభంగా వరుసలు కట్టగలడు. వాయించగలడు. వాయింపించ గలడు.

  సంగీత దర్శకత్వం చేసే అవకాశం వస్తే అంతకంటే కావలసినది ఏముంది… డబ్బుకి డబ్బు, పేరుకి పేరు.

  గురువు గారికి అంత ఇష్టం లేక పోయినా మద్రాసు బయల్దేరాడు. సోమేశ్వరరావుగారికి తన చిన్నతనం గుర్తుకు వచ్చి తటస్థంగా ఊరుకున్నారు.

  అక్కడ ఉన్న నాలుగు నెలలలోనూ కొన్ని ఛాన్స్ లు రానే వచ్చాయి.

  ప్రేమ్ నగర్ లో ఎవరో రావాలి అనే వీణపాటలో, అమాయకురాలు చిత్రంలో పాడెద నీ నామమే పాటలో వీణ వాయించాడు. ఇవి కాక కొన్ని రీ రికార్డింగులకు కూడా అవకాశం వచ్చింది.

  అక్కడే ఉండి ప్రయత్నిస్తే తన ఆశయం నెరవేరే అవకాశం ఉండేది కూడా!

   అంతలో సికింద్రాబాద్ సంగీత కళాశాలలో వీణ లెక్చరర్ పోస్ట్ లో చేరటానికి వెంటనే బయలుదేరి రమ్మని నేదునూరు గారి దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది. టెంపరరీ అయినా మంచి అవకాశం… పర్మనెంట్ తప్పకుండా అవుతుంది, అందులో జంటనగరాలలో కచేరీలకి చాలా అవకాశాలుంటాయి.

  సినిమాలలో ఉండి పోతానంటే పెద్దలు… ముఖ్యంగా నాన్నగారు ఊరుకోరు కదా! పైగా… అసలైన కర్ణాటక సంగీతానికి దూరమైపోతాడు. తన ధ్యేయం… గురువుని మించిన శిష్యుడవాలని.

  అక్కడి నుంచీ, హైదరాబాద్ కి పయనం, ఉద్యోగపర్వం మొదలయింది.

  వెను వెంటనే వివాహ ప్రయత్నాలు. అయితే అమ్మాయిని వెతకనక్కర్లేదు. చిన్నప్పటినుంచీ అనుకున్న, అనుకూలమైన సంబంధం ఉండనే ఉంది.

                  …………

                     6

 

  అయ్యగారి సోమేశ్రరావుగారి బావమరిది, పప్పు సోమేశ్రరావు మైనారిటీ తీరకుండానే ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ కళాకారునిగా వాయిస్తూ పేరు తెచ్చుకున్నారని తెలిసిందే కదా!

  తన పంతొమ్మిదవ సంవత్సరంలో, అక్కయ్య శిష్యురాలు పేరి భానుమతితో వివాహం… రెండు సంవత్సరాల తరువాత 1955 లో హైద్రాబాద్ కు పయనం, కొత్త చోటు, కొత్త కాపురం. 

  విశాలాంధ్ర ఉద్యమం తీవ్రంగా నడుస్తోంది.

  రాష్ట్ర రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

  ఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్త. హైద్రాబాద్ లో మంచి అవకాశాలు ఉన్నాయని కళాకారులు, విద్యా వంతులు తరలి వస్తున్న సమయం…

  కానీ, మన భాష కాదు… అక్కడ ఉర్దూ వచ్చితీరాలిట. రేప్పొద్దున్న పిల్లలకి ‘అ ఆ ఇ ఈ’ లు కూడా రావేమో! బంధువుల్లో అభ్యంతరాలు బాగానే వచ్చాయి.

  అయితే… తెలుగు వారు అందరికీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని హైదరాబాద్ తరలించారు.

  అందులో బూర్గుల రామకృష్ణారావు గారు, కాసు బ్రహ్మానంద రెడ్డిగారు, నీలం సంజీవరెడ్డి గారు ప్రముఖ పాత్రలు వహించారు.

  రాష్ట్రంలో మూల మూలల నుంచీ ప్రజలు హైదరాబాద్ వచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మందికి బదిలీలు వచ్చాయి.

  ఎవరి వృత్తికి తగినట్లు వారికి ఉద్యోగాలు, లేదా వ్యాపారాలు… జంటనగరాలలో జనాభా పెరగ సాగింది. ఎన్నో కర్మాగారాలు కేంద్ర ప్రభుత్వం కూడా స్థాపించింది.

  విద్యా సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది.

  పప్పు వారు విశాలాంధ్ర ఏర్పాటుకు ముందే కాబోయే రాష్ర రాజధానికి రాక తప్పలేదు. బంధువులు, స్నేహితులు ఆ విధంగా చెయ్యమని సలహా ఇచ్చారు.

  అక్కడైతే మంచి భవిష్యత్తు ఉంటుందని… ఇంత దూరం వచ్చాక ఏదో పని దొరకకుండా పోతుందా!

  ఏడాది తిరగ కుండానే…

  బి.ఏ బియిడి చదివిన పప్పు సోమేశ్వరరావుకి స్కూల్లో టీచరుగా ఉద్యోగం వచ్చింది. అయితే అది కాదు వారి ధ్యేయం, ఆశయం… వేరే ఉంది.

  ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నా రోజూ క్రమం తప్పకుండా వీణ సాధన చేస్తున్నారు దంపతులు ఇద్దరూ.

  కొద్ది నెలలు గడిచాయి…    

  తర్వాత తనకి ఇష్టమైన వృత్తిలో అవకాశం… హైద్రాబాద్, త్యాగరాజ సంగీత కళాశాలలో వీణ అధ్యాపకునిగా నియామకం జరిగింది.

  భార్యా భర్తల సంతోషానికి హద్దుల్లేవు. అనుకున్నది జరిగింది. చిక్కడపల్లిలో నివాసం. ఎందుకో తెలియదు కానీ మొదట్లో ఆంధ్రా నించి వచ్చిన వారందరూ చిక్కడపల్లి లోనే ఉండే వారు. ముఖ్యమైన ఆకర్షణ… ఆంధ్రుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి గుడి ఉండడం అనుకునే వారు.

 

  ఇష్టమైన వృత్తి… బంధువులు తెలిసిన వారు కూడా ఉన్నారు. ఆనందంగా సాగిపోతోంది కాలం.

  ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు కలిగారు.

  కళాశాలలో చేస్తూ ఉండగానే ఇంటికి ఎందరో శిష్యులు వచ్చేవారు. కళాశాలలో, ఇంట్లో కలిపి అనేక మంది శిష్యులు తయారయారు. నిముషం కూడా తీరిక లేకుండా సాగి పోతోంది సమయం, జీవన యానం..

  రాగం, తానం పల్లవులను అద్భుతంగా వాయించటంలో పేరు పొందారు. తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. వారే… వంద పల్లవులను విభిన్న తాళాలలో వాయించే నేర్పు గల పప్పు సోమేశ్వరరావు గారు.

  ‘సోమేశ్వర కృతికదంబం’ పేరిట వాగ్గేయకారుల చరిత్రలు రచించారు. స్వయంగా వాగ్గేయకారులు.

 

  హైద్రాబాద్ లోని శ్రీ త్యాగరాజ గానసభ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు,పప్పువారు...

  అక్కడ అనేక కార్యక్రమాలను, పోటీలను, సమావేశాలను నిర్వహించడానికి తోడ్పడ్డారు.

  హైదరాబాద్ లో రవీంధ్ర భారతి తరువాత అంతటి పేరున్న సమావేశ మందిరం త్యాగరాజ గానసభ. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి.

  ‘వీణానాద సుధార్ణవ’, ‘వైణిక సార్వభౌమ’, ‘వైణిక చక్రవర్తి’, ‘వైణిక శిరోమణి’ బిరుదాంకితులు పప్పు సోమేశ్వరరావుగారు..

  వీరి భార్య భానుమతి, అయ్యగారి జయకుమారి శిష్యురాలు, మరదలు. వీణా వాదనలో నిష్ణాతురాలు. ఎందరో శిష్యులకు సంగీత బోధన చేశారు.

 

  భానుమతీ, పప్పు సోమేశ్వరరావుల ప్రథమ పుత్రిక… మన కథానాయిక.

  ద్రావిడ బ్రాహ్మలలో మొదటి ఆడపిల్లకు మేనత్త పేరు పెట్టటం సంప్రదాయం.

   మేనత్తని మించిన వైణికురాలు కూడా అవాలి కదా!

అందుకే… మేనత్త జయకుమారి పేరు కలిసి వచ్చేటట్లు జయలక్ష్మి అని పేరు పెట్టారు.

  పుట్టగానే శ్యామసుందరుని పిలిచి, “నీకు భార్య పుట్టింది తెలుసా…” అని చూపించారు బంధువులు అందరూ.

  ఏడేళ్ల పిల్లవాడికి అదంతా ఏం తెలుస్తుంది… ఒక సారి చూసి, ఝంపె తాళంలో ఎగురుకుంటూ వెళ్లి పోయాడు.

  శారదక్కకి, మోహన వర్ణం పాడి అప్పజెప్పాలి మరి. లేకపోతే నాన్నగారు వీపు విమానం మోతే!

  జయలక్ష్మి, స్కూల్లో ప్రతీ సెలవులకి అమ్మతో అమ్మమ్మగారి ఇంటికి, బాపట్ల వెళ్లినప్పుడు… పెద్దమ్మ గారు, అత్తయ్యగారు ఉన్న ఊరు విజయవాడ కూడా వెళ్లేది.

  బాపట్లకి దగ్గరే కదా… తప్పదు.

  పెద్దవాళ్లు అప్పుడూ అప్పుడూ అనే మాటలు, ఎంత చిన్నపిల్లలయినా మనసులోకి ఎక్కక తప్పదు.

  ఒకసారి ఇలాగే జయ వాళ్ల పెద్దమ్మగారి అమ్మాయి, ఐదో క్లాసు సెలవులకి వెళ్లినప్పుడు… ఆకతాయి తనంతో బావనీ, మరదల్నీ ఒకే రిక్షాలో కూర్చోపెట్టింది.

  అక్కడ రిక్షాలు ఎత్తుగా, సింహాసనం మీద కూర్చున్నట్లు ఉంటాయి. సీటు కూడా ముందుకు పడి పోతూ ఉంటుంది. అలాగే జారిపోతూ, చెరో పక్కకీ ఒదిగి పోతూ, ఒకరి నొకరు తగల కుండా, జాగ్రత్తగా కష్టపడి వెళ్లారు.

  మేనరికం అంటే… అందులో పెద్దలకు అంగీకారమైతే, మధురమైన ఊహలూ, చిన్న చిన్న విహారాలూ, సినిమాలు… మధ్య వివాహం జరిగి పోతుంది.

  ఎప్పుడు ఎలా జరిగిందో కూడా తెలియకుండా, క్షేమ సమాచారాలు… ప్రోగ్రెస్ కార్డుల, ప్రేమలేఖల ప్రవాహంలో పెళ్లి కూడా భాగం అయింది. పెద్దగా చెప్పవెళ్లడం మాట్లాడ కోవడం వంటివేమీ లేవు.

   బాపట్లలో, అమ్మమ్మ గారింట్లో, పెద్దమ్మ సర్వలక్ష్మిగారి ఆధ్వర్యంలో శ్యామసుందరం-జయలక్ష్మిల పెళ్లి, వైభవంగా జరిగింది.

  ఇటూ, అటూ పెళ్లివారు… అందరూ బంధువులే. సరదాగా వేళాకోళాలు… కావలసినవి వండించుకుని తినడాలు, పిండి వంటలు, బట్టలు ఇచ్చి పుచ్చుకోవడాలు… సందడిగా జరిగింది.

  రోజూ సాయంత్రం వీణ ప్రోగ్రాంలు. అందరూ ఉద్దండులే. పెళ్లికి వచ్చి సహకార వాయిద్య కారులు నేను… నేను అంటూ పోటీ పడి వాయించారు.

  శ్యామసుందరం, జయలక్ష్మిల చిన్న సంసారం ఏర్పడింది, హైదరాబాద్ లో!

  ఇద్దరు పిల్లలు… అబ్బాయి ఆదిత్య, అమ్మాయి కళ్యాణి… కాబోయే వైణిక విద్వాంసులు వచ్చారు, సంగీత నిలయం లోకి.

                   ………………..

                       7

 

  శ్యామసుందరం దంపతులు తమ ఇద్దరు పిల్లలతో, నాన్నగారి ఆరోగ్యం సరిగ్గా లేదని, విజయవాడకి మకాం మార్చేశారు.

   వాళ్లు విజయవాడ వచ్చిన ఐదునెలలకి అయ్యగారి సోమేశ్వరరావుగారు తన యాభై మూడవ సంవత్సరంలో స్వర్గస్థులయారు.   

  వారి కుటుంబానికి అనుకోని కష్టం…

  ప్రపంచ వ్యాప్తంగా వాసా వారి సంప్రదాయాన్ని విస్తరించ వలసిన వైణికులు… ఇంకా సంసార బాధ్యతలున్నాయి. యాభై మూడేళ్లు అంటే మరణించే వయసా? ఎవరికి సమయం వస్తే వారు వెళ్లి పోవలసిందే కదా!

   శారదకి తండ్రి దగ్గర అందరికంటే చనువు ఎక్కువ. ‘అమ్మలూ’ అంటూ తన వెనుకే తిప్పుకునే వాడు సోమేశం. మొదటి సంతానంకి దక్కే వరం అది.

  రోజూ తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంటే, జయకుమారి పిలిచి పక్కన కూర్చో పెట్టుకుంది.

 

    “జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

    తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి || ”

(భగవద్గీత రెండవ అధ్యాయం)

  “పుట్టినవానికి మరణం తప్పదు. మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పని ఈ విషయంలో దుఃఖించుట తగదు. అని కృష్ణ పరమాత్మ చెప్తారు.

  చుట్టూ ఉన్న వారు మరణించటం చూస్తూ ఉన్నా తను మాత్రం మరణించడు అనుకుంటాడట మనిషి. అదే ప్రపంచంలో ఆశ్చర్య కరమైన విషయం అని ధర్మరాజు యక్షప్రశ్నకి సమాధానం ఇస్తాడు.”

  జయకుమారి పై శ్లోకం చెప్పి వివరించింది.

  జయకుమారికి 43 సంవత్సరాలే… ఇంకా స్థిరపడ వలసిన పిల్లలు ఇద్దరున్నారు. పెద్దకొడుకు, కోడలు అభం శుభం తెలియని చిన్న వాళ్లు. తనకు ఈ వయసుకే ఇంత కష్టం వచ్చింది. అయినా… సంస్కృత పండితుల పుత్రిక కదా, చిన్నతనం నుంచే వేదాంతం వంటబట్టించు కుంది.

   కింది శ్లోకం కూడా చెప్పింది వణుకుతున్న కంఠంతో...

 

  “సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం

  నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిః

    (మోహ ముద్గరం- 9వ శ్లోకం)

  సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగ భావం తొలగి పోతుంది. దాని వల్ల క్రమంగా మనలో ఉన్న మోహం తొలగి పోతుంది. మోహం తొలగి పోతే మనసు చలించ కుండా భగవంతునిపై నిలిచి పోతుంది. అదే నిశ్చల తత్వం. నిశ్చల తత్వం ఉంటే సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. ఆది శంకరులు చెప్పింది అదే!” దుఃఖం ఆపుకో లేక, చీర కొంగుతో మొహం కప్పుకుంది

  “అమ్మా… అత్తయ్యా!” పక్కనే కూర్చుని అంతా వింటున్న శ్యామసుందరం, జయలక్ష్మి వచ్చి జయమ్మని గట్టిగా పట్టుకున్నారు.

  “అవును నాన్నా! మీ నాన్నగారితో ముప్ఫై మూడేళ్ల సాంగత్యం. ఆయన కంటే సత్పురుషులెవరున్నారు చెప్పు?”

  “నిజమే అమ్మా! మనందరికీ ఆ సత్పురుషుని సాంగత్యం లభించింది. అందరం అదృష్ట వంతులం.” శ్యామసుందరం గద్గద స్వరంతో అన్నాడు, కళ్లలోంచి నీళ్లు కారిపోతుండగా!

  జయలక్ష్మి అత్తయ్య చెయ్యి పట్టుకుంది.

  పిల్లలందరూ అమ్మ కాళ్ల దగ్గర కూర్చున్నారు మౌనంగా.

  ముగ్గురు ఆడపిల్లల వివాహాలు వారు ఉండగానే జరిపించి, తన బాధ్యత కొంత నెరవేర్చుకోగలిగారు సోమేశ్వరరావు గారు.

 

  ఇంటరు, పదో క్లాసు చదువు కుంటున్న తమ్ముళ్లు శ్యామసుందరం దంపతుల వద్దే పై చదువులు చదివారు. వివాహాది శుభకార్యాలన్నీ వారి చేతుల మీదుగానే జరిగాయి.

  మాతృమూర్తి, తొలి గురువు శ్రీమతి జయకుమారి… మేనకోడలే కోడలయిన జయలక్ష్మిని, స్వంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ, ఇంటి పెద్దరికం తీసుకుని… సంసారం నడిపించారు.

  పురుళ్లకి వచ్చే పోయే కూతుళ్లు, సెలవులకి వచ్చి మామయ్య దగ్గర సంగీతం కూడా నేర్చుకునే మనుమలు, మనుమరాళ్లు… నాలుగు గదుల గవర్న్ మెంట్ క్వార్టర్. ఎలా సర్దుకున్నారో అనూహ్యం.

  ఇంక అప్పటి రోజుల్లో బంధువులు ఏ పని ఉన్నా ఇంటికి వచ్చి చూసుకుని వెళ్లే వారు. ఇప్పటిలాగా హోటళ్లలో ఉండటం తెలీదు… ఆర్ధిక స్థోమతు కూడా ఉండేది కాదు.

  అందులో బెజవాడ అంటే రైల్వే జంక్షన్… వచ్చిన రైలుకు, కనెక్షన్ రైలుకు నాలుగైదు గంటలు తేడా ఉండేది. ఆ మధ్యలో వచ్చి పలుకరించి భోజనాదులు స్వీకరించి వెళ్లే ఆత్మీయులు… నిత్య కళ్యాణంలా ఉండేది గృహం.

  స్వతహాగా తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న జయకుమారి అండ శ్యామసుందరం దంపతులకి చాలా ఉపయోగ పడింది.

  అటువంటి హడావుడి ఉన్న ఇంట్లోనే తమ్ముళ్లు బాగా చదువుకుని పైకి వచ్చారు.

  జయలక్ష్మి పిల్లలు కూడా ఎప్పుడూ చదువులో ఫస్టే.

  సోమేశ్వరరావుగారి సరస్వతీ ఆరాధన ఫలం… మనుమలు, మనవరాళ్లు… అందరూ వైణికులే కాక, సాంకేతిక విద్యలలో కూడా శిఖరాలనధిరోహించారు.

  మేనత్త గురించి జయలక్ష్మి మాటల్లో…

  “నాకు, మా వారికి, మా నాన్నకి (స్వంత అక్కే కదా…), మా పిల్లలకి అందరికీ అమ్మే మా అత్తయ్య.”

  “నన్ను మీరే మామయ్య దగ్గరకి పంపాలి…” అదే ఆవిడ కోరిన కోరిక. ఆ విధంగానే చివరి వరకూ జయమ్మగారిని జాగ్రత్తగా చూసుకున్నారు శ్యామసుందరం, జయలక్ష్మి దంపతులు.

 

  చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి, గురువుగారు వాసా వెంకటరావుగారి పుత్రుడు అయిన వాసా కృష్ణమూర్తిగారు, మిత్రుడి మరణ వార్త వినగానే వచ్చి పరామర్శించారు. వారిరువురూ ఒకే ప్రాణంలా ఉండేవారు.

  “సోమేశం లేని లోకంలో ఉండలేనమ్మా…” పరి పరి విధాల దుఃఖిస్తూ విచారించారు. అన్నట్లుగానే సంవత్సరం తిరగ కుండానే స్నేహితుని దగ్గరకు వెళ్లిపోయారు.

                    ………… 

 

  కుటుంబ పెద్ద సంగీత విద్వాంసుడయితే ఆ కుటుంబ సభ్యులకు సంగీతం అభ్యసించడం, అబ్బటం… ఊపిరి పీల్చటమంత సహజం.

  శ్యామసుందరం గారి ఇంట్లో కూడా అంతే. అదొక సంగీత ప్రపంచం. ప్రతీ ద్వారం సరిగమలు వినిపిస్తుంది.

  ఎవరో ఒకరు ఏదో ఒక రాగంలో కీర్తన అందుకుంటారు తమ పని తాము చేసుకుంటూ…

  తరువాత… ఒకరి వెనక ఒకరు వేర్వేరు సంగతులు, గమకాలు, ఒకర్ని చూసి ఒకరు నేర్చుకోవడాలు… ప్రతీ క్షణం, ప్రతీ నిముషం సంగీత శిక్షణే.

  సూర్యోదయాత్పూర్వమే, భూపాలం వంటి రాగాలతో మేలుకొలుపులతో ప్రతిధ్వనించే గృహం, ప్రతీ నిముషం రాగాల ఝరితో నడుస్తుంటుంది.

  ప్రొద్దున్న రోజు వారీ పనులు మొదలయే ముందు గాత్రం, వీణ సాధన. ఎవరి స్థాయి కి తగిన సాధన వారికి.

  పెద్దలు సాధన చేస్తూనే, పిల్లలకి శిక్షణ… నిరంతరం ఏదో కొత్త రాగం, కొత్త కీర్తన, కొత్త సంగతి… నేర్చుకోవాలన్న తపన ప్రతీ ఒకరిలో కనిపిస్తుంది.

  గంట గంటకీ శిక్షణ తరగతులు… అవి కాక శ్యామసుందరం కళాశాల విధులు. పరీక్షల నిర్వహణలు. పరీక్షలకు శిష్యులను తయారు చేయడం.

  ఏ పని చేసినా నాద సంబంధమే.

   శ్యామసుందరం సోదరీ, సోదరులతో తండ్రిగారి వద్ద ప్రతీ క్షణం క్రొంగొత్త సంగతి నేర్చుకున్నట్లే…

  జయలక్ష్మి కూడా సంగీత కుటుంబంలోనే పెరిగింది కదా! అలాగే నేర్చుకునేది.

  అమ్మ తొలి గురువు, తరువాత గురువు నాన్నగారు, పప్పు సోమేశ్వరరావుగారు. కొంత కాలం మామగారి దగ్గర కూడా నేర్చుకుంది.

 

  వివాహమయాక భర్త శ్యామసుందరుడే గురువు. వీణ వాయిద్యంలో తనకు తగిన శిష్యురాలిగా తీర్చి దిద్దిన మేటి గురువు.

  సంసారంలో సంభాషణలన్నీ రాగాలతో పాటలలో!

  పొద్దున్నే వేడి వేడి ఫిల్టర్ కాఫీ కావాలంటే ఒక కొత్త రాగంలో అడుగుతారు గురువుగారు.

  మోహన రాగంలో సమ్మోహనంగా అందిస్తారు శిష్యురాలు. నిజంగానే శ్యామసుందరం, వాళ్ల నాన్నగారి లాగా పాటలతో సంభాషించటంలో దిట్ట. పైగా ఒకో సంభాషణ ఒకో రాగంలో అని ఊహించుకోవచ్చు చదువరులు.

  ఒక గురువు జ్ఞానంలో, విజ్ఞానంలో పరిపూర్ణత్వం సాధించి ఉండవచ్చు. కానీ శిష్యులకు అర్ధమయేటట్లుగా వివరించి చెప్పలేక పోవచ్చు.

  ఇంకొక గురువునకు వివరించి, విశదీకరించి చెప్పగలిగే నైపుణ్యం ఉండవచ్చు. అయితే తగినంత జ్ఞానం ఉండక పోవచ్చు.

  శిష్యుల స్థాయి నెరిగి, వారికి తేటతెల్లముగా అర్ధమయేటట్లు బోధించగలిగిన వారే మంచి గురువు… సద్గురువు.

  కీర్తనలు, రాగం, తానం, పల్లవులను ఎంత సమర్ధవంతంగా నేర్పుతారో అంతే నేర్పుతో సిద్ధాంతాన్ని కూడా బోధించగలిగిన వారే మంచి సంగీత గురువు.

  తన నాద ప్రస్థానంలో శ్యామసుందరం అత్యంత సమర్ధుడైన గురువుగా శిఖరాలను అందుకున్నారనటంలో అణు మాత్రమైనా సందేహం లేదు.

  శిష్యులు అడిగిన ఏ ప్రశ్నలకైనా తడుముకోకుండా జవాబు చెప్పగల సమర్ధుడు శ్యామసుందరం.

  “అతడు జ్ఞానియే కాక, విద్యలోని మర్మములన్నీ తెలియజెప్పే గురువు” అని తన శిష్యురాలు, జీవిత భాగస్వామి అయిన జయలక్ష్మి చెప్పటం ఎంతో ముదావహం.

  ఏ కీర్తన నేర్పించినా సాహిత్యం అర్ధ సహితంగా వివరించి, అందులో పరమార్ధాన్ని జీవితానికి అన్వయిస్తూ, మనస్సుకు హత్తుకునే ఉదాహరణలతో తేలికగా అర్ధమయేటట్లు చెప్పటం శ్యామసుందరం ప్రత్యేకత.

  అది వంశ పారంపర్యంగా అతని తండ్రిగారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పవచ్చు.

  కొన్ని రాగాలలో జన్య రాగాలలోని ఆరోహణ, అవరోహణలలో ఉండే స్వరాలు కాకుండా అదనంగా ఒకటో రెండో మూడో స్వరాలుంటాయి. వానిని ‘అన్యస్వరాలు’ అంటారు.

  ఉదాహరణకి, బిలహరి రాగంలో శుద్ధ దైవతం, కాంభోజి రాగంలో కాకలి నిషాదం… అన్యస్వరాలు.

  ఏ రాగంలోనైనా అన్యస్వరం ఉన్నప్పుడు, ఆ స్వరాన్నిఆరోహణ అవరోహణలలో సరైన స్థానంలో నిలుపుతే రాగస్వరూపం, రాగలక్షణానికి దగ్గరగా మారుతుంది.

  ‘సని పదస’ - లో కాకలి నిషాదం పడగానే, కాంభోజి రాగం అని తెలిసిపోతుంది.

  అపస్వరం అంటే అందరికీ తెలిసిందే. స్వర స్థానానికి, ఇటూ అటూగా… కర్ణ కఠోరంగా విన వచ్చేది.

  “గురువుగారూ అన్యస్వరానికీ, అపస్వరానికీ గల తేడా ఏమిటండీ?” తరగతిలో ఒక శిష్యుడు అడిగిన ప్రశ్న…

  అన్య, అప స్వరాలకి అందరికీ అర్ధమయే ఉదాహరణలు ఇచ్చారు శ్యామసుందర్.

  “అన్య స్వరాలు లడ్డూలో జీడి పప్పుల్లాంటివి. ఎన్ని వచ్చినా ఇంకా ఇంకా కావాలని వెతుక్కుంటాము. అదే అపస్వరం అయితే పప్పులోని రాయి వంటిది. ఒక రాయి వచ్చినా సహించలేం.”  ఇటువంటి ఉదాహరణలు విన్న విద్యార్థులు జన్మలో ఆ రెంటికీ మధ్య ఉన్న తేడాని మర్చిపోరు.

  అలాగే… ఏదైనా పాటలో ఒక స్వరంలోకి వెళ్లేటప్పుడు ఇంకొక స్వరాన్ని ఆధారంగా తీసుకుని వెళ్తారు. ఆ ఆధారిత స్వరం కూడా ఆ రాగంలోదే ఉండాలి. ఉదాహరణకి…

  మోహన రాగంలో ‘పా’ అనాలంటే ‘అంతర గాంధారం’ నుంచి తీసుకోవాలి. అలాగే ‘సా’ అనటానికి ‘చతుశృతి దైవతం’ నుంచి తీసుకోవాలి. అంతే కానీ, మధ్యమం కానీ నిషాదం కానీ తగల కూడదు. దానికి శ్యామసుందర్ గారు ఇచ్చిన ఉదాహరణ…

  “కిరసనాయిల్ కొలిచిన గ్లాసు కడిగి అందులో పరమాన్నం ఇస్తే ఆ పాయసంలో కిరసనాయిల్ వాసన ఉన్నట్లే ఉంటుంది… ఆ రాగంలో ఇతర స్వరాల ఛాయ.”

  శిష్యుల మనసులకు హత్తుకు పోతాయి ఇటువంటి ఉపమానాలు.

  సంగీతం వినడానికీ, నేర్చుకోవడానికీ గురు శిష్యులు ఇద్దరికీ ఆ అభిరుచి ఉండనక్కర్లేదు, ఒక్కరికి ఉంటే చాలంటారు శ్యామసుందర్.

  “ఒక కాయితానికి మరొక కాయితం అంటుకోవటానికి ఒక కాగితానికి గమ్ ఉంటే చాలు, రెండింటికీ ఉండక్కర్లేదు. అలా ఒకరిని చూసి మరొకరికి ఆసక్తి పెరుగుతుంది” అని అంటారు.

  ఈ రకంగా అరటిపండు వలిచి చేతులో పెడుతున్నట్లు వివరించటం వారి ప్రత్యేకత.

  సాధారణంగా శ్యామసుందరం గారి శిష్యులు అందరూ శ్రద్ధగా సాధన చేసి డిప్లొమా పరీక్ష పాసవుతూంటారు.

  సంగీత బోధకునిగా వారికి కర్తవ్య పాలనలో కరుణకి తావు లేదు. అంత నిబద్ధత గల గురువుగా పేరు పొందారు.

  సంగీతంలో ఎన్నో శాఖోపశాఖలు ఉన్నాయి.

  అన్ని రకాల సంగీతాలనూ విని ఆనందించ గలిగిన రసజ్ఞుడే పరిపూర్ణ కళాకారుడు అని శ్యామసుందరం అంటారు.

  వారి గురువు, తండ్రీ అయ్యగారి సోమేశ్వరరావుగారు కూడా అదే అనేవారు… ‘సంగీతానికి సరిహద్దులు లేవు’ అని.

  అంతే కాదు… సంగీత శాఖలన్నీ తన శిష్యులకు పరిచయం చేసి, వినిపించి, సంగీతం పై గొప్ప అభిరుచిని కలిగించారు.

  అందులో… లలిత సంగీతం, హిందూస్తానీ సంగీతం, గజల్స్, వెస్టర్న్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, జానపద గీతాలు, పల్లె పాటలు… కొన్ని ఉదాహరణలు.

  కర్ణాటక సంగీతం సరే సరి, వారికి మాతృభాష లాగ ‘అమ్మ పాట’ అన్నమాటే.

  సంగీతం వినేటప్పుడు ఫలానా కళాకారుడు అని కానీ, ఫలానా సంగీతం అని కానీ కాకుండా సమభావంతో ప్రపంచ గీతాలన్నీ విని ఆనందిస్తారు. అంతే కాదు… అందరికీ వినిపిస్తూ ఉంటారు.

  ఇటువంటి సమభావం ఉండటం ఏ కళాకారునిలో నైనా మెచ్చుకోవలసిన అంశం.

  ఈ సందర్భంగా మనం రెండు విషయాలు శ్యామసుందరం గారి గురించి విన్నవి చెప్పుకోవచ్చు.

  “నాన్నగారు మాకు ఇచ్చిన ఈ సంగీత సంపద మాకు నిరంతరం మా వెంట తోడుగా ఉండి నిలిచే స్నేహితుడు. ఇటువంటి స్నేహితుడిని మా పిల్లలకు ఇవ్వ గలిగితే మా జన్మ ధన్యం” అని వారి అబ్బాయి ఆదిత్య ప్రశంసించడం ఏ తండ్రి కైనా గర్వకారణం కదా!

  తెలుగు విశ్వవిద్యాలయం వారికి వీణ మీద క్షుణ్ణంగా, సమగ్రంగా వ్యాసాలు రాస్తున్నప్పుడు… గురువుగారు చెప్తుంటే వంచిన తల ఎత్తకుండా రాసిన శిష్యురాలికి ఏదైనా జ్ఞాపిక కొని ఇద్దామనుకున్నారు.

  కానీ ఆ అమ్మాయి, “గురువుగారూ సంగీతం పట్లా, వీణ పట్లా మీరిచ్చిన ఈ జ్ఞానం కంటే ఇంకేదీ నాకు ఆనందం ఇవ్వదు” అని తిరస్కరించింది.

  శ్యామసుందరం గారు, బి.కామ్ చదివే రోజుల నుంచీ, సంగీత కళాశాల రోజుల దాకా రేడియోకి, అనేక పోటీలకు వేల పాటలు స్వయంగా కంపోజ్ చేశారు. ఎంత మంది చేతో పాడించారు.

  వీణ వాయించే టప్పుడు వారు ఒక సంగీత గని. ఏ పాట కావాలంటే ఆ పాట వినవచ్చు.

  “అన్ని సంగీతాలూ వీణపై అవలీలగా పలికించగలగటం నా అదృష్టం” అంటారు.

  ఇటువంటి విశాల దృక్పథం కలిగిన అగ్రగణ్య సంగీతజ్ఞులలో శ్యామసుందరం గారు ఒకరు.

 

  చిన్నతనం నుంచీ తండ్రిగారితో కలిసి వేల కచేరీలు చేసిన శ్యామసుందరం గారు, తాను స్వయంగా చేసిన ప్రదర్శనలు అసంఖ్యాకం.

  జీవిత భాగస్వామి జయలక్ష్మితో, పిల్లలు ఆదిత్య, కళ్యాణిలతో దేశ విదేశాలలో చేసిన కచేరీలు ఎన్నెన్నో శ్రోతల మనసులను రంజింప జేశాయి.

 

    1984 లో తెలుగు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ మెంబర్ గా ఉండి యూనివర్సిటీ కార్య కలాపాలలో పాల్గొని విశేషమైన సేవలందించారు.

  దక్షిణ మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రం వారి గవర్నింగ్ బాడి మెంబర్ గా మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక రంగాలకు అనేక సేవలందించారు.

  రేడియో ఆడిషన్ బోర్డ్ మెంబర్ గా. ఉద్యోగ నియామకాల బోర్డు మెంబరుగా పలుమార్లు సేవలందిచారు.

  అనేక మంది మహామహుల సహకారంతో, శ్రీ శ్యామసుందరం గారి సంగీత ప్రస్థానం నిరాటంకంగా సాగిపోతోంది.

  “వీణా వాద్య విశారద, సంగీత విద్వన్మణి, సునాద సుధానిధి, వీణా వాదన చతుర… ఇవి శ్యామసుందరం గారు అందుకున్న బిరుదులలో కొన్ని.”

 

                        8

  

   శ్యామసుందరం గారికి అన్ని విధాలుగా తగిన జీవిత భాగస్వామి జయలక్ష్మి. మరుదులతో, ఆడబిడ్డలతో స్నేహంగా ఉంటూ, పెద్ద కోడలిగా తన కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ సంగీతం మీద ఆసక్తి కలిగేటట్లు చూసుకుంది.

  తన వారసులందరూ తనతో సమానమైన వారో, తనని మించిన వారో అవాలనే అయ్యగారి సోమేశ్వరరావుగారి కోరిక సంపూర్తిగా తీరిందని చెప్పవచ్చు… తీరేటట్లుగా ప్రతీ ఒకరూ కృషి చేశారనటంలో సందేహం లేదు..

  తండ్రిగారితో పాటుగా, విడి విడిగా కూడా వందల వేల కచేరీలు, ఎందరో విద్వన్మణుల చేత ప్రశంసలు… బహుమతులు అందుకున్నారు... అందుకుంటున్నారు. మెలకువలో, నిదురలో, కలలో కూడా సంగీతమే.

  సరస్వతీదేవి తన వీణతో సహా అందరి ఇళ్లలో కొలువై, తన కచ్ఛపి నాదం వినిపిస్తోంది.

 

  అయ్యగారి సోమేశ్వరరావుగారి ప్రథమ పుత్రిక శారదా దేవి… తండ్రికి ముద్దుల తనయగా గారంగా పెరుగుతూ బాధ్యతలు కూడా పంచుకుంది.

  తను పుట్టినప్పుడు సోమేశ్వరరావుగారు, ‘అమ్మలు పుట్టినరోజు’ అని కళ్యాణి రాగంలో, ఆ రోజు జరిగిన కచేరీలో వాయించారు.

  శారద పద్నాలుగేళ్ళ వయసులో విజయవాడ సంగీత కళాశాలలో మొదటి బ్యాచ్ లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది.

   రేడియో కాంపిటీషన్ లో విజయవాడలో ఉత్తీర్ణత సాధించి, ఫైనల్ పోటీలో ఎందరో ప్రముఖులతో పోటీపడి ప్రశంసలందుకుంది.

  వివాహమయ్యాక భర్త వెంట ఉత్తర హిందూస్థానం వెళ్లిపోయి, అక్కడ వాతావరణం అనుకూలంగాలేక వీణ దూరం పెట్టవలసి వచ్చింది…

  అయినా సంగీతానికి దూరం అవలేదు. తమ్ముళ్లు, చెల్లెళ్లు అంతంత పేరు సంపాదించడానికి ఆవిడే కారణం. ఒక ఉదాహరణలా నిలిచి, స్ఫూర్తి కలిగించారు.

  తమ్ముడు శ్యామసుందరం తో కలిసి అనేక బాలానందం కార్యక్రమాల్లో, సంగీత రూపకాల్లో పాల్గొన్నది. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు.

  ఒక రకంగా పసివాడుగా ఉన్నప్పుడు తమ్ముడిని ఆవిడే చూసుకుందని అనుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలతో పని చేసుకునే తల్లికి చేదోడు వాదోడుగా నిలిచి తల్లిదండ్రులు అనుకున్నది సాధించేందుకు తోడ్పడింది.

 

  రెండవ సంతానం శ్యామసుందరం… మన రెండవ కథానాయకుడు. సోమేశ్వరరావుగారి గృహంలో, జీవితంలో ముఖ్య పాత్రధారి. కుటుంబంలో, బంధువులలో, స్నేహితులలో అందరికీ ఆత్మీయుడు... తెలుగు వారందరూ గర్వించదగ్గ కళాకారుడు. వారి గురించి తెలుసు కుంటూనే ఉన్నాం.

  ఎంత తెలుసు కున్నా ఇంకా ఏదో తెలుకు కోవలసినదీ, నేర్చు కోవలసినదీ ఉంటూనే ఉంటుంది వారి గురించి.

 

  సోమేశ్వరరావుగారి మూడవ సంతానం, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అయ్యగారి వారి నాద కేతనం ఎగరేస్తున్న కళాకారిణి శ్రీమతి పరటి రాజేశ్వరి.

  వారి గురించి చెప్పాలంటే మరొక నవల రాయాలిసిందే. ఉగ్గుపాలతోనే సంగీతాన్ని గ్రోలిన కళాకారిణి.

  వారు ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యమే.

  రాజూ అని స్నేహితుల చేత పిలిపించుకుంటూ అందరికీ ఆప్యాయత పంచే స్నేహశీలి.

  సౌమ్యంగా, సామాన్యగృహిణిలా ఏమీ ఎరగనట్లు కొత్తవారికి కనిపించే అనంత సంగీత విజ్ఞాన ఖని.

 

  మూడు సంవత్సరాల పిన్న వయసులో…

  “అక్కా! గాంకాయ ఇస్తా ‘లంబోదర’ నేర్పించవా?” అంటూ అక్క వెంట పడి అడిగి గీతాలు పాడించుకుని… సంగీతం పట్ల మక్కువను చూపించింది రాజేశ్వరి.

  చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్నవి ఇవ్వటానికి సాధారణంగా ఇష్టపడరు. ఎవరైనా తీసుకో బోతే, చేతులు రెండూ వెనక్కి పెట్టేసుకుంటారు.

  కానీ మన అయ్యగారి వారి వారసురాలు పాట నేర్చుకోవడానికి ఎంత ప్రియమైనది అయినా ఇచ్చేస్తుంది.

  సాధారణంగా మొదటి సంతానం కంటే రెండవ సంతానం చురుకుగా ఉంటారు.

  అక్కనో అన్ననో అనుసరిస్తూ, వాళ్లు చేసే పనులను చూస్తూ… నేర్చుకుంటూ…

  అటువంటిది రాజేశ్వరికి అన్న, అక్క… ఇద్దరున్నారు అనుసరణకి. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు వీణా నాదం వినిపిస్తూ ఉంటారు.

  వారి వెనుకే ఉంటూ నిశ్సబ్దంగా అంతా గమనిస్తూ మనసులోకి బదిలీ చేసుకునే నేర్పరి.

  సహజంగా తెలివి, ఆసక్తి, అభిరుచి ఉన్న రాజేశ్వరికి వీణ అంటే మరింత మక్కువ కలిగింది… ప్రోత్సాహం లభించింది.

  ఎవరూ చెప్పకుండానే రోజూ సాధన… వీణ వాయిస్తూ ఉంటే సలహాలు చెప్తూ సరిదిద్దే అక్క, అన్న. అమ్మ సరే సరి. ఇంక లోటేముంది.

  పదహారేళ్ల ప్రాయంలోనే వీణలో ఆంధ్రా యూనివర్సిటీ డిప్లొమా డిస్టింక్షన్ లో పాసయింది. అంతే కాదు…

  రేడియో ఆడిషన్, సెలెక్ట్ చేసే వాళ్లు మెచ్చుకునేటట్లు పూర్తి చేసుకుని రేడియో కళాకారిణి అయుంది.

   అనేక కచేరీలు, రేడియో, టి.వి కార్యక్రమాలు… ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది శిష్య పరంపర… అయ్యగారి వారి మరొక ఆణిముత్యం ‘శ్రీ కళా ప్రపూర్ణ’ శ్రీమతి పరటి రాజేశ్వరి.

   మధుర భాషిణి, కార్యదీక్ష పరురాలు… ఏ పని చేపట్టినా ముగించే వరకూ అవిశ్రాంతంగా పని చేసి విజయవంతంగా ముగించ గలిగే కార్యశీలి.

   చిన్నతనంలోనే ఉస్మానియా యూనివర్శిటీ కామర్స్ లెక్చరల్ శ్రీ పరటి జగన్నాథరావుగారితో వివాహం జరిగింది.

   ముగ్గురు పిల్లలని మంచి మార్గదర్శకత్వంలో పెంచుతూ, తను కూడా డబల్ యమ్మే చేసింది.

   పిల్లలు సాంకేతిక రంగంలో, సాఫ్ట్ వేర్ లో శిఖరాలను అందుకున్నారు. ముగ్గురూ సంగీతంలో… వీణ వాదనలో నిష్ణాతులు.

  ఈ విజయాల వెనుక జగన్నాథరావుగారి ప్రోత్సాహం ఎంతో ఎన్నదగినది.

  జగన్నాథరావుగారు, సౌమ్యశీలి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో అందరితో స్నేహంగా ఉంటూ, పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దారు. మంచి హాస్య ప్రియులు.

  యాక్సిడెంట్ లో అకాల మరణం వారిని దూరం చేసినా వారి ఆశీస్సులతో ఎన్నో కీర్తి శిఖరాగ్రాలను చేరుకో గలిగింది, శ్రీమతి పరటి రాజేశ్వరి.

  చిన్న పిల్లగా ఉండగానే, బాపట్లలో… అక్కా అన్నల అడుగు జాడల్లో నడుస్తూ, వారి విద్యాభ్యాసాన్ని గమనిస్తూ, సరి సమానంగా నేర్చుకుంటూ, విజయవాడ వచ్చాక, తండ్రిగారి వద్ద చురుకుగా విద్యాభ్యాసం చేస్తూ, అనతి కాలంలో పేరు ప్రతిష్ఠలను ఆర్జించింది.

   తెలుగు యూనివర్సిటీ ఫాకల్టీ మెంబర్ గా చక్కని శిష్యులను యమ్మే వీణకి తయారు చేసింది… వారు కూడా కచేరీలు చేస్తూ మంచి వైణికులు అయారు.

  పిల్లలు అమెరికా వాస్తవ్యులు అవడంతో, తనుకూడా అక్కడి పౌరసత్వం తీసుకుంది.

  ప్రతిభకు పట్టం కట్టే అమెరికా దేశంలో శిష్యులను తయారుచేస్తూ, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

  షికాగోలో “రాజవీణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్” స్థాపించి కర్ణాటక సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేస్తున్నారు. 

 

  శ్రీమతి రాజేశ్వరి తానా, నాటా, ఆటా మొదలైన సమావేశాల్లో తన శిష్యులచేత సంగీత నృత్య నాటికలు ప్రదర్శింప చేస్తూ తెలుగు వారి ప్రతిభ దశదిశలా వ్యాపింప చేస్తున్నారు.

  త్యాగరాజ సంగీత నాటికలు "ప్రహ్లాద భక్తి విజయం" మరియు "నౌకా చరిత్రం" వంటి అందమైన ప్రదర్శనలతో పలువురి ప్రశంస లందుకుంటున్నారు.

  పాశ్చాత్య, హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతాన్ని మిళితం చేసిన, రాజేశ్వరి గారి ఫ్యూజన్ కంపోజిషన్లు ఉత్తర అమెరికా ప్రేక్షకుల నుండి అపారమైన ప్రశంసలను పొందాయి.

  అమెరికా, యూరోపు దేశాల్లో వివిధ సంగీత ఉత్సవాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటూ, ఆమె విద్యార్థులు ప్రకాశిస్తూ గురువుగారికి కీర్తి గడిస్తూనే ఉన్నారు.

  అంతే కాదు ఆమె సంగీత వారసత్వాన్ని గర్వంగా సూచిస్తారు.

 

  కుటుంబ యజమాని కళాకారుడు, విద్వాంసుడు అయితే, కుటుంబం అంతా కళలకు కాణాచి అవుతుంది. ఆ గృహము సరస్వతీ నిలయమే.

  ఇందుకు అయ్యగారి సోమేశ్వరరావు గారి కుటుంబం మంచి ఉదాహరణ. సరస్వతీ దేవి తన కృపా కటాక్షాలతో వారి వారసులను సంగీత సాహిత్యాలలోనే కాకుండా సాంకేతిక విద్యలలో కూడా ప్రావీణ్యత సంపాదించేటట్లు కరుణించింది.

  అను నిత్యం, ప్రతీక్షణం సరస్వతీ ఆరాధన… నిరంతరం కచ్ఛపి నాద సాధన ఫలితం కనిపిస్తూనే ఉంటుంది.

  సోమేశ్వరరావుగారి పిల్లలు, మనుమలు, వారి పిల్లలు… వంశ పారంపర్యంగా వీణా సాధన చేస్తూ, విద్వాంసులుగా పేరు తెచ్చుకున్నారు… తెచ్చుకుంటున్నారు.

  

  మూడవ అమ్మాయి శ్రీలక్ష్మి కూడా వీణ నేర్చుకుంది. బండి వారి కోడలుగా, నరసయ్యగారి అర్ధాంగిగా, గృహిణిగా తన బాధ్యతలు నెరవేర్చుకుంటోంది.

  ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించటం, స్వంత మనుషుల్లాగా ప్రేమగా పలుకరించే ఉత్తమ ఇల్లాలు… అయ్యగారి జయకుమారి కూతురు ఇంకెలా ఉంటుంది అనిపించుకున్న రత్నం.

 

  సోమేశ్వరరావుగారి ద్వితీయ పుత్రుడు అయ్యగారి సత్యప్రసాద్ కూడా పేరెన్నికగన్న కళాకారుడు.

  జీవితంలో కీలకమైన ఇంటరు చదువుతూ ఉండగా పితృ వియోగం ఎవరికైనా తట్టుకోవడం కష్టమే. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తి కూడా దానిని సృష్టించిన వాడే ఇస్తాడు.

  సమర్ధులైన తల్లి, అన్నా వదినలు ఉండటం వలన సత్యప్రసాద్ కి, ఉమాశంకర్ కి ఊరట తలిగింది.

  అన్నగారు శ్యామసుందరం, ఆదర్శం… గురువు, మార్గ దర్శకుడు కూడా!

  సంగీతమే వృత్తిగా స్వీకరించి రాజమండ్రీ మ్యూజిక్ కాలేజి అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా పని చేశాడు.

  మొహమాటం, మంచితనం, ముక్కుసూటితనం… మర్యాద మన్ననలకు ప్రతి రూపం అతను.

  సత్యప్రసాద్, అతని సతీమణి రాజ్యలక్ష్మి తో కలిసి అనేక కచేరీలు చేశాడు.

  అయ్యగారి వారి పుత్రులకు దీటైన వారు వారి కోడళ్లు.

  రాజ్యలక్ష్మి అనగానే చిరునవ్వుతో కళకళ లాడుతూ కనిపించే అందమైన గృహిణి కళ్ల ముందు కనిపిస్తుంది.

  ఎంతమంది లో ఉన్నా గలగలా, కలుపుగోలుగా మాట్లాడుతూ ఆత్మీయంగా దరిచేరే తత్వం…

  తనకి అలంకరణ చేయడం ఇష్టం. చక్కని సలహాలు ఇచ్చి ఇంట్లో ఏ కార్యక్రమమైనా… పూజలూ, పండుగలూ, పెళ్లిళ్లూ సమర్ధ వంతంగా నిర్వహిస్తుంది.

  వీణ చాలా బాగా వాయిస్తుంది… కానీ వేదిక మీద భర్తతోనే వాయించాలని నియమం…

  ఎంతో మంది శిష్యులను వైణికులుగా తీర్చి దిద్దుతోంది.

 

  సత్యప్రసాద్ కదనకుతూహలం రాగంలో విన వచ్చే గిటార్ నోట్స్ ను వీణపై అద్భుతంగా పలికిస్తాడు.

  గిటార్ నోట్స్ ను వీణపై పలికించటం ఎంత కష్టమో… దానికి ఎంత సాధన కావాలో? ఊహించడం కూడా కష్టమే.

  వాయిద్యం ఒక జలపాతం వంటిది. అనేక వాద్య పరికరాలు అలవోకగా పలికించటమే కాకుండా, కీర్తనా రచనలకు కూడా శ్రీకారం చుట్టారు శ్రీ సత్యప్రసాద్.

  సీనియర్ బి హై కళాకారునిగా, దేశమంతా అనేక ప్రదర్శనలు ఇస్తూ, సన్మానాలు సత్కారాలు అందుకున్నాడు.

  సంగీతామృతాన్ని ఆధ్యాత్మికతతో కలిపి ఆస్వాదించగల పరిపూర్ణ వ్యక్తి సత్యప్రసాద్.

  సంగీత కళాశాలలో వీణ, థియరీ బోధకుడిగా ఎందరో శిష్యులను తయారుచేశారు. భార్య, కొడుకూ, కోడలూ మనవలూ కూడా వాయిస్తారు.

  మరొక కాబోయే విద్వాంసుడు, మనవడు… చిన్నారి రిషి వీరింట పెరుగుతున్నాడు.

 

  ప్రభుత్వ నవోదయా పాఠశాలలో సంగీత అధ్యాపకునిగా పని చేసిన ఉమా చంద్రశేఖర్, సోమేశ్వరరావుగారి కనిష్ఠ పుత్రుడు.

  అతని భార్య రాధ… సౌజన్య మూర్తి. సౌశీల్యం, సహనం, అమాయకత్వం కలబోసిన సహజ సౌందర్యవతి.

  తన గొప్ప వ్యక్తిత్వమే తన వెల కట్టలేని ఆభరణం. రాధ గురించి మంచి తప్పితే ఇంకొక మాట మనసులోకి రాదు.

  అత్తవారి ఇంట్లో అందరి మనసులూ జయించిన మంచి కోడలు. ఉత్తమ ఇల్లాలు.

  ఉత్తమ అత్తగారు కూడా అయింది.

  అయ్యగారి వారి కోడలు కదా… తప్పదు. చక్కగా వీణ నేర్చుకుంది. చాలా బాగా పాడుతుంది.

 

  ఉమా చంద్రశేఖర్ పదవ తరగతి చదువుతుండగా తండ్రిగారు స్వర్గస్తులయినా, ఇద్దరు అన్నగార్ల మార్గదర్శకత్వంలో అన్నల, అక్కల అడుగుజాడల్లో నడుస్తూ సంగీతమే ఊపిరిగా శిష్యులను తీర్చి దిద్దుతున్నాడు.

  వీణ, గాత్ర సంగీతములలో అత్యున్నత శ్రేణి, డిప్లొమా పత్రం సంపాదించాడు.

  వీణ మాత్రమే కాదు… కీ బోర్డ్, హార్మోనియం, తబలా, డోలక్, జాజ్ డ్రమ్స్, బేస్ డ్రమ్ మొదలైన అనేక సంగీత వాద్యములలో నిష్ణాతుడు.

  శిష్యులందరూ, భక్తి గీతాలు, జాతీయగీతాలు, లలిత గీతాలు పాడగలరు.

  చాల మంది శిష్యులు కీ బోర్డ్ మీద వాయించగలరు. ఉమా చంద్రశేఖర్, పాఠశాలలో అన్ని సాంస్కృతిక కార్యక్రమములలోను … ప్రత్యేక వేడుకలలోనూ పాల్గొంటూ పెద్దల మన్ననలు పొందుతూ ఉన్నారు.  

                    …………

                       9

 

  గురువుగారు, అయ్యగారి సోమేశ్వరరావు గారితో సరి సమానంగా బిరుదులు సత్కారాలు అందుకున్న పప్పు సోమేశ్వరరావుగారి వారసులు కూడా సంగీతజ్ఞులే.

  క్రమం తప్పని సాధన, సంగీత సరస్వతికి అంకిత భావన, సోమేశ్వరరావులిరువురిని సంగీత కళాకారులని చేశాయి.

  నిరంతరం నాదామృతాన్ని ఆస్వాదిస్తూ, సంగీతాభిమానులకు ఆనందాన్ని పంచుతూ కుటుంబంలో అందరినీ సంగీత జ్ఞానులను చేసిన పుంభావ సరస్వతులు.

 

  అందరినీ అలరించే వీణా గానం చేసే కళాకారులకి ఆహ్లాదం వినోదం కలిగించడం ఎలాగబ్బా అని సందేహం రావచ్చు…

  సంగీత కళాశాలలో వీణ అధ్యాపకునిగా పని చేస్తున్న పప్పు సోమేశ్వరరావుగారు చూడటానికి ఏదో ఆలోచిస్తున్నట్లు సీరియస్ గా ఉంటారంటారు. ఎవరైనా పలుకరిస్తే మాత్రం ఆప్యాయంగా నవ్వుతారు.

  వారికి కుటుంబం తో గడపడం చాలా ఇష్టం. మంచి హాస్య ప్రియులు కూడా.

  తండ్రులెవరికైనా పిల్లలతో గడప గలిగితే అంతకంటే కావసింది ఉండదు. పప్పు సోమేశ్వర్రావు గారు కూడా అంతే.

  రోజువారీ కార్యక్రమాల్లో కాసింత మార్పు కావాలని దంపతులిద్దరూ, పిల్లలు నలుగురూ హైద్రాబాద్ లో రిక్షాలో కూర్చుని సినిమాకి బయల్దేరుతారు.

  అంతమంది ఎలా కూర్చో గలిగారో ఊహాతీతమే. ఇష్టమైన పని చేస్తుంటే కష్టమనిపించదు అంటుంది జయలక్ష్మి, వారి పెద్దమ్మాయి.

  అమ్మాయిలు… జయలక్ష్మి, ఉమాదేవి కాళ్లు కిందికి వేళాడేసుకుని కూర్చుంటే, “రోడ్డుమీద వెళ్తున్న వారందరూ మమ్మల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది…” అంటుంది ఉమా దేవి. అయినా సినిమాకి కదా సర్దుకుంటారు.

  సోమేశ్రరావుగారు పంథొమ్మిది వందల డెబ్భైయవ దశకం చివరలో హైద్రాబాద్ లో స్వంత గృహం నిర్మాణం చేసుకున్నారు.

 

  అప్పటికే ఇద్దరమ్మాయిలకీ పెళ్లిళ్లు అయాయి. పెద్దబ్బాయి చంద్రశేఖర్ కి 1981 లో వివాహం అయింది. చిన్న అబ్బాయి ప్రసన్న ఇంకా చదువుకుంటున్నాడు.

  ఆ రోజు శ్రీరామనవమి…

  కాలనీలో పందిరి వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఆ కాలనీలో కళ్యాణం పప్పు సోమేశ్వరరావు దంపతులు జరిపిస్తారు.

  ఆ ఏడు, ఇద్దరమ్మాయిలూ, అల్లుళ్లూ, అబ్బాయి, కోడలూ అందరూ వచ్చారు. కన్నుల పండువగా ఉంది గానమారుతి (పప్పు వారి ఇంటికి పెట్టిన పేరు).

  శ్రీరాముని కళ్యాణం, తదుపరి విందు కార్యక్రమం. వేదిక మీద సీతారాముల్లాంటి సోమేశ్వరరావు దంపతులు పట్టు బట్టలు కట్టుకుని కూర్చుని చేస్తుంటే, చూస్తున్న వారికి రెండు కళ్లూ సరిపోవనిపిస్తుంది.

  సాయంత్రం పందిట్లో కుటుంబ సభ్యుల వీణా వాయిద్యం తప్పకుండా ఉంటుంది

  మరి ఇటువంటి కుటుంబంలో పిల్లలకు సంగీతాభిమానానికి కొదవే ముంటుంది.

 

  వారి పెద్దమ్మాయి అయ్యగారి జయలక్ష్మి. సంగీత సాహిత్య

సరస్వతి... మన రెండవ కథా నాయిక. తన గురించి తెలుసుకున్నాము… తెలుసు కుంటున్నాము.

  “మళ్లీ జన్మ అంటూ ఉంటే జయలక్ష్మి నాకు కూతురుగా పుట్టాలి…” జయలక్ష్మి గురించి పప్పు సోమేశ్వరరావుగారు చెప్పిన మాటలు. తండ్రి ఇలా చెప్తుంటే విన్న ఏ కూతురుకైనా ఒడలు పులకరించక మానదు.

  “ కన్నపిల్లలంటేఎవరికైనా అభిమానముంటుంది. కానీ జయలక్ష్మి అంటే మాకు గౌరవంతో కూడిన అభిమానం… అభిమానం తన హక్కు. గౌరవం తను సంపాదించుకున్నది.” జయలక్ష్మి వాళ్ల అమ్మగారు తన గురించి ఆప్యాయంగా అన్న పలుకులు.

  “జయలక్ష్మీ నువ్వు జంటిల్మాన్. నువ్వు మా కోడలివి అయావు కనుక మా ఇంటికి ఉపయోగ పడ్డావు. ఇదే అబ్బాయివి అయుంటే మా తమ్ముడికి ఉపయోగ పడేదానివి.” ఈ మాటలు శ్యామసుందరం తల్లిగారు, మన మొదటి కథానాయిక, జయకుమారి అన్న మాటలు.

 

  అక్కగారి స్ఫూర్తితో, వంశపారంపర్యంగా అందుకున్న

సంగీతం మీది ఆసక్తి, వారి అబ్బాయి చంద్రశేఖర్ ని పిన్న వయసులోనే పెద్ద విద్వాంసుడిని చేశాయి.

  ఆకర్షణీయమైన రూపం, సహజమైన, సదా పెదవుల మీద నిలిచే చిరునవ్వు, అందరితో కలిసి పోయే తత్వం… వైణిక సార్వభౌమ పప్పు చంద్రశేఖర్ ని పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రీతి పాత్రుడిని చేశాయి.

  చంద్రశేఖర్ చిన్న వయసులోనే ‘ఏ’ గ్రేడ్ కళాకారునిగా పేరు తెచ్చుకుని అనేక వందల కచేరీలు చేశాడు. దురదృష్టవశాత్తూ చిన్నతనం లోనే రోడ్ యాక్సిడెంట్ లో కాలం చేశాడు. ఒక మంచి కళాకారుని కోల్పోయింది సంగీత ప్రపంచం.

 

  జాతస్య మరణం ధ్రువం అనేది నిజమైనా, యశోకాయులైన నట, గాయక కవీశ్వరులు, జరా మరణముల కతీతులై సదా ప్రకాశిస్తారు.

  మనకు వ్యాసుడు, వాల్మీకి, పోతన, శ్రీనాథుడు మొదలైన కవులు… యమ్మెస్. సుబ్బలక్ష్మి, డి.కె పట్టమ్మాళ్, మంగళంపల్లి బాలమురళీ, శంకరశాస్త్రి, చిట్టిబాబు వంటి గాయకులు మంచి ఉదాహరణలు. అయ్యగారి సోమేశ్వరరావు గారు కూడా ఆ కోవలోకే వస్తారు.

  పప్పు చంద్రశేఖర్ కూడా వారి సరసన నిలిచాడు.

  ఇక్కడ భర్తృహరి తన సుభాషితంలో చెప్పిన ఒక శ్లోకం స్మరించుకుందాము…

 

  ““జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

  నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం||”

 

  “రస సిద్ధులు అయిన కవులు, కవీశ్వరులు కలకాలం నిలిచి పోతారు. ముసలితనం వల్ల, మృత్యువు వల్లా వచ్చే భయాలు ఈ యశః కాయులకు ఉండవు.”

  ఈ సుభాషితం కేవలం కవులకే పరిమితం కాదు. ఏ కళా కారునికైనా… యశోకాయులకు ఎవరికైనా వర్తిస్తుంది.

  కళలకూ, కళాకారులకూ మరణం లేదు. చంద్రశేఖరం ఉనికి ఉల్లాస సహితం, ఉత్తేజ భరితం. సంగీతం అంటే ప్రాణం, సంగీతమే ఊపిరి.

  కఠోర సాధన, నిజాయితీ, క్రమశిక్షణ, సమయ పాలన చంద్రశేఖరం బాట.

  తండ్రిగారితో కలిసి ఢిల్లీ వంటి అనేక సభలలో కచేరీలు… తాను స్వతంత్రంగా ఎన్నో కచేరీలు చేశాడు.

  ఆకాశవాణి ఢిల్లీలో, హైద్రాబాద్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేశాడు.

  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ప్రపంచ స్థాయి కీర్తి అందుకునే బంగారు భవిష్యత్తు ముందు ఉండగా, ఒక సినీ నటుడి తొందరపాటు డ్రైవింగ్ కి బలై పోయాడు… తన కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచి.

  అందమైన, గుబాళింపు ఇచ్చే పూలను ముందుగా భగవంతుడు తన అక్కున చేర్చుకుంటాడుట.

  కిన్నెర, కింపురుష యక్ష, గంధర్వాదులను తన వీణా వాదనతో అలరించాలనేమో, చంద్రశేఖర్ ను తొందరగా తీసుకుని వెళ్లి పోయాడు పరమాత్మ.

 

  పప్పు సోమేశ్వరరావుగారింట నిరంతరం వీణా నాదం వినిపిస్తూనే ఉంటుంది. ముందరి గది ఇంటి యజమానికి ప్రత్యేకం. అక్కడ సరస్వతీ దేవి కొలువై ఉంటుంది.

  ఎవరు ఎప్పుడు వెళ్లినా వారు వీణ వాయించు కుంటూనే కనిపిస్తారు.

  వీణ సాధన, లేదా కృతుల రచన చేస్తుంటారు. వారు సంస్కృతాంధ్ర పండితులు. భానుమతి కొంత వరకూ నేర్పి పంపించిన సీనియర్ క్లాసు విద్యార్ధులకు అడ్వాన్స్డ్ పాఠాలు చెప్తుంటారు.

  మధ్య హాలులో వారి ధర్మపత్ని భానుమతి గారి సంగీత ప్రపంచం. నాలుగైదు సంవత్సరాల వయసు వారి నుండి నలభై సంవత్సరముల వరకూ శిష్యులు, శిష్యురాళ్లు… వచ్చే పోయే బంధువులు… అందరితో సందడే సందడి.

  పిల్లలకు వివాహాలు అయాక మేడ మీద కూడా గదులు వేశారు.

  చంద్రశేఖరం సంసారం మేడమీదికి మారింది. అక్కడ భార్యా పిల్లలతో… తన సంగీత సామ్రాజ్యం ఏర్పరచుకున్నాడు.

  ద్వితీయ కుమార్తె ఉమ… అక్క తో సమంగా సంగీత సాధన చేసేది. వివాహానంతరం అమ్మగారింటి పక్కనే… అమ్మకి సంగీత బోధనలో, ఇంటి పనులలో సహాయం చేస్తూ చేదోడుగా ఉంటూ నివాసం.

  చిన్నకుమారుడు ప్రసన్నకి సంగీతం మీద అంత ఆసక్తి లేకపోయినా, అతని భార్య పద్మ డిప్లొమా పాసయి, అత్తగారి వారసత్వం పుచ్చుకుంది. ఎందరో శిష్యులను ఏర్పరచుకుంది.

  వారి ఇంటికి వెళ్తే, హాలంతా తివాచీలు, వాటి మీద వీణలు… అవి వాయిస్తూ ఉన్న సరస్వతీ స్వరూపాలు స్వాగతం పలుకుతారు.

  అప్పుడప్పుడు వస్తూ ఉండే జయలక్ష్మి, పిల్లలు… ఆహ్లాదంగా పరిహాసాలాడుకుంటూ కలసి మెలసి ఆనందంగా సాగుతున్న ఉమ్మడి కుటుంబం.

(చివరి భాగం వచ్చే గురువారం)



No comments:

Post a Comment

Pages