కచ్ఛపి నాదం - 9
మంథా భానుమతి
కల్లా కపటం తెలియని ప్రపంచం. అటువంటి ప్రదేశాన్నే
భగవంతుడు తన పరీక్షకి ఎన్నుకుంటాడేమో!
“ఇప్పుడే బజారుకెళ్లి వస్తానమ్మా!” అని కిందికి
వచ్చి చెప్పి వెళ్లిన వాడు ఇంక రాలేడని, రాడని ఎవరైనా అనుకోగలరా?
పోనీ పెద్ద ట్రాఫిక్ ఉన్న రోడ్లు కూడా కాదు. కాలనీలోనే
రెండు వీధులవతల, ఒక యువకుడు నిర్లక్ష్యంగా నడుపుతున్న వాహనం… తనని ఢీ కొడ్తే ఫుట్ పాత్
మీద పడి తగుల కూడని చోట దెబ్బ తగిలి విన కూడని వార్త వింటే ఆ కుటుంబ సభ్యులు ఎలా భరించగలరు
‘వైణిక సార్వభౌమ’, ‘వీణా నాద సుధార్ణవ’ పప్పు చంద్రశేఖర్,
విశ్వ వ్యాప్తంగా, ఎన్నో కచేరీలు చేసి, మరెన్నో పురస్కారాలు అందుకొన వలసిన వాడు… అతని
వీణా నాదంతో తననే అలరించాలని అనుకున్నాడేమో… భగవంతుడు తన లోకానికి తీసుకుని పోయాడు.
కళకళలాడుతూ ఉండే గాన మారుతి గృహం ఒక్క సారిగా అస్తవ్యస్తమైపోయింది.
అనుకోని పరిస్థితులెదురైతే ఎదుర్కునే ధైర్యం వాటిని
సృష్టించిన వాడే ఇస్తాడు.
నెమ్మదిగా తమ తమ నిత్య కృత్యాల క్రమంలోకి అందరూ
ప్రవేశించారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా.
ఆనందమైనా, దుఃఖమైనా… కొంత కాలానికి మనుషుల మనసుల్లో
మరుగున పడిపోతుంది.
తరువాతి తరం అందుకోవాలి… వారి చదువులూ, సంగీతం,
ధ్యేయం… జీవితం సాగిపోతూనే ఉంటుంది.
పాత తరం వెెెెెెెెెెెెెెళ్లి పోవటం, కొత్త తరం అందుకోవడం
ఎటువంటి పరిస్థితుల్లో నైనా సహజ ప్రక్రియ.
……………
పప్పు సోమేశ్వర్రావుగారు వాగ్గేయకారులు. వారు
1972 లో నవగ్రహ కీర్తనలు కాక, మరి కొన్ని కీర్తనలు సర్వ దేవతలనూ స్తుతిస్తూ రచించారు.
సంస్కృత, జ్యోతిష్య శాస్త్రాలలో కూడా నిష్ణాతులవటం
వలన ఆ శాస్త్రాలను అన్వయిస్తూ సకల దేవతల మీద కృతులు రచించారు.
రచించిన కృతులు ఒక పదేళ్ల పాటు వెలుగు చూడలేదు.
పెద్ద కారణాలు ఏం లేవు…ఆ కృతుల విలువను అర్ధం చేసుకుని ప్రోత్సాహించే వారు ఉంటే బైటికి
వచ్చేవి.
మంచి రచన చేసినప్పుడు ఆ రచనలను అందరికీ అందజేసే
లాగ ప్రయత్నం చేయాలి. లేకపోతే మరుగున పడిపోతాయి.
అటువంటివే చరిత్రలో దొరికిన అజ్ఞాత రచయితల కావ్యాలు,
పద్యాలు, కీర్తనలు.
అయితే పప్పువారి ఇంట్లో ఆలస్యమయితే అవచ్చు కానీ…
ప్రోత్సాహానికి పరిమితి లేదు.
వారి శ్రీమతి భానుమతి, కుమార్తె ఉమాదేవిల విన్నపాల
తరువాత తను వాటిని స్వయంగా వీణ మీద వాయించి త్యాగరాజ గానసభలో ఆవిష్కరించారు.
ఈ కీర్తనలను పుస్తకరూపంలోకి తీసుకురమ్మని పదే పదే,
అల్లుడు శ్రీ శ్యామసుందర్ గారిని కోరే వారు. శ్యామసుందర్ కి కూడా మామగారి కోరిక మన్నించాలనే
ఉంది.
దేనికైనా సమయం రావాలి…
శ్యామసుందరం వారి అమ్మాయి కళ్యాణి వివాహ సమయంలో,
అంతులేని పని ఒత్తిడిలో కూడా ప్రింటింగ్ ప్రెస్ లో ప్రతీ రోజూ కూర్చుని కంపోజ్ చేయించి,
పుస్తక రూపంలో ముద్రించి, పుస్తకావిష్తరణ చేయించారు.
కళ్యాణి పెళ్లి ఒక పండిత సభలా ఉందని అందరూ మెచ్చుకున్నారు.
మరి రెండు సంవత్సరాల తర్వాత ఆ కీర్తనలను సి.డి రూపంలో
తీసుకు వచ్చారు.
పప్పు సోమేశ్రరావు గారి అమ్మాయి ఉమాదేవి ప్రోత్సాహంతో
వాళ్ల అమ్మగారు, భానుమతి గారు చొరవ తీసుకుని సిడిలు చేయించారు.
పాట రూపంలో అయితే సాహిత్యం అందరికీ అర్ధమవుతుందని
ఖర్చుకి వెను కాడ వద్దని చెప్పింది ఉమాదేవి.
పైగా… “ఇంకొక అమ్మాయి ఉంటే వివాహం చేసే వారు కదమ్మా!
ఖర్చుకి వెనుకాడే వారా… ఇదీ అంతే” అని ఒప్పించింది.
ఇక్కడ ఉమాదేవి గురించి కొంత చెప్పాలి. తను కూడా
సంగీతం నేర్చుకుంది. శిష్యులను తయారు చేయగల సమర్ధురాలు. అయితే శాపగ్రస్థ అని చెప్పవచ్చు.
ఉమాదేవి, భర్త ఓరుగంటి శర్మగారు ఇద్దరూ పరోపకారులు.
ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే వారు.
శర్మగారు జ్యోతిష పండితులు. ఎంత తెలిసిన వారైనా
కర్మ కి అతీతులు కారు.
కుటుంబానికి, సన్నిహితులకు కొండంత అండగా ఉండవలసిన
వారు. కానీ… వాళ్లని బందీలు చేసేశాడు భగవంతుడు.
ఉమాదేవి మాటల్లో చెప్పాలంటే… ఇద్దరు మునీశ్వరులను
పిల్లల రూపంలో ఇచ్చాడు. ఇద్దరూ డౌన్ సిండ్రోమ్ బాధితులు. ఎంత వయసు వచ్చినా చంటి పిల్లలే.
వారి సేవ లోనే జీవనం అయిపోయింది శర్మ దంపతులకి.
అంత భౌతిక మానసిక వేదనలో కూడా ఓరుగంటి శర్మ దంపతులు
ఎవరు కనిపించినా చిరు నవ్వుతో పలుకరించి యోగక్షేమాలు అడిగే వారు. దంపతులిరివురినీ కొద్ది
తేడాలో తమ వద్దకు రప్పించుకున్నాడు పరమాత్ముడు. పిల్లిద్దరినీ వదిలి వెళ్లాల్సి వస్తోందని
వేదనతో కన్ను మూశారు వారు.
సాధారణంగా అటువంటి పిల్లలు తొందరలోనే భగవంతుని చేరుకుంటారు.
కానీ ఆ మునీశ్వరులకి నలభై సంవత్సరాలు పైగా ఆయుర్దాయముంది.
పరిస్థితిని ఏర్పాటు చేసిన పరమాత్ముడే పరిష్కారాన్ని
కూడా పంపిస్తాడు. శర్మగారి తమ్ముడు, చిన్నశర్మ అతని భార్య కంటికి రెప్పల్లా చూసుకుని,
పిల్లల్ని స్వర్గానికి సాగనంపారు.
“ప్రపంచంలో ఎవరికైనా బాధలున్నాయనిపిస్తే తన జీవితాన్ని
చూసి… పెద్దగీత, చిన్నగీత…” అనుకోమనేది ఉమాదేవి నవ్వుతూ!
అటువంటి వారే శ్రీకృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞులు.
ఆ నవగ్రహ కీర్తనలు స్వరం కట్టి పాడించడానికి శ్యామసుందరం
మామగారి అనుమతి తీసుకుని, పాడడానికి అనువుగా తన బాణీ కి మార్చేశారు.
పప్పువారి కృతులు, వారు సూచించిన రాగాలలో, అయ్యగారి
శ్యామసుందరం గారి స్వర రచనతో రూపొందాయి.
విజయవాడ లో మల్లాది సోదరులూ, మోదుమూడి దంపతులూ,
విష్ణుభట్ల సరస్వతి, మండా కృష్ణమోహన్, నర్సమ్మ గార్లు పాడుతూ ఉండగా, శ్యామసుందరం వీణ,
పాలపర్తి వారు వయోలీన్, ఫల్గుణ్ మృదంగం తో… మొదటగా నవగ్రహ స్తోత్రంతో అద్భుతమైన నవగ్రహ
కృతులు ఏర్పడ్డాయి.
ఈ కృతులకు ముందుమాట బాలమురళీ గారు రచించారు.
దీక్షీతార్ కృతులతో సమాన స్థాయిలో రాగాల మేళవింపు
జరిగింది.
కీర్తనలను విన్నవారు, అద్భుతమైన రచన, అత్యంత అద్భుతమైన
సంగీతం అనకుండా ఉండలేరు.
ఈ నవగ్రహ కీర్తనలను నేర్చుకొనినా, విన్నా ఆయా గ్రహాల
కృపకు పాత్రులవుతారనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
……….
10
బాపట్ల, విజయవాడ:
అయ్యగారి వారి, పప్పు వారి జీవన యానంలో ప్రముఖ పాత్ర
వహించాయి బాపట్ల, విజయవాడ పట్టణాలు.
పప్పు వారి అమ్మాయి, అయ్యగారి వారి కోడలు… జయలక్ష్మి
మాటల్లోనే బాపట్ల, విజయవాడల్లో జరిగిన విశేషాల గొప్పదనం తెలుసు కుందాం.
“మా అత్తయ్య, మా అమ్మమ్మ కూడా బాపట్లలో ఉండే వారు.
‘అలాగే కదా మా అమ్మా నాన్నల పెళ్లి అయింది.’ అందుకనే మా ఇద్దరికీ బాపట్ల అంటే చాలా
ఇష్టం.
మా ఇద్దరి జీవితాలలో ప్రముఖ సంఘటనలన్నీ బాపట్ల లోనే
జరిగాయి. మా వారు, శ్యామసుందరం గారి చిన్నతనం అంతా అక్కడే గడిచింది.
అక్కడ వారు చేేసిన అల్లరి పనులు… లెక్క లేదు.
బాపట్లలో ఉన్నప్పుడు చాలా చిన్నవాడు… కానీ,
పక్షిలా
ఎగరాలనీ, మబ్బుల్లో నడవాలని, కాళ్లకి పసరు పూసుకుని ఆకాశంలో తిరగాలని, కుక్క పిల్ల
మీసాలు పీకాలని, ఇంటికి వచ్చిన వారి చెప్పులు దాచేసి వాళ్లు వెతుక్కుంటుంటే తెచ్చి
ఇవ్వాలని… ఏవేవో ఊహలు ఉండేవి.
వీలైనవి చేసే వారు కూడా!
ఒక సారి వాళ్లింటికి ఆ అల్లరి పిల్లాడి మేనమామ వచ్చారు.
ఇంక ఆ కృష్ణయ్యకి ఎంత ఆనందమో. మావయ్య, తన సంచీ లోంచి బ్రష్షు, పేస్టు తీసి… బ్రష్ మీద
పేస్ట్ వేసుకుని పెరట్లోకి వెళ్లారు దంత ప్రక్షాళనకి.
మన చిన్నారి హీరో పేస్టు వాసన చూశాడు. అది స్ట్రాంగ్
పిప్పరమెంట్ వాసన వేసింది. ఇంకేం… పాదరసం లాంటి బుర్ర కదా! కొంచెం పేస్ట్ తీసి అలమార్లో
తలుపుకి గుండ్రంగా బిళ్ల ల్లాగా అతికించాడు… ఎండాక పిప్పరమెంట్ అవుతుందని. కొంత తీసి
మొహానికి పూసుకున్నాడు, స్నో లాగ ఉందని.
మొహం మండి పోతోంది. గట్టిగా ఏడవాలని ఉంది కానీ చేసిన
పనికి దెబ్బలు పడతాయని తెలుసు. కళ్లలోంచి నీళ్లు కారి పోతున్నాయి…
సగానికి పైగా పేస్టు ఖాళీ. మావయ్య వచ్చి చూశాడు…
ఒళ్లు మండి పోయింది. కానీ బాగుండదని ఊరుకున్నాడు. కాబోయే అల్లుడు కదా మరి!
వచ్చిన అతిథి ఊరుకున్నా వాళ్ల నాన్నగారు ఊరుకుంటారా?
ఊరుకోలేదు... అయితే ఏదైనా చేసే లోపే వాళ్ల అమ్మగారు చటుక్కున తీసుకెళ్లి మొహం కడిగి,
వెన్న రాశారు. అప్పుడు శాంతించారు అందరూ!
నేను పుట్టింది, పదవ తరగతి చదవింది, మా పెళ్లి జరిగింది
బాపట్లలోనే.
మా వారు గుంటూరు కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు
టైం దొరికితే ఏం చేసే వాళ్లమో తెలుసా?
గుంటూర్లో అన్ని సినిమా హాళ్లున్నాయి, సినిమాకి
వెళ్లా మనుకుంటున్నారా? కాదు… కానే కాదు!
బస్సెక్కి బాపట్ల వెళ్లి అక్కడ మాయాబజార్ వరకూ రిక్షాలో
వెళ్లి, దిగిపోయి… నడుచు కుంటూ మాయాబజార్ అంతా తిరిగి, బస్టాండుకు వచ్చి బస్సెక్కి
గుంటూరులో దిగే వాళ్లం.
అందరూ ఇదేం వెఱ్ఱి? అనుకున్నా సరే...
మద్రాస్ వెళ్తున్నప్పుడు బాపట్ల రాత్రి పూట వచ్చినా
సరే లేచి చూడాలని ఉండేది. కళ్లు నిద్రతో కూరుకు పోతున్నా ఫర్లేదని లేచి కూర్చునే వాళ్లం.
అయితే స్టేషన్ వచ్చినప్పట్నుంచీ ఊరు వెళ్లి పోయే
వరకూ పక్క పట్టాల మీద… ఈ చివర్నుంచి ఆ చివరికి గూడ్సు బండి. నేను గట్టిగా తిట్టుకుంటుంటే…
గురువుగారు, మర్నాడు కచేరీలో వాయించ వలసినవి చూసుకుంటున్నవారు…
లేచి బాపట్ల సోడా ఇప్పించి, కళ్లు మూసుకుని పడుకోమనే వారు.
బాపట్ల ఎంత అందంగా ఉంటుందంటే… మల్లె పూలు, మంచి
వంకాయలు, చల్లని సాయంత్రం, రాత్రి దూరంగా ఎక్కడి నుంచో చక్కని పాటలు… మంచి నెయ్యి,
దూరంగా తాటి తోపులు.
ఆ తాటి తోపుల అవతల ఉంటుంది… ప్రఖ్యాతి గాంచిన స్టువర్టు
పురం.
అక్కడి దొంగలు పిచ్చివాళ్లు పాపం… రాత్రి పూట వచ్చి,
దోచుకుందామనుకున్న ఇంట్లో ఉన్న చద్దన్నం బావి గట్టు మీద కూర్చుని తినేసి, వాళ్లందరి
చెప్పులూ… అరవకుండా కుక్కల మీదకి విసురుకుంటూ వెళ్లి పోయేవారు.
వాళ్లు చద్దన్నం తినడానికే వచ్చినట్లుండే వారు…ఎంత
దొంగలైనా ఆకలేస్తుంది కదా పాపం!
ఆ రోజుల్లో బాపట్ల ప్రశాంతంగా ఎంతో అందంగా, పూల
మొక్కలూ, మేడ మీది నుంచి వెళ్లే మబ్బులూ, చల్లగాలులూ… ఎంత బాగుండేదో.
అప్పుడు సీలింగు ఫాన్లు లేవు. టేబుల్ ఫాన్ ఒకటే
ఉండేది ఇంటిల్లిపాదికీ. అయినా హాయిగా పడుక్కునే వాళ్లం. ఇప్పుడేమో ఏ.సి ఉంటే కానీ నడవదు
జీవితం.
ఆ మనుషులమే కానీ అలవాట్లు మారి, సుఖాలకు అలవాటు
పడిపోయాం.
మేము పదవ క్లాసు బాపట్లలో చేరడానికి వెళ్తే, మమ్మల్ని
మహారాణుల్లా చూశారు. హైదరాబాద్ నుంచి వచ్చాం మరి… కొద్దిగా వాళ్ల కంటే తెల్లగా ఉన్నాం
కదా… అందుకని.
కొంచెం స్టైల్ గా ఉండే వాళ్ల మేమో… నిజం. నేను గొప్పలు
చెప్పుకోవడం లేదు.
కానీ వాళ్లకు తెలీదు పాపం!
ఎంత హైద్రాబాద్ వాళ్లం అయితేనేం మాకు చిక్కడపల్లి
నుంచి నారాయణ్ గుడా వరకు మాత్రం వెళ్లడం తెలుసు. హిందీ కలిసిన ఉర్దూ మాట్లాడటం రాదు.
ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయం.
ఇంక మాకూ వాళ్లకీ తేడా ఏముంది? అదే భ్రమ అంటే.
నేను హైద్రాబాద్ లో తొమ్మిదో తరగతి వరకూ ఇంగ్లీష్
మీడియం లో చదివి, పది మాత్రం బాపట్లలో ఇంగ్లీష్ /తెలుగు మీడియంలో చదివినా… ఊరంతటికీ
ఫస్ట్.
బుర్ర ఉందండీ. బుర్ర బాగా ఉంది. పైగా బట్టీ కొట్టడం
వచ్చు. ఇంకేం కావాలి?”
మధ్యలో సినిమాలు… ఒక్క సినిమా చూడాలంటే ఎంత కష్టపడాలో!
ఎంత మందిని కాకా పట్టాలో! ఒక్క రూపాయి కూడా దొరికేది కాదు. ఎలాగో పెద్దమ్మ దగ్గర గారాలు
పోయి, రూపాయి సంపాదించి పక్కింటి అత్తయ్యగారితో సినిమాకి వెళ్లామా… శిఖరారోహణం చేసినంత
ఆనందం. ఆ అత్తయ్యగారు వారానికి రెండు సినిమాలు చూసేది. కొత్తది లేకపోతే మూడో సారి పాతదైనా
ఫరవాలేదు. మరి ఇంట్లో ఏం మాయ చేసేదో!
విజయవాడ: “పదవ తరగతి తరువాత విజయవాడ వచ్చేయ వలసి
వచ్చింది. కొన్ని కుటుంబ కారణాల వల్ల ఇంటర్ లో చేర లేక పోయాను.
విజయవాడలో ఇంకొక పెద్దమ్మ గారింట్లో ఉండి, (అమ్మ
వాళ్లు ఆరుగురు సిస్టర్స్) ఇంగ్లీషు, తెలుగు టైపు రైటింగు నేర్చు కుంటూ, దక్షిణ భారత
హిందీ ప్రచార సభలో రాష్ట్ర భాష చదువు కుంటూ… కాబోయే మామగారు అయ్యగారి సోమేశ్వర్రావు
గారి దగ్గర సంగీతాభ్యాసం చేస్తూ ఎనిమిది నెలలు గడిపాను.
మేనకోడలు మేనకోడలే, సంగీతం సంగీతమే… తప్పు చేసినా,
సాధన చెయ్యకపోయినా పనిష్మెంటు తప్పదు.
విజయవాడలో సినిమాలే సినిమాలు.
మ్యూజిక్ కాలేజీలో మూడో సంవత్సరం ఫస్ట్ వచ్చాను.
అక్కడ అభ్యాసం అంత చక్కగా ఉండేది. రాష్ట్రభాష లో డిస్టింక్షన్. టైపు మాత్రం పరీక్షకి
వెళ్లలేదు.
పది నెలలు అవుతుండగా మే 15 న బాపట్లలో ఒక విశేషం
జరిగింది. అదే… మా వివాహం.
మరి బాపట్ల, విజయవాడ… అయ్యగారి, పప్పు వాళ్ల కుటుంబంలో
మార్పులు తెచ్చిన ప్రధాన మైన పట్టణాలంటే అందరూ నమ్మాలిసిందే!”
………..
మూడవ తరం:
అయ్యగారి శ్యామసుందరం గారి వారసులు ఆదిత్య, కళ్యాణి
వీణా వాదనలో నిష్ణాతులు. ఇద్దరు పిల్లలూ పుట్టాక, హైద్రాబాద్ నుంచి విజయవాడకి మారారు
శ్యామసుందరం దంపతులు అని తెలుసుకున్నాం.
విజయవాడ కాలేజి నుంచి బదిలీ మీద గుంటూరు తరలి వెళ్లారు
శ్యామసుందరం. అక్కడ అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా చేశాక మళ్లీ విజయవాడ ట్రాన్సఫర్…
విజయవాడలోనే 2005 లో ప్రిన్సిపాల్ గా రిటైర్ అయారు.
కృష్ణ
నగర్- గుంటూరు.
గుంటూరులోనే తమ వృత్తులలో స్థిరపరచే కీలకమైన పదో
తరగతి, ఇంటరు చదివారు, ఆదిత్య, కళ్యాణి.
వీణ కూడా దీక్షగా నేర్చుకోవలసిన వయసు.
జయలక్ష్మికి వీణ నేర్చుకునే విద్యార్ధులు ఎక్కువయారు.
మామూలు సమయాల్లో అయితే తను విద్యార్ధులకు నేర్పుతూ, పిల్లల మీద పూర్తి ధ్యాస పెట్టలేనని,
కరెంట్ పోయినప్పుడు వాళ్లకి వీణ నేర్పడం, ప్రాక్టీస్ చేయించడం చేసేది.
చీకటిలో కొవ్వొత్తి ముందు పెట్టుకుని సాధన… ఇంకేమీ
కనిపించదు. పూర్తి ధ్యాస తమ వీణల మీదే.
ఆ కొద్ది, మసక వెలుతురు లోనే బాగా వాయించుకుంటూ
ఉంటే ఆ కొవ్వొత్తి కూడా ఆర్పేసేది.
“అమ్మా! అదేంటి. ఏమీ కనిపించడం లేదు.” కళ్యాణి గొడవ
చేసింది.
“వీణ వాయించడానికి ఏమీ కనిపించక్కర్లేదు. వాయించండి.
ఏం వాయిస్తున్నాం మనం?”
“కాంభోజి వర్ణం. చిట్టస్వరం…”
గా, మ గగరిరి సా,రి గసరిస నిదపద సా,స పదస రీ,రి…
ఇద్దరూ మాట్లాడకుండా వాయించేశారు. మామూలు కంటే బాగా
వచ్చింది.
కళ్యాణికి అమ్మ, సీనియర్ శిష్యులకి వర్ణాలు నేర్పేటప్పుడు
చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది. సీనియర్లకి… అదీ పరీక్షకి తయారయే వాళ్లకి ఒక్కొక్కళ్లకే
నేర్పుతుంది జయలక్ష్మి.
ఇలాగే ఆ రోజు ఒక అమ్మాయి ముందు తెరచి ఉన్న పుస్తకం
తీసేసింది.
ఆ అమ్మాయి వాయించడం ఆపేసింది.
“ఎందుకాపేశావు చిట్టితల్లీ?”
“పాఠం లేదు కదా మేడమ్.”
“పాఠం నేర్చుకోలేదా?”
“మొదట్నుంచీ చెప్తున్నా కదా… క్లాస్ కి వచ్చే ముందు
పాఠం నేర్చుకోవాలని…”
మౌనం సమాధానం.
“ఏ పాఠమైనా సరే ముందు కంఠస్థం చేయాలి. కీర్తనల సాహిత్యం,
వర్ణాలలో మొత్తం స్వరాలు, సాహిత్యం… కృతులలో చిట్టస్వరాలు… అన్నీ చూడకుండా రావాలి.”
“చూసి వాయిస్తే తప్పేంటి మేడమ్. సరిగ్గా స్వరాలు
పడాలి కానీ…”
“తప్పేం లేదు, తప్పులు వాయించనంత వరకూ. కానీ అదంతా
బుర్రలో ఉందనుకో, నువ్వు వాయిద్యం మీద, గమకాల మీద, రాగ స్వరూపం మీద దృష్టి పెట్ట గలుగుతావు.
పెద్ద పెద్ద కచేరీల్లో, అన్నీ కంఠతా వచ్చినా పాఠం ముందు పెట్టుకుంటారు… కానీ ఎప్పుడన్నా
చూస్తారు, కొద్దిగా తల తిప్పి. తప్పు పాడకూడదని. అంతే కానీ మొదట్నుంచీ, పుస్తకంలో తల
పెట్టేసి…”
ఇంకా సందేహం తోనే చూసింది శిష్యురాలు
“రేపు పరీక్షలో కూడా చూస్తావా?”
ఖంగు తింది పాపం… అడిగినంత ఫీజు ఇస్తున్నాం కదా
ఏమంటారులే అనుకుంది.
“గాత్రం పాడేటప్పుడు కూడా ఏ పాటన్నా నేర్చుకుని,
చూడకుండా పాడండి… మీకే తేడా తెలుస్తుంది. సరే… రేపటికి కంఠస్తం చెయ్యి. ఇవేళ్టికి చూసి
వాయిద్దాం. కానీ రేపట్నుంచీ…”
“అలాగే గురువుగారూ…”
ఆ తరువాత ఆ మంచి శిష్యురాలు మళ్లీ పుస్తకం చూడలేదు.
డిప్లొమా పరీక్షలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది.
కళ్యాణి చిన్నప్పటి నుంచీ అమ్మా, నాన్నగార్లు కఠినంగా
ఉంటూ ఇచ్చిన శిక్షణ ఎంత ఉపయోగమో గ్రహించింది.
ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఎప్పుడూ పిల్లలిద్దరూ
దేనికీ వెనుకడుగు వేయలేదు.
తాము అనుకున్నది సాధించగలిగారు.
పదిమందీ మెచ్చుకునేటట్లు తమ జీవనాన్ని తీర్చి దిద్దుకున్నారు…
దిద్దుకుంటున్నారు.
ఇంకొక రోజు:
జయలక్ష్మి హాల్లోకి వచ్చి పిల్లల గది ముందు నిలబడి
చిన్నగా తలుపు తట్టి పిలుస్తోంది… ఇంకా తెల్లవార లేదు. ఐదింటికే లేచి స్నానం చేసేసి
బైటికి వచ్చింది.
“ఆదిత్యా! కళ్యాణీ! పది అంకెలు లెక్క పెట్టే లోపు
లేవాలి. మొదలెడుతున్నా… ఒ… క… టీ రెం… డూ మూ… డూ…, ఒకటీ… రెండూ… మూడూ, రెం… డూ మూ…
డూ నా… లు… గూ… రెండూ మూడూ…”
“బాగుంది. ఇలా అయితే పది అంకెలు లెక్క పెట్టే సరికి
ఎంత టైమ్ పడుతుంది? చాలా చాలా బాగుంది నీ డిసిప్లిన్.” హాల్లో బల్ల దగ్గర, కుర్చీలో
కూర్చుని ఏదో రాసుకుంటున్న శ్యామసుందరం నవ్వుతూ అన్నాడు.
“రాత్రి చాలా సేపు చదుకుని పడుక్కున్నారు. అయినా,
ఐదున్నరకల్లా లేచి పోవాలి, ఒక రోజు కూడా వీణ వాయించడం, నేర్చుకోవడం మాన కూడదనే మన నియమం
తప్పకూడదు కదా! ఏం చెయ్యాలి మరి? ఒకో సారి అనిపిస్తుంది, పిల్లల మీద మరీ ఎక్కువగా భారం
పెడుతున్నామేమో అని” జయలక్ష్మి ఆలోచిస్తూ నెమ్మదిగా అంది.
గట్టిగా మాట్లాడితే, పక్కింటి వాళ్లు నిద్ర చెడగొట్టారని
దెబ్బలాటకి వస్తారు. గవర్న్మెంట్ క్వార్టర్ అది. కింద రెండు, పైన రెండు… రెండు గదుల
ఇళ్లు.
“అదే… మాతృ హృదయం అంటే. నేను ఏమీ మాట్లాడను. ఎందుకంటే
ఆ నియమం పెట్టింది నేనే కదా!”
“మీరేంటి? అంత తొందరగా లేచేశారు. టీ తాగారా?” జయ
దగ్గరగా వచ్చి రాస్తున్న కాగితాలు చూస్తూ అడిగింది.
“యూనివర్సిటీ వాళ్లకి ఇవ్వాల్సిన వ్యాసాలు. ఇస్తానన్న
టైమ్ కి ఇవ్వాలి కదా? పాయింట్స్ రాసుకుంటున్నాను. ఇవి కొంచెం విస్తరించేసి రాయబోతున్న
అమ్మాయికి డిక్టేట్ చేస్తాను.” శ్యామసుందర్ సీరియస్ గా చూస్తూ, రాస్తున్న కాగితాలని
పక్కన పెట్టి అన్నాడు.
జయ గుండె కదలి నట్లయింది. ఎంత కష్ట పడతారూ… పోల్చి
చూస్తే తను చేసే దేముందీ!
జయ ఏమనుకుంటోందో గ్రహించేశాడు అప్పుడే… వెంటనే అన్నాడు,
“ఏమీ ఫరవాలేదు లేవోయ్… కష్ట పడితేనే మంచి ఫలితాలు
వస్తాయి. కష్టే…”
“ఫలీ… నాన్నగారు లేచేశారే అప్పు డే!” ఆదిత్య ఆవులిస్తూ
వచ్చి ఎదురుగా నిలుచున్నాడు. కళ్యాణి కూడా లేచి బాత్రూం లోకి వెళ్లింది.
“టీ పెడతాను అందరం తాగి పనులు చేసుకుందాం.” జయ వంటింట్లోకి
వెళ్లింది.
హైద్రాబాద్ లో ఉన్నప్పుడు టీ అలవాటయింది. కాఫీ కంటే
టీ ఇష్టం అందరికీ.
పిల్లలిద్దరూ పళ్లు తోముకుని వచ్చారు.
అందరూ జయ చేసి తయారుగా పెట్టిన టీ తలొక గ్లాసూ తెచ్చుకుని
కుర్చీల్లో కూర్చున్నారు.
“అమ్మా నీ చిన్నప్పటి సంగతి ఏదైనా చెప్పు. కాస్త
రిలాక్స్డ్ గా ఉంటుంది.” కళ్యాణి అడిగింది.
“బాపట్లలో టెన్త్ చదువుతున్న రోజులు…”
గట్టిగా ఊపిరి పీల్చి వదిలారు ముగ్గురూ… హూ అంటూ!
“ఏదన్నా చెప్పమంటే అమ్మ బాపట్ల అని మొదలు పెడుతుంది.
హైద్రాబాద్ లో రోజులు గుర్తుకు రావామ్మా?” ఆదిత్య అంటుంటే కళ్యాణి కిసుక్కున నవ్వింది.
“హైద్రాబాద్ లో ఏముంది? పొద్దున్న లేస్తే ఉరుకులు
పరుగులు. రోడ్డు మీదికి వెళ్తే నడవడానికి లేకుండా ఫుట్ పాత్ ల మీద షాపులు. సూర్యుడు,
చంద్రుడు కనిపించని ఇళ్లు. తెలుగు వచ్చినా ఉర్దూ- హిందీలో మాట్లాడే షాపుల వాళ్లు”
“సరే సరే… చెప్పు. ఇదివరకు చెప్పనిదే ఉండాలి సుమా!”
కళ్యాణి వినడానికి తయారయి అంది.
“వేసంకాలం. రాత్రే డాబా మీద నీళ్లు చల్లి, అందరికీ
పక్కలేసి, ఒక పక్కగా కూజాలో నీళ్లు పెట్టుకుని, దాని మీద గ్లాసు బోర్లించి వచ్చాము
నేను, మా పెద్దమ్మా.
అందరం అన్నాలు తిని, పైకి వెళ్లాం. ఆకాశంలో వెన్నెల,
చల్లని గాలి ఆస్వాదిస్తూ… ఎవరి పక్క మీద వాళ్లం కాసేపు కూర్చుని, ఆ రోజు విశేషాలు చెప్పుకుని
పడుక్కున్నాం. సరిగ్గా ఒక గంటైనా పడుకున్నామో లేదో… అంతే మొదలయింది.
చిరుజల్లు. కారు మబ్బులు కమ్ముకున్నాయి. గబగబా లేచి
ఎవరి పక్క వాళ్లు తీసుకుని కిందికి పరుగెట్టాం.
“పక్కలేసేటప్పుడు ఒక్క మబ్బు లేదే, ఆకాశంలో… చుక్కలు
చక్కగా కనిపించాయి. ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయో…” అమ్మమ్మ ఆయాస పడుతూ అంది. కింద హాల్లో
పక్క వేసుకుని, తాటాకు విసిని కర్రతో విసురుకుంటూ.
“మీ కోనసీమ నుంచి వచ్చుంటాయిలే అమ్మమ్మా!” టేబుల్
ఫాన్ దగ్గరగా నా పక్క వేసుకుని నిద్ర కళ్లతో అంటూ పడుకున్నా. మా అమ్మమ్మకి కోనసీమ పేరు
ఎత్తుతే చాలు ఎక్కడలేని ఆవేశం వచ్చేస్తుంది.”
“నీకు బాపట్ల లాగానా…” ఆదిత్య అనేసి గబగబా వీణ తెచ్చుకోడానికి
వెళ్లిపోయాడు.
“అవునమ్మా… అప్పట్లాగ డాబా మీద పడుకోవటాలు అవీ లేవు
ఇప్పుడు... డాబా ఉన్నా, పైకి ఎక్కామా దోమలు ముసిరి పోతాయి… మంచి విందు దొరికిందని.”
ఉక్రోషంగా చూస్తున్న జయని ఊరడిస్తున్నట్లు భుజం మీద చెయ్యి వేసి హత్తుకుని, తను కూడా
వీణ తెచ్చుకోడానికి వెళ్లింది కళ్యాణి.
చిదానంద స్వరూపుడు శ్యామసుందర్… కాగితాలు మూసేశాడు.
చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు.
తివాసీ వేసి నాలుగు వీణలూ అమర్చాడు ఆదిత్య.
ప్రభాత సంగీతం మొదలయింది. శ్యామసుందర్ రాగం వాయించటం
ఆరంభించాడు.
“ఇది ఏ రాగం?”
“హనుమత్తోడి.” కళ్యాణి వెంటనే చెప్పింది. ఆదిత్యకి
కూడా తెలుసు కానీ చెల్లెలికి వదిలేస్తాడు… అదే కొత్త రాగం అయితే ముందుకొస్తాడు.
అందరూ ఆరోహణా, అవరోహణ వాయించాక…
“ఇందులో మీకు ఏం వచ్చు” అడిగాడు.
“వర్ణం వచ్చు నాన్నగారూ!”
పిల్లలు అంటుంటే, జయ మొదలు పెట్టింది. నలుగురూ
ఐదు నిముషాల్లో వాయించేశారు. వాయిస్తూనే ‘ఏరా… నా పై’ అని సన్నగా పాడింది కళ్యాణి.
“బాగుంది. హాయిగా… ఇవేళ ‘కద్దను వారికి…’ కీర్తన
మొదలు పెడదాం…” అంటూ శ్యామసుందరం రాగం వాయించడానికి సంగతులు ప్రారంభించాడు.
ఒక గంటసేపు నిరాటంకంగా సాగింది నాదోపాసన.
ముందు గురువుగారు వాయించడం, తరువాత శిష్యులు అనుసరించడం.
అద్భుతంగా వాయిస్తున్నారు. అందులో… తోడి రాగం మనసుకు
సాంత్వన నిస్తుంది. ఎక్కువ సేపు రాగ ప్రస్తారం చేసి, పల్లవి వరకూ నేర్చుకుని లేచారు.
“పదండి… గబగబా స్నానాలు చేసేసి రండి. ఈలోగా ఉప్మా
చేస్తాను. తినేసి బయల్దేరాలి కదా…” జయ హడావుడి చేసింది.
“ఉప్మానా?” ఇద్దరూ చెరొక రకం స్పందన…
“ఎందుకు నీకు ఉప్మా అంటే ఇష్టం?”
“నమలకుండా మింగేయచ్చు.”
“అంతే కానీ నిమ్మకాయ పిండి పుల్లపుల్లగా, అల్లం
ముక్కలు పంటికి తగుల్తూ, కరివేపాకు వాసన వేస్తూ… మధ్యలో జీడి పప్పులు కమ్మగా వస్తుంటే,
ఉండే రుచి కాదన్నమాట…” సందు దొరుకుతే చాలు ఆదిత్య చెల్లెల్ని ఆట పట్టిస్తుంటాడు.
బుంగమూతి పెట్టి గబగబా తినేసి పరుగెత్తింది కళ్యాణి.
జయ, శ్యామసుందరం నవ్వుతూ చూస్తున్నారు తమ ఇంటి రత్నాలని.
వారసత్వంగా వచ్చిన వీణ వదలకుండా, తెలివి తేటలతో
అమ్మా నాన్న చెప్పిన మంచి మాటలు వింటూ కష్టపడి చదువుకుని పోస్ట్ గ్రాడ్యువేషన్ చేసిన
ఆదిత్య, కళ్యాణి తల్లిదండ్రులు గర్వ పడేటట్లు పెరిగారు.
కళ్యాణి బాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఆన్
లైన్ లో వీణ క్లాసులు తీసుకుంటోంది.
ఆదిత్యకి తన వైణిక వారసత్వం గురించి గర్వపడే ఎన్నో
సంఘటనలలో అబ్దుల్ కలాం గారితో జరిగిన సమావేశం మరపు రానిది. వైణికుడిగా అతను అందుకున్న
పురస్కారాలు, ప్రశంసలు ఒక ఎత్తైతే కలాంగారి ప్రశంస ఇంకొక ఎత్తు అనుకుంటాడు.
ఆ సమావేశం గురించి అతని మాటల్లోనే—
“20 సంవత్సరాల క్రిందటి మాట… బెంగుళూరులోని CAIR లోని రోబోటిక్స్ ల్యాబ్‌లో
ఒక ప్రాజెక్ట్‌పై శ్రద్ధగా పని చేస్తున్నప్పుడు, సమయం తెలియలేదు నాకు. రాత్రి 7:30
దాటింది. సెంటర్ లో అంతా లైట్లు ఆఫ్ చేసేశారు. ల్యాబ్‌లో నేను, నా సహోద్యోగి సర్తాజ్
మాత్రమే ఉన్నాం.
సర్తాజ్ రోజూ పని అయాక నేనుండే చోటు సివి రామన్
నగర్‌కి వెళ్లే బస్ ఎక్కడానికి నన్ను బస్‌స్టాప్‌కి దించేవాడు. ఆ రోజు సాయంత్రం, అతను
లిఫ్ట్ ఇవ్వలేనని చెప్పి వేరే పని మీద వెళ్లి పోయాడు... నేను ఆ సంగతి మరచిపోయాను, కానీ
అది పట్టించు కోకుండా నా పనిని కొనసాగించాను. ఎప్పుడైనా పనిలో లీనమైతే అంతే… అన్నీ
మర్చి పోతాను..
రాత్రి 8 గంటల ప్రాంతంలో, ఎవరో మెట్లు దిగుతున్నట్లు
వినిపించింది. ల్యాబ్ తలుపు తెరుచుకుంది. సెంటర్ డైరెక్టర్ శ్రీ విద్యాసాగర్ లోపలికి
చూసి 'ఆదిత్యా, నేను సివి రామన్ నగర్ వైపు వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేయమంటావా?'
అని అడిగారు.
అంత కంటేనా… అతని ఆఫర్‌కి సంతోషంగా వప్పుకున్నాను...
దేవుడు పంపిన సహాయంలా అనిపించింది.
మా దారిలో మిస్టర్ విద్యాసాగర్ తన బ్యాచిలర్ ఫ్రెండ్
కోసం కొన్ని మసాలా దోసెలు తీసుకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.. CAIR దగ్గరున్న
షాన్‌భాగ్ హోటల్‌లో ఆగి, కొన్ని మసాలా దోసెలు తీసుకున్నాము. అక్కడి నుండి సివి రామన్
నగర్‌కు వెళ్లే దారిలో ఇస్రోలో ఉంటున్న అతని స్నేహితుడి ఇంటికి వెళ్లాము.
క్వార్టర్స్ కి వెళ్లే గేట్ల వద్ద, మా కారును ఒక
సెక్యూరిటీ గార్డు ఆపాడు. శ్రీ విద్యాసాగర్ తన బ్యాడ్జిని సెక్యూరిటీ గార్డుకి చూపిస్తే
అతను గేట్లు తెరిచాడు. మేము లోపలికి వెళ్లాము.
ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి, సాదాసీదాగా డ్రస్
వేసుకున్న ఒక ముసలాయన మమ్మల్ని పలకరించడానికి వచ్చాడు. శ్రీ విద్యాసాగర్ నన్ను తన స్నేహితుడు
- మిస్టర్ అబ్దుల్ కలాంకి పరిచయం చేసారు.
ఆ సమయంలో ఆ పేరు వినగానే పెద్దగా ఏమీ స్ఫురించలేదు...
కానీ అతను మా రక్షణ వైజ్ఞానిక ప్రపంచం లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడని తెలిసింది.
మిస్టర్ కలాం మమ్మల్నిఇంట్లోకి తీసుకు వెళ్లారు...
అతని గదిని దాటుకుంటూ వెళ్తుండగా, అక్కడున్న వీణను నేను గమనించాను. దాని పక్కన ఒక దివాన్,
కొన్ని పుస్తకాలు చక్కగా అమర్చి ఉన్నాయి. మిస్టర్ కలాం, శ్రీ విద్యాసాగర్ ఎప్పుడూ కలుసుకునే
స్నేహితుల్లా కబుర్లు చెప్పుకున్నారు.
వారి సంభాషణ ఎక్కువగా వారి రెండు కేంద్రాలు పాల్గొన్న
వివిధ ప్రాజెక్ట్‌ల గురించి జరిగింది. నా ఆలోచనల్లో నేనున్నాను కానీ అప్పుడప్పుడు,
గదిలో చూసిన వీణ గురించి ఆలోచిస్తున్నాను.
ఈ పెద్దాయన వీణ వాయిస్తారా?
విద్యాసాగర్ గారు, శ్రీ కలాం గారికి నేను వీణ వాయించే
శాస్త్రవేత్త నని చెప్పారు... మిస్టర్ కలాం నవ్వుతూ నా వైపు చూసి "ఓహ్! అవునా…
నాలాగే అన్నమాట" అని ప్రతిస్పందించారు.
తరువాత కలాం గారికి అత్యవసర సమావేశం ఉందని ఫోన్
వచ్చింది. మేము బయల్దేరేశాము. కానీ వారి మాటలు, ‘ఓహ్! నాలాగేనా’ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే
ఉన్నాయి.
ఆయన పేరు విన్నప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వస్తుంది.
ఎంతటి వినయవంతుడో అనిపిస్తుంది. వారిని కలవటం అదే మొదటి సారి. ఆ తరువాత చాలా సార్లు
మా ప్రాజెక్టులను తనిఖీ చెయ్యటానికి CAIR కి వచ్చారు. అతని వ్యాఖ్య ‘ఓ… నాలాగే’ ఎప్పటికీ
మరువ లేను. అతను భారత దేశం గర్వించ దగ్గ గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!”
…………………
11
శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి వీణ కళాకారుల ఇంట పుట్టి,
మరొక కళాకారుని ఇంటమెట్టి, వారిరువురినీ మించి ఎదిగిన కళాకారుని వివాహం చేసుకుంది.
తను స్వయంగా కళాకారిణి, వైణికురాలు… ఎందరో శిష్యులను
తయారు చేసిన, చేస్తున్న గురువు.
వేదిక మీద, దూరం నుంచి చూసి వారి వీణా గానాన్ని
విని ఆస్వాదిస్తూ అబ్బురపడి, వారిని సరస్వతీ స్వరూపుల్లా భావించే శ్రోతలకి, కళాకారులతో
అంత సన్నిహితంగా మెలిగిన, మెలుగుతున్న జయలక్ష్మి భావాలెలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంటుంది
కదా…
వివాహం అయి యాభై సంవత్సరాలు అయింది. అసలు పుట్టగానే
కుదిర్చేశారు పెద్దలు. పెరుగుతూ పెరుగుతూనే తన జీవిత భాగస్వామిని గమనిస్తూనే పెరిగింది.
ప్రతీ రోజూ, ప్రతీ నిముషం జీవన ప్రస్థానాన్ని ఆనందిస్తూ
గడిపింది జయలక్ష్మి అయ్యగారి.
తమ కన్నా అధికులతో పోల్చుకోవటం లేదు… అందరితో స్నేహంగా
ఉంటూ, ఎవరినీ చిన్న చూపు చూడకుండా, ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటూ జీవనాన్ని సాగించారు
అయ్యగారి దంపతులు. అదే వారి జీవన విజయ రహస్యం అని అంటారు.
జీవితంలో ఎత్తు పల్లాలు లేవంటారు… కానీ ఉండకుండా
ఎవరికీ ఉండదు. వాటిని సవరించుకుంటూ సాదా సీదాగా చేసుకుంటూ హాయిగా సాగి పోతున్నారు.
ఈ అందమైన సాహచర్యానికి శ్యామసుందరం గారే మూల కారణం
అంటుంది జయలక్ష్మి. ఇద్దరిదీ ఒకే బాట, ఒకే మాట.
“నాకు విద్య, విద్యలో మెళకువలు నేర్పి… నన్ను కళాకారిణిగా
రూపొందించి, ఈ సంగీత ప్రపంచంలో నాకూ చిన్ని స్థానాన్ని ఏర్పరచిన గురువు మావారు” అని
గర్వంగా చెప్తుంది.
జీవన సహచరిగా శ్యామసుందరం వెంట అతని సన్మాన సత్కారాల్లో
భాగం పంచుకోవటం సామాన్యమైన విషయం కాదు. తనకున్న అర్హత కన్నా మిన్నగా తనకి సమాజంలో గుర్తింపు
నిచ్చారంటుంది.
ఇంతటి సద్భావం కలగటానికి, దంపతులు ఇరువురూ ఒకరి
కోసం ఒకరు, విడదీయలేని స్నేహితులు అనుకోవడమే కారణం. ఏ దాంపత్యంలో నైనా ఉండవలసింది ఈ
స్నేహభావమే.
“ఇది కావాలి… అని అడగకుండానే అన్నీ అమరుస్తారు నా
నేస్తం” అంటుంది జయలక్ష్మి.
ఈ విధంగా ఉంటే జీవితం ఆనందంగా నల్లేరు మీద నడకలా
సాగకుండా ఎలా ఉంటుంది?
అందుకే ఆ దంపతుల సమక్షంలో అందరికీ ఆహ్లాదంగా గడుస్తుంది
సమయం.
వారి పిల్లలకి కూడా అటువంటి విలువలనే నేర్పించారు
అయ్యగారి దంపతులు.
ధనార్జన లో కన్నా జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ,
సజ్జన సాంగత్యం మించినదేదీ లేదని చెప్పారు.
సంగీతం, సాంకేతిక విద్యలతో పాటుగా సంస్కారం కలిగి
ఉండాలని, మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే చెప్తుంటారు.
కళ్యాణి, ఆదిత్య వారినెప్పుడూ నిరాశ పరచ లేదు.
తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ మంచి అలవాట్లతో సత్సాంగత్యంతో, సదాచారాలతో జీవనాన్ని
సాగిస్తున్నారు.
కోడలు, అల్లుడూ కూడా మంచి విద్యావంతులూ, సంస్కార
వంతులు. స్నేహ భావంతో, కుటుంబ విలువలకు ప్రాధన్యత నిస్తూ చక్కగా అందరితో కలసి మెలసి
ఉంటూ అయ్యగారి దంపతుల ఆశయాలకు తగిన వారు.
తరువాతి తరం–
మనవలు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
కళ్యాణి, కృష్ణకుమార్ దంపతులు వారి పిల్లలు లాస్య,
శ్రియ లకి వీణ నేర్పిస్తున్నారు.
ఆదిత్య, టీనా దంపతుల అబ్బాయి తేజస్ పియానో వాద్య
కారుడు.
స్వర్ణోత్సవం:
అయ్యగారి శ్యామసుందరం, జయలక్ష్మి ల యాభైయవ పెళ్లి
రోజు వేడుకలు ఎవరూ ఊహించలేనంత ఘనంగా మూడు నెలలపాటు జరిపారు… వారి పిల్లలు, శిష్యులు,
ప్రశిష్యులు.
కోవిడ్ లాకౌట్ రోజులు. ఎక్కడి వారు అక్కడే. అయితేనేం
మనసుంటే మార్గం ఉండదా?
నలభై రోజులు వాగ్గేయకార కదంబం, స్వర్ణోత్సవం జరిగింది.
శిష్య, ప్రశిష్యులతో నిత్య సంగీత సాధన, నాద నివేదన
చేశారు.
త్యాగరాజు, దీక్షితార్, శ్యామశాస్త్రి, అన్నమయ్య
మొదలైన వాగ్గేయ కారుల గురించి, రాగములకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలతో చర్చలు చేశారు.
ఎప్పుడూ వినని కొత్త వర్ణాలతో…
చిన్న పిల్లల దగ్గర నుండి, సీనియర్ విద్యార్ధుల
వరకూ ఎవరూ తీసి పోనట్లు పాడారు. వాయించారు.
అంతా నాదమయం చేశారు స్వర్ణోత్సవాన్ని.
ఒక మంచి ఆలోచన చేసి, దానికి ప్రాణం పోసి, దానిలో
శిష్యులందరినీ భాగస్వాములను చేసి అందరినీ అలరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రతీ నిముషం ఏదీ చెదరకుండా చివరి వరకూ అనుకున్నది
జరిగేలా చూసి, సంగీత నాదామృతాన్ని అందరికీ సమానంగా పంచారు.
గురువుగారు శ్యామసుందరం గారు సంగీతానికి సంబంధించిన
రాగలక్షణం, స్వరపరచటం, ప్రదర్శన… అన్నింటినీ అనుసంధాన పరచేలాగ అద్భుతమైన కార్యక్రమాన్ని
రూపొందించి, శిష్యులందరికీ కష్టమైన ఛాలెంజ్ ఇచ్చారు. వారితో, వాయింపించి, పాడించి వారి
సాధనా పటిమను, ధైర్యాన్ని పెంచారు. వారు మామూరు గురువులు కాదు, సంగీతానికి ఒక పవర్
హౌస్, ఒక లైట్ హౌస్ వంటి వారు.
ఆది పురుషుడు… అయ్యగారి సోమేశ్వర్రావు గారి పట్టుదల,
సాధన, అంకిత భావం… వారిని శిఖరాగ్రాన నిలబెట్టి, ఎందరో సంగీత వారసులను, శిష్య ప్రశిష్యులను
సంగీత ప్రపంచానికి అందించి, ప్రపంచం నలు మూలలా అయ్యగారి వారి బాణీని విస్తరింప చేసింది.
అయ్యగారి వారింట వెలసిన సరస్వతీ దేవి కచ్ఛపి నాదం
తరతరాలుగా వినిపిస్తూనే ఉంటుంది.
*—--------------*
సమాప్తం.
అయ్యగారి
శ్యామసుందరంగారి మనసుకు తృప్తినిచ్చిన కచేరీలు:
1978: మద్రాసు మ్యూజిక్ అకాడమీ దేశంలో ప్రథమ స్థానంలో
ఉంటుందన్నది సంగీత ప్రియులందరికీ తెలిసిన విషయమే.
అది…
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి “సంగీత కళానిధి” అవార్డు ఇచ్చిన సంవత్సరం.
ఒక సంస్థ వారు ఒక కళాకారునికి ప్రతిష్టాత్మక అవార్డు
ఇచ్చిన సమయంలో ప్రఖ్యాత కళాకారుల కచేరీలు నిర్వహించడం సాంప్రదాయం.
ఆ వేదికపై మహాదేవు లక్ష్మీనారాయణ రాజుగారి మృదంగ
సహకారంతో వీణ వాయించే అవకాశం లభించింది.
దానికి “Best Veena performance Award” అందుకోవటం
మరపురాని సన్నివేశం అంటారు శ్యామసుందరం గారు.
1979: బెజవాడ మ్యూజిక్ కాలేజి లో అధ్యాపకుని గా
ఉండగా చెన్నై కృష్ణగాన సభలో నేదునూరిగారి ప్రోత్సాహంతో వీణ వాయించి “బెస్ట్ వీణ పెర్ఫార్మెన్స్”
అవార్డు పొందటం ఎంతో తృప్తి కలిగించింది.
1982: ఆకాశవాణి సౌత్ ఇండియన్ హుకప్ ప్రోగ్రాం శ్రీ
కున్నక్కుడి వైద్యనాథన్ గారు విన్నారుట.
తరువాత వారు విజయవాడలో ఈ మాసపు పాట కంపోజ్ చెయ్యటానికి
వచ్చి, శ్యామసుందరం గారి వీణా వాద్యం మళ్లీ విని, రికార్డింగ్ అయిపోయాక, త్వరలో మీకు
మంచి అవకాశం వస్తుంది అందుకోండి అని చెప్పి వెళ్లిపోయారుట.
1983: ఆ వెంటనే 1983 లో డిల్లీ నుంచి ఆహ్వానం వచ్చింది,
తిరువాయూర్ నుండి దక్షిణ ప్రాంత సంగీత సభలో వాయించాలని.
శ్యామసుందరం ఆనందంతో ఉక్కిబిక్కిరి అవుతూ ఆహ్వానం
అందుకున్నారు…
తిరువాయూర్ నుండి సౌత్ ఇండియన్ హుక్ అప్ ప్రోగ్రాం
వాయిస్తూ ఉండగా దక్షీణ భారతదేశమంతా లైవ్ బ్రాడ్ కాస్ట్ అవడం గురించి విని ఉన్నారు.
ప్రోగ్రాం రోజు వచ్చింది. వీరి వీణ, తరువాత సీతారాజన్
గారి గాత్రం. మరునాడు నేదునూరిగారి నేషనల్ ప్రోగ్రాం.
శుక్రవారం రాత్రి 10 గంటలు… ప్రోగ్రాం మొదలవబోతోంది.
ఇసుక వేస్తే రాలనంతమంది జనం. శాస్త్రీయ సంగీతానికి ఎంత మంది శ్రోతలో అనిపించింది.
సంగీత కచేరీని, సినిమా చూసినంత ఆసక్తితో ఒళ్లంతా
కళ్లూ చెవులూ పెట్టుకుని వింటూ హర్షధ్వానాలను వారి కేకల రూపంలో ప్రదర్శిస్తూ ఆనందించారు
శ్రోతలు. అది శ్యామసుందరంగారు మరువలేని సంఘటన అంటారు..
అమెరికాలో పిట్స్బర్గ్ లో అద్భుతమైన కచేరీ వాయించారు.
చివరి వరకూ అత్యంత ఆసక్తితో విన్న ఒక శ్రోత…
“నిన్నటి వరకూ నేను అనేక బిపి మాత్రలు వాడాను.
ఈ రోజు ఈ అద్భుతమైన వీణాగానము విన్నాక. ఇంత మానసిక
ప్రశాంతతను, అలౌకిక ఆనందాన్ని ఇంతకుముందు ఎన్నడూ ఎరుగను. నా బిపి తగ్గింది. ఇక మాత్రలు
వాడనవుసరం లేదు” అన్నారు. అంత కన్న చక్కని ప్రశంస ఏముంటుంది అంటారు శ్యామసుందర్.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక పట్టణాలలో తన
వీణా వాదన వినిపించి, శ్రోతల మన్ననలను అందుకుని, ప్రశంసలు పొందారు.
శ్యామసుందర్ గారు అదృష్టంగా భావించే విషయాలు:
మద్రాసు ఆకాశవాణి 12 ట్రాక్ స్యూడియో శ్యామసుందర్
గారి వీణా వాయిద్యంతో, వారి సంగీత సమ్మేళనం కార్యక్రమంతో మొదలవడం…
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రారంభోత్సవం
వారి వీణ కచేరీతో ఆరంభమవటం...
మద్రాస్ దూరదర్శన్ లో లైవ్ ప్రోగ్రాం ప్రసారం.
(సాధారణంగా ఎప్పుడూ లైవ్ ఉండవు, రికార్డింగ్ లే.) ఈ ప్రోగ్రాం కొత్తగా మొదలైన డిడి
బెంగుళూరు నుండి మొదటి కర్ణాటక కార్యక్రమంగా రిలే చేశారు.
మైసూరు దత్త పీఠం వారిచే స్వామీజీ 75వ పుట్టినరోజు
వేడుకలలో దేశం మొత్తం మీద నుండీ ఎంపిక చేసిన 9 మంది అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల
సరసన స్వామీజీ స్వహస్తాలతో ‘నాదనిధి’ సత్కారం అందుకోవడం…
2011: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందుకొనటం
ఒక ఎత్తైతే, కంచి కామకోటి పీఠ విద్వాంసుడిగా నియామకం మరొక శిఖరారోహణం.
2012: కేంద్ర సంగీత నాటక అకాడమీ, 2011 పురస్కారం
రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేసిన అనంతరం, శ్యామసుందర్ గారు చేసిన కచేరీ
ఆహుతులైన శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ పురస్కారానికి అర్హులు లభించినప్పుడే ఎంపిక
చేస్తారు.
అరవై సంవత్సరాల ఈ అవార్డు చరిత్రలో ఇప్పటి వరకూ
19 మంది ఎంపిక అయితే 18 వ వారు శ్రీ శ్యామసుందర్ గారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎన్నికయిన
ముగ్గురూ శ్రీ ఈమని శంకరశాస్త్రిగారు, శ్రీ చిట్టిబాబుగారు, శ్రీ శ్యామసుందర్ గారు.
అవార్డు తీసుకునేందుకు రాష్ట్రపతి భవనంలోకి అడుగు
పెడుతుండగా, శ్యామ సుందర్ గారు తన శ్రీమతి జయలక్ష్మితో అన్న ఈ మాటలు…
“ఏ నాటి నోము ఫలమో… ఏ దాన బలమో ఇంతటి అదృష్టానికి
నోచుకున్నాను. నా తల్లిదండ్రులే గురువులయి నన్ను ఆశీర్వదించారు.
విజయనగర సాంప్రదాయ వైణికులలో ఉద్దండ పండితులు ఎందరు
ఉన్నా, విజయనగర సాంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత నాకు దక్కింది…
అది నేను చేసిన పూజా ఫలమో, నా పూర్వజుల పుణ్య ఫలమో.” వారి నిరాడంబరతను వ్యక్తీకరిస్తూ
తన వ్యక్తిత్వాన్ని, వినయాన్ని, అణకువను తెలియ పరుస్తున్నాయి.
అవార్డ్ ప్రదానం అయాక జరిగిన కచేరీ, ఢిల్లీ దూరదర్శన్
వారు భద్రపరచారు.
జాతీయ స్థాయి కార్యక్రమాల్లో రేడియో ద్వారా, డిడి
ద్వారా అనేక సార్లు కచేరీలు చేశారు.
రాగం, తానం, పల్లవి కార్యక్రమాలు ఎన్నో సార్లు ప్రసారమయ్యాయి,
అవుతున్నాయి.
అపురూప రాగరంజని కార్యక్రమాలు కూడా చాలా సార్లు
ప్రసారం చేశారు.
అనేక ప్రత్యేక కార్యక్రమాలకు వీణ సహకారం అందించారు.
రేడియో ఆర్కైవ్ కోసం యక్షగానాలు కంపోజ్ చేశారు.
దేశభక్తి గేయాల నుండి, సంగీత రూపకాల దాకా అనేక కార్యక్రమాలకు
సంగీతాన్ని అందించారు.
వారు సంగీతాన్ని సమకూర్చిన నాదబంధం రేడియో కార్యక్రమానికి
ఇన్నొవేటివ్ అంశాలలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వించదగిన విషయం.
అనేక ప్రైవేట్ ఛానల్స్ లో సోదాహరణ ప్రసంగాలూ, జీవిత
విశేషాల ఇంటర్వ్యూలు ఇచ్చారు.
సంగీత పాఠాల నిర్వహణ చేస్తూ, ఔత్సాహిక గాయకులకి
సంగీతంలో మెళకువలు నేర్పించారు.
ఎన్నో వార్తా పత్రికలలో అనేక ఆర్టికిల్స్ వచ్చాయి.
తెలుగు యూనివర్సిటీ బి.ఏ, యమ్మే విద్యార్థుల కోసం
వీణ గురించి, సమగ్రమైన వ్యాసాలు రచించారు. సోదాహరణ ప్రసంగాలు ఇచ్చారు.
స్పిక్ మేకే (The Society for the
Promotion of Indian Classical Music And Culture Amongst Youth) వారి
కార్యక్రమాలలో పాల్గొని. విద్యార్థులలో సంగీతం పట్ల ఆసక్తి, అవగాహన కల్పించారు.
(సమాప్తం)
***
No comments:
Post a Comment