క్రొత్తనీరు (నవల -మొదటి భాగం )
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
ఆఫీసు నుండి ఇంటికి వచ్చింది సమీర. ఇంట్లో అందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు.'వాతావరణం గంభీరంగా ఉంది 'అనుకొంది సమీర.
భోజనాలయ్యాక గదిలోకి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటూ ఉంటే "కాసేపు ఆ డబ్బా కట్టేసి హాల్లోకి రా!నీతో మాట్లాడాలి!"అంది తల్లి పద్మ.
చేసేది లేక హాల్లోకి వచ్చి కూర్చుంది సమీర.
"ఇంతకీ ఈ సంబంధం గురించి ఏమనుకుంటున్నావు?"తండ్రి రఘురామ్ ప్రశ్నించాడు.
మౌనంగా ఉంది సమీర.
"వాళ్లకు ఏదో ఒక సమాధానం చెప్పాలిగా!ఇలా అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని సాకులు చెప్తూ ఉంటే పెళ్ళి అవుతుందా? పెళ్ళీ పెటాకులు లేకుండా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? రోజు రోజుకూ కాలం గడిచిపోతూ ఉంది. మేము ఎల్లకాలం నీకు తోడుగా ఉంటామా? పెద్దవాళ్ళం అవుతున్నాము. నీకు పెళ్ళి చేశాక చిన్నదానికి కూడా చెయ్యాలి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు!...."
తల్లి తీవ్రంగా మాట్లాడుతుంటే అసహనంగా ఉంది సమీరకు.
"ఒక్క సంబంధంమన్నా మంచిగా ఉందా? చెప్పండి!నన్ను, నా వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు కావాలి. దురలవాట్లు లేనివాడు కావాలి. క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగేవాడు కాదు. జీవితం పట్ల స్పష్టమైన అభిప్రాయం, అవగాహన ఉన్నవాడు కావాలి. గాలివాటుగా ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడుపుతూ నిలకడలేని మనస్తత్వం వున్నవాడు నాకు వద్దు. అటువంటి వాడిని భర్తగా నేను భరించలేను. మొన్న వచ్చిన సంబంధం చూశారా? కాసేపు మాట్లాడితే వాడి చపలత్వం బయటపడుతోంది. నాకు నచ్చలేదు నాన్నా!... నేను పెళ్ళి చేసుకోకుండా ఉంటాను కానీ ఇలాంటి తిక్క వెధవల్ని మాత్రం చేసుకోను..."
అంటూ గిరుక్కున తిరిగి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొంది సమీర.
కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది పద్మ.
పద్మ, రఘురాములకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపిల్ల సమీర. రెండోపిల్ల సాధన. సమీర బి. టెక్. పూర్తిచేసి కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తోంది. రెండేళ్లుగా సమీరకు సంబంధాలు చూస్తున్నారు. సగం సమీరకు నచ్చకపోవటం, మిగిలిన సగం అవతలివాళ్లకు నచ్చకపోవటం. పద్మకు దిగులెక్కువయ్యింది. రఘురాముకు కూతుర్ని ఎలా కన్విన్స్ చెయ్యాలో తెలియటం లేదు.
సమీర చిన్నప్పటి నుండి పుస్తకాలు తెగ చదువుతూ పెరిగింది. ఆ ప్రభావం వలన ఆమె ఈ కాలం పిల్లల్లా ఉండదు. ఆమె ఆలోచనా ధోరణి ఒక తరం వెనక ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ కల్చర్ ఆమెలో కనిపించదు. సాంప్రదాయంగా పెరిగిన అమ్మాయి అవటం వలన నేటి పాశ్చాత్య వెఱ్ఱిపోకడలు ఆమెకు నచ్చవు. పెళ్ళి సంబంధాల్లో వచ్చిన కుర్రవాళ్ళు ఆమెలాగా పెరిగిన వాళ్ళు కాకపోవటం, పుస్తకపఠనం అంటే తెలియని వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేస్తున్నాకూడా విచ్చల విడిగా తిరుగుతూ ఉండే నేటి తరానికి వారసులు. తేడా అంతా సంస్కృతి,నాగరికత దగ్గరే వస్తోంది.ఎవరైనా ' సోషల్ డ్రింకింగ్ 'అన్నా ఆమె భరించలేకపోతోంది.
రాత్రి రఘురామ్ తమ్ముడు అనంత్ అన్నయ్యకు ఫోన్ చేశాడు.
"సమీర అభిప్రాయం ఏమిటి?"అని.
"ఏముంది? ఈ సంబంధం కూడా చేసుకోనంటోంది... ఏం చెయ్యను?"అన్నాడు రఘురామ్ దిగులుగా.
"శనివారం ప్రమీలను పంపిస్తాను. తను మాట్లాడితే కొంచెం మార్పు వస్తుందేమో చూద్దాం!"అన్నాడు అనంత్.
శనివారం ప్రమీల వచ్చింది.
"పదవే!కాసేపు బిర్లా మందిర్ దాకా వెళ్లి వద్దాం!"అంది ప్రమీల.
"వద్దులే పిన్నీ!ఇక్కడే చెప్పు!కొత్త విషయం కాదుగా!"అంది సమీర.
"మగవాళ్లకు పెళ్లయ్యాక బాధ్యత తెలుస్తుంది సమీరా!మీ బాబాయి పెళ్లయిన కొత్తల్లో ఎలా ఉండేవాడో తెలుసా!చాలా దుడుకు. ఎవరినీ లెక్కపెట్టేవాడు కాదు. తిక్కకోపం. స్నేహితులకు అప్పులు ఇస్తూ డబ్బులన్నీ జెల్లెం బుల్లెం చేస్తూ ఉండేవాడు. నాకు అతడితో ఎలా బ్రతకాలో అర్థం అయ్యేది కాదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కుదురు వచ్చింది. తర్వాత తర్వాత పెద్దమనిషి తరహాగా అన్ని పనులూ అలోచించి, నాతో సంప్రదించి చెయ్యటం అలవాటయింది. ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు ఉండటం సహజం. మగపిల్లల టెంపర్ కొంచెం వేరుగా ఉంటుంది. వాళ్ళల్లో మెచూరిటీ కొద్దిగా ఆలస్యంగా వస్తుంది. నువ్వు మరీ భూతద్ధంలో చూసి బెంబేలు పడకు!మొన్న చూసిన సంబంధం అందరికీ నచ్చింది. ఆస్థి పాస్థి అన్నీ బాగున్నాయి. వాళ్ళు కూడా సాత్వికంగా ఉన్నారు. పిల్లవాడి చదువు, జీతం
నీకంటే ఎక్కువేకదా!నెత్తి మీద కాసిని వెండ్రుకలు కూడా ఉన్నాయి...."
ఫక్కున నవ్వింది సమీర.
"ఆడపిల్లలకు బారెడు జడలు ఎప్పుడో అంతరించిపోయాయి. మగపిల్లలకు బట్టతల కామన్ అయ్యిందిగా!.."
నవ్వింది ప్రమీల.
"అదేమీ కాదు పిన్నీ!అతడికి పబ్బులకు వెళ్ళే అలవాటు ఉందట. నన్ను కూడా అడిగాడు.'మీరు పార్టీలకు వెళ్తారా!'అని అలాంటివి నేను భరించలేను...."
"పెళ్లయ్యాక అన్నీ మానేస్తాడులేవే!....మరీ చెప్తావు!...ఇప్పుడు అందరికీ కాస్తో కూస్తో తాగుడు అలవాటు ఉంటోంది. నేనింత వరకు ఎవ్వరికీ చెప్పలేదు కానీ మీ బాబాయి కూడా లైట్ గా ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తారు. లిమిట్ లో ఉంటారు కాబట్టి నేనేమీ అనను. కొద్దిగా మనం కూడా కాంప్రమైజ్ అవ్వాలి.అన్నీ బాగున్న సంబంధాన్ని వదులుకోవటం తెలివితక్కువతనం అవుతుంది. ఆలోచించు!..."
ప్రమీల చెప్పింది విని మౌనంగా ఉంది సమీర.
** ** **
ఆఫీసుకు వెళ్ళింది సమీర.
కొలీగ్స్ అందరూ గుమిగూడి మాట్లాడుకుంటున్నారు.
"ఏమిటి విషయం?"అడిగింది ఒక అమ్మాయిని సమీర.
"మన ఆఫీసులో కూడా క్లీనింగ్ మొదలైంది.చాలామందిని తీసేస్తున్నారు.అంతా రాండంగా జరుగుతోంది. ఎవరికి ఉద్యోగం పోతుందో ఎవరికి ఉంటుందో తెలియటం లేదు."చెప్పింది ఆ అమ్మాయి.
"హార్డ్ వర్కర్స్ ని తీసేయరనుకుంటా! లేజీగా పనిచేసే వాళ్ళకే భయం "! అంది సమీర
కంప్యూటర్ ఓపెన్ చేస్తూ.
"అదేమీ లేదమ్మా!హార్డ్ వర్కర్స్,బాగా తెలివైన వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. ఈ జాబ్ పోతే మరొకటి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు."
అందరి మొహాల్లో ఆందోళన భయం కనిపిస్తోంది. నిజమే! గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలే వేలకు వేల మంది ఎంప్లాయిస్ ని తీసేస్తున్నాయి. ఇక చిన్నచిన్న కంపెనీల గురించి అసలు ఆలోచించనక్కర్లేదు.
ఆ పూట అందరూ అదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.
లంచ్ అవర్లో కంపెనీ బయట ఉన్న కాఫటేరియాకు వచ్చింది సమీర. కాసేపటికి మాళవిక అక్కడికి వచ్చింది.మాళవిక సమీర స్నేహితురాలు.సమీర కంపెనీ ప్రక్క బిల్డింగులో ఉన్న ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తోంది.ఇద్దరూ ప్రతిరోజు లంచ్ అవర్ లో కాఫటేరియాలో కలుస్తారు.
ఒక గంట మాట్లాడుకుంటూ తిని ఎవరికి వాళ్లు పనిలోకి వెళ్తారు.
"మా కంపెనీలో కూడా లే ఆప్స్ అంటున్నారు."అంది సమీర దిగులుగా.
"విన్నాను!విన్నాను!ఈ వార్త!మీ సాఫ్ట్ వేరు కంపెనీలు చాలా వరకు మూతపడుతున్నాయి! మళ్లీ ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందంటున్నారుకదా!ఇంకా మా ట్రావెల్ ఏజెన్సీల పరిస్థితి అంత దిగజారలేదు.రేపు మా గతి ఎలా ఉంటుందో?... ఈ విషయం వదిలేయ్!నీ గురించి చెప్పు!పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? పెళ్లిచూపులు ఎలా జరిగాయి?"
మాళవిక ప్రశ్నలకు బదులు ఇవ్వలేదు సమీర.
టేబుల్ మీద వేలితో రాస్తూ కూర్చుంది.
"నీకు నచ్చలేదా?..వాళ్ళకా?.."
రెట్టించింది మాళవిక.
"నాకే నచ్చటం లేదు.సోషల్ డ్రింకింగ్ అంటున్నాడు.వదిలేద్దాం అనుకుంటున్నా!"
" నిన్ను చేసుకుందామని క్యూ కట్టి వస్తున్నారే!నా దౌర్భాగ్యం చూడు! నాకు వచ్చే సంబంధాలన్నీ మా అమ్మ చెడగొట్టి పారేస్తుంది. ఇప్పటికీ పాతికేళ్ళు దాటాయి!...ఇంకెప్పుడు పెళ్లి? ఇంకెప్పుడు పిల్లలు?...పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు పెట్టుకోకు! కాస్త సోషల్ డ్రింకింగే కదా!చల్తా హై! బుద్ధిగా చేసుకో!తర్వాత దిద్దుకోవచ్చు!"
మాట్లాడలేదు సమీర.
"నన్ను చూడు! నీలాగా కాదు!కాస్త లిబరల్ గా ఉంటాను!కానీ మా అమ్మకు నచ్చదు. నాతో పాటు అమ్మానాన్న కూడా వచ్చి ఉంటామంటే పెళ్లి వాళ్ళు పారిపోతున్నారు. అమ్మాయితో పాటు అత్తమామల్ని కూడా ఇంట్లోనో,ఇంటిపక్కనో పెట్టుకోమంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పు!... ఇదీ ప్రాబ్లమ్!..."
"ఆంటీ నిన్ను వదిలిపెట్టి ఉండలేక అలా చెప్తుందేమో ! ఇంటి ప్రక్కన అమ్మ నాన్న ఉంటే నీకు కూడా బాగానే ఉంటుంది కదా!వాళ్ళ సహకారం ఉంటే నువ్వు జాబ్ హాయిగా చేసుకోవచ్చు!రేప్పొద్దున నీకు పిల్లలు పుడితే అమ్మవాళ్ళు చూసుకుంటారు!టెన్షన్ ఉండదు."
"అది కాదు సమీరా!మా అమ్మ నా సంసారంలో వేళ్ళు కాళ్ళు పెట్టి నా కాపురానికి ఎసరు పెడుతుందేమోనని మగవాళ్ళ వైపు వాళ్లు భయపడుతున్నారు. ఈ మధ్య దేశంలో విడాకుల శాతం తెగ పెరిగిపోయింది.టీవీల్లో దీని గురించే విపరీతంగా చర్చాగోష్ఠులు జరుగుతున్నాయి.అన్నిటికీ కోడళ్ళు, వాళ్ల పేరెంట్స్ కారణమని గగ్గోలు పెడుతున్నారు. దీంతో అమ్మ డిమాండ్ ఎవ్వరికీ నచ్చటం లేదు.
పోనీ 'నేను బాగానే మేనేజ్ చేసుకోగలను 'అంటే మా అమ్మ వినదు. ఇంట్లో ఇదీ గొడవ!... ఏం చేయను?...నా పెళ్లి గురించి ఇంక నేనే డిసైడ్ చేసుకోవాలి!ఎవరినో ఒకర్ని సెలెక్ట్ చేసుకుని ప్రేమా దోమా అని పెళ్లి దాకా లాక్కొచ్చి....... అబ్బబ్బ పెద్ద తలకాయ నొప్పి!.. ఆ తర్వాత ఎలా ఉంటుందో అని టెన్షన్!....మన తెలివితేటల మీద మనకంత నమ్మకం లేదు! ఏదో పళ్లెంలో పంచభక్ష్యాలు పెట్టి, చేతికి అందిచ్చినట్లు పేరెంట్స్ మంచి సంబంధం చూస్తే హాయిగా చేసుకోవాలని ఉంది నాకు!చుట్టు ప్రక్కల శుద్ధమైన రాజకుమారుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు.!రెక్కల గుర్రం మీద ఎగిరిపోవటానికి...."
మాళవిక మాటలకు పెద్దగా నవ్వింది సమీర.
మాళవిక తత్వమే అంత.
గలగల మాట్లాడుతూ ఉంటుంది.సమీర ఎంత గంభీరంగా, రిజర్వుడుగా, ధీర సమీరంలా ఉంటుందో మాళవికది అంత బోళాతత్వం.ఏదీ మనసులో దాచుకోదు.ఆమెకు ఒక అన్న ఉన్నాడు.మనోజ్.
చదువుకని లండన్ కి వెళ్లి అక్కడే సెటిలై ఒక ఫ్రాన్స్ అమ్మాయిని చేసుకున్నాడు. మాళవిక తల్లిదండ్రులు వాసుదేవరావు, నీరజలు. కొడుకు తమకు దూరమయ్యాడని వాళ్ళు బాధ పడుతూ ఉంటారు. మాళవికకు పెళ్లి చేసి, అమ్మాయి దగ్గరే ఉంటే కూతురు, అల్లుడు పెద్ద వయసులో తమను చూసుకుంటారని నీరజ ఆశ...
వృద్ధాశ్రమాలు అంటే తగని భయం.. అందుకే మాళవిక పెళ్లి సంబంధాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటోంది నీరజ.
"రేపు శని ఆదివారాలు వరంగల్ లో మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ ఉంది. మా క్లాసులో వాళ్ళు చాలామంది వస్తున్నారు. నా స్కూలు చదువంతా వరంగల్ కదా!నా కాలేజీ టైంకు నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. నేను చిన్నప్పటి స్నేహితులను కలిసి వద్దామని వరంగల్ వెళ్తున్నాను!"
"గుడ్ గుడ్!సోమవారం ఆఫీసుకు వస్తావు కదా!"
"రెండు రోజులు మాత్రమే సమీరా!మండే కలుద్దాం! "
స్నేహితురాళ్లిద్ధరూ టీ తాగి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్లిపోయారు .
(సశేషం )
No comments:
Post a Comment