మానస వీణ - 60
(ఆఖరి భాగం)
అనసూయ
ఇస్రో లో స్థానం
సంపాదించిన అనిరుధ్ ని అందరూ అభినందించారు. మానస తన అనీ ఎవరు ఊహించనంత ఎత్తుకి
ఎదిగాడని ఒకింత గర్వం, రెండింతల ఉత్సాహంతో తనకి కావలసిన పదార్థాలన్ని ప్రత్యేకంగా
చేయించి మరి సర్దుతోంది. ఇంతలో అనిరుధ్ వాళ్ళ నాన్న జిటిఆర్ గారు తలుపు దగ్గరే ఆగిపోవడం చూసిన అనిరుధ్ "ఏంటి
నాన్నగారు రావడానికి సందేహం దేనికి?
రండి,"
అని పిలిచాడు.
"నీకు ఇంత మంచి ఉద్యోగం వస్తుందని ఏనాడూ అనుకోలేదు. నా వంతు
తోడ్పాటు ఇవ్వలేదు. ఇదిగో ఈ బంగారు తల్లి
'మానస'
కాదు కాదు, నా పాలిటి భాగ్యరేఖ
వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. నీ గమనాన్ని మార్చి ,
నన్ను ఆ దుండగుల నుండి చాకచక్యంతో
కాపాడి, ఆడపిల్లలు అబలలు కాదు సబలలు అని నిరూపించింది" అని
జిటిఆర్ ఇద్దరినీ మనసారా అభినందించాడు.
అనిరుధ్ వీసా, పాస్పోర్ట్ అన్నీ
తీసుకుని, అందరికీ విడ్కోలు చెప్పి,
ఇస్రో కి పయనమయ్యాడు.
***
సర్కిల్ ఇన్స్పెక్టర్
శశిధర్, డిటెక్టివ్ ఏరన్ ల సహాయంతో ఆశ్రమంలో ఉన్న నినూష, చైత్ర, రమ్య, దివ్య లను ఎత్తుకుపోవాలని చూసిన వ్యక్తిని వలేసి పట్టి
అరెస్ట్ చేసారు. అతడిని చేసిన థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్ లో అవయవ రవాణా చేసే స్థావరం
వివరాలు బయటపడ్డాయి. దినేష్ నాయకత్వంలో ఉన్న టీం ఆ స్థావరంపై ముట్టడి చేసి
నేరస్తులను అరెస్ట్ చేసింది. సుశీలమ్మ కోరినట్టుగానే, అప్రూవల్ గా మారిన అప్పలనాయుడుకు జీవితఖైదు విధించబడింది.
‘హేమలతా ప్రేమ
కుటీరాన్ని’ నిర్వహించే బాధ్యతను కొండలరావు, అలివేణి దంపతులు, మానస, ఆమె స్నేహితురాలు మాధవి,
జనని, సమీర, జిటిఆర్, శ్రావణి దంపతులు, అంతా కలిసి సంయుక్తంగా నిర్వహించసాగారు. దినేష్ కు స్పెషల్
ప్రమోషన్ లభించగానే అతను సమీరను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆశయాల సాధనకు
ముందుకు సాగిపోయారు. త్వరలోనే అదే ఆశ్రమంలో దినేష్ తల్లిదండ్రులు పరిమళాదేవి, యశోవర్ధనరావుల పేర్లతో ‘యశోపరిమళ వృద్ధాశ్రమం’ అనే పేరుతో ఒక వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. వృద్ధులకు
అనాధ పిల్లలు వారసులుగా, పిల్లలకు వృద్ధులు ఆలంబనగా మారారు.
రాజా ఆదేశంతో
గిరిజనులు అడవిలో ఉన్న అప్పలనాయుడు స్థావరాలన్నీ ధ్వంసం చేసారు. అతడు బంధించిన
వారిని విడిపించారు. అతడు అక్రమంగా చేస్తున్న గంజాయి సాగు, అటవీ సంపద కొల్లగొట్టడం వంటివి మీడియా కు బట్టబయలు చేసారు.
ఎప్పుడైతే అప్పలనాయుడు సామ్రాజ్యం కూలిపోయిందో,
అతనికి కొమ్ము కాసే వారంతా భయంతో చెడు
మార్గాన్ని వదిలేస్తామని, తమకు ఉపాధి కల్పించమని,
ప్రభుత్వానికి లొంగిపోయారు. మంత్రి కృషీవలరావు, జిటిఆర్, సుశీలమ్మ లతో సహా
గూడానికి వెళ్లి, ఒక చిన్న సభను పెట్టి,
అప్పలనాయుడు అక్రమంగా అందరినుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను, ఆ ముగ్గురి చేతుల
మీదుగా స్వంతదారులకు తిరిగి అప్పగించింది మానస. అదే సభలో స్కూల్ పునరుద్ధరణ
పథకాలను కూడా తెలిపింది. సుశీలమ్మ ఆ గిరిజనుల సేవలో అక్కడే ఉండిపోవాలని
తీర్మానిన్చుకుంది. ‘దేవదాసీలు’ అనే సాంఘిక దురాచారం కూడదని, అర్ధమయ్యేలా గిరిజనులకు వివరించి, రాజా, సరితల వివాహం జరిపించింది మానస. అంతే కాదు, జగ్గయ్యతాత, రాజా, సరిత ల ఆధ్వర్యంలో “సిద్ధ
వైద్యాలయం” నెలకొల్పడానికి పర్మిషన్లు,
విరాళాలు సేకరించడానికి ఉద్యుక్తమయ్యింది.
***
సిద్ధ వైద్యాలయం గురించి మండల స్థాయి అధికారితో మాట్లాడటానికి
వెళ్లింది మానస. ఇంతలో ఎవరో తనని పిలిచిన అలికిడి అవడంతో ఉలిక్కి పడింది. వెనక్కి
తిరిగి చూస్తే రాజేష్...
"రాజేష్ కొన్నాళ్ళుగా ఏమయ్యావ్?
ఎలా ఉన్నావ్, సమీర, నేను నీ గురించి ఎంత
అనుకున్నామో" అని చెమ్మగిల్లిన కళ్ళతో ప్రశ్నించింది మానస.
"మానసా, నేను మీకు సహాయం చేసి ఇంటికి వెళ్ళాక అమ్మా వాళ్ళకి ఆరోగ్య
పరిస్థితి బాలేదని ఒక ఫోన్ వచ్చింది. అందుకే ఎవరికీ చెప్పకుండా వాళ్ళను తీసుకుని, వెళ్ళిపోయా. ఇన్నాళ్లూ వాళ్ళకి సేవ చేస్తూ, అప్పుడు వాళ్ళ కళ్ళలో
ఆనందం చూసాకా, నాకు నిజమైన ఆనందం అంటే తెలిసింది. మనవాళ్లు మనతో ఉంటే, అస్సలు ఏ కష్టాలు
కన్నీళ్ళు మనల్ని ఏమి చేయలేవని తెలుసుకున్నా. కానీ...” అని ఆపేసాడు రాజేష్.
రాజేష్ కళ్ళల్లో ఏదో
తెలియని బాధ కనిపించడం తో "రాజేష్ చెప్పు,
అసలు ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? ఈ ఆఫీస్ కి ఎందుకు
వచ్చావ్? నాకు కుదిరితే నేను నీకు హెల్ప్ చేస్తా" అనగానే, "నీకు
తెలుసు కదా మన ఆశ్రమం అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ పిల్లలు, వాళ్ళ నవ్వులు అస్సలు
మర్చిపోలేకపోతున్నా. అమ్మా నాన్నా దగ్గర ఉన్నా ఎందుకో వాళ్ళకి ఎవరూ లేరని నా బాధ. అందుకే
ఇక్కడ ప్రభుత్వం తరుఫున వారి గుర్తింపుకు ఫారం సబ్మిట్ చేద్దామని వచ్చా అని చెప్తూ
వుండగానే... "హే రాజేష్! నిజంగా ఇదే కదా లలితా పరాభట్టరక దయ అంటే... నాతో రా”
అంటూ అతనితో జిటిఆర్ గారి ఇంటికి వెళ్ళింది. ఆయన
రాజేష్ ను చూసి, సంతోషించాడు. అప్పుడు మానస తన మనసులో ఉన్న ఆలోచనను ఇలా చెప్పింది.
“రాజేష్, మీ అమ్మానాన్నలను కూడా ఆశ్రమంలోనే ఉంచు. ఆశ్రమంలో పెట్టబోయే
గ్రంథాలయం బాధ్యతలు చూసుకుంటూ, అందరికీ సేవ చేస్తూ కొత్త ఆనందం
పొందుతారు. నీద్వారా నాకు కావలసిన సహాయం మరొకటి ఉంది. నేటి యువతకు స్వావలంబన కోసం
విద్యతో పాటుగా వృత్తివిద్యలు కూడా అవసరమే. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే కాలేరు కదా! ఒక్కొక్కరికీ ఒక్కొక్క విద్యలో
నైపుణ్యం ఉంటుంది. ఆయా విద్యల్లో వారికి శిక్షణ ఇస్తే, వారు కుటీర పరిశ్రమలు పెట్టుకుని, స్వంతంగా నిలబడే అవకాశం ఉంటుంది. తద్వారా మన దేశ ఆర్ధిక
వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అనేక వనరులున్నా,
మన దేశ ఆర్ధిక స్థితి ఇతరులతో పోలిస్తే వెనుకబడి ఉండడానికి కారణం, మన దేశంలో తగినన్ని కుటీర పరిశ్రమలు లేకపోడమే! అందుకే నా
మిత్రుడు యుగంధర్, నువ్వూ కలిసి, జిటిఆర్ అంకుల్ యువత కోసం పెట్టబోయే
“వృత్తివిద్యా శిక్షణా కేంద్రం” నిర్వహించాలి. మా ఆశయంలో పాలు పంచుకుంటావు కదూ?”
ఆనందంగా అంగీకరించాడు
రాజేష్. త్వరలోనే యువత కోసం ‘సృజన వృత్తి విద్యా శిక్షణా కేంద్రం’ స్థాపించబడింది.
త్వరలోనే ‘సిద్ధ
వైద్యాలయం’ నెలకొల్పడం, ఎన్నో అరుదైన మూలికల్ని సేకరించి, మొండి రోగాలకు సైతం చికిత్స చేయడం జరిగింది. అంతే కాదు
ఓషధులతో చికిత్స గురించి పరిశోధించడానికి ఒక ప్రయోగశాల కూడా స్థాపించబడింది. పరిసర
గ్రామాల ప్రజల ఆనందానికి హద్దులు లేవు. మంచి వ్యవసాయ నిపుణుల సహాయంతో, అప్పలనాయుడు
అనుచరులకూ, కొందరు గిరిజనులకూ, ‘సేంద్రీయ వ్యవసాయం’ మానస ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించబడింది. ఆ గ్రామం ఇప్పుడు
సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి కేంద్రంగా మారింది. మరోపక్క గిరిజన పాఠశాలలో
పిల్లలు కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందసాగారు.
మానస చేస్తున్న అద్భుతాలను చూసిన భూషణం తన మనసులో ఆడపిల్లల పట్ల ఉన్న తక్కువ భావనను తీసివేసి, ఆమెను మనస్పూర్తిగా క్షమాపణలు కోరాడు. తను అక్రమంగా సంపాదించిన ఆస్తినంతా ఆశ్రమానికి దానం చేసాడు. కాలం ఆనందంగా ముందుకు సాగింది.
***
ఆరు నెలల తర్వాత ఇస్రో లాంచ్ చేసిన “చంద్రయాన్” సాటిలైట్ లాంచ్ ప్రాజెక్ట్ లో కీలకమైన పాత్ర పోషించి, జాతీయ అవార్డు అందుకున్నాడు అనిరుధ్. అతని విజయానికి ఉప్పొంగిపోయింది అతని కుటుంబమంతా. అతను తిరిగి వచ్చాకా మానస, అనిరుధ్ ల వివాహం ఆత్మీయులందరి మధ్యనా అంగరంగ వైభవంగా జరిగింది. మానసవీణ... ఇంకా ఎంతో మంది మనసులలో హృద్యమైన రాగాలు పలికించేందుకు జంటగా ముందుకు సాగిపోయింది.
***
No comments:
Post a Comment