నగరం నిర్మింపబడలేదు
ఆర్.రమాదేవి
అప్పుడెప్పుడో అదొక పల్లె
మార్పు సహజమేనంటూ
పల్లెలన్నీ కలుపుకుపోయి
మహానగరం అన్నారు.
మా పల్లెతో పాటుగా
అటు ఇటు పల్లెల మనుషులు ఇక్కడే చేరిపోయారు.
చిత్రమే
ఎప్పుడు విడిపోయారో
పట్నవాసులంటూ... పల్లె వాసులంటూ
వెలివేతలు మొదలయ్యాయి.
మనిషిని ప్రేమించడం మరచిన మనిషి
అసూయతో స్నేహం చేసిన మనిషి, కలిసి
కొత్త వాదనలు మొదలుపెట్టారు.
మానవత్వపు మహనీయత
అమాయకతకు పుట్టినిల్లు
పల్లెటూర్లేనన్న రాజముద్ర వేశారు.
అంతేనా!?
మానవత్వం లేని మనుషులు
కుటిలతత్వమే నగరవాసుల లోగిలని
చెరగని ముద్ర వేస్తున్నారు.
పల్లెలను కలుపుకున్న మహానగరంలో
అప్పటోల్ల వారసత్వమే కదా ఉన్నది!
చేదు మాత్రలా విషమయ్యారెందుకో?
పేరును బట్టే
అమాయకత్వం ఉండేటట్టయితే
ఈ మహానగరాన్ని పెద్దపల్లె అంటే పోలేదా...
ఇక అంతా
రామరాజ్యమే అని కలకనవచ్చు.
***
No comments:
Post a Comment