నటరాజ శతకము - డా.జక్కంపూడి మునిరత్నం - అచ్చంగా తెలుగు

నటరాజ శతకము - డా.జక్కంపూడి మునిరత్నం

Share This

నటరాజ శతకము - డా.జక్కంపూడి మునిరత్నం

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయం:

డా. జక్కంపూడి మనిరత్నం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణి తాలూకా, కావేరిరాజపురం లో 15.01.1948 లో  శ్రీమతి జక్కంపూడి నరసమ్మ, శ్రీ జక్కంపూడి మునస్వామి నాయుడు దంపతులకు జన్మించారు.
వీరు ఎం.ఏ. పిహెచ్.డ్., శ్రీ వేంక్టేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి నుండి పూర్తిచేసి, అచ్చటే ఆచార్యులుగా పనిచేసినారు.
వీరు బహుగ్రంథకర్త. వీరు రచించిన గ్రంథములి: 1. శ్రీ వేంకటేశ్వర స్త్తిపంచకం, 2. చంద్రమౌళి శతకం, 3. ఉళవర్ పత్తు (తమిళ గేయాలు), 4. సోమన,ఎర్ఱన హరి వంశములు, 5. నాటక వ్యాసములు, 6. అన్నమయ్య, ఆళ్వార్లు తులనాత్మక పరిశీలన 7. నటరాజ శతకము, 8. షిర్డీసాయి శతకము, 9. శ్రీవేంకటేశ్వర శతకము, 10. దేదీప్య శతకము, 11. సఖ శతకము, 12. సుబ్రహ్మణ్య శతకము, 13. తెలుగుబాల శతకము. 14. గొంతుల జ్వాల (కవితల సంపుటి), 15 గేయారామం (గేయసంపుటి), 16. భావనా తరంగిణి (వ్యాస సంపుటి)

శతక పరిచయం::

"శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!రత్నసభరాజ! నటరాజ!రాజవాస" అనేమకుటంతో సీసపద్యములలో రచింపబడిన ఈశతకం భక్తి నీతి రస ప్రథానమైన శతకము. ఈశతకము "తిరువాలంగాడు" నందువెలసిన నటరాజస్వామిని సంబోధిస్తు రచింపబడినది. తిరువాలంగాడు అనే తమిళ శబ్ధానికి "శ్రీవటారణ్యము" అని అర్థము.  నటరాజస్వామి అయిదు సభల్లో నాట్యం చేస్తాడని ప్రతీతి. అవి కనకసభ, రజితసభ, తామ్రసభ, చిత్రసభ, రత్నసభ. ఇవి వరుసగా చిదంబరం, మధురై, తిరునల్వేలి, కుట్రాలం, మరియు తిరువాలంగాడులో ఉన్నాయి. ఈకారణం చేతనే మకుటంలో నటరాజును శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస! రత్నసభరాజ! అనేసంభోదనను కవి ప్రయోగించాడు.
కొన్ని పద్యాలను చూద్దాము.

సీ. శ్రీపార్వతీసతీ చిత్త నిత్యనివాస,  
        తాపస మానసస్థానవాస!
కైలాసనామక ఘనతరనగవాస!,
        ప్రమథగణామల భావవాస!
విష్ణువిధాతాది విబుధహృదయవాస!
        పరమ యోగీంద్ర ధీపదనివాస!
భక్తజనార్ద్రహృత్పంకజాత నివాస!
        జ్ఞానసంబంధ సద్గానవాస!
తే.గీ. సాధు సజ్జన సంకల్ప సతతవాస!
పరహితైకార్ద్రసన్మనః ఫలకవాస!
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

సీ. వడికించు పెనుమంచు కడుమేటి నగముపై
        కాపురముండుట కడిది సుఖమై
ఉరుకుల పరుగుల ఉరవడితో వచ్చు
        మిన్నేరుఁదాల్చుట చిన్నపనియె
చల్లదనంబునే సతతమొసగుచుండు
        శీతాంశు తలమీద జేర్చనగునె
గజచర్మమెంతగా కప్పికొనినగాని
        చలిబాధ కోర్చుట్ సాధ్యమగునె
తే.గీ. అన్యులెవైకి చేయరానట్టి పనులు
నీకు సులభసాధ్యములు లోకైకనాథ
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

భక్తిరస పద్యాలతో పాటొ ఈకవి అనేక నీతిని భోదించే పద్యాలను కూడా ఈ శతకంలో పొందుపరచాడు. కొన్ని నీతి పద్యాలను చూద్దాము.

సీ. వినయముంచని తప్పు విద్యనేర్వని తప్పు
         ఉద్గ్రంథముల చూడకుండు తప్పు
ఉచితము ననుచితమూహచేయని తప్పు
          సన్మార్గమును బట్టి చనని తప్పు
నీ కథలను విననేరని నేరము
            ఘనభక్త గాథల వినని తప్పు
సర్వదా నిన్ను సంస్మరణ చేయని తప్పు
         మంత్రజపము తోడ మనని తప్పు
తే.గీ. అన్ని తప్పులు సైచినాదుకొనుచు
బాపి దొసగుల గుణముల పాదుకొలుపు
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

సీ. ఉన్నతపదవులు ఎన్ని వచ్చినగాని
          నిలకడగా నవి నిలువగలవె
భోగభాగ్యములెన్ని పుడమి వచ్చినగాని
            శాశ్వతమగునె ఈజగమునందు
అలఘు విద్యలు ఎన్ని అవనియందబ్బిన
             నిత్యములె అవి నెమికి చూడ
హిత బాంధవాదులు ఎందరున్ననుగాని
          కలకాలముందురె కలిసి మెలిసి
తే.గీ. స్వర్గసంపదలైన నశాశ్వతములు
శాశ్వతము నీదు కరుణయే శాంభమూర్తి!
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

కొన్ని  అధిక్షేపపద్యాలను చూద్దాము

సీ. కనకరత్నాదులు కావలసిన వుండ
            నాగభూషణుడు వైనావదేమి?
గజములశ్వములుండగా వాటినెక్కక
             నందివాహనుదవైనావదేమి?
కస్తూరిగంధ సుగంధ వస్తువులుండ
             బూడిద పూసుకొన్నావదేమి?
ఏలుకొనంగజగాలు మూడును లేవె
             కాటికాపరివైన కతమదేమి?
తే.గీ. నీ నిరాడంబరత్వము నేర్వనగునె
ఎట్టివారికినైన మహితలమున
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

సీ. కోరిన వరమును కూరిమితో యిచ్చి
                రాక్షసుమ్రోల పారంగనేల
సామాన్యు మనుజుని సత్వమెరుగబోయి
              దెబ్బలు వింటితో తినగనేల
పిట్టునకాశొంచి ప్రొయమార చనుదెంచి
             కర్రదెబ్బలు గొను కర్మమేమి
వేడిన వెంటనే వేగముగా నేగి
          దనుజు వాకిలిగాచు తమకమేమి
తే. భక్తవత్సల్య మెటువంటి పాట్లుదెచ్చె?
మంచికోరినవచ్చు సన్మానమిదియ
శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస!
రత్నసభరాజ! నటరాజ!రాజవాస

ఈశతకంలో అనేకపద్యములు పూర్వకవులైన పోతన, పాల్కూరికి సోమనాథకవి, మొదలైన వారిపద్యాలకు అనుకరణలుగా గనిపిస్తాయి. మరికొన్ని పద్యాలు పురాతన భక్తి పాటలకు పద్యరూపాలుగా కనిపిస్తాయి.
చక్కని సరళమైన భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో ఈశతకం రచింపదడింది. ఇది అందరు చదవవలసిన భక్తి రస ప్రధనమైన శతకం.
మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages