‘నిశ్చింతం పరమం సుఖ’’మనుమాటేనిజము
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0354-04 సం: 04-318
పల్లవి:
‘‘నిశ్చింతం పరమం సుఖ’’మనుమాటేనిజమునిజముతెలియరు
ఆశ్చర్యంబిది పరమయోగులకు ననుభవులకు దృష్టాంతము సుండీ
చ.1: కరచరణాదులుగలచైతన్యము గక్కునబానుపుపైనుండి
సరుగన సడిలిన నిద్రానందము సమకూడీ నరులకటువలెనే
పరమాత్మునిపై సకలోద్యోగ వుపాయంబులు దా దిగవిడిచి
ధరదానుండిన బ్రహ్మానందము తనుదానే పైకొనుజుండీ
చ.2: వున్నతిదానొక దేశములోపలనుండి క్రితముచూచిన నవియెల్లా
అన్ని దేశములు నటుదలపోసిన యంతకుగోచరమైనట్లు
యెన్నగబూర్వజ్ఞానంబున సర్వేశ్వరుడగు హరిదలచినను
సన్నిధియగు సుజ్ఞానానందము సత్యము సత్యంబది సుండీ
చ.3: ననిచిన ప్రపంచకల్పములలో నానావిధముల జంతువులు
తనుదాజూడగరానిరూపు లద్దములోపల గన్నట్లు
ఘనుడగు శ్రీవేంకటపతిరూపము గక్కన నెదుటనె సేవించి
అనయము తనుదా సంతసించుటే యాత్మానందంబిది సుండీ
భావం
నిశ్చింతగా ఉంటే శ్రేష్ఠమైన సుఖం లభిస్తుందని ఒక మాట చెబుతారు.ఇది నిజము. నిజముతెలియరుగాని ఆశ్చర్యకరమైన విషయము ఇది. పరమయోగులకు, అనుభవము పొందినవారికి ఇది ఉదాహరణము సుమా !( పరమయోగులు,భగవదనుభవము పొందినవారు నిశ్చింతగా సుఖంగా ఉంటారని భావం)
చ.1:
చేతులు, కాళ్ళు ఉన్న చైతన్యము(నరుని శరీరము) విశ్రాంతి కోరిన వెంటనే పానుపుపైకి చేరగానే నిద్రానందము ఎలా కలుగుతుందో- అలా-సకలమైన ప్రయత్నాలు , ఉపాయాలు విడిచి పరమాత్మునిపై భారము పెట్టి ఆయనను శరణుకోరి- భూమిలో ఉంటే - బ్రహ్మానందము తనకు తానే కలుగుతుంది.
చ.2:
తానొక దేశములోపలనుండి క్రితం సారి చూచిన దేశములన్నీ ఈదేశములానే ఉన్నాయని- మూల స్వరూపమిదేనని ఆలోచిస్తే - పూర్వం చూసిన దేశాలన్నీ కళ్లముందు కనబడ్డట్లుగా-
పూర్వజ్ఞానముతో సర్వేశ్వరుడయిన హరిని తలిస్తే -ఇంతకు పూర్వమున్న( కప్పివేయబడిన)సుజ్ఞానముతో కూడిన ఆనందము పొందుతాము. ఇది సత్యము సుమా!
చ.3:
అతిశయించిన ప్రపంచకల్పములలో(ఒక కల్పమనగా 1000 మహాయుగాలు అనగా 432, 000, 000 సంవత్సరాలు) నానావిధములయిన జంతువులు సృష్టించబడ్డాయి. ఇవి తమరూపును తాము చూసుకోలేవు. కాని అద్దములోపల చూసుకోగలవు. ఇలాగే ఘనుడయిన శ్రీవేంకటపతిరూపమును ఎదుటనె సేవించితమలో తాము సంతోష పడుటే ఆత్మానందము సుమా!( వేంకటేశ్వరుడు అద్దం. జీవులమైన మనం ఆయనలో మనలిని చూసుకొని పరవశిస్తూ శరణం పొందాలని భావం)
విశేషాలు
పూర్వజ్ఞానము
విశిష్టాద్వైతమతములో చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అని పదార్థములు మూడు.
అందు చిత్తు అనగా ఆత్మ.
ఆ ఆత్మ జ్ఞానేంద్రియ మనోబుద్ధి విలక్షణమై అజడమై ఆనందరూపమై నిత్యమై అణువై నిరవయమై నిర్వికారమై జ్ఞానాశ్రయమై ఈశ్వరునికి శేషమై ఉండునది.
అజడము అనగా స్వయంప్రకాశము జ్ఞానాంతరాపేక్ష లేక తనకు తానే ప్రకాశించునది.
అణువు అనగా అత్యల్ప పరిమాణము కలది. అట్టి పరిమాణము కలిగి ఒక్కచోట ఉన్నను శరీరము నందంతట సుఖదుఃఖానుభవము కలుగుట, దీపము ఒక్కచోటు ఉన్నను దానిప్రభ అంతట వ్యాపించునట్లు వ్యాపించునట్టి జ్ఞానముచే కలుగుచు ఉన్నది. జ్ఞానాశ్రయము అనగా జ్ఞానమునకు ఆశ్రయమైనది. ఈజ్ఞానము ధర్మభూతము అని చెప్పబడును. ఇది సుషుప్తి మూర్ఛాదులయందు ప్రసరణము లేనందున ప్రకాశింపదు.అన్నమయ్య ఈ కీర్తనలో దీనినే పూర్వజ్ఞానము అన్నాడు.(పు.నా.చం)
***
No comments:
Post a Comment