ఎగిరెగిరి దంచినా, ఎగర కుండా దంచినా అదే కూలి
పి. కాశీ విశ్వనాథం
వెంకటరావు, రామారావు ఇద్దరూ స్నేహితులు. స్థానికంగా ఉండే పరిశ్రమలో దినసరి వేతనానికి పనిచేస్తూ ఉండేవారు. కొద్దిరోజులుగా ఇద్దరూ కలవలేదు. అనుకోకుండా ఒక రోజు ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకున్నారు.
“ఏంటి సంగతి ఈ మధ్య కనిపించడం లేదు.” అని వెంకటరావు రామారావును అడిగాడు.
“ ఏమీలేదు కాసేపు అదనంగా పనిచేస్తే యజమాని కాణీయో పరకో ఎక్కువ ఇస్తాడని ఆశతో పనిచేస్తున్నాను.” అన్నాడు రామారావు.
“నీ పిచ్చికానీ ‘ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగర కుండా దంచినా అదే కూలి.’ అన్నాడు వెంకటరావు.
“నువ్వన్నది నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు.” అన్నాడు రామారావు.
“వెనకటికి రామాయమ్మ ఇంట్లో వడ్లు దంచడానికి కూలికి సోములమ్మ, రాములమ్మ వెళ్ళారు. సోములమ్మ చాలా నిదానంగా పనిచేసుకుపోయేది.
ఎక్కువ కష్టపడితే డబ్బులు ఎక్కువ ఇస్తుందనే ఆశతో ఎగిరెగిరి మరీ దంచింది రాములమ్మ. సాయంత్రానికి సోములమ్మ కంటే ఎక్కువ వడ్లను దంచింది. ఒళ్లు హూనం అయ్యింది.
రామాయమ్మ మాత్రం ఇద్దరికీ సమానంగా కూలి ఇచ్చింది. రాములమ్మకి కష్టం అనిపించింది.”నేను ఎక్కువ వడ్లు దంచాను నాకు ఎక్కువ డబ్బులు కావాలి అని అడిగింది.”
“మీరు రోజుకి కూలికి ఒప్పుకుని పనికి
వచ్చారు. అలాంటప్పుడు ఎక్కువ ఎలా ఇస్తాను.” అంది రామాయమ్మ.
“ఎగిరెగిరి దంచినా అదేకూలి,ఎగరకుండా దంచినా అదే కూలి” అని అనుకుంటూ ఇంటిదారి పట్టింది రాములమ్మ. అలా అప్పటి నుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.
మన పరిస్థితి కూడా అంతే మనం దినసరి వేతనం మీద పనిచేస్తున్నాం. రోజుకి ఎన్ని పనిగంటలు పని చెయ్యాలి,ఎంత మొత్తం ఇచ్చేది ముందుగానే యాజమాన్యం మనకి చెప్పింది. దానికి అంగీకరించే మనం పని లోకి వచ్చాం. తీసుకున్న వేతనానికి న్యాయం చెయ్యాలి. అంతే కాని యజమాని మెప్పుకోసమో ఎక్కువ డబ్బులు ఇస్తారనో ఆశపడి పనిచేసి భంగపడిన సందర్భాల్లో
“ఎగిరెగిరి దంచినా అదేకూలి,ఎగరకుండా దంచినా అదే కూలి” అనే జాతీయాన్ని వాడుతున్నాం.” అని వివరంగా చెప్పాడు వెంకటరావు.
“ఎగిరెగిరి దంచినా అదేకూలి,ఎగరకుండా దంచినా అదే కూలి” అంటే ఏమిటో ఇప్పుడు బాగా అర్థమయ్యింది.” అన్నాడు రామారావు.
***
No comments:
Post a Comment