సర్వస్య శరణాగతి - అచ్చంగా తెలుగు
సర్వస్య శరణాగతి  


రచన: సి.హెచ్.ప్రతాప్
 



భగవద్గీత 12 వ అధ్యాయం ( భక్తియోగం) లో 6,7 వ శ్లోకాలు.

యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పర: |
అనన్యేనైవ యోగేన్ మాం ధ్యాయంత ఉపాసతే || 6||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ || 7||

ఓ అర్జునా, సర్వ కర్మలను నాకే అర్పించి , ఇతర చింతనలు లేక నాకు భక్తులై, మనస్సును నా యందు లగ్నం చేసి నన్నే సదా ధ్యానిస్తూ, నా భక్తి యుత సేవలో నన్ను అర్చించే వారిని శ్రీఘ్రమే జనన ,మరణాలనే సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అని పై శ్లోకం భావం.

భౌతిక ప్రపంచం మాయలో పడిపోకుండా భగవంతుని అనుగ్రహంతో అతి దుర్లభమైన ఆ సంసార సాగరాన్ని దాటే అతి సులువైన ఉపాయాన్ని భగవంతుడు ఈ శ్లోకాల ద్వారా తెలియజేశారు. కలియుగపు మాయ, ప్రలోభాలు దృష్టిలో వుంచుకొని,కష్టసాధ్యమైన ఆచరణా మార్గం కాకుండా కుల, మత, వర్గ, వర్ణ, జాతి, పేదా, గొప్ప అనే బేధాలు లేకుండా అందరూ ఆచరించి శ్రీఘ్రమే తరించగల గొప్ప ఉపాయం ఇది.
భగవంతుని సేవయే మానవుల ప్రథమ కర్తవ్యం. ఈ సేవను నిర్లక్ష్యం చేస్తే మనల్ని భ్రాంతిలో పడేసి అధమ పాతాళానికి తొక్కివేసే మాయను సేవించాల్సి వస్తుందని ప్రధమంగా తెలుసుకోవాలి.

మానవులు సర్వదా భగవత్‌ ప్రాప్తికి, భగవద్ ఆరాధనకు వినియోగించుకోవాలి.  నోటితో అర్థం లేని ప్రసంగాలు చేయరాదు. నిరర్థక వాక్యాలు పల్కరాదు. చెవులతో ఇతర విషయాలు వినరాదు. కంటితో ఇతర దృశ్యాలను తిలకించ రాదు. మనస్సులో ఇతర విషయాలకు తావీయ రాదు. మన హృదయం భగవానుని మందిరం అని భావించి ఆ సాధనలన్నీ  ఆ మందిర ద్వారాలుగా నిరంతరం వీటిని భగవానుని కోసమే తెరచి వుంచాలి.

భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగంలో సూచించబడిన సాధనా మార్గం ఈ విధంగా వుంది. ముందుగా ఇతర వ్యర్ధమైన ఆలోచనలు కట్టిపెట్టి భగవంతుని యందే మనస్సు పూర్తిగా లగ్నం చేయాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం,యోగాభ్యాసం ఎంతగానో ఉపకరిస్తాయి.మనస్సులో వ్యర్ధమైన ఆలోచనలు ప్రవేశించి నప్పుడల్లా భగవంతుని నామం స్మరించడం లేదా మనకు ఇష్టమైన దేవతా రూపాన్ని ఉపాసన చేయడం అలవాటు చేసుకుంటే, ఈ సాధన ద్వారా వచ్చే ఆధ్యాత్మిక శక్తికి చెడు ఆలోచనలు దూరంగా పారిపోవడం ఖాయం.

శరణాగతి అంటే - నీ గురువు పట్ల నీకున్న అనన్య ప్రేమ వలన వారికి సర్వస్వం నమర్పించుకోవాలనుకుంటావు. నీ మనస్సంతా గురువే నిండిపోయి ఉంటాడు. గురువు యొక్క ఆలోచనలు తప్పితే మరేం చేయడానికి బుద్ధి పుట్టదు. వారి ప్రేమను అత్యధికంగా పొందాలని పరితపిస్తావు. ఆ ప్రేమ లభించకపోతే గురువును వదలి వెళదామనుకుంటావు. కానీ వెళ్ళలేని స్థితిలో అది అసాధ్యమని తెలుసుకుంటావు. గురువు వల్ల నీకున్న అవ్యాజమైన ప్రేమతో ఆయనను వదిలి వెళ్ళలేక ఆయననే అంటిపెట్టుకొని ఉండడం, అది నిజమైన శరణాగతి" అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీబాబూజీ అద్భుతంగా తెలియజేసారు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహామ్యహమ్‌

‘అనన్యంగా నన్నెవరైతే చింతిస్తూ (స్మరిస్తూ) ఉంటారో.. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని భావం. దాన్ని అనుసరించి భగవద్రక్షణ అతనికి లభించింది. ఆ భక్తుడు మాయా పరిధిలోని వాడే అయినా.. మాయాతీతుడైన భగవంతుని శరణు పొందిన వాడు. కాబట్టి మాయ అతని మీద తన ప్రభావం చూపించలేదు.

మనం చేసే కర్మలన్నింటినీ ఫలితం ఆశించకుండా భగవంతునికే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని అర్పించాలి. అనుక్షణం భగవంతుని కరుణ కోసం, ఆయనను సంతృప్తి పరచడమే మన లక్ష్యం కావాలి.భగవంతుని ప్రియం చేకూర్చడమే లక్ష్యం అయినప్పుడు ఎటువంటి త్యాగాలకైనా మానసికంగా సిద్ధం కావాలి.  కష్ట నష్టాలు ఎదురైనప్పుడుఎటువంటి సంశయాలకు తావివ్వక , సంపూర్ణ శరణాగతి భావంతో  ప్రార్థన మార్గం ద్వారా భగవంతుడినే శరణు వేడడం అత్యుత్తమం. అనుక్షణం భగవంతుని నామం జపించడం సాధనా అలవాటు చేసుకుంటే కొంతకాలానికి అప్రయత్నంగా భగవంతుని వైపు మనస్సు మరలుతుంది.ఈ విధమైన సాధనను చేసి ఉచ్వాస, నిశ్వాసాలు లో భగవంతుని నామం జ్ఞ్ఞప్తి లో వుంచుకోగలిగిననాడు శుద్ధ భక్తుడని, వారిని శ్రీఘ్రమే భవసాగరం నుండి ఉద్ధరిస్తానని గీత సాక్షిగా ప్రమాణం చేసి వున్నాడు. అందుకే కర్మ, జ్ఞాన యోగాల కంటే భవ సాగరం దాటేందుకు భక్తి యోగమే ఈ కలియుగంలో ఉత్తమమైనదని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం.

***

No comments:

Post a Comment

Pages