శ్రీథరమాధురి - 126 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 126

Share This

శ్రీథరమాధురి - 126

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)





ధైర్యమే జీవితం, 

భయమే మరణం!
 
***
ధైర్యం స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది.
భయం బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
 
మీరు భయపడితే, ఎల్లప్పుడూ ఒక బానిసగా మిగులుతారు.
 
***
మీకు వయసు వస్తున్న కొద్దీ, గతంలో మీరు చేసిన తప్పులను ఒప్పుకునే పరిణితి, ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ వయసులో కూడా మీరు గతంలోని మీ చర్యలను సమర్ధించుకుంటూ, వాటికి అప్పట్లో కుటుంబ పరిస్థితులే కారణమని అన్నట్లయితే, అది మీ పిరికితనాన్ని, మీలో పరిణితి లేకపోవడాన్నీ, చూపుతుంది.
 
మీకు వయసు వస్తున్న కొద్దీ పరిణితి, ధైర్యం చేతులు కలిపి మిమ్మల్ని ముందుకు నడిపించాలి. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కర్తృత్వ భావనతో మీరు గతంలో చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపం చెందితే, అది మీ ఆత్మ మనఃశ్శాంతిగా ఈ లోకాన్ని వదిలి పోవడానికి సహాయం చేస్తుంది.

***
ఈ జీవితంలో గతాన్ని వదిలి వేసే,  జరిగినవన్నీ విడనాడే ధైర్యం కలిగిన వారు మాత్రమే ప్రశాంతంగా జీవించగలుగుతారు. మిగిలిన వారు కుమిలిపోతూ, ప్రశాంతతకు దూరంగా జీవిస్తుంటారు.
 
***
హృదయం యొక్క భాషని అర్థం చేసుకుని, ఆచరించేందుకు గొప్ప ధైర్యం కావాలి. మీరు పిరికివారైతే, ప్రేమించకండి. ప్రేమ హృదయం నుంచి పుడుతుంది. చాలాసార్లు అది ఆచరణకు అనువుగా ఉండదు. ఆచరణకు అనువుగా ఉండాలంటే అది సులువుగా ఉండాలి. అలా ఆచరించలేనివి, కష్టతరమైనవి. ప్రేమ కష్టాలకు గురిచేస్తుంది, ఎందుకంటే ప్రేమ అంటే త్యాగం. మీరు పిరికివారైతే, మీరు ఎన్నడూ త్యాగం చేయలేరు. ఈరోజుల్లో చాలామంది యువత ప్రేమలో పడి కష్టాలకు గురవుతున్నారు, ఎందుకంటే వారికి జీవితంలో అన్నీ కావాలి. కానీ, ఇక్కడ విరుద్ధంగా జరిగే సంగతి ఏమిటంటే, ప్రేమ కోసం మీరు అన్నింటినీ త్యాగం చేయాలి. కాబట్టే ఈ ఇక్కట్లు.

***
'కాదు' అని నీకు చెప్పాలనిపించినప్పుడు 'కాదు' అని చెప్పే ధైర్యాన్ని, సంకల్పాన్ని పెంపొందించుకోండి.

***
ఎవరినీ పట్టుకు వేలాడుతూ ఉండకండి. ఒక అనుబంధం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండకండి. అది బేషరతుగా ఉండాల్సిన స్థానంలో ఉండనప్పుడు, దాన్ని విడనాడే ధైర్యాన్ని కలిగి ఉండండి. దాన్ని వదిలేసి మీ దారిన మీరు వెళ్ళండి.
 
***

No comments:

Post a Comment

Pages