ఉదంకుని గురుదక్షిణ - అచ్చంగా తెలుగు
 ఉదంకుని గురుదక్షిణ

రచన :టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
 




ఉదంకుడు 'పైలుడు 'అనే మహర్షి యొక్క శిష్యుడు. పైలుడు వేదవ్యాసమహర్షి యొక్క  శిష్యుడు.
విద్య పూర్తయిన తర్వాత ఉదంకుడు గురువుగారి దగ్గరకి వెళ్ళి తాను గురుదక్షిణ సమర్పించుకుంటానని అడుగుతాడు."వద్దులే నాయనా! నువ్వు సంతోషంగా గృహస్థాశ్ర మానికి వెళ్ళు!అంటారు   గురువుగారు.
"కాదు కూడదం "టూ బలవంతం చేస్తాడు  ఉదంకుడు.
చివరకు తప్పదనుకుంటూ గురువుగారు  తన భార్యకి ఏమైనా అవసరమేమో కనుక్కోమంటారు.
 పౌష్యుడనే రాజుగారి భార్య యొక్క కుండలాలు ఒక నాలుగురోజుల్లో తనకి తెచ్చి యిస్తే, వాటిని ధరించి తానొక  వ్రతం చేసుకుంటానని అడుగుతుంది గురుపత్ని.గురుపత్ని కోఱిక చెల్లించడానికి ఉదంకుడు బయలుదేరుతాడు. అడవిమార్గంలో వెళుతూ ఉంటే దారిలో పెద్ద ఎద్దును ఎక్కి ఉన్న ఒక దివ్యపురుషుడు ఉదంకునికి దర్శనమిస్తాడు . ఆ దివ్యపురుషుడు "ఆ వృషభ గోమయాన్ని భుజిస్తే, బయలుదేరిన కార్యం సఫలమవుతుందని" చెప్తాడు.ఉదంకుడు ఆ దివ్యపురుషుని మాటను మన్నించి ఆ ఎద్దు గోమయాన్ని భుజిస్తాడు.. ఆ తర్వాత గబగబా రాజుగారైన  పౌష్యుని దగ్గరకి వెళ్ళి,తాను వచ్చిన పని చెప్తాడు  ఉదంకుడు . పౌష్యుడు సంతోషంగా తప్పకుండా తన భార్య కుండలాలను తీసుకొమ్మంటాడు. ఉదంకుడినే తన భార్య వద్దకు వెళ్ళి స్వయంగా అడిగి తీసుకోమంటాడు. ఉదంకుడు వెళ్ళి చూస్తే అంతఃపురంలో మహారాణి కనిపించదు. తిరిగి పౌష్యుడి దగ్గరకి వచ్చి చెపితే,పౌష్యుడు తన భార్య మహాపతివ్రత అని, అందువల్ల ఆవిడ ఆశుచులకి కనపడదని చెప్తాడు, ఉదంకునికి తాను గోమయాన్ని తిన్నానన్న సంగతి గుర్తుకువచ్చి. బహుశా అందుకే అశుచిదోషం తనకి కలిగిందని అనుకొని, ఆచమనం చేసి శుద్ధిచేసుకొని, పౌష్యుడి అనుమతి తీసుకొని మళ్ళీ అంతఃపురానికి వెళతాడు. అప్పుడతనికి పౌష్యాదేవి కనిపిస్తుంది. అతనికి నమస్కరించి తన కుండలాలని సంతోషంగా ఇస్తుంది.

ఉదంకుడికి కుండలాలని ఇస్తూ పౌష్యుని భార్య తక్షకుడి గురించి హెచ్చరిస్తుంది.తక్షకుడు చాలా రోజులుగా ఆ కుండలాలను తస్కరించాలనే దుర్బుద్ధితో కాపువేసి ఉన్నాడని, అతనినుండి కుండలాలను  కాపాడుకుంటూ తీసుకువెళ్ళమని ఉదంకుడికి చెపుతుంది. సరే అని ఆ కుండలాలు తీసుకొని మళ్ళీ పౌష్యుడి వద్దకు వస్తాడు ఉదంకుడు.అప్పుడా రాజు ఉదంకుడితో, తమ యింట భోజనం చెయ్యనిదే వెళ్ళకూడదని అంటాడు. తొందరలో ఉన్నాకూడా ,  మహారాజు అడిగినప్పుడు కాదనకూడదని సరేనంటాడు ఉదంకుడు. భోజనం చేస్తూంటే అందులో ఒక తలవెండ్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడా అన్నాన్ని అసహ్యించుకొని, కోపించి, సరిగా పరీక్షించకుండా అశుద్ధాన్నం పెట్టావు కాబట్టి గుడ్డివాడవు కమ్మని పౌష్యుడిని శపిస్తాడు. పౌష్యుడు కూడా శాపానుగ్రహ సమర్థుడే. ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నీకు సంతానం కలగకుండు గాక అని ప్రతిశాపం పెడతాడు. సంతానోత్పత్తికి అన్నం మూలాధారమని వేదం చెపుతుంది. వెండ్రుక వచ్చిన దోషానికి అన్నాన్నే ఈసడించినందువల్ల అతను సంతానహీనుడయ్యాడన్నది ఇందులోని రహస్యం. ఉదంకుడప్పుడు తన శాపం ఉపహరించమని అంటే పౌష్యుడు నువ్వే నీ శాపాన్ని తిరిగి తీసుకోమని ఉదంకుడిని కోరతాడు. పౌష్యునికి కొద్ది కాలంలోనే  శాపవిమోచనం కలుగుతుందని చెప్పి ఉదంకుడు అక్కడనుండి బయలుదేరతాడు. దారిలో ఒక సరస్సు కనిపిస్తే, గట్టున ఒక చోటును శుభ్రం చేసి, కుండలాలని పెట్టి, స్నానాని కని ఆ సరస్సులోకి దిగుతాడు ఉదంకుడు.అప్పుడే తక్షకుడు కుండలాలని చేత చిక్కించుకొని పారిపోతాడు. ఉదంకుడు తక్షకుని వెంటపడి పట్టుకుంటే, పాముగా మారి, ఒక పుట్టలోకి దూరి కుండలాలతో పాటు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడు కూడా అతని వెంటే ఆ పుట్టలోంచి నాగలోకానికి వెళతాడు. నాగలోకం చేరిన ఉదంకుడికి నాగజాతి ప్రముఖులందరూ కనిపిస్తారు. వాళ్ళని చాలా భక్తిగా స్తోత్రం చేస్తాడు  ఉదంకుడు.

నాగరాజు లందరినీ ఉదంకుడు స్తోత్రం చేసినా ఎలాంటి ప్రయోజనమూ కలుగదు. అయితే అంతలోనే ఉదంకుడికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రాన్ని నేస్తూ ఉంటారు. ఆ పక్కనే పన్నెండు అడ్డకఱ్ఱలతో (spokes) ఉన్న ఒక చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు కుఱ్ఱవాళ్ళు కనిపిస్తారు. ఆ పక్కనే ఎత్తైన గుఱ్ఱాన్ని అధిరోహించిన మహా తేజోవంతుడయిన ఒక దివ్యపురుషుడు కనిపిస్తాడు. అతన్ని చూసి ఉదంకుడు విశేషమంత్రాలు చదువుతూ భక్తితో ఆ దివ్యపురుషుడిని కీర్తిస్తూ  స్తోత్రం చేస్తాడు. అప్పుడా దివ్యపురుషుడు ప్రసన్నుడై ఏమి కావాలో కోరుకోమంటే, నాగులందరూ తనకి వశమై తన కుండలాలు తనకి తిరిగి ఇచ్చెయ్యాలని కోరుకుంటాడు ఉదంకుడు. అప్పుడా దివ్యపురుషుడు అలా అయితే ఈ గుఱ్ఱం చెవిలో ఒక్కసారి ఊదమంటాడు. ఉదంకుడలాగే ఊదుతాడు. అప్పుడు ఆ అశ్వదేహంనుండి ప్రళయాగ్నులు పుట్టి పాతాళమంతా వ్యాపిస్తాయి. సర్పాలన్నీ భయంతో వణికిపోతాయి, భయంతో తక్షకుడు కుండలాలని ఉదంకుడికి తెచ్చి యిస్తాడు.

 కుండలాలని తిరిగి సంపాదించినా ఉదంకునికి మరొక సమస్య వచ్చిపడుతుంది. కుండలాలని నాలుగు రోజుల్లో తీసుకురమ్మని గురుపత్ని ఆజ్ఞ. ఆ రోజే నాల్గవరోజు. అంత తొందరగా అక్కడకి చేరుకోడం ఎలా? అలా చింతిస్తున్న ఉదంకుడిని చూసి, ఆ దివ్యపురుషుడు, మనసుకన్నా వేగమైన తన గుఱ్ఱాన్ని ఎక్కి వెళ్ళమని అంటాడు. అతని మాట ప్రకారం ఉదంకుడు ఆ గుఱ్ఱాన్ని ఎక్కి క్షణకాలంలో గురువుగారి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే గురుపత్ని వ్రతానికి సిద్ధమై కుండలాలని ఎప్పుడు తెస్తాడా అని ఉదంకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుండలాలతో వచ్చిన అతడిని చూసి సంతోషించి, ఆ కుండలాలు ధరించి తాను చేయదలచుకున్న వ్రతం పూర్తి చేసుకుంటుంది గురుపత్ని . పక్కనే ఉన్న పౌష్యుని రాజ్యానికి వెళ్ళి రావడనికి అన్ని రోజులెందుకు పట్టిందని అడుగుతారు గురువుగారు. జరిగిందంతా చెప్తాడు ఉదంకుడు. అంతా చెప్పి తాను చూసిన వింతలు ఏమిటో వివరించమని గురువుగారిని ప్రార్థిస్తాడు. గురువుగారు ఉదంకుడికి ఇలా వివరిస్తాడు:

ఎద్దునెక్కి వచ్చిన దివ్యపురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. ఉదంకుడు సేవించిన గోమయం అమృతం. నాగలోకంలో కనిపించిన ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వారు తెల్లని నల్లని దారాలతో నేస్తున్న మగ్గం అహో రాత్రాలు (పగలు, రాత్రి). పన్నెండు రేకుల చక్రం పన్నెండు నెలలతో కూడిన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. ఆ గుఱ్ఱం అగ్ని. గుఱ్ఱం ఎక్కి వచ్చిన దివ్యపురుషుడు ఇంద్ర సఖుడైన పర్జన్యుడు. ఇంద్రుడు తన స్నేహితుడు కాబట్టి తన పని మీద వెళ్ళిన ఉదంకుడికి సహాయం చేసాడని, అమృత భక్షణం వల్లనే అతనికి నాగలోకంలో ఎలాంటి హాని జరగకుండా అతని పని సఫలమయిందని, అతడి జన్మ ధన్యమయిందని కూడా గురువుగారు ఉదంకుడికి వివరిస్తారు.

అయితే ఉదంకునికి తక్షకుని మీద ద్వేషం పెరిగిపోతుంది.. అందుకని ఆ తర్వాత ఉదంకుడు సర్పాలపై పగ తీర్చుకోడానికి పరీక్షిన్మహారాజు కుమారుడైన జనమేజయుని దగ్గరికి వెళ్తాడు. తన తండ్రిని తక్షకుడు సంహరించాడని జనమేజయుడు సర్పాలపై ద్వేషం పెంచుకున్నాడు. ఉదంకుని ప్రేరణతో  జనమేజయుడు సర్పయాగాన్ని చేయటానికి సిద్ధపడతాడు. సర్పాలకు ప్రమాదం సంభవించిందని గ్రహించి ఆస్తీకుడు అనే తపోసంపన్నుడు సర్పయాగాన్ని మధ్యలోనే ఆపించి వేస్తాడు.ఇది ఉదంకుని కథ.ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గురుదక్షిణ చెల్లించటానికి ఉదంకుడు ఎటువంటి కష్టం వచ్చినా భయపడడు. అయితే ఉదంకుడు తన స్వభావరిత్యా రాజైన పౌష్యుని మీద ఆవేశపడి శాపం ఇచ్చి, తానుకూడా శాపాన్ని పొందాడు. మరల అంత ఆవేశం పనికిరాదని తెలుసుకున్నాడు. ఆ శాపాన్ని మరలించివేశాడు. అతడి పట్టుదలకు, అతడి చదువుకూ, అతడి గురుశుశ్రూషకు మెచ్చుకున్న ఇంద్రుడు ఉదంకునికి సహాయపడటమే కాకుండా అమృతాన్ని కూడా ఇచ్చాడు.
ఈ కథను చదివిన వారికి, విన్నవారికి కూడా సకల కోర్కెలు తీరిపోవటమే కాదు, సర్పదోషాలు తొలగిపోతాయి. పైగా పాఠకుల, శ్రోతల యొక్క మనసుల్లో ఉన్న ఉద్వేగ ప్రవృత్తులు సమసిపోతాయి.

(సమాప్తం )

No comments:

Post a Comment

Pages